పగలు ప్రజలకు సేవ - రాత్రిళ్లు లక్ష్యం కోసం శ్రమ
ఒకసారి విఫలమైనా పట్టుదలతో ప్రిపరేషన్ కొనసాగించి గ్రూప్-1లో డీఎస్పీ కొలువు కైవసం - ఏపీపీఎస్సీ నుంచి నోటిఫికేషన్ రాగానే ఉద్యోగానికి లాంగ్ లీవ్ పెట్టి చదివిన మధుచరణ్

By ETV Bharat Andhra Pradesh Team
Published : February 10, 2026 at 5:01 PM IST
|Updated : February 10, 2026 at 5:06 PM IST
Panchayat Secretary To DSP Rank: ఆ యువకుడి లక్ష్యం సివిల్స్. అందుకే లక్షల జీతం వచ్చే సాఫ్ట్‌వేర్ కొలువు వదులుకున్నాడు. పల్లెటూరిలో పంచాయతీ సెక్రటరీగా విధులు నిర్వర్తిస్తున్నాడు. పగలు ప్రజలకు సేవ చేస్తూనే రాత్రిళ్లు లక్ష్యం కోసం శ్రమించాడు. ఒకసారి విఫలమైనా పట్టుదలతో ప్రిపరేషన్ కొనసాగించాడు. ఇప్పుడు ఏకంగా గ్రూప్-1లో కొలువు సాధించి డీఎస్పీగా ఎంపికయ్యాడు. కాకినాడ జిల్లాకు చెందిన మధుచరణ్ పంచాయతీ సెక్రటరీ నుంచి డీఎస్పీ వరకు ఎదిగాడు.
గ్రూప్-1లో సత్తాచాటి డీఎస్పీ హోదా: కలెక్టర్ కావాలని కలగన్నాడు. సాఫ్ట్‌వేర్ కొలువును కాదనుకున్నాడు. దిల్లీ వెళ్లి సివిల్స్ కోచింగ్ తీసుకున్నాడు. ప్రభుత్వ ఉద్యోగాల నోటిఫికేషన్ రావడంతో మధ్యలోనే తిరిగొచ్చాడు. పంచాయతీ సెక్రటరీ ఉద్యోగాన్ని బాధ్యతగా స్వీకరించాడు. కానీ, తన లక్ష్యం మరవలేదు. పల్లె ప్రజలతో మమేకం అవుతూనే ఖాళీ సమయాల్లో పుస్తకాలతో దోస్తీ చేశాడు. దాని ప్రతిఫలమే నేడు గ్రూప్-1లో సత్తాచాటి డీఎస్పీ హోదా దక్కించుకున్నాడు. మధుచరణ్ స్వస్థలం కాకినాడ జిల్లా జగ్గంపేట మండలం ఇర్రిపాక గ్రామం. తండ్రి అప్పారావు ప్రభుత్వ ఉపాధ్యాయుడు, తల్లి అనంతలక్ష్మి గృహిణి. సోదరుడు జగదీశ్ పంచాయతీ కార్యదర్శి ఉద్యోగం చేస్తున్నాడు. చిన్నప్పటి నుంచి చదువులో రాణిస్తున్న మధుకు ఇంజినీరింగ్ అయిపోగానే ప్రముఖ సాఫ్ట్‌వేర్ సంస్థలో భారీ ప్యాకేజీతో ఉద్యోగం లభించింది. కానీ, మధు లక్ష్యం సివిల్ సర్వీసెస్ అందుకే ఆ ఉద్యోగంలో చేరకుండా దిల్లీకి వెళ్లి సివిల్స్ కోచింగ్ తీసుకున్నాడు.
"మా కుమారుడు మధుచరణ్ చిన్నప్పటి నుంచి కష్టపడే తత్వం ఉన్నవాడు. తన లక్ష్యం కోసం సాఫ్ట్‌వేర్ జాబ్ కూడా వదులుకున్నాడు. మా కుమారుడు డీఎస్పీగా ఎంపికవడం మాకు చాలా ఆనందకరమైన విషయం." -అప్పారావు, మధు చరణ్ తండ్రి
తల్లిదండ్రుల ప్రోత్సాహం వల్లే ఈ స్థాయికి: మధు సివిల్స్ కోచింగ్ తీసుకుంటుండగానే పంచాయతీ సెక్రటరీ నోటిఫికేషన్ రావడంతో సొంతూరికి తిరిగొచ్చాడు. అన్న, తమ్ముడు ఇద్దరూ కలిసి పరీక్ష రాసి విజయం సాధించారు. మూడేళ్లుగా కె. నాయకంపల్లిలో బాధ్యతలు నిర్వర్తిస్తున్న మధు తన లక్ష్యాన్ని మాత్రం మరవలేదు. ఉద్యోగం చేస్తూనే మధ్యలో ఒకసారి గ్రూప్-1 పరీక్ష రాసి విఫలమయ్యాడు. తన లక్ష్యాన్ని సాధించేవరకూ వదిలేది లేదని పట్టుపట్టాడు. 2023లో ఏపీపీఎస్సీ నుంచి నోటిఫికేషన్ రాగానే తాను చేస్తున్న ఉద్యోగానికి లాంగ్ లీవ్ పెట్టి సన్నద్ధమై విజయం సాధించాడు. తల్లిదండ్రుల ప్రోత్సాహం వల్లే తాను ఈ స్థాయికి చేరానని మధు చరణ్ సంతోషం వ్యక్తం చేశాడు.
"నేను 10వ తరగతి వరకు గవర్నమెంట్ స్కూల్లో చదువుకున్నా.ఇంటర్ ఆదిత్య జూనియర్ కాలేజ్‌లో పూర్తి చేశా. సర్‌సీఆర్ రెడ్డి కాలేజ్‌లో బీటెక్ చేశాను. బీటెక్ చేస్తున్నప్పుడే నాకు క్యాంపస్ ప్లేస్మెంట్లో ఉద్యోగం వచ్చింది. కానీ ప్రజలకు సేవ చేయాలనే ఉద్ధేశంతో సివిల్స్‌కి ప్రిపేర్ అయ్యాను. ఈ విషయంలో మా తల్లిదండ్రులు నన్ను చాలా ప్రోత్సహించారు. నేను గ్రూప్ 1 కోసం ప్రత్యేకంగా కోచింగ్ తీసుకోలేదు. గ్రూప్ 1లో డీఎస్పీగా సెలక్ట్ అవడం నాకు చాలా సంతోషంగా ఉంది." -మధుచరణ్
పంచాయతీ సెక్రటరీగా ప్రజల సమస్యలను క్షేత్రస్థాయిలో చూసిన అనుభవం డీఎస్పీగా తన విధులకు ఎంతో ఉపయోగపడుతుందని తెలిపాడు. మధు చరణ్ చాలా నిబద్ధత కలిగిన వ్యక్తి అని, ఆయన డీఎస్పీగా ఎంపికవ్వడం చాలా సంతోషంగా ఉందని సహోద్యోగులు, గ్రామస్తులు అంటున్నారు. లక్ష్యం బలమైనది అయితే అడ్డంకులు, ఆంటకాలు పెద్దలెక్క కాదని డీఎస్పీగా ఎంపికైన మధుచరణ్ నిరూపించాడు.
175 నియోజకవర్గాల పనితీరుపై సర్వే - విజయవాడ పశ్చిమ నియోజకవర్గం నంబర్ వన్
పార్లమెంటులో ఏపీ రాజధానిగా అమరావతికి చట్టబద్ధతపై బిల్లు పెట్టాలి: సీఎం చంద్రబాబు

