08-07-2026 Telangana News Today Live Updates: మీసేవ కేంద్రాల్లోనూ యూరియా బుకింగ్ సేవలు

Published : July 8, 2026 at 6:55 AM IST
|Updated : July 8, 2026 at 10:44 PM IST
08-07-2026 Telangana News Today Live Updates : ఈరోజు తెలంగాణ తాజా ప్రధాన వార్తల సమాచారం
LIVE FEED
రంగారెడ్డి: మృతిచెందిన కాంగ్రెస్ నాయకుడు శంకర్ కుటుంబానికి పరామర్శ
రంగారెడ్డి జిల్లాలో మృతిచెందిన కాంగ్రెస్ నాయకుడు శంకర్ కుటుంబానికి పలువురు ప్రముఖులు పరామర్శించారు. జిల్లాలోని తలకొండపల్లి మండలం గట్టుఇప్పలపల్లిలో శంకర్ కుటుంబాన్ని మంత్రులు పొంగులేటి, వాకిట శ్రీహరి పరామర్శించారు. ఈనెల 4న మిడ్జిల్‌లో సీఎం సభలో అస్వస్థకు గురై చికిత్సపొందుతూ శంకర్ మృతి చెందారు. తక్షణ సహాయంగా శంకర్ కుటుంబానికి రూ.5 లక్ష చెక్కు అందించారు.
హైదరాబాద్ చేరుకున్న ఇండియన్ ఒలింపిక్ అసోసియేషన్ అధ్యక్షురాలు పీటీ ఉష
ఇండియన్ ఒలింపిక్ అసోసియేషన్ అధ్యక్షురాలు పీటీ ఉష హైదరాబాద్ చేరుకున్నారు. ఆమె రేపు పలు క్రీడా కార్యక్రమాల్లో పాల్గొననున్నారు. సీఎంతో కలిసి యంగ్ ఇండియా స్పోర్ట్స్ వర్సిటీ లోగో ఆవిష్కరించనున్నారు. రేపు యంగ్ ఇండియా స్పోర్ట్స్ వర్సిటీ వెబ్‌సైట్ ప్రారంభించనున్నారు. స్పోర్ట్స్ యూనివర్సిటీలో పలు విద్యా కోర్సులకు రేపు శ్రీకారం చున్నారు. పారా నేషనల్ పారా అథ్లెటిక్ సపోర్ట్ ప్రోగ్రామ్ ప్రకటించనున్నారు. ఖేలో ఇండియా యూత్ గేమ్స్ నిర్వహణకు సంబంధించి ప్రకటన ఇవ్వనున్నారు. స్పోర్ట్స్ నాలెడ్జ్ ఆన్ వీల్స్ ప్రత్యేక వాహనాలు ప్రారంభించనున్నారు.
రేపు హనుమకొండ, వరంగల్ జిల్లాల్లో గవర్నర్ శివప్రతాప్ శుక్లా పర్యటన
రేపు హనుమకొండ, వరంగల్ జిల్లాల్లో గవర్నర్ శివప్రతాప్ శుక్లా పర్యటించనున్నారు. హనుమకొండలో స్వయం సహాయక సంఘాల స్టాల్స్‌ను సందర్శించనున్నారు. స్వయం సహాయక సంఘాల సభ్యులతో మాట్లాడనున్నారు. హనుమకొండ ఐడీవోసీలో రెండు జిల్లాల అధికారులతో గవర్నర్ సమీక్ష నిర్వహించనున్నారు. ఐడీవోసీ నుంచి నషా ముక్త్ భారత్ ర్యాలీని ప్రారంభించనున్నారు. హనుమకొండలో రెడ్‌క్రాస్ సొసైటీని సందర్శించనున్నారు. రేపు సాయంత్రం భద్రకాళి అమ్మవారిని దర్శించుకోనున్నారు.
