ETV Bharat / state

03-06-2026 Telangana News Today Live Updates : ఫోన్‌ ట్యాపింగ్‌ కేసు - మాజీ ఎమ్మెల్యే తీగల కృష్ణారెడ్డికి సిట్‌ నోటీసులు

Telangana News Today Live Updates
Telangana News Today Live Updates (ETV Bharat)
author img

By ETV Bharat Telangana Team

Published : June 3, 2026 at 6:53 AM IST

|

Updated : June 3, 2026 at 10:47 PM IST

Choose ETV Bharat

03-06-2026 Telangana News Today Live Updates : ఈరోజు తెలంగాణ తాజా ప్రధాన వార్తల సమాచారం.

LIVE FEED

10:44 PM, 3 Jun 2026 (IST)

నందిగామ బైపాస్ రోడ్డులో ప్రమాదం - ఇద్దరు మృతి

రంగారెడ్డి జిల్లా నందిగామ బైపాస్ రోడ్డులో ప్రమాదం జరిగింది. ఈ ఘటనలో ఇద్దరు మృతి చెందారు. మృతులు బిహార్‌ కార్మికులు రోషన్ కుమార్ (24) పంకజ్ (19)గా గుర్తించారు. పాలిప్యాక్‌ పరిశ్రమలో పని చేస్తున్నారు. విధులు ముగించుకుని షాద్‌నగర్ నుంచి నందిగామ వెళ్తున్న సమయంలో ఈ ఘటన చోటు చేసుకుంది.

9:43 PM, 3 Jun 2026 (IST)

ఫోన్‌ ట్యాపింగ్‌ కేసు - మాజీ ఎమ్మెల్యే తీగల కృష్ణారెడ్డికి సిట్‌ నోటీసులు

ఫోన్‌ ట్యాపింగ్‌ కేసులో మాజీ ఎమ్మెల్యే తీగల కృష్ణారెడ్డికి సిట్‌ నోటీసులు జారీ చేసింది. రేపు ఉదయం 11 గంటలకు విచారణకు హాజరుకావాలని పేర్కొంది. 2014-18 మధ్య మహేశ్వరం ఎమ్మెల్యేగా తీగల కృష్ణారెడ్డి పని చేశారు.

7:31 PM, 3 Jun 2026 (IST)

అమెరికాలో కారు ప్రమాదం - మధుయాష్కీ గౌడ్ సతీమణికి గాయాలు

అమెరికాలో జరిగిన రోడ్డు ప్రమాదంలో మాజీ ఎంపీ మధుయాష్కీ గౌడ్ సతీమణి డాక్టర్ సుచి యాష్కీకి గాయాలయ్యాయి. తమ చిన్న కుమార్తె డాక్టర్ గగన యాష్కీని హార్వర్డ్ యూనివర్సిటీ అనుబంధ హాస్పిటల్​లో ఎండీ కోర్సులో జాయిన్ చేసి తిరుగు ప్రయాణంలో న్యూయార్క్‌కు వస్తుండగా ఈ ప్రమాదం జరిగినట్లు తెలిసింది. వర్షం కారణంగా ప్రయాణిస్తున్న కారు అదుపుతప్పి పల్టీలు కొట్టింది. ఈ ఘటనలో సుచియాష్కికి పక్కటెముకలు విరిగాయని, ప్రస్తుతం ఆమె చికిత్స పొందుతున్నారని కుటుంబ సభ్యులు తెలిపారు. మధుయాష్కి గౌడ్ కూడా ప్రస్తుతం అమెరికాలోనే ఉన్నారు. డాక్టర్ గగన యాష్కి న్యూయార్క్ మెడికల్ కళాశాలలో గ్రాడ్యుయేషన్ పూర్తి చేయగా కాన్వాకేషన్ వేడుకకు హాజరయ్యేందుకు ఇటీవల ఆయన అమెరికా వెళ్లారు.

7:25 PM, 3 Jun 2026 (IST)

మమతా బెనర్జీకి మరో షాక్ - ప్రతిపక్ష నేతగా తృణమూల్‌ బహిష్కృత ఎమ్మెల్యే రితబ్రత బెనర్జీ

బంగాల్‌లో ఇటీవల వెలువడిన అసెంబ్లీ ఫలితాల్లో ఘోరంగా ఓడిన మమతా బెనర్జీకి మరో గట్టి ఎదురుదెబ్బ తగిలింది. తృణమూల్ కాంగ్రెస్ బహిష్కృత ఎమ్మెల్యే, తిరుగుబాటు నేత రితబ్రత బెనర్జీ బంగాల్‌ నూతన ప్రతిపక్ష నాయకుడిగా ఎంపికయ్యారు. మమతా బెనర్జీ నేతృత్వంలోని పక్షానికి భారీ షాక్ ఇస్తూ, స్పీకర్ రతీంద్ర బోస్ ఈ మేరకు నిర్ణయం తీసుకున్నారు. బంగాల్ అసెంబ్లీలో ప్రతిపక్ష నాయకుడికి కేటాయించే ప్రత్యేక చాంబర్ తాళాలను కూడా రితబ్రత బెనర్జీకి స్పీకర్ అందజేశారు.

