07-07-2026 Telangana News Today Live Updates : జనగామ: పాలకుర్తి మండలంలో కారు బీభత్సం, ఇద్దరు మృతి

Published : July 7, 2026 at 6:59 AM IST
|Updated : July 7, 2026 at 10:43 PM IST
07-07-2026 Telangana News Today Live Updates : ఈరోజు తెలంగాణ తాజా ప్రధాన వార్తల సమాచారం
LIVE FEED
జనగామ: పాలకుర్తి మండలంలో కారు బీభత్సం, ఇద్దరు మృతి
జనగామ జిల్లా పాలకుర్తి మండలంలో కారు బీభత్సం సృష్టించిన ఘటనలో ఇద్దరు మృతి చెందారు. రెండు వేర్వేరు చోట్ల బైకులను కార్లు ఢీకొట్టాయి. మద్యం మత్తులో పాలకుర్తి వద్ద కారు బైకును ఢీకొట్టింది. ఈ ఘటనలో రఘునాథపల్లి మండలం వెల్ది గ్రామానికి చెందిన వెంకటలక్ష్మి (42) మృతి చెందారు. మృతురాలి భర్త శ్రీనివాస్‌కు తీవ్రగాయాలయ్యాయి. ఆయనను ఆస్పత్రికి తరలించారు. బైకును ఢీకొట్టి పారిపోతూ గూడూరు వద్ద కారు డ్రైవర్ మరో బైకును ఢీకొట్టింది. ప్రమాదంలో చిల్పూరు మండలానికి చెందిన కృష్ణాజిగూడెం వాసి రంజిత్ (29) మృతి చెందారు. గూడూరు వద్ద కారు డ్రైవర్‌ను పట్టుకునేందుకు స్థానికులు వెంబడించారు. నిలిపి ఉంచిన బైకులను గుద్దుకుంటూ కారు డ్రైవర్ పారిపోయాడు. బొమ్మెర వద్ద కారు ఆగిపోవడంతో 2 పడకల ఇళ్లలోకి వెళ్లి నిందితుడు దాక్కున్నాడు. నిందితుడుని పట్టుకొని స్థానికులు దేహశుద్ధి చేసి పోలీసులకు అప్పగించారు. నిందితుడు బొమ్మెర గ్రామానికి చెందిన రాహుల్ (22)గా గుర్తించారు.
హైదరాబాద్: అత్తాపూర్‌లో రూ.2,100 కోసం స్నేహితుల మధ్య ఘర్షణ
హైదరాబాద్ అత్తాపూర్‌లో రూ.2,100 కోసం స్నేహితుల మధ్య ఘర్షణ చోటుచేసుకుంది. అప్పు ఇచ్చిన డబ్బులు తిరిగి ఇవ్వాలని అడగడంతో వివాదం చెలరేగింది.
నిందితుడు అఫ్తాబ్ కోపంలో స్నేహితుడిపై కత్తితో దాడి చేశాడు. దాడిలో గాయాలపాలైన వ్యక్తిని ఆస్పత్రికి తరలించారు. కేసు నమోదు చేసిన అత్తాపూర్ పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.
హైదరాబాద్: ఎమ్మెల్సీ నవీన్‌రెడ్డిపై కేసు నమోదు
హైదరాబాద్ ఎమ్మెల్సీ నవీన్‌రెడ్డిపై కేసు నమోదైంది. నలమోని శ్రీధర్ ఫిర్యాదుతో షాద్‌నగర్ పీఎస్‌లో ఈ కేసు నమోదైంది. ఎమ్మెల్యే శంకర్‌పై అనుచిత వ్యాఖ్యలు చేశారని ఫిర్యాదు రావడంతో పోలీసులు కేసు నమోదు చేశారు.
పెద్దపల్లి జిల్లా బొట్లవనపర్తిలో 15 రోజుల పసికందు విక్రయం
పెద్దపల్లి జిల్లా బొట్లవనపర్తిలో 15 రోజుల పసికందు విక్రయించారు. రూ.2 లక్షలకు మంచిర్యాల జిల్లా నస్పూర్‌కు చెందిన దంపతులు కొనుగోలు చేశారు.
తనకు తెలియకుండానే బిడ్డను విక్రయించారని తల్లి రమ పోలీసులకు ఫిర్యాదు చేసింది. బేరం కుదిర్చిన మధ్యవర్తులపై ధర్మారం పోలీసులు కేసునమోదు చేశారు. పాపను తల్లికి అప్పగించారు.
హైదరాబాద్: రూ.1.60 కోట్ల విలువైన సింథటిక్ డ్రగ్స్ స్వాధీనం
హైదరాబాద్‌లో రూ.1.60 కోట్ల విలువైన సింథటిక్ డ్రగ్స్‌ను అధికారులు స్వాధీనం చేసుకున్నారు. నాచారంలో ఎక్సైజ్ స్టేట్ టాస్క్‌ఫోర్స్, డ్రగ్ ఇన్‌స్పెక్టర్ల సంయుక్త దాడులు నిర్వహించారు. 5.86 కిలోల ఎన్-బెంజిల్‌పైపెరాజైన్ డ్రగ్స్‌ను అధికారులు సీజ్ చేశారు. హైమా సింథసిస్ లిమిటెడ్‌పై ఎన్‌డీపీఎస్ చట్టం కింద కేసు నమోదు చేశారు. గుజరాత్ నుంచి తెచ్చి హైదరాబాద్, బెంగళూరు, ముంబయికి సరఫరా చేస్తున్నట్లు గుర్తించారు. డ్రగ్స్ విక్రయిస్తున్న ముదిగొండ ఈశ్వర్‌పై కేసు నమోదు చేశారు. డ్రగ్స్, నిందితుడిని నాచారం ఎక్సైజ్ స్టేషన్‌కు అధికారులు అప్పగించారు.
