ETV Bharat / state

3rd July 2026 News Today AP Live News Updates: బాపట్ల జిల్లాలో ఆర్థిక ఇబ్బందులతో తండ్రి, కుమారుడు ఆత్మహత్యాయత్నం

3rd July 2026 News Today AP Live News Updates
3rd July 2026 News Today AP Live News Updates (ETV Bharat)
author img

By ETV Bharat Andhra Pradesh Team

Published : July 3, 2026 at 7:08 AM IST

|

Updated : July 3, 2026 at 10:51 PM IST

Choose ETV Bharat

3rd July 2026 News Today AP Live News Updates: అరకు పార్లమెంట్‌లో పరిస్థితులపై మంత్రి లోకేశ్‌తో మంత్రి సంధ్యారాణి చర్చ

LIVE FEED

10:49 PM, 3 Jul 2026 (IST)

ఆర్థిక ఇబ్బందులతో తండ్రి, కుమారుడు ఆత్మహత్యాయత్నం

బాపట్ల జిల్లా మార్టూరు మండలం బొబ్బేపల్లిలో విషాదం చోటుచేసుకుంది. ఆర్థిక ఇబ్బందులతో తండ్రి, కుమారుడు పురుగుల మందు ఆత్మహత్యాయత్నానికి పాల్పడ్డారు. గమనించిన కుటుంబ సభ్యులు వారిని ఆసుపత్రికి తరలించగా చికిత్స పొందుతూ తండ్రి ఆంజనేయులు మృతి చెందాడు. కుమారుడు అంకమ్మరావు పరిస్థితి విషమంగా ఉంది.

10:48 PM, 3 Jul 2026 (IST)

యూట్యూబర్ రావణ్‌ను కోర్టులో హాజరుపరిచిన పోలీసులు

యూట్యూబర్ రావణ్‌ను పోలీసులు కోర్టులో హాజరుపరిచారు. రావణ్ తరపున జడ శ్రావణ్‌కుమార్ కోర్టుకు వచ్చారు. కోర్టులో వాదనలు కొనసాగుతున్నాయి.

10:47 PM, 3 Jul 2026 (IST)

విశాఖ జిల్లాలో ఆరుగురు బీఎల్‌వోలపై సస్పెన్షన్ వేటు

విశాఖ జిల్లాలో విధుల్లో నిర్లక్ష్యం వహించిన ఆరుగురు బీఎల్‌వోలను కలెక్టర్ సస్పెండ్ చేశారు. ఎస్‌ఐఆర్ ప్రక్రియలో బీఎల్‌వోలు నిర్లక్ష్యం వహించినట్లు గుర్తించి వారిపై చర్యలు తీసుకున్నారు.

10:47 PM, 3 Jul 2026 (IST)

పాపికొండలు విహారయాత్రకు పచ్చ జెండా

పాపికొండలు విహారయాత్రకు అధికారులు పచ్చజెండా ఊపారు. ఇరవై రోజుల తరువాత శనివారం నుంచి విహారయాత్రను పునరుద్ధరిస్తూ అనుమతులు మంజూరు చేశారు. పోలవరం జిల్లా దేవీపట్నం మండలంలో గండిపోశమ్మ ఆలయం నుంచి బయలుదేరేందుకు 15 ప్రైవేట్‌ బోట్లు, ఒక ఏపీటీడీసీ బోటు సిద్ధమయ్యాయి. గత నెల 14న పోశమ్మగండి నుంచి గోదావరిలో విహారయాత్రకు బయలుదేరిన ఓ పర్యాటక బోటు దేవీపట్నం పోలీసు స్టేషన్‌ సమీపంలోకి వెళ్లేసరికి సాంకేతిక లోపం తలెత్తడంతో నిలిచిపోయిన సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో అధికారులు పాపికొండల విహారయాత్రను తాత్కాలికంగా నిలిపివేస్తున్నట్లు ప్రకటించారు. అప్పట్లో రంపచోడవరం ఆర్డీవో స్వాతి, ఇటీవల జేసీ ప్రశాంత్‌కుమార్‌ బోట్లను తనిఖీ చేశారు. శనివారం నుంచి బోట్లు వెళ్లేందుకు అనుమతులు మంజూరు చేశారని జలవనరుల శాఖ ఏఈ భాస్కర్‌ తెలిపారు.

10:45 PM, 3 Jul 2026 (IST)

బొల్లా బ్రహ్మనాయుడు తనపై చేసిన విమర్శలను ఖండించిన ఎంపీ లావు

పల్నాడు జిల్లా వినుకొండ నియోజకవర్గంలో పలు అభివృద్ధి పనులను జీవీ ఆంజనేయులుతో కలిసి ఎంపీ లావు శ్రీకృష్ణదేవరాయలు ప్రారంభించారు.బొల్లా బ్రహ్మనాయుడు తనపై చేసిన విమర్శలను ఎంపీ లావు ఖండించారు. గండిపేట భూకబ్జా వ్యవహారంలో రూ.31 కోట్ల లావాదేవీలు జరిగాయన్నారు. బొల్లా బ్రహ్మనాయుడి లావాదేవీలకు ఆధారాలు ఉన్నాయని చెప్పారు. బొల్లా బ్రహ్మనాయుడి అంశంలో ఈడీ విచారణకు కోరేందుకు సిద్ధమని ఎంపీ లావు వెల్లడించారు.

