కనిగిరికి వచ్చిన గూడ్స్ రైలు : సంతోషంగా స్వాగతం పలికిన స్థానికులు
ఛత్తీస్‌గఢ్‌లోని బిలాస్పూర్ నుంచి రైల్వే సామగ్రితో కనిగిరికి వచ్చిన గూడ్స్ రైలు - కనిగిరి, పామూరు మధ్య 50 శరవేగంగా నిర్మాణ పనులు

By ETV Bharat Andhra Pradesh Team
Published : December 29, 2025 at 6:20 PM IST
Goods Rail In Kanigiri : ప్రకాశం జిల్లా కనిగిరికి రైలు బండి వచ్చింది. రైలు బండిని చూసేందుకు స్థానిక, సమీప గ్రామాల ప్రజలు కనిగిరి రైల్వే స్టేషన్ వద్దకు చేరుకొని రైలు బండికి స్వాగతం పలుకుతూ సెల్ఫీలు తీసుకొని సంతోషం వ్యక్తం చేశారు. ఛత్తీస్‌గఢ్ రాష్ట్రంలోని బిలాస్పూర్ నుంచి రైల్వే సామాగ్రితో గూడ్స్ రైలు కనిగిరికి వచ్చినట్లు రైలు లోకో పైలెట్ తెలిపారు. నడికుడి-శ్రీకాళహస్తి రైల్వే లైన్ నిర్మాణ పనులకు సంబంధించిన సామగ్రిని గూడ్స్ రైలు తీసుకొని రావడంతో స్థానికులు రైలుకి స్వాగతం పలికారు. ఎప్పటి నుంచో మా ప్రాంతానికి రైలు వస్తుందని వింటున్నాం కాని , కూటమి ప్రభుత్వం వచ్చాకనే మా ప్రాంతానికి రైలు వచ్చిందని స్థానికులు ఆనందం వ్యక్తం చేశారు.
దశాబ్దాలుగా నత్తనడక : ప్రకాశం జిల్లాలోని నడికుడి- శ్రీకాళహస్తి రైల్వే లైన్ నిర్మాణ పనులు శరవేగంగా పూర్తయ్యాయి. దశాబ్దాలుగా నత్తనడకన సాగిన రైల్వే లైన్ నిర్మాణ పనులు కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక డబుల్ ఇంజిన్ వేగంతో ఊపందుకున్నాయి. భూ సేకరణకు సంబంధించిన పరిహారం రూ.7 కోట్లు చెల్లించడంతో రైల్వే లైన్ నిర్మాణ పనులు ఊపందుకున్నాయి. ప్రధానంగా భూసేకరణకు ఉన్న అడ్డంకులన్నింటినీ కూటమి ప్రభుత్వం పరిష్కరించడంతో పనుల పూర్తికి మార్గం సుగమమైంది.
ప్రస్తుతం శరవేగంగా జరుగుతున్న పనులు : కనిగిరి, పామూరు మండలాల మధ్య సుమారు 50 కిలోమీటర్ల నిర్మాణాన్ని పూర్తి చేసేందుకు పనులు శరవేగంగా జరుగుతున్నాయి. తాజాగా రైల్వే అధికారులు నడికుడి నుంచి కనిగిరి ప్రాంతం వరకు రైలు ఇంజిన్‌తో ట్రయల్ రన్ నిర్వహించారు. ఆదివారం కావడంతో రైలును చూసేందుకు స్థానికులు ఎక్కువగా వచ్చారు.