ఊరు, పేరు, అంచనాలు మార్చి నిధులు కొల్లగొట్టడానికి కేసీఆర్ స్కీమ్ : రేవంత్ రెడ్డి
ప్రజాభవన్‌లో కాళేశ్వరం ప్రాజెక్టుపై పవర్ పాయింట్ ప్రజంటేషన్ జరుగుతోంది. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి హాజరయ్యారు. కాళేశ్వరం ప్రాజెక్టు రీడిజైన్ పేరుతో కేసీఆర్ ఆలోచనలు మారాయని, ప్రాజెక్టు రీడిజైన్‌పై కేసీఆర్ విశ్రాంత ఇంజినీర్ల కమిటీ వేశారని రేవంత్ రెడ్డి తెలిపారు. ఊరు, పేరు, అంచనాలు మార్చి నిధులు కొల్లగొట్టడానికి కేసీఆర్ స్కీమ్ వేశారని రేవంత్ ఆరోపించారు. రూ.38 వేల కోట్ల ప్రాజెక్టు అంచనాను రూ.81 వేల కోట్లకు పెంచారని, అందులోనూ అవినీతి జరిగిందన్నారు. అయితే ప్రాజెక్టు అంచనా రూ.1.47 లక్షల కోట్లకు పెరిగిందని కాగ్ నివేదిక ఇచ్చిందన్నారు. డిజైన్, ప్రణాళిక, నాణ్యత పాటించి ఉంటే చర్చించే పరిస్థితి వచ్చేది కాదని ముఖ్యమంత్రి తెలిపారు.
పోలీసు శాఖలో ఖాళీలు, నియామకాలపై వివరణ ఇవ్వాలని హైకోర్టు ఆదేశం
పోలీసు శాఖలో ఖాళీలు, నియామకాలపై వివరణ ఇవ్వాలని హైకోర్టు ఆదేశించింది. ఖాళీల భర్తీకి జారీ చేసిన నోటిఫికేషన్ల వివరాలు ఇవ్వాలని ఆదేశించింది. పోలీసు ఉద్యోగాలు భర్తీ చేయకపోవడాన్ని సవాల్ చేస్తూ వచ్చిన ప్రజాప్రయోజన వ్యాజ్యంపై జరిగిన విచారణలో 7 వేల కానిస్టేబుల్ ఉద్యోగాలు భర్తీ చేస్తున్నట్లు ప్రత్యేక జీపీ తెలిపారు. దీనికి సంబంధించిన వివరాలు ఇవ్వాలని ధర్మసనం ఆదేశించింది.
మహిళపై అత్యాచారం ఘటనలో నిందితుడు అరెస్టు
సికింద్రాబాద్‌లోని మహంకాళి పీఎస్ పరిధిలో మహిళపై అత్యాచారం ఘటనలో నిందితుడిని పోలీసులు అరెస్టు చేశారు. మహిళల సమస్యలపై టీవీ షో కార్యక్రమం కోసం హైదరాబాద్ వచ్చిన మహిళను ఆఫీస్ అడ్రస్ చూపిస్తానంటూ తీసుకెళ్లి మరో వ్యక్తితో అత్యాచారం చేశాడు. బాధితురాలి ఫిర్యాదు మేరకు పోలీసులు నిందితుడిని అరెస్ట్ చేశారు.
కడియం శ్రీహరిపై ముఖ్యమంత్రికి ఫిర్యాదు చేసిన మంత్రి కొండా సురేఖ
కడియం శ్రీహరిపై సీఎం రేవంత్‌రెడ్డికి మంత్రి కొండా సురేఖ లేఖ ద్వారా ఫిర్యాదు చేశారు. మంత్రిగా తనకు సమాచారం ఇవ్వకుండా కడియం సమీక్ష చేశారని ఫిర్యాదులో పేర్కొన్నారు. నిన్న బొగ్గులకుంటలోని దేవదాయశాఖ కమిషనర్ కార్యాలయంలో కడియం సమీక్ష నిర్వహించడాన్ని ఆమె ఖండించారు. కడియం శ్రీహరి సమీక్షించడం పరిపాలనా వ్యవస్థకు విరుద్ధమని మంత్రి సురేఖ లేఖలో వివరించారు.
