ETV Bharat / state

Telangana Formation Day Live Updates : కాంగ్రెస్ అధికారంలోకి వచ్చిన తర్వాత స్వేచ్ఛ వచ్చింది : కోదండరామ్​

Telangana Formation Day Live Updates
Telangana Formation Day Live Updates (ETV Bharat)
author img

By ETV Bharat Telangana Team

Published : June 2, 2026 at 7:03 AM IST

|

Updated : June 2, 2026 at 12:16 PM IST

Choose ETV Bharat

Telangana Formation Day Live Updates : రాష్ట్రం ఆవిర్భవించి 12 ఏళ్లు పూర్తి చేసుకొని 13వ ఏడాదిలోకి అడుగుపెట్టింది. ఈ సందర్భంగా తెలంగాణ ఆవిర్భావ దినోత్సవ వేడుకలు రాష్ట్రవ్యాప్తంగా ఘనంగా జరగనున్నాయి.

LIVE FEED

12:07 PM, 2 Jun 2026 (IST)

తెలంగాణ జన సమితి కార్యాలయంలో రాష్ట్ర ఆవిర్భావ వేడుకలు

తెలంగాణ జన సమితి కార్యాలయంలో రాష్ట్ర ఆవిర్భావ వేడుకలు జరిగాయి. ఎమ్మెల్సీ కోదండరాం రాష్ట్ర ప్రజలకు తెలంగాణ ఆవిర్భావ దినోత్సవం శుభాకాంక్షలు తెలిపారు. '60 ఏళ్ల నిరీక్షణ ఫలించిన రోజు జూన్‌ 2, మేం ఎప్పుడూ ఆంధ్ర ప్రజలకు వ్యతిరేకం కాదు. తెలంగాణపై ఆంధ్ర పాలకుల పెత్తనాన్ని మాత్రమే వ్యతిరేకించాం' అని కోదండరాం మాట్లాడారు. సోనియాగాంధీ, సుష్మాస్వరాజ్ తెలంగాణ కోసం కృషి చేశారని, బీఆర్‌ఎస్ ప్రభుత్వం నిరంకుశ వైఖరితో వ్యవహరించిందని అన్నారు. కాంగ్రెస్ అధికారంలోకి వచ్చిన తర్వాత స్వేచ్ఛ వచ్చిందని కోదండరాం తెలిపారు.

12:06 PM, 2 Jun 2026 (IST)

రాష్ట్ర అవతరణ వేడుకల్లో పాల్గొన్న కల్వకుంట్ల కవిత

రాష్ట్ర అవతరణ వేడుకల్లో కల్వకుంట్ల కవిత పాల్గొన్నారు. తెలంగాణ రక్షణసేన కార్యాలయంలో కవిత జాతీయ జెండా ఎగరవేశారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ మిలియన్ మార్చ్‌ను తలపించేలా భూపోరాటం చేస్తామని, జులై 2 న ఉప్పల్ భగాయత్‌లో పెద్దఎత్తున భూపోరాటం చేస్తామని అన్నారు. పార్టీలకు అతీతంగా అన్ని వర్గాల ప్రజలు ఉద్యమంలో పాల్గొనాలని కవిత సూచించారు. ఉద్యమకారులకు ఇచ్చిన హామీలపై సీఎం నుంచి ప్రకటన రాలేదు. ఉద్యమకారులకు హామీలపై సీఎం ప్రకటన చేయకపోవటం దుర్మార్గం అని కవిత మాట్లాడారు. ఆగస్టు 6 లోపు ట్యాంక్‌బండ్‌పై జయశంకర్‌ విగ్రహం ఏర్పాటు చేయాలని డిమాండ్​ చేశారు.

12:02 PM, 2 Jun 2026 (IST)

తెలంగాణ భవన్‌లో రాష్ట్ర ఆవిర్భావ వేడుకల్లో పాల్గొన్న కేటీఆర్‌

తెలంగాణ భవన్‌లో రాష్ట్ర ఆవిర్భావ వేడుకల్లో కేటీఆర్‌ పాల్గొన్నారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ కేసీఆర్‌ మీద సినిమా తీయాలని అనుకుంటున్నా అని ప్రముఖ దర్శకుడు అడిగగా, కాళేశ్వరం నిర్మాణం పూర్తయ్యాక తీద్దామని కేసీఆర్‌ అన్నారని కేటీఆర్​ బదులిచ్చారు. జూన్‌ 2వ తేదీ కేసీఆర్‌ జీవితచరిత్రలో అతిపెద్దది. దశాబ్దాల పోరాటం ఫలించిన రోజే జూన్‌ 2, తెలంగాణ కోసం ఎత్తిన జెండా దింపేది లేదని కేసీఆర్‌ చెప్పారని కేటీఆర్​ అన్నారు. పోరాటం మధ్యలో ఆపితే ప్రజలు రాళ్లతో కొట్టాలని కేసీఆర్‌ ధైర్యంగా చెప్పారు. పదవీత్యాగాలకే కాదు, ప్రాణత్యాగానికీ వెనుదీయని నేత కేసీఆర్‌, 14 ఏళ్లు పోరాడి రాష్ట్రం సిద్ధించాక కేసీఆర్‌ చేతిలో ప్రజలు బాధ్యతలు పెట్టారు. పోరాట నాయకుడే పాలకుడైతే బాగుంటుందని ప్రజలు భావించారు. 2028 డిసెంబర్‌లో కేసీఆర్ మళ్లీ సీఎం అవుతారని ప్రజలే చెప్తున్నారని కేటీఆర్‌ మాట్లాడారు.