7:21 PM, 3 Jun 2026 (IST)

రేపు, ఎల్లుండి ఉమ్మడి మహబూబ్‌నగర్ జిల్లాలో సీఎం రేవంత్‌రెడ్డి ప‌ర్యట‌న

రేపు, ఎల్లుండి ఉమ్మడి మహబూబ్‌నగర్ జిల్లాలో సీఎం రేవంత్‌రెడ్డి ప‌ర్యట‌ించనున్నారు. పాలమూరు జిల్లాలోని ప్రాజెక్టులు పరిశీలించి అధికారులతో సమీక్ష జరపనున్నారు. రేపు సోమశిలలో బస చేయనున్న సీఎం, ఎల్లుండి ఉద్దండాపూర్‌లో బహిరంగ సభలో పాల్గొంటారు.

7:04 PM, 3 Jun 2026 (IST)

ప్రభుత్వ టీచర్ల కోసం ప్రత్యేకంగా టెట్ నిర్వహణపై ఉత్తర్వులు

ప్రభుత్వ టీచర్ల కోసం ప్రత్యేకంగా టెట్ నిర్వహణపై ప్రభుత్వం ఉత్తర్వులు జారీచేసింది. ఏడాదికి రెండుసార్లు ప్రత్యేక టెట్‌ నిర్వహించాలని జీవోలో పేర్కొన్నారు. ఇప్పటికే సాధారణ టెట్​ను ఏడాదికి రెండుసార్లు నిర్వహిస్తున్నారు.

6:59 PM, 3 Jun 2026 (IST)

ఎస్ఐఆర్ వేళ అర్హులైన ఓటర్లు అసౌకర్యానికి గురికాకుండా చూడాలన్న అసదుద్దీన్ ఒవైసీ

ఎస్ఐఆర్ పురోగతిపై పార్టీ ఎమ్మెల్యేలతో మజ్లిస్ అధినేత అసదుద్దీన్ ఒవైసీ సమీక్షించారు. ఎస్ఐఆర్‌పై క్షేత్రస్థాయిలో సవాళ్లు, ప్రజల ఇబ్బందులపై చర్చించారు. ఎస్ఐఆర్ వేళ అర్హులైన ఓటర్లు అసౌకర్యానికి గురికాకుండా చూడాలని, అర్హులైన ఓటర్ల పేర్లు జాబితాలో ఉండేలా చూడాలని అసదుద్దీన్ పార్టీ నేతలకు సూచించారు. పౌరుల ప్రజాస్వామ్య హక్కుల పరిరక్షణకు మజ్లిస్ కట్టుబడి ఉందని అసదుద్దీన్ తెలిపారు.

6:58 PM, 3 Jun 2026 (IST)

ఫోన్ ట్యాపింగ్ కేసులో జూబ్లీహిల్స్ బీజేపీ నేత దీపక్‌రెడ్డికి సిట్ నోటీసులు

ఫోన్ ట్యాపింగ్ కేసులో జూబ్లీహిల్స్ బీజేపీ నేత దీపక్‌రెడ్డికి సిట్ నోటీసులు జారీచేసింది. రేపు ఉ.11.30 గం.కు కమాండ్ కంట్రోల్ సెంటర్‌లో విచారణకు రావాలని సూచించింది.
పంజాగుట్ట పోలీస్‌స్టేషన్‌లో నమోదైన ఫోన్‌ ట్యాపింగ్‌ కేసులో సాక్షిగా దీపక్‌రెడ్డి వాంగ్మూలం నమోదు చేయనున్నారు.

6:56 PM, 3 Jun 2026 (IST)

మాజీ అదనపు ఎస్పీ భుజంగరావు అరెస్టు

ఆదాయానికి మించి ఆస్తుల కేసులో మాజీ అదనపు ఎస్పీ భుజంగరావును ఏసీబీ అధికారులు అరెస్ట్ చేశారు. ఇవాళ భుజంగరావు కుటుంబసభ్యులు, బంధువుల ఇళ్లలో ఏసీబీ జరిపిన సోదాల్లో సూర్యాపేటలో 27 ఎకరాలకు పైగా వ్యవసాయ భూమి గుర్తించారు. ఐదు ఇంటి స్థలాలు, రెండు ఇళ్లు, హైదరాబాద్‌లో కమర్షియల్ భవనం గుర్తించారు. బ్యాంకు ఖాతాలో రూ.3.83 లక్షలున్నాయి. వీటితో పాటు కిలో బంగారు నగలు, 29 మద్యం సీసాలు కూడా తనిఖీల్లో బయటపడ్డాయి. మొత్తం రూ.5.92 కోట్ల విలువైన సొత్తును ఏసీబీ అధికారులు గుర్తించారు.

