04-07-2026 Telangana News Today Live Updates : అచ్చంపేట డిప్యూటీ తహశీల్దార్ అశోక్‌ను సస్పెండ్ చేస్తూ కలెక్టర్ ఉత్తర్వులు

Published : July 4, 2026 at 7:15 AM IST
|Updated : July 4, 2026 at 8:49 PM IST
04-07-2026 Telangana News Today Live Updates : ఈరోజు తెలంగాణ తాజా ప్రధాన వార్తల సమాచారం
LIVE FEED
ఆరుగురు సభ్యుల ముఠాను అరెస్టు చేసిన నవీపేట పోలీసులు
నిజామాబాద్ జిల్లాలో చోరీలు చేస్తున్న ముఠాను అరెస్టు పోలీసులు అరెస్టు చేశారు. ఆరుగురు సభ్యుల ముఠాను అరెస్టు చేసిన నవీపేట పోలీసులు నిందితుల నుంచి 63 గ్రాముల బంగారం, కారు స్వాధీనం చేసుకున్నారు.
అచ్చంపేట డిప్యూటీ తహశీల్దార్ అశోక్‌ను సస్పెండ్ చేస్తూ కలెక్టర్ ఉత్తర్వులు
నాగర్‌కర్నూల్ జిల్లా అచ్చంపేట తహశీల్దార్ ఆఫీస్‌లో ఇద్దరు సిబ్బందిపై కలెక్టర్ చర్యలు తీసుకున్నారు. అచ్చంపేట డిప్యూటీ తహశీల్దార్ అశోక్‌ను సస్పెండ్ చేస్తూ కలెక్టర్ ఉత్తర్వులు జారీ చేశారు. కంప్యూటర్ ఆపరేటర్‌ను విధుల నుంచి తొలగించి, క్రిమినల్ కేసు నమోదు చేశారు. కలెక్టర్ ఆదేశాలతో కంప్యూటర్ ఆపరేటర్ జైపాల్‌పై క్రిమినల్ కేసు నమోదైంది. డీటీ అశోక్, ధరణి ఆపరేటర్ జైపాల్ భూమిని అక్రమంగా బదిలీ చేశారు. బతికి ఉన్న రైతును రైతును మృతుడిగా చూపించి పట్టా భూమి బదలాయించారు.
నీటి సంపులో పడి రెండేళ్ల చిన్నారి విశ్వైక మృతి
రాజన్నసిరిసిల్ల జిల్లా చందుర్తి మండలం రామన్నపేటలో విషాదం చోటు చేసుకుంది. నీటి సంపులో పడి రెండేళ్ల చిన్నారి విశ్వైక మృతి చెందింది.
వర్షాభావ పరిస్థితుల పట్ల అప్రమత్తంగా ఉండాలి: సీఎస్
వ్యవసాయం, ఆరోగ్యం, తాగునీరు, విద్యా రంగంపై కలెక్టర్లతో సీఎస్ సంజయ్ జాజు వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించారు. వర్షాభావ పరిస్థితుల పట్ల అప్రమత్తంగా ఉండాలని ఆదేశించారు.
ఎరువులు, విత్తనాలు అందుబాటులో ఉండేలా చూడాలని, పంటల వైవిధ్యంపై రైతులకు అవగాహన కల్పించాలని సూచించారు. విద్యుత్, తాగునీటి సరఫరాపై జాగ్రత్త తీసుకోవాలని సీఎస్ ఆదేశించారు.
అంతర్జాతీయ క్రికెట్‌లో వైభవ్ సూర్యవంశీ అరంగేట్రం
అంతర్జాతీయ క్రికెట్‌లో వైభవ్ సూర్యవంశీ అరంగేట్రం చేశారు. 15 ఏళ్ల 99 రోజులకే వైభవ్ అంతర్జాతీయ క్రికెట్ ఆడుతున్నారు. అంతర్జాతీయ క్రికెట్ ఆడుతున్న అతిపిన్న భారతీయుడిగా వైభవ్ రికార్డు సృష్టించారు. సచిన్(16 ఏళ్లు) రికార్డును అధిగమించిన వైభవ్ బద్దలు కొట్టాడు.