మీసేవ కేంద్రాల్లోనూ యూరియా బుకింగ్ సేవలు
మీసేవ కేంద్రాల్లోనూ యూరియా బుకింగ్ సేవలు ప్రారంభమయ్యాయి. యాప్ ద్వారా బుక్ చేసుకోలేని రైతులకు మీసేవ ద్వారా చేసుకునే అవకాశాన్ని ప్రభుత్వం కల్పించింది. రైతులు మీసేవ సదుపాయాన్ని వినియోగించుకోవాలని వ్యవసాయశాఖ సూచించింది. మీసేవ బుకింగ్ ఐడీ 48 గంటలపాటు మాత్రమే చెల్లుబాటు అవుతుందని మీసేవ కమిషనర్ పేర్కొన్నారు. గడువు ముగిసేలోపు డీలర్ ద్వారా యూరియా కొనుగోలు చేయాలని సూచించారు.
గణేశ్ విగ్రహాలు 15 అడుగలలోపు తయారు చేయించుకోవాలి: సీపీ సజ్జనర్
బంజారాహిల్స్ ఐసీసీసీలో భాగ్యనగర్ గణేశ్ ఉత్సవ సమితితో సీపీ సజ్జనర్ భేటీ అయ్యారు. గణేశ్ విగ్రహాల ఎత్తుపై ఉత్సవ సమితి ప్రత్యేక శ్రద్ధ పెట్టాలని ఆయన అన్నారు. గణేశ్ విగ్రహాలు 15 అడుగలలోపు తయారు చేయించుకోవాలని సూచించారు. విద్యుత్ తీగలు అడ్డువస్తే కర్రలతో పైకిలేపే యత్నం చేయవద్దని విజ్ఞప్తి చేశారు. భక్తులకు ఇబ్బంది కలగకుండా పోలీసులు సహకరిస్తారని హామీ ఇచ్చారు.
వైద్యుడిని బెదిరించి రూ.15 కోట్లు వసూలు చేయాలని కుట్ర
హనుమకొండలో వైద్యుడి వద్ద భారీగా వసూలు చేయాని కుట్ర పన్నాడు. చివరికది భగ్నమైంది. వైద్యుడిని బెదిరించి రూ.15 కోట్లు వసూలు చేయాలని ఓ వ్యక్తి కుట్ర పన్నాడు. నిందితుడు గతంలో ఆ వైద్యుడి వద్ద డ్రైవర్‌గా పనిచేసిన సుభాష్‌గా గుర్తించారు. వైద్యుడి వద్ద ఉద్యోగం పోవడంతో అతడిపై కక్ష పెంచుకున్నాడు. మరో ఇద్దరితో కలిసి రూ.15 కోట్లు వసూలు చేయాలని పథకం వేశాడు. హత్యకు సుపారీ వచ్చిందంటూ వైద్యుడికి బెదిరింపు కాల్స్ చేశాడు. వైద్యుడి ఫిర్యాదుతో పోలీసులు రంగంలోకి దిగారు. ములుగు క్రాస్‌రోడ్ వద్ద పోలీసులను చూసి పరారీకి యత్నించారు. అయితే నిందితులను వెంబడించి పోలీసులు ముగ్గురిని పట్టుకున్నారు. నిందితుల వద్ద 4 ఫోన్లు, ఓ బైకును సీజ్ చేశారు.
ఏప్రిల్-జూన్ మధ్య ఎరువుల సరఫరా లోటు ఉంది: తుమ్మల
మంత్రి తుమ్మల నాగేశ్వరరావు కేంద్రమంత్రి జేపీ నడ్డాకు లేఖ రాశారు. ఖరీఫ్‌లో అవసరమైన ఎరువుల సరఫరాకు చర్యలు తీసుకోవాలని లేఖలో పేర్కొన్నారు. ఏప్రిల్-జూన్ మధ్య ఎరువుల సరఫరా లోటు ఉందని ప్రస్తావించారు. లోటును ఈనెల అదనపు కేటాయింపుల ద్వారా భర్తీ చేయాలని సూచించారు. రాష్ట్రంలో 55.52 లక్షల ఎకరాల్లో విత్తడం పూర్తయిందని వెల్లడించారు. ఈ సీజన్‌లో విస్తీర్ణం పెరగడంతో ఎరువుల అవసరం పెరిగిందని వెల్లడించారు.
