ETV Bharat / state

3rd September 2026 AP News Today Live Updates : ఈనెల 5న ఉద్యోగ సంఘాలతో సీఎం భేటీ

3rd September 2026 AP News Today Live Updates
ఆంధ్రప్రదేశ్ తెలుగు బ్రేకింగ్​ న్యూస్​ (ETV Bharat)
author img

By ETV Bharat Andhra Pradesh Team

Published : September 3, 2026 at 7:03 AM IST

|

Updated : September 3, 2026 at 10:16 PM IST

Choose ETV Bharat

3rd September 2026 AP News Today Live Updates : టీటీడీ డిప్యూటీ ఈవో లోకనాథంను ఏసీబీ అధికారులు గురువారం అరెస్టు చేశారు. నిన్న ఉదయం నుంచి లోకనాథం ఇల్లు, కార్యాలయాల్లో చేపట్టిన సోదాలు ముగిసిన నేపథ్యంలో ఆయనను అదుపులోకి తీసుకున్నారు. నెల్లూరు ఏసీబీ కోర్టులో హాజరుపరచనున్నారు. లోకనాథం ఇంట్లో రూ.5 కోట్ల విలువైన ఆస్తులు గుర్తించారు.

LIVE FEED

10:14 PM, 3 Sep 2026 (IST)

ఈనెల 5న ఉద్యోగ సంఘాలతో సీఎం భేటీ

పీఆర్‌సీ, ఉద్యోగుల సమస్యలపై ఈ నెల 5న ఉద్యోగ సంఘాల నేతలతో ముఖ్యమంత్రి చంద్రబాబు భేటీ కానున్నారు. ఉండవల్లి క్యాంపు కార్యాలయంలో ఈ సమావేశం జరగనుంది. పెండింగ్ డీఏలు, ఇతర బకాయిలపై ఇందులో ప్రధానంగా చర్చిస్తారు. ఒక్కో ఉద్యోగ సంఘం నుంచి ఒక ప్రతినిధిని చర్చలకు రావాలని ప్రభుత్వం ఆహ్వానించింది. ఈ విషయాన్ని అమరావతి ఐకాస అధ్యక్షుడు బొప్పరాజు వెంకటేశ్వర్లు ధ్రువీకరించారు.

10:14 PM, 3 Sep 2026 (IST)

స్థానిక ఎన్నికల్లో బీసీలకు 34 శాతం రిజర్వేషన్లు: సీఎం

స్థానిక సంస్థల ఎన్నికలపై మంత్రులు, పార్టీ పరిశీలకులతో సీఎం చంద్రబాబు సమీక్ష నిర్వహించారు. అసెంబ్లీ కంటే మెరుగైన విజయం సాధించేలా పార్టీ యంత్రాంగం సమాయత్తం కావాలన్నారు. కూటమి పార్టీల మధ్య పూర్తి సమన్వయం ఉండాలని స్పష్టం చేశారు. స్థానిక పోరులో బీసీలకు ఖచ్చితంగా 34 శాతం రిజర్వేషన్లు ఇస్తామన్నారు. అభ్యర్థుల ఎంపికలో మహిళలు, యువత పనితీరుకు అధిక ప్రాధాన్యత ఉంటుందని తెలిపారు.

10:14 PM, 3 Sep 2026 (IST)

టీటీడీ డిప్యూటీ ఈవో లోకనాథంకు 14 రోజుల రిమాండ్

అక్రమాస్తుల కేసులో టీటీడీ డిప్యూటీ ఈవో లోకనాథంకు నెల్లూరు ఏసీబీ కోర్టు 14 రోజుల రిమాండ్ విధించింది. దీంతో అధికారులు ఆయన్ను నెల్లూరు జైలుకు తరలించారు. లోకనాథం, ఆయన బంధువుల ఇళ్లలో ఏకకాలంలో జరిపిన తనిఖీల్లో సుమారు రూ.5 కోట్ల విలువైన ఆస్తులు, బంగారు, వెండి నగలను స్వాధీనం చేసుకున్నారు. గతంలో జరిగిన కల్తీ నెయ్యి వ్యవహారంలోనూ ఆయన ప్రమేయం ఉన్నట్లు ఆరోపణలు ఉన్నాయి.

10:12 PM, 3 Sep 2026 (IST)

కాణిపాకం బ్రహ్మోత్సవాలకు సీఎం చంద్రబాబుకు ఆహ్వానం

కాణిపాకం వరసిద్ధి వినాయకస్వామి బ్రహ్మోత్సవాలకు ముఖ్యమంత్రి చంద్రబాబును ఆలయ కమిటీ ఆహ్వానించింది. సచివాలయంలో పూతలపట్టు ఎమ్మెల్యే, దేవాదాయ శాఖ కమిషనర్‌తో కలిసి కమిటీ సభ్యులు సీఎంను కలిశారు. ఈ నెల 14 నుంచి అక్టోబర్ 4 వరకు జరిగే ఉత్సవాలకు రావాలని కోరారు. ఈ సందర్భంగా వేద పండితులు ముఖ్యమంత్రికి వేదాశీర్వచనం పలికి, స్వామివారి శేషవస్త్రాలు, తీర్థ ప్రసాదాలు అందజేశారు.

10:12 PM, 3 Sep 2026 (IST)

బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడితో నటుడు బాబూమోహన్ భేటీ

విజయవాడలోని బీజేపీ రాష్ట్ర కార్యాలయాన్ని ప్రముఖ సినీ నటుడు బాబూమోహన్ సందర్శించారు. పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు మాధవ్‌ను ఆయన మర్యాదపూర్వకంగా కలుసుకున్నారు. ఆంధ్రప్రదేశ్‌లో పార్టీ కార్యక్రమాలు, సమకాలీన అంశాలపై ఇరువురి మధ్య చర్చ జరిగింది. ఈ సందర్భంగా బాబూమోహన్‌ను మాధవ్ శాలువాతో సత్కరించి, 'సారథ్యం యాత్ర' ప్రత్యేక సంచికను ఆయనకు బహూకరించారు.

8:54 PM, 3 Sep 2026 (IST)

స్థానిక ఎన్నికలపై చంద్రబాబు కసరత్తు

స్థానిక సంస్థల ఎన్నికలకు సన్నద్ధం కావడంపై సీఎం చంద్రబాబు దృష్టి సారించారు. ఇందులో భాగంగా ఉండవల్లి క్యాంపు కార్యాలయంలో పార్టీ మంత్రులు, రీజినల్ కోఆర్డినేటర్లతో ఆయన సమావేశమయ్యారు. రాబోయే స్థానిక సంస్థల ఎన్నికల్లో అనుసరించాల్సిన వ్యూహాలు, పార్టీ శ్రేణులను సమాయత్తం చేసే అంశాలపై నేతలతో సీఎం విస్తృతంగా చర్చించారు.

8:54 PM, 3 Sep 2026 (IST)

మంత్రి కొండా సురేఖ బర్తరఫ్‌కు గవర్నర్ ఆమోదం

తెలంగాణ మంత్రివర్గం నుంచి కొండా సురేఖను బర్తరఫ్ చేసేందుకు గవర్నర్ శివప్రతాప్‌ శుక్లా ఆమోదం తెలిపారు. అంతకుముందు సీఎం రేవంత్‌రెడ్డి లోక్‌భవన్‌కు వెళ్లి గవర్నర్‌ను కలిసి ఈ మేరకు సిఫార్సు లేఖ సమర్పించారు. సీఎం సిఫార్సు మేరకు కొండా సురేఖను క్యాబినెట్ నుంచి తొలగిస్తూ గవర్నర్ నిర్ణయం తీసుకున్నారు.

8:53 PM, 3 Sep 2026 (IST)

ఉన్నత విద్యామండలి ఇన్‌ఛార్జ్ బాధ్యతల అప్పగింత

ఉన్నత విద్యామండలి ఛైర్మన్ మధుమూర్తి సుదీర్ఘ సెలవుపై వెళ్లారు. దీంతో కౌన్సిల్ వైస్ ఛైర్మన్ ప్రొఫెసర్ విజయభాస్కరరావుకు ఛైర్మన్ ఇన్‌ఛార్జ్ బాధ్యతలను అప్పగించారు. ప్రభుత్వ ఆదేశాల మేరకు ఆయన ఈ అదనపు బాధ్యతలను స్వీకరించనున్నారు.

