26-08-2026 Telangana News Today Live Updates : మల్లికార్జున ఖర్గేను మర్యాదపూర్వకంగా కలిసిన భట్టి విక్రమార్క

Published : August 26, 2026 at 7:10 AM IST
|Updated : August 26, 2026 at 10:52 PM IST
26-08-2026 Telangana News Today Live Updates : ఈరోజు తాజా ప్రధాన వార్తల సమాచారం
LIVE FEED
మల్లికార్జున ఖర్గేను మర్యాదపూర్వకంగా కలిసిన భట్టి విక్రమార్క
బెంగళూరులో ఏఐసీసీ అధ్యక్షుడు ఖర్గేతో డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క భేటీ అయ్యారు. మల్లికార్జున ఖర్గేను భట్టి విక్రమార్క మర్యాదపూర్వకంగా కలిశారు. "బెంగళూరుకు అధికారిక కార్యక్రమానికి వచ్చాను. కర్ణాటక విద్యుత్ మంత్రి జార్జ్‌తో సమావేశమయ్యాను. బెంగళూలోనే ఉన్న ఏఐసీసీ అధ్యక్షుడు ఖర్గేను కలిశాను. మా మధ్య రాజకీయ పరిణామాలపై ఎలాంటి చర్చ జరగలేదు" అని భట్టి విక్రమార్క తెలిపారు.
నేపాల్ వరదలు - హెల్ప్‌లైన్, కోఆర్డినేషన్ సెంటర్ ఏర్పాటు
నేపాల్ వరదలపై రాష్ట్ర ప్రభుత్వం హెల్ప్‌లైన్, కోఆర్డినేషన్ సెంటర్ ఏర్పాటు చేసింది. దిల్లీలోని తెలంగాణ భవన్‌లో హెల్ప్‌లైన్, కోఆర్డినేషన్ సెంటర్ ఏర్పాటు చేసింది.
- హెల్ప్‌లైన్: రెసిడెంట్ కమిషనర్ పీఎస్ వందన- 9871999044
- హెల్ప్‌లైన్: పీఆర్ఓ చక్రవర్తి నంబర్- 9949351270
- హెల్ప్‌లైన్: లైజన్ ఆఫీసర్ జి.రక్షిత్ నాయక్ నంబర్- 9618597969
హైదరాబాద్ నుంచి వెళ్లిన 140 మంది యాత్రికుల ఆచూకీపై ఆందోళన
హైదరాబాద్ ఏజెన్సీ ద్వారా నేపాల్ వెళ్లిన యాత్రికుల ఆచూకీపై ఆందోళన చెందుతున్నారు. హైదరాబాద్ నుంచి 140 మంది యాత్రికులు నేపాల్ వెళ్లారు. హైదరాబాద్‌లోని ప్రైవేటు ఏజెన్సీ ద్వారా 156 మంది వెళ్లారు. కానీ అనారోగ్యం కారణంగా 16 మంది యాత్రికులు గదిలోనే ఉండిపోయారు. విహారం కోసం బయటకు వెళ్లిన 140మంది యాత్రికులు తిరిగిరాలేదు.
నేపాల్ - టిబెట్ సరిహద్దుల్లో ఆకస్మిక వరదలు, 95కు చేరిన మృతులు
నేపాల్ - టిబెట్ సరిహద్దుల్లో ఆకస్మిక వరదలకు ఇప్పటివరకు 95 మంది చనిపోయారు. ఈ వరదల్లో సుమారు 500 మంది గల్లంతయ్యారు. వీరిలో 105 మంది భారతీయులు ఉన్నట్లు అధికారులు వెల్లడించారు. నేపాల్-టిబెట్ సరిహద్దుల్లోని భోటేకోశీ నదికి భారీగా వరద పోటెత్తింది. వరద ధాటికి ఆ మార్గంలోని వంతెనలు కొట్టుకుపోగా, 13 జలవిద్యుత్ ప్రాజెక్టులు ధ్వంసమయ్యాయి.
గ్లోబల్ సమ్మిట్‌పై కేబినెట్ సబ్ కమిటీ సమావేశం
గ్లోబల్ సమ్మిట్‌పై ప్రజాభవన్‌లో కేబినెట్ సబ్ కమిటీ సమావేశం జరిగింది. మంత్రులు భట్టి విక్రమార్క, ఉత్తమ్, శ్రీధర్‌బాబు భేటీలో పాల్గొని సమ్మిట్ కోసం ప్రజాభవన్‌లో వార్‌రూమ్ ఏర్పాటు చేయాలని నిర్ణయించారు. డిసెంబరు 7,8,9 తేదీల్లో ఇన్వెస్ట్ తెలంగాణ గ్లోబల్ సమ్మిట్ జరగనుంది.
