04-06-2026 Telangana News Today Live Updates : హయత్‌నగర్ వద్ద రోడ్డుపై అడ్డంగా ఆయిల్ ట్యాంకర్ - పెట్రోల్ లీకవడంతో హైఅలర్ట్

Published : June 4, 2026 at 6:56 AM IST
|Updated : June 4, 2026 at 10:38 PM IST
04-06-2026 Telangana News Today Live Updates : ఈరోజు తెలంగాణ తాజా ప్రధాన వార్తల సమాచారం.
LIVE FEED
రంగారెడ్డి: నందిగామ బైపాస్ రోడ్డులో ప్రమాదం, ఇద్దరు మృతి
రంగారెడ్డి జిల్లా నందిగామ బైపాస్ రోడ్డులో ప్రమాదం చోటుచేసుకుంది. దీనిలో ఓ కారు బైకును ఢీకొట్టడంతో బిహార్ కార్మికులు రోషన్ కుమార్ (24) పంకజ్ (19)లు అక్కడికక్కడే మృతిచెందారు. వీరిద్దరూ పాలిప్యాక్ పరిశ్రమలో కార్మికులుగా పనిచేస్తున్నారు. విధులు ముగించుకుని షాద్‌నగర్ నుంచి నందిగామ వెళ్తుండా రోడ్డు ప్రమాదంలో మృతి చెందారు.
ఫోన్ ట్యాపింగ్ కేసులో మాజీ ఎమ్మెల్యే తీగల కృష్ణారెడ్డికి సిట్ నోటీసులు
ఫోన్ ట్యాపింగ్ కేసులో మాజీ ఎమ్మెల్యే తీగల కృష్ణారెడ్డికి సిట్ నోటీసులు అందాయి. రేపు ఉ.11 గం.కు కమాండ్ కంట్రోల్ సెంటర్‌లో విచారణకు రావాలని సిట్ ఆదేశించింది. 2014-18 మధ్య మహేశ్వరం ఎమ్మెల్యేగా తీగల పనిచేశారు.
సీతారాంబాగ్‌లో చాక్లెట్ల తయారీ కేంద్రంలో తనిఖీలు
హైదరాబాద్ సీతారాంబాగ్‌లో చాక్లెట్ల తయారీ కేంద్రంలో హెచ్-ఫాస్ట్, ఫుడ్ సేఫ్టీ అధికారులు తనిఖీలు చేపట్టారు. సోదాల్లో గడువు ముగిసిన రసాయనాలతో చాక్లెట్లు తయారు చేస్తున్నట్లు గుర్తించారు. అంతే కాకుండా పాత లైసెన్స్ నంబర్‌తో ఉత్పత్తులను మార్కెట్లో విక్రయిస్తున్నట్లు కూడా గుర్తించారు. ఉత్పత్తులపై తయారీ, గడువు తేదీలు, బ్యాచ్ నంబర్ ఏమీ ముద్రించడం లేదు. వీటితో పాటు భారీగా చాక్లెట్లు, గడువు ముగిసిన ముడిపదార్థాలు, 200 కిలోల క్యారమెల్ చాక్లెట్లు, ఇతర చాక్లెట్ ఉత్పత్తులు సీజ్ చేశారు. హబీబ్‌నగర్ పీఎస్‌లో కేసు నమోదు చేసి, చాక్లెట్ల తయారీ కేంద్రం నిర్వాహకుడు కార్తీక్‌ను అరెస్టు చేశారు.
హయత్‌నగర్ వద్ద రోడ్డుపై అడ్డంగా ఆయిల్ ట్యాంకర్ - లీకవుతున్న పెట్రోల్
హైదరాబాద్ శివారు హయత్‌నగర్ పరిధిలో ఆయిల్ ట్యాంకర్ బీభత్సం సృష్టించింది. లక్ష్మారెడ్డిపాలెం వద్ద 2 కార్లను ఢీకొట్టి పెట్రోల్ ట్యాంకర్ బోల్తాపడింది. పెట్రోల్ ట్యాంకర్ ఢీకొనడంతో రెండు కార్లు పూర్తిగా ధ్వంసమయ్యాయి. కార్లలో ప్రయాణిస్తున్న వారికి స్వల్ప గాయాలయ్యాయి. ప్రమాదంలో ట్యాంకర్ క్యాబిన్‌లో చిక్కుకున్న డ్రైవర్‌ను కాపాడేందుకు అగ్నిమాపక సిబ్బంది, పోలీసులు సహాయచర్యలు చేపట్టారు. ఓవైపు సహాయక చర్యలు కొనసాగుతుండగానే ట్యాంకర్ నుంచి పెట్రోల్ లీకవడంతో అధికారులు అప్రమత్తమయ్యారు. పెట్రోల్ లీకేజీతో ఘటనాస్థలిలో హైఅలర్ట్ ప్రకటించారు. ఈ ప్రమాదంతో జాతీయ రహదారిపై రాకపోకలు భారీగా నిలిచిపోయాయి. వాహనాలను మరో మార్గాల నుంచి మళ్లిస్తున్నారు.