8:53 PM, 3 Sep 2026 (IST)

ఐఏఎస్ ప్రసన్న వెంకటేశ్‌ను రిలీవ్ చేసిన ప్రభుత్వం

సీనియర్ ఐఏఎస్ అధికారి ప్రసన్న వెంకటేశ్‌ను ఏపీ ప్రభుత్వం విధుల నుంచి రిలీవ్ చేసింది. ఇటీవల ఆయన జాతీయ పరీక్షల సంస్థ (ఎన్‌టీఏ) డైరెక్టర్‌గా నియమితులయ్యారు. ప్రస్తుతం సాంఘిక సంక్షేమ గురుకుల విద్యాసంస్థల సొసైటీ కార్యదర్శిగా బాధ్యతలు చూస్తున్న ఆయన, త్వరలోనే కేంద్ర సర్వీసుల్లో చేరనున్నారు.

8:52 PM, 3 Sep 2026 (IST)

కారుమూరి కస్టడీ కోసం పోలీసుల పీటీ వారెంట్

మద్యం రవాణా టెండర్ల కేసులో నిందితుడిగా ఉన్న కారుమూరి నాగేశ్వరరావును కస్టడీలోకి తీసుకునేందుకు పోలీసులు పీటీ వారెంట్ పిటిషన్ వేశారు. ప్రస్తుతం ఆయన చంచల్‌గూడ జైలులో రిమాండ్‌లో ఉన్నారు. ఈ పిటిషన్‌పై కౌంటర్ దాఖలు చేయాలని న్యాయవాదులను ఆదేశించిన న్యాయస్థానం, తదుపరి విచారణను సెప్టెంబర్ 11వ తేదీకి వాయిదా వేసింది.

8:52 PM, 3 Sep 2026 (IST)

సత్యప్రసాద్ అప్రూవర్ పిటిషన్‌పై 9న తీర్పు

మద్యం కుంభకోణం కేసులో ఏ3 నిందితుడు సత్యప్రసాద్ దాఖలు చేసిన అప్రూవర్ పిటిషన్‌పై ఏసీబీ కోర్టులో విచారణ జరిగింది. వైసీపీ హయాంలో ఈయన ఏపీఎస్‌బీసీఎల్‌ స్పెషల్ ఆఫీసర్‌గా పనిచేశారు. తాను అప్రూవర్‌గా మారేందుకు అనుమతించాలని ఆయన కోరారు. ఈ పిటిషన్‌పై తీర్పును న్యాయస్థానం ఈ నెల 9వ తేదీకి వాయిదా వేసింది.

8:52 PM, 3 Sep 2026 (IST)

బొల్లుపల్లిలో పులి దాడిలో గేదె మృతి

మార్కాపురం డివిజన్ పరిధిలోని అర్ధవీడు మండలం బొల్లుపల్లి గ్రామంలో పులి సంచారం తీవ్ర కలకలం రేపింది. గ్రామంలోకి చొరబడిన పులి ఓ గేదెపై దాడి చేసి చంపేసింది. దీంతో సమీప గ్రామాల ప్రజలు భయాందోళనలకు గురవుతున్నారు. అటవీ శాఖ అధికారులు వెంటనే రంగంలోకి దిగి తగిన చర్యలు తీసుకోవాలని గ్రామస్తులు కోరుతున్నారు.

7:50 PM, 3 Sep 2026 (IST)

తాళ్లరేవు వద్ద రోడ్డు ప్రమాదంలో ఇద్దరు మృతి

కాకినాడ జిల్లా తాళ్లరేవు మండలం మట్లపాలెం వద్ద ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. ఆటో, బైకు బలంగా ఢీకొనడంతో ఇద్దరు యువకులు అక్కడికక్కడే మృతి చెందారు. మరో యువకుడి పరిస్థితి విషమంగా ఉండటంతో ఆస్పత్రికి తరలించారు. మృతులను పటవల గ్రామస్తులుగా పోలీసులు గుర్తించారు.

7:50 PM, 3 Sep 2026 (IST)

ప్రైవేటు ఆస్పత్రులకు రూ.233 కోట్ల చెల్లింపులు

ఎన్టీఆర్ వైద్యసేవ ట్రస్ట్ అనుబంధ ప్రైవేటు ఆస్పత్రులకు ప్రభుత్వం రూ.233 కోట్లు చెల్లించింది. ఈహెచ్‌ఎస్ కింద మరో రూ.23 కోట్లు ఇచ్చేందుకు రంగం సిద్ధమైంది. ఈ ఏడాది నెట్‌వర్క్ ఆస్పత్రులకు మొత్తం రూ.1,657 కోట్లు చెల్లించినట్లు మంత్రి సత్యకుమార్ తెలిపారు. బిల్లుల చెల్లింపులపై ప్రభుత్వం ప్రత్యేక శ్రద్ధ పెట్టిందన్నారు.

7:49 PM, 3 Sep 2026 (IST)

నడింపాలెంలో కేంద్ర యోగా, ప్రకృతి వైద్య సంస్థ

గుంటూరు జిల్లా నడింపాలెంలో కేంద్ర యోగా, ప్రకృతి వైద్య పరిశోధన సంస్థ ఏర్పాటు కానుంది. రూ.100 కోట్లతో 100 పడకల ఆస్పత్రిని నిర్మించేందుకు కేంద్రం ఉత్తర్వులు ఇచ్చిందని మంత్రి సత్యకుమార్ తెలిపారు. రూ.9.94 కోట్లతో త్వరలోనే ప్రభుత్వం ఆధ్వర్యంలో ఈ సంస్థ నిర్మాణ పనులు ప్రారంభం కానున్నాయి.

7:49 PM, 3 Sep 2026 (IST)

ముగిసిన దస్తగిరి ఈడీ విచారణ

వివేకా హత్య కేసులో దస్తగిరి ఈడీ విచారణ ముగిసింది. సుమారు 7 గంటల పాటు అధికారులు ఆయనను ప్రశ్నించారు. హత్యకు ముందు, తర్వాత జరిగిన రూ.40 కోట్ల డీల్, బ్యాంకు లావాదేవీలపై ఆరా తీశారు. తాను ఈడీ అడిగిన అన్ని ప్రశ్నలకు వాస్తవాలే చెప్పానని విచారణ అనంతరం దస్తగిరి తెలిపారు. మనీలాండరింగ్ వెనుక ఉన్న సూత్రధారులు బయటపడాలని ఆయన కోరారు.

7:49 PM, 3 Sep 2026 (IST)

ఏసీబీ కోర్టులో మద్యం కేసు విచారణ

రాష్ట్రంలో సంచలనం రేపిన మద్యం కేసు విచారణను ఏసీబీ కోర్టు ఈనెల 11కు వాయిదా వేసింది. ఈ కేసులో ఏ3 నిందితుడిగా ఉన్న సత్యప్రసాద్ తాను అప్రూవర్‌గా మారుతానని పిటిషన్ వేశారు. ఆయన గత వైసీపీ ప్రభుత్వ హయాంలో ఏపీఎస్‌బీసీఎల్‌ స్పెషల్ ఆఫీసర్‌గా పనిచేశారు. ఈ పిటిషన్‌పై 11వ తేదీన కోర్టు తదుపరి విచారణ చేపట్టనుంది.

7:49 PM, 3 Sep 2026 (IST)

ఈశ్వర్ కిరణ్ కస్టడీకి కోర్టు అనుమతి

మద్యం కుంభకోణం కేసులో ఏ9 నిందితుడు ఈశ్వర్ కిరణ్‌ను కస్టడీకి తీసుకునేందుకు ఏసీబీ కోర్టు అనుమతించింది. ఈ నెల 7, 8, 9 తేదీల్లో విచారించేందుకు ఏసీబీకి గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. రాజ్ కెసిరెడ్డితో కలిసి మద్యం స్కామ్ లావాదేవీల్లో ఈశ్వర్ కిరణ్ కీలకంగా వ్యవహరించారు. ప్రస్తుతం ఆయన గుంటూరు జైలులో రిమాండ్ ఖైదీగా ఉన్నారు.