సీఎం రేవంత్ రెడ్డిని కలిసిన యాదగిరిగుట్ట పాలకమండలి
యాదగిరిగుట్ట ఆలయ నూతన పాలక మండలి సీఎం రేవంత్‌రెడ్డిని మర్యాదపూర్వకంగా కలిశారు. ఈ మేరకు పాలకమండలికి ముఖ్యమంత్రి దిశానిర్దేశం చేశారు. పాలకమండలి తరఫున దేవాదాయశాఖ మంత్రి కొండా సురేఖకూడా హాజరయ్యారు.
బండి భగీరథ్ బెయిల్ పిటిషన్‌పై రేపు హైకోర్టు తీర్పు
బండి భగీరథ్ బెయిల్ పిటిషన్‌పై రేపు హైకోర్టు తీర్పు ఇవ్వనుంది. భగీరథ్ బెయిల్ పిటిషన్‌పై ఇదివరకే వాదనలు ముగిశాయి. పోక్సో కేసులో బండి భగీరథ్ జైలులో ఉన్నారు. 50 రోజులుగా చర్లప్లలి జైలులో రిమాండ్ ఖైదీగా ఉన్నారు. ఇప్పటికే బెయిల్ ఇవ్వడానికి మల్కాజ్‌గిరి కోర్టు నిరాకరించింది. మల్కాజ్‌గిరి కోర్టు బెయిల్ నిరాకరణతో హైకోర్టులో భగరీథ్ బెయిల్ పిటిషన్ దాఖలు చేశారు.
జులై 31న ఓటర్ల ముసాయిదా జాబితా ప్రచురణ: చెన్నయ్య
ఈటీవీతో సీఈవో ఆఫీస్ ట్రైనింగ్ నోడల్ అధికారి చెన్నయ్య ముఖాముఖి. "బీఎల్‌వోలు ఇంటికి వచ్చి ఎన్యుమరేషన్ పత్రం ఇస్తారు. ఇంటి వద్ద ఎన్యుమరేషన్ పత్రం ఇవ్వకపోతే బీఎల్‌వోను సంప్రదించాలి. బీఎల్‌వోల నంబర్లు ఈసీఐ.నెట్ వెబ్‌సైట్, యాప్ ద్వారా పొందవచ్చు. ఎపిక్ నంబర్, జిల్లా, ఇతర వివరాలతో బీఎల్‌వోల నంబర్లు పొందవచ్చు. బీఎల్‌వోకు ఫోన్ చేస్తే ఇంటికి వచ్చి ఎన్యుమరేషన్ పత్రం ఇస్తారు. బీఎల్‌వోల వద్ద ఓటర్ల ఫొటోతో కూడిన ఎన్యుమరేషన్ పత్రం ఉంటుంది. ఎన్యుమరేషన్ పత్రంలో మూడు విభాగాలు ఉంటాయి. ఎన్యుమరేషన్ పత్రంలో 2002 నాటి వివరాలు నమోదు చేయాలి. 2002 నాటి సర్ వివరాలు లేకపోయినా పర్వాలేదు. 2002 నాటి వివరాలు ఉంటే రాయండి.. లేకపోతే లేదు. 2002 నాటి వివరాలు లేకపోతే రెండో విభాగం నింపాలి. రెండో విభాగంలో కుటుంబసభ్యుల్లో ఒకరి వివరాలు నింపాలి. 2002 నాటి వివరాలు తెలంగాణ, ఏపీకి సంబంధించి ఏది రాసినా పర్వాలేదు. జులై 31న ఓటర్ల ముసాయిదా జాబితా ప్రచురణ" అని చెన్నయ్య వివరించారు.