10:44 PM, 3 Jul 2026 (IST)

స‌ర్ విధుల్లో అల‌స‌త్వం వహించిన నలుగురు అధికారులకు నోటీసులు

ఎన్టీఆర్ జిల్లాలో​ స‌ర్ విధుల్లో అల‌స‌త్వం వహించిన నలుగురు అధికారులకు కలెక్టర్ షోకాజు నోటీసులు జారీ చేశారు. ఓటు భ‌ద్రతకు కీల‌క‌మైన స‌ర్‌లో నిర్లక్ష్యం వ‌హిస్తే చ‌ర్యలు తప్పవని కలెక్టర్‌ హెచ్చరించారు.

10:43 PM, 3 Jul 2026 (IST)

కుప్పం ప్రజల దీవెనలే నాకు శ్రీరామ రక్ష: సీఎం చంద్రబాబు

'కుప్పంలో ఏర్పాటు చేసిన పరిశ్రమలకు అన్ని రకాలుగా సహకరిస్తాం. కుప్పం ప్రజల దీవెనలే నాకు శ్రీరామ రక్ష. దేశంలోనే ఆదర్శ నియోజకవర్గంగా కుప్పాన్ని తయారు చేయాలనేది నా కోరిక. సంక్షేమం- అభివృద్ధి- సుపరిపాలనతో ప్రభుత్వాన్ని నడుపుతున్నాం. ప్రతి కుటుంబానికి ఉపాధి, యువకుడికి ఉద్యోగం లభించేలా చూస్తాం. ప్రపంచంలోని బెస్ట్ పరిశ్రమలను రాష్ట్రానికి, కుప్పానికి తెస్తాం. చెత్త నుంచి బయో ఫ్యూయల్ తయారు చేస్తున్నామని' సీఎం చంద్రబాబు పేర్కొన్నారు.

10:42 PM, 3 Jul 2026 (IST)

టీటీడీకి రూ.50.20 లక్షల విరాళం

తిరుమల ఎస్వీ అన్నప్రసాదం ట్రస్టుకు మిళనాడుకు చెందిన కేకేఎస్ నిర్మాణ సంస్థ ప్రతినిధు రూ.50.20 లక్షల విరాళం అందిచారు. ఈ మేరకు అదనపు ఈవో కార్యాలయంలో వెంకయ్య చౌదరికి డీడీని అందజేశారు.

10:41 PM, 3 Jul 2026 (IST)

కల్యాంలో యువకుడు ఆత్మహత్య

అనంతపురం జిల్లా డి.హీరేహాల్ మండలం కల్యాంలో యువకుడు ఆత్మహత్య పాల్పడ్డాడు. మృతుడు బంగాల్​కు చెందిన వ్యక్తిగా పోలీసులు గుర్తించారు.

7:42 PM, 3 Jul 2026 (IST)

14 ఏళ్ల బాలిక అనుమానాస్పద మృతి - మామపై అనుమానం వ్యక్తం చేస్తూ పోలీసులకు తల్లి ఫిర్యాదు

కృష్ణా జిల్లా ఉంగుటూరు మండలంలో జూన్ 28న 14 ఏళ్ల బాలిక అనుమానాస్పద మృతి తీవ్ర కలకలం రేపుతోంది. ఇంట్లో ఉరివేసుకొని బాలిక ఆత్మహత్యకు పాల్పడినట్లు ఆరోపణలు వస్తుండగా ఈ ఘటన పలు అనుమానాలకు తావిస్తోంది. బాలిక మృతిచెందిన రోజే కుటుంబ సభ్యులు పోలీసులకు ఎలాంటి ముందస్తు సమాచారం ఇవ్వకుండా అంత్యక్రియలు నిర్వహించి మృతదేహాన్ని ఖననం చేశారు. అయితే బాలిక మృతి విషయంలో మామపై అనుమానం వ్యక్తం చేస్తూ పోలీసులకు తల్లి ఫిర్యాదు చేశారు. అనుమానాస్పద మృతిగా పోలీసులు కేసు నమోదు చేసి, దర్యాప్తు చేస్తున్నారు.

7:11 PM, 3 Jul 2026 (IST)

ప్రకాశ్‌రెడ్డి మాపై ఇష్టం వచ్చినట్లు మాట్లాడుతున్నారు: ఎమ్మెల్యే సురేంద్రబాబు

వైఎస్సార్సీపీ మాజీ ఎమ్మెల్యే రాప్తాడు ప్రకాశ్​రెడ్డి తీరుపై టీడీపీ నాయకులు తీవ్రస్థాయిలో ధ్వజమెత్తారు. ఈ విషయంపై టీడీపీ ఎమ్మెల్యే సురేంద్రబాబు మాట్లాడుతూ ప్రకాశ్‌రెడ్డి తమపై ఇష్టం వచ్చినట్లు మాట్లాడుతున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. తాము 2019- 24 మధ్య ఏపీతో పాటు అనేక రాష్ట్రాల్