ETV Bharat / state

07th July 2026 News Today AP Live News Updates : గల్లంతైన మత్స్యకారుల కుటుంబాలకు తక్షణ సాయంగా రూ.10 లక్షలు: అచ్చెన్నాయుడు

AP News Today Live Updates
AP News Today Live Updates (ETV Bharat)
author img

By ETV Bharat Andhra Pradesh Team

Published : July 7, 2026 at 7:13 AM IST

|

Updated : July 7, 2026 at 10:42 PM IST

Choose ETV Bharat

07-07-2026 AP News Today Live Updates : చిన్నారి జ్ఞానేశ్వరిని అప్పగించండి - చట్టపరంగా చర్యలు ఉండవు: డీఎస్పీ తిలక్‌

LIVE FEED

10:38 PM, 7 Jul 2026 (IST)

బాధిత కుటుంబాల ఆవేదన కలిచివేస్తోంది: మంత్రి అచ్చెన్నాయుడు

విశాఖ సముద్ర తీరంలో గల్లంతైన బాధిత కుటుంబాల ఆవేదన కలిచివేస్తోందని మంత్రి అచ్చెన్నాయుడు అన్నారు. గల్లంతైన మత్స్యకారులు క్షేమంగా ఒడ్డుకు తిరిగి రావాలని ప్రార్థిస్తున్నట్లు చెప్పారు. తక్షణ సాయంగా రూ.10 లక్షలు చొప్పున బాధిత కుటుంబాలకు నగదు అందించాలని విశాఖ కలెక్టర్‌ను మంత్రి అచ్చెన్నాయుడు ఆదేశించారు. గల్లంతైన మత్స్యకార కుటుంబాలకు అన్ని విధాలుగా అండగా ఉంటామని మంత్రి అచ్చెన్న స్పష్టం చేశారు.

8:48 PM, 7 Jul 2026 (IST)

తిరుమల: రిలయన్స్ ప్రతినిధులతో టీటీడీ అదనపు ఈవో వెంకయ్యచౌదరి భేటీ

రిలయన్స్ ప్రతినిధులతో టీటీడీ అదనపు ఈవో వెంకయ్యచౌదరి భేటీ అయ్యారు. రిలయన్స్ ఇస్తున్న 25 బస్సులకు సౌకర్యాల ఏర్పాటుపై సమావేశం నిర్వహించారు. ఛార్జింగ్ స్టేషన్లు, డ్రైవర్లు, విద్యుత్ సరఫరా, ఇతర అంశాలపై చర్చించారు. ఒకేసారి 20 బస్సులు ఛార్జింగ్ అయ్యేలా 10 పాయింట్లు ఉంచాలని వెంకయ్య చౌదరి సూచించారు.

7:39 PM, 7 Jul 2026 (IST)

ఆటో బోల్తాపడి 19 మంది కూలీలకు గాయాలు

ప.గో.: పాలకొల్లు మండలం వెలివెల వద్ద ఆటో బోల్తా పడింది. ఈ ప్రమాదంలో 19 మంది కూలీలకు గాయాలయ్యాయి. ముగ్గురికి తీవ్రగాయాలవ్వగా స్థానికులు వారందర్నీ ఆస్పత్రికి తరలించారు.

7:37 PM, 7 Jul 2026 (IST)

ఈ రాత్రిలోగా సీడ్ యాక్సిస్ రోడ్డుకు భూములివ్వని వారికి రేపు భూసేకరణ అమలు

ఈ రాత్రిలోగా సీడ్ యాక్సిస్ రోడ్డుకు భూములివ్వని వారికి రేపు భూసేకరణ అమలు అవుతుందని మంత్రి నారాయణ తెలిపారు. ఇప్పటికే ల్యాండ్ అక్విజిషన్ నోటిఫికేషన్ ఇచ్చిన 2.5 ఎకరాలకు సేకరణ అమలు చేశామన్నారు. సీడ్ యాక్సిస్ కోసం నోటిఫికేషన్లు ఇచ్చిన భూములకే అక్విజిషన్ అమలవుతుందిని వివరించారు.

7:36 PM, 7 Jul 2026 (IST)

రాష్ట్రానికి వీబీజీ రామ్‌జీ నుంచి తొలి విడతగా రూ.2,545 కోట్లు విడుదల

రాష్ట్రానికి వీబీజీ రామ్‌జీ నుంచి తొలి విడతగా రూ.2,545 కోట్లు విడుదలయ్యాయని కేంద్రమంత్రి పెమ్మసాని వెల్లడించారు. ఈ నిధులు గ్రామీణాభివృద్ధికి కేంద్రం ఇచ్చే మరో భారీ ఊతమని పెమ్మసాని అన్నారు.

7:33 PM, 7 Jul 2026 (IST)

గల్లంతైన మత్స్యకారుల కోసం ఈ అర్ధరాత్రి వరకు గాలింపు

విశాఖ: మత్స్యకార కుటుంబాల విజ్ఞప్తి మేరకు గల్లంతైన మత్స్యకారుల కోసం ఈ అర్ధరాత్రి వరకు గాలింపులు కొనసాగించేలా నిర్ణయం తీసుకున్నారు. గాలింపు ముగిశాక నేవీ, కోస్ట్‌గార్డ్‌ అధికారులు వివరాలు వెల్లడించనున్నారు. గల్లంతైన ఒక్కొక్కరి కుటుంబానికి రూ.5 లక్షల చొప్పున బీమా మంజూరు చేయనున్నారు.

7:32 PM, 7 Jul 2026 (IST)

సాయికృష్ణ కేసులో సీఐ నాగరాజు కస్టడీ నిబంధన సడలింపు పిటిషన్‌పై హైకోర్టు ఉత్తర్వులు

సాయికృష్ణ కేసులో నిందితుడిగా ఉన్న సీఐ నాగరాజును కృష్ణలంక పోలీసు స్టేషన్‌లో విచారణకు హైకోర్టు అనుమతి ఇచ్చింది. ఈనెల 9 నుంచి 16 వతేదీ వరకు విచారించేందుకు సిట్‌కు అనుమతిస్తూ ఉత్తర్వులు జారీ చేసింది. ఉదయం 10 నుంచి సాయంత్రం 5 గంటల వరకు విచారించవచ్చని సీన్ రీకన్ స్ట్రక్షన్ చేసుకోవచ్చని వెల్లడించింది. సీఐ నాగరాజును రాజమహేంద్రవరం కేంద్ర కారాగారం నుంచి విజయవాడ కు తరలించేటప్పుడు, పోలీస్‌స్టేషన్‌లో విచారించేటప్పుడు వీడియో తీయాలని ఉత్తర్వుల్లో హైకోర్టు స్పష్టం చేసింది.

7:30 PM, 7 Jul 2026 (IST)

శివాలయంలోని దీపంతో సిగరెట్ అంటించుకున్న యువకుడు

ఆదోనిలో రణమండల కొండపై శివాలయంలోని వీడియోపై ప్రభుత్వం సీరియస్ అయ్యింది. శివాలయంలోని దీపంతో ఈరన్ సిగరెట్ అంటించుకుంటూ వీడియో చిత్రీకరించాడు. ఇది కాస్తా వైరల్ అవుతుండగా పోలీసులు విచారణ చేపట్టారు. ఈ క్రమంలో 2022లో వీడియో చిత్రీకరించినట్లు పోలీసులు గుర్తించారు.

7:10 PM, 7 Jul 2026 (IST)

భీమవరం ఫ్లైఓవర్‌పై కారు బీభత్సం

ప.గో. జిల్లా: భీమవరం ఫ్లైఓవర్‌పై కారు బీభత్సం చేసింది. కారు 3 బైక్‌లను ఢీకొట్టడంతో, ముగ్గురుకి గాయాలయ్యాయి. గర్భిణికి తీవ్ర గాయాలడంతో పరిస్థితి విషమంగా ఉందని వైద్యులు తెలుపుతున్నారు.