22ఏ పై సిట్టింగ్ జడ్జితో న్యాయ విచారణ జరిపించాలి: రామచందర్‌రావు
22ఏ జాబితాలో తమ భూములు చేర్చారని పలు కాలనీ వాసులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారని బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు రామచందర్‌రావు ఆరోపించారు. 22ఏ పై సిట్టింగ్ జడ్జితో న్యాయ విచారణ జరిపించాలని ఆయన డిమాండ్ చేశారు. నిషేధిత జాబితాలో చేర్చిన భూములను ప్రీ హోల్డ్‌లో పెట్టాలని ఆయన ప్రభుత్వానికి సూచించారు.
విద్యార్థులే లక్ష్యంగా గంజాయి సరఫరా చేస్తున్న వ్యక్తి అరెస్టు
మేడ్చల్ జిల్లాలో విద్యార్థులే లక్ష్యంగా గంజాయి సరఫరా చేస్తున్న వ్యక్తిని మేడ్చల్ ఎక్సైజ్ పోలీసులు అరెస్ట్ చేశారు. ప్రైవేటు బస్సులో తరలిస్తున్న 5కిలో గంజాయి గుండ్లపోచంపల్లి వద్ద స్వాధీనం చేసుకున్నారు. నిందితుడు ఆదిలాబాద్‌కు చెందిన మహ్మద్ ఖాదర్(46)గా గుర్తించారు.
నేపాల్ ఆకస్మిక వరదల్లో 384 మంది పర్యాటకులు గల్లంతు
హిమాలయ దేశం నేపాల్‌లో మెరుపు వరదలు పెను విధ్వంసం సృష్టించాయి. టిబెట్ సరిహద్దు దిశ నుంచి ఉగ్రరూపం దాల్చి ప్రవహించిన భోటేకోశీ నది తీర ప్రాంతాలను ముంచెత్తింది. విపత్తులో ఇప్పటివరకు ఎనిమిది మంది మృతి చెందగా, సుమారు 400 మంది గల్లంతయ్యారు. గల్లంతైన వారిలో 105 మంది భారతీయులతో పాటు, 37 మంది ఎన్‌ఆర్‌ఐలు ఉన్నట్లు నేపాల్ టూరిజం బోర్డు వెల్లడించింది.
మోడల్ స్కూల్ టీచర్లకు డెత్ గ్రాట్యుటీ, ఫ్యామిలీ పెన్షన్ పొందే అర్హత ఉంది: హరీశ్‌రావు
మోడల్ స్కూల్ టీచర్ల సమస్యలపై పోరాడుతామని హరీశ్‌రావు హామీ ఇచ్చారు. ఇవాళ తనను కలిసిన టీచర్లతో ఆయన మాట్లాడారు. మోడల్ స్కూల్ టీచర్లకు డెత్ గ్రాట్యుటీ, ఫ్యామిలీ పెన్షన్ పొందే అర్హత ఉందన్నారు. మోడల్ స్కూల్ టీచర్ల డిమాండ్లకు బీఆర్‌ఎస్ మద్దతు ఉంటుందని హరీశ్‌రావు హామీ ఇచ్చారు.
మా కుమార్తె సుస్మిత వ్యాఖ్యలతో మాకు సంబంధం లేదు: కొండా మురళి
తమ కుమార్తె సుస్మిత వ్యాఖ్యలతో తమకు సంబంధం లేదని కాంగ్రెస్ నేత కొండా మురళి స్పష్టం చేశారు. తాము కాంగ్రెస్‌ను వీడేది లేదన్నారు. కమిటీ నిర్ణయం వెలువడే వరకు ఏమీ మాట్లాడమని, సోనియాగాంధీ, రాహుల్‌గాంధీపై విశ్వాసం ఉందన్నారు. ప్రజాభవన్‌లో భట్టి, ఉత్తమ్‌తో భేటీ అనంతం ఆయన మాట్లాడారు. అయితే సమావేశంలో మంత్రి సురేఖ అంశంపై చర్చించలేదన్నారు.
