ETV Bharat / state

6th August 2026 AP News Today Live Updates : జీఎంఆర్ గ్రూప్ ఛైర్మన్ జీ.ఎం.రావును కలిసిన ఎంపీ కలిశెట్టి అప్పలనాయుడు

6th August 2026 AP News Today
6th August 2026 AP News Today (ETV Bharat)
author img

By ETV Bharat Andhra Pradesh Team

Published : August 6, 2026 at 7:00 AM IST

|

Updated : August 6, 2026 at 10:51 PM IST

Choose ETV Bharat

6th August 2026 AP News Today Live Updates : ఎంపీ కలిశెట్టి అప్పలనాయుడు కుటుంబసభ్యులతో కలిసి జీఎంఆర్ గ్రూప్ ఛైర్మన్ జీ.ఎం.రావును కలిశారు. భోగాపురం ఎయిర్‌పోర్టు నిర్మించినందుకు జీ.ఎం.రావుకు ఎంపీ కలిశెట్టి ధన్యవాదాలు తెలిపారు.

LIVE FEED

10:37 PM, 6 Aug 2026 (IST)

జీఎంఆర్ గ్రూప్ ఛైర్మన్ జి.ఎం.రావును కలిసిన ఎంపీ కలిశెట్టి అప్పలనాయుడు

ఎంపీ కలిశెట్టి అప్పలనాయుడు కుటుంబసభ్యులతో కలిసి జీఎంఆర్ గ్రూప్ ఛైర్మన్ జీ.ఎం.రావును కలిశారు. భోగాపురం ఎయిర్‌పోర్టు నిర్మించినందుకు జీ.ఎం.రావుకు ఎంపీ కలిశెట్టి ధన్యవాదాలు తెలిపారు.

3:38 PM, 6 Aug 2026 (IST)

కేంద్రమంత్రి గజేంద్రసింగ్‌ను కలిసిన ఎంపీ సతీష్‌

దిల్లీలో కేంద్రమంత్రి గజేంద్రసింగ్‌ను ఎంపీ సతీష్‌ కలిసి వినతిపత్రం అందజేశారు. పంచారామ క్షేత్రాలను జాతీయ టెంపుల్ టూరిజం సర్క్యూట్‌గా అభివృద్ధి చేయాలని విజ్ఢప్తి చేశారు. స్వదేశ్ దర్శన్ 2.0లో పంచారామ శివ టెంపుల్ సర్క్యూట్'ను చేర్చాలని కోరారు. పంచారామ క్షేత్రాలను ఒకే పర్యాటక సర్క్యూట్‌గా అభివృద్ధి చేయాలని, పంచారామ శివ సర్క్యూట్‌కు ప్రత్యేక డీపీఆర్ రూపొందించాలని కేంద్రానికి ప్రతిపాదన చేశారు.

3:36 PM, 6 Aug 2026 (IST)

అగ్రిగోల్డ్​ బాధితులకు త్వరగా న్యాయం చేయాలి

అగ్రిగోల్డ్ బాధితులకు సత్వరమే న్యాయం జరిగేలా చర్యలు వేగవంతం చేయాలని అధికారులను ముఖ్యమంత్రి చంద్రబాబు ఆదేశించారు. అమరావతిలో జరిగిన మంత్రివర్గ సమావేశం ముగిసిన అనంతరం సహచర మంత్రులతో ముఖ్యమంత్రి పలు కీలక అంశాలపై చర్చించారు. అగ్రిగోల్డ్ బాధితుల్ని ఆదుకునేందుకు ప్రభుత్వ చర్యలను అడ్డుకునేందుకు కొందరు న్యాయస్థానాలను ఆశ్రయించేందుకు యత్నిస్తున్నారని, ఈ విషయంలో చాలా కఠినంగా వ్యవహరిస్తూ ఎక్కడికక్కడ ఆస్తులను వేలం (ఆక్షన్) వేసి బాధితులకు త్వరగా న్యాయం చేయాలని స్పష్టం చేశారు. కేంద్ర ప్రభుత్వం పిలుపునిచ్చిన ‘2047 వికసిత్ భారత్’ లక్ష్యానికి అనుగుణంగా, రాష్ట్రంలో స్వాతంత్య్ర దినోత్సవ వేడుకలను ‘స్వర్ణాంధ్ర విజన్ 2047’ ప్రతిబింబించేలా ఘనంగా నిర్వహించాలని సూచించారు. ఎగువ ప్రాంతాల నుంచి వస్తున్న వరద నీటిని సమర్థవంతంగా వినియోగించుకుంటూ తాగునీటి ఎద్దడిని పూర్తిగా అధిగమించాలని, ఆ తర్వాత ప్రాధాన్యతగా పశుగ్రాసం కొరత లేకుండా చర్యలు తీసుకోవాలని మంత్రులకు దిశానిర్దేశం చేశారు.

3:35 PM, 6 Aug 2026 (IST)

కొత్త కార్మిక చట్టాల అమలుకు తుది నోటిఫికేషన్

కొత్త కార్మిక చట్టాల అమలుకు రాష్ట్ర ప్రభుత్వం తుది నోటిఫికేషన్ ఇచ్చింది. ఏడు చాప్టర్లతో కొత్త కార్మిక చట్టాల రూపకల్పన, అమలుకు శ్రీకారం చుట్టింది.

2:23 PM, 6 Aug 2026 (IST)

వెయిట్‌లిఫ్టర్ అజయ్ బాబుకు సన్మానం

కామన్వెల్త్ గేమ్స్ రజత పతక విజేత వల్లూరి అజయ్ బాబుకు విజయవాడలో ఘన సన్మానం జరిగింది. శాప్ కార్యాలయంలో నిర్వహించిన ఈ కార్యక్రమంలో శాప్ ఛైర్మన్ రవినాయుడు, వీసీ అండ్ ఎండీ భరణి పాల్గొని ఆయనను దుశ్శాలువాతో సత్కరించారు.