పాలమూరు ప్రాజెక్టుల సందర్శనలో సీఎం రేవంత్‌రెడ్డి
పాలమూరు పర్యటనలో ఉన్న ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి కొడంగల్ - నారాయణపేట ప్రాజెక్టుపై అధికారులతో సమీక్ష నిర్వహించారు. అనంతరం కోయిల్ సాగర్ ప్రాజెక్టు, కృష్ణా, భీమా నదులపై ప్రతిపాదిత బ్రిడ్జి కమ్ బ్యారేజీలు ప్రియదర్శిని జూరాల ప్రాజెక్టును ఏరియల్ వ్యూ ద్వారా పరిశీలించారు. పాలమూరు ప్రాజెక్టుల సందర్శనలో భాగంగా ముఖ్యమంత్రి, మంత్రులు కాట్రావుపల్లిలో ఎత్తిపోతల పథకం, ప్రతిపాదిత బ్యారేజీలపై ఏర్పాటు చేసిన ఫొటో గ్యాలరీ వీక్షించారు. కొడంగల్-నారాయణపేట ప్యాకేజీ-1లోని పంప్‌హౌస్, కెనాల్ పనుల పరిశీలించారు.
ఐవీఎఫ్, సరోగసీ కేంద్రాల ద్వారా పిల్లల అక్రమ రవాణాపై సుప్రీంకోర్టుకు అమికస్‌క్యూరీ నివేదిక
ఐవీఎఫ్, సరోగసీ కేంద్రాల ద్వారా పిల్లల అక్రమ రవాణాపై అమికస్‌క్యూరీ సుప్రీంకోర్టుకు నివేదిక సమర్పించింది. చట్టాల్లోని లొసుగులతో చైల్డ్ ట్రాఫికింగ్ దందా జరుగుతోందని నివేదికలో పేర్కొంది. పిల్లల అక్రమ రవాణాపై సుప్రీంకోర్టు తీవ్ర ఆందోళన వ్యక్తం చేసింది. ఫెర్టిలిటీ క్లినిక్‌ల దందాపై జస్టిస్ పార్థీవాలా, జస్టిస్ విశ్వనాథన్ ధర్మాసనం కేంద్రానికి నోటీసులు జారీ చేసింది.
బోడుప్పల్‌లో అగ్నిప్రమాదం, మూడు కార్లు దగ్ధం
హైదరాబాద్ బోడుప్పల్‌లో అగ్నిప్రమాదం జరగగా మూడు కార్లు దగ్ధమయ్యాయి. చెత్తకు నిప్పు పెట్టడంతో పక్కనే ఉన్న కార్లకు మంటలు అంటుకున్నట్లు అనుమానిస్తున్నాయి. ఘటనాస్థలికి చేరుకుని అగ్నిమాపక సిబ్బంది మంటలు అదుపులోకి తీసుకొచ్చారు.
త్వరలో తహసీల్దార్ల బదిలీలు: మంత్రి పొంగులేటి
త్వరలో తహసీల్దార్ల బదిలీలు జరుగుతాయని మంత్రి పొంగులేటి ప్రకటించారు. ఫ్యూచర్ సిటీని రద్దుచేసే అవకాశమే ఉండదన్నారు. ఏడాదిన్నరలో 90శాతం గ్రామాల సర్వే పూర్తవుతుందని తెలిపారు. ఇప్పటివరకు ఇందిరమ్మ ఇళ్లకు రూ.7 వేల కోట్లు చెల్లించామని, కేంద్రం నుంచి ఇంకా నిధులు రాలేదన్నారు.
ఇవాళ రాత్రి 10 వరకైనా రిజిస్ట్రేషన్లు చేస్తాం: రిజిస్ట్రేషన్ శాఖ
భూముల ధరలు రేపటి నుంచి పెరుగుతుండటంతో ఇవాళ రిజిస్ట్రేషన్ కార్యాలయాలు రాత్రి 10 వరకు పనిచేయనున్నాయి. ఇప్పటికే స్లాట్ బుక్ చేసుకుని సా.6.30లోపు వచ్చిన వారి చెక్‌లిస్ట్ పూర్తయితే రాత్రి 10 వరకైనా రిజిస్ట్రేషన్లు చేస్తామని రిజిస్ట్రేషన్ శాఖ ప్రకటించింది. పెరిగిన మార్కెట్ విలువల సమాచారం వెబ్‌సైట్‌లో అప్‌లోడ్ అయిందని, ఈ రాత్రి 12 గం.కు పెంచిన మార్కెట్ విలువలు అమల్లోకి రాస్తాయని తెలిపింది. రేపటి నుంచి పెంచిన ధరలతోనే రిజిస్ట్రేషన్లు జరుగుతాయి.