ఆస్ట్రేలియాకు వస్తే.. మోదీని చంపుతామంటూ బెదిరింపులు
ఆస్ట్రేలియాకు వస్తే.. మోదీని చంపుతామంటూ సోషల్ మీడియాలో దుండగులు పోస్టులు పెడుతున్నారు. బెదిరింపు పోస్టుల వివరాలను ఆస్ట్రేలియా మీడియా వెల్లడించింది. ఈనెల 8 న ప్రధాని మోదీ ఆస్ట్రేలియా పర్యటనకు వెళ్లనున్నారు.
రాహుల్‌గాంధీని ప్రధానిగా చేయాల్సిన అవసరం ఉంది: సీఎం
రాహుల్‌గాంధీని ప్రధానిగా చేయాల్సిన అవసరం ఉందన్నారు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి. రాహుల్‌గాంధీ ప్రధాని అయితేనే.. రాష్ట్ర సమస్యలు పరిష్కారం అవుతాయన్నారు. తెలంగాణ ఇచ్చిన సోనియాగాంధీ కుటుంబానికి కృతజ్ఞత చూపాలని, రాహుల్‌గాంధీని ప్రధాని చేసే మొదటి అడుగు మిడ్జిల్ నుంచి పడాలని రేవంత్ రెడ్డి కోరారు.
నిన్న భట్టి విక్రమార్క చెప్పినవన్నీ అవాస్తవాలే: హరీశ్‌రావు
నిధులు లేవని కేసీఆర్ ఏనాడు సంక్షేమ పథకాలను ఆపలేదన్నారు మాజీ మంత్రి హరీశ్ రావు. రంకెలు వేసినంత మాత్రాన అంకెలు మారవని, నిన్న భట్టి విక్రమార్క చెప్పినవన్నీ అవాస్తవాలేనని ఆయన ఆరోపించారు. బీఆర్‌ఎస్ ప్రభుత్వ మొత్తం అప్పు 5.56 లక్షల కోట్లు అని భట్టి చెప్పారని, కానీ కేసీఆర్ ప్రభుత్వం దిగిపోయేనాటికి చెల్లించాల్సిన అప్పు రూ.4.17 లక్షల కోట్లు మాత్రమేనని స్పష్టం చేశారు. కాంగ్రెస్ నేతల అనుభవం స్కామ్‌లు చేసేందుకే ఉపయోగపడుతోందని హరీశ్ ఎద్దేవా చేశారు.
పార్లమెంట్ వర్షాకాల సమావేశాలకు తేదీలు ఖరారు
పార్లమెంట్ వర్షాకాల సమావేశాలకు ముహూర్తం ఖరారైంది. జులై 20 నుంచి ఆగస్టు 13వరకు పార్లమెంటు సమావేశాలు నిర్వహించనున్నట్లు కేంద్ర పార్లమెంటు వ్యవహారాల శాఖ మంత్రి కిరణ్ రిజిజు తెలిపారు. ప్రభుత్వ సిఫార్సు మేరకు రాష్ట్రపతి ద్రౌపదిముర్ము ఉభయసభల సమావేశాలకు ఆమోదం తెలిపారని ఆయన వెల్లడించారు. ఈ విషయాన్ని పార్లమెంటు వ్యవహారాల శాఖ మంత్రి కిరణ్ రిజిజు సామాజిక మాధ్యమం ఎక్స్ ద్వారా వెల్లడించారు. జాతీయ ప్రాధాన్యత కలిగిన కీలక అంశాలతోపాటు పలు బిల్లులపై ఈ సమావేశాల్లో అర్థవంతమైన చర్చలు, సంభాషణలు, నిర్ణయాలు జరుగుతాయని కేంద్ర మంత్రి ఆశాభావం వ్యక్తం చేశారు.
ఐదోరోజు 6 ఎకరాల వరకు రైతుభరోసా నిధులు జమ
రైతుభరోసా నిధులు విడుదల కొనసాగుతోంది. ఇవాళ ఐదోరోజు 6 ఎకరాల వరకు నిధులు జమ అయ్యాయి. సుమారు 1.69 లక్షల మంది రైతుల ఖాతాల్లో రూ.5,45.41 కోట్ల జమ చేశారు. ఇప్పటివరకు 67.45 లక్షల మంది రైతులు రైతు భరోసా అందుకున్నారు.