2:22 PM, 6 Aug 2026 (IST)

యూట్యూబర్ ప్రశ్నా రావణ్ కస్టడీ విచారణ వాయిదా

యూట్యూబర్ ప్రశ్నా రావణ్ కస్టడీ పిటిషన్‌పై గన్నవరం కోర్టులో విచారణ జరిగింది. ప్రాసిక్యూషన్ తరఫు న్యాయవాది తమ వాదనలను వినిపించారు. దీంతో తదుపరి విచారణను కోర్టు సోమవారానికి వాయిదా వేసింది. నిందితుడు జోసెఫ్ ప్రస్తుతం నెల్లూరు సెంట్రల్ జైలులో జ్యుడీషియల్ రిమాండ్‌లో ఉన్నారు.

2:22 PM, 6 Aug 2026 (IST)

ముగిసిన రాష్ట్ర కేబినెట్ భేటీ

ముఖ్యమంత్రి చంద్రబాబు అధ్యక్షతన జరిగిన రాష్ట్ర మంత్రివర్గ సమావేశం ముగిసింది. మూడున్నర గంటలకు పైగా జరిగిన ఈ భేటీలో పలు కీలక నిర్ణయాలకు ఆమోదం తెలిపారు. ఈజ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్ యాక్ట్-2026, ఏపీ పీపీపీ పాలసీ-2026 ముసాయిదాకు ఆమోదం పలికారు. దిశా, ల్యాండ్ గ్రాబింగ్ చట్టాలను ఉపసంహరించి మరిన్ని పటిష్ఠ చట్టాలు తేవాలని నిర్ణయించారు. రెండు కొత్త ప్రైవేట్ విశ్వవిద్యాలయాలకు అనుమతి ఇచ్చారు. కొత్త జిల్లాల కోసం 15 డీఈవో పోస్టుల సృష్టికి ఓకే చెప్పారు. అమరావతి క్వాంటమ్ వ్యాలీ ట్విన్ టవర్స్ నిర్మాణ పనులను ఎల్‌అండ్‌టీకి అప్పగించేందుకు రూ.1,002.49 కోట్లకు ఆమోదం తెలిపారు. 'అమరావతి ఐ' ప్రాజెక్టు రీ-టెండర్లు, పాదచారుల భద్రత పాలసీ-2026కు ఆమోదముద్ర వేశారు. గోదావరి పుష్కరాల ఘాట్ల అభివృద్ధి కోసం రూ.210.06 కోట్లు కేటాయించారు.

2:21 PM, 6 Aug 2026 (IST)

విజయవాడ సెంట్రల్‌లో తీవ్ర ఉద్రిక్తత

విజయవాడ సెంట్రల్ నియోజకవర్గంలో ఉద్రిక్త వాతావరణం నెలకొంది. డీఎస్సీలో అవకతవకలు జరిగాయంటూ ముత్యాలంపాడు వద్ద వైఎస్సార్సీపీ శ్రేణులు దీక్షకు దిగాయి. అనుమతి లేకుండా నిరసనలు చేపట్టడంపై టీడీపీ నేతలు ఆగ్రహం వ్యక్తం చేశారు. సీఎం చంద్రబాబు, మంత్రి లోకేశ్‌లను దూషించారంటూ నిరసనకు దిగారు. ఇరువర్గాల మధ్య గొడవ జరగడంతో బొండా ఉమ అక్కడికి చేరుకున్నారు. రెండు పార్టీల నాయకులు పరస్పర నినాదాలు చేసుకోవడంతో వాతావరణం వేడెక్కింది. పోలీసులు సకాలంలో స్పందించి పరిస్థితిని అదుపులోకి తెచ్చారు.

2:20 PM, 6 Aug 2026 (IST)

డీఎస్సీపై వైఎస్సార్సీపీ అనవసర రాద్ధాంతం: బొండా ఉమ

డీఎస్సీ అంశంపై వైఎస్సార్సీపీ అనవసర రాద్ధాంతం చేస్తోందని ఎమ్మెల్యే బొండా ఉమ విమర్శించారు. కష్టపడి సాధించుకున్న ఉద్యోగాలను జగన్ నాశనం చేయాలని చూస్తున్నారని మండిపడ్డారు. చర్చకు రావాలని మంత్రి లోకేశ్ సవాల్ విసిరినా ఎవరూ రాలేదన్నారు. నిరసన శిబిరం తొలగించకపోవడంతోనే తాను అక్కడికి వెళ్లానని చెప్పారు. లోకేశ్‌ను అనవసరంగా దూషిస్తే చూస్తూ ఊరుకోమని, వైఖరి మార్చుకోకపోతే ఇంటికి వెళ్లి బుద్ధి చెబుతామని హెచ్చరించారు.

2:19 PM, 6 Aug 2026 (IST)

నంద్యాల సబ్ రిజిస్ట్రార్ కార్యాలయంలో ఏసీబీ సోదాలు

నంద్యాల సబ్ రిజిస్ట్రార్ ఆఫీసులో ఏసీబీ అధికారులు తనిఖీలు చేపట్టారు. అక్కడ పనిచేసే సీనియర్ అసిస్టెంట్ గోపాల్‌రావు నివాసంలో సోదాలు జరుపుతున్నారు. కర్నూలులోని ఆయన ఇంట తనిఖీలు కొనసాగుతున్నాయి. ఆదాయానికి మించిన ఆస్తులు ఉన్నాయనే ఆరోపణలతో ఈ దాడులు నిర్వహించారు. నంద్యాల కార్యాలయంలో పలు కీలక దస్త్రాలను అధికారులు పరిశీలిస్తున్నారు.

2:02 PM, 6 Aug 2026 (IST)

టీడీపీ, వైఎస్సార్సీపీ పరస్పర నినాదాలతో వేడెక్కిన వాతావరణం

విజయవాడ సెంట్రల్ నియోజకవర్గంలో తీవ్ర ఉద్రిక్తత చోటుచేసుకుంది. డీఎస్సీలో అవకతవకలు జరిగాయంటూ ముత్యాలంపాడులో వైఎస్సార్సీపీ దీక్షకు వ్యతిరేకంగా టీడీపీ నాయకులు నిరసకు దిగారు. చంద్రబాబు, లోకేశ్‌పై దుర్భాషలాడారంటూ వైఎస్సార్సీపీ శ్రేణలపై ఆగ్రహం వ్యక్తం చేశారు. ఇరువర్గాల బాహాబాహీతో శిబిరం వద్దకు వచ్చిన ఎమ్మెల్యే బొండా ఉమా వచ్చారు. ఇరువర్గాలు ఒకేచోట చేరుకోవడం, పరస్పర నినాదాలతో ఉద్రిక్త వాతావరణం నెలకొంది. పోలీసులు పరిస్థితిని అదుపులోకి తీసుకొచ్చారు.