సీఎం రేవంత్‌రెడ్డిని మర్యాదపూర్వకంగా కలిసిన మలేషియా ఎంపీ శరవణన్
సీఎం రేవంత్‌రెడ్డిని మలేషియా ఎంపీ శరవణన్ మర్యాదపూర్వకంగా కలిశారు. గ్రీన్ గ్రోత్ ఎకనమిక్ సమ్మిట్‌లో పాల్గొనడానికి హైదరాబాద్‌కు శరవణన్ వచ్చారు. గ్రీన్ గ్రోత్ ఎకనమిక్ సమ్మిట్ ప్రతినిధులు సీఎంను కలిశారు. పర్యావరణ, సామాజిక, పరిపాలనాపరమైన అంశాలపై, ఏఐ వినియోగం, భవిష్యత్ పెట్టుబడులపై సమావేశంలో చర్చించారు.
డీఎస్పీ భీమ్‌రెడ్డి ఆస్తుల విలువ రూ.200కోట్లకు పైగా ఉంటుంది: ఏసీబీ
డీఎస్పీ భీమ్‌రెడ్డి ఆస్తుల విలువ రూ.200కోట్లకు పైగా ఉంటుందని ఏసీబీ అంచనా వేసింది. ఆయన ఇంట్లో స్వాధీనం చేసుకున్న 2 మెమరీ కార్డుల్లో ఆర్థిక లావాదేవీల వివరాలు రాసి పెట్టుకున్నారు. వాటి ఆధారంగా భీమ్‌రెడ్డి ఆస్తుల వివరాలు సంపాదించింది. అక్రమాస్తులు కూడబెట్టడంలో భీమ్‌రెడ్డి తెలివిగా వ్యవహరించాడని, మొదట తన పేరిట ఆస్తులు కొనుగోలు చేసి, తరువాత వాటిని బినామీల పేరిట మార్చాడని ఏసీబీ గుర్తించింది. క్యాన్సిలేషన్ డీడ్ ద్వారా బినామీల పేరిట ఆస్తులను అనుభవిస్తున్నాడని తెలిపింది. సోదాల సమయంలో భీమ్‌రెడ్డి శ్వాస సమస్యతో ఇబ్బంది పడ్డాడని అందుకే వెంటనే అరెస్ట్ చేయలేదని వివరించింది.
మరో 2-3 రోజుల్లో జేబీఎం ఎలక్ట్రికల్ బస్సులు రోడ్డెక్కుతాయి: ఆర్టీసీ ఎండీ
మరో 2-3 రోజుల్లో జేబీఎం ఎలక్ట్రికల్ బస్సులు రోడ్డెక్కుతాయని ఆర్టీసీ ఎండీ నాగిరెడ్డి ప్రకటించారు. 118 బస్సులకు సాంకేతిక బృందం ఫిట్‌నెస్ సర్టిఫికెట్ ఇచ్చిందని, ప్రయాణికులకు ఇబ్బందులు లేకుండా ప్రత్యామ్నాయంగా అదనపు సర్వీసులు నడుపుతున్నామన్నారు. 500 జేబీఎం బస్సుల పునరుద్ధరణ వేగంగా జరుగుతోందని నాగిరెడ్డి తెలిపారు.
అప్పుడు లేని అభ్యంతరాలు ఇప్పుడెందుకు? : టీఆర్‌ఎస్
పార్టీ పేరు, ఈసీ అభ్యంతరాలపై టీఆర్ఎస్(TRS Row) వర్గాలు స్పందించాయి. తెలంగాణ ప్రజా జాగృతి పేరుతో పార్టీ రిజిస్ట్రేషన్‌కు దరఖాస్తు చేశామని, కానీ ఈసీనే తెలంగాణ రక్షణ సేన కేటాయిస్తూ అభ్యంతరాలకు అవకాశమిచ్చిందని వారు అన్నారు. తమపై వెయ్యికి పైగా అభ్యంతరాలు వచ్చాయంటున్నారు.. కానీ అవేమిటో ఇవ్వడం లేదన్నారు. పార్టీ రిజిస్ట్రేషన్ కోసం పత్రిక ప్రకటనలు కూడా ఇచ్చామని, అప్పుడు లేని అభ్యంతరాలు ఇప్పుడెందుకని ప్రశ్నించారు. అంతిమంగా గెలిచేది న్యాయమేనని టీఆర్‌ఎస్ ధీమా వ్యక్తం చేశాయి.