11:34 AM, 2 Jun 2026 (IST)

హైదరాబాద్‌ : లోక్‌భవన్‌లో రాష్ట్ర అవతరణ వేడుకలు

హైదరాబాద్‌ లోక్‌భవన్‌లో రాష్ట్ర అవతరణ వేడుకలు ఘనంగా జరిగాయి. లోక్‌భవన్‌లో గవర్నర్ జాతీయ పతాకావిష్కరణ చేశారు. తెలంగాణ అభివృద్ధి పథంలో దూసుకుపోతుందని, వివిధ రాష్ట్రాల సమ్మిళిత సంస్కృతికి హైదరాబాద్‌ ప్రతీక అని గుర్తు చేసుకున్నారు. వసుధైక కుటుంబం భావనకు హైదరాబాద్‌ సాక్ష్యమన్నారు. వికసిత్‌ భారత్‌లో తెలంగాణ మరింత కీలకంగా ఎదుగుతుందని కొనియాడారు.

10:59 AM, 2 Jun 2026 (IST)

తెలుగు ప్రజలకు రెండు రాష్ట్రాలు ఏర్పడి నేటికి 12 ఏళ్లు: చంద్రబాబు

తెలుగు ప్రజలకు రెండు రాష్ట్రాలు ఏర్పడి నేటికి 12 ఏళ్లు అయ్యిందని ఏపీ సీఎం చంద్రబాబు పేర్కొన్నారు. రెండు రాష్ట్రాలుగా ఏర్పడినా, తెలుగు జాతి అంతా ఎప్పటికీ ఒక్కటేనన్నారు. అటు తెలంగాణ, ఇటు ఏపీ అభివృద్ధిలో దూసుకుపోవాలని ఆకాంక్షించారు. తెలుగు గడ్డ భవిష్యత్‌లో మరెన్నో విజయాలు సాధించాలన్నారు.

10:57 AM, 2 Jun 2026 (IST)

గాంధీభవన్‌లో ఘనంగా తెలంగాణ రాష్ట్ర అవతరణ వేడుకలు

హైదరాబాద్​లోని గాంధీభవన్‌లో తెలంగాణ రాష్ట్ర అవతరణ వేడుకలు ఘనంగా జరిగాయి.

10:10 AM, 2 Jun 2026 (IST)

తెలంగాణ ప్రజలకు రాష్ట్ర ఆవిర్భావ దినోత్సవ శుభాకాంక్షలు : పవన్‌ కల్యాణ్‌

ఏపీ డిప్యూటీ సీఎం పవన్‌ కల్యాణ్‌ తెలంగాణ ప్రజలకు రాష్ట్ర ఆవిర్భావ దినోత్సవ శుభాకాంక్షలు తెలిపారు. తెలంగాణ కోసం బలిదానం చేసిన ప్రతి ఒక్కరికీ అంజలి ఘటిస్తున్నానన్న పవన్‌, జనసేన ఊపిరులూదుకొన్నది తెలంగాణ గడ్డపైనేనని గుర్తు చేసుకున్నారు. తెలంగాణ నేల నుంచే వారసత్వంగా పోరాటాన్ని పుణికి పుచ్చుకున్నదని కొనియాడారు. వ్యక్తి స్వేచ్ఛకు విఘాతం కలిగితే గళం వినిపించే తెగువ తెలంగాణలో ఉందని, గళం వినిపించే తెగువ జనసేన శ్రేణుల్లోనూ నిండుగా ఉందని పేర్కొన్నారు. తెలంగాణ రాష్ట్రం సమున్నతంగా అభివృద్ధి చెందాలని ఆకాంక్షిస్తున్నానని తెలిపారు.