1:57 PM, 6 Aug 2026 (IST)

యాడికిలో ఉద్రిక్తత

డీఎస్సీలో అక్రమాలు జరిగాయంటూ అనంతపురం జిల్లా యాడికి మండలంలో వైఎస్సార్సీపీ నాయకులు దీక్షకు దిగారు. ఎలాంటి అనుమతులు లేకుండా వైఎస్సార్సీపీ నేతలు దీక్షలు చేయడమేంటని టీడీపీ నాయకులు సైతం నిరసన తెలిపారు. ఇరుపార్టీల నాయకులు, కార్యకర్తలు ఒకేచోట బైఠాయించడంతో పరిస్థితి ఉద్రిక్తంగా మారింది. పోలీసులు రంగంలోకి దిగి ఇరువర్గాలకు సర్దిచెప్పి పరిస్థితిని అదుపులోకి తెచ్చేందుకు ప్రయత్నిస్తున్నారు.

1:10 PM, 6 Aug 2026 (IST)

దేవదాయ శాఖ మంత్రిని కలిసిన శ్రీశైలం ఆలయ ఛైర్మన్, ఈవో

విజయవాడలో దేవదాయ శాఖ మంత్రిని శ్రీశైలం ఆలయ ఛైర్మన్, ఈవో మర్యాదపూర్వకంగా కలిశారు. రేపటి నుంచి శ్రీశైలంలో వరుణ యాగ సహిత సహస్ర ఘటాభిషేకంలో పాల్గొనాలని మంత్రిని ఆహ్వానించారు. ఈ సందర్భంగా మంత్రికి ఛైర్మన్, ఈవో ఆహ్వాన పత్రికను అందజేశారు. వర్షాభావ పరిస్థితులు తొలగి సమృద్ధిగా వర్షాలు కురవాలని శ్రీశైలంలో వరుణ యాగాలు నిర్వహిస్తున్నట్లు తెలిపారు. ఈనెల 10 న మల్లికార్జున స్వామికి సహస్ర ఘటాభిషేకం నిర్వహిస్తున్నట్లు తెలిపారు

1:06 PM, 6 Aug 2026 (IST)

రాజమహేంద్రవరంలో పీజీ విద్యార్థినిని కారుతో ఢీకొట్టిన ఘటనపై పోలీసుల దర్యాప్తు

రాజమహేంద్రవరంలో పీజీ విద్యార్థినిని కారుతో ఢీకొట్టిన ఘటనపై పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. ఘటనపై ప్రకాశ్‌నగర్ పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. ఈనెల 3న వైద్య విద్యార్థులను కారుతో ఢీకొట్టారని డీఎస్పీ సుభాశ్​ తెలిపారు. నిందితులు ఉద్దేశపూర్వకంగా వేగంగా కారు నడిపి స్కూటీని ఢీ కొట్టారన్నారని, స్కూటీపై ఉన్న ఇద్దరు విద్యార్థులకు తీవ్రగాయాలయ్యాయని తెలిపారు. ఘటనలో వైద్యవిద్యార్థి ప్రియాంక తలకు తీవ్రగాయమైందని, ప్రస్తుతం ప్రియాంక వెంటిలేటర్‌పై చికిత్స పొందుతున్నారని చెప్పారు. నిందితులు దస్వంత్, ఆండ్రూ జోసెఫ్​గా గుర్తించినట్లు తెలిపారు. నిందితులు మద్యం సేవించి మాల్‌లోకి వచ్చారని, తనిఖీ చేసిన మాల్ సిబ్బంది మద్యం సేవించినందున అనుమతించలేదన్నారు. బయటకు వెళ్తూ గేటు వద్ద స్కూటీని ఢీకొట్టారని, నిందితులను అదుపులోకి తీసుకుని కేసు నమోదు చేశామని డీఎస్పీ సుభాశ్​ వివరించారు.

1:04 PM, 6 Aug 2026 (IST)

మల్లాది విష్ణు, వైఎస్సార్సీపీ శ్రేణులను అదుపులోకి తీసుకున్న పోలీసులు

విజయవాడలో ప్రజలను ఇబ్బందులకు గురిచేసినందుకు మల్లాది విష్ణు, వైఎస్సార్సీపీ శ్రేణులను పోలీసులు అరెస్టు చేశారు.

12:17 PM, 6 Aug 2026 (IST)

వేగంగా కారు నడపడం వల్లే ఘటన జరిగింది: డీఎస్పీ సుభాశ్​

రాజమహేంద్రవరంలో వేగంగా కారు నడపడం వల్లే ఘటన జరిగిందని డీఎస్పీ సుభాశ్​ తెలిపారు. కావాలనే కారుతో ఢీకొట్టినట్లు అనుకోవట్లేదన్నారు. యువకులకు నేర ప్రవృత్తి ఏమీ లేదని, ప్రస్తుతానికి పరారీలో ఉన్నట్లు తెలిపారు. యువకుల పేర్లు తెలిశాయని, వారిని పట్టుకొని విచారణ చేస్తామన్నారు. యువకుల పేరుతో పాటు కారును కూడా గుర్తించినట్లు పేర్కొన్నారు. యువకులు మద్యం మత్తులో ఉన్నట్లు గుర్తించామని, సినిమా చూసి వెళ్తుండగా ప్రమాదం జరిగిందని డీఎస్పీ తెలిపారు. యువకులు కూడా సినిమా చూసేందుకు వెళ్లారని, మద్యం మత్తులో ఉండటం వల్ల గేటు వద్దే యాజమాన్యం అడ్డుకుందని వివరించారు.