7:08 PM, 7 Jul 2026 (IST)

సచివాలయంలో అగ్రిగోల్డ్ బాధితుల మంత్రివర్గ ఉపసంఘం భేటీ

సచివాలయంలో అగ్రిగోల్డ్ బాధితుల మంత్రివర్గ ఉపసంఘం భేటీ అయ్యింది. మంత్రులు అనిత, అనగాని, నాదెండ్ల మనోహర్ పాల్గొన్నారు. అగ్రిగోల్డ్ బాధితులకు 6 నెలల్లో పరిష్కారం చూపేలా ప్రభుత్వం చర్యలు తీసుకుంటుందని మంత్రి నాదెండ్ల మనోహర్ స్పష్టం చేశారు. బాధితుల కోసం త్వరలోనే ప్రత్యేక కోర్టు ఏర్పాటు చేస్తామన్నారు. ఆస్తుల వేలంతో ప్రత్యేక కోర్టు న్యాయం చేస్తుందన్నారు. ఆస్తుల వివరాలను వైఎస్సార్సీపీ ప్రభుత్వం ధ్వంసం చేసిందన్ అగ్రిగోల్డ్ ఏజెంట్లు రూ. 2వేల కోట్ల విలువైన బాండ్లు సీఐడీకి అందచేయాలని మంత్రి మనోహర్ అన్నారు.

7:04 PM, 7 Jul 2026 (IST)

సెర్ప్ ప్రధాన కార్యాల‌యంలో మంత్రి కొండపల్లి సమీక్ష

విజ‌య‌వాడ‌: సెర్ప్ ప్రధాన కార్యాల‌యంలో మంత్రి కొండపల్లి సమీక్ష నిర్వహించారు. ఆగ‌స్టు 1 నుంచి మార్కెట్‌లోకి 'స్వయం ఏపీ' బ్రాండ్‌ వస్తున్నట్లు తెలిపారు. 587 మహిళాసంఘాలు తయారుచేసే 65 ఉత్పత్తులకు సెర్ప్ గుర్తింపు దక్కిందన్నారు. గ్రామీణ మహిళల ఉత్పత్తులకు స్థిర‌మైన మార్కెట్‌ కల్పించేలా చర్యలు తీసుకోవాలన్నారు. కొత్తగా వచ్చిన వ్యాపార‌, పారిశ్రామిక యూనిట్ల ప‌నితీరుపై ప్రతినెలా త‌నిఖీ చేపట్టేలా చర్యలు తీసుకోవాలన్నారు. ఎస్‌హెచ్‌జీ మ‌హిళ‌లతో ఆధునిక యాంత్రిక‌, లాండ్రీ యూనిట్ల ఏర్పాటుకు ఆదేశాలు జారీ చేశారు.

ఎస్‌హెచ్‌జీ మహిళలకు పెళ్లి, ఇతర అవసరాలకు తక్కువ వడ్డీకి రుణం ఇచ్చేందుకు స్త్రీ నిధి 'కల్యాణలక్ష్మి' ప‌థ‌కం ప్రారంభించేందుకు చర్యలు, ఎస్‌హెచ్‌జీ సభ్యులకు పీఎం జీవన్‌జ్యోతి బీమా యోజన, పీఎం సురక్షా బీమా యోజన సౌక‌ర్యం కల్పించే అంశంపై చర్చిచారు. వెలుగు మార్ట్‌లు ప‌నితీరు నిరంత‌రం పర్యవేక్షించాలని నిర్ణయం తీసుకున్నారు. వెలుగు మార్ట్‌లు మూత‌ప‌డిన, ప‌నిచేయ‌ని చోట్ల బాధ్యులపై చర్యలకు ఆదేశించారు.

6:58 PM, 7 Jul 2026 (IST)

సీఆర్డీఏ సమావేశంలో కీలక నిర్ణయాలు తీసుకున్న ప్రభుత్వం

సీఆర్డీఏ సమావేశంలో ప్రభుత్వం కీలక నిర్ణయాలు తీసుకున్నారు. 2024 జూన్ నుంచి భూములిచ్చే వారికి కౌలు రూ.40 వేలు ఇచ్చేందుకు ఆమోదం తెలిపింది. భూములిచ్చినప్పటి నుంచి 10 ఏళ్ల పాటు అమలయ్యేలా చర్యలు చేపట్టారు. జరీబు భూమికి రూ.5 వేలు, మెట్ట భూమికి రూ.3 వేలు పెంచేందుకు ఆమోదించింది. గ్రామకంఠాల్లో భూమి కోల్పోతున్న వారికి రూ.10 వేలు ఇచ్చేందుకు పచ్చజెండా ఊపింది. కొత్తగా పూలింగ్ జరిగే గ్రామాల రైతుల కుటుంబాలకు రుణమాఫీకి నిర్ణయం తీసుకుంది.

ఈ ఏడాది జనవరి 6లోగా రుణం తీసుకున్న వారికి అమలు చేసేలా, ఇనాం భూముల కోసం దేవదాయశాఖకు రూ.159 కోట్లు చెల్లించేందుకు, అమరావతిలోని 25 టౌన్‌షిప్‌ల్లో ఒక ఇంటర్నేషనల్ స్కూల్ ఉండేలా చూడాలని సీఎం ఆదేశించారు. రాత్రిలోగా భూములివ్వని వారికి రేపు భూసేకరణ అమలు చేస్తామన్నారు. ఇప్పటికే ల్యాండ్ అక్విజిషన్ నోటిఫికేషన్ 2.5 ఎకరాలకు అమలు అయ్యిందని మంత్రి నారాయణ స్పష్టం చేశారు.

6:15 PM, 7 Jul 2026 (IST)

పాపను అప్పగించండి - చట్టపరంగా ఎలాంటి చర్యలు ఉండవు: డీఎస్పీ తిలక్‌

కాకినాడ: తుని మండలం సీహెచ్.అగ్రహారంలో డీఎస్పీ మీడియా సమావేశం ఏర్పాటు చేశారు. ఎవరైనా పాపను తీసుకెళ్తే పోలీసులకు అప్పగించాలని సూచించారు. నిందితులపై చట్టపరంగా ఎలాంటి చర్యలు ఉండవని, పాప ఆచూకీపై సమాచారం ఇస్తే చాలుని, తామే వెళ్లి తీసుకొస్తామని డీఎస్పీ వివరించారు. చిన్నారిని తల్లిదండ్రుల వద్దకు క్షేమంగా చేర్చడమే తమ లక్ష్యమని డీఎస్పీ తెలిపారు. చిన్నారి అదృశ్యమైన రోజు నుంచి అన్ని కోణాల్లో దర్యాప్తు చేస్తున్నామన్నారు. రాజకీయ విమర్శలకు సమాధానం చెప్పం, మా పని మేం చేస్తున్నామని ఆయన అన్నారు. సామాజిక మాధ్యమాల్లో వచ్చే వదంతులు నమ్మవద్దని డీఎస్పీ తిలక్‌ సూచించారు.

6:13 PM, 7 Jul 2026 (IST)

రేప‌ట్నుంచి దివ్యాంగులకు స‌ద‌రం స్లాట్ బుకింగ్‌

రేప‌ట్నుంచి దివ్యాంగులకు స‌ద‌రం స్లాట్ బుకింగ్‌ ప్రారంభమవనుంది. దివ్యాంగుల డేటాకు బ్లాక్ చెయిన్ టెక్నాలజీ ద్వారా ప్రభుత్వం భద్రత కల్పించనుంది. తొలి వైకల్య నిర్ధారణ పరీక్ష ఫలితంపై అప్పీళ్లకు రెండుసార్లే అవకాశం కల్పిస్తుంది. త్వరలో 104 హెల్ప్‌డెస్క్‌ ద్వారా సాంకేతిక సమస్యలు, ఇతర అంశాలపై స్పష్టత రానుంది. పారదర్శకంగా సదరం ధ్రువపత్రాలు జారీ చేస్తామని ఆరోగ్యశాఖ డైరెక్టర్ తెలిపారు. అన్ని సేవలు ఉచితమని దళారులను నమ్మవద్దని ఆరోగ్యశాఖ డైరెక్టర్ స్పష్టం చేశారు.