నాచారంలో బాలామృతం ప్లాంట్ ప్రారంభించిన సీఎం రేవంత్ రెడ్డి
నాచారంలో బాలామృతం ప్లాంట్‌ను సీఎం రేవంత్ రెడ్డి ప్రారంభించారు. ఫ్లాంట్ వద్దకు చేరుకున్న ముఖ్యమంత్రికి మంత్రి సీతక్క, ఎమ్మెల్యే బండారి లక్ష్మారెడ్డి స్వాగతం పలికారు. అనంతరం ముఖ్యమంత్రి బాలామృతం ప్లాంట్ ఆవరణలో మెుక్క నాటారు.
వనస్థలిపురం ఆటోనగర్ వద్ద కంటైనర్‌లో మంటలు
హైదరాబాద్ వనస్థలిపురం ఆటోనగర్ వద్ద కంటైనర్‌లో మంటలు చెలరేగాయి. డాల్డా లోడ్‌తో వస్తున్న కంటైనర్ ఇంజిన్‌లో షార్ట్‌సర్క్యూట్‌తో మంటలు వచ్చి, వాటి ధాటికి డీజిల్ ట్యాంక్ పేలింది. దీంతో కంటైనర్ ముందు భాగం దగ్ధమైంది. వెంటనే హయత్‌నగర్ అగ్నిమాపక సిబ్బంది కంటైనర్‌లో మంటలార్పారు.
48 సబ్ రిజిస్ట్రార్, 3 జిల్లా రిజిస్ట్రార్ ఆఫీస్‌ల నిర్మాణానికి అనుమతులు: పొంగులేటి
రాష్ట్రంలో 48 సబ్ రిజిస్ట్రార్, 3 జిల్లా రిజిస్ట్రార్ ఆఫీస్‌ల నిర్మాణానికి అనుమతులు మంజూరు చేశామని మంత్రి పొంగులేటి తెలిపారు. ఒకే నమూనా, ఆధునిక సౌకర్యాలతో ఈ భవనాల నిర్మాణం చేపట్టనున్నట్లు ప్రకటించారు. తహసీల్దార్, ఆర్డీవో, సబ్ రిజిస్ట్రార్ ఆఫీస్‌లకు శాశ్వత భవనాలు కల్పించడం కోసం రూ.97 కోట్లు కేటాయించినట్లు తెలిపారు.
ఏడో రోజు రైతు భరోసా పెట్టుబడి సాయం విడుదల
ఏడో రోజు 8 ఎకరాల రైతులకు రైతుభరోసా నిధులు విడుదల అయ్యాయి. 58,831 మంది రైతుల ఖాతాల్లో రూ.259.73 కోట్లు జమ అవుతున్నాయి. మొత్తం ఏడు రోజుల్లో రైతుభరోసా కింద రూ.7750.45 కోట్లు జమ చేశారు. ఇప్పటివరకు 68.96 లక్షల మంది రైతులకు రైతుభరోసా సాయం అందిందని మంత్రి తుమ్మల తెలిపారు.
కేటీఆర్ కుమారుడు హిమాన్షుకు స్వల్ప గాయం
కేటీఆర్ కుమారుడు హిమాన్షు ఆటలాడుతుండగా స్వల్ప గాయమైంది. ప్రస్తుతం హిమాన్షు ఏఐజీ ఆస్పత్రిలో చికిత్సపొందుతున్నాడు. ఇప్పటికే ఆసుపత్రికి కేటీఆర్, హరీశ్‌రావు చేరుకోగా కాసేపటి క్రితం కేసీఆర్ కూడా వచ్చి హిమాన్షును పరామర్శించారు.
గంజాయి రవాణాకు ఖమ్మం ప్రవేశమార్గంలా ఉంది: డీజీపీ సీవీ ఆనంద్
గంజాయి రవాణాకు ఖమ్మం ప్రవేశమార్గంలా ఉందని డీజీపీ సీవీ ఆనంద్ ఆందోళన వ్యక్తం చేశారు. ప్రవేశ మార్గాలను బ్లాక్ చేస్తే గంజాయి అరికట్టడం సాధ్యమేనని దీనిపై దృష్టి సారించాలని ఉమ్మడి ఖమ్మం జిల్లా పోలీసులకు సూచించారు. ఆయన ఇవాళ ఖమ్మంలో పర్యటించారు. నేర నియంత్రణ కేసుల దర్యాప్తు సమగ్రంగా ఉండాలని, నేరస్థులను అరెస్టు చేయడమే కాదు తగిన శిక్ష పడేలా చూడాలని సిబ్బందికి సూచించారు. సాంకేతికతను మరింత అందిపుచ్చుకోవాలని డీజీపీ తెలిపారు.
కాంట్రాక్టు, ఔట్‌సోర్సింగ్ ఉద్యోగులకు ఒకటో తారీఖున జీతాలు ఇవ్వాలి: సీఎం రేవంత్‌రెడ్డి
కాంట్రాక్టు, ఔట్‌సోర్సింగ్ ఉద్యోగులకు ప్రభుత్వ ఉద్యోగులతో పాటు ఒకటో తారీఖున జీతాలు ఇవ్వాలని సీఎం రేవంత్‌రెడ్డి ఆదేశించారు. కాంట్రాక్టు, ఔట్ సోర్సింగ్ ఉద్యోగుల సమస్యలపై ఇవాళ సమీక్ష జరిపారు. కాంట్రాక్టు, ఔట్‌సోర్సింగ్ ఉద్యోగుల వివరాలు డిజిటలైజ్ చేయాలని, సమయానికి జీతాలు ఇవ్వని ఏజెన్సీలపై కఠిన చర్యలు తీసుకోవాలని ఆదేశించారు.