6:55 PM, 3 Jun 2026 (IST)

ఈనెల 5 నుంచి 12 వరకు ఎస్‌ఎస్‌సీ అడ్వాన్స్‌డ్ సప్లిమెంటరీ పరీక్షలు

ఈనెల 5 నుంచి 12 వరకు ఎస్‌ఎస్‌సీ అడ్వాన్స్‌డ్ సప్లిమెంటరీ పరీక్షలు(SSC Supplementary Exams) జరగనున్నాయి. రాష్ట్రంలో 93 కేంద్రాల్లో 31,542 మంది విద్యార్థులు పరీక్షలు రాయనున్నారు. ఉదయం 9.30 నుంచి మధ్యాహ్నం 12.30 వరకు పరీక్షలు నిర్వహిస్తారు. బీఎస్‌ఈ తెలంగాణ వెబ్‌సైట్‌లో హాల్ టికెట్లు ఉంచినట్లు విద్యాశాఖ అధికారులు తెలిపారు.

6:22 PM, 3 Jun 2026 (IST)

కేటీఆర్‌ నాకు సోదరుడితో సమానం : పవన్‌ కల్యాణ్

హైదరాబాద్​లో తన సభకు అనుమతి ఇవ్వడం చిన్న విషయమని, ఇస్తే గొడవే వచ్చేది కాదన్నారు ఏపీ డిప్యూటీ సీఎం పవన్‌ కల్యాణ్(AP Dy CM Pavan Kalyan). హైదరాబాద్‌లో తనకు ఇల్లు ఉందని, అక్కడ ఉండటం సాధారణ విషయమేనన్నారు. సభ పెట్టుకోవడం అనేది తన హక్కు.. దాన్ని కాదనకూడదన్నారు. రాష్ట్ర విభజనకు తాను ఎప్పుడూ వ్యతిరేకం కాదని, ప్రాంతీయ విద్వేషాలు రగల్చడం రాహుల్‌గాంధీకి మంచిది కాదని పవన్‌ సూచించారు. ప్రాంతీయ విద్వేషాలు రెచ్చగొట్టే వారు ప్రజలకు ఏం సందేశం ఇస్తారని పవన్‌ ప్రశ్నించారు. తెలంగాణ, తమిళనాడులో ప్రాంతీయ భావం ఉందని, ఏపీ ప్రజల్లో ఉన్న ఉప ప్రాంతీయవాదం సరికాదన్నారు. కేటీఆర్‌ తనకు సోదరుడితో సమానమని, ఇవాళ ఆయన ఏమన్నారో తాను వినలేదన్నారు. తామిద్దరం కలిసినప్పుడు ఈ అంశంపై సరదాగా మాట్లాడుకుంటామని పవన్‌కల్యాణ్ తెలిపారు.


6:21 PM, 3 Jun 2026 (IST)

రాష్ట్రంలో సవరించిన భూముల మార్కెట్ విలువలు రేపటి నుంచి అమలు: పొంగులేటి

రాష్ట్రంలో సవరించిన భూముల మార్కెట్ విలువలు రేపటి నుంచి అమలు కానున్నాయని రెవెన్యూ శాఖ మంత్రి పొంగులేటి శ్రీనివాస రెడ్డి తెలిపారు. భూముల విలువల సవరణ శాస్త్రీయంగా, హేతుబద్ధంగా చేపట్టామని, క్షేత్రస్థాయి అధ్యయనం, మార్కెట్ పరిస్థితుల మేరకు కొత్త విలువలు రూపొందించినట్లు తెలిపారు. ప్రాంతాలవారీగా మార్కెట్ ధరలు, రిజిస్ట్రేషన్లు పరిశీలించే నిర్ణయం తీసుకున్నట్లు పొంగులేటి ప్రకటించారు.

6:19 PM, 3 Jun 2026 (IST)

ఈనెల 15 నుంచి సింగరేణి ప్రాంతంలో కవిత 'బాయిబాట'

ఈనెల 15 నుంచి సింగరేణి ప్రాంతంలో కవిత 'బాయిబాట' పట్టనున్నారు. కోల్ బెల్ట్ ప్రాంతంలో సింగరేణి కార్మికులతో కవిత సమావేశాలు నిర్వహిస్తారు. సింగరేణి అండర్ గ్రౌండ్, ఓపెన్ కాస్ట్ గనుల వద్ద ఈ సమావేశాలు జరగనున్నాయి. మొదటి విడత 6 రోజుల పాటు 5 నియోజకవర్గాల పరిధిలో కవిత పర్యటన సాగనుంది.