గచ్చిబౌలి ట్రిపుల్ ఐటీలో విద్యార్థి ఆత్మహత్య
హైదరాబాద్ గచ్చిబౌలి ట్రిపుల్ ఐటీలో విద్యార్థి ఆత్మహత్య చేసుకున్నాడు. ట్రిపుల్ ఐటీలో కంప్యూటర్ సైన్స్ చదువుతున్న ఖమ్మం వాసి అనిరుధ్ క్యాంపస్ బిల్డింగ్ ఆరో అంతస్తు నుంచి దూకి చనిపోయాడు. అనిరుధ్ మరణానికి కారణాలు తెలియరాలేదు.
స్టెరాయిడ్ ఇంజెక్షన్లు అమ్మకూడదని ఇండియా మార్ట్‌కు పోలీసుల ఆదేశాలు
ఈ-కామర్స్ వెబ్‌సైట్ల నుంచి నిందితులు స్టెరాయిడ్ ఇంజెక్షన్లు కొనుగోలు చేసి, వాటిని మార్కెట్లో ఎక్కువ ధరకు విక్రయిస్తున్నారని పోలీసులు తెలిపారు. ఇలా విక్రయిస్తున్న ముఠాను పోలీసులు పట్టుకున్నారు. వైద్యుల అనుమతి లేకుండా స్టెరాయిడ్ ఇంజెక్షన్లు వాడకూడదని, కొందరు ఫేక్ మందుల చీటి ద్వారా స్టెరాయిడ్ ఇంజెక్షన్లు కొనుగోలు చేస్తున్నారని టాస్క్‌ఫోర్స్ డీసీపీ వైభవ్ గైక్వాడ్ తెలిపారు. స్టెరాయిడ్ ఇంజెక్షన్లు అమ్మకూడదని ఇండియా మార్ట్‌కు ఇప్పటికే ఆదేశాలు ఇచ్చామన్నారు.
ఉమ్రాకు వెళ్లిన బంధువుల ఇంట్లో చోరీ చేసిన ముగ్గురు అరెస్టు
హైదరాబాద్‌లో ఉమ్రాకు వెళ్లిన బంధువుల ఇంట్లో చోరీ చేసిన ముగ్గురిని పోలీసులు అరెస్టు చేశారు. నిందితుల నుంచి 134 గ్రాముల బంగారం, రూ.12.50 లక్షలతో కలుపుకొని మొత్తం రూ.29 లక్షల విలువైన సొత్తు స్వాధీనం చేసుకున్నారు. సీసీ ఫుటేజీ, ఫింగర్‌ప్రింట్స్ ఆధారంగా పోలీసులు నిందితులను గుర్తించారు.
కొండపాక శ్రీ సత్యసాయి సంజీవని ఆస్పత్రిలో 'గిఫ్ట్ ఆఫ్ లైఫ్' కార్యక్రమం
సిద్దిపేటలోని కొండపాక శ్రీ సత్యసాయి సంజీవని ఆస్పత్రిలో 'గిఫ్ట్ ఆఫ్ లైఫ్' కార్యక్రమం జరుగుతోంది. ఉచితంగా 500 గుండె సర్జరీలు పూర్తయిన సందర్భంగా 'గిఫ్ట్ ఆఫ్ లైఫ్' కార్యక్రమం నిర్వహిస్తున్నారు. ఈ కార్యక్రమంలో హరీశ్‌రావు, సినీహీరో విజయ్ దేవరకొండ పాల్గొన్నారు.