మోండా మార్కెట్ పరిధిలో చోరీ కేసును ఛేదించిన పోలీసులు
సికింద్రాబాద్ మోండా మార్కెట్ పరిధిలో చోరీ కేసును పోలీసులు ఛేదించారు. చోరీకి పాల్పడిన దిల్లీకి చెందిన మనోజ్ సింగ్‌ను పోలీసులు అరెస్టు చేశారు. నిందితుడి దగ్గర చోరీ చేసిన
రూ.82 లక్షల విలువైన 576 గ్రాముల బంగారు నగలు, సెల్‌ఫోన్ స్వాధీనం చేసుకున్నారు. సీసీ కెమెరాల ద్వారా నిందితుడిని పట్టుకున్నట్లు పోలీసులు తెలిపారు.
ఆర్టీసీ బస్సు ఢీకొని బీటెక్ విద్యార్థి మృతి
సికింద్రాబాద్‌లో ఆర్టీసీ బస్సు ఢీకొని బీటెక్ విద్యార్థి విశాల్ మదన్ మృతి చెందాడు. జలమండలి కార్యాలయం వద్ద విశాల్ బైకును ఆర్టీసీ బస్సు ఢీకొట్టడంతో అక్కడికక్కడే చనిపోయాడు. మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం గాంధీ ఆసుపత్రికి తరలించారు. మృతుడు విశాల్ గురునానక్ కళాశాలలో బీటెక్ చదువుతున్నాడు. జూబ్లీ బస్ స్టేషన్ నుంచి ఉప్పల్‌కు వెళ్తుండగా ఈ ప్రమాదం జరిగింది.
సైబర్ మోసగాళ్లకు సహకరిస్తున్న ముగ్గురు అరెస్టు
నిర్మల్ జిల్లాలో సైబర్ మోసగాళ్లకు సహకరిస్తున్న ముగ్గురిని పోలీసులు అరెస్టు చేశారు. మ్యూల్ ఖాతాలతో నేరగాళ్లకు సహకరిస్తున్న జిల్లాకు చెందిన ఐదుగురు నిందితులను గుర్తించారు. నిందితుల కరెంట్ ఖాతాల్లో రూ.8.18 కోట్ల మేర లావాదేవీలు జరిగాయి. దీంతో నిందితుల్లో ముగ్గురిని అరెస్ట్ చేశారు. పరారీలో ఉన్న మిగతా ఇద్దరి కోసం గాలిస్తున్నారు.
కామారెడ్డి జిల్లాలో ఈదురుగాలులతో కూడిన వర్షం
కామారెడ్డి జిల్లాలో ఈదురుగాలులతో కూడిన వర్షం బీభత్సం సృష్టించింది. కామారెడ్డి పట్టణంలో భారీ వర్షంతో కాలనీలు జలమయమయ్యాయి. దోమకొండ, బీబీపేట, మాచారెడ్డి, బిక్కనూరు, జుక్కల్ మండలాల్లో వర్షం కురిసింది. వర్షానికి జుక్కల్ మండలంలో జొన్న సంచులు తడిసిపోయాయి.
టీజీ లాసెట్, పీజీఎల్‌సెట్ ఫలితాలు విడుదల
టీజీ లాసెట్, పీజీఎల్‌సెట్ ఫలితాలు(Lawcet Results) విడుదలయ్యాయి. ఉన్నత విద్యామండలి ఛైర్మన్, ఓయూ వీసీ సమక్షంలో ఫలితాలను విడుదల చేశారు. మే 18న ఉస్మానియా విశ్వవిద్యాలయం ఈ పరీక్షలను నిర్వహించింది. 54,374 మంది విద్యార్థులు లాసెట్, పీజీ లాసెట్ రాయగా, 39,673 మంది విద్యార్థులు ఉత్తీర్ణత సాధించారు. 3 ఏళ్ల లాసెట్‌లో విజయదుర్గ, 5 ఏళ్ల లాసెట్‌లో సనిత్ రెడ్డి, రెండేళ్ల పీజీ లాసెట్‌లో నిషిత మొదటి ర్యాంకు సాధించారు.
ఒంగోలు చెరువు కొమ్ముపాలెం వద్ద కుంటలో నలుగురు చిన్నారుల గల్లంతు
ఒంగోలు చెరువుకొమ్ముపాలెం వద్ద కుంటలో నలుగురు చిన్నారులు గల్లంతయ్యారు. ఆడుకుంటూ చెరువులో దిగిన దినేశ్ (10), చిన్ను (11), సుశాంత్ (12), అభిరామ్ (14) కనిపించకుండా పోయారు. సమాచారం అందుకున్న పోలీసులు గాలింపు చర్యలు చేపట్టారు. గల్లంతైన చిన్నారులు చెరుకుపాలెం గ్రామస్థులుగా గుర్తించారు. కుంట ఒడ్డున పిల్లల దుస్తులు, చెప్పులు లభించాయి.