భట్టి విక్రమార్కతో కొండా మురళి, రాజగోపాల్‌రెడ్డి సమావేశం
ప్రజాభవన్‌లో డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్కతో కొండా మురళి, కోమటిరెడ్డి రాజగోపాల్‌రెడ్డి సమావేశమయ్యారు. అదే సమయంలో ప్రజాభవన్‌కు వచ్చిన ఉత్తమ్‌కుమార్ రెడ్డి కూడా భేటీలో పాల్గొన్నారు. ఇటీవల పార్టీలో జరిగిన పరిణామాలపై వీరు చర్చిస్తున్నట్లు సమాచారం. తాజా పరిణామాల దృష్ట్యా కీలక నేతల చర్చలపై సర్వత్రా ఆసక్తి నెలకొంది.
నాగార్జునసాగర్ ఎడమ కాలువకు తాగునీటి కోసం నీటి విడుదల
నాగార్జునసాగర్ ఎడమ కాలువకు తాగునీటి కోసం నీటి విడుదల ప్రారంభమైంది. త్రిపురారం మండలం పెద్ద దేవులపల్లి రిజర్వాయర్‌కు అధికారులు నీరు విడుదల చేపట్టారు. దేవులపల్లి రిజర్వాయర్‌కు 4 రోజులపాటు నీటి విడుదల కొనసాగుతుంది.
భారీ సైబర్ మోసం నుంచి వృద్ధుడిని కాపాడిన సైబర్ సెక్యూరిటీ బ్యూరో
భారీ సైబర్ మోసం నుంచి వృద్ధుడిని సైబర్ సెక్యూరిటీ బ్యూరో కాపాడింది. రూ.82.20 లక్షల మేర జరుగుతున్న మోసాన్ని అధికారులు నిలువరించారు. డిజిటల్ అరెస్టు పేరుతో విశ్రాంత బ్యాంకు ఉద్యోగిని సైబర్ నేరగాళ్లు బెదిరించారు. ఆర్‌బీఐ వెరిఫికేషన్ పేరుతో వృద్ధుడి నుంచి రూ.85.20 లక్షలను తమ ఖాతాలకు బదిలీ చేయించుకున్నారు. మరింత డబ్బు కావాలని అడగటంతో బ్యాంకు అధికారులను సంప్రదించగా వారు సైబర్ సెల్‌ను అలర్ట్ చేసి ఖాతాను ఫ్రీజ్ చేశారు.
స్టైఫండ్ల కోసం 23వ రోజు ఆయుష్ విద్యార్థుల నిరసన
స్టైఫండ్ల కోసం సికింద్రాబాద్‌లో 23వ రోజు ఆయుష్ విద్యార్థులు నిరసనకు దిగారు. ఆయుష్ కమిషనర్ కార్యాలయం వద్ద వైద్య విద్యార్థులు బైఠాయించారు. నిరసన, దీక్షలు చేస్తున్న ప్రభుత్వం పట్టించుకోవట్లేదని, స్టైఫండ్లు పెంచి జీవో విడుదల చేయకపోతే ఆందోళనలు తీవ్రం చేస్తామని వారు హెచ్చరించారు.
గచ్చిబౌలి అంజయ్యనగర్‌లో కొనసాగుతున్న అక్రమ నిర్మాణాల కూల్చివేత
గచ్చిబౌలి అంజయ్యనగర్‌లో అక్రమ నిర్మాణాల కూల్చివేత కొనసాగుతున్నాయి. ఎనిమిది అక్రమ నిర్మాణాలలో నిన్నటి వరకు 3 భవనాలు కూల్చివేశారు. ఇవాళ నాలుగో భవనం కూల్చివేత పనులు జరుగుతున్నాయి. మిగిలిన అక్రమ కట్టడాలపైనా చర్యలు తీసుకోనున్నట్లు అధికారులు తెలిపారు.
హైటెక్ సిటీలో అక్టేవ్ జీసీసీ ప్రారంభించిన ఐటీ మంత్రి శ్రీధర్‌బాబు
హైటెక్ సిటీలో అక్టేవ్ జీసీసీని ఐటీ మంత్రి శ్రీధర్‌బాబు ప్రారంభించారు. ఐటీ రంగానికి ఈ ప్రభుత్వం ఎంతో ప్రాధాన్యత ఇచ్చిందని తెలిపారు. దేశంలో అత్యధిక జీసీసీలు హైదరాబాద్‌లో ఏర్పాటవుతున్నాయన్నారు. ఏడాది వ్యవధిలో 75 జీసీసీలు నగరంలో ఏర్పాటయ్యాయని తెలిపారు.
