'క్యూర్'లో లాటరీ ప్రక్రియ ముగిసింది - ఇల్లు దక్కింది ఎంతమందికో తెలుసా?
క్యూర్‌లో తొలివిడత ఎల్‌ఐజీ లాటరీ ప్రక్రియ పూర్తి - డ్రా ద్వారా 7,340 మంది ఎంపిక - క్షేత్రస్థాయి విచారణ, పరిశీలన అనంతరం ఫ్లాట్లు కేటాయింపు - పలు ప్రాంతాల్లో ఎల్లుండితో ముగియనున్న గడువు

Published : September 1, 2026 at 8:09 AM IST
|Updated : September 1, 2026 at 9:06 AM IST
Indiramma Houses Lucky Draw in Hyderabad : హైదరాబాద్ క్యూర్ పరిధిలో తొలి విడత ఇందిరమ్మ ఇళ్ల కేటాయింపు లాటరీ ప్రక్రియ పూర్తయింది. ఇందిరమ్మ టవర్లలో ఫ్లాట్ల కోసం డ్రా ద్వారా 7,340 మందిని ఎంపిక చేశారు. క్షేత్రస్థాయి విచారణ, ఆధారాల పరిశీలన తర్వాతే ఫ్లాట్లు కేటాయించనున్నట్లు హౌసింగ్ బోర్డు స్పష్టం చేసింది. ముషీరాబాద్, చాంద్రాయణగుట్ట, ఎల్బీనగర్, గోషామహల్ నియోజకవర్గాల్లో దరఖాస్తుల గడువు ఈ నెల 3న ముగియనుంది.
అర్హులను గర్తించి ఇళ్ల కేటాయింపు : హైదరాబాద్ క్యూర్ పరిధిలోని అల్పాదాయ వర్గాలకు సొంతింటి కల నెరవేర్చే లక్ష్యంతో ప్రభుత్వం నిర్మిస్తున్న ఇందిరమ్మ టవర్ల ఫ్లాట్ల కేటాయింపులో కీలక ప్రక్రియ ముగిసింది. క్యూర్ పరిధిలో లాటరీ ద్వారా 7,340 మంది లబ్ధిదారులను అధికారులు ఎంపిక చేశారు. తొలి విడతగా ప్రభుత్వ స్థలాలు అందుబాటులో ఉన్న 16 అసెంబ్లీ నియోజవర్గాల్లో దరఖాస్తులు స్వీకరించారు. కూకట్‌పల్లి, కుత్బుల్లాపూర్, ఖైరతాబాద్, నాంపల్లి, శేరిలింగంపల్లి, అంబర్పేట, బహదూర్పురా, ఇబ్రహీంపట్నం, కార్వాన్, మలక్పేట, మల్కాజిగిరి, మేడ్చల్, రాజేంద్రనగర్, సనత్‌నగర్, కంటోన్మెంట్, మహేశ్వరం నియోజకవర్గాల నుంచి 60,720 దరఖాస్తులు వచ్చాయి. అందులో 40,900 మంది మాత్రమే అర్హులు ఉన్నట్లు పరిశీలనలో తేలింది. వీరిలో లాటరీ ద్వారా 7,340 మందిని లబ్దిదారులుగా ఎంపిక చేశారు.
వెబ్‌సైట్‌లో ఎంపికైన వారి వివరాలు : లాటరీలో పేరు వచ్చినా సరే క్షేత్రస్థాయి విచారణ, ఆధారాల పరిశీలన తర్వాతే ఫ్లాట్లు కేటాయించనున్నట్లు హౌసింగ్ బోర్డు వీసీ వీపీ గౌతమ్ వెల్లడించారు. లాటరీలో ఎంపికైన వారి వివరాలను సంబంధిత వెబ్‌సైట్‌లో ఉంచనున్నట్లు తెలిపారు. ఎవరైనా అనర్హులు ఎంపికైనట్లు తెలిస్తే ఆన్‌లైన్‌లో అభ్యంతరాలు తెలపవచ్చునని సూచించారు. అర్హులకు మాత్రమే ఇళ్లు దక్కాలన్న లక్ష్యంతో బహుళ స్థాయి తనిఖీ విధానం అనుసరిస్తున్నట్లు స్పష్టం చేశారు. కొందరు తమ నివాస నియోజకవర్గానికి బదులుగా పొరపాటున వేరే నియోజకవర్గాన్ని ఎంపిక చేశారని, అలాంటి దరఖాస్తుదారులు ఆన్‌లైన్‌లో సరి చేసుకోవాలని తెలిపారు. లాటరీలో ఎంపిక కాని వారు నిరుత్సాహపడొద్దని, రాబోయే ప్రాజెక్టుల్లో మళ్లీ అవకాశం ఉంటుందని గౌతమ్ వెల్లడించారు.
"ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాతే నాకు కొత్త రేషన్ కార్డు వచ్చింది. ఈరోజు ఇందిరమ్మ ఇళ్ల లక్కీ డ్రాలో కూడా నా పేరు రావడం సంతోషంగా ఉంది. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డికి మనస్ఫూర్తిగా ధన్యవాదాలు తెలియజేస్తున్నాను" - ఇందిరమ్మ ఇంటికి ఎంపికైన మహిళ
మరో 5 నియోజకవర్గాల్లో నోటిఫికేషన్లకు కసరత్తులు : ఇందిరమ్మ ఫ్లాట్ల లాటరీలో ఇళ్లు వచ్చిన లబ్ధిదారుల్లో సంతోషం వ్యక్తమవుతోంది. ఏళ్లుగా ఎదురు చూస్తున్న తమ సొంతింటి కల నెరవేరబోతోందని కొందరు భావోద్వేగానికి లోనయ్యారు. ముషీరాబాద్, చాంద్రాయణగుట్ట, ఎల్బీనగర్, గోషామహల్ నియోజకవర్గాల్లో దరఖాస్తు గడువు ఈ నెల 3తో ముగియనుంది. మరో 5 నియోజకవర్గాల్లో కూడా అనువైన స్థలాలను గుర్తించి, దశల వారీగా నోటిఫికేషన్లు జారీ చేసేందుకు హౌసింగ్ బోర్డు కసరత్తు చేస్తోంది.
"గత ప్రభుత్వం ఉన్నప్పటి నుంచి ఎన్నోసార్లు ఇంటి కోసం దరఖాస్తు చేస్తున్నాను. కానీ ఎప్పుడూ మంజూరు కాలేదు. నాకు ఇందిరమ్మ ఇల్లు వస్తుందని అస్సలు ఊహించలేదు. చాలా సంతోషంగా ఉంది" - ఇందిరమ్మ ఇంటికి ఎంపికైన మహిళ
లక్కీ డ్రాతోనే క్యూర్ పరిధిలో ఇందిరమ్మ ఇళ్లు - మరో 10 రోజుల్లో రెండో విడత : పొంగులేటి
ఈ చిన్నారిది లక్కీ హ్యాండ్ - డ్రా తీస్తే తమ కుటుంబానికే వచ్చిన ఇందిరమ్మ ఇంటి టోకెన్