6:37 PM, 3 Sep 2026 (IST)

79 మందికి రాష్ట్ర ఉత్తమ ఉపాధ్యాయ పురస్కారాలు

రాష్ట్రంలో ఉత్తమ ఉపాధ్యాయుల జాబితాను ప్రభుత్వం అధికారికంగా ప్రకటించింది. విద్యా రంగంలో విశేష సేవలు అందించిన 79 మంది ఉపాధ్యాయులను ఈ అవార్డులకు ఎంపిక చేసింది. ఉపాధ్యాయ దినోత్సవం సందర్భంగా వీరికి ఈ పురస్కారాలను ప్రభుత్వం అందజేయనుంది. విద్యా ప్రమాణాల పెంపునకు కృషి చేసిన పలువురికి ఈ జాబితాలో చోటు దక్కింది.

6:37 PM, 3 Sep 2026 (IST)

ఏపీని ఏవియేషన్ హబ్‌గా తీర్చిదిద్దుతాం: మంత్రి జనార్దన్‌రెడ్డి

మంత్రి బీసీ జనార్దన్‌రెడ్డితో మెల్‌స్టార్ ఏవియేషన్ సంస్థ ప్రతినిధులు సచివాలయంలో భేటీ అయ్యారు. కర్నూలు విమానాశ్రయంలో పైలట్ శిక్షణ కేంద్రం, విజయవాడలో విమాన నిర్వహణ శిక్షణ కేంద్రాన్ని ఏర్పాటు చేసేందుకు వారు ఆసక్తి చూపారు. భోగాపురం, విజయవాడ, కర్నూలు ఎయిర్‌పోర్టుల్లో రిపేర్ యూనిట్లను నెలకొల్పాలని నిర్ణయించారు. ఏపీని ఏవియేషన్ హబ్‌గా తీర్చిదిద్ది యువతకు ఉపాధి కల్పిస్తామని మంత్రి తెలిపారు.

6:37 PM, 3 Sep 2026 (IST)

విద్యుత్ సరఫరాలో అంతరాయాలు రావొద్దు: మంత్రి గొట్టిపాటి

రాష్ట్రంలో విద్యుత్ సరఫరాపై అధికారులతో మంత్రి గొట్టిపాటి రవికుమార్ సమీక్ష నిర్వహించారు. ఎల్ నినో ప్రభావంతో కరెంట్ వినియోగం భారీగా పెరిగిందన్నారు. డిమాండ్‌కు తగినట్లుగా ప్లాంట్లు ఉత్పత్తికి సిద్ధంగా ఉండాలని ఆదేశించారు. థర్మల్, హైడల్ విద్యుత్ కేంద్రాల్లో ఎలాంటి సాంకేతిక సమస్యలు తలెత్తకుండా చూడాలన్నారు. ప్రజలకు, పరిశ్రమలకు కోతలు లేకుండా నాణ్యమైన నిరంతర విద్యుత్ అందించాలని స్పష్టం చేశారు.

5:50 PM, 3 Sep 2026 (IST)

సూర్యలంక బీచ్‌లో పచ్చదనం పెంపు

బాపట్ల సూర్యలంక బీచ్‌లో పచ్చదనం పెంచేందుకు శ్రీకారం చుట్టారు. అటవీశాఖ ఆధ్వర్యంలో పర్యావరణ పరిరక్షణ, సుందరీకరణ కోసం చర్యలు చేపట్టారు. ఇందులో భాగంగా కొణిదల నాగబాబు, ఎమ్మెల్యే నరేంద్రవర్మ కలిసి తాటి విత్తనాలు, మొక్కలు నాటారు. బీచ్‌లోని పొగురు దిబ్బ ప్రాంతంలో ఈ కార్యక్రమం జరిగింది. ఏపీ గ్రీన్ సొసైటీ ఆధ్వర్యంలో సూర్యలంకను మరింత పర్యాటకంగా అభివృద్ధి చేయడమే లక్ష్యమని నాగబాబు తెలిపారు.

5:50 PM, 3 Sep 2026 (IST)

తెనాలి వ్యాపారిది హత్యే: ఎస్పీ వకుల్ జిందాల్

తెనాలి వ్యాపారి నాగయ్య అదృశ్యం కేసును పోలీసులు ఛేదించారు. సోమసుందరపాలెం వద్ద ఆయన్ను కిడ్నాప్ చేసి హత్య చేశారని గుంటూరు ఎస్పీ వకుల్ జిందాల్ తెలిపారు. ఆస్తి కోసం బావమరిది రాజేషే ఈ దారుణానికి ఒడిగట్టాడని చెప్పారు. రూ.4 లక్షలకు సుపారీ గ్యాంగ్‌తో ఒప్పందం చేసుకున్నాడన్నారు. హత్య తర్వాత ఒంటిపై ఉన్న నగలు దోచుకెళ్లారని వెల్లడించారు. ఈ కేసులో ఐదుగురిని అరెస్టు చేసి, కారు, నగలు స్వాధీనం చేసుకున్నామన్నారు.

5:49 PM, 3 Sep 2026 (IST)

గుంటూరు బాలిక మిస్సింగ్ కేసులో సిట్ ఏర్పాటు

గుంటూరులో బాలిక అదృశ్యం కేసు దర్యాప్తు కోసం ప్రత్యేక దర్యాప్తు బృందాన్ని (సిట్) ఏర్పాటు చేశామని ఎస్పీ వకుల్ జిందాల్ తెలిపారు. ఈ కేసును అన్ని కోణాల్లో ముమ్మరంగా దర్యాప్తు చేస్తున్నామన్నారు. ఇందులో లవ్ జిహాద్ కోణం ఉందో, లేదో నిందితులను పట్టుకున్న తర్వాతే స్పష్టంగా తెలుస్తుందని ఆయన వెల్లడించారు.

5:49 PM, 3 Sep 2026 (IST)

డీఎంజీ కార్యాలయాన్ని ప్రారంభించిన మంత్రి కొల్లు

మయూరి టెక్ పార్కులోని డీఎంజీ కార్యాలయాన్ని మంత్రి కొల్లు రవీంద్ర ప్రారంభించారు. అక్కడ ఏర్పాటు చేసిన కమాండ్ కంట్రోల్ రూమ్, కెమికల్ ల్యాబ్ తదితరాలను ఆయన పరిశీలించారు. అనంతరం జిల్లాలవారీగా మైనింగ్ అధికారులతో ఆయన సమీక్ష నిర్వహించారు. స్టాక్ యార్డుల్లో ఇసుక నిల్వలు, రవాణాపై అధికారులకు పలు సూచనలు చేశారు. కొత్త మైన్స్ వేలం ప్రక్రియను వేగవంతం చేయాలని, ప్రజల అభిప్రాయాలకు ప్రాధాన్యత ఇవ్వాలని ఆదేశించారు.

5:49 PM, 3 Sep 2026 (IST)

రాష్ట్రంలో రూ.300 కోట్ల పెట్టుబడులకు సంస్థ ఆసక్తి

రాష్ట్ర మంత్రి బీసీ జనార్దన్‌రెడ్డితో శ్రీక్షేత్ర లాజిస్టిక్స్ సంస్థ ప్రతినిధులు సచివాలయంలో సమావేశమయ్యారు. రాష్ట్రంలో రైల్వే అనుసంధాన మల్టీ మోడల్ లాజిస్టిక్స్ హబ్స్ అభివృద్ధికి వారు ఆసక్తి చూపారు. ఏపీలో రూ.300 కోట్ల పెట్టుబడులు పెట్టేందుకు సిద్ధంగా ఉన్నామని సంస్థ డైరెక్టర్ వివేక్ అగర్వాల్ తెలిపారు. తగిన ప్రతిపాదనలతో వస్తే ప్రభుత్వం తరపున అన్ని విధాలా సహకరిస్తామని మంత్రి వారికి హామీ ఇచ్చారు.