ఫ్రాన్స్ అధ్యక్షుడు ఇమ్మాన్యుయెల్ మెక్రాన్‌కు తప్పిన పెను ప్రమాదం
ఫ్రాన్స్ అధ్యక్షుడు ఇమ్మాన్యుయెల్ మెక్రాన్‌కు పెను ప్రమాదం తప్పింది. సిరియా రాజధాని డమాస్కస్‌లో మెక్రాన్ బస చేసిన హోటల్ వద్ద పేలుడు జరిగింది. ఈ ఘటనలో నలుగురికి గాయాలయ్యాయి. సిరియా అధ్యక్షుడు అహ్మద్ అల్-షరాను కలిసేందుకు మెక్రాన్ హోటల్‌కు వెళ్లిన కొద్దిసేపటికే బయట పేలుడు జరిగింది.
మియాపూర్‌లో ప్రియుడితో కలిసి భర్తను చంపి పూడ్చి పెట్టిన భార్య
హైదరాబాద్ మియాపూర్‌లో ప్రియుడితో కలిసి భార్య, భర్తను చంపి పూడ్చి పెట్టిన ఘటన వెలుగుచూసింది. భర్త కనిపించడం లేదని గతేడాది నవంబర్‌లో మహిళ ఫిర్యాదు చేయగా దర్యాప్తు జరిపిన పోలీసులు భర్తను భార్యే చంపి.. మృతదేహాన్ని పూడ్చిపెట్టినట్లు గుర్తించారు. భార్య కాల్ రికార్డులు, సీసీ కెమెరాల ఫుటేజ్ ఆధారంగా పోలీసులు నిర్ధరించారు. మృతదేహాన్ని మహారాష్ట్ర సరిహద్దుకు తీసుకెళ్లి పూడ్చిపెట్టినట్లు గుర్తించారు.
దిల్లీ హైకోర్టులో కవిత పిటిషన్
టీఆర్‌ఎస్ పేరు విషయంలో ఎన్నికల కమిషన్ అభ్యంతరాలపై కల్వకంట్ల కవిత(Kavita Petition) దిల్లీ హైకోర్టును ఆశ్రయించింది. టీఆర్‌ఎస్ పేరును తన పార్టీ పేరుగా ఖరారు చేయాలని పిటిషన్లో ఆమె విజ్ఞప్తి చేశారు. బీఆర్ఎస్తో పాటు ఇతర పార్టీల నుంచి వచ్చిన ఫిర్యాదుల మేరకు ఈసీ తెలంగాణ రక్షణ సేన బదులు మరో పేరు తీసుకోవాలని ఇటీవల లేఖ రాసింది. దీనిపై కవిత కోర్టును ఆశ్రయించారు. అయితే ముందుగా జూన్ 23న ఈసీ ఇచ్చిన నోటీసుకు సమాధానం చెప్పాలని దిల్లీ హైకోర్టు సూచించింది.
గన్‌పార్క్ వద్ద విద్యార్థి సంఘాల జేఏసీ ఆందోళన
హైదరాబాద్ గన్‌పార్క్ వద్ద విద్యార్థి సంఘాల జేఏసీ ఆందోళన చేపట్టింది. ఫీజు రీయింబర్స్‌మెంట్ నిధులు వెంటనే విడుదల చేయాలని వారు డిమాండ్ చేశారు. ఫీజు రీయింబర్స్‌మెంట్ ఎత్తివేసేలా ఉన్న జీవోను రద్దు చేయాలని కోరుతూ బీసీ విద్యార్థి సంఘం ఆధ్వర్యంలో ట్యాంక్‌బండ్‌పై విద్యార్థులు ర్యాలీ చేపట్టారు. ఈ నిరసనల్లో ఆర్.కృష్ణయ్య, మాజీ మంత్రి శ్రీనివాస్ గౌడ్ పాల్గొన్నారు.
కాళేశ్వరం ప్రాజెక్టుపై కాంగ్రెస్ నేతలకు అవగాహన సమావేశం
కాళేశ్వరం ప్రాజెక్టుపై కాంగ్రెస్ నేతలకు అవగాహన సమావేశం జరిగింది. ప్రజాభవన్‌లో సీఎం రేవంత్‌రెడ్డి అధ్యక్షతన జరిగిన ఈ ప్రత్యేక సమావేశానికి మంత్రులు, ఎమ్మెల్యేలు, ఎంపీలు, ఎమ్మెల్సీలు, డీసీసీ అధ్యక్షులు హాజరయ్యారు. మేడిగడ్డ, అన్నారం, సుందిళ్ల బ్యారేజీల ఎన్‌డీఎస్‌ఏ నివేదికలపై మంత్రి ఉత్తమ్ పవర్‌పాయింట్ ప్రజెంటేషన్ ఇచ్చారు. బ్యారేజీల్లో గుర్తించిన లోపాలు, ప్రభుత్వ చర్యలపై నేతలకు అవగాహన కల్పించారు.