కాంగ్రెస్, బీఆర్‌ఎస్ పార్టీలు రూ.10 లక్షల కోట్ల అప్పులు చేశాయి: బండి సంజయ్
కాంగ్రెస్, బీఆర్‌ఎస్ పార్టీలు రూ.10 లక్షల కోట్ల అప్పులు చేశాయని కేంద్రమంత్రి బండి సంజయ్ ఆరోపించారు. గ్రామాల అభివృద్ధికి కేంద్రం డబ్బులిస్తే... దారి మళ్లించారని, ఇలానే కొనసాగితే పాకిస్థాన్, శ్రీలంకలా తెలంగాణ మారుతుందని ఆయన ఆందోళన వ్యక్తం చేశారు. రాష్ట్రంలో డబుల్ ఇంజిన్ సర్కార్ వస్తేనే... అప్పులు తీరతాయని ప్రకటించారు. సర్‌పై రాష్ట్ర ప్రభుత్వం కుట్ర చేస్తోందని బండి సంజయ్ ఆరోపించారు.
ఉప్పల్ పీఎస్ పరిధిలోని ఆదర్శనగర్‌లో భార్యను చంపిన భర్త
హైదరాబాద్ ఉప్పల్ పీఎస్ పరిధిలోని ఆదర్శనగర్‌లో భర్త భార్యను చంపిన ఘటన వెలుగుచూసింది. క్యాబ్ డ్రైవర్‌గా పనిచేస్తున్న సురేశ్, భార్య జెస్సికాను అనుమానంతో హత్య చేశాడు. ఘటన అనంతరం సురేశ్ అక్కడి నుంచి పరార్యయాడు. సమాచారం అందుకున్న పోలీసులు దర్యాప్తు ప్రారంభించారు.
గచ్చిబౌలి, కొండాపూర్‌లో ఫుట్‌పాత్ ఆక్రమణలను తొలగించిన హైడ్రా, సీఎంసీ
గచ్చిబౌలి, కొండాపూర్‌లో ఫుట్‌పాత్ ఆక్రమణలను హైడ్రా, సీఎంసీ తొలగించింది. కొండాపూర్ బొటానికల్ గార్డెన్ నుంచి మసీద్‌బండ వరకు ఆక్రమణలు తొలగించారు. భారీ పోలీసు బందోబస్తు మధ్య ఈ కార్యక్రమం చేపట్టారు.
ఆహార కల్తీపై 100 రోజుల్లో 185 కేసులు నమోదు చేసిన హెచ్-ఫాస్ట్
ఆహార కల్తీపై 100 రోజుల్లో హెచ్-ఫాస్ట్ 185 కేసులు నమోదు చేసింది. సుమారు 122 టన్నుల కల్తీ, నాసిరకం ఆహార పదార్థాలు స్వాధీనం చేసుకుంది. కల్తీ అల్లం-వెల్లుల్లి పేస్ట్, పండ్లు, పనీర్, కోవా, నెయ్యి, మాంసం, చికెన్ వ్యర్థాలు సీజ్ చేసింది. తదుపరి చర్యల కోసం ఫుడ్ సేఫ్టీ అధికారులకు 247 కేసులు బదిలీ చేసింది. రాజేంద్రనగర్ జోన్‌లో అత్యధికంగా 55 కేసులు నమోదయ్యాయి. రోజూ సగటున 15 వరకు ఫిర్యాదులు అందుతున్నట్లు హైదరాబాద్ సీపీ వెల్లడించారు.
20 ఏళ్ల రాజకీయ జీవితంపై భావోద్వేగంతో 'ఎక్స్'లో పోస్ట్ పెట్టిన సీఎం
20 ఏళ్ల రాజకీయ జీవితంపై భావోద్వేగంతో 'ఎక్స్'లో సీఎం రేవంత్ రెడ్డి పోస్ట్ పెట్టారు. మిడ్జిల్‌లో ప్రారంభమైన రాజకీయ జీవితాన్ని గుర్తు చేసుకున్న సీఎం రేవంత్‌రెడ్డి.. రెండు దశాబ్దాల ప్రజాజీవితం మరపురాని మధురజ్ఞాపకమన్నారు. రేవంత్‌రెడ్డిగా మెుదలైన ప్రయాణం.. రేవంతన్నగా నిలిచే స్థాయికి చేరింది సంతోషం వ్యక్తం చేశారు. 20 ఏళ్ల రాజకీయ ప్రస్థానం నా జీవితంలో ప్రత్యేక అధ్యాయమని, ప్రతి సందర్భం, సంఘటన, సంఘర్షణలో అండగా ఉన్న ప్రజలకు సీఎం కృతజ్ఞతలు తెలిపారు.