5:15 PM, 3 Sep 2026 (IST)

ఎల్‌నినో పరిస్థితులపై కేంద్రానికి లేఖ: సీఎం

రాష్ట్రంలో ఎల్‌నినో ప్రభావం, కరువు పరిస్థితులపై కేంద్రానికి నేడే లేఖ రాస్తానని సీఎం తెలిపారు. ప్రకాశం, అన్నమయ్య జిల్లాల్లో మునుపెన్నడూ లేని వర్షాభావం ఉందన్నారు. పంటలు ఎండకుండా, తాగునీటి కొరత రాకుండా ఎంతైనా ఖర్చు చేస్తామన్నారు. ప్రారంభోత్సవ ప్రకటనల్లో మంత్రుల ఫొటోలు లేకపోవడంపై ఆయన ఆగ్రహం వ్యక్తం చేశారు. ప్రొటోకాల్ ఉల్లంఘనలు పునరావృతం కావొద్దని అధికారులను ఆదేశించారు.

5:15 PM, 3 Sep 2026 (IST)

తిరుమలలో ముగిసిన వరుణయాగం

వర్షాలు సమృద్ధిగా కురవాలని తిరుమలలో టీటీడీ నిర్వహించిన వరుణయాగం మహా పూర్ణాహుతితో ముగిసింది. వరుణ దేవుడి కరుణ కోసం ఐదు రోజుల పాటు కారీరిస్టీ యాగం, వరుణ జపం, పర్జన్యశాంతి హోమాలను అత్యంత వైభవంగా జరిపించారు. మొత్తం 32 మంది రుత్వికులు ఈ యాగ కార్యక్రమాల్లో భక్తిశ్రద్ధలతో పాల్గొన్నారు.

4:28 PM, 3 Sep 2026 (IST)

ఏకపక్షంగా తొలగించడం బాధాకరం: కొండా సురేఖ

నన్ను బర్తరఫ్ చేస్తున్నట్లు వస్తున్న వార్తలపై కొండా సురేఖ స్పందించారు. కనీసం వివరణ అడగకుండా ఏకపక్షంగా తొలగించడం బాధాకరమన్నారు. అయితే ముగ్గురు బీసీ మహిళలకు పదవులు దక్కడం సంతోషమే అన్నారు. ఈ మేరకు ఖర్గే, రాహుల్ గాంధీలకు రాసిన లేఖలను విడుదల చేశారు. తన శాఖలో కడియం శ్రీహరి జోక్యం చేసుకుని సమీక్షలు చేశారని ఆరోపించారు. మంత్రిగా తనకు అధికారాలు లేకుండా చేశారన్నారు. తాను ఎలాంటి తప్పు చేయలేదని, సీఎం రేవంత్‌రెడ్డి ఆత్మపరిశీలన చేసుకోవాలని సురేఖ స్పష్టం చేశారు.

4:18 PM, 3 Sep 2026 (IST)

కొండూరు కిడ్నీ బాధితులకు ఊరట

ఎన్టీఆర్‌ జిల్లా ఎ.కొండూరు కిడ్నీ బాధితుల సమస్యకు శాశ్వత పరిష్కారం లభించింది. జేజేఎం-అమరజీవి జలధార కింద తాగునీరు అందించేందుకు డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ చొరవ చూపారు. గత ప్రభుత్వం నిర్వీర్యం చేసిన ఈ ప్రాజెక్టును 26 నెలల్లో రూ.49.94 కోట్లతో పూర్తి చేశారు. 38 ఆవాసాల పరిధిలో 130 కిలోమీటర్ల మేర పైప్‌లైన్ నిర్మించి, 75 వేల మందికి ఇంటింటికీ స్వచ్ఛమైన నీరందిస్తున్నారు.

4:18 PM, 3 Sep 2026 (IST)

జగన్ అసమర్థుడిగా మిగిలిపోతారు : మంత్రి ప్రత్తిపాటి

చంద్రబాబు సాధించిన విజయాలను తనవిగా చెప్పుకుంటే వైఎస్ జగన్ ప్రజల దృష్టిలో అసమర్థుడిగా మిగిలిపోతారని మంత్రి ప్రత్తిపాటి పుల్లారావు విమర్శించారు. నీళ్లు లేకుండానే ప్రాజెక్టులను జాతికి అంకితం చేయడం ఆయనకే చెల్లిందన్నారు. నిజాలను వక్రీకరించి తనకు అనుకూలంగా మార్చుకోవడమే ఆయనకు తెలిసిన విద్య అని ఎద్దేవా చేశారు. ప్రజల ఆస్తులు కొల్లగొట్టిన ఆయన, ఇప్పుడు ఇతరుల కష్టాన్ని కాజేస్తున్నారని మండిపడ్డారు.

4:18 PM, 3 Sep 2026 (IST)

వార్డుల పునర్విభజన పిటిషన్లు కొట్టివేత

విశాఖపట్నంతో పాటు రాష్ట్రంలోని పలు మున్సిపల్ కార్పొరేషన్లలో వార్డుల పునర్విభజన ప్రక్రియపై దాఖలైన పిటిషన్లపై హైకోర్టులో విచారణ జరిగింది. ఈ పునర్విభజనను సవాల్ చేస్తూ పలువురు దాఖలు చేసిన వ్యాజ్యాలను ఉన్నత న్యాయస్థానం కొట్టివేసింది. దీంతో కార్పొరేషన్లలో వార్డుల విభజనకు సంబంధించి ఉన్న న్యాయపరమైన అడ్డంకులు తొలగిపోయాయి. మున్సిపల్ ఎన్నికల నిర్వహణకు మార్గం సుగమమైంది.

4:16 PM, 3 Sep 2026 (IST)

స్థానిక సంస్థల ఎన్నికలకు సన్నద్ధం కావాలి : సీఎం

స్థానిక ఎన్నికలను ఈ ఏడాదిలోనే పూర్తి చేయాలని సీఎం చంద్రబాబు అధికారులను ఆదేశించారు. కోర్టు పరిధిలో ఉన్న 100 మున్సిపాలిటీల్లో ఎన్నికలు జరిగేలా అడ్డంకులు పరిష్కరించాలన్నారు. జిల్లాల్లోని జటిలమైన సమస్యలను ఇన్‌ఛార్జి మంత్రులు పరిష్కరించాలని సూచించారు. నరసాపురంలో 6 వేల ఎకరాల భూముల సమస్యను రెండు నెలల్లో తేల్చాలన్నారు. సూర్యఘర్ పథకంలో ఏపీని నంబర్ వన్ స్థానంలో నిలపాలని ఆయన స్పష్టం చేశారు.

4:16 PM, 3 Sep 2026 (IST)

వైఎస్సార్సీపీ తప్పుడు ప్రచారాన్ని తిప్పికొట్టాలి : సీఎం చంద్రబాబు

జలాశయాల్లో నీళ్లున్నా పంటలకు ఇవ్వడం లేదంటూ వైఎస్సార్సీపీ చేస్తున్న తప్పుడు ప్రచారాన్ని తిప్పికొట్టాలని సీఎం చంద్రబాబు పిలుపునిచ్చారు. కూటమి ప్రభుత్వ విజయాలను తమ ఘనతగా వారు చెప్పుకుంటున్నారని విమర్శించారు. వెలిగొండ, పోలవరం కాలువలకు నీటి విడుదల చేసిన మంత్రి నిమ్మలను ఆయన అభినందించారు. నిత్యావసరాల ధరలు పెరగకుండా చర్యలు తీసుకోవాలని, రైతులకు వాస్తవ పరిస్థితులు వివరించాలని అధికారులకు సూచించారు.

4:16 PM, 3 Sep 2026 (IST)

నాపై వేటు వేయడం సరికాదు: కొండా సురేఖ

మంత్రివర్గం నుంచి తనను బర్తరఫ్ చేయడాన్ని కొండా సురేఖ ఖండించారు. తన వివరణ తీసుకోకుండా ఈ నిర్ణయం తీసుకోవడం సరికాదన్నారు. తన కుమార్తె చేసిన వ్యాఖ్యలకు తనను బాధ్యురాలిని చేయడం ఏమిటని ప్రశ్నించారు. ఆమె వ్యాఖ్యలను తాను ఖండించాల్సిన అవసరం లేదన్నారు. తన వల్లే ముగ్గురు బీసీ మహిళలకు పదవులు రావడం సంతోషమన్నారు. జగ్గారెడ్డి, రాజగోపాల్‌రెడ్డి వ్యాఖ్యలపై ఎందుకు చర్యలు తీసుకోలేదని నిలదీశారు.