మక్తల్‌లో ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి పర్యటన
నారాయణపేట జిల్లా మక్తల్‌లో ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి పర్యటన(CM Tour in Mahabubnagar District) కొనసాగుతోంది. పాలమూరు ప్రాజెక్టుల సందర్శనలో భాగంగా మక్తల్‌లో పర్యటిస్తున్న సీఎం, మంత్రులు కాట్రావుపల్లిలో ఎత్తిపోతల పథకం, ప్రతిపాదిత బ్యారేజీలపై ఏర్పాటు చేసిన ఫొటో గ్యాలరీ వీక్షించారు. మక్తల్-నారాయణపేట-కొడంగల్ ఎత్తిపోతల పథకం గురించి అధికారులు వివరించారు. అనంతరం మక్తల్-నారాయణపేట-కొడంగల్ ఎత్తిపోతల పనుల పరిశీలనకు సీఎం బయలుదేరి వెళ్లారు. కాట్రావుపల్లిలో ఎత్తిపోతల పనులను సీఎం రేవంత్‌రెడ్డి పరిశీలించనున్నారు.
శంషాబాద్ సబ్ రిజిస్ట్రార్ కార్యాలయంలో విజిలెన్స్ తనిఖీలు
శంషాబాద్ సబ్ రిజిస్ట్రార్ కార్యాలయంలో విజిలెన్స్ తనిఖీలు జరుగుతున్నాయి. కార్యాలయంలోని రికార్డులను క్షుణ్ణంగా పరిశీలించిన అధికారులు కొంతకాలంగా కార్యాలయ నిర్వహణపై ఆరోపణల దృష్ట్యా విజిలెన్స్ తనిఖీలు చేపట్టారు. రిజిస్ట్రేషన్ ప్రక్రియ, రికార్డుల నిర్వహణను పరిశీలించారు.
పోలవరం ప్రాజెక్టు అథారిటీ సీఈవోకు లేఖ రాసిన హరీశ్‌రావు
పోలవరం ప్రాజెక్టు అథారిటీ సీఈవోకు బీఆర్ఎస్ నేత హరీశ్‌రావు లేఖ(Harish Rao Letter) రాశారు. ప్రస్తుతం భద్రాచలంలో పర్యటిస్తున్న పోలవరం ప్రాజెక్ట్ అథారిటీ బృందం అధికారులకు పినపాక, భద్రాచలం బీఆర్ఎస్ నాయకులు ఈ లేఖను అందజేశారు. పోలవరం పూర్తయితే భద్రాచలం పట్టణానికి నిత్యం జలగండమేనని హరీశ్‌రావు ఆందోళన వ్యక్తం చేశారు. ముంపు గ్రామాలకే కాదు.. పరిశ్రమలకూ బ్యాక్‌వాటర్ ముప్పు ఉందన్నారు. ముంపు బాధితులకు పరిహారం ఇచ్చి.. పునరావాసం కల్పించాలనని, భద్రాచలం వద్ద తక్షణమే కరకట్టల నిర్మాణం చేయాలని హరీశ్‌రావు డిమాండ్ చేశారు. భద్రాచలంలోనే పోలవరం అథారిటీ ప్రత్యేక కార్యాలయం ఏర్పాటు చేయాలని కూడా హరీశ్‌రావు సూచించారు.
అమీర్‌పేటలో అగ్నిప్రమాదం - మెట్రో సేవలకు అంతరాయం
హైదరాబాద్ నగరంలో అమీర్‌పేటలో అగ్నిప్రమాదం చోటుచేసుకుంది. మెట్రో పిల్లర్ నంబర్ 1043 వద్ద ఉన్న షాపింగ్ కాంప్లెక్స్ రెండో అంతస్తులోని ఎంఎస్‌ఆర్ ఫ్యాషన్స్ దుకాణంలో మంటలు భారీగా ఎగిసిపడ్డాయి. అగ్నిప్రమాద తీవ్రత, దట్టమైన పొగ అలముకోవడంతో మెట్రో సేవలకు కొంతసేపు అంతరాయం కలిగింది. ట్రాఫిక్‌కు కూడా అంతరాయం కలిగింది. అయితే ప్రస్తుతం మంటలు అదుపులోకి వచ్చాయి.