12:15 PM, 6 Aug 2026 (IST)

మాజీ ఎమ్మెల్యే పెద్దారెడ్డిని అడ్డుకున్న పోలీసులు

మాజీ ఎమ్మెల్యే కేతిరెడ్డి పెద్దారెడ్డిని పోలీసులు అడ్డుకున్నారు. డీఎస్సీలో అక్రమాలు జరిగాయంటూ వైఎస్సార్సీపీ నిరసనకు పిలుపునిచ్చింది. ఇందులో భాగంగా యాడికిలో జరిగే నిరసన కార్యక్రమానికి వెళ్లేందుకు పెద్దారెడ్డి సిద్ధమయ్యారు. ఈ సమాచారం అందుకున్న పోలీసులు తాడిపత్రిలోని ఆయన నివాసానికి చేరుకున్నారు. ఆయన బయటకు వెళ్లకుండా ఇంటి వద్దే అడ్డుకున్నారు.

12:13 PM, 6 Aug 2026 (IST)

లంచం తీసుకుంటూ పట్టుబడిన సర్వేయర్

అనకాపల్లి జిల్లా మైన్స్ కార్యాలయంలో ఏసీబీ అధికారులు తనిఖీలు చేపట్టారు. ఈ దాడుల్లో మైనింగ్ సర్వేయర్ మురళి ఏసీబీకి చిక్కాడు. ఓ క్వారీ సర్వే రిపోర్ట్ ఇచ్చేందుకు ఆయన రూ.15 లక్షలు లంచం డిమాండ్ చేశాడు. ముందుగా అడ్వాన్స్ రూపంలో రూ.5 లక్షలు తీసుకుంటున్నాడు. ఆ సమయంలో ఏసీబీ అధికారులు రెడ్‌హ్యాండెడ్‌గా పట్టుకున్నారు. నిందితుడిని అదుపులోకి తీసుకుని దర్యాప్తు చేస్తున్నారు.

12:13 PM, 6 Aug 2026 (IST)

మంత్రులతో నారా లోకేశ్ బ్రేక్‌ఫాస్ట్ భేటీ

కేబినెట్ సమావేశానికి ముందు మంత్రులతో నారా లోకేశ్ బ్రేక్‌ఫాస్ట్ భేటీ నిర్వహించారు. స్థానిక సంస్థల ఎన్నికలు సమయానికే జరుగుతాయన్నారు. వీటికి సన్నద్ధం కావాలని మంత్రులకు పిలుపునిచ్చారు. స్థానిక సంస్థల్లో మెజారిటీ స్థానాలు కూటమి గెలవాలని సూచించారు. గత ప్రభుత్వ విధ్వంసాన్ని, కూటమి అభివృద్ధిని ప్రజలకు వివరించాలన్నారు. ప్రతి ఇంటి దగ్గర 3 నిమిషాలు ఉండి కేటాయించాలని దిశానిర్దేశం చేశారు. అసెంబ్లీలో చర్చించాల్సిన అంశాలపై మంత్రులతో చర్చించారు. ఎల్‌నినో పరిస్థితులను అసెంబ్లీ వేదికగా ప్రజలకు వివరిద్దామన్నారు. జలాశయాలకు వరద రావడం ఊరటనిచ్చే అంశమన్నారు. తాగునీరు, పశుగ్రాసానికి తొలి ప్రాధాన్యం ఇవ్వాలని సూచించారు. ప్రజా సమస్యల పరిష్కారానికి అసెంబ్లీని వేదికగా చేసుకుందామని లోకేశ్ స్పష్టం చేశారు.

12:13 PM, 6 Aug 2026 (IST)

విజయవాడలో వైఎస్సార్సీపీ టెంట్లు తొలగింపు

విజయవాడ సెంట్రల్ నియోజకవర్గంలో ఉద్రిక్తత చోటుచేసుకుంది. గవర్నమెంట్ ప్రింటింగ్ ప్రెస్ వద్ద వైఎస్సార్సీపీ నేతలు ధర్నా చేపట్టారు. దీనిని స్థానిక ఎమ్మెల్యే బొండా ఉమా అడ్డుకున్నారు. వైఎస్సార్సీపీ అనధికారంగా ధర్నా చేస్తోందని ఆయన మండిపడ్డారు. ధర్నాచౌక్ వదిలి ప్రజలను ఇబ్బంది పెడుతున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. అక్కడున్న టెంట్లను బొండా ఉమా తొలగించడంతో ఇరువర్గాల మధ్య తోపులాట జరిగింది.

12:13 PM, 6 Aug 2026 (IST)

యాడికిలో ఉద్రిక్తత

అనంతపురం జిల్లా యాడికిలో ఉద్రిక్త పరిస్థితి నెలకొంది. డీఎస్సీ అక్రమాలపై వైఎస్సార్సీపీ నాయకులు దీక్ష చేపట్టారు. అనుమతి లేకుండా దీక్షలు చేయడంపై టీడీపీ శ్రేణులు నిరసన వ్యక్తం చేశాయి. ఇరు పార్టీల నేతలు ఒకేచోట బైఠాయించడంతో ఉద్రిక్తత చోటుచేసుకుంది. పోలీసులు వెంటనే రంగంలోకి దిగారు. ఇరువర్గాలకు సర్దిచెప్పి పరిస్థితిని అదుపులోకి తెచ్చేందుకు ప్రయత్నిస్తున్నారు.

12:13 PM, 6 Aug 2026 (IST)

కృష్ణా బేసిన్ ప్రాజెక్టులకు భారీ వరద

కృష్ణా నది బేసిన్‌లోని ప్రాజెక్టులకు వరద ప్రవాహం కొనసాగుతోంది. శ్రీశైలం జలాశయానికి భారీగా వరద వస్తోంది. ప్రాజెక్టు ఇన్‌ఫ్లో 2,32,938 క్యూసెక్కులు, ఔట్‌ఫ్లో 7,493 క్యూసెక్కులుగా ఉంది. ప్రాజెక్టులో ప్రస్తుతం 139 టీఎంసీల నీరు నిల్వ ఉంది. తుంగభద్ర డ్యామ్‌కు 60,751 క్యూసెక్కుల వరద వస్తోంది. ఇక్కడి నుంచి 1,750 క్యూసెక్కులు వదులుతున్నారు. ఇందులో 64.82 టీఎంసీల నీరు ఉంది. నాగార్జున సాగర్‌కు 12,124 క్యూసెక్కుల ఇన్‌ఫ్లో వస్తోంది. 5,076 క్యూసెక్కుల నీటిని వదులుతున్నారు. సాగర్‌లో ప్రస్తుతం 137.34 టీఎంసీల నీరు ఉంది. పులిచింతల ప్రాజెక్టులో 28.92 టీఎంసీల నీరు నిల్వ ఉంది. గోదావరి నదికి కూడా వరద కొనసాగుతోంది. ధవళేశ్వరం నుంచి సుమారు 3.75 లక్షల క్యూసెక్కుల నీటిని సముద్రంలోకి వదులుతున్నారు.