4:16 PM, 3 Sep 2026 (IST)

పర్యాటక పురస్కారాలకు దరఖాస్తుల ఆహ్వానం

ప్రపంచ పర్యాటక దినోత్సవం సందర్భంగా అందించే అవార్డులకు దరఖాస్తులు ఆహ్వానిస్తున్నట్లు మంత్రి కందుల దుర్గేశ్ తెలిపారు. మొత్తం 38 విభాగాల్లో 46 అవార్డులు ప్రదానం చేస్తామన్నారు. దరఖాస్తు చేసుకునేందుకు ఈనెల 18 వరకు గడువు ఉందని, సెప్టెంబర్ 27న పురస్కారాల ప్రదానోత్సవం ఉంటుందని చెప్పారు. పర్యాటకరంగ పునర్నిర్మాణం థీమ్‌తో ఈసారి వేడుకలు నిర్వహిస్తున్నామని, వివరాలకు aptourism.gov.in ను చూడాలన్నారు.

3:22 PM, 3 Sep 2026 (IST)

రాష్ట్రంలో నిత్యావసరాల ధరల పెరుగుదలపై మంత్రులతో లోకేశ్‌ చర్చ

రాష్ట్రంలో నిత్యావసరాల ధరల పెరుగుదలపై మంత్రులతో మంత్రి లోకేశ్ చర్చించారు. సామాన్యులపై భారం పడకుండా తక్షణ చర్యలు చేపట్టాలని సూచించారు. ధరలను మంత్రివర్గ ఉపసంఘం ఎప్పటికప్పుడు పర్యవేక్షించాలన్నారు. కృత్రిమ కొరత సృష్టించి, అధిక ధరలకు విక్రయిస్తే కఠిన చర్యలు తీసుకోవాలని చెప్పారు. వస్తువులు అందుబాటు ధరల్లో ఉండేలా సరఫరా వ్యవస్థను బలోపేతం చేయాలని అధికారులను ఆయన ఆదేశించారు.

3:22 PM, 3 Sep 2026 (IST)

ఎల్‌నినోను సమన్వయంతో ఎదుర్కోవాలి : సీఎం

ఎల్‌నినో ప్రభావాన్ని ఎదుర్కొనేందుకు అన్ని శాఖలు సమన్వయంతో పనిచేయాలని సీఎం చంద్రబాబు ఆదేశించారు. దేశంలో వర్షపాతం లోటు -14 శాతం ఉంటే, రాష్ట్రంలో -52 శాతం ఉందని ఆవేదన వ్యక్తం చేశారు. తాగునీరు, పశుగ్రాసానికి తొలి ప్రాధాన్యం ఇవ్వాలన్నారు. విపత్తు నిర్వహణ కింద కేంద్ర నిధులు తెచ్చేలా చూడాలన్నారు. ప్రభుత్వం చేసే పనులను ప్రజల్లోకి తీసుకెళ్లాలని, నేటి తరానికి వాస్తవాలు వివరించాలని చెప్పారు.

3:22 PM, 3 Sep 2026 (IST)

కొండా సురేఖను మంత్రివర్గం నుంచి బర్తరఫ్‌ చేయాలంటూ గవర్నర్‌కు లేఖ

తెలంగాణ మంత్రివర్గం నుంచి కొండా సురేఖను బర్తరఫ్ చేస్తూ ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. ఆమె రాజీనామాకు నిరాకరించడంతో, బర్తరఫ్ చేయాలని సీఎస్ గవర్నర్‌కు లేఖ రాశారు. ప్రణాళికా సంఘం ఉపాధ్యక్షుడిగా చిన్నారెడ్డిని తొలగించి, ఆ స్థానంలో గద్వాల విజయలక్ష్మిని నియమించారు. తెలంగాణ మహిళా కమిషన్‌ ఛైర్‌పర్సన్‌గా నేరెళ్ల శారద, కుడా ఛైర్‌పర్సన్‌గా జి.సుధారాణికి బాధ్యతలు అప్పగిస్తూ అధిష్ఠానం నిర్ణయం తీసుకుంది.

3:22 PM, 3 Sep 2026 (IST)

ముగిసిన ఏపీ కేబినెట్ భేటీ

రాష్ట్ర మంత్రివర్గ సమావేశం ముగిసింది. రైతులకు అండగా కేబినెట్ కీలక నిర్ణయాలు తీసుకుంది. తోతాపురి మామిడికి మద్దతు ధర కోసం మార్క్‌ఫెడ్‌కు రూ.281 కోట్లు, పొగాకు రైతులకు రూ.94 కోట్ల సాయానికి ఆమోదం తెలిపింది. కేజ్ కల్చర్ కొత్త విధానానికి గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. అమరావతిలో సిమెంట్ రోడ్ల స్థానంలో బీటీ రోడ్ల నిర్మాణానికి, రూ.759 కోట్లతో 'అమరావతి సంగమం' ఏర్పాటుకు మంత్రివర్గం ఆమోదముద్ర వేసింది.

2:39 PM, 3 Sep 2026 (IST)

మంత్రి కొండా సురేఖను మంత్రి పదవి నుంచి తొలగించేందుకు లైన్‌ క్లియర్‌

హైదరాబాద్: మంత్రి కొండా సురేఖను కేబినెట్ నుంచి తొలగించడం ఖాయమైపోయింది. కొండా సురేఖను మంత్రి పదవి నుంచి తొలగించేందుకు కాంగ్రెస్‌ అధిష్ఠానం క్లియరెన్స్‌ ఇవ్వగా కాసేపట్లో దానికి సంబంధించిన లేఖను సీఎస్ సంజయ్​ జాజు గవర్నర్‌కు ఇవ్వనున్నారు. ఆ లేఖకు గవర్నర్‌ శివ ప్రతాప్ శుక్లా ఆమోదం తెలిపితే సురేఖ మంత్రి పదవి నుంచి బర్తరఫ్‌ కానున్నారు. దీంతో ఆమె సాధారణ ఎమ్మెల్యేగా కొనసాగాల్సి ఉంటుంది. ఒకవేళ ఎమ్మెల్యే పదవికి కూడా రాజీనామా చేస్తే మాత్రం వరంగల్ తూర్పు నియోజకవర్గంలో ఉపఎన్నిక అనివార్యం అవుతుంది.

2:38 PM, 3 Sep 2026 (IST)

సచివాలయంలో కొనసాగుతున్న రాష్ట్ర మంత్రివర్గ సమావేశం

సచివాలయంలో రాష్ట్ర మంత్రివర్గ సమావేశం కొనసాగుతుంది. 31 అజెండా అంశాలకు మంత్రివర్గం ఆమోదం తెలిపింది. రాష్ట్రంలో నెలకొన్న ఎల్‌నినో ప్రభావంపై సుదీర్ఘంగా చర్చ జరుగుతోంది.

2:37 PM, 3 Sep 2026 (IST)

అనంతపురంలో నాన్ జ్యుడీషియల్ స్టాంపుల కొరత

అనంతపురంలో నాన్ జ్యుడీషియల్ స్టాంపుల కొరత ఏర్పడింది. నెలన్నరగా స్టాంపుల కొరతతో వినియోగదారులు ఇబ్బంది పడుతున్నారు. రూ.10, 20, 50, 100 స్టాంపుల కోసం వినియోగదారుల అవస్థలు పడుతున్న పరిస్థితి నెలకొంది. రిజిస్ట్రేషన్ శాఖ అధికారులు పట్టించుకోవట్లేదని స్టాంపు వెండర్ల ఆరోపిస్తున్నారు.