కాక్రోచ్ జనతా పార్టీ ఎక్స్ ఖాతాను పునరుద్ధరించాలని దిల్లీ హైకోర్టు ఆదేశం
కాక్రోచ్ జనతా పార్టీ ఎక్స్ ఖాతాను పునరుద్ధరించాలని దిల్లీ హైకోర్టు ఆదేశించింది. సీజేపీ ఎక్స్ ఖాతాను బ్లాక్ చేస్తూ కేంద్రం ఉత్తర్వులు రద్దు జారీ చేసింది. దీనిపై వారు దిల్లీ హైకోర్టును ఆశ్రయించారు. నీట్‌పై సీజేపీ నిరసనలు ముగిసినందున నిషేధం అవసరం లేదని దిల్లీ హైకోర్టు ఆదేశించింది.
సిద్ధాపూర్‌లో డంపింగ్‌యార్డు ఏర్పాటు చేయొద్దని బీఆర్‌ఎస్ ధర్నా
రంగారెడ్డి జిల్లా షాద్‌నగర్‌లోని ప్రధాన చౌరస్తాలో బీఆర్‌ఎస్ శ్రేణులు ధర్నాకు(BRS Dharna) దిగారు. సిద్ధాపూర్‌లో డంపింగ్‌యార్డు ఏర్పాటు చేయొద్దని బీఆర్‌ఎస్ శ్రేణులు డిమాండ్ చేస్తున్నాయి. కొత్తూరు మండలం సిద్ధాపూర్‌లో డంపింగ్‌యార్డ్ వద్దని, వేరేచోటుకు తరలించాలని వారు కోరుతున్నారు.
వయనాడ్‌లో మరోసారి విరిగిపడిన కొండచరియలు
కేరళ వయనాడ్‌లో మరోసారి కొండచరియలు(Landslide in Wayanad) విరిగిపడ్డాయి. వయనాడ్‌లో నిన్న రాత్రి నుంచి భారీ వర్షాలు కురుస్తున్నాయి. వయనాడ్‌లో అనక్కంపొయిల్- కల్లాడి సొరంగం నిర్మాణస్థలం వద్ద కొండచరియలు కూలిన ఘటనలో ఒకరు మృతిచెందగా, ఏడుగురికి గాయాలయ్యాయి. సొరంగం నిర్మాణ పనుల్లో ఉన్న ఏడుగురు కార్మికులు గల్లంతయ్యారు. ఈ ఘటనలో కొంతమంది కార్మికులను సహాయ సిబ్బంది రక్షించారు.
సట్లజ్ చిత్రం తొలగింపుపై సమాచార ప్రసార శాఖ వివరణ
జీ5 ఓటీటీ యాప్ నుంచి సట్లజ్ చిత్రం తొలగింపుపై సమాచార ప్రసార శాఖ వివరణ ఇచ్చింది. కేవలం అనుమతుల ఉల్లంఘన వల్లే చిత్రాన్ని తొలగించినట్లు వెల్లడించింది. అనుమతులు లేకుండానే చిత్రాన్ని ఓటీటీలో స్ట్రీమింగ్ చేశారని ఐ అండ్ బీ వెల్లడించింది. అనుమతులు వచ్చే వరకు స్ట్రీమింగ్ చేయొద్దని జీ5 ఓటీటీకి ఐ అండ్ బీ నోటీసులు ఇచ్చింది.
ఖైరతాబాద్‌లో కాంక్రీట్ మిక్సర్ వాహనదారుల ఆందోళన
ఖైరతాబాద్‌లో కాంక్రీట్ మిక్సర్ వాహనదారులు ఆందోళనకు దిగారు. ఆర్టీవో కార్యాలయాన్ని ముట్టడించారు. గేట్లు తోసుకుని కార్యాలయంలోకి వెళ్లేందుకు నిరసనకారులు ప్రయత్నం చేయగా, పోలీసులు వారిని అడ్డుకున్నారు. ఆర్టీవో అధికారులు అక్రమ జరిమానాలతో వేధిస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు.
రంగారెడ్డి: హ్యామ్ రోడ్ల పనులకు మంత్రి కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి శంకుస్థాపన
రంగారెడ్డి జిల్లా ఇబ్రహీంపట్నం మండలం తొర్రూరులో రూ.338 కోట్లతో నిర్మించే హ్యామ్‌రోడ్లకు మంత్రి కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి శంకుస్థాపన చేశారు. కార్యక్రమంలో ఎమ్మెల్యే మల్‌రెడ్డి రంగారెడ్డి, ఎంపీ చామల కిరణ్, ఈటల రాజేందర్, కొండా విశ్వేశ్వర్ రెడ్డి పాల్గొన్నారు.