6:10 PM, 7 Jul 2026 (IST)

151 ఆనకట్టల భద్రత మదింపు చేసేందుకు ప్యానెల్ ఏర్పాటు చేసిన ప్రభుత్వం

ఆనకట్ట భద్రతా చట్టం-2021 మేరకు స్వతంత్ర నిపుణుల ప్యానెల్ ఏర్పాటుకు ప్రభుత్వం నిర్ణయించింది. 151 ఆనకట్టల భద్రత మదింపు చేసేందుకు ప్యానెల్ ఏర్పాటు చేసింది. దీనికోసం రూ.27.5 కోట్ల నిధులు కేటాయించింది. రాష్ట్రంలోని అన్ని ఆనకట్టలనూ తనిఖీ చేయాలని నిర్ణయించింది. కమిటీ ఛైర్మన్లుగా జలవనరుల నిపుణులు అక్షయ్‌కుమార్ దాస్, పి.రామచంద్రరావు, ఎం.కె.శ్రీనివాస్, ఎ.కె.గంజు, ఎ.కె.బజాజ్, అల్వాల్ పరమేశం, జె.చంద్రశేఖర్ అయ్యర్, ఎస్.కె.శ్రీవాస్తవను నియమించింది.

5:44 PM, 7 Jul 2026 (IST)

మత్స్యకారులు గల్లంతైన ఘటనలో ముగిసిన సెర్చ్‌ ఆపరేషన్‌

సముద్రంలో చేపలవేటకు వెళ్లి ఆరుగురు మత్స్యకారులు గల్లంతైన ఘటనలో సెర్చ్‌ ఆపరేషన్‌ ముగిసింది. దాదాపు 72 గంటలపాలు నేవీ, కోస్ట్‌గార్డ్‌, స్థానిక పోలీసులు గాలించినప్పటికీ ప్రయోజనం లేకపోయింది. ఇప్పటి వరకు మత్స్యకారుల ఆచూకీ లభ్యం కాలేదు. తమవాళ్ల ఆచూకీ కనిపెట్టాలని బాధిత కుటుంబాలు కోరుతున్నాయి. మరోవైపు బాధితులకు కాసేపట్లో ఆర్థిక సాయం ప్రకటించే అవకాశం ఉంది. విశాఖ చేపల రేవు నుంచి వేటకు వెళ్లిన మత్స్యకారులు వేట ముగించుకొని శనివారం తిరిగొస్తుండగా బోటు తిరగబడటంతో ఈ ప్రమాదం జరిగింది. ఆ సమయంలో అందులో ఏడుగురు మత్స్యకారులు ఉండగా ఒకరు సురక్షితంగా బయటపడ్డారు. మిగిలిన ఆరుగురి ఆచూకీ లభ్యం కాలేదు.

5:31 PM, 7 Jul 2026 (IST)

సీఎం అధ్యక్షతన 63వ సీఆర్‌డీఏ సమావేశం- రెండో దశ పూలింగ్‌లో భూములు ఇచ్చిన రైతుల గురించి చర్చ

సచివాలయం: సీఎం చంద్రబాబు అధ్యక్షతన 63వ సీఆర్‌డీఏ సమావేశం జరిగింది. ఈ కార్యక్రమంలో మంత్రి నారాయణ, సీఎస్ సాయిప్రసాద్, వివిధ శాఖల ఉన్నతాధికారులు పాల్గొన్నారు. రెండో దశ పూలింగ్‌లో భూములు ఇచ్చిన రైతుల గురించి చర్చించారు. రైతులకు యాన్యుటీ, వ్యవసాయ రుణమాఫీ, ల్యాండ్ బ్యాంక్ ఏర్పాటు, మంత్రుల కమిటీ సిఫారసు మేరకు వివిధ సంస్థలకు భూ కేటాయింపుపై చర్చలు జరిపారు.

5:30 PM, 7 Jul 2026 (IST)

ఆస్తి తగాదాలు - వ్యక్తిని చంపిన బంధువులు

ఏలూరు: జంగారెడ్డిగూడెం మండలం పేరంపేటలో దారుణం జరిగింది. ఆస్తి తగాదాలతో కారుమూరి దుర్గారెడ్డి అనే వ్యక్తిపై బంధువులు కత్తులతో దాడి చేసి చంపారు. బాధ్యులను అరెస్టు చేసే వరకు మృతదేహాన్ని తరలించేది లేదని కుటుంబసభ్యులు ఆందోళన చేపట్టారు.

5:25 PM, 7 Jul 2026 (IST)

ఈ వారంలో ధవళేశ్వరం గేట్ల పునర్నిర్మాణ పనులను సీఎం ప్రారంభిస్తారు: మంత్రి నిమ్మల

మంత్రి నిమ్మల రామానాయుడు ధవళేశ్వరం బ్యారేజ్ గేట్లు పరిశీలించారు. ఈ బ్యారేజ్​ గోదావరి డెల్టా వ్యవస్ధకు గుండెకాయ అని మంత్రి నిమ్మల పేర్కొన్నారు. 10 లక్షల ఎకరాలకు సాగునీరిచ్చే బ్యారేజ్‌కు జగన్‌ రూపాయి ఇవ్వలేదని ధ్వజమెత్తారు. 2014లో టీడీపీ ప్రభుత్వం 58 కొత్త గేట్లు ఏర్పాటు చేసిందని గుర్తుచేశారు. మిగతా 117 గేట్లు మార్చేందుకు సీఎం ఇప్పుడు రూ.150 కోట్లు మంజూరు చేశారన్నారు.

ఈ వారంలో ధవళేశ్వరం గేట్ల పునర్నిర్మాణ పనులను సీఎం ప్రారంభిస్తారని నిమ్మల స్పష్టం చేశారు. బ్యారేజ్ ప్రమాదంలో ఉందని చెప్పినా గత ప్రభుత్వం పట్టించుకోలేదని గోదావరి డెల్టాను సమగ్ర ప్రక్షాళన చేయిస్తున్నట్లు వివరించారు. డీపీఆర్ తయారీకి రూ.13.4 కోట్లు కేటాయించి లైడార్ సర్వే పూర్తి చేశామన్నారు. డీపీఆర్ సిద్ధం కాగానే డెల్టా ఆధునికీకరణ పనులు చేపడతామన్నారు.

5:22 PM, 7 Jul 2026 (IST)

ఏపీని పెట్టుబడుల గమ్యస్థానంగా మార్చిన ఏకైక నాయకుడు చంద్రబాబు: ప్రత్తిపాటి

అనపర్తి నియోజకవర్గ టీడీపీ విస్తృతస్థాయి సమావేశంలో ఎమ్మెల్యే ప్రత్తిపాటి పుల్ల రావు పాల్గొన్నారు. అనపర్తి టీడీపీ ఇన్‌ఛార్జ్ ఎంపికపై శ్రేణుల అభిప్రాయాలు సేకరించారు. ఇన్‌ఛార్జ్ ఎంపికకు నిమ్మల, వెంకటరమణ చౌదరి, ప్రత్తిపాటితో త్రీమెన్ కమిటీ వేశారు. ఏ రాష్ట్రంలో లేని సంక్షేమ పథకాలు ఏపీలో అమలవుతున్నాయని ప్రత్తిపాటి అన్నారు. ఏపీని పెట్టుబడుల గమ్యస్థానంగా మార్చిన ఏకైక నాయకుడు చంద్రబాబు అని ఆయన కొనియాడారు. సామాజిక పింఛన్ల పంపిణీలో దేశంలో ఏపీదే అగ్రస్థానమని వివరించారు. సంక్షేమ పథకాలతో పేద, మధ్యతరగతి వర్గాలకు అండగా నిలుస్తున్నామన్నారు. వైఎస్సార్సీపీ కుట్రలను తిప్పికొట్టేవారికి సముచిత స్థానం, గౌరవం లభిస్తాయని ప్రత్తిపాటి పేర్కొన్నారు.

