ETV Bharat / state

ఆ అదృష్టవంతులు ఎవరో? - నేడే క్యూర్​ పరిధిలో ఇందిరమ్మ ఫ్లాట్లకు లక్కీ డ్రా

తొలి విడతలో 4 అసెంబ్లీ నియోజకవర్గాల్లో ఇళ్ల కేటాయింపు - కుత్బుల్లాపూర్, కంటోన్మెంట్, రాజేంద్రనగర్, నాంపల్లి నియోజకవర్గాల్లో లాటరీ - సందేహాలకు 040-24603572కు ఫోన్‌ చేయవచ్చన్న హౌసింగ్ బోర్డు

LIG Indiramma Houses In Cure Area
హైదరాబాద్ క్యూర్ పరిధిలో ఎల్‌ఐజీ ఇందిరమ్మ ఇళ్ల నమూనా (ETV Bharat)
author img

By ETV Bharat Telangana Team

Published : August 28, 2026 at 7:17 AM IST

|

Updated : August 28, 2026 at 8:06 AM IST

3 Min Read
Choose ETV Bharat

Indiramma Houses in Cure Area : హైదరాబాద్ క్యూర్ పరిధిలో నిర్మించనున్న ఇందిరమ్మ టవర్లలో ఫ్లాట్ల లక్కీ డ్రా నేడు ప్రారంభం కానుంది. రోజుకు 4 అసెంబ్లీ నియోజకవర్గాల్లో ఇళ్లు కేటాయించనున్నారు. కుత్బుల్లాపూర్, కంటోన్మెంట్, రాజేంద్రనగర్, నాంపల్లి నియోజకవర్గాల్లో నేడు లాటరీ తీయనున్నారు. హైదరాబాద్ కోర్ అర్బన్‌లోని 16 నియోజకవర్గాల్లో 40 వేల 900 మంది ఇందిరమ్మ ఇళ్ల కోసం అదృష్టాన్ని పరీక్షించుకోనున్నారు. ఇళ్లు దక్కని వారు నిరాశపడవద్దని, తదుపరి విడతల్లో మళ్లీ దరఖాస్తు చేసుకోవచ్చని హౌసింగ్ బోర్డు వైస్​ ఛైర్మన్​ వీపీ గౌతమ్ తెలిపారు.

ఆ అదృష్టవంతులు ఎవరో? - నేడే క్యూర్​ పరిధిలో ఇందిరమ్మ ఫ్లాట్లకు లక్కీ డ్రా (ETV Bharat)

నేటి నుంచి ఎల్‌ఐజీ ఇందిరమ్మ ఇళ్ల కేటాయింపు : హైదరాబాద్ కోర్ అర్బన్ పరిధిలో ఎల్‌ఐజీ (అల్పాదాయ వర్గం) ఇందిరమ్మ ఫ్లాట్ల కేటాయింపు ప్రక్రియ నేటి నుంచి జరగనుంది. ఉదయం 11 గంటల నుంచి కుత్బుల్లాపూర్, సికింద్రాబాద్ కంటోన్మెంట్, రాజేంద్రనగర్, నాంపల్లి అసెంబ్లీ నియోజకవర్గాల్లో లాటరీ ద్వారా ఇళ్లు కేటాయించనున్నారు. కుత్బుల్లాపూర్‌ నియోజకవర్గంలోని గండి మైసమ్మ ఫంక్షన్ హాల్, కంటోన్మెంట్ పరిధిలో మల్లారెడ్డి గార్డెన్స్, రాజేంద్రనగర్ లక్ష్మీగూడ పొదుపు సంఘం హాల్, నాంపల్లి పరిధిలో రెడ్‌హిల్స్‌లోని వెస్ట్ గార్డెన్‌లో డ్రా తీయనున్నట్టు హౌసింగ్ బోర్డు వీసీ గౌతమ్ తెలిపారు.

రేపు ఖైరతాబాద్, కూకట్‌పల్లి, అంబర్‌పేట, బహదూర్‌పురా, ఎల్లుండి శేరిలింగంపల్లి, మలక్‌పేట, ఇబ్రహీంపట్నం, మేడ్చల్‌ నియోజకవర్గాల్లో ఇందిరమ్మ ఇళ్ల డ్రా జరగనుంది. ఈ నెల 31న మల్కాజిగిరి, సనత్‌నగర్, మహేశ్వరం, కార్వాన్ నియోజకవర్గాల్లో లాటరీ ప్రక్రియ ఉంటుంది. స్థలాభావం, భద్రతా ఏర్పాట్ల వల్ల లాటరీ కేంద్రాల్లోకి దరఖాస్తు దారులందరినీ అనుమతించలేమని ఆయన పేర్కొన్నారు. అయితే కేంద్రాల వద్ద లాటరీ జరుగుతున్న తీరును ప్రజలందరూ స్క్రీన్లపై వీక్షించేలా ఏర్పాటు చేస్తున్నట్లు తెలిపారు. లాటరీ ప్రక్రియ ప్రత్యక్ష ప్రసారాన్ని tghb.telangana.gov.in వెబ్ సైట్‌తో పాటు tghd.official పేరుతో ఉండే హౌసింగ్ డిపార్ట్​మెంట్ సోషల్ మీడియా హ్యాండిల్స్ ద్వారా చూడవచ్చునన్నారు.