11:12 AM, 6 Aug 2026 (IST)

కేతిరెడ్డిపై చర్యలు తీసుకోవాలి: జేసీ ప్రభాకర్ రెడ్డి

మాజీ ఎమ్మెల్యే కేతిరెడ్డి పెద్దారెడ్డి అక్రమాలపై చర్యలు తీసుకోవాలని జేసీ ప్రభాకర్ రెడ్డి కోరారు. అనంతపురం జిల్లా కలెక్టర్ ఆనంద్‌ను ఆయన కలిశారు. కేతిరెడ్డి అక్రమాలపై గతంలో విజిలెన్స్ ఇచ్చిన నివేదికలపై చర్యలు చేపట్టాలన్నారు. మున్సిపల్ స్థలాన్ని ఆక్రమించి కేతిరెడ్డి ఇల్లు నిర్మించినట్లు అధికారులు నిర్ధారించారన్నారు. సజ్జలదిన్నె వద్ద సైతం ఆయన భూ కబ్జాకు పాల్పడ్డారని, వెంటనే కఠిన చర్యలు తీసుకోవాలని కలెక్టర్‌కు జేసీ విజ్ఞప్తి చేశారు.

11:11 AM, 6 Aug 2026 (IST)

హస్తకళలకు క్యూఆర్ కోడ్‌తో సాంకేతిక వెలుగులు

హస్తకళలకు లేపాక్షి సంస్థ క్యూఆర్ కోడ్ విధానాన్ని తీసుకొచ్చింది. ఉప ముఖ్యమంత్రి పవన్ కల్యాణ్ సూచనల మేరకు దీనిని అమలు చేస్తోంది. ఈ కోడ్‌ను స్కాన్ చేస్తే సదరు కళాఖండం చరిత్ర సులభంగా తెలుస్తుంది. ఆ వస్తువు తయారీలో కళాకారుడి కష్టాన్ని కూడా ఇది వివరిస్తుంది. ప్రాథమికంగా 8 రకాల చేతివృత్తులకు క్యూఆర్ కోడ్ ప్రవేశపెట్టారు. దీని ద్వారా నకిలీ ఉత్పత్తులకు చెక్ పెట్టవచ్చని అధికారులు భావిస్తున్నారు.

10:56 AM, 6 Aug 2026 (IST)

తిరుమల శ్రీవారి దర్శనానికి పెరిగిన భక్తుల రద్దీ

తిరుమల శ్రీవారి దర్శనానికి భక్తుల రద్దీ పెరిగింది. సర్వదర్శన టైమ్ స్లాట్ టోకెన్ల కోసం భక్తులు భారీగా తరలివచ్చారు. శుక్రవారం నాటి సర్వదర్శనం టైమ్ స్లాట్ టోకెన్ల జారీ ప్రక్రియ ముగిసింది. బుధవారం సర్వదర్శన టైమ్ స్లాట్ టోకెన్లు జారీ చేయకపోవడంతో గురువారం భక్తుల రద్దీ పెరిగింది. దీంతో సర్వదర్శన టైమ్ స్లాట్ టోకెన్లు లేక భక్తులు వెనుదిరుగుతున్నారు.

10:55 AM, 6 Aug 2026 (IST)

కర్నూలులో ఏసీబీ అధికారుల సోదాలు

కర్నూలులో ఏసీబీ అధికారుల సోదాలు చేపట్టారు. సబ్‌రిజిస్ట్రార్‌ కార్యాలయ సీనియర్‌ అసిస్టెంట్ గోపాల్‌రావు ఇంట్లో సోదాలు నిర్వహిస్తున్నారు. కర్నూలు సమీపంలోని పెద్దపాడు వద్ద మైత్రి హోమ్‌లో గోపాల్‌రావు నివాసం ఉంది. నంద్యాల జిల్లా సబ్ రిజిస్ట్రార్‌ కార్యాలయంలో సీనియర్ అసిస్టెంట్‌గా గోపాల్​రావు విధులు నిర్వహిస్తున్నారు. ఆదాయానికి మించి ఆస్తులు ఉన్నాయనే సమాచారంతో ఏసీబీ అధికారులు తనిఖీలు చేస్తున్నారు.

10:54 AM, 6 Aug 2026 (IST)

ప్రారంభమైన రాష్ట్ర మంత్రివర్గ సమావేశం

సీఎం చంద్రబాబు అధ్యక్షతన రాష్ట్ర మంత్రివర్గ సమావేశం ప్రారంభమైంది. దాదాపు 30కి పైగా అజెండా అంశాలపై మంత్రులు చర్చిస్తున్నారు. ఈజ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్ యాక్ట్-2026కు కేబినెట్ గ్రీన్ సిగ్నల్ ఇవ్వనుంది. ఏపీ పీపీపీ పాలసీ ముసాయిదాకు ఆమోదం తెలుపుతారు. దిశా, ల్యాండ్ గ్రాబింగ్ బిల్లుల ఉపసంహరణపై చర్చిస్తారు. వాటి స్థానంలో పటిష్ఠమైన చట్టాలు తీసుకురావడంపై చర్చిస్తారు. మున్సిపల్ భూముల లీజు పెంపు, యూడీఏల పునర్వ్యవస్థీకరణకు ఆమోదం తెలుపుతారు. పాదచారుల భద్రత పాలసీ-2026కు గ్రీన్ సిగ్నల్ ఇస్తారు. రెండు కొత్త ప్రైవేట్ వర్సిటీలకు అనుమతి ఇస్తారు. కొత్త జిల్లాలకు 15 డీఈవో పోస్టులు సృష్టిస్తారు. అమరావతి క్వాంటమ్ వ్యాలీ ట్విన్ టవర్స్ నిర్మాణం ఎల్‌అండ్‌టీకి అప్పగిస్తారు. అసెంబ్లీ, హైకోర్టు డిజైన్ల కోసం అదనపు నిధులకు ఆమోదం తెలుపుతారు. అమరావతి భూ కేటాయింపులు, అమరావతి ఐ ప్రాజెక్టు రీ-టెండర్లకు ఓకే చెబుతారు. టెక్స్‌టైల్స్ పాలసీలో సవరణలు, పారిశ్రామిక మౌలిక సదుపాయాలపై చర్చిస్తారు. మొబైల్ టవర్లకు ప్రభుత్వ భూములు, రాయితీ విద్యుత్‌ ఇస్తారు. గోదావరి పుష్కరాలకు రూ.210.06 కోట్లతో ఘాట్‌ల అభివృద్ధికి ఆమోదం తెలుపుతారు.