3:20 PM, 7 Jul 2026 (IST)

ఆవిష్కరణల కేంద్రం మాగోక్ సైన్స్ పార్కును సందర్శించిన లోకేశ్‌

సియోల్‌: మంత్రి లోకేశ్‌ ఆవిష్కరణల కేంద్రం మాగోక్ సైన్స్ పార్కును సందర్శించారు. భవిష్యత్తు సాంకేతికతకు మాగోక్ సైన్స్ పార్కు అద్దం పడుతోందని ప్రశంసలు కురిపించాడు. ఎల్జీ ఆర్ట్ సెంటర్, ఎల్జీ డిస్కవరీ ల్యాబ్ ప్రదర్శనలు అద్భుతమని కొనియాడారు. టెక్నాలజీని ఒకేచోట చూడటం సరికొత్త అనుభూతి కలిగించిందన్నారు. ఓఎల్‌ఈడీ, రోబోటిక్స్, బ్యాటరీలు, మెటీరియల్స్ సాంకేతికతను ప్రశంసించారు. బయోటెక్, ఫ్యూచర్‌టెక్ గ్యాలరీ సాంకేతికతకు అద్దం పట్టిందన్నారు.

3:18 PM, 7 Jul 2026 (IST)

కుమారుడిని బ్యాట్‌తో కొట్టి చంపిన తండ్రి

మార్కాపురం: అర్ధవీడు మండలం మిట్టమీదిపల్లిలో దారుణం చోటుచేసుకుంది. కుమారుడ్ని బ్యాట్‌తో కొట్టి చంపిన తండ్రి ఆ బాధతో ఉరి వేసుకుని ఆత్మహత్య చేసుకున్నాడు.

3:18 PM, 7 Jul 2026 (IST)

న్యూయార్క్‌లో రోడ్డు ప్రమాదం - ఎన్టీఆర్‌ జిల్లాకు చెందిన యువతి మృతి

అమెరికాలోని న్యూయార్క్‌లో రోడ్డు ప్రమాదంలో ఎన్టీఆర్‌ జిల్లాకు చెందిన అట్లూరి ప్రసన్న మృతి చెందారు.

3:15 PM, 7 Jul 2026 (IST)

టెకీ రాధాగాయత్రి మృతి కేసులో కీలక పరిణామం

విశాఖ: టెకీ రాధాగాయత్రి మృతి కేసులో కీలక పరిణామం చోటుచేసుకుంది. మెజిస్ట్రేట్ దర్యాప్తు చేయాలని దెహ్రాదూన్ జిల్లా కలెక్టర్‌ ఆదేశించారు. ముస్సోరి డివిజనల్ మెజిస్ట్రేట్ రాహుల్ ఆనంద్​ కేసు విచారణ ప్రారంభించారు. జూన్‌ 14-16 మధ్య ఏం జరిగిందో తెలుసుకోవడానికి అధికారులు విచారణ చేయనున్నారు. తల్లిదండ్రులు రాకుండానే శవపరీక్ష చేసిన సిబ్బందిని ప్రశ్నించే అవకాశం ఉంది.

2:55 PM, 7 Jul 2026 (IST)

కొండపర్వ వద్ద రోడ్డు ప్రమాదం - ద్విచక్రవాహనంపై ప్రయాణిస్తున్న దంపతులను ఢీకొట్టిన లారీ

ఎన్టీఆర్ జిల్లా విస్సన్నపేట మండలం కొండపర్వ వద్ద రోడ్డు ప్రమాదం చోటుచేసుకుంది. ద్విచక్రవాహనంపై ప్రయాణిస్తున్న దంపతులను లారీ ఢీకొట్టింది. ఈ ఘటనలో చర్లపల్లి శృతి(28) మృతి చెందగా, భర్తకు తీవ్రగాయాలయ్యాయి.

2:53 PM, 7 Jul 2026 (IST)

సచివాలయంలో సీఎం చంద్రబాబు అధ్యక్షతన రాష్ట్రస్థాయి పెట్టుబడుల ప్రోత్సాహక బోర్డు సమావేశం

సచివాలయంలో సీఎం చంద్రబాబు అధ్యక్షతన రాష్ట్రస్థాయి పెట్టుబడుల ప్రోత్సాహక బోర్డు సమావేశమైంది. పరిశ్రమలు, పెట్టుబడులు మౌలిక సదుపాయాల కల్పన శాఖల ప్రాజెక్టులపై చర్చిస్తున్నారు. రూ.9,076 కోట్ల పెట్టుబడులకు సంబంధించి 11 ప్రాజెక్టులపై చర్చలు జరుపుతున్నారు.

2:51 PM, 7 Jul 2026 (IST)

సాంప్రదాయ హస్తకళా వారసత్వానికి ఆంధ్రప్రదేశ్‌ పుట్టినిల్లు: పవన్‌

'ఒక జాతి గొప్పతనం నిర్మించిన భవనాల్లో కాదు, కళాకారుల్లో కనిపిస్తుంది. కళాకారుల అద్భుత ప్రతిభ వారి కష్టాన్ని గుర్తించడానికి వచ్చా. సాంప్రదాయ హస్తకళా వారసత్వానికి ఆంధ్రప్రదేశ్‌ పుట్టినిల్లు. అద్భుత కళల వెనుక లక్షలమంది కళాకారుల కృషి ఉంది. వస్తువుల తయారీ మాత్రమే కాదు, వారసత్వాన్ని సజీవంగా ఉంచుతున్నారు.తరతరాల సంప్రదాయాన్ని కళాకారులు కాపాడుతున్నారని' పవన్‌ కల్యాణ్‌ పేర్కొన్నారు.

2:49 PM, 7 Jul 2026 (IST)

ప్రాజెక్టుల భద్రతను గత వైఎస్సార్సీపీ ప్రభుత్వం గాలికొదిలేసింది: మంత్రి నిమ్మల

తూర్పు గోదావల్లి జిల్లాలో మంత్రి నిమ్మల రామానాయుడు పర్యటించారు. ధవళేశ్వరంలోని కాటన్ బ్యారేజ్‌ వద్ద దెబ్బతిన్న గేట్లను పరిశీలించారు. కొత్త గేట్ల ఏర్పాటు పనుల ప్రారంభంపై అధికారులతో చర్చించారు. 'ప్రాజెక్టుల భద్రతను గత వైఎస్సార్సీపీ ప్రభుత్వం గాలికొదిలేసింది. ప్రాజెక్టు గేట్లు కొట్టుకుపోయినా గొడ్డలి పార్టీ ప్రభుత్వం పట్టించుకోలేదు. కూటమి ప్రభుత్వం వచ్చాక శ్రీశైలం ప్రాజెక్టు మరమ్మతులు చేస్తోందని' నిమ్మల రామానాయుడు వివరించారు.

2:46 PM, 7 Jul 2026 (IST)

మావిగన్‌పై జగన్ చెప్పేది ఎవరూ నమ్మే పరిస్థితిలో లేరు : మంత్రి పార్థసారథి

'మావిగన్‌పై జగన్ చెప్పేది ఎవరూ నమ్మే పరిస్థితిలో లేరు. అమరావతిలో కుట్రలకు తెరలేపాలని జగన్‌ చూస్తున్నారు. గంజాయ్ బ్యాచ్, రౌడీలతో కలిసి లేని అసమ్మతిని రెచ్చగొట్టే కుట్ర. రాష్ట్రం ఏమైనా పర్వాలేదన్నట్లు గొడ్డలి పార్టీ అధినేత ఆలోచనలు. రౌడీయిజం చేసి అధికారం సంపాదించాలనుకుంటే గుణపాఠం తప్పదు. రాజ్యాంగాన్ని కాపాడేందుకు ప్రభుత్వం కఠిన చర్యలకైనా వెనుకాడదు. ప్రజాస్వామ్యం గురించి ప్రకాశ్​రాజ్​తో చెప్పించుకునే పరిస్థితుల్లో లేము. కించపరిచినా, వ్యక్తిత్వ హననానికి పాల్పడినా చట్టం తన పని తాను చేసుకుపోతుందని' మంత్రి పార్థసారథి వ్యాఖ్యానించారు.