తాడిచర్ల-2ను యూపీఏ హయాంలోనే సింగరేణికి కేంద్రం కేటాయించింది : భట్టి
సింగరేణికి తాడిచర్ల-2 కేటాయింపు సంతోషకరమంటూనే.. కేంద్రం వాస్తవాలను మరుగునపరిచి తప్పుదోవ పట్టించడం సరికాదన్నారు డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క. 2013లో సింగరేణికి కేంద్ర ప్రభుత్వం లేఖ రాసిందని, యూపీఏ హయాంలోనే సింగరేణికి కేంద్రం కేటాయించిందని గుర్తుచేశారు. గిరిజన ప్రాంతాల్లోని బొగ్గును ప్రభుత్వ సంస్థలు తప్ప మరొకరు లీజుకు తీసుకోకూడదని విరవించారు. గతంలోనే కేటాయిస్తే 2013 నుంచి ఇప్పటివరకు పెండింగ్ పెట్టి ఇప్పుడు కేటాయించారని భట్టి ఆరోపించారు.
గద్వాల జిల్లాలో ఇందిరమ్మ ఇళ్లు ప్రారంభం
గద్వాల జిల్లా ధరూర్ మం. ర్యాలంపాడులో ఇందిరమ్మ ఇళ్లను మంత్రులు పొంగులేటి, వాకిటి శ్రీహరి ప్రారంభించారు. ఆర్ అండ్ ఆర్ సెంటర్‌లో 52 ఇందిరమ్మ ఇళ్లను నిర్మించిన ప్రభుత్వం వాటిని లబ్ధిదారులకు అందించింది. ఇవాళ వారంతా గృహ ప్రవేశం చేశారు.
1677 పాయింట్లు నష్టపోయిన సెన్సెక్స్
ఇరాన్‌తో కాల్పుల విరమణ ఒప్పందం ముగిసిందని ట్రంప్ వ్యాఖ్యల నేపథ్యంలో ప్రపంచవ్యాప్తంగా స్టాక్ మార్కెట్లు కుప్పకూలాయి. BSE ప్రధాన సూచి సెన్సెక్స్ 20 నిమిషాల్లో 900 పాయింట్లు కుప్పకూలింది. మొత్తంగా 1677 పాయింట్లు కోల్పోయి 76,503 పాయింట్ల వద్ద స్థిరపడింది. నిఫ్టి 517 పాయింట్లకు పైగా పతనమై 23,882 పాయింట్ల వద్ద ముగిసింది. అటు ఆసియా, యూరప్ మార్కెట్లు 2 శాతానికి పైగా నష్టపోయాయి. బారెల్ చమురు ధర 75 డాలర్లకు చేరింది.
బాన్సువాడ ఎస్‌ఎంహెచ్ హాస్టల్‌లో విద్యార్థిని ఆత్మహత్య
కామారెడ్డి జిల్లా బాన్సువాడ ఎస్‌ఎంహెచ్ హాస్టల్‌లో విద్యార్థిని ఆత్మహత్యకు పాల్పడింది. ఇంటర్ ఫస్టియర్ విద్యార్థిని అమృత హాస్టల్‌లో ఫ్యాన్‌కు ఉరేసుకొని చనిపోయింది. విద్యార్థిని అమృత స్వస్థలం మద్నూర్ మండలం లక్ష్మాపూర్ గ్రామం. మృతికి వివరాలు తెలియాల్సి ఉంది. విషయం తెలుసుకున్న పోలీసులు మృతదేహాన్ని పోస్ట్‌మార్టమ్‌కు తరలించి దర్యాప్తు ప్రారంభించారు.