భూత్నాల్ సరస్సులో 6 మృతదేహాలు లభ్యం
కర్ణాటక విజయపురలోని భూత్నాల్ సరస్సులో 6 మృతదేహాలు కలకలం రేపాయి. మృతుల్లో నలుగురు మహిళలు, ఇద్దరు బాలురు ఉన్నారు. ఆరుగురి మృతిపై పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. సరస్సు చూసేందుకు వెళ్లి జారిపడి ఉంటారని అనుమానం వ్యక్తం చేస్తున్నారు.
భద్రాచలం ఆబ్కారీ సీఐ రహీమున్నీసాబేగం, కానిస్టేబుల్ రవిపై సస్పెన్షన్ వేటు
భద్రాచలం ఆబ్కారీ సీఐ రహీమున్నీసాబేగం, కానిస్టేబుల్ రవిపై సస్పెన్షన్ వేటు పడింది. గంజాయి కేసులో ఇద్దరు నిందితుల్లో ఒకరినే రిమాండ్‌కు పంపారని, మరో నిందితుడు తప్పించుకోవడాన్ని గోప్యంగా ఉంచారని, ఎఫ్‌ఐఆర్‌ను మార్చివేశారనే ఆరోపణలపై సీఐపై చర్యలు తీసుకున్నారు.
కాంగ్రెస్ ప్రభుత్వం భూములు కేంద్రంగా పాలన సాగిస్తోంది : హరీశ్‌రావు
గతంలో కేసీఆర్, ప్రజలు కేంద్రంగా పాలన సాగించారని మాజీమంత్రి హరీశ్‌రావు అన్నారు. కాంగ్రెస్ ప్రభుత్వం మాత్రం భూములు కేంద్రంగా పాలన సాగిస్తోందని విమర్శించారు. ప్రాజెక్టుల నిర్మాణంతో వరి దిగుబడిలో పంజాబ్‌ను అధిగమించి తెలంగాణ నంబర్‌వన్‌గా నిలిచిందన్నారు. కేసీఆర్ ప్రతి ఆలోచన పేదల సంక్షేమం కోణంలోనే చేశారని, ఈ ప్రభుత్వం మాత్రం ఎక్కడ భూములున్నా వెంటనే అమ్మేస్తున్నారన్నారు. రెండున్నరేళ్లలోనే రూ.30 వేల కోట్ల విలువైన భూములు అమ్మారన్నారు.
అగ్నిప్రమాదం- 15 మంది శిశువులు మృతి
పాకిస్థాన్ ఇస్లామాబాద్‌లో అగ్నిప్రమాదం చోటు చేసుకుంది. పాకిస్థాన్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ మెడికల్ సైన్సెస్‌లో జరిగిన ప్రమాదంలో 15 మంది శిశువులు మృతి చెందారు.
హుస్సేన్‌సాగర్‌లో దూకి సూడాన్ వాసి ఆత్మహత్యాయత్నం
హుస్సేన్‌సాగర్‌లో దూకి సూడాన్ వాసి ఆత్మహత్యాయత్నించారు. ఏడీ డ్రిల్ అనే వ్యక్తి సచివాలయం ముందు హుస్సేన్‌సాగర్‌లో దూకారు. గమనించిన పోలీసులు తాడు సహాయంతో విదేశీయుడిని రక్షించారు. ఆత్మహత్యాయత్నానికి కారణాలపై ఆరా తీస్తున్నారు.
పొలానికి దారి విషయంలో వివాదం వల్ల మనస్తాపం చెంది రైతు ఆత్మహత్య
మహబూబాబాద్ జిల్లా కురవి మండలం నేరడ గ్రామంలో విషాదం చోటుచేసుకుంది. పొలానికి దారి విషయంలో వివాదం వల్ల మనస్తాపం చెంది, మొగిలిచర్ల రామచంద్రు(64) అనే రైతుచెట్టుకు ఉరివేసుకొని రైతు ఆత్మహత్య చేసుకున్నారు.
కోదాడ రోడ్డు ప్రమాదంపై మంత్రి ఉత్తమ్ కుమార్‌రెడ్డి దిగ్భ్రాంతి
కోదాడ రోడ్డు ప్రమాదంపై మంత్రి ఉత్తమ్ కుమార్‌రెడ్డి దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. బస్సు ప్రమాదంలో బాధిత కుటుంబాలకు సానుభూతి తెలిపిన మంత్రి, క్షతగాత్రులకు మెరుగైన వైద్యం అందేలా చూడాలని అధికారులకు ఆదేశించారు.