అమీర్‌పేటలో భారీగా ట్రాఫిక్ జామ్ - వాహనాల దారి మళ్లింపు
అమీర్‌పేటలోని శ్రీనివాసనగర్ వెస్ట్, మెట్రో పిల్లర్ నంబర్ A1043 సమీపంలో ఉన్న కేఎస్సార్ ఫ్యాషన్స్‌లో అగ్నిప్రమాదం సంభవించినట్లు పోలీస్ కమిషనర్ వీసీ సజ్జనర్ తెలిపారు. అత్యవసర సహాయక చర్యల కారణంగా, అమీర్‌పేట నుండి ఎస్సార్ నగర్ మార్గంలో వాహనాల రాకపోకలకు అంతరాయం ఏర్పడింది. దీనివల్ల ఈ ప్రాంతంలో ట్రాఫిక్ జామ్ అయ్యింది. వాహనదారులు ఈ మార్గంలో ప్రయాణించకుండా ప్రత్యామ్నాయ మార్గాలను ఎంచుకోవాలని విజ్ఞప్తి చేస్తున్నామని... విధుల్లో ఉన్న ట్రాఫిక్, అత్యవసర సిబ్బందికి సహకరించాలని ప్రజల్ని కోరుతున్నామంటూ ఎక్స్ వేదికగా సజ్జనర్ సూచించారు.
మూడు ఫైరింజన్లతో మంటలార్పుతున్న అగ్నిమాపక సిబ్బంది
అమీర్‌పేటలోలోని ప్రధాన రహదారికి సమీపంలోని షాపింగ్ కాంప్లెక్స్ వద్ద ప్రమాదం జరగడంతో ట్రాఫిక్ జామ్ అయింది. ఈ ప్రమాదంలో ఇప్పటివరకు ప్రాణనష్టం జరిగినట్లుగా సమాచారం లేదు. ఆస్తినష్టం మాత్రం భారీగానే జరిగినట్లుగా తెలుస్తోంది. మంటలు భారీగా వ్యాపించడం, సిటీ నడిబొడ్డున కావడంతో స్థానికులు భయాందోళనకు గురయ్యారు. అగ్నిమాపక సిబ్బంది మూడు ఫైరింజన్లతో మంటలార్పుతున్నారు. మంటలు పూర్తిగా అదుపులోకి వచ్చిన తరువాతే ప్రమాదానికి కారణాలు, ఆస్తినష్టం వివరాలు తెలిసే అవకాశం ఉంది.
పీసీసీ ప్రధాన కార్యదర్శి గడ్డం చంద్రశేఖర్ రెడ్డికి షోకాజ్ నోటీసు
పీసీసీ ప్రధాన కార్యదర్శి గడ్డం చంద్రశేఖర్ రెడ్డికి పీసీసీ క్రమశిక్షణ కమిటీ షోకాజ్ నోటీసు జారీ చేసింది. పార్టీ వ్యతిరేక కార్యకలాపాలు, క్రిమినల్ కేసుల్లో ఉన్నట్లు ఆరోపణల దృష్ట్యా షోకాజ్ నోటీసు జారీచేశారు. కామారెడ్డి కార్యకర్తలు, నేతలు గడ్డం చంద్రశేఖర్‌రెడ్డిపై ఫిర్యాదు చేశారు. ఈనెల 11 లోపు సమాధానం ఇవ్వాలని క్రమశిక్షణ కమిటీ షోకాజ్ నోటీసులో పేర్కొంది.
సచివాలయంలో అఖిలపక్ష నేతలతో ఉద్యమకారుల గుర్తింపు కమిటీ సమావేశం
సచివాలయంలో కె.కేశవరావు అధ్యక్షతన అఖిలపక్ష నేతలతో ఉద్యమకారుల గుర్తింపు కమిటీ సమావేశం జరుగుతోంది. తెలంగాణ ఉద్యమకారుల గుర్తింపు, పుష్కరాలపై సూచనల స్వీకరణకు ఈ సమావేశం ఏర్పాటు చేశారు. మంత్రి పొన్నం, అద్దంకి దయాకర్, కోదండరాం, రాములునాయక్, మోతె శోభన్‌రెడ్డితో పాటు కాంగ్రెస్, బీఆర్ఎస్, బీజేపీ, టీడీపీ, సీపీఐ, టీజేఎస్, ఆప్, ఎంఐఎం, న్యూ డెమోక్రసీ ప్రతినిధులు ఈ భేటీకి హాజరయ్యారు.
అమీర్‌పేటలో భారీ అగ్నిప్రమాదం - షాపింగ్ కాంప్లెక్స్‌లో ఎగిసిపడుతున్న మంటలు
హైదరాబాద్ నగరంలో అమీర్‌పేటలోని ఓ దుకాణంలో అగ్నిప్రమాదం(Ameetpet Fire Accident) చోటుచేసుకుంది. షాపింగ్ కాంప్లెక్స్ రెండో అంతస్తులోని దుకాణంలో మంటలు చెలరేగాయి. అమీర్‌పేటలోని షాపింగ్ కాంప్లెక్స్‌లో ఎంఎస్‌ఆర్ ఫ్యాషన్స్ దుకాణంలో మంటలు భారీగా ఎగిసిపడుతున్నాయి. మెట్రో పిల్లర్ నంబర్ 1043 వద్ద ఈ ప్రమాదం జరిగింది. ఫైర్ సిబ్బంది ఘటనాస్థలికి చేరుకుని మంటలు ఆర్పే ప్రయత్నం చేస్తున్నారు. ప్రమాద తీవ్రత అధికంగా ఉండటంతో కాంప్లెక్స్‌లోని ఇతర దుకాణాలకూ సైతం మంటలు వ్యాపించాయి. ఇతర దుకాణాల్లోని వారిని ఖాళీ చేయిస్తున్నారు. పోలీస్, ఫైర్, మున్సిపల్, హైడ్రా, ఎస్డీఆర్ఎఫ్, జీహెచ్ఎంసీ సిబ్బంది ప్రమాద స్థలంలో సహాయక చర్యలు చేపట్టారు. రద్దీ ప్రాంతం కావడంతో ట్రాఫిక్‌కు మళ్లిస్తున్నారు.