10:53 AM, 6 Aug 2026 (IST)

ట్రైనీ ఐపీఎస్ ఉదయ్ కృష్ణారెడ్డిని కస్టడీలో ప్రశ్నిస్తున్న పోలీసులు

ట్రైనీ ఐపీఎస్ ఉదయ్ కృష్ణారెడ్డిని పోలీసులు కస్టడీలో ప్రశ్నిస్తున్నారు. కోర్టు ఆయనకు రెండ్రోజుల పోలీస్ కస్టడీకి అనుమతి ఇచ్చింది. అత్తాపూర్ పోలీస్‌స్టేషన్‌లో విచారణ కొనసాగుతోంది. డీసీపీ లావణ్య పర్యవేక్షణలో ఉమెన్ సేఫ్టీ వింగ్ అధికారులు ఆయనను విచారిస్తున్నారు. మహిళా ట్రైనీ ఐపీఎస్‌ను లైంగికంగా వేధించిన కేసులో ఉదయ్‌ను గతనెల 28న పోలీసులు అరెస్టు చేశారు. ఈ కస్టడీ విచారణలో పోలీసులు కీలక ఆధారాలు సేకరించనున్నారు.

10:53 AM, 6 Aug 2026 (IST)

వైద్య విద్యార్థినిపై కారు ఎక్కించిన ఇద్దరు యువకులు

రాజమహేంద్రవరంలో దారుణ ఘటన ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. వైద్య విద్యార్థిని ప్రియాంకపై ఇద్దరు యువకులు కారు ఎక్కించారు. తల పైనుంచి కారు వెళ్లడంతో ఆమె బ్రెయిన్ డెడ్‌గా మారారు. ప్రకాష్‌నగర్ పోలీసులు నిందితులను అదుపులోకి తీసుకున్నారు. ఈనెల 3న రాజమహేంద్రవరం ప్రసాదిత్యా మాల్‌ వద్ద ఈ ఘటన జరిగింది. జీఎస్‌ఎల్‌ మెడికల్ కాలేజీలో 28 ఏళ్ల ప్రియాంక డెర్మటాలజీ పీజీ చేస్తున్నారు. మాల్ నుంచి స్కూటీపై బయటికొస్తున్న సమయంలో ఏవీ అప్పారావు రోడ్డులో వేగంగా వచ్చిన కారు ఆమెను ఢీకొట్టింది. ఆమెపై కారు ఎక్కించిన యువకులను నామవరం ఇంజినీరింగ్ విద్యార్థులుగా గుర్తించారు. ప్రకాష్‌నగర్ పోలీసులు ఈ కేసును దర్యాప్తు చేస్తున్నారు.

10:16 AM, 6 Aug 2026 (IST)

సముద్రంలో చిక్కుకున్న నిపుణులను కాపాడిన పోలీసులు

అనకాపల్లి జిల్లాలో పెను ప్రమాదం తప్పింది. అచ్యుతాపురం మండలం పూడిమడక-తంతడి మధ్య సముద్రంలో నలుగురు సాయిల్ టెస్ట్ నిపుణులు చిక్కుకున్నారు. వీరంతా బంగాల్‌కు చెందిన వారు. బార్క్ జెట్టి నిర్మాణ సాయిల్ టెస్ట్ కోసం ఇక్కడికి వచ్చారు. అయితే పరీక్షా వాహనాన్ని లాక్కొని వచ్చిన పడవల తాళ్లు ఒక్కసారిగా తెగిపోవడంతో వారు అందులోనే చిక్కుకుపోయారు. వెంటనే సమాచారం అందుకున్న పూడిమడక మెరైన్, అచ్యుతాపురం పోలీసులు సకాలంలో స్పందించారు. సముద్రంలో చిక్కుకున్న ఆ నలుగురిని సురక్షితంగా ఒడ్డుకు చేర్చి కాపాడారు.

10:16 AM, 6 Aug 2026 (IST)

తుంగభద్రకు తగ్గిన వరద ప్రవాహం

తుంగభద్ర జలాశయానికి ఎగువ నుంచి వస్తున్న వరద తగ్గుముఖం పట్టింది. నిన్న ఉదయం లక్ష క్యూసెక్కులు ఉండగా.. ప్రస్తుతం 50 వేల క్యూసెక్కుల నీరు మాత్రమే డ్యామ్‌లోకి చేరుతోంది. ప్రాజెక్టు గరిష్ఠ నీటి నిల్వ సామర్థ్యం 105 టీఎంసీలు కాగా, ప్రస్తుతం 64.81 టీఎంసీల నీరు ఉంది. జలాశయం పూర్తిస్థాయి నీటిమట్టం 1,633 అడుగులు కాగా.. ప్రస్తుతం నీటిమట్టం 1,621 అడుగులకు చేరినట్లు అధికారులు వివరించారు.