5:17 PM, 3 Jun 2026 (IST)

తిరుమల కల్తీ నెయ్యి కేసులో దేశవ్యాప్తంగా 15 ప్రాంతాల్లో ఈడీ అధికారుల సోదాలు

తిరుమల కల్తీ నెయ్యి కేసులో ఈడీ అధికారులు దేశవ్యాప్తంగా 15 ప్రాంతాల్లో సోదాలు జరిపారు. దిల్లీ, ముంబయి, రాజ్‌కోట్‌, గుంటూరు, రూర్కీ, బికనీర్‌, అహల్యానగర్‌, దిండిగల్‌, దెహ్రాదూన్, అహల్యానగర్ ప్రాంతాల్లో ఈ సోదాలు జరిగాయి. పలువురి నివాసాలు, కార్యాలయాల్లో తనిఖీలు చేపట్టారు. ఇందులో పోమిల్ జైన్, విపిన్ జైన్, రాజు రాజశేఖరన్, రాజేష్ మన్సుఖ్‌లాల్, అపూర్వ వినయకాంత్, శాంతారామ్, అజయ్ కుమార్, మహేష్ కుమార్, ఆశిష్ అగర్వాల్‌ ఉన్నారు. సోదాల సమయంలో 60 లక్షల నగదు, రూ.45 కోట్లకు పైగా విలువైన స్థిర, చరాస్తుల్లో పెట్టుబడులు గుర్తించారు.

4:56 PM, 3 Jun 2026 (IST)

ఖమ్మం-వైరా ప్రధాన రహదారిపై అకస్మాత్తుగా రోడ్డుపై గొయ్యి

ఖమ్మం కోర్టు సమీపంలో రహదారి కుంగింది. ఖమ్మం-వైరా ప్రధాన రహదారిపై అకస్మాత్తుగా కుంగింది. ఆ సమయంలో భారీ వాహనాలు లేకపోవడంతో ప్రమాదం తప్పింది. వెంటనే స్పందించిన నగరపాలక, ఆర్ అండ్ బీ అధికారులు మరమ్మతు పనులు చేపట్టారు.

4:51 PM, 3 Jun 2026 (IST)

కువైట్‌ విమానాశ్రయంపై ఇరాన్ దాడిలో భారతీయుడు మృతి

కువైట్‌ విమానాశ్రయంపై ఇరాన్ దాడిలో ఒక భారతీయుడు మృతి చెందాడు. ఈ విషయాన్ని కువైట్‌లోని భారత రాయబార కార్యాలయం ధ్రువీకరించింది. చనిపోయిన వ్యక్తిని ఇంకా గుర్తించాల్సి ఉంది.

4:50 PM, 3 Jun 2026 (IST)

పవన్ కల్యాణ్‌ వ్యాఖ్యలను ఖండించిన గద్దర్ కుమార్తె వెన్నెల

పవన్ కల్యాణ్‌ వ్యాఖ్యలను గద్దర్ కుమార్తె వెన్నెల(Gaddar Daughter Vennela) ఖండించారు. తెలంగాణ గడ్డ నేడు మా జాగీరు.. రేపు మా బిడ్డల జాగీరు అని వ్యాఖ్యానించారు. నటుడిగా, గద్దర్ అభిమానిగా పవన్‌ను అభిమానిస్తానన్నారు. పైసలు పంచితేనో, లాబీలు చేస్తేనో తెలంగాణ రాలేదని, త్యాగాలు చేసి తెలంగాణ తెచ్చుకున్నామన్నారు.

4:49 PM, 3 Jun 2026 (IST)

కర్ణాటక సీఎంగా ప్రమాణ స్వీకారం చేసిన డీకే శివకుమార్‌

కర్ణాటకలో కొత్త ప్రభుత్వం కొలువుదీరింది. ముఖ్యమంత్రిగా డీకే శివకుమార్(Karnataka New CM DK Shiva kumar) ప్రమాణస్వీకారం చేశారు. లోక్ భవన్‌లోని గ్లాస్‌హౌస్‌లో జరిగిన ఈ కార్యక్రమంలో గవర్నర్ ఈ మేరకు డీకే శివకుమార్​తో ప్రమాణం చేయించారు. ఈ ప్రమాణ స్వీకార కార్యక్రమానికి కాంగ్రెస్ జాతీయ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే, లోక్​సభ ప్రతిపక్ష నేత రాహుల్‌ గాంధీ, మాజీ సీఎం సిద్ధరామయ్య హాజరయ్యారు.