38 మందికి మరణ శిక్ష, 11 మందికి జీవిత ఖైదు విధించిన గుజరాత్ హైకోర్టు
అహ్మదాబాద్ పేలుళ్ల కేసులో గుజరాత్ హైకోర్టు(Gujarat Highcourt Judgement) సంచలన తీర్పు వెలువరించింది. 38 మందికి మరణశిక్ష, 11 మందికి జీవితఖైదు విధించిన గుజరాత్ హైకోర్టు, దిగువ కోర్టు ఇచ్చిన తీర్పును సమర్థించింది. దిగువ కోర్టు తీర్పును సవాల్ చేస్తూ దాఖలైన అన్ని పిటిషన్లను కొట్టివేసింది. ఇండియన్ ముజాహిద్దీన్ సభ్యులకు విధించిన శిక్షలను సమర్థించింది. 2008 అహ్మదాబాద్‌లో వరుస పేలుళ్ల కేసులో 56 మంది మృతి చెందిన విషయం తెలిసిందే.
భారత్, ఇండోనేసియా స్నేహంలో కొత్త అధ్యాయం : ప్రధాని మోదీ
భారత్, ఇండోనేసియా మధ్య స్నేహం శతాబ్దాలుగా ఉందని ప్రధాని మోదీ పేర్కొన్నారు. భారత్, ఇండోనేసియా స్నేహంలో కొత్త అధ్యాయం మొదలైందన్నారు. రక్షణ, విపత్తు నిర్వహణ, పారిశ్రామికరంగంలో రెండు దేశాలు పరస్పరం సహకరించుకుంటాయన్న మోదీ, సముద్ర భద్రత, రక్షణ సహకారంపై భారత్- ఇండోనేషియా మధ్య ఒప్పందం కుదిరిందని తెలిపారు. రెండు దేశాల్లో వైద్య సేవలు మెరుగ్గా ఉన్నాయని, వైద్య రంగంలోనూ సహకరించుకోవాలన్నారు. వ్యవసాయ సాంకేతిక పరిజ్ఞానంలో ఇండోనేసియా సహకారం తీసుకుంటామన్న ఆయన, ఏఐ, డిజిటల్ టెక్నాలజీ, స్టార్టప్‌లలో ఇండోనేసియాతో కలిసి పని చేస్తామని స్పష్టం చేశారు.
ఇండోనేసియాలో ప్రధాని మోదీకి మరో అరుదైన గౌరవం
ఇండోనేసియాలో ప్రధాని మోదీకి మరో అరుదైన గౌరవం దక్కింది. 'బింటాంగ్ ఆదిపూర్ణ ఆఫ్ రిపబ్లిక్ ఆఫ్ ఇండోనేసియా'తో మోదీని అధ్యక్షుడు సత్కరించారు.
కామారెడ్డి : మద్నూరులో ఆరేళ్ల బాలిక దుర్గ అపహరణ కలకలం
కామారెడ్డి జిల్లా మద్నూరులో ఆరేళ్ల బాలిక దుర్గ అపహరణ కలకలం రేపింది. సోమవారం మద్నూర్‌లో వారసంతకు చిన్నారితో వచ్చిన మీర్జాపూర్ వాసి హన్మంత్, మిర్చి బండి వద్ద కుమార్తెతో కలిసి బజ్జీలు తింటుండగా చిన్నారి అదృశ్యమైంది. తండ్రి దృష్టిని మరల్చి ఆరేళ్ల బాలికను దుండగుడు అపహరించాడు. సీసీ కెమెరాల ఫుటేజీ, స్థానికులు ఇచ్చిన సమాచారం మేరకు పోలీసుల గాలింపు చేపట్టారు. మహారాష్ట్రకు చెందిన వ్యక్తి బాలికను అపహరించినట్లు పోలీసులు అనుమానం వ్యక్తం చేస్తున్నారు. కిడ్నాపర్ కోసం మహారాష్ట్రలోని దెగ్లూరులో గాలిస్తున్నారు.
మాజీ ఎమ్మెల్యే కొమ్మిడి నరసింహారెడ్డి మృతి పట్ల కాంగ్రెస్ నేతల సంతాపం
మాజీ ఎమ్మెల్యే కొమ్మిడి నరసింహారెడ్డి మృతి పట్ల కాంగ్రెస్ నేతలు సంతాపం తెలిపారు. మహేశ్ కుమార్ గౌడ్, ఎంపీ చామల ఆయనకు నివాళులు అర్పించారు.
ఇండోనేసియాలో ప్రధాని మోదీ పలు కీలక ఒప్పందాలు
ఇండోనేసియాలో ప్రధాని మోదీ ఆధ్వర్యంలో పలు కీలక ఒప్పందాలు కుదిరాయి. ఇండోనేసియాలో ఈవీఎంల అభివృద్ధికి భారత్ మద్దతు ఇవ్వనుండగా, భారత్ నుంచి ఆస్ట్రా క్షిపణులు దిగుమతి చేసుకోవాలని ఇండోనేసియా నిర్ణయం తీసుకుంది. ఇండోనేసియాలో ఉక్కు, నికెల్, అయస్కాంతాల తయారీలో భారత్ పెట్టుబడి పెట్టనుంది. మలక్కా జలసంధి పరిధిలో సబాంగ్ పోర్టు సంయుక్తంగా అభివృద్ధి చేసేలా ఒప్పందం కుదిరింది.