2:42 PM, 7 Jul 2026 (IST)

రాష్ట్రానికి నష్టం చేస్తే ప్రజలకు కూడా అన్యాయం చేసినట్లు కాదా? : మంత్రి మండిపల్లి

'వైఎస్సార్సీపీ ఐదేళ్ల పాలన వల్ల రాష్ట్రం 15 ఏళ్లు వెనక్కి పోయింది. ఇప్పుడిప్పుడే రాష్ట్రాన్ని అభివృద్ధి పథంలోకి చంద్రబాబు తీసుకెళ్తున్నారు. తప్పుడు ప్రచారాలు చేసి ఏం సాధించాలని అనుకుంటున్నారో వాళ్లకే తెలియాలి. నమ్మిన ప్రజలకు న్యాయం చేయాల్సిన అవసరం ఉంది. రాష్ట్రానికి నష్టం చేస్తే ప్రజలకు కూడా అన్యాయం చేసినట్లు కాదా? ఐదేళ్లు సీఎంగా ఉండి కేవలం శిలాఫలకాలకే జగన్‌ పరిమితమయ్యారు. అన్ని నియోజకవర్గాలను అభివృద్ధి చేయడమే కూటమి ప్రభుత్వ లక్ష్యం. కూటమి ప్రభుత్వ పాలనలో రాష్ట్రంలో పెట్టుబడుల వరద కొనసాగుతోందని' మంత్రి మండిపల్లి రాంప్రసాద్​రెడ్డి పేర్కొన్నారు.

2:35 PM, 7 Jul 2026 (IST)

కూటమి ఎజెండా, అందరి సహకారంతో ఎయిర్‌పోర్టు నిర్మించుకున్నాం: రామ్మోహన్‌

భోగాపురం విమానాశ్రయం నిర్మాణ పనులను కేంద్రమంత్రి రామ్మోహన్‌ పరిశీలించారు. టెర్మినల్, ఏటీసీ, రన్ వే, ఎయిర్‌పోర్ట్‌ గ్రీనరీ పనులను పరిశీలించారు. కేంద్రమంత్రి రామ్మోహన్‌కు నిర్మాణ వివరాలను అధికారులు వివరించారు. 'వందశాతం మేర పనులు పూర్తయ్యాయి. ఆపరేషన్స్‌కు సిద్ధంగా ఉన్నట్లు జీఎంఆర్ నిర్మాణ సంస్థ తెలిపింది. ఇవాళ భోగాపురం ఎయిర్‌పోర్టుపై సమీక్షించాం. ఇంత అద్భుత భవనం వస్తుందని అనుకోలేదు. కూటమి ఎజెండా, అందరి సహకారంతో ఎయిర్‌పోర్టు నిర్మించుకున్నాం. సీఎం ఆదేశాలతో రెండేళ్లలో పూర్తి చేశాం. ఇవాళే ఎయిర్‌పోర్టుకు లైసెన్స్‌ ఇచ్చారు. ప్రధాని తేదీ ఖరారు చేయగానే ఎయిర్‌పోర్టు ప్రారంభిస్తాం. రానున్న రోజుల్లో ట్రాఫిక్ దృష్ట్యా అన్ని ఏర్పాట్లు చేస్తాం. చేప ఆకారంలో ఈ టెర్మినల్ నిర్మించాం. ఎయిర్‌పోర్టు నిర్మాణానికి రైతులు పూర్తి సహకారం అందించారు. స్థానిక ప్రజల సహకారంతో రెండేళ్లలో ఎయిర్‌పోర్టు పూర్తిచేశాం. విశాఖ ప్రజలు భోగాపురం ఎయిర్‌పోర్టుకు వచ్చేందుకు రోడ్డు నిర్మిస్తున్నాం. ఆర్కే బీచ్‌ నుంచి కారిడార్‌ ఏర్పాటు చేస్తున్నామని' కేంద్రమంత్రి రామ్మోహన్‌ నాయుడు పేర్కొన్నారు.

2:33 PM, 7 Jul 2026 (IST)

ఆస్పరి పీఎస్‌ ఎదుట పురుగుల మందు తాగి ఉద్యోగి ఆత్మహత్యాయత్నం

కర్నూలు ఆస్పరి పీఎస్‌ ఎదుట పురుగుల మందు తాగి సహకార సంఘం ఉద్యోగి హనుమంత్‌రెడ్డి ఆత్మహత్యాయత్నానికి పాల్పడ్డాడు. హనుమంత్‌రెడ్డి ఫోర్జరీ చేసి రూ.3 లక్షలు వాడుకున్నట్లు పోలీసులకు సొసైటీ అధికారులు ఫిర్యాదు చేశారు. హనుమంత్‌రెడ్డిని ఇవాళ విచారణకు పిలవడంతో ఆత్మహత్యాయత్నం చేశాడు. దీంతో వెంటనే ఆయణ్ని ప్రభుత్వ ఆసుపత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు.

2:29 PM, 7 Jul 2026 (IST)

ఇంద్రకీలాద్రిపై ఆషాఢ మాస మహోత్సవాల నిర్వహణపై అధికారుల సమీక్ష

ఇంద్రకీలాద్రిపై ఆషాఢ మాస మహోత్సవాల నిర్వహణపై అధికారుల సమీక్ష నిర్వహించారు. ఈ సమీక్షలో ఆలయ పాలకమండలి ఛైర్మన్ బొర్రా రాధాకృష్ణ ఈవో సేనానాయక్, వైదిక కమిటీ సభ్యులు పాల్గొన్నారు. ఈనెల 15 నుంచి ఆగస్టు 12 వరకు ఆషాఢ మాస మహోత్సవాలు నిర్వహించనున్నారు. ఈనెల 15 నుంచి ఆగస్టు 24 వరకు వారాహీ దేవి నవరాత్రులు జరగనున్నాయి. రోజూ అమ్మవారికి 'పంచవారాహి మంత్రాలతో' విశేష పూజలు, హోమాలు నిర్వహించనున్నారు. ఈనెల 27 నుంచి మూడ్రోజుల పాటు శాకాంబరీ దేవి మహోత్సవాలు జరగనున్నాయి. అమ్మవారి ఆషాఢ సారె సమర్పణకు అధికారులు ప్రత్యేక ఏర్పాట్లు చేస్తున్నారు. రాజగోపురం నుంచి మెట్లమార్గం ద్వారా మహా మండపం చేరుకునేలా ఏర్పాట్లు చేస్తున్నారు. మండపం వద్ద ఏర్పాటు చేసిన ప్రత్యేక వేదికపై అమ్మవారికి సారె సమర్పించనున్నారు. ఈనెల 15న ఆలయ అధికారులు తొలి సారె సమర్పించనున్నారు. ఆగస్టు 12న ఉత్సవాల ముగింపు రోజున అర్చకులు సారెను సమర్పించనున్నారు.

2:22 PM, 7 Jul 2026 (IST)

ప్రొద్దుటూరులో 24 క్యారెట్ల 10 గ్రా. బంగారం ధర రూ. 1,42,200

ప్రొద్దుటూరులో 24 క్యారెట్ల 10 గ్రా. బంగారం ధర రూ. 1,42,200, 22 క్యారెట్ల 10 గ్రా. బంగారం ధర రూ. 1,30,820గా ఉంది. కిలో వెండి ధర రూ.2,33,000గా ఉంది.

2:19 PM, 7 Jul 2026 (IST)

హై రిజెక్షన్ ఉన్న ఆక్షన్ ప్లాట్‌ఫార్మ్‌లపై ప్రత్యేక దృష్టి పెట్టాలి: మంత్రి అచ్చెన్న

సచివాలయంలో వర్జీనియా పొగాకు కొనుగోళ్లపై మంత్రి అచ్చెన్నాయుడు సమీక్ష నిర్వహించారు. ఈనెల 9న ఏపీకి టొబాకో బోర్డు సెంట్రల్ జాయింట్ సెక్రటరీ రానున్నారు. రైతులు, కంపెనీల ప్రతినిధులతో సమావేశాలు నిర్వహించాలని అధికారులను అచ్చెన్నాయుడు ఆదేశించారు. హై రిజెక్షన్ ఉన్న ఆక్షన్ ప్లాట్‌ఫార్మ్‌లపై ప్రత్యేక దృష్టి పెట్టాలన్నారు. ఆక్షన్ సెంటర్లను సందర్శించాలని సహచర మంత్రులకు విజ్ఞప్తి చేశారు. కంపెనీల సిండికేట్‌పై క్షేత్రస్థాయిలో విచారణ చేయాలని విజ్ఞప్తి చేశారు. ఆక్షన్‌లో పాల్గొనని కంపెనీలపై చర్యలు తీసుకోవాలని టొబాకో బోర్డును ఆదేశించారు. పొగాకు రైతులకు న్యాయమైన ధరలు అందేలా చర్యలు తీసుకోవాలని చెప్పారు.