2:36 PM, 3 Sep 2026 (IST)

ఇద్దరు ఐపీఎస్ అధికారుల సస్పెన్షన్‌ను ఎత్తివేసిన ఏపీ సర్కార్

ఇద్దరు ఐపీఎస్ అధికారుల సస్పెన్షన్‌ను ఏపీ సర్కార్ ఎత్తివేసింది. సీనియర్ ఐపీఎస్‌లు విశాల్ గున్ని, కాంతి రాణా టాటాలకు ఊరటనిచ్చింది. విధుల్లోకి తీసుకుంటూ సీఎస్‌ జి.సాయిప్రసాద్ ఉత్తర్వులు జారీ చేసింది. రేపటితో సస్పెన్షన్ గడువు ముగియనుంది. ఈలోపే ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. డీజీపీ నివేదిక ఆధారంగా విశాల్ గున్నిపై సస్పెన్షన్‌ వేటు ఎత్తివేసింది. తన విజ్ఞప్తి, డీజీపీ నివేదిక పరిగణనలోకి తీసుకుని కాంతి రాణా సస్పెన్షన్ రద్దు చేసింది. అధికారుల ఇద్దరిపై విచారణలు, క్రిమినల్ కేసుల ప్రక్రియ యథాతథంగా కొనసాగుతున్నాయి.

2:33 PM, 3 Sep 2026 (IST)

కాకినాడ జిమ్ ట్రైనర్ సతీశ్‌రెడ్డి హత్య కేసు - ఛేదించిన పోలీసులు

కాకినాడ: జిమ్ ట్రైనర్ సతీశ్‌రెడ్డి హత్య కేసును పోలీసులు ఛేదించారు. ఆగస్టు 26న తెల్లవారుజామున జిమ్ ట్రైనర్ సతీశ్‌రెడ్డి హత్యకు గురైన విషయం తెలిసిందే. సతీశ్‌రెడ్డి(30)ని హత్య చేసిన నలుగురు నిందితులు అరెస్టు చేశారు. బొందల సాయికిరణ్, ఇంటి సత్యనారాయణ, ప్రయాగ దుర్గాప్రసాద్, ఇంటి ఆదికృష్ణని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. నిన్న సాయంత్రం రైల్వేస్టేషన్ వద్ద నిందితులను అరెస్ట్ చేశామని ఏఎస్పీ మహంతి కిషోర్ తెలిపారు. నిందితుడు సాయికిరణ్ వేరే యువతితో ఉన్న ఫొటోలను సతీశ్ మార్ఫింగ్ చేశాడన్నారు. ఆ ఫొటోలను మృతుడు సతీశ్, సాయికిరణ్ ప్రియురాలికి పంపించాడని అన్నారు. ఫొటోలు పంపడంతో సతీశ్‌రెడ్డికి, సాయికిరణ్‌కి మధ్య విభేదాలు తలెత్తాయని చెప్పారు. సాయికిరణ్ మరో ముగ్గురితో కలిసి సతీశ్‌ను హత్య చేశాడన్నారు. నలుగురిని అరెస్టు చేసి రిమాండ్‌కు తరలిస్తున్నామన్నారు. ఈకేసులో ఇంకా ఎవరి పాత్రయినా ఉందా అనే కోణంలో విచారిస్తున్నామని ఏఎస్పీ మహంతి కిషోర్ పేర్కొన్నారు.

1:10 PM, 3 Sep 2026 (IST)

వివేకా హత్య కేసులో ముమ్మరంగా ఈడీ దర్యాప్తు

వివేకా హత్య కేసులో ముమ్మరంగా ఈడీ దర్యాప్తు కొనసాగుతోంది. వివేకా హత్య కేసులో అప్రూవర్ దస్తగిరిని ఈడీ అధికారులు ప్రశ్నిస్తున్నారు. వివేకా హత్య కేసులో జరిగిన రూ.40 కోట్ల డీల్‌పై దస్తగిరిని ఈడీ ప్రశ్నించింది. ఎర్ర గంగిరెడ్డి, శివశంకర్‌రెడ్డి, దస్తగిరి మధ్య జరిగిన ఒప్పందంపై ఈడీ ఆరా తీసింది. తనకు రూ.5 కోట్లు ఇస్తామని చెప్పినట్లు గతంలో దస్తగిరి సీబీఐకి తెలిపారు. నాడు దస్తగిరి ఇచ్చిన స్టేట్‌మెంట్ ఆధారంగా ఈడీ అధికారుల దర్యాప్తు చేస్తున్నారు. వివేకా హత్య కేసు అప్రూవర్ దస్తగిరి స్టేట్‌మెంట్‌ రికార్డు చేయనున్నారు. వివేకా హత్యకు ముందు, తర్వాత బ్యాంక్‌ లావాదేవీలపై ఈడీ ప్రత్యేక దృష్టి సారిస్తోంది. బ్యాంక్‌ స్టేట్‌మెంట్లతో ఈడీ విచారణకు దస్తగిరి హాజరయ్యారు.

12:16 PM, 3 Sep 2026 (IST)

విద్యాహక్కు చట్టం అమలుపై సర్కార్ కీలక అడుగు

విద్యాహక్కు చట్టం అమలుపై సర్కార్ కీలక అడుగు వేసింది. ప్రైవేటు స్కూళ్లలో 25 శాతం ఉచిత ప్రవేశాలపై అధ్యయనానికి ప్యానెల్​ను ఏర్పాటు చేసింది. 16 మంది సభ్యులతో రాష్ట్ర స్థాయి కమిటీ ఏర్పాటు చేస్తూ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. కమిటీ ఛైర్‌పర్సన్‌గా పాఠశాల విద్యాశాఖ డైరెక్టర్, కన్వీనర్‌గా సమగ్ర శిక్షా ఎస్పీడీని నియమించింది. సుప్రీంకోర్టు, ఎన్‌సీపీసీఆర్ ఆదేశాల మేరకు నిబంధనల సవరించింది. ఆన్‌లైన్ అడ్మిషన్లు, పారదర్శకత, ఫీజుల రీయింబర్స్‌మెంట్‌పై ప్రభుత్వానికి కమిటీ నివేదించింది. ఉచిత ప్రవేశాలు పొందే పేద విద్యార్థుల పట్ల వివక్ష లేకుండా పక్కా చర్యలు చేపడుతోంది. కమిటీలో తల్లిదండ్రులు, ప్రైవేట్ స్కూల్స్ అసోసియేషన్, ఎన్జీవో ప్రతినిధులకు చోటు దక్కనుంది.

12:00 PM, 3 Sep 2026 (IST)

ఇంద్రకీలాద్రిపై పాలకమండలి సమావేశం - దసరా ఉత్సవాల నిర్వహణపై ప్రధానంగా చర్చ

విజయవాడ: ఇంద్రకీలాద్రిపై బోర్డు ఛైర్మన్‌ బొర్రా రాధాకృష్ణ అధ్యక్షతన పాలకమండలి సమావేశమైంది. దసరా ఉత్సవాల నిర్వహణపై ప్రధానంగా చర్చించారు. ఇంద్రకీలాద్రిపై అక్టోబర్‌ 11 నుంచి 20 వరకు దసరా ఉత్సవాలు జరగనున్నాయి. ఈవో శీనానాయక్‌ అమ్మవారి అలంకరణ వివరాలు సభ్యులకు తెలిపారు. అక్టోబర్‌ 11న దుర్గమ్మకు బాలా త్రిపురసుందరీదేవిగా అలంకరణ, 12న గాయత్రీదేవి, 13న అన్నపూర్ణదేవి, 14న మహాచండీదేవి, 15న లలితా త్రిపురసుందరీదేవి, 16న సరస్వతిదేవి అలంకరణ, 17న మహాలక్ష్మిదేవి, 18న దుర్గాదేవి, 18న మహిషాసురమర్ధినిగా అలంకరణ చేయనున్నారు. 20న రాజరాజేశ్వరిదేవిగా దుర్గమ్మ భక్తులకు దర్శనం ఇవ్వనున్నారు. 20వ తేదీ సాయంత్రం కృష్ణానదిలో హంసవాహన తెప్పోత్సవం కార్యక్రమం నిర్వహించనున్నారు.