4:45 PM, 3 Jun 2026 (IST)

ఆర్మూర్-జగిత్యాల-మంచిర్యాల హైవే (ఎన్‌హెచ్‌ 63), జగిత్యాల-కరీంనగర్‌ జాతీయరహదారి (ఎన్‌హెచ్‌ 563) కేంద్రం విస్తరణకు ఆమోదం

రాష్ట్రంలో రెండు జాతీయ రహదారుల విస్తరణకు కేంద్ర కేబినెట్‌ ఆమోదం లభించింది. ఆర్మూర్-జగిత్యాల-మంచిర్యాల హైవే (ఎన్‌హెచ్‌ 63), జగిత్యాల-కరీంనగర్‌ జాతీయరహదారి (ఎన్‌హెచ్‌ 563) విస్తరణకు ఆమోదం లభించింది. ఆర్మూర్-జగిత్యాల-మంచిర్యాల హైవే హైబ్రిడ్‌ యాన్యుటీ విధానంలో, జగిత్యాల-కరీంనగర్‌ మార్గం బీవోటీ పద్ధతిలో నిర్మించనున్నారు. రెండు జాతీయ రహదారులు 4 వరుసలుగా విస్తరించనున్నారు. ఇందుకోసం రూ.7,597 కోట్లు ఖర్చుచేయనున్నారు.

4:44 PM, 3 Jun 2026 (IST)

తెలంగాణలో పవన్ కల్యాణ్‌ కార్యక్రమం అడ్డుకోవడం సరికాదు: చంద్రబాబు

తెలంగాణలో జనసేన అధ్యక్షుడు, ఏపీ ఉపముఖ్యమంత్రి పవన్ కల్యాణ్‌ కార్యక్రమం అడ్డుకోవడం సరికాదని ఏపీ సీఎం నారా చంద్రబాబు నాయుడు తెలిపారు. ప్రజలకు మంచి చేయడంలో నాయకులు పోటీపడాలని సూచించారు. ప్రజల మధ్య విభేదాలు తెచ్చేందుకు నేతలు పోటీపడకూడదని తెలంగాణ నేతలకు హితువు పలికారు.

2:05 PM, 3 Jun 2026 (IST)

నౌహీరా షేక్ పీఏ నజ్నీన్‌ అన్సారీ అరెస్టు

హైదరాబాద్​లో నౌహీరా షేక్ పీఏ నజ్నీన్‌ అన్సారీని ఈడీ అధికారులు అరెస్టు చేశారు. ఈడీ అటాచ్ చేసిన ఆస్తులను నౌహీరా షేక్ రెంట్‌కు ఇచ్చారు. ఇందులో నజ్నీన్‌ అన్సారీ కీలకంగా వ్యవహరించారు. మనీలాండరింగ్‌ కేసులో నౌహీరాను గతంలో ఈడీ అరెస్టు చేసింది.

2:04 PM, 3 Jun 2026 (IST)

భద్రాచలంలోని గోదావరి ముంపు ప్రాంతాల్లో పర్యటిస్తున్న అధికారులు

భద్రాచలంలోని గోదావరి ముంపు ప్రాంతాల్లో కేంద్ర జలసంఘం, పోలవరం ప్రాజెక్ట్ అథారిటీ అధికారులు పర్యటిస్తున్నారు. పోలవరం పూర్తయితే బ్యాక్ వాటర్ ఎంతవరకు వస్తుందో అధికారులు పరిశీలిస్తున్నారు. వరద తీవ్రత పెరిగితే ఏ ప్రాంతాలు ప్రభావితం అవుతాయనే విషయాలను మ్యాప్ సహాయంతో పరిశీలిస్తున్నారు.

2:03 PM, 3 Jun 2026 (IST)

జూబ్లీ బస్టాప్‌ వద్ద ఆర్టీసీ బస్సు బీభత్సం

సికింద్రాబాద్ జూబ్లీ బస్టాప్‌ వద్ద ఆర్టీసీ బస్సు బీభత్సం సృష్టించింది. ఆర్టీసీ బస్సు ప్రయాణికులపైకి దూసుకెళ్లింది. ఈ ఘటనలో ద్విచక్ర వాహనదారుడు శివ బస్సు టైర్ల కింద ఇరుక్కుపోయాడు. బస్సు కింద పడిన శివను వాహనదారులు కాపాడి, ఆస్పత్రికి తరలించారు.

1:06 PM, 3 Jun 2026 (IST)

ఖరీఫ్‌ సీజన్‌కు విత్తనాలు సిద్ధంగా ఉంచాం: మంత్రి తుమ్మల

ఖరీఫ్‌ సీజన్‌కు విత్తనాలు సిద్ధంగా ఉంచామని వ్యవసాయశాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు తెలిపారు. ఇతర రాష్ట్రాల వాళ్లు కూడా వచ్చి కొనుగోలు చేసే విత్తనాలు ఉన్నాయన్నారు. ఇతర రాష్ట్రాల్లో జొన్న, మొక్కజొన్న పంటను ప్రభుత్వాలు కొనుగోలు చేయట్లేదన్న తుమ్మల.. నష్టం వచ్చినా సరే ఆ పంటను కొనుగోలు చేసినట్లు తెలిపారు.