రెండ్రోజుల భారీ వర్షాల నుంచి ముంబయి వాసులకు కాస్త ఉపశమనం
రెండ్రోజుల భారీ వర్షాల నుంచి ముంబయి వాసులకు కాస్త ఉపశమనం కలిగింది. ముంబయిలో ఇవాళ వర్షాలు తెరిపినిచ్చాయి. దీంతో అధికారులు లోకల్ ట్రైన్ సర్వీసులను పునరుద్ధరించారు. మరోవైపు ఐఎండీ ఇవాళ ఆరెంజ్ అలర్ట్ ప్రకటించింది. గురువారం వరకు పాఠశాలలకు సెలవులు ప్రకటించగా, ముంబయిలో పలుచోట్ల కూలిన గోడలు, ప్రకటనల హోర్డింగ్‌లు తొలగిస్తున్నారు.
ఉత్తర్‌ప్రదేశ్: అయోధ్య రామాలయం ఆర్థిక వివరాలు బహిర్గతం
ఉత్తర్‌ప్రదేశ్: అయోధ్య రామాలయం ఆర్థిక వివరాలు బహిర్గతం చేశారు. విరాళాలపై ఆరోపణలు, సిట్ విచారణ దృష్ట్యా శ్రీరామజన్మభూమి తీర్థ్‌ట్రస్ట్ ఆర్థిక వివరాలు వెల్లడించింది. అయోధ్య గుడికి ఇప్పటి వరకు రూ.3,264 కోట్ల విరాళాలు వచ్చినట్లు తెలిపింది. ఆలయ అభివృద్ధికి రూ.2,761 కోట్లు ఖర్చు చేయగా, మిగిలిన నిధులు ఇతర పనుల కోసం ట్రస్ట్ వద్దే భద్రంగా ఉన్నట్లు వెల్లడించింది. ఆలయంలో బంగారం, వెండి కానుకలు ఎక్కడికి పోలేదని ట్రస్ట్ స్పష్టం చేసింది.
మధ్యప్రదేశ్: మైహార్ జిల్లాలో ఘోర రోడ్డుప్రమాదం, ఐదుగురు మృతి
మధ్యప్రదేశ్‌లోని మైహార్ జిల్లాలో ఘోర రోడ్డు ప్రమాదం చోటుచేసుకుంది. ఘటనలో ఐదుగురు మృతి చెందారు. ట్రక్కును ఎస్‌యూవీ వాహనం ఢీకొనడంతో ప్రమాదం జరిగింది.
నాటింగ్‌హామ్ : నేడు ఇంగ్లాండ్‌తో భారత్ మూడో టీ 20 మ్యాచ్
నాటింగ్‌హామ్ : నేడు ఇంగ్లాండ్‌తో భారత్ మూడో టీ20 మ్యాచ్ ఆడనుంది. నాటింగ్‌హామ్‌లో రాత్రి 10 గంటలకు భారత్, ఇంగ్లాండ్ మ్యాచ్ ప్రారంభం కానుంది. 5 టీ-20 మ్యాచ్‌ల సిరీస్‌లో ఇంగ్లాండ్ ఇప్పటికే 1-0 ఆధిక్యంలో ఉంది.
నేడు ఖమ్మంలో డీజీపీ సీవీ ఆనంద్ పర్యటన
నేడు ఖమ్మంలో డీజీపీ సీవీ ఆనంద్ పర్యటించనున్నారు. ఖమ్మం కమిషనరేట్ ప్రాంగణంలో రహదారి భద్రత అవగాహన కేంద్రాన్ని డీజీపీ ప్రారంభించనున్నారు. ఖమ్మం జిల్లాలో హెల్మెట్లు పంపిణీ చేయనున్నారు. అనంతరం వనమహోత్సవం కార్యక్రమంలో డీజీపీ సీవీ ఆనంద్ పాల్గొననున్నారు.
సనత్‌నగర్: డీసీపీ రమణారెడ్డి ఆధ్వర్యంలో నిర్బంధ తనిఖీలు
సనత్‌నగర్ డీసీపీ రమణారెడ్డి ఆధ్వర్యంలో నిర్బంధ తనిఖీలు నిర్వహించారు. పర్థివాడ, ఫతేనగర్‌లో అక్రమ మద్యం విక్రయాలపై దాడులు జరిపారు. రెండు బెల్ట్ షాపులపై కేసులు నమోదు చేసి పోలీసులు ఇద్దరు అరెస్టు చేశారు. అనంతరం 25 లీటర్ల మద్యం, 82 మద్యం బాటిళ్లు స్వాధీనం చేసుకున్నారు. గంజాయి సేవిస్తున్నారనే అనుమానంతో దాడులు నిర్వహించి 15 మందిని అదుపులోకి తీసుకున్నారు. హెచ్‌న్యూ టీమ్ పరీక్షల్లో ఐదుగురికి పాజిటివ్‌గా నిర్ధారణ అయింది. సరైన పత్రాలు లేని 35 బైకులు, 5 ఆటోలు సీజ్ చేశారు.