ప్రభుత్వ మార్గదర్శకాల ప్రకారం కేటాయింపు : ఇందిరమ్మ టవర్ల ఇళ్ల కేటాయింపు ప్రక్రియలో సిఫార్సులు, మధ్యవర్తుల ప్రమేయానికి అవకాశమే ఉండదని, పూర్తి పారదర్శకంగా ప్రభుత్వ మార్గదర్శకాల ప్రకారం కేటాయింపు ప్రక్రియ ఉంటుందని గౌతమ్ తెలిపారు. ఇళ్లు ఇప్పిస్తామని ఎవరు చెప్పినా నమ్మవద్దని కోరారు. అన్ని అర్హతలున్నప్పటికీ లాటరీలో తమ పేరు రాకపోతే నిరాశ పడవద్దని, తదుపరి విడతలో మళ్లీ దరఖాస్తు చేసుకోవచ్చని తెలిపారు. క్యూర్ పరిధిలో లక్ష ఇళ్లు నిర్మిస్తామని, ఇప్పుడు పైలట్ ప్రాజెక్టు మాత్రమే చేపట్టినట్లు వివరించారు. అనర్హులైన దరఖాస్తుదారులు కూడా ప్రభుత్వం త్వరలో ప్రకటించే ఎంఐజీ (మధ్య ఆదాయ వర్గం) హౌసింగ్ పథకానికి దరఖాస్తు చేసుకోవచ్చని సూచించారు. ఇళ్ల కేటాయింపుపై ఎలాంటి సందేహాలున్నా కాల్ సెంటర్ 040 24603572కు ఫోన్ చేయవచ్చునన్నారు. లాటరీలో ఇళ్లు దక్కని వారికి రూ.10 వేలు తిరిగి ఇవ్వనున్నట్లు పేర్కొన్నారు.

వేలల్లో దరఖాస్తులు : జీహెచ్​ఎంసీ, సైబరాబాద్, మల్కాజిగిరి మున్సిపల్ కార్పొరేషన్ల పరిధిలో అల్పాదాయ వర్గాలకు లక్ష ఫ్లాట్లు నిర్మించనున్నట్లు ప్రభుత్వం ప్రకటించింది. తొలి విడతలో 16 నియోజకవర్గాల్లో నిర్మించనున్న 18 టవర్లలోని 7 వేల 680 ఫ్లాట్లకు దరఖాస్తులు స్వీకరించారు. మొత్తం 60 వేల 720 మంది దరఖాస్తు చేయగా, అందులో 40 వేల 900 మందిని అర్హులుగా గుర్తించారు. ఇందిరమ్మ టవర్లకు ప్రభుత్వం రూ.807 కోట్లను మంజూరు చేసి టెండర్ల ప్రక్రియ పూర్తి చేసింది. పదంతస్తుల టవర్‌లో ఒక్కో అంతస్తుకు 12 ఫ్లాట్ల చొప్పున 528 చదరపు అడుగు బిల్డప్ ఏరియా 400 చదరపు అడుగుల కార్పెట్ ఏరియాతో సింగిల్ బెడ్ రూమ్‌లు నిర్మించనున్నారు. స్థలం, రూ.5 లక్షల సబ్సిడీని ప్రభుత్వం ఇవ్వనుండగా, రూ.6 లక్షలు లబ్ధిదారులు 4 విడతల్లో తమ వాటాగా చెల్లించాలి. ప్రభుత్వమే ఉచితంగా రిజిస్ట్రేషన్ చేసి ఇస్తుండటంతో అవసరమైతే బ్యాంకు నుంచి రుణం తీసుకోవచ్చు. మహిళలకు 30 శాతం, ఎస్సీలకు 14, ఎస్టీలకు 5, బీసీలకు 16, దివ్యాంగులకు 5, ప్రభుత్వ ఔట్ సోర్సింగ్, నాలుగో తరగతి ఉద్యోగులు, పారిశుద్ధ్య కార్మికులకు 10 శాతం రిజర్వ్ చేసి మిగతా 50 శాతం జనరల్‌గా కేటాయించాలని నిర్ణయించారు.

హైదరాబాద్ క్యూర్ పరిధిలో ఎల్‌ఐజీ ఇందిరమ్మ ఇళ్ల డ్రా తేదీలు ఖరారు - ఎక్కడ, ఎప్పుడంటే?

'క్యూర్​' పరిధి ఇందిరమ్మ ఇండ్ల పథకానికి వడివడిగా అడుగులు - రూ. 660 కోట్లతో టెండర్ల ప్రక్రియ

Last Updated : August 28, 2026 at 8:06 AM IST