వైసీపీ మాజీ ఎమ్మెల్యే బొల్లా బ్రహ్మనాయుడు పిటిషన్‌పై హైకోర్టులో విచారణ
వైసీపీ మాజీ ఎమ్మెల్యే బొల్లా బ్రహ్మనాయుడు పిటిషన్‌పై నార్సింగి పీఎస్‌లో నమోదైన కేసులో ముందస్తు బెయిల్ పిటిషన్‌పై హైకోర్టులో విచారణ జరిగింది. రూ.1500 కోట్ల విలువైన భూముల కబ్జాకు యత్నించాడని బొల్లా బ్రహ్మనాయుడుపై కేసులు నమోదయ్యాయి. నకిలీ జీవోలతో భూమి కాజేసేందుకు ప్రయత్నించినట్లు బ్రహ్మనాయుడు, మరికొందరిపై కేసు నార్సింగి పోలీసులు నమోదు చేశారు. ప్రస్తుతం బ్రహ్మనాయుడు పరారీలో ఉన్నారు. విచారణ సందర్భంగా నార్సింగి పోలీసులు, ప్రభుత్వానికి హైకోర్టు నోటీసులు జారీచేసింది. తదుపరి విచారణను ఈనెల 11వ తేదీకి వాయిదా వేసింది.
ఫోన్ ట్యాపింగ్ కేసులో సిట్ విచారణ - హాజరైన తీగల కృష్ణారెడ్డి, బీజేపీ నేత లంకల దీపక్‌రెడ్డి
ఫోన్ ట్యాపింగ్ కేసులో సిట్ విచారణకు తీగల కృష్ణారెడ్డి, బీజేపీ నేత లంకల దీపక్‌రెడ్డి హాజరయ్యారు. నిన్న నోటీసులు ఇవ్వగా.. కమాండ్ కంట్రోల్ సెంటర్‌లో విచారణకు హాజరయ్యారు.
కేరళ, తమిళనాడులోకి ప్రవేశించిన నైరుతి రుతుపవనాలు
కేరళ, తమిళనాడులోకి నైరుతి రుతుపవనాలు ప్రవేశించాయి. గతంతో పోలిస్తే ఈ ఏడాది ఆలస్యంగా కేరళలోకి ప్రవేశించాయి. తెలంగాణలోకి రుతుపవనాల ప్రవేశానికి వారం పట్టే అవకాశం ఉందని అంచనా వేస్తున్నారు.
శంషాబాద్ ఎయిర్‌పోర్టులో విదేశీ ప్రయాణికుడికి ఎబోలా వైరస్ హిస్టరీ
శంషాబాద్ ఎయిర్‌పోర్టులో విదేశీ ప్రయాణికుడికి ఎబోలా వైరస్ హిస్టరీ ఉన్నట్లు అధికారులు గుర్తించారు. ఎయిర్‌పోర్టులో ఏర్పాటు చేసిన స్కానర్ ద్వారా గుర్తించారు. ఈ ప్రయాణికుడు సూడాన్ నుంచి వచ్చినట్లు అధికారులు తెలిపారు. ఎబోలా లక్షణాలు ఉండటంతో గాంధీ ఆస్పత్రికి తరలించారు.
ఈసారి బీజేపీకి అవకాశం ఇవ్వాలని తెలంగాణ ప్రజలు నిర్ణయానికి వచ్చారు : రామచందర్‌రావు
తెలంగాణకు అనుకూలమని బీజేపీ తొలి నుంచీ చెబుతోందని ఆ పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు రామచందర్‌రావు అన్నారు. బీజేపీ మద్దతు వల్లే యూపీఏ ప్రభుత్వం బిల్లు ప్రవేశపెట్టిందని గుర్తు చేశారు. లోక్‌సభలో బిల్లు ప్రవేశపెట్టినప్పుడు టీఆర్‌ఎస్‌కు ఇద్దరే ఎంపీలు ఉన్నారన్న రామచందర్‌రావు.. ఈ ఇద్దరు కూడా ఓటింగ్‌కు హాజరుకాలేదన్నారు. 12 ఏళ్లు గడిచినా.. తెలంగాణ ఉద్యమకారులను గుర్తించలేని దుస్థితి రాష్ట్రంలో ఉందని విమర్శించారు.