11:47 AM, 3 Sep 2026 (IST)

స్థానిక సంస్థల ఎన్నికలపై సాయంత్రం భేటీకానున్న సీఎం చంద్రబాబు

స్థానిక సంస్థల ఎన్నికలపై సీఎం చంద్రబాబు సాయంత్రం భేటీకానున్నారు. ఇన్‌ఛార్జి మంత్రులు, సీనియర్‌ నేతలతో సీఎం క్యాంపు కార్యాలయంలో సమావేశమవుతారు. టీడీపీ పార్టీ కేంద్ర కార్యాలయం ఎన్టీఆర్ భవన్‌లో ఈనెల 7, 8 తేదీల్లో తెలుగుదేశం ఎమ్మెల్యేలకు శిక్షణ తరగతులు నిర్వహించనున్నారు. శిక్షణ తరగతులకు అధినేత చంద్రబాబు, వర్కింగ్ ప్రెసిడెంట్ లోకేశ్‌ హాజరుకానున్నారు.

11:45 AM, 3 Sep 2026 (IST)

విశాఖలో నేవీ ఉద్యోగి భార్య ప్రియాంకవర్మ ఆత్మహత్య

విశాఖ: నేవీ ఉద్యోగి భార్య ప్రియాంకవర్మ(27) ఆత్మహత్య చేసుకుంది. నౌసేనాబాగ్‌లో 14వ అంతస్తు నుంచి ప్రియాంక దూకి బలవన్మరణానికి పాల్పడింది. ప్రియాంక భర్త దీపక్ వర్మ విశాఖ నేవీలో ఉద్యోగిగా విధులు నిర్వర్తిస్తున్నారు. ఘటనపై మల్కాపురం పోలీసులు కేసు నమోదు చేసి విచారణ చేస్తున్నారు.

11:41 AM, 3 Sep 2026 (IST)

స్థానిక ఎన్నికలు వాయిదాపడే ప్రసక్తే లేదు: మంత్రి లోకేశ్‌

టీడీపీ మంత్రులతో పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ లోకేశ్‌ బ్రేక్‌ఫాస్ట్‌ సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా మంత్రి లోకేశ్ మాట్లాడుతూ "అర్హులైన ప్రతిఒక్కరికీ అక్టోబర్ నెల నుంచి దశలవారీగా కొత్త పింఛన్లు ఇద్దాం. వచ్చిన దరఖాస్తులన్నీ పరిష్కరించుకుంటూ కొత్త పింఛన్లు ఇస్తూ వెళ్దాం. స్థానిక ఎన్నికలకు అంతా సిద్ధమై అన్ని స్థానాల్లో కూటమి అభ్యర్థులను గెలిపించాలి. అక్టోబర్‌లోగా ఎన్నికల ప్రక్రియ పూర్తవుతుంది. స్థానిక ఎన్నికలు వాయిదాపడే ప్రసక్తే లేదు. కోర్టు పెండింగ్‌లో ఉన్నవి కూడా ఎన్నికలు జరిగేలా ప్రభుత్వం కృషిచేస్తోంది. త్వరితగతిన పరిష్కరించుకుని అన్నింటిలో ఎన్నికలు జరిగేలా ప్రభుత్వం కృషి. తొలుత పురపాలికలు, తర్వాత ఎంపీటీసీ, జెడ్పీటీసీలు, ఆతర్వాత పంచాయతీ ఎన్నికలు. ఎన్నికలు వాయిదా పడాలన్న గొడ్డలి పార్టీ కుయుక్తులు పనిచేయవు. స్థానిక ఎన్నికలు వాయిదా పడితే ఫైనాన్స్ కమిషన్ నిధులు ఆగిపోతాయనేది వైఎస్సార్సీపీ కుట్ర. కోర్టు కేసులు పరిష్కరించుకుని అనుకున్న సమయానికి ఎన్నికలు నిర్వహించి తీరుతాం. స్థానిక ఎన్నికలు వాయిదాపడే ప్రసక్తే లేదని" మంత్రి లోకేశ్‌ వెల్లడించారు.

11:20 AM, 3 Sep 2026 (IST)

మంగళగిరిలోని విద్యాభవన్ ఎదుట యూటీఎఫ్‌ ఆధ్వర్యంలో ఆందోళన

మంగళగిరిలోని విద్యాభవన్ ఎదుట యూటీఎఫ్‌ ఆధ్వర్యంలో ఆందోళన జరిగింది. ఇన్ సర్వీస్ టీచర్లకు టెట్ నుంచి మినహాయింపునకు అసెంబ్లీలో తీర్మానానికి టీచర్లు డిమాండ్‌ చేస్తున్నారు. ఇన్‌ సర్వీస్‌ టీచర్లకు టెట్‌ అర్హత 40 శాతానికి పరిమితం చేయాలని కోరుతున్నారు. మ్యాథ్స్, సైన్సు టీచర్లకు వారి సబ్జెక్టుకు మాత్రమే పరిమితం చేయాలని టీచర్లు అన్నారు. పోలీసులు అడ్డుకోవడంతో రోడ్డు పక్కన నిలబడి టీచర్లు నిరసన తెలుపుతున్నారు.

11:07 AM, 3 Sep 2026 (IST)

సచివాలయంలో సీఎం అధ్యక్షతన మంత్రివర్గ సమావేశం ప్రారంభం

సచివాలయం: సీఎం అధ్యక్షతన రాష్ట్ర మంత్రివర్గ సమావేశం ప్రారంభమయ్యింది. 20కి పైగా అజెండా అంశాలతో మంత్రివర్గం సమావేశమైంది. రైతులు, మత్స్యకారులు, సాగునీరు, అమరావతి, విద్యుత్‌ రంగాలపై కేబినెట్‌ దృష్టి సారిస్తుంది. రైతులకు ఆర్థిక చేయూతపై కేబినెట్‌లో కీలక ప్రతిపాదనలు ప్రవేశపెట్టనుంది. తోతాపురి మామిడికి మద్దతు ధర కోసం మార్క్‌ఫెడ్‌ నిధుల అంశంపై చర్చించనుంది. రూ.281 కోట్ల నిధుల ప్రతిపాదనలకు ఆమోదం మంత్రివర్గం తెలపనుంది. పొగాకు రైతులకు డీబీటీ ద్వారా రూ.94 కోట్ల ఆర్థికసాయం అందించే ప్రతిపాదనలపై చర్చ కొనసాగుతుంది. రిజర్వాయర్‌ కేజ్‌ కల్చర్‌ పాలసీ - 2026 ముసాయిదాకు కేబినెట్‌ ఆమోదం తెలపనుంది. మత్స్యరంగంలో కేజ్‌ కల్చర్‌ను ప్రోత్సహించేందుకు కొత్త విధానం తీసుకురానుంది. వరద నష్టం పునరుద్ధరణకు రూ.6.24 కోట్ల పనులకు మంత్రివర్గం ఆమోదించనుంది. కృష్ణా, ఎన్టీఆర్‌, గుంటూరు, బాపట్ల జిల్లాల్లో 78 వరద పునరుద్ధరణ పనులు, వెలిగొండ టన్నెల్‌లో టీబీఎం తొలగింపు పనులకు రూ.11.63 కోట్ల మంజూరు, అమరావతిలో రహదారి నిర్మాణ విధానంలో కీలక మార్పుల ప్రతిపాదనలు, సిమెంట్‌ కాంక్రీట్‌ రోడ్ల స్థానంలో బీటీ రోడ్లు సీఆర్‌ఆర్‌ఐ, చీఫ్‌ ఇంజినీర్ల బోర్డు సిఫార్సులపై చర్చించనుంది. అమరావతి సంగమం నిర్మాణానికి రూ.759.79 కోట్ల పరిపాలనా అనుమతి ప్రతిపాదించనుంది. శాఖమూరులో స్టేట్‌ పబ్లిక్‌ లైబ్రరీ, ఆడిటోరియం, గుడ్‌ గవర్నెన్స్‌ సంస్థలతో 'అమరావతి సంగమం' చేపట్టనుంది. అమరావతి రైల్వే కనెక్టివిటీ, ఇన్నర్‌ రింగ్‌ రోడ్డు పనులపై కీలక నిర్ణయాలు తీసుకోనుంది. వివిధ సంస్థలకు భూ కేటాయింపులపై చర్చించి మంత్రివర్గం ఆమోదం తెలపనుంది.