9:51 AM, 6 Aug 2026 (IST)

చంద్రబాబు అధ్యక్షతన కాసేపట్లో కేబినెట్‌ భేటీ

సీఎం చంద్రబాబు అధ్యక్షతన సచివాలయంలో ఏపీ కేబినెట్ సమావేశం కానుంది. ఈ భేటీలో 30కి పైగా అజెండా అంశాలపై మంత్రులు చర్చించనున్నారు. అమరావతి ఐ ప్రాజెక్టు రీ-టెండర్లు, అదనపు భూమి లీజు ప్రతిపాదనలపై నిర్ణయం తీసుకోనున్నారు. ఎల్‌అండ్‌టీకి క్వాంటమ్ వ్యాలీ ట్విన్ టవర్స్ పనులను అప్పగించనున్నారు. ఇందుకోసం రూ.1,002 కోట్ల రుణ సమీకరణకు ఆమోదం తెలపనున్నారు. అసెంబ్లీ, హైకోర్టు డిజైన్ల అదనపు వ్యయాన్ని రూ.206 కోట్లకు పెంచనున్నారు. రైతుల యాన్యుటీ కోసం రూ.300 కోట్ల రుణానికి గ్రీన్ సిగ్నల్ ఇవ్వనున్నారు. వైకుంఠపురం ఇనాం భూముల వివాద పరిష్కారం, దేవదాయ శాఖకు నిధుల చెల్లింపుపై చర్చిస్తారు.

భీమవరం, మార్కాపురం, నంద్యాలలో కొత్త యూడీఏలు ఏర్పాటు చేయనున్నారు. 'పాదచారుల భద్రత విధానం-2026'కు కేబినెట్ ఆమోదం తెలపనుంది. విద్యా, వైద్య సంస్థల భూముల లీజు గడువు పునరుద్ధరణ, దిశా బిల్లులో సవరణలపై చర్చించనున్నారు. ఆక్వా రైతులకు విద్యుత్ రాయితీ టారిఫ్ కొనసాగింపు, పేదల గృహ నిర్మాణ ప్రాజెక్టు తదితర అంశాలపై మంత్రివర్గం కీలక నిర్ణయాలు తీసుకోనుంది.

9:51 AM, 6 Aug 2026 (IST)

పోతిరెడ్డిపాడు నుంచి నీటి విడుదల

నంద్యాల జిల్లా పోతిరెడ్డిపాడు హెడ్ రెగ్యులేటర్ నుంచి అధికారులు నీటిని విడుదల చేశారు. శ్రీశైలం డ్యామ్ నీటిమట్టం 854 అడుగులు దాటింది. దీంతో తాగునీటి అవసరాల కోసం పోతిరెడ్డిపాడు నుంచి 2 వేల క్యూసెక్కులు వదిలారు. సాయంత్రం బనకచర్ల నుంచి వెలుగోడు ప్రాజెక్టుకు కూడా నీటిని విడుదల చేయనున్నారు. మరోవైపు నిన్న సాయంత్రం మల్యాల ఎత్తిపోతల నుంచి హంద్రీనీవాకు 350 క్యూసెక్కుల నీటిని పంపించారు.

9:32 AM, 6 Aug 2026 (IST)

మాజీ మంత్రి అంబటి రాంబాబుపై మరో కేసు

మాజీ మంత్రి అంబటి రాంబాబుపై గుంటూరులోని అరండల్‌పేట పోలీస్ స్టేషన్‌లో మరో కేసు నమోదైంది. కేంద్రమంత్రి పెమ్మసానిపై ఆయన తప్పుడు ప్రచారం చేశారంటూ టీడీపీ జిల్లా అధ్యక్షుడు పిల్లి మాణిక్యరావు ఫిర్యాదు చేశారు. విద్వేషాలు రెచ్చగొడుతూ, ప్రజాశాంతికి భంగం కలిగించేలా వీడియో పోస్ట్ చేశారని పేర్కొన్నారు. దీంతో పోలీసులు అంబటిపై 356, 353, 352, 61(2)3 (5) బీఎన్ఎస్ సెక్షన్ల కింద కేసు నమోదు చేశారు.

9:32 AM, 6 Aug 2026 (IST)

సాయికృష్ణ కేసులో ముమ్మర విచారణ

సాయికృష్ణ కేసులో కానిస్టేబుళ్ల విచారణ రెండో రోజు కొనసాగుతోంది. ఈ కేసులో నిందితులైన హెడ్ కానిస్టేబుళ్లు అశోక్, నానిలను సిట్ అధికారులు కస్టడీకి తీసుకున్నారు. విజయవాడ సిట్ కార్యాలయంలో వీరిని ఐదు రోజుల పాటు ప్రశ్నించనున్నారు. కేసులో దాగి ఉన్న వాస్తవాలను రాబట్టేందుకు అధికారులు లోతుగా విచారిస్తున్నారు. నేడు మరో ఇద్దరు నిందితులు బాబూరావు, సాంబయ్యలను సైతం సిట్ కస్టడీలోకి తీసుకునే అవకాశం ఉంది.

9:32 AM, 6 Aug 2026 (IST)

కృష్ణా జిల్లాలో కుటుంబం ఆత్మహత్యాయత్నం

కృష్ణా జిల్లాలో ముగ్గురు ఆత్మహత్యాయత్నం చేయడం కలకలం రేపింది. వీరవల్లి సొసైటీ కార్యదర్శి హేమ, భర్త బాలాజీ, కుమారుడు గురువారం వేకువజామున పురుగుల మందు తాగారు. అపస్మారక స్థితికి వెళ్లే ముందు వీరు బంధువులకు ఫోన్ చేసి చెప్పారు. వెంటనే వారు అక్కడికి చేరుకుని ముగ్గురినీ విజయవాడ ప్రభుత్వాస్పత్రికి తరలించారు. సొసైటీలో అక్రమాలపై విచారణ జరగడమే ఈ ఘటనకు కారణమని పోలీసులు భావిస్తున్నారు.