2:19 PM, 7 Jul 2026 (IST)

రాష్ట్రంలో నైరుతి రుతుపవనాలు, ఎల్‌నినో ప్రభావంపై హోంమంత్రి సమీక్ష

రాష్ట్రంలో నైరుతి రుతుపవనాలు, ఎల్‌నినో ప్రభావంపై హోంమంత్రి అనిత సమీక్ష నిర్వహించారు. తాడేపల్లిలోని రాష్ట్ర విపత్తు నిర్వహణ సంస్థ ప్రధాన కార్యాలయంలో అధికారులతో ఆమె సమీక్షించారు.

12:18 PM, 7 Jul 2026 (IST)

రాష్ట్రంలో సర్ ప్రక్రియ సజావుగా సాగుతోంది: రాష్ట్ర ఎన్నికల ప్రధాన అధికారి వివేక్‌ యాదవ్

చిలకలూరిపేటలో రాష్ట్ర ఎన్నికల ప్రధాన అధికారి వివేక్‌ యాదవ్ పర్యటించారు. చిలకలూరిపేట కృష్ణనగర్ 141 పోలింగ్ కేంద్రం వద్ద సర్‌ ప్రక్రియ పరిశీలన చేపట్టారు. ఓటరు నమోదు అధికారి లీలా రాణితో మాట్లాడి వివరాలు తెలుసుకున్నారు. రాష్ట్రంలో సర్ ప్రక్రియ సజావుగా సాగుతోందని ఆయన తెలిపారు. బీఎల్వో నుంచి కలెక్టర్ వరకు 'సర్'పై బాధ్యతగా పనిచేస్తున్నారన్నారు. పూర్తిచేసిన 62 శాతం పత్రాలను డిజిటలైజ్‌ జరిగిందని వివరించారు. అర్హులైన వారందరికీ ఓటు హక్కు కల్పిస్తామన్నారు. అందుబాటులో లేకపోతే బంధువులు పత్రాలను అందజేయవచ్చని 'సర్' విజయవంతానికి రాజకీయ పార్టీలన్నీ సహకరించాలని వివేక్‌ యాదవ్ కోరారు.

12:17 PM, 7 Jul 2026 (IST)

శ్రీకాకుళం జిల్లా గూనపాలెం, హడ్కో కాలనీ పార్కులకు కేంద్రమంత్రి రామ్మోహన్‌ శంకుస్థాపన

శ్రీకాకుళం జిల్లా గూనపాలెం, హడ్కో కాలనీ పార్కులకు కేంద్రమంత్రి రామ్మోహన్‌ శంకుస్థాపన చేశారు. ఎయిర్‌పోర్ట్ అథారిటీ నుంచి రూ.2 కోట్ల సీఎస్ఆర్ నిధులతో పార్కులు నిర్మించారు. 3 నెలల్లో పార్కులు పూర్తిచేయాలని కేంద్రమంత్రి రామ్మోహన్ ఆదేశించారు. పార్కుల అభివృద్ధి సంకల్పంతో కూటమి ప్రభుత్వం కృషిచేస్తోందని మంత్రి రామ్మోహన్‌ వివరించారు.

12:14 PM, 7 Jul 2026 (IST)

14 గంటలు స్విమ్‌ చేసి వాణిజ్య నౌకను అందుకున్న చిన్నా

విశాఖ: బోటు ప్రమాదం నుంచి బయటపడిన చిన్నాకు ఐసీయూలో చికిత్స అందిస్తున్నట్లు సూపరింటెండెంట్ ఈశ్వర్‌ప్రసాద్ తెలిపారు. 14 గంటలు స్విమ్‌ చేసి వాణిజ్య నౌకను చిన్నా అందుకున్నాడు. అరగంట ఆలస్యమై ఉంటే చిన్నా ప్రాణాలు పోయేవని, ఎక్కువసేపు స్విమ్‌ వల్ల శరీరం పూర్తిగా అలిసిపోయింది కిమ్స్‌ ఐకాన్‌ సూపరింటెండెంట్ వివరించారు. చిన్నాకు వైద్యం కొనసాగుతోందని 24 గంటల అనంతరం డిశ్చార్జ్ చేస్తామని ఆయన పేర్కొన్నారు.

12:13 PM, 7 Jul 2026 (IST)

విజయవాడ అంబేడ్కర్ కళా వేదికలో ఏపీ హస్తకళా మహోత్సవం

విజయవాడ అంబేడ్కర్ కళా వేదికలో ఏపీ హస్తకళా మహోత్సవం నిర్వహిస్తున్నారు. హస్తకళా మహోత్సవానికి డిప్యూటీ సీఎం పవన్, మంత్రి సవిత హాజరయ్యారు. హస్తకళాకారులతో మాటామంతి కార్యక్రమంలో పవన్‌కల్యాణ్‌ పాల్గొన్నారు.

12:07 PM, 7 Jul 2026 (IST)

హిందూ మఠాధిపతులు, పూజారులను జోసెఫ్‌ తిడితే జగన్‌ ఎందుకు వెనకేసుకొస్తున్నారు: ఎమ్మెల్యే కోటంరెడ్డి

హిందూ మఠాధిపతులు, పూజారులను జోసెఫ్‌ తిడితే జగన్‌ ఎందుకు వెనకేసుకొస్తున్నారు? దేశభక్తి లేదని జోసెఫ్‌ ప్రత్యేకంగా చెబుతుంటే ఆయన్ను జగన్‌ సమర్థిస్తారా? అని ఎమ్మెల్యే కోటంరెడ్డి శ్రీధర్‌రెడ్డి వివరించారు. కేసుల విషయం న్యాయస్థానాలు చూసుకుంటాయని, కేసులో బలం ఉంది కాబట్టే జోసెఫ్‌ను రిమాండ్‌కు పంపారని వెల్లడించారు. హిందూ దేవుళ్లను దూషిస్తున్న జోసెఫ్‌ను జగన్‌ ఎందుకు సమర్థిస్తున్నారో చెప్పాలని ప్రశ్నించారు. ఇవాళ హిందూ దేవుళ్లను విమర్శిస్తున్నారు, రేపు ఏ మతాన్నైనా విమర్శించే అవకాశం ఉందని, హిందూ మతవిశ్వాసాలపై దాడి చేసిన వ్యక్తులు రేపు ఎవరిపైనైనా దాడి చేస్తారని మండిపడ్డారు.

11:18 AM, 7 Jul 2026 (IST)

మత్స్యకారుల గల్లంతు ఘటనపై విశాఖ వన్‌టౌన్‌ పీఎస్‌లో కేసు నమోదు

మత్స్యకారుల గల్లంతు ఘటనపై విశాఖ వన్‌టౌన్‌ పీఎస్‌లో కేసు నమోదైంది. గల్లంతైన బండయ్య భార్య లక్ష్మి ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు.

11:16 AM, 7 Jul 2026 (IST)

చిన్నవడుగూరులో టీడీపీ నాయకుడిపై వైఎస్సార్సీపీ నేత దాడి

అనంతపురం జిల్లా పెద్దవడుగూరు మండలం చిన్నవడుగూరులో టీడీపీ నాయకుడిపై వైఎస్సార్సీపీ నేత దాడికి పాల్పడ్డాడు. సోమవారం రాత్రి మద్యం తాగి టీడీపీ నాయకులను వైఎస్సార్సీపీ నేత మదన్మోహన్‌రెడ్డి దూషించాడు. మదన్మోహన్‌రెడ్డిని ప్రశ్నించేందుకు టీడీపీ నాయకుడు భాస్కర్‌ వెళ్లాడు. ఈ క్రమంలో మదన్మోహన్‌రెడ్డి, భాస్కర్​పై కొడవలితో దాడి చేసి చేతిని నరికేశాడు.

