డంపింగ్ యార్డులో అనాథ శవంలా కులవర్ధన్ అంత్యక్రియలు
మదనపల్లె చిన్నారి అత్యాచారం, హత్య నిందితుడి జీవితానికి హీనమైన ముగింపు! - నిందితుడి మృతదేహాన్ని తీసుకెళ్లేందుకు కుటుంబ సభ్యుల నిరాకరణ - అనాథ శవంలా డంపింగ్ యార్డులో ఖననం చేసిన పారిశుద్ధ్య కార్మికులు

By ETV Bharat Andhra Pradesh Team
Published : February 20, 2026 at 11:46 AM IST
Madanapalle Child Murder Accused kulavardhan Funerals: ఏడేళ్ల చిన్నారిని అత్యాచారం చేసి ఆపై హత్య చేసిన దుర్మార్గుడు కులవర్ధన్‌కు ఊహించని దుస్థితి పట్టింది. నీటిలో దూకి ఆత్మహత్య చేసుకున్న కులవర్ధన్ మృతదేహాన్ని స్వాధీనం చేసుకునేందుకు కుటుంబ సభ్యులు సైతం నిరాకరించారు. ఫలితంగా మదనపల్లె పురపాలక సిబ్బంది అంత్యక్రియలు నిర్వహించారు.
రాష్ట్రాన్ని ఉలిక్కిపడేలా చేసిన మదనపల్లెలో చిన్నారి అత్యాచారం, హత్య కేసులో నిందితుడు కులవర్ధన్ జీవితం అత్యంత హీనంగా ముగిసింది. మరణానంతరం అంత్యక్రియలు నిర్వహణకు కుటుంబ సభ్యులు, బంధువులు నిరాకరించడంతో అనాథ శవంలా పురపాలక సిబ్బంది డంపింగ్ యార్డులో ఖననం చేశారు. ఈనెల 17న కులవర్ధన్ ఓ చిన్నారిపై అత్యాచారం చేసి ఆపై నీటి డ్రమ్ములో ముంచి చంపేశాడు. నిందితుడిని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు.
అమానుషనేర నింధితుడి అంత్యక్రియలు: అయితే పోలీసుల కళ్లుగప్పి పారిపోయిన కులవర్ధన్ చెరువలోకి దూకి ఆత్మహత్య చేసుకున్నాడు. పోస్టుమార్టం నిర్వహించి మృతదేహాన్ని అప్పగించేందుకు పోలీసులు కుటుంబ సభ్యులను ఆసుపత్రికి పిలిపించారు. అయితే అమానుషమైన నేరం చేసిన వ్యక్తి మృతదేహాన్ని తాము తీసుకెళ్లబోమని అంత్యక్రియలు కూడా చేయమని నిందితుడి సోదరి తేల్చిచెప్పారు. మృతుడి తల్లిని సంప్రదించేందుకు పోలీసులు ప్రయత్నించినా అందుబాటులోకి రాలేదు.
మృతదేహాన్ని తీసుకెళ్లేందుకు కుటుంబ సభ్యులు నిరాకరించడంతో అనాథ శవంగా భావించి అంత్యక్రియలు నిర్వహించాలని పోలీసులు పురపాలక సిబ్బందికి లేఖ రాశారు. 48 గంటలుగా మదనపల్లె జిల్లా ఆసుపత్రి మార్చురీలో ఉన్న కులవర్ధన్ మృతదేహాన్ని పారిశుద్ధ్య కార్మికులు స్వాధీనం చేసుకుని పట్టణ శివారులోని డంపింగ్ యార్డులో ఖననం చేశారు.
ఆందోళనకు దిగిన వారిపై కేసు నమోదు: ఇదిలా ఉండగా మరోవైపు కులవర్ధన్‌ను అదుపులోకి తీసుకుని తరలిస్తుండగా ఆందోళనకు దిగి పోలీసుల విధులకు ఆటంకం కలిగించిన వారిపై కేసులు నమోదయ్యాయి. మదనపల్లె ఒకటో పట్టణ పోలీసు కానిస్టేబుల్ ఫిర్యాదు మేరకు పలువురు ప్రజా సంఘాల, వివిధ రాజకీయ పార్టీల నేతలపై పలు సెక్షన్ల కింద కేసులు నమోదు చేశారు. అన్నమయ్య జిల్లా మదనపల్లెలో అమానవీయ ఘటన జరిగింది. ఏడేళ్ల బాలిక సోమవారం సాయంత్రం అదృశ్యమైంది. తల్లిదండ్రులు, బంధువులు బాలిక ఆచూకీ కోసం పరిసరాలను వెతకగా ఎదురుగా ఉన్న కులవర్థన్ ఇంట్లో విగతజీవిగా కనిపించింది. కోపం కట్టలు తెంచుకున్న బంధువులు కులవర్థన్ ఇంటి వద్ద ఆందోళన చేపట్టడంతో ఉద్రిక్తత నెలకొన్న సంగతి తెలిసిందే.
మదనపల్లెలో అదృశ్యమైన ఏడేళ్ల బాలిక హత్య - తల్లిదండ్రులకు హోంమంత్రి అనిత ఫోన్
విద్యార్థినిపై అత్యాచారం కేసు - ఎస్సైకి 10 ఏళ్ల జైలు శిక్ష విధించిన గుంటూరు కోర్టు