కేంద్ర ప్రభుత్వ విధానాల వల్లే ధాన్యం కొనుగోళ్లలో జాప్యం జరిగిందని తుమ్మల ఆరోపించారు. డీజిల్‌ కొరత, హమాలీల కొరత వల్ల ధాన్యం సేకరణ ఆలస్యమైందన్నారు. పంటల వైవిధ్యం, పంటమార్పిడిపై రైతులు దృష్టి పెట్టాలని సూచించారు. కూరగాయలు, పప్పు దినుసుల పంటల సాగు చాలా పెరగాలన్నారు.

అధికంగా రసాయన ఎరువుల వాడకం వల్ల భూసారం తగ్గుతుందని మంత్రి ఆందోళన వ్యక్తం చేశారు. రసాయనాలు ఎక్కువ వాడితే పంట ఉత్పత్తుల్లో వాటి అవశేషాలు కనిపిస్తాయన్నారు. ఆ అవశేషాలు కనిపిస్తే.. ఇతర దేశాలు కొనట్లేదని తుమ్మల చెప్పారు.

12:53 PM, 3 Jun 2026 (IST)

రెండో అంతస్తు నుంచి జారిపడి రీసెర్చ్‌ ఆఫీసర్ మృతి

రంగారెడ్డి జిల్లా రాజేంద్రనగర్‌లోని ఎన్‌ఐఆర్‌డీ రీసెర్చ్‌ ఆఫీసర్ బాలరాజు(54) మృతి చెందారు. ఎన్‌ఐఆర్‌డీ భవనం రెండో అంతస్తు నుంచి జారిపడ్డారు. ఆస్పత్రిలో చికిత్సపొందుతూ మరణించారు. ఈ ఘటనపై కేసునమోదు చేసిన పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.

12:31 PM, 3 Jun 2026 (IST)

రెస్టారెంట్‌లో అగ్నిప్రమాదం - 20 మంది సజీవ దహనం

దిల్లీ మాలవీయనగర్‌లోని ఓ రెస్టారెంట్‌లో అగ్నిప్రమాదం జరిగింది. ఈ ఘటనలో 20 మంది సజీవ దహనమయ్యారు. ఘటనాస్థలిలో సహాయచర్యలు కొనసాగుతున్నాయి. రెస్టారెంట్‌లో చిక్కుకున్న 40 మందిలో ముగ్గురిని కాపాడారు. మృతుల్లో ఎక్కువ మంది విదేశీయులు ఉన్నట్లు తెలుస్తోంది.

12:24 PM, 3 Jun 2026 (IST)

జనసేన కొత్తగా పోటీ చేసేదేముంది: కేటీఆర్‌

తెలంగాణలో పోటీచేస్తామన్న పవన్​ కల్యాణ్​ వ్యాఖ్యలపై కేటీఆర్​ స్పందించారు. జనసేన కొత్తగా పోటీ చేసేదేముందన్న కేటీఆర్​.. 2023లో పోటీ చేశారు, మున్సిపల్‌ ఎన్నికల్లో కూడా పోటీ చేశారని గుర్తుచేశారు. పవన్‌ కల్యాణ్‌ను ప్రజలే అడ్డుకున్నారని కేటీఆర్​ అన్నారు. తెలంగాణ ఏర్పడితే 11 రోజులు అన్నం తినలేదని పవన్‌ గతంలో అన్నారన్న కేటీఆర్​.. తెలంగాణ ఏర్పడితే అన్నం తినని వ్యక్తి, రాష్ట్ర అవతరణ రోజు సభ ఎందుకు పెట్టారని ప్రశ్నించారు.

తెలంగాణ ముమ్మాటికి భూమిపుత్రుల జాగీరే అని అందులో అనుమానం లేదని కేటీఆర్​ అన్నారు. ప్రాంతీయవాదం ఉగ్రవాదం కంటే ప్రమాదకరం అని పవన్‌ అన్నారన్న కేటీఆర్​.. పొట్టి శ్రీరాములు ఆంధ్రరాష్ట్రం కోసం ప్రాణాలు అర్పించారని, దాన్ని తప్పు పడతారా అని ప్రశ్నించారు. తెలంగాణకు వస్తున్న పరిశ్రమలను మోదీ.. గుజరాత్‌కు తరలించారు..దాన్ని ఏమనాలని ప్రశ్నించారు. జాతీయవాదం గురించి పవన్‌ వద్ద పాఠాలు నేర్చుకోవాల్సిన అవసరం తమకు లేదన్నారు. తెలంగాణను కాపాడుకునేందుకు ఓజీ కేసీఆర్‌ ఉన్నారన్నారు.