నేను ఏ తప్పు చేయలేదు... వివరణ ఎందుకు ఇస్తా?: కడియం శ్రీహరి
తనపై సురేఖ సీఎంకు ఫిర్యాదు చేసిన నేపథ్యంలో ఆమెను ఉద్దేశించి కడియం శ్రీహరి(Kadiyam Srihari on Konda) పరోక్షంగా వ్యాఖ్యలు చేశారు. కొందరు కొత్త అలవాట్లు నేర్చుకుంటున్నారని, కాంట్రవర్సీ చేస్తూ... ప్రజల మధ్యలో ఉండాలనుకుంటున్నారని ఆరోపించారు. తాను ఏ తప్పు చేయలేదని, వివరణ ఎందుకు ఇస్తానని ప్రశ్నించారు. తాను అధికారులతో సమీక్ష నిర్వహించలేదని.. సమస్యలు విన్నవించానని తెలిపారు.
నీటిపారుదల మంత్రిగా నాకు 3 నెలలు అవకాశం ఇవ్వండి: హరీశ్‌రావు
నీటిపారుదల మంత్రిగా నాకు 3 నెలలు అవకాశం ఇస్తే నీళ్లు ఎలా రావో చూస్తానన్నారు మాజీ మంత్రి హరీశ్‌రావు. మంత్రిగా అధికారం ఇస్తే కన్నెపల్లి నుంచి ఎల్లంపల్లి వరకు నీళ్లు తెస్తానని లేకుంటే రాజకీయాల నుంచి తప్పుకుంటానని సవాల్ విసిరారు. ఈ మూడు నెలలపాటు జీతం, కారు, ప్యూన్, ఫ్యాన్ ఏమీ వద్దన్నారు. తనకు పదవులు ఏం కొత్త కాదని, 13 ఏళ్లు మంత్రిగా చేశానని హరీశ్‌రావు గుర్తుచేశారు.
గాంధీభవన్‌లో ప్రజలు, కార్యకర్తల నుంచి ఫిర్యాదులు స్వీకరించిన మంత్రి వివేక్
గాంధీభవన్‌లో ప్రజలు, కార్యకర్తల నుంచి మంత్రి వివేక్ ఫిర్యాదులు స్వీకరించారు. 200కు పైగా ఫిర్యాదులు వచ్చాయి. ఇందులో ఎక్కువగా పింఛన్, డబుల్‌బెడ్‌రూమ్ ఇళ్లు, భూసమస్యలే ఉన్నాయి. ఫిర్యాదులను స్పాట్‌లోనే మంత్రి వివేక్ పరిష్కరించారు. ఇందుకోసం ఆయన ఐదుగురు కలెక్టర్లు, జోనల్ కమిషనర్‌తో ఫోన్‌లో మాట్లాడారు.
గురుదక్షిణ చెల్లించేందుకే రేవంత్‌రెడ్డి నీళ్లను వదులుతున్నారు : హరీశ్ రావు
గురుదక్షిణ చెల్లించేందుకే రేవంత్‌రెడ్డి నీళ్లను వదులుతున్నారని మాజీ మంత్రి హరీశ్ రావు(Harish Rao on Revanth) ఆరోపించారు. కాళేశ్వరంలో నీళ్లు ఉండి కూడా... లిఫ్ట్ చేయకపోవడం క్రిమినల్ నెగ్లిజెన్స్ కిందకు వస్తుందన్నారు. ఇలాంటి వారిని ఉరితీసినా తప్పులేద్నారు. నీళ్లు ఉండి కూడా... వరంగల్ జిల్లాకు అన్యాయం చేస్తున్నారని ఆయన మండిపడ్డారు. నిన్న రేవంత్‌రెడ్డి ప్రసంగం సొల్లు తప్ప... ఏదీ నిజం లేదని, అబద్ధాలకు చొక్కా తొడిగితే రేవంత్‌రెడ్డిలా ఉంటుందని ఆయన ఆరోపించారు.