9:10 AM, 6 Aug 2026 (IST)

పొగాకు వ్యాపారి కిడ్నాప్ కేసులో వైఎస్సార్సీపీ మాజీ ఎమ్మెల్యే ముస్తఫాకు రిమాండ్‌

పొగాకు వ్యాపారి కిడ్నాప్ కేసులో గుంటూరు తూర్పు వైఎస్సార్సీపీ మాజీ ఎమ్మెల్యే ముస్తఫాకు కోర్టు రిమాండ్ విధించింది. నిన్న ఏలూరు జిల్లా నూజివీడులో వైసీపీ నేతలు హడావుడి చేశారు. దీంతో శాంతిభద్రతలకు విఘాతం కలగకుండా గురువారం తెల్లవారుజామున ఆయన్ను జడ్జి ముందు హాజరుపరిచారు. అనంతరం నెల్లూరు సబ్ జైలుకు తరలించారు. ఇదే కేసులో ఆయన కుమారుడు ముబషీర్‌కు కూడా నిన్ననే రిమాండ్ విధించిన విషయం తెలిసిందే.

8:57 AM, 6 Aug 2026 (IST)

పొగాకు రైతులను ఆదుకున్నది టీడీపీనే: లోకేశ్

పొగాకు రైతులను సంక్షోభంలో ఆదుకున్నది టీడీపీ ప్రభుత్వమే అని మంత్రి లోకేశ్ స్పష్టం చేశారు. ఈ ఏడాది టొబాకో బోర్డు లక్ష్యం 131 మిలియన్ కిలోలు కాగా, రైతులు 241 మిలియన్ కిలోలు ఉత్పత్తి చేశారన్నారు. అందుకే కిలోకు రూ.10 చొప్పున రూ.100 కోట్ల సాయం ఇవ్వాలని ప్రభుత్వం నిర్ణయించిందన్నారు. రైతులకు అప్పులిచ్చామని జగన్ చెప్పగానే, తమకు రాలేదని ఓ రైతు చెప్పిన వీడియోను లోకేశ్ విడుదల చేశారు.

8:57 AM, 6 Aug 2026 (IST)

డుంబ్రిగూడ వద్ద గంజాయి ద్రావణం పట్టివేత

అల్లూరి జిల్లా డుంబ్రిగూడ వద్ద ఎన్‌సీబీ అధికారులు భారీగా గంజాయి ద్రావణాన్ని స్వాధీనం చేసుకున్నారు. అక్రమంగా తరలిస్తున్న 30 కిలోల గంజాయి ద్రావణాన్ని పట్టుకున్నారు. దీనిని తరలిస్తున్న ముగ్గురు నిందితులను అరెస్టు చేశారు. పట్టుబడిన గంజాయి ద్రావణం విలువ సుమారు రూ.3.75 కోట్లు ఉంటుందని అధికారుల అంచనా.

8:56 AM, 6 Aug 2026 (IST)

శ్రీవారి సర్వదర్శనానికి 20 గంటలు

తిరుమలలో భక్తుల రద్దీ తీవ్రంగా ఉంది. టోకెన్లు లేని భక్తులకు సర్వదర్శనానికి 20 గంటల సమయం పడుతోంది. క్యూకాంప్లెక్స్‌లోని అన్ని కంపార్టుమెంట్లు భక్తులతో నిండిపోయాయి. శిలాతోరణం క్యూలైన్ వరకు భక్తులు వేచి ఉన్నారు. నిన్న ఒక్కరోజే 77,502 మంది భక్తులు శ్రీవారిని దర్శించుకున్నారు. నిన్న స్వామివారి హుండీ ఆదాయం రూ.5.46 కోట్లుగా నమోదైంది. అలాగే 34,485 మంది భక్తులు స్వామివారికి తలనీలాలు సమర్పించారు.

6:57 AM, 6 Aug 2026 (IST)

శ్రీశైలం జలాశయానికి పెరుగుతున్న వరద

శ్రీశైలం జలాశయానికి వరద నీటి ప్రవాహం కొనసాగుతోంది. ఎగువన ఉన్న జూరాల నుంచి శ్రీశైలానికి ప్రస్తుతం 2,20,948 క్యూసెక్కుల వరద నీరు వచ్చి చేరుతోంది. డ్యామ్ పూర్తిస్థాయి నీటిమట్టం 885 అడుగులు కాగా ప్రస్తుతం నీటిమట్టం 869.20 అడుగులకు చేరుకుంది. ప్రాజెక్టు పూర్తిస్థాయి నీటి నిల్వ సామర్థ్యం 215.80 టీఎంసీలు కాగా, ప్రస్తుతం జలాశయంలో 138.27 టీఎంసీల నీరు నిల్వ ఉంది.

6:56 AM, 6 Aug 2026 (IST)

నేడు రాష్ట్ర కేబినెట్ సమావేశం

రాష్ట్ర మంత్రివర్గం నేడు భేటీ కానుంది. సీఆర్డీఏ పరిధిలో పలు కీలక ప్రాజెక్టులకు కేబినెట్ ఆమోదం తెలపనుంది. క్వాంటమ్‌ వ్యాలీ కోసం 2 టవర్ల నిర్మాణ బాధ్యతలను ఎల్ అండ్ టీకి అప్పగించే అవకాశముంది. రాజధానిలో 20 మెగావాట్ల డేటా సెంటర్‌కు గ్రీన్‌సిగ్నల్ ఇవ్వనున్నారు. రోప్‌వే ప్రాజెక్టులు, 'లండన్ ఐ' నమూనా నిర్మాణం టెండర్లపై నిర్ణయం తీసుకోనున్నారు. అసెంబ్లీ సమావేశాల నిర్వహణపైనా ఈ భేటీలో ప్రాథమికంగా చర్చించనున్నారు.

6:56 AM, 6 Aug 2026 (IST)

స్థానిక ఎన్నికల ఏర్పాట్లపై ఎస్‌ఈసీ సమీక్ష

స్థానిక ఎన్నికల ముందస్తు ఏర్పాట్లపై ఎస్‌ఈసీ అనిల్ చంద్ర నేడు అధికారులతో సమీక్షించనున్నారు. ఈ భేటీకి పురపాలక, పట్టణాభివృద్ధి శాఖల ముఖ్య కార్యదర్శులు, పంచాయతీరాజ్ కమిషనర్లు హాజరవుతారు. ఎన్నికల నిర్వహణకు తీసుకోవాల్సిన ముందస్తు చర్యలపై ఈ సమావేశంలో ప్రధానంగా చర్చించనున్నారు.

Last Updated : August 6, 2026 at 10:51 PM IST