11:14 AM, 7 Jul 2026 (IST)

ప్రహ్లాదపురంలో బంగారం కోసం వృద్ధురాలి హత్య

విశాఖ శివారు ప్రహ్లాదపురంలో బంగారం కోసం వృద్ధురాలు పైడమ్మ(72)ను దొంగలు హత్య చేశారు. ఇంట్లో వృద్ధురాలు ఒంటరిగా నిద్రిస్తున్న సమయంలో ఈ ఘటన చోటుచేసుకుంది. దీనిపై పెందుర్తి పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.

11:12 AM, 7 Jul 2026 (IST)

విశాఖలో ఎల్జీ ఎలక్ట్రానిక్స్ జీసీసీ ఏర్పాటు చేయండి: మంత్రి లోకేశ్‌

ఎల్జీ ఎలక్ట్రానిక్స్ (గ్లోబల్) సీఈవో ల్యూ జె చెయోల్, ఎల్ జీ ఎలక్ట్రానిక్స్ (ఇండియా) సీఈవో హాంగ్ జు జియోన్​లతో మంత్రి లోకేశ్​ విడివిడిగా భేటీ అయ్యారు. ఎల్జీ ఎలక్ట్రానిక్స్ నోయిడా, బెంగళూరు ప్రాజెక్టులను విస్తరిస్తూ విశాఖపట్నంలో ఒక ఇంజనీరింగ్ సెంటర్/జీసీసీ ఏర్పాటు చేయాల్సిందిగా లోకేశ్ విజ్ఞప్తి చేశారు. శ్రీసిటీ, దాని పరిసర ప్రాంతాల్లో డిస్‌ప్లే మాడ్యూల్స్, సెన్సార్లు, పవర్ ఎలక్ట్రానిక్స్ మొదలైన వాటి విడిభాగాల తయారీ కేంద్రాన్ని ఏర్పాటు చేసే అవకాశాలను పరిశీలించాలని కోరారు. ఐఓటీ, రోబోటిక్స్‌పై ఇన్నోవేషన్ ల్యాబ్‌లను అభివృద్ధి చేయడానికి ఆర్‌టీఐహెచ్‌తో కలిసి పనిచేయాలని కోరారు. క్యారియర్ సంస్థ తరహాలో వాణిజ్య ప్రయోజనాల కోసం చిల్లర్ మ్యానుఫ్యాక్చరింగ్ ఫెసిలిటీ ఏర్పాటుచేయాల్సిందిగ విజ్ఞప్తి చేశారు. కొత్తగా ఏపీలోని శ్రీసిటీలో రూ. 5,000 కోట్ల వ్యయంతో 3వ మ్యానుఫ్యాక్చరింగ్ యూనిట్ నిర్మిస్తోందని ఎల్జీ (ఇండియా) సీఈవో హాంగ్ జు జియోన్ తెలిపారు. దీనిద్వారా సుమారు 1,500 మందికి ఉద్యోగావకాశాలు లభిస్తాయన్నారు. ఈ ఏడాది చివరినాటికి శ్రీసిటీ యూనిట్ ద్వారా వాణిజ్య ఉత్పత్తి ప్రారంభించాలని భావిస్తున్నామని చెప్పారు.

11:07 AM, 7 Jul 2026 (IST)

నిజాంపట్నం తీరానికి కొట్టుకొచ్చిన నేవిగేషన్ బాయ్

బాపట్ల జిల్లా నిజాంపట్నం తీరానికి నేవిగేషన్ బాయ్ కొట్టుకొచ్చింది. సముద్రంలో బెలూన్‌ మాదిరిగా తేలియాడే పరికరం మత్స్యకారులు గుర్తించారు. వెంటనే వారు
ఉన్నతాధికారులకు సమాచారం ఇచ్చారు. చెన్నై నుంచి నిజాంపట్నం తీరానికి కొట్టుకొని వచ్చినట్లు అధికారులు గుర్తించారు. చెన్నై అధికారుల విజ్ఞప్తి మేరకు నేవిగేషన్ బాయ్‌ను లారీలో అధికారులు పంపారు. వాతావరణ సమాచార సేకరణకు చెన్నై పోర్టు వద్ద నేవిగేషన్ బాయ్ ఏర్పాటు చేశారు. ప్రమాదవశాత్తు విరిగిపడి ఇది నిజాంపట్నం తీరానికి కొట్టుకొచ్చింది. నేవిగేషన్ బాయ్ విలువ రూ.70 లక్షలు విలువ ఉంటుందని అధికారులు తెలిపారు.

9:31 AM, 7 Jul 2026 (IST)

శ్రీశైలం దేవస్థానంలో ఈఈ పదవీ విరమణ బెనిఫిట్స్‌పై చిక్కుముడి

శ్రీశైలం దేవస్థానంలో ఈఈ ఎం.నరసింహారెడ్డి పదవీ విరమణ బెనిఫిట్స్‌పై చిక్కుముడి పడింది. గత నెలలో ఆయన పదవీ విరమణ చేశారు. పదవీ విరమణ చేశాక రికార్డులు సరిగా లేవని అధికారులు గుర్తించారు. తప్పులు జరిగాయని తెలిసినా పదవీ విరమణ బెనిఫిట్స్ ఇవ్వడానికి అధికారులు దేవదాయ శాఖ కమిషనర్‌కు లేఖ రాశారు.1993లో వర్క్ ఇన్‌స్పెక్టర్‌ హోదాలో కరీంనగర్ నుంచి నరసింహారెడ్డి వచ్చారు. మాతృసంస్థ కాకపోయినా నరసింహారెడ్డికి శ్రీశైలంలో ఏఈ, డీఈ, ఈఈగా దేవస్థానం అధికారులు పదోన్నతులు కల్పించారు. మల్లన్న ఖజానాకు గండి కొడుతున్నారని అధికారుల తీరుపై విమర్శలు వెలువెత్తుతున్నాయి.

9:30 AM, 7 Jul 2026 (IST)

గాలింపు చర్యలను ఎప్పటికప్పుడు పర్యవేక్షిస్తున్న సీఎం చంద్రబాబు

మత్స్యకారుల సెర్చ్ ఆపరేషన్ ను ముఖ్యమంత్రి చంద్రబాబు ఎప్పటికప్పుడు పర్యవేక్షిస్తున్నారు. మత్స్యకారుడు కర్రి చిన్నా చెప్పిన కీలక సమాచారం ఆధారంగా గాలింపు చర్యలు ముమ్మరం చేశారు. గల్లంతైన మత్స్యకారుల ఆచూకీ కోసం రెస్క్యూ ఆపరేషన్ కొనసాగుతోంది. నేవీ, కోస్టు గార్డు నౌకలతో పాటు హెలికాప్టర్లతో గాలింపు చర్యలు చేపట్టారు. నౌకాదళానికి చెందిన రెండు హెలికాప్టర్లతో పాటు కోస్టు గార్డు నౌకలు, మెరైన్ పోలీసుల గాలింపు చేపట్టారు. బోటు బోల్తా పడిన గంగవరం పరిసర ప్రాంతాలతో పాటు తీరం నుంచి 12 నాటికల్ మైళ్ల పరిధిలో నౌకాదళ హెలికాప్టర్లతో గాలింపు విస్తృతం చేయాలని సీఎం సూచించారు. తూర్పు నౌకాదళ కమాండ్ నుంచి రెండు యుద్ధ నౌకలతో పాటు రెండు హెలికాప్టర్లు కూడా సెర్చ్ అండ్ రెస్క్యూ ఆపరేషన్ ను చేపట్టాయని సీఎంకు తీరప్రాంత భద్రత విభాగం ఐజీ గోపీనాథ్ జెట్టి వివరించారు.