పంజాగుట్టలోని వైఎస్సార్ విగ్రహానికి నివాళులు అర్పించిన కాంగ్రెస్ నేతలు
వైఎస్సార్ జయంతి సందర్భంగా పంజాగుట్టలోని వైఎస్సార్ విగ్రహానికి కాంగ్రెస్ నేతలు నివాళులు అర్పించారు. వీరిలో డిప్యూటీ సీఎం భట్టి, మంత్రి శ్రీధర్‌బాబు, షబ్బీర్ అలీ, దానం నాగేందర్ ఉన్నారు. వైఎస్సార్ జయంతి సందర్భంగా డిప్యూటీ సీఎం భట్టి కేక్ కట్ చేశారు.
కామారెడ్డి పట్టణంలో ఐదుగురిపై దాడి చేసిన పిచ్చికుక్క
ఇటీవల కాలంలో పలు ప్రాంతాల్లో శునకాల బెడదతో ప్రజలు బెంబేళెత్తిపోతున్నారు. పిచ్చికుక్కలు దాడిచేసి గాయపరిచిన ఘటన కామారెడ్డి పట్టణంలో కలకలం రేపింది. ఈ ఘటనలో ఐదుగురు మహిళలకు గాయాలయ్యాయి. వారిని దగ్గర్లోని ఆస్పత్రిలో చేర్పించి వైద్యసేవలందిస్తున్నారు.
పవన్‌కల్యాణ్ అభిమాని నిరంజన్ కుటుంబానికి సోనూసూద్ పరామర్శ
పవన్ కల్యాణ్ వీరాభిమాని నిరంజన్ మృతి విషయం తెలుసుకున్న సోనూసూద్(Sonu Sood Videocall), అతడి కుటుంబ సభ్యులతో వీడియో కాల్లో మాట్లాడి పరామర్శించారు. నిరంజన్ కుటుంబానికి అన్ని విధాలుగా అండగా ఉంటామని తెలిపారు.
సూర్యాపేట జాజిరెడ్డిగూడెం మండలం అర్వపల్లిలో ఉద్రిక్తత
సూర్యాపేట జాజిరెడ్డిగూడెం మండలం అర్వపల్లిలో ఉద్రిక్తత చోటుచేసుకుంది. రాళ్లు, కర్రలతో కాంగ్రెస్‌లోని ఇరువర్గాలు దాడులు చేసుకున్నారు. కాంగ్రెస్‌లోని అసంతృప్త వర్గీయులు చలో గాంధీభవన్ వెళ్తుండగా ఘర్షణ చోటుచేసుకుంది. అసంతృప్తులను తుంగతుర్తి ఎమ్మెల్యే వర్గీయులు అడ్డుకోవడంతో ఘర్షణ వాతావరణం తలెత్తింది. ఇరువర్గాలను అదుపు చేసేందుకు పోలీసులు లాఠీఛార్జ్ చేశారు.
అన్నదాత అల్లాడుతుంటే ప్రభుత్వానికి పాపం అనిపించట్లేదా?: కేటీఆర్
బీఆర్ఎస్ కార్యనిర్వాహక అధ్యక్షుడు కేటీఆర్ ఎక్స్(KTR Tweet on Revanth Reddy) వేదికగా కాంగ్రెస్ ప్రభుత్వంపై ప్రశ్నల వర్షం కురిపించారు. మేడిగడ్డ వద్ద లక్షల క్యూసెక్కులు వృథాగా పోతున్నాయని, నీళ్లు లేక పల్లెల్లో రైతన్నలు కన్నీళ్లు పెడుతుంటే నీటిని వృథా చేస్తారా? అని ప్రశ్నించారు. నిర్లక్ష్యం వహించి కాంగ్రెస్ ప్రభుత్వం తమాషా చూస్తున్నదని మండిపడ్డారు. అన్నదాత అల్లాడుతుంటే ప్రభుత్వానికి పాపం అనిపించట్లేదా అని నిలదీశారు. గోదావరి జలాలను ఎత్తిపోసి రైతు గోసం తీర్చాలనే సోయ లేదా అని మండిపడ్డారు. కేసీఆర్ మీద రైతులకు శిక్ష వేయడం తగునా అని కేటీఆర్ ప్రశ్నించారు. ముఖ్యమంత్రికి రైతు ముఖ్యమా? రాజకీయం ముఖ్యమా అని అన్నారు. మీ పగ ప్రతిపక్షం మీద తీర్చుకోవాలని, రైతన్నలను ఆగం చేయొద్దని కేటీఆర్ తన ట్వీట్లో హితవు పలికారు.