రేపు కాళేశ్వరం ప్రాజెక్టుకు వెళ్లనున్న బీఆర్‌ఎస్ నేతలు
బీఆర్‌ఎస్ నేతలు రేపు కాళేశ్వరం ప్రాజెక్టుకు వెళ్లనున్నారు. కేటీఆర్ నేతృత్వంలో బీఆర్‌ఎస్ నేతలు కన్నెపల్లి పంప్‌హౌస్ పరిశీలించనున్నారు. కన్నెపల్లి పంప్‌హౌస్ నుంచి నీటిని ఎత్తిపోసే అవకాశం ఉందన్న బీఆర్‌ఎస్.. ప్రభుత్వం అలా ఎందుకు చేయట్లేదని విమర్శించింది.
తెలంగాణ రక్షణ సేన(టీఆర్‌ఎస్) పేరుపై పెద్ద సంఖ్యలో అభ్యంతరాలు
తెలంగాణ రక్షణ సేన(టీఆర్‌ఎస్) పేరుపై పెద్ద సంఖ్యలో అభ్యంతరాలు రావడంతో ప్రత్యామ్నాయ పేర్లు సూచించాలని ఈసీ సూచించింది. ఈ మేరకు కల్వకుంట్ల కవితకు లేఖ రాసింది. ఈసీ లేఖకు సమాధానాలు తెలంగాణ రక్షణ సేన(టీఆర్‌ఎస్) పంపింది. కేవలం రెండు అభ్యంతరాలు మాత్రమే తమకు పంపినట్లు లేఖలో వెల్లడించింది. మిగతా అభ్యంతరాలు చెప్పకుండా ప్రత్యామ్నాయ పేర్లు ఎలా అడుగుతారని టీఆర్‌ఎస్ ప్రశ్నించింది. దేశంలోని చాలా పార్టీల సంక్షిప్త నామాలు ఒకేలా ఉన్నాయంటున్న టీఆర్‌ఎస్, పార్టీ పేరు అంశంలో అవసరమైతే న్యాయ పోరాటం చేస్తామని ప్రకటించింది.
సూర్యాపేట: కోదాడలో గతనెల మరణించిన యువకుడి కేసులో ట్విస్ట్
సూర్యాపేట జిల్లా కోదాడలో గతనెల మరణించిన యువకుడి కేసులో మరిన్ని నిజాలు వెలుగులోకి వచ్చాయి. మహేశ్ కాలితో తన్నడంతో లారీ కింద పడి యాకూబ్ మరణించాడు. యాకూబ్ మృతిని లారీ డ్రైవర్‌పై నెట్టేందుకు మహేశ్ యత్నించాడు. ఈ మేరకు సీసీ ఫుటేజీ పరిశీలించడంతో వాస్తవాలు వెలుగులోకి వచ్చాయి. బార్‌లో జరిగిన గొడవ కారణంగానే ఈ ఘటన జరిగినట్లు పోలీసులు నిర్ధారించారు.
దొడ్డి కొమురయ్య వర్ధంతి సందర్భంగా నివాళులు అర్పించిన కేటీఆర్
దొడ్డి కొమురయ్య వర్ధంతి సందర్భంగా కేటీఆర్ నివాళులు అర్పించారు. తెలంగాణ పోరాట స్ఫూర్తికి నిలువెత్తు రూపం దొడ్డి కొమురయ్య అంటూ కేటీఆర్ కొనియాడారు. దొడ్డి కొమురయ్య స్ఫూర్తిని భావితరాలకు అందించేందుకు కృషి చేశామని తెలిపారు.