10:07 AM, 2 Jun 2026 (IST)

తెలంగాణ ప్రజలు నూతన ఆవిష్కరణకు ప్రసిద్ధి చెందినవారు: ప్రధాని మోదీ

ప్రధాని మోదీ తెలంగాణ ప్రజలకు రాష్ట్ర ఆవిర్భావ దినోత్సవ శుభాకాంక్షలు తెలిపారు. తెలంగాణ ప్రజలు నూతన ఆవిష్కరణకు ప్రసిద్ధి చెందిన వారని కొనియాడారు. తెలంగాణ చరిత్ర ధైర్య సాహసాలు, పట్టుదలకు స్ఫూర్తి అన్న ప్రధాని, తెలంగాణ అభివృద్ధికి మద్దతు ఇచ్చేందుకు కేంద్రం కట్టుబడి ఉందని స్పష్టం చేశారు.

9:11 AM, 2 Jun 2026 (IST)

సంక్షేమం, అభివృద్ధికి ఈ ప్రభుత్వం సమప్రాధాన్యం ఇస్తోంది : సీఎం

సంక్షేమం, అభివృద్ధికి ఈ ప్రభుత్వం సమప్రాధాన్యం ఇస్తోందని సీఎం రేవంత్​ రెడ్డి పేర్కొన్నారు. రాష్ట్ర ప్రజలకు తెలంగాణ ఆవిర్భావ దినోత్సవ శుభాకాంక్షలు తెలిపిన సీఎం, నా తెలంగాణ కోటి రత్నాల వీణ అని గుర్తు చేశారు. తెలంగాణ కల సాకారం చేసిన నాటి ప్రధాని మన్మోహన్‌ సింగ్, సోనియా గాంధీకి ధన్యవాదాలు తెలిపారు. పుట్టుక నీది, చావు నీది, బతుకంతా దేశానిది అని కాళోజీ అన్నారని గుర్తు చేసిన రేవంత్ రెడ్డి, కాళోజీ స్ఫూర్తితో అధికారం చేపట్టిన నాటి నుంచి రాష్ట్ర హితం కోసం శ్రమిస్తున్నామని స్పష్టం చేశారు.

8:29 AM, 2 Jun 2026 (IST)

రాష్ట్రవ్యాప్తంగా ఘనంగా తెలంగాణ అవతరణ దినోత్సవ వేడుకలు

తెలంగాణ అవతరణ దినోత్సవ వేడుకలు రాష్ట్రవ్యాప్తంగా ఘనంగా జరుగుతున్నాయి. నల్గొండలో రాష్ట్ర అవతరణ వేడుకల్లో మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి పాల్గొన్నారు. క్లాక్ టవర్ కూడలి వద్ద అమరవీరుల స్థూపానికి నివాళి అర్పించిన మంత్రి, పోలీస్ పరేడ్ మైదానంలో జాతీయ పతాకావిష్కరణ చేశారు. హనుమకొండలో జరిగిన ఆవిర్భావ వేడుకల్లో మంత్రి పొంగులేటి పాల్గొన్నారు. హనుమకొండ అమరవీరుల స్థూపం వద్ద నివాళి అర్పించిన మంత్రి, పోలీస్ పరేడ్ గ్రౌండ్స్‌లో జాతీయ జెండాను ఎగురవేశారు. ఖమ్మంలో నిర్వహించిన రాష్ట్ర అవతరణ వేడుకల్లో డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క పాల్గొన్నారు.

8:12 AM, 2 Jun 2026 (IST)

తెలంగాణ అమరవీరులకు నివాళి అర్పించిన సీఎం రేవంత్‌రెడ్డి

హైదరాబాద్‌ గన్‌పార్క్‌ వద్ద తెలంగాణ అమరవీరులకు సీఎం రేవంత్‌రెడ్డి నివాళి అర్పించారు.

8:06 AM, 2 Jun 2026 (IST)

అవమానాల అధ్యాయానికి ముగింపు పలికిన రోజు ఇది: హరీశ్‌రావు

మాజీ మంత్రి హరీశ్‌రావు రాష్ట్ర ప్రజలకు తెలంగాణ ఆవిర్భావ దినోత్సవ శుభాకాంక్షలు తెలిపారు. త్యాగాల చరిత్రకు న్యాయం జరిగిన రోజు నేడని గుర్తు చేసుకున్నారు. అవమానాల అధ్యాయానికి ముగింపు పలికిన రోజు ఇదని, తెలంగాణ ఆత్మగౌరవ పతాకం సగర్వంగా ఎగిరిన రోజని, 4 కోట్ల ప్రజల ఆత్మగౌరవ ఆకాంక్షలు సాకారమైన రోజు ఇది అని హర్షం వ్యక్తం చేశారు.

6:44 AM, 2 Jun 2026 (IST)

శాసన మండలిలో రాష్ట్ర ఆవిర్భావ దినోత్సవం వేడుకలు

శాసన మండలిలో రాష్ట్ర ఆవిర్భావ దినోత్సవం వేడుకలు నిర్వహించారు. మండలి ఛైర్మన్ గుత్తా సుఖేందర్ రెడ్డి జాతీయ పతాకావిస్కరణ చేశారు. పతాకావిష్కరణ కార్యక్రమంలో ఎమ్మెల్సీలు పాల్గొన్నారు.