తెలంగాణ వచ్చాక ఉద్యోగ నియామకాల లక్ష్యం నెరవేరలేదని, రాష్ట్రం కోసం పోరాడిన విద్యార్థులపైనే కేసులు పెట్టారన్నారు. చాలా ఏళ్లుగా యూనివర్సిటీలు పార్ట్‌టైమ్ ఫ్యాకల్టీతో నడుస్తున్నాయని చెప్పారు. మిగులు నిధుల రాష్ట్రాన్ని బీఆర్‌ఎస్ పాలన అప్పులపాలు చేసిందని ఆరోపించారు.
కృష్ణా జలాల్లో 299 టీఎంసీలకే కేసీఆర్ సంతకం పెట్టడం తొందరపాటేనని, బీఆర్‌ఎస్, కాంగ్రెస్ పార్టీలకు ప్రాజెక్టులు-నీళ్లపై ఓ విధానం లేదని రామచందర్‌రావు విమర్శించారు. కృష్ణా జలాల్లో రాష్ట్రానికి అన్యాయం జరిగేలా కర్ణాటకకు సహకరిస్తున్నారని ఆరోపించారు. రాష్ట్రానికి కేంద్రప్రభుత్వం ఎన్నో ప్రాజెక్టులు, నిధులు ఇస్తోందని, తెలంగాణకు కేంద్రం రూ.13 లక్షల కోట్ల నిధులు ఇచ్చిందన్నారు. ఫసల్‌బీమా యోజనను రాష్ట్రంలో ఎందుకు అమలు చేయట్లేదని ప్రశ్నించారు. ఈసారి బీజేపీకి అవకాశం ఇవ్వాలని తెలంగాణ ప్రజలు నిర్ణయానికి వచ్చారని చెప్పారు.
ఆటోను ఢీకొట్టి కారుపై బోల్తా పడిన లారీ
నాగర్‌కర్నూల్ చారకొండలో రోడ్డు ప్రమాదం జరిగింది. జడ్చర్ల- కోదాడ హైవేపై అదుపుతప్పి ఆటోను లారీ ఢీకొట్టింది. అనంతరం ఆ లారీ కారుపై బోల్తా పడింది. ఈ ప్రమాదంలో ఆటోలోని నలుగురికి, కారులోని ఇద్దరికి గాయాలయ్యాయి.
చంచల్‌గూడ జైలులో బాల్క సుమన్‌తో కేటీఆర్ ములాఖత్
చంచల్‌గూడ జైలులో ఉన్న బాల్క సుమన్‌ను ములాఖత్‌లో కేటీఆర్ కలిశారు. వివాదాస్పద వ్యాఖ్యల కేసులో సుమన్ ప్రస్తుతం జైలులో రిమాండ్ ఖైదీగా ఉన్నారు. కేటీఆర్‌తోపాటు తలసాని శ్రీనివాస్, సుధీర్‌రెడ్డి ఉన్నారు. చంచల్‌గూడ జైలు వద్ద బీఆర్‌ఎస్ కార్యకర్తలు, నేతలు చేరుకున్నారు.
మాజీ అడిషనల్ ఎస్పీ భుజంగరావుకు 14 రోజులు రిమాండ్
ఆదాయానికి మించిన ఆస్తుల కేసులో మాజీ అడిషనల్ ఎస్పీ భుజంగరావును నిన్న అరెస్టు చేసిన ఏసీబీ అధికారులు ఇవాళ ఏసీబీ ప్రత్యేక కోర్టులో హాజరుపరిచారు. ఈ కేసులో భుజంగరావుకు ఏసీబీ కోర్టు 14 రోజులు రిమాండ్ విధించింది. దీంతో చంచల్‌గూడ జైలుకు తరలించారు. అదనపు ఎస్పీ భుజంగరావు ఇప్పటికే సస్పెన్షన్‌లో ఉన్నారు. అక్రమ ఫోన్ ట్యాపింగ్ కేసులో ఏ-3గా ఉన్నారు.
ఆర్టీసీ కార్గోలో స్ఫటిక గుర్తింపు
సూర్యాపేట జిల్లా కోదాడ ఆర్టీసీ కార్గోలో నాటుసారాలో తయారీలో వాడే స్ఫటికను సిబ్బింది గుర్తించారు. నాలుగు స్ఫటిక బస్తాలను స్వాధీనం చేసుకున్నారు. రాజమహేంద్రవరం నుంచి ఆర్టీసీ కార్గోలో ఈ పార్సిల్ కోదాడకు వచ్చాయి. సింహ్రాద్రి అనే వ్యక్తి.. రవి అనే వ్యక్తికి ఈ సరకు పంపినట్లు గుర్తించారు.