వరంగల్ భద్రకాళి అమ్మవారి ఆలయం వద్ద ఉద్రిక్తత
వరంగల్ భద్రకాళి అమ్మవారి ఆలయం వద్ద ఉద్రిక్తత నెలకొంది. ఆలయం శుద్ధి కోసం వచ్చిన బీజేపీ కార్యకర్తలను పోలీసులు అడ్డుకున్నారు. భద్రకాళి ఆలయం వద్ద పోలీసులు-బీజేపీ కార్యకర్తలకు మధ్య తోపులాట జరిగింది. పలువురు బీజేపీ నేతలను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. కాంగ్రెస్, బీఆర్ఎస్ నేతలు రావడంతో ఆలయం అపవిత్రమైందంటూ బీజేపీ ఆరోపణ చేసింది. నిన్న తడిబట్టలతో కాంగ్రెస్, బీఆర్ఎస్ నేతలు ఆలయానికి వెళ్లిన కారణంగా ఆలయం అపవిత్రమైనందున శుద్ధి చేస్తామంటూ బీజేపీ నేతలు వచ్చారు. 'కుడా' ఫ్లాట్ల వేలంపై ఆరోపణలు చేస్తూ ఇరుపార్టీల నేతలు ఆలయానికి వెళ్లారు.
సంగారెడ్డి జిల్లా : ముత్తంగి ఓఆర్‌ఆర్ కూడలిలో రేషన్‌బియ్యం స్వాధీనం
సంగారెడ్డి జిల్లా ముత్తంగి ఓఆర్‌ఆర్ కూడలిలో 32 క్వింటాళ్ల రేషన్‌బియ్యం ఎస్‌వోటీ పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. హైదరాబాద్ నుంచి గుజరాత్‌కు తరలిస్తుండగా రేషన్‌బియ్యం స్వాధీనం చేసుకున్నారు.
ఖమ్మం: కల్లూరు పట్టణం అంబేడ్కర్‌నగర్‌లో కుమారుడిని చంపిన తండ్రి
ఖమ్మం జిల్లా కల్లూరు పట్టణం అంబేడ్కర్‌నగర్‌లో తండ్రి కుమారుడిని చంపేశాడు. కుటుంబ కలహాల కారణంగా తండ్రి ఆ హత్యకు పాల్పడినట్లు సమాచారం.
శంషాబాద్ నుంచి కౌలాలంపూర్ వెళ్లాల్సిన విమానంలో సాంకేతిక లోపం
శంషాబాద్ నుంచి కౌలాలంపూర్ వెళ్లాల్సిన విమానంలో సాంకేతిక లోపం ఎదురైంది. సిబ్బంది టేకాఫ్‌కు ముందు లోపం గుర్తించి ప్రయాణికులను దించేసింది. సాంకేతిక లోపం వచ్చిన విమానంలో సుమారు 150 మంది ప్రయాణికులు ఉన్నారు. ఎలాంటి ఇబ్బంది కలగకుండా ప్రయాణికులకు సిబ్బంది హోటల్లో బస ఏర్పాటు చేశారు.
కామారెడ్డి పట్టణంలోని రాజీవ్‌నగర్ కాలనీలో కార్డన్‌సెర్చ్
కామారెడ్డి పట్టణంలోని రాజీవ్‌నగర్ కాలనీలో కార్డన్‌సెర్చ్ చేశారు. సరైన ధ్రువపత్రాలు లేని 95 బైక్‌లు, 15 ఆటోలు స్వాధీనం చేసుకున్నారు.
ఉత్తరప్రదేశ్ : ఆగ్రాలో భర్తను చంపి టైల్స్ కింద పాతిపెట్టిన భార్య
ఉత్తర్‌ప్రదేశ్‌లో దారుణం చోటుచేసుకుంది. ఆగ్రాలో భర్తను చంపిన ఓ భార్య టైల్స్ కింద పాతిపెట్టింది. బాత్‌రూమ్ టైల్స్ కింద సురేంద్ర శర్మ(45)ను పాతిపెట్టి, పైనుంచి కాంక్రీట్ వేసింది. సురేంద్ర శర్మ మృతదేహాన్ని వెలికి తీసిన పోలీసులు, నిందితురాలు రూబీశర్మను అరెస్టు చేసి విచారిస్తున్నారు.