కోదాడ వద్ద జరిగిన రోడ్డు ప్రమాదం - మృతులంతా ఆంధ్రప్రదేశ్‌కు చెందిన వారిగా గుర్తింపు
సూర్యాపేట జిల్లా కోదాడ సమీపంలో దొరకుంట వద్ద కంటైనర్‌ను ప్రైవేటు బస్సు వెనుకనుంచి ఢీకొట్టింది. ఈ వేకువ జామున జరిగిన ప్రమాదంలో ఆరుగురు మృతిచెందారు. అయితే మృతులంతా ఆంధ్రప్రదేశ్‌కు చెందిన వారిగా తెలుస్తోంది. యాసారపు చిన్ని(32), బొల్లిపొంగు మేరీ జోష్న(29)చెన్నకేశవుల నాగేంద్రబాబు(21) మరణించారు. మరో ముగ్గురి వివరాలు తెలియాల్సి ఉంది.
సూర్యాపేటలో రోడ్డు ప్రమాదంపై సీఎం రేవంత్‌రెడ్డి దిగ్భ్రాంతి
సూర్యాపేట జిల్లాలో జరిగిన రోడ్డు ప్రమాదంపై ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. మృతుల కుటుంబాలకు ప్రగాఢ సానుభూతి తెలిపారు. గాయపడిన వారికి మెరుగైన వైద్యం అందేలా చర్యలు తీసుకోవాలని సీఎస్‌ను ఆదేశించారు.
సూర్యాపేట జిల్లా కోదాడ సమీపంలో రోడ్డు ప్రమాదం - ఆరుగురు మృతి
సూర్యాపేట జిల్లా కోదాడ సమీపంలో ఘోర రోడ్డు ప్రమాదం సంభవించింది. ఈ ఘటనలో ఆరుగురు మృతి చెందగా, 20 మందికిపైగా గాయపడ్డారు. కోదాడ మండలం దొరకుంట వద్ద కంటైనర్‌ను ప్రైవేటు బస్సు వెనుక నుంచి ఢీకొట్టింది. బస్సు హైదరాబాద్ నుంచి ఏలూరు వెళ్తుండగా ఘటన చోటుచేసుకుంది. భద్రతా సిబ్బంది క్షతగాత్రులను ఆస్పత్రికి తరలిస్తున్నారు.
భారీ వర్షాల కారణంగా ఒడిశాలో కొనసాగుతున్న వరద ఉద్ధృతి
భారీ వర్షాల కారణంగా ఒడిశాలో వరద ఉద్ధృతి కొనసాగుతోంది. 6 జిల్లాల్లో దాదాపు లక్ష మందికిపై వరద ప్రభావం పడనుంది. భద్రక్, జాజ్‌పూర్, కేంద్రపడా, కేందుఝర్, నవరంగ్‌పూర్, కోరాపుట్ జిల్లాల్లో ప్రజలకు ఇబ్బందులు ఎదురవుతున్నాయి. భద్రతా సిబ్బంది ముంపు ప్రాంతాల ప్రజలను సురక్షిత ప్రాంతాలకు తరలిస్తున్నాయి.
క్యూర్ ఇందిరమ్మ ఇళ్లు కేటాయింపులకు డ్రా తేదీల్లో మార్పు
క్యూర్ పరిధిలోని ఇందిరమ్మ ఇళ్లు కేటాయింపులకు సంబంధించిన డ్రా తేదీల్లో మార్పు చోటుచేసుకుంది. ఎల్‌ఐజీ ఫ్లాట్ల కేటాయింపు కోసం ఈనెల 28 నుంచి 31 వరకు లాటరీ ప్రక్రియ ఉండనుంది. ఈనెల 28న కౌకూర్, పాటిగడ్డ, జల్‌పల్లి, కుల్సుంపురాలో, ఈనెల 29న జూబ్లీహిల్స్ ఎమ్మెల్యే కాలనీ, బోయన్‌పల్లి, బండ్లగూడ, నందిముసలిగుడలో ఇళ్లకు లాటరీ నిర్వహించనున్నారు. ఈనెల 30న గాజుల రామారం, అంబర్‌పేట సిటీపోలీస్ లైన్స్, గడ్డిఅన్నారం, పోచారంలో డ్రా తీయనున్నారు. అలాగే ఈనెల 31న రాయదుర్గం, కేపీహెచ్‌బీ కాలనీ, మైలార్‌దేవ్‌పల్లి, రెడ్ హిల్స్‌లో ఇళ్లకు లాటరీ నిర్వహించనున్నారు.