6:44 AM, 2 Jun 2026 (IST)

తెలంగాణ అవతరణ దినోత్సవానికి ముస్తాబైన రాష్ట్రం

తెలంగాణ అవతరణ దినోత్సవానికి రాష్ట్రం ముస్తాబైయింది. సికింద్రాబాద్‌ పరేడ్ మైదానంలో నేడు తెలంగాణ ఆవిర్భావ వేడుకలు జరగనున్నాయి. ఉదయం 8గం.కు రాష్ట్ర అవతరణ దినోత్సవానికి సీఎం హాజరుకానున్నారు.ఆ తర్వాత గన్‌పార్క్‌ వద్ద అమరవీరులకు నివాళులర్పించనున్నారు. పరేడ్‌ గ్రౌండ్స్‌లో జాతీయ పతాకాన్ని సీఎం రేవంత్‌రెడ్డి ఆవిష్కరించి, పోలీసుల గౌరవ వందనాన్ని స్వీకరించనున్నారు. ఉద్యోగులు, పింఛనర్ల ఆరోగ్య పథకంపై సీఎం ప్రకటన చేయనున్నట్లు సమాచారం. ఇవాళ ఉద్యోగ నోటిఫికేషన్ జారీ చేయనున్న టీజీపీఎస్సీ తెలిపింది.

6:43 AM, 2 Jun 2026 (IST)

రాష్ట్ర ఆవిర్భావ దినోత్సవం సందర్భంగా పోలీసులకు పతకాలు

ఉత్తమ సేవలు అందించిన పలువురు పోలీసులు, అధికారులకు తెలంగాణ రాష్ట్ర ఆవిర్భావ దినోత్సవం సందర్భంగా ప్రభుత్వం పతకాలు ప్రకటించింది. టీఎస్‌ జెన్‌కో విజిలెన్స్‌ అండ్‌ సెక్యూరిటీ చీఫ్‌ ప్రతాప్‌కు సీఎం సర్వోన్నత పోలీసు పతకం దక్కింది. భద్రాద్రి కొత్తగూడెం రిజర్వ్‌ ఇన్‌స్పెక్టర్‌ రవి, చెర్ల సీఐ రాజుకు శౌర్య పతకం ప్రకటించారు. ఇంటిలిజెన్స్‌ కానిస్టేబుల్‌ సంపత్‌, గ్రేహౌండ్స్‌లోని మరో ఏడుగురికి శౌర్య పతకాలు వరించాయి. 16 మందికి మహోన్నత సేవా పతకాలు, 94 మందికి ఉత్తమ సేవా పతకాలు, 50 మంది కఠిన సేవా పతకాలు, మరో 461 మంది సేవా పతకాలు అందుకోనున్నారు.

6:43 AM, 2 Jun 2026 (IST)

రాష్ట్ర ప్రజలకు తెలంగాణ ఆవిర్భావ దినోత్సవ శుభాకాంక్షలు చెప్పిన కేసీఆర్‌

రాష్ట్ర ప్రజలకు తెలంగాణ ఆవిర్భావ దినోత్సవ సందర్భంగా కేసీఆర్‌ ప్రజలకు శుభాకాంక్షలు తెలియజేశారు. అమరవీరుల త్యాగాలను బీఆర్‌ఎస్‌ అధినేత, మాజీ సీఎం స్మరించుకున్నారు. తెలంగాణను అనతికాలంలోనే దేశంలోనే నంబర్ వన్‌గా నిలబెట్టామని, తెలంగాణ అస్తిత్వం ప్రమాదంలో పడకుండా అప్రమత్తంగా ఉండాలని పిలుపునిచ్చారు.

6:41 AM, 2 Jun 2026 (IST)

నేడు తెలంగాణ ఆవిర్భావ దినోత్సవం సందర్భంగా బీఆర్ఎస్ ప్రతిజ్ఞ

నేడు తెలంగాణ ఆవిర్భావ దినోత్సవం సందర్భంగా బీఆర్ఎస్ ప్రతిజ్ఞ చేశారు. జాతీయ జెండా ఎగరవేసిన అనంతరం ప్రతిజ్ఞ చేయాలని బీఆర్ఎస్ ఆదేశాలు చేశారు. ఉద్యమం, కేసీఆర్ పాలన, ప్రస్తుత పరిస్థితులు ప్రతిబింబించేలా, 'మన తెలంగాణను రక్షించుకుందాం' అనే పేరుతో బీఆర్​ఎస్​ శ్రేణులు ప్రతిజ్ఞ చేయనున్నారు.

Last Updated : June 2, 2026 at 12:16 PM IST