పెద్దపల్లి: గోదావరిఖని లక్ష్మీనగర్‌లోని పూజా సామగ్రి దుకాణంలో మంటలు
పెద్దపల్లి జిల్లా గోదావరిఖని లక్ష్మీనగర్‌లోని పూజా సామగ్రి దుకాణంలో మంటలు చెలరేగాయి. షార్ట్ సర్క్యూట్‌తో అగ్నిప్రమాదం సంభవించగా, మంటలు పక్క దుకాణానికీ వ్యాపించాయి. అగ్నిమాపక సిబ్బంది ఘటనా స్థలికి చేరుకొని మంటలు అదుపు చేశారు. సుమారు రూ.10 లక్షల ఆస్తి నష్టం జరిగినట్లు అధికారులు అంచనా వేస్తున్నారు.
మాంచెస్టర్ : నేడు ఇంగ్లాండ్‌తో భారత్ రెండో టీ20
మాంచెస్టర్ : నేడు ఇంగ్లాండ్‌తో భారత్ రెండో టీ20 ఆడనుంది. రాత్రి 7 గంటల నుంచి ఇంగ్లాండ్, భారత్ మధ్య రెండో టీ 20 మ్యాచ్ స్టార్ కానుంది.
ఉప్పల్: నేడు టీజీ-20 లీగ్‌లో రెండు మ్యాచ్‌లు
ఉప్పల్: నేడు టీజీ-20 లీగ్‌లో రెండు మ్యాచ్‌లు జరగనున్నాయి. మధ్యాహ్నం 2.15 గంటల నుంచి అన్విత ఖమ్మం, రంగారెడ్డి రైజర్స్ మ్యాచ్ జరగనుండగా, రాత్రి 7.15 గంటల నుంచి కరీంనగర్ డైమండ్స్, హైదరాబాద్ ఈ ఛాంపియన్స్ తలపడనున్నాయి.
నిజామాబాద్ రూరల్ పరిధిలో విస్తారంగా వర్షం
నిజామాబాద్ రూరల్ పరిధిలో విస్తారంగా వర్షాలు కురుస్తున్నాయి. మోపాల్, ఇందల్వాయి, డిచ్‌పల్లి, సిరికొండ, జక్రాన్ పల్లి, ధర్పల్లి, నిజామాబాద్ రూరల్ మండలాల్లో వర్షాలు పడుతున్నాయి.
నేడు నాగర్‌కర్నూల్ జిల్లాలో ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి పర్యటన
నేడు నాగర్‌కర్నూల్ జిల్లాలో ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి పర్యటించనున్నారు. 20ఏళ్ల రాజకీయ జీవితానికి పురుడు పోసిన గడ్డపై నేడు తిరిగి వస్తున్నారు. జడ్పీటీసీగా మొదలై సీఎంగా ఎదిగిన తనను ఆదరించిన ప్రజలను కలవనున్నారు. ఊర్కొండపేట ఆంజనేయస్వామిని దర్శించుకుని అనంతరం రూ.10 కోట్లతో పలు అభివృద్ధి పనులకు శంకుస్థాపన చేయనున్నారు. అనుచరులు, నేతలు, పెద్దలతో ఆత్మీయ సమ్మేళనం నిర్వహణ తర్వాత మధ్యాహ్నం మిడ్జిల్‌లో అంబేడ్కర్, గోపాల్‌రెడ్డి విగ్రహాలు ఆవిష్కరిస్తారు. అలాగే మిడ్జిల్‌లో పలు అభివృద్ధి పనులకు సీఎం రేవంత్‌రెడ్డి భూమిపూజ చేస్తారు.