నిజామాబాద్: ఇందల్వాయి మండలం ఎల్లారెడ్డిపల్లిలో చిరుత సంచారం
నిజామాబాద్ జిల్లా ఇందల్వాయి మండలం ఎల్లారెడ్డిపల్లిలో చిరుత సంచారం. శ్రవణ్ అనే రైతు కోళ్ల ఫామ్‌కు వచ్చిన చిరుత, స్థానికులు భయాందోళనకు గురవుతున్నారు. కుక్కలు అరవడంతో వెళ్లిపోయిన చిరుత, సీసీ కెమెరాలో ఈ దృశ్యాలు రికార్డైయ్యాయి.
హనుమకొండ: అరుదైన వ్యాధితో బాధపడుతున్న నిరంజన్ మృతి
హనుమకొండలో అరుదైన వ్యాధితో బాధపడుతున్న నిరంజన్ మృతి చెందాడు. ఆస్పత్రిలో చికిత్స పొందుతూ పవన్‌కల్యాణ్ అభిమాని నిరంజన్ మృతి. ఇటీవల నిరంజన్‌ను ఏపీ డిప్యూటీ సీఎం పవన్‌కల్యాణ్ పరామర్శించి సంగతి తెలిసిందే. నిరంజన్‌తో ఇటీవల సెల్ఫీ తీసుకొని రూ.లక్ష పవన్ ఆర్థికసాయం చేశారు.
తెలంగాణ ఫోన్ ట్యాపింగ్ కేసులో మరో కీలక పరిణామం!
ఫోన్ ట్యాపింగ్ కేసులో కీలక పరిణామం. ఈ కేసు నిందితుల జాబితాలో ముగ్గురు బీఆర్ఎస్ ముఖ్యుల్ని చేర్చినట్లు విశ్వసనీయంగా తెలిసింది. ప్రత్యేక దర్యాప్తు బృందం (సిట్) చేపట్టిన సుదీర్ఘ విచారణ ఇటీవలే కొలిక్కి రాగా అనుబంధ అభియోగపత్రంలో వీరిని నిందితులుగా చేర్చినట్లు తెలుస్తోంది. న్యాయనిపుణుల ఆమోదం లభించిన అనంతరం వీరిపై అభియోగాల నమోదుకు సాంకేతికపరమైన అనుమతులనూ తీసుకోనున్నారు.
వనస్థలిపురం ఆటోనగర్‌లో కంటైనర్‌కు అగ్నిప్రమాదం
వనస్థలిపురం ఆటోనగర్‌లో ఓ కంటైనర్‌లో అగ్నిప్రమాదం సంభవించింది. డాల్డా లోడ్‌తో వెళ్తున్న కంటైనర్ ఇంజిన్‌లో ఒక్కసారిగా మంటలు చెలరేగాయి. మంటల ధాటికి డీజిల్ ట్యాంక్ పేలింది. డ్రైవర్ అప్రమత్తతతో ప్రమాదం తప్పింది. అగ్నిమాపక సిబ్బంది ఘటనాస్థలికి చేరుకుని మంటలు అదుపు చేశారు.