నడికుడి - శ్రీకాళహస్తి రైల్వేలైన్ నేపథ్యం : గుంటూరు జిల్లా నడికుడి జంక్షన్ నుంచి తిరుపతి జిల్లా శ్రీకాళహస్తి వరకు 308 కిలోమీటర్ల మేర నడికుడి - శ్రీకాళహస్తి రైల్వే లైన్ పదేళ్ల క్రితమే మంజూరైంది. దీనికి సర్వే పనులు పూర్తై కొత్త రైల్వే లైను నిర్మాణానికి రైల్వే శాఖ పచ్చజెండా ఊపిన తరువాత కూడా చాలా కాలంపాటు పనులు ప్రారంభం కాలేదు. ప్రకాశం జిల్లాలో కరవు మండలాలను కలుపుతూ వెళ్లే ఈ రైలు మార్గంపై ప్రజలు ఎన్నో ఆశలు పెట్టుకున్నారు. రైల్వే శాఖ పరంగా నిధుల విషయంలో సమస్య రానప్పటికీ భూసేకరణ విషయంలో ఇబ్బంది తలెత్తింది. వాటిని పరిష్కరించడానికి గత ప్రభుత్వం చొరవ చూపలేదు. కూటమి ప్రభుత్వం వచ్చాక భూ వివాదాలు పరిష్కరించింది. దీంతో రైలు విస్తరణ పనులకి మార్గం సుగమమైంది.
నడికుడి నుంచి శ్రీకాళహస్తి వరకు 308 కిలోమీటర్లు ఉండగా ఇందులో అత్యధికంగా ప్రకాశం జిల్లాలోని దొనకొండ, దర్శి, పొదిలి, కనిగిరి, పామూరు తదితర మండలాలను కలుపుతూ 102 కిలోమీటర్ల రైల్వేలైన్ ఉంది. ప్రభుత్వం ఎట్టకేలకు రైల్వే లైన్‌కు కావలసిన 1,923 ఎకరాల భూసేకరణ పూర్తి చేసి రైల్వేశాఖకు అప్పగించింది. నడికుడి-శ్రీకాళహస్తి రైల్వే లైన్లో భాగంగా ఇప్పటికే పలుచోట్ల రైల్వేస్టేషన్లు పూర్తయ్యాయి. పొదిలి వరకూ రైల్వేలైన్ పూర్తి చేసి ట్రయల్ రన్ కూడా నిర్వహించారు.
దక్షిణాది నగరాలకు కీలకం : రాజధాని అమరావతి ప్రాంతాన్ని రాయలసీమతో పాటు దక్షిణాది నగరాలకు అనుసంధానం చేయడంలో నడికుడి - శ్రీకాళహస్తి రైల్వే మార్గం కీలకం కానుంది. ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రాష్ట్రాల ప్రజల రాకపోకలకు ఈ రైలు మార్గం ఎంతో సౌకర్యంగా ఉంటుంది. రైల్వే లైన్ విజయవాడ - చెన్నై రైల్వే మార్గానికి ప్రత్యామ్నాయంగా ఉపయోగపడనుంది. నడికుడి-శ్రీకాళహస్తి మధ్యన రైల్వే లైనులో అక్కడక్కడా హైదరాబాద్- గుంటూరు, విజయవాడ- బెంగళూరు ప్రధాన లైను కూడా కలుస్తుంది. ప్రస్తుతం ఉన్న హౌరా- చైన్నై, హైదరాబాద్- చెన్నై మార్గాల మధ్య రైళ్ల రాకపోకలు పెరగడంతో ఆ లైన్లపై ఒత్తిడి పెరుగుతోంది. విజయవాడ నుంచి చెన్నై వరకు ఉన్న మార్గమంతా డెల్టా ప్రాంతంలో ఉండటంతో తుపాన్లు, వరదల సమయంలో ఇబ్బందులు ఎదురవుతున్నాయి. నడికుడి-శ్రీకాళహస్తి మార్గం దీనికి సమాంతరంగా మెట్ట ప్రాంతాల గుండా వెళుతుంది.
గుంటూరులో జనవరి 3 నుంచి ప్రపంచ తెలుగు మహాసభలు
కేబినెట్ మీటింగ్‌లో మంత్రి రాంప్రసాద్‌రెడ్డి కంటతడి - ఓదార్చిన సీఎం చంద్రబాబు