నేడు ప్రజాభవన్‌లో కాంగ్రెస్ నాయకుల సమావేశం
నేడు ప్రజాభవన్‌లో కాంగ్రెస్ నాయకుల సమావేశం కానున్నారు. ఇరిగేషన్ ప్రాజెక్టులపై, కాళేశ్వరం కుంగుబాటు, ఎన్‌డీఎస్‌ఏ నివేదికలు, సాంకేతిక అంశాలపై మంత్రి ఉత్తమ్ అవగాహన కల్పించనున్నారు. భేటీలో మంత్రులు, ఎమ్మెల్యేలు, ఎంపీలు, ఎమ్మెల్సీలు, డీసీసీ అధ్యక్షులు, సీనియర్ నాయకులు పాల్గొననున్నారు. సీఎం, డిప్యూటీ సీఎం, పీసీసీ అధ్యక్షుడు పాల్గొనే అవకాశం ఉంది.
టీజీ 20: ఉత్కంఠభరిత మ్యాచ్‌లో హైదరాబాద్ ఈ ఛాంపియన్స్ విజయం
టీజీ 20లో ఉత్కంఠభరిత మ్యాచ్‌లో నల్గొండ నైట్స్‌పై 5 వికెట్ల తేడాతో హైదరాబాద్ ఈ ఛాంపియన్స్ ఘనవిజయం సాధించారు.
అసెంబ్లీ కమిటీలు ప్రకటించిన ప్రభుత్వం
అసెంబ్లీ కమిటీలను ప్రభుత్వం ప్రకటించింది. 13 మంది సభ్యులతో సెలెక్ట్ కమిటీని ఏర్పాటు చేసింది. దీనికి ఛైర్మన్‌గా మంత్రి పొన్నంను నియమించింది. కడియం శ్రీహరి ఛైర్మన్‌గా 11 మంది సభ్యులతో జాయింట్ కమిటీని ఏర్పాటు చేసింది. స్పీకర్ ప్రసాద్ కుమార్ ఛైర్మన్‌గా 11 మంది సభ్యులతో అమినిటీస్ కమిటీని నియమించింది. మేడిపల్లి సత్యం ఛైర్మన్‌గా 11 మంది సభ్యులతో ఎస్సీ వెల్ఫేర్ కమిటీని ఏర్పాటు చేసింది. పాయం వెంకటేశ్వర్లు అధ్యక్షతన 11 మంది సభ్యులతో ఎస్టీ వెల్ఫేర్ కమిటీని ఏర్పాటు చేసింది. మక్కన్‌సింగ్ రాజ్ ఠాకూర్ నేతృత్వంలో 11 మంది సభ్యులతో బీసీ సంక్షేమ కమిటీని నియమించింది. మట్టా రాగమయి ఛైర్మన్‌గా 11 మంది సభ్యులతో లైబ్రరీ కమిటీని నియమించింది. చిట్టెం పర్ణిక రెడ్డి అధ్యక్షతన 11 మంది సభ్యులతో స్త్రీ, శిశు సంక్షేమ కమిటీని ఏర్పాటు చేసింది. లక్ష్మీకాంతరావు ఛైర్మన్‌గా 11 మంది సభ్యులతో మైనార్టీ సంక్షేమ కమిటీ ఏర్పాటు చేసింది.
స్పీకర్ ప్రసాద్ అధ్యక్షులుగా 11 మంది సభ్యులతో వైల్డ్‌లైఫ్, ఎన్విరాన్‌మెంట్ ప్రొటెక్షన్ కమిటీని ఏర్పాటు చేసింది. డిప్యూటీ స్పీకర్ ఛైర్మన్‌గా ఏడుగురు సభ్యులతో పిటిషన్స్ కమిటీని ఏర్పాటు చేసింది. డిప్యూటీ స్పీకర్ ఛైర్మన్‌గా ఏడుగురు సభ్యులతో ప్రివిలేజ్ కమిటీని నియమించింది. పటోళ్ల సంజీవ్‌రెడ్డి ఛైర్మన్‌గా ఏడుగురు సభ్యులతో హామీల కమిటీని నియమించింది. ఏడుగురు సభ్యులతో రూల్స్ కమిటీని ఏర్పాటు చేసి ఛైర్మన్‌గా స్పీకర్ ప్రసాద్‌కుమార్‌ను నియమించింది. ఐదుగురు సభ్యులతో కౌన్సిల్‌లో పిటిషన్స్ కమిటీని ఏర్పాటు చేసి, ఛైర్మన్‌గా డిప్యూటీ ఛైర్మన్‌ను నియమించింది. ఐదుగురు సభ్యులతో మండలి ప్రివిలేజ్ కమిటీని ఏర్పటు చేసి, ఛైర్మన్‌గా డిప్యూటీ ఛైర్మన్‌ను నియమించింది. ఐదుగురు సభ్యులతో మండలి హామీల కమిటీ, ఛైర్మన్‌గా శంకర్‌నాయక్‌ను నియమించింది. పది మంది సభ్యులతో మండలి రూల్స్ కమిటీ ఏర్పాటు చేసి, ఛైర్మన్‌గా గుత్తా సుఖేందర్‌రెడ్డిని నియమించింది. ఐదుగురు సభ్యులతో మండలి ఎథిక్స్ కమిటీ ఏర్పాటు చేసి, ఛైర్మన్‌గా మహేశ్‌కుమార్‌గౌడ్‌ను నియమించింది.