తెలంగాణ పోలీస్ శాఖలో కొలువుల జాతర షురూ
తెలంగాణ పోలీస్ శాఖలో కొలువుల జాతర షురూ మొదలైంది. పోలీస్, జైళ్లు, అగ్నిమాపక, స్పెషల్ ప్రొటెక్షన్ ఫోర్స్‌లో కొలువుల భర్తీకి రంగం సిద్ధమైంది. దాదాపు 7 వేల పోలీస్ పోస్టుల భర్తీకి ప్రభుత్వం ఆమోదముద్ర వేసింది. పోలీసు శాఖలో 5,000 ఉద్యోగాలు, త్వరలో మరో 2 వేల పోస్టులకు ఉత్తర్వులు వెలువరించనుంది. ఆర్థిక అనుమతులు మంజూరు చేయడంతో త్వరలో నియామక ప్రక్రియలు షురూ కానున్నాయి. ఒకట్రెండు రోజుల్లో తెలంగాణ పోలీస్ నియామక మండలి నోటిఫికేషన్ విడుదల చేసే అవకాశం ఉంది. 10 విభాగాల్లో కలిపి మొత్తం 5,000 పోస్టులు భర్తీ చేయనుంది. అత్యధికంగా పోలీసు కానిస్టేబుల్(సివిల్) విభాగంలో 3,697 పోస్టులు, ఆర్మ్‌డ్ రిజర్వ్ కానిస్టేబుల్ విభాగంలో 1,052 పోస్టులు, సబ్‌ఇన్‌స్పెక్టర్(సివిల్)-148, సబ్‌ఇన్‌స్పెక్టర్(ఆర్మ్‌డ్ రిజర్వ్)-14 పోస్టులు, రిజర్వ్ సబ్‌ఇన్‌స్పెక్టర్(టీజీఎస్పీ)-12, సబ్‌ఇన్‌స్పెక్టర్(ఎస్‌ఏఆర్ సీపీఎల్)-3 పోస్టులు, అసిస్టెంట్ సబ్‌ఇన్‌స్పెక్టర్(ఎఫ్‌పీబీ)-23, సివిల్ -3,697 పోస్టులు, పోలీసు కానిస్టేబుల్(ఆర్మ్‌డ్ రిజర్వ్)- 1,052 పోస్టులు, పోలీసు కానిస్టేబుల్(ఎస్‌ఏఆర్ సీపీఎల్)- 24 పోస్టులు, పోలీసు కానిస్టేబుల్(డ్రైవర్-పీటీవో)-20, మెకానిక్ పీటీవో- 7 పోస్టులు భర్తీ కానున్నాయి.
అల్పపీడనం ప్రభావంతో రాష్ట్రంలో 3 రోజులు భారీ నుంచి అతి భారీ వర్షాలు
వాయవ్య బంగాళాఖాతంలో ఏర్పడిన అల్పపీడనం ప్రభావంతో రాష్ట్రంలో మూడు రోజులు భారీ నుంచి అతి భారీ వర్షాలు కురిసే అవకాశముందని వాతావరణశాఖ వెల్లడించింది. ఉత్తర తెలంగాణలోని ఉమ్మడి ఆదిలాబాద్, నిజామాబాద్, కరీంనగర్ జిల్లాల్లో భారీ నుంచి అతి భారీ వర్షాలు, తూర్పు తెలంగాణ జిల్లాలైన ఉమ్మడి వరంగల్, ఖమ్మం జిల్లాల్లో అక్కడక్కడ భారీ వర్ష సూచన ఉన్నట్లు సూచించింది. దక్షిణ, మధ్య తెలంగాణ జిల్లాల్లో తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉంది. ఇవాళ ఉమ్మడి ఆదిలాబాద్ తో పాటు నిజామాబాద్, జగిత్యాల జిల్లాలకు ఎల్లో అలర్ట్ జారీ చేసింది. రేపు ఆదిలాబాద్, ఆసిఫాబాద్, మంచిర్యాల జిల్లాలకు ఆరెంజ్ అలర్ట్ జారీ చేయగా, పెద్దపల్లి, కరీంనగర్ జిల్లాలకు ఆరెంజ్ హెచ్చరికలు జారీ చేసింది.
హైదరాబాద్: జవహర్‌నగర్‌లోని శాంతినగర్‌లో రేఖ(24) అనే వివాహిత ఆత్మహత్య
హైదరాబాద్ జవహర్‌నగర్‌లోని శాంతినగర్‌లో రేఖ(24) అనే వివాహిత ఆత్మహత్యకు పాల్పడింది. కుటుంబకలహాలు, వేధింపులతో ఉరేసుకుని రేఖ ఆత్మహత్య చేసుకుంది. మృతురాలు రేఖకు 11 నెలల బాబు ఉన్నట్లు సమాచారం. మృతురాలి తల్లి ఫిర్యాదుతో కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేపట్టారు.