అంతర్జాతీయ డ్రగ్స్ స్మగ్లింగ్ ముఠా అరెస్ట్
ఈగల్ పోలీసులు కీలక ఆపరేషన్ నిర్వహించారు. థాయిలాండ్ నుంచి హైదరాబాద్‌కు హైడ్రోఫోనిక్ గంజాయి సరఫరా చేసే అంతర్జాతీయ డ్రగ్స్ స్మగ్లింగ్ ముఠాను అరెస్ట్ చేశారు. కీలక నిందితుడు సహా 10 మంది పెడ్లర్లను అరెస్టు చేశారు. రూ.12 కోట్ల విలువైన హైడ్రోఫోనిక్ గంజాయి స్వాధీనం చేసుకున్నారు.
బెల్టుషాపులు నడిపితే రూ.10 వేలు జరిమానా
హనుమకొండ జిల్లా భీమదేవరపల్లిలో బెల్టుషాపులపై గ్రామపంచాయతీ సిబ్బందితో సర్పంచ్ కుమారస్వామి సోదాలు చేయించారు. బెల్టుషాపుల్లోని మద్యం సీసాలను గ్రామపంచాయతీ కార్యాలయానికి తరలించారు. గ్రామంలో బెల్ట్ షాపులను మూసివేయాలని సర్పంచ్ నోటీసులు ఇచ్చారు. అనుమతులు లేకుండా నడిపితే రూ.10 వేలు జరిమానా విధిస్తామని హెచ్చరించారు.
ఇజ్రాయెల్- లెబనాన్ మధ్య కుదిరిన కీలక ఒప్పందం
ఇజ్రాయెల్- లెబనాన్ మధ్య కీలక ఒప్పందం కుదిరింది. కాల్పుల విరమణను పొడిగించేందుకు ఒప్పందం కుదుర్చుకున్నారు. ఇందుకు అమెరికా మధ్యవర్తిత్వం వహించింది. లెబనాన్ లోపల కొన్ని ప్రత్యేక పైలట్ భద్రతా వలయాలు ఏర్పాటు చేయాలని నిర్ణయించాయి. భద్రతా వలయాల్లో హెజ్బొల్లా మిలిటెంట్లను నిషేధించాలని ఒప్పందంలో పేర్కొన్నాయి.
నేడు, రేపు ఉమ్మడి మహబూబ్‌నగర్ జిల్లాలో సీఎం రేవంత్‌రెడ్డి పర్యటన
నేడు, రేపు ఉమ్మడి మహబూబ్‌నగర్ జిల్లాలో సీఎం రేవంత్‌రెడ్డి పర్యటించనున్నారు. ఉమ్మడి మహబూబ్‌నగర్ జిల్లాలో ప్రాజెక్టుల పురోగతిని పరిశీలించనున్నారు. నేడు సోమశిలలో వివిధ ప్రాజెక్టులపై ప్రజెంటేషన్, సమీక్షలు అనంతరం నేడు సోమశిలలో సీఎం బస చేయనున్నారు. పాలమూరు-రంగారెడ్డి, కల్వకుర్తి, కోయిల్‌సాగర్‌పై ప్రజెంటేషన్, భీమా, నెట్టెంపాడు, ఇతర ప్రాజెక్టులపై ప్రజెంటేషన్, సమీక్ష చేయనున్నారు. రేపు ఉదండపూర్ రిజర్వాయర్ వద్ద బహిరంగ సభ నిర్వహించనున్నారు.
నేడు కేరళలోకి నైరుతి ప్రవేశానికి అనుకూల పరిస్థితులు
నేడు కేరళలోకి నైరుతి ప్రవేశానికి అనుకూల పరిస్థితులు అనుకూలించాయి. కేరళకు వచ్చిన వారం రోజులకు తెలంగాణలోకి ప్రవేశించే అవకాశం ఉంది. ఉపరితల ఆవర్తనం, ద్రోణుల వల్ల మూడు రోజులపాటు ఈదురుగాలులు, ఉరుములతో తేలికపాటి నుంచి మోస్తరు వర్షా సూచనలున్నాయి. గంటకు 50 నుంచి 60 కిలోమీటర్ల వేగంతో ఈదురుగాలులు వీచే అవకాశం ఉంది. రాష్ట్రంలో 4 రోజుల్లో ఉష్ణోగ్రతలు 2-4 డిగ్రీల మేర తగ్గే అవకాశం ఉంది.
హైదరాబాద్: షాద్‌నగర్‌లో రైలు ఢీకొని గుర్తుతెలియని వ్యక్తి మృతి
హైదరాబాద్ జిల్లా షాద్‌నగర్‌లో కాచిగూడ - కర్నూలు రైలు ఢీకొట్టడంతో గుర్తుతెలియని వ్యక్తి మృతి చెందాడు. మృతుడి వద్ద ఎలాంటి ఆధారాలు లభించలేదని పోలీసులు తెలిపారు.