10:06 AM, 3 Sep 2026 (IST)

గొడ్డలి పార్టీ అధినేత జగన్‌కు క్రెడిట్ చోరీ వ్యాధి బాగా ముదిరిపోయింది: మంత్రి సంధ్యారాణి

గొడ్డలి పార్టీ అధినేత జగన్‌కు క్రెడిట్ చోరీ వ్యాధి బాగా ముదిరిపోయిందని, వైద్యుడు కూడా లేని ఇలాంటి వ్యాధికి మొదటి రోగి జగనే అంటూ ఎద్దేవా చేశారు. ప్రభుత్వం ఏం చేసినా, ఉదయం అవినీతి అంటారని, సాయంత్రం తనదే ఘనతంటారని సంధ్యారాణి అన్నారు. మందుల డోస్ అయినా పెంచాలి లేదా మాట్లాడటమైనా మానితే ఆయనకే మంచిదని వ్యాఖ్యానించారు. జగన్‌ క్రెడిట్‌ ప్రభుత్వ ఆస్తులు కొల్లగొట్టడం, తాకట్టు పెట్టడం, విధ్వంసం చేయడమేనని మంత్రి సంధ్యారాణి విమర్శించారు.

9:30 AM, 3 Sep 2026 (IST)

టీటీడీ డిప్యూటీ ఈవో లోకనాథం అరెస్టు

టీటీడీ డిప్యూటీ ఈవో లోకనాథంను ఏసీబీ అధికారులు గురువారం అరెస్టు చేశారు. నిన్న ఉదయం నుంచి లోకనాథం ఇల్లు, కార్యాలయాల్లో చేపట్టిన సోదాలు ముగిసిన నేపథ్యంలో ఆయనను అదుపులోకి తీసుకున్నారు. నెల్లూరు ఏసీబీ కోర్టులో హాజరుపరచనున్నారు. లోకనాథం ఇంట్లో రూ.5 కోట్ల విలువైన ఆస్తులు గుర్తించారు. ఈ నేపథ్యంలోనే 2 కిలోల బంగారం, 6.5 కిలోల వెండి, రూ.12 లక్షల నగదును ఏసీబీ అధికారులు స్వాధీనం చేసుకున్నారు. లోకనాథం, కుమారుడి పేరిట 4 ఫిక్స్‌డ్‌ డిపాజిట్లు, తిరుపతి శ్రీనివాసనగర్‌లో ఫ్లాట్‌, గొల్లవానిగుంటలో 2 ఇళ్లు, వడమాలపేట మండలం పాదిరేడులో ఒక ఇల్లు కొనుగోలు చేసినట్లు గుర్తించారు. కల్తీ నెయ్యి కేసులో మాజీ ఛైర్మన్‌ వైవీ సుబ్బారెడ్డి వ్యక్తిగత సహాయకుడు చిన్నఅప్పన్న విచారణలో వెల్లడైన పలు అంశాలు ఆధారంగా లోకనాథంపై కేసు నమోదు చేశారు.

9:15 AM, 3 Sep 2026 (IST)

పల్నాడు జిల్లాలో పేకాట క్లబ్‌పై గుర్తుతెలియని వ్యక్తుల దాడి

పల్నాడు జిల్లా సత్తెనపల్లి పేకాట క్లబ్‌పై గుర్తుతెలియని వ్యక్తుల దాడి చేశారు. సుమారు 20 మంది వ్యక్తులు తెల్లవారుజామున పేకాట క్లబ్‌పై దాడిచేసినట్లు సమాచారం. పేకాట క్లబ్‌లోని టేబుళ్లు, కుర్చీలు, సీసీ కెమెరాలు ధ్వంసం చేశారు. ఘటనాస్థలిని సీఐ నాగమల్లేశ్వరరావు, పోలీసు సిబ్బంది పరిశీలించారు.

8:19 AM, 3 Sep 2026 (IST)

తిరుమలలో టోకెన్లు లేని భక్తులకు శ్రీవారి సర్వదర్శనానికి 18 గంటలు

తిరుమలో టోకెన్లు లేని భక్తులకు శ్రీవారి సర్వదర్శనానికి 18 గంటలు సమయం పడుతోంది. శ్రీవారి సర్వదర్శనానికి అన్ని కంపార్టుమెంట్లు భక్తులతో నిండిపోయాయి. కంపార్టుమెంట్లన్నీ నిండి శిలాతోరణం క్యూలైన్ వరకు భక్తులు వేచి ఉన్నారు. నిన్న శ్రీవారిని 79,215 మంది భక్తులు దర్శించుకోగా, హుండీ ఆదాయం రూ.4.45 కోట్లు వచ్చింది. నిన్న శ్రీవారికి 36,740 మంది భక్తులు తలనీలాలు సమర్పించారు.

6:43 AM, 3 Sep 2026 (IST)

నేడు రాష్ట్ర మంత్రివర్గం సమావేశం

నేడు రాష్ట్ర మంత్రివర్గం సమావేశం జరగనుంది. సచివాలయంలో సీఎం చంద్రబాబు అధ్యక్షతన మంత్రివర్గం భేటీ కానుంది. అమరావతిలో పలు కీలక ప్రతిపాదనలకు కేబినెట్‌ ఆమోదం తెలిపే అవకాశముంది. శాఖమూరులో సెంట్రల్‌ లైబ్రరీ, ఆడిటోరియం నిర్మాణాలకు ఆమోదం తెలిపనుంది. శాఖమూరులో హెచ్‌ఆర్‌ నిర్మాణాలకు కేబినెట్‌ ఆమోదం తెలిపే అవకాశం ఉంది. రాజధానిలోని 29 గ్రామాలకు రూ.533 కోట్లు కేటాయించేందుకు ఆమోదించనుంది. సంజీవని ప్రాజెక్టుపై కేబినెట్ చర్చించనుంది.

6:42 AM, 3 Sep 2026 (IST)

విశాఖలో అగ్నివీర్‌ పథకం కింద ఆర్మీ నియామక ర్యాలీ

విశాఖలో అగ్నివీర్‌ పథకం కింద ఆర్మీ నియామక ర్యాలీ నిర్వహించనున్నారు. విశాఖలోని ఇందిరా ప్రియదర్శిని స్టేడియంలో ఈనెల 20 వరకు ఆర్మీ నియామక ర్యాలీ జరగనుంది. ఆర్‌కే బీచ్‌ రోడ్డులోని ఎన్‌టీఆర్‌ సర్కిల్‌ నుంచి 1.6 కి.మీ రన్నింగ్‌ ట్రాక్‌ వరకు ర్యాలీ చేయనున్నారు.

6:39 AM, 3 Sep 2026 (IST)

ఇవాళ టీటీడీ డిప్యూటీ ఈవో లోకనాథం ఇంట్లో సోదాలు చేయనున్న ఏసీబీ

ఇవాళ కూడా టీటీడీ డిప్యూటీ ఈవో లోకనాథం ఇంట్లో ఏసీబీ సోదాలు చేయనుంది. నిన్న లోకనాథం ఇంట్లో రూ.5 కోట్ల విలువ గల ఆస్తులు ఏసీబీ అధికారులు గుర్తించారు. 2 కిలోల బంగారం, 6.5 కిలోల వెండి, రూ.12 లక్షలు స్వాధీనం చేసుకున్నారు. లోకనాథం, కుమారుడి పేరిట 4 ఫిక్స్‌డ్‌ డిపాజిట్లు, తిరుపతి శ్రీనివాసనగర్‌లో ఫ్లాట్‌, గొల్లవానిగుంటలో 2 ఇళ్లు, వడమాలపేట మండలం పాదిరేడులో ఇల్లు కొనుగోలు చేసినట్లు గుర్తించారు. కల్తీ నెయ్యి కేసులో వైవీ సుబ్బారెడ్డి పీఏ చిన్నఅప్పన్న విచారణలో అంశాలు వెల్లడించారు. చిన్నఅప్పన్న విచారణ అంశాల ఆధారంగా లోకనాథంపై కేసు నమోదు చేసుకున్నారు.

Last Updated : September 3, 2026 at 10:16 PM IST