8:45 AM, 7 Jul 2026 (IST)

కురుపాం మండలం గుజ్జువాయిలో సచివాలయ ఉద్యోగి ఆత్మహత్య

మన్యం జిల్లా కురుపాం మండలం గుజ్జువాయిలో ఫినాయిల్‌ తాగి సచివాలయ ఉద్యోగి కొండగొర్రి శైలజ(36) ఆత్మహత్యకు పాల్పడింది. గుమ్మలక్ష్మీపురం మండలం ఇరిడిలో వెల్ఫేర్ అసిస్టెంట్‌గా శైలజ విధులు నిర్వహిస్తుంది.

8:44 AM, 7 Jul 2026 (IST)

ఉదయం ఎస్‌ఐపీబీ సమావేశంలో పాల్గొననున్న సీఎం చంద్రబాబు

సచివాలయం ఇవాళ ఉదయం ఎస్‌ఐపీబీ సమావేశంలో సీఎం చంద్రబాబు పాల్గొననున్నారు. మధ్యాహ్నం సీఆర్డీఏ సమావేశంలో ముఖ్యమంత్రి పాల్గొననున్నారు.

8:42 AM, 7 Jul 2026 (IST)

దక్షిణ కొరియాలో మూడో రోజు మంత్రి లోకేశ్‌ పర్యటన

దక్షిణ కొరియాలో మూడో రోజు మంత్రి లోకేశ్‌ పర్యటిస్తున్నారు. అపాక్ట్ సీఈవో సియాంగ్ డాంగ్ లీతో మంత్రి లోకేశ్ భేటీ అయ్యారు. ఓఎస్‌ఏటీ సెమీకండక్టర్ నైపుణ్యాభివృద్ధికి సహకారం అందించాలని విజ్ఞప్తి చేశారు. ఏఎస్‌ఐపీ భాగస్వామ్యంతో ఏపీలో అపాక్ట్ కేంద్రం ఏర్పాటు పట్ల లోకేశ్ ధన్యావాదాలు తెలిపారు. అపాక్ట్‌తో దీర్ఘకాలిక భాగస్వామ్యాన్ని ఆశిస్తున్నామని చెప్పారు.

8:41 AM, 7 Jul 2026 (IST)

తిరుమలలో టోకెన్లు లేని భక్తులకు శ్రీవారి సర్వదర్శనానికి 12 గంటలు

తిరుమలలో టోకెన్లు లేని భక్తులకు శ్రీవారి సర్వదర్శనానికి 12 గంటల సమయం పడుతోంది. స్వామివారి సర్వదర్శనానికి 29 కంపార్టుమెంట్లలో భక్తులు వేచి ఉన్నారు. సోమవారం నాడు శ్రీవారిని 81,692 మంది భక్తులు దర్శించుకోగా 35,361 మంది తలనీలాలు సమర్పించారు. నిన్న శ్రీవారి హుండీ ఆదాయం రూ.4.72 కోట్లు సమకూరింది.

8:39 AM, 7 Jul 2026 (IST)

విశాఖ కంచరపాలెం-కప్పరాడ జాతీయ రహదారిపై వ్యాను బీభత్సం

విశాఖ కంచరపాలెం-కప్పరాడ జాతీయ రహదారిపై వ్యాను బీభత్సం సృష్టించింది. పార్కింగ్‌ చేసిన వాహనాలు, ఫుట్‌పాత్‌పై ఉన్న చెట్లు, విద్యుత్‌ స్తంభాలను ఢీకొట్టి వ్యాను బోల్తా పడింది. ప్రాణాపాయం నుంచి వ్యాను డ్రైవర్ బయటపడ్డాడు.

7:03 AM, 7 Jul 2026 (IST)

పారాదీప్ తీరానికి సురక్షితంగా 10 మంది మత్స్యకారులు

బోటు ఇంజిన్‌ చెడిపోయి సముద్రంలో చిక్కుకున్న 10 మంది మత్స్యకారులు పారాదీప్ తీరానికి సురక్షితంగా 10 మంది మత్స్యకారులు చేరుకున్నారు. పారాదీప్ తీరం నుంచి వారు విశాఖకు రానున్నారు. సహాయ సిబ్బందిని డీఐజీ గోపీనాథ్ జెట్టి అభినందించారు.

7:02 AM, 7 Jul 2026 (IST)

వెంకటగిరిలో కుమారుడిని చంపి తల్లి ఆత్మహత్య

తిరుపతిలో జిల్లాలో విషాదం చోటుచేసుకుంది. వెంకటగిరిలో కుమారుడిని చంపి తల్లి ఆత్మహత్య చేసుకుంది. 9 ఏళ్ల కుమారుడిపై పెట్రోల్‌ పోసి తానూ కూడా నిప్పంటించుకుంది. తల్లి లీలాబాల శ్రావణి అక్కడికక్కడే మృతి చెందగా, ఆస్పత్రికి తరలిస్తుండగా కుమారుడు చంద్రమౌళి మృతి చెందాడు.

6:59 AM, 7 Jul 2026 (IST)

ఖరీఫ్, రబీల్లో పంటలబీమా అమలు

ఖరీఫ్, రబీల్లో ప్రధానమంత్రి ఫసల్‌ బీమా పథకం(పీఎంఎఫ్‌బీవై), సవరించిన వాతావరణ ఆధారిత బీమా పథకం అమలుకు ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. సాగుచేసిన పంటల వారీగా తమ వాటా ప్రీమియం చెల్లించిన రైతులకు బీమా వర్తిస్తుంది. కేంద్ర, రాష్ట్రాలు తమ వాటా మొత్తాన్ని చెల్లిస్తాయి. జిల్లాల వారీగా అమలుకు సంబంధించిన బీమా సంస్థలు, పంటలు, నమోదు తేదీలపై మార్గదర్శకాలను సర్కారు విడుదల చేసింది. ఖరీఫ్‌లో పీఎంఎఫ్‌బీవై కింద వరికి ఆగస్టు 15, ఇతర అన్నిరకాల నోటిఫైడ్‌ పంటలకు జులై 31 వరకు గడువు ఉంది. వాతావరణ ఆధారిత బీమా పథకం కింద అన్నిరకాల నోటిఫైడ్‌ పంటలకు జులై 15లోగా నమోదు చేసుకోవాలి. రబీలో పీఎంఎఫ్‌బీవై కింద వరికి డిసెంబర్‌ 31, ఇతర అన్నిరకాల నోటిఫైడ్‌ పంటలకు డిసెంబర్‌ 15 వరకు గడువు ఉంది.

6:57 AM, 7 Jul 2026 (IST)

ప్రెసిడెన్షియల్ ఆర్డర్ 2025 ప్రకారం ఉద్యోగుల లోకల్ క్యాడర్ స్ట్రెంత్ ప్రక్రియ

ప్రెసిడెన్షియల్ ఆర్డర్ 2025 ప్రకారం ఉద్యోగుల లోకల్ క్యాడర్ స్ట్రెంత్ ప్రక్రియ జరుగుతోంది. ఈ ప్రక్రియ సజావుగా సాగేందుకు సచివాలయంలో నోడల్ అధికారిని ప్రభుత్వం నియమించింది. 36 విభాగాలకు డిప్యూటీ సెక్రటరీ స్థాయి అధికారిని నియమిస్తూ ఉత్తర్వులు జారీ చేసింది.

6:55 AM, 7 Jul 2026 (IST)

ఈడబ్ల్యూఎస్ ఫీజు రియంబర్స్‌ బకాయిలు రూ.251.3 కోట్లు విడుదల

ఈడబ్ల్యూఎస్ ఫీజు రియంబర్స్‌ రూ.251.3 కోట్లు, పోస్ట్‌మెట్రిక్ స్కాలర్‌షిప్‌లు రూ.534.63 కోట్లు, మైనార్టీలకు పోస్ట్‌మెట్రిక్ స్కాలర్‌షిప్‌లకు రూ.47.8 కోట్లు, రూ.171.13 కోట్ల ఫీజు రియంబర్స్‌ బకాయిలను ప్రభుత్వం విడుదల చేసింది.

Last Updated : July 7, 2026 at 10:42 PM IST