11:49 AM, 3 Jun 2026 (IST)

తెలంగాణకు మళ్లీ ముప్పు పొంచి ఉంది: కేటీఆర్‌

తెలంగాణకు మళ్లీ ముప్పు పొంచి ఉందిని కేటీఆర్‌ ఆందోళన వ్యక్తం చేశారు. మోటార్లకు మీటర్లు పెడితేనే నిధులు ఇస్తామని మోదీ అన్నారు అని కేటీఆర్​ చెప్పారు. నిధులు రాకపోయినా సరే.. రైతుల మోటార్లకు మీటర్లు మేం పెట్టేది లేదని చెప్పామని గుర్తు చేశారు. రేవంత్‌రెడ్డి మాత్రం మోదీ చెప్పినట్లు నడుచుకుంటున్నారని విమర్శించారు. అవసరం లేకపోయినా.. రైతు డిస్కమ్ ఏర్పాటు చేశారన్నారు. రాజకీయాల్లో గెలుపోటములు సహజం.. ఓటమికి కుంగిపోమని స్పష్టం చేశారు. టీడీపీ, బీఆర్‌ఎస్‌ మాత్రమే ఇన్నేళ్లు మనుగడ సాగించాయన్నారు.

11:15 AM, 3 Jun 2026 (IST)

తెలంగాణ కథలో నంబర్‌ వన్‌ విలన్‌ కాంగ్రెస్‌ పార్టీయే : కేటీఆర్‌

ప్రతి వ్యక్తి తాను పుట్టినగడ్డ చరిత్ర తెలుసుకోవాలని బీఆర్​ఎస్​ వర్కింగ్​ ప్రెసిడెంట్​, మాజీ మంత్రి కేటీఆర్‌ సూచించారు. ఆనాడు బలవంతంగా ఆంధ్ర, తెలంగాణను కాంగ్రెస్​ కలిపిందని విమర్శించారు. ఆంధ్ర, తెలంగాణ కలిపేసిన తర్వాత కొన్నాళ్లకే మళ్లీ ఉద్యమం మొదలైందన్నారు. 1969 ఉద్యమంలో 379 మంది ప్రాణాలను కాంగ్రెస్​ బలిగొన్నదని ఆరోపించారు. తెలంగాణ ఉద్యమాలను కాంగ్రెస్​ కర్కశంగా అణిచివేసిందని ఆరోపించారు. మలిదశ ఉద్యమంలో వేలాది మంది ప్రాణాలను బలికొందని ఆరోపించారు. తెలంగాణ కథలో నంబర్‌ వన్‌ విలన్‌ కాంగ్రెస్‌ పార్టీయేనని కేటీఆర్‌ ఆరోపించారు.

10:51 AM, 3 Jun 2026 (IST)

సోషల్ మీడియాలో పవన్ ఆసక్తికర పోస్టు

జనసేన అధినేత, ఏపీ డిప్యూటీ సీఎం పవన్‌ కల్యాణ్‌ సోషల్ మీడియాలో చేసిన పోస్టు వైరల్​ అవుతోంది. నవనిర్మాణ సభ పేరుతో సమావేశానికి పోలీసులు నిరాకరణ నేపథ్యంలో మంగళవారం సాయంత్రం మీడియా సమావేశం నిర్వహించారు. అనేక అంశాలపై కీలక వ్యాఖ్యలు చేశారు. తెలంగాణలో జనసేన ఉంటుందని, ఎన్నికల్లో పోటీచేస్తుందని స్పష్టం చేశారు. అయితే తాజాగా ప్రముఖ కవి శేషేంద్ర రచించిన కవితను పవన్‌ కల్యాణ్‌ పోస్టు చేశారు.

9:58 AM, 3 Jun 2026 (IST)

ఫోన్ ట్యాపింగ్ కేసు నిందితుడు మాజీ ఏఎస్పీ భుజంగరావు నివాసాల్లో ఏసీబీ సోదాలు

ఆదాయానికి మించిన ఆస్తుల కేసులో మాజీ అడిషనల్‌ ఎస్పీ భుజంగరావు నివాసాల్లో ఏసీబీ సోదాలు చేస్తోంది. హైదరాబాద్, సూర్యాపేట సహా పలు ప్రాంతాల్లోని నివాసాల్లో తనిఖీలు చేస్తున్నారు. హఫీజ్‌పేటలోని భుజంగరావు ఇంటితోపాటు ఆయన బంధువుల ఇళ్లల్లోనూ ఏసీబీ అధికారులు సోదాలు చేస్తున్నారు. మాజీ ఏఎస్పీ భుజంగరావు ఫోన్ ట్యాపింగ్ కేసులో నిందితుడిగా ఉన్నారు.

8:53 AM, 3 Jun 2026 (IST)

ఇద్దరు మహిళలు అనుమానాస్పద స్థితిలో మృతి

మహబూబాబాద్ జిల్లాలో మరిపెడ మండలం భూక్యా తండాలో ఇద్దరు మహిళలు అనుమానాస్పద స్థితిలో మృతిచెందారు. మద్యం అధిక మోతాదు వల్ల రాత్రి చనిపోయినట్లు స్థానికులు భావిస్తున్నారు. ఘటనాస్థలికి చేరుకుని మహిళల మృతిపై పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.

8:15 AM, 3 Jun 2026 (IST)

ఒకదానికొకటి ఢీకొన్న మూడు డీసీఏంలు

నల్లొండ జిల్లా డిండి మండలం ఎర్రగుంటపల్లి వద్ద రోడ్డుప్రమాదం జరిగింది. కోదాడ జడ్చర్ల రహదారిపై మూడు డీసీఏంలు ఒకదానికొకటి ఢీకొట్టాయి. ఈ ఘటనలో గొర్రెలతో వెళ్తున్న డీసీఎంలు ఢీకొని గొర్రెల కాపరి ఎల్లయ్య మృతి చెందారు.

6:45 AM, 3 Jun 2026 (IST)

రేపు, ఎల్లుండి ఉమ్మడి మహబూబ్‌నగర్‌ జిల్లాలో సీఎం రేవంత్‌రెడ్డి పర్యటన

రేపు, ఎల్లుండి ఉమ్మడి మహబూబ్‌నగర్‌ జిల్లాలో సీఎం రేవంత్‌రెడ్డి పర్యటించనున్నారు. ఉమ్మడి మహబూబ్‌నగర్‌ జిల్లాలో ప్రాజెక్టుల పురోగతిని పరిశీలించనున్నారు. రేపు సోమశిలలో వివిధ ప్రాజెక్టులపై ప్రజెంటేషన్, పాలమూరు-రంగారెడ్డి, కల్వకుర్తి, కోయిల్‌సాగర్‌పై ప్రజెంటేషన్, సమీక్షలు, భీమా, నెట్టెంపాడు, ఇతర ప్రాజెక్టులపై ప్రజెంటేషన్, సమీక్ష చేయనున్నారు. ఉదండపూర్ రిజర్వాయర్ వద్ద బహిరంగ సభ నిర్వహించనున్నారు.

6:44 AM, 3 Jun 2026 (IST)

రేపు లాసెట్‌ ఫలితాలు విడుదల

రేపు మధ్యాహ్నం 3.30గంటలకు లాసెట్‌ ఫలితాలు విడుదల కానున్నాయి. లాసెట్‌ ఫలితాలను ఉన్నత విద్యామండలి ఛైర్మన్‌ విడుదల చేయనున్నారు.

6:41 AM, 3 Jun 2026 (IST)

రేపు కేరళలోకి నైరుతి ప్రవేశానికి అనుకూల పరిస్థితులు

రేపు కేరళలోకి నైరుతి ప్రవేశానికి అనుకూల పరిస్థితులు ఉండడంతో కేరళ నుంచి వారం రోజులకు తెలంగాణలోకి ప్రవేశించే అవకాశం ఉంది. ఉపరితల ఆవర్తనం, ద్రోణుల వల్ల మూడ్రోజులపాటు ఈదురుగాలులు, ఉరుములతో తేలికపాటి నుంచి మోస్తరు వర్ష సూచనలు ఉన్నాయి. గంటకు 50 నుంచి 60 కిలోమీటర్ల వేగంతో ఈదురుగాలులు వీచే అవకాశం ఉంది. ఇవాళ ఉమ్మడి హైదరాబాద్‌, రంగారెడ్డి, నల్గొండ, వరంగల్‌ జిల్లాలకు ఎల్లో అలర్ట్‌ జారీ చేసింది. తెలంగాణలో 4 రోజుల్లో ఉష్ణోగ్రతలు 2-4 డిగ్రీల మేర తగ్గే అవకాశం ఉంది.

6:34 AM, 3 Jun 2026 (IST)

రాష్ట్రంలో 'పెద్ది' టికెట్ ధరల పెంపు, రోజుకు 5 షోలకు అనుమతి

రాష్ట్రంలో 'పెద్ది' టికెట్ ధరల పెంపు, రోజుకు 5 షోలకు తెలంగాణ ప్రభుత్వం గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. జూన్ 4న విడుదలకానున్న 'పెద్ది' సినిమా టికెట్ ధరల పెంపునకు అనుమతి ఇచ్చింది. జూన్ 3న రాత్రి 8 గంటలకు స్పెషల్ ప్రీమియర్ షోకి అనుమతి ఇవ్వగా టికెట్ ధర గరిష్ఠంగా రూ.600గా నిర్ణయించారు. జూన్ 4 నుంచి 10 రోజులపాటు సింగిల్ స్క్రీన్లలో రూ.100, మల్టీప్లెక్స్‌ల్లో రూ.125 పెంచుకోవచ్చు.

Last Updated : June 3, 2026 at 10:47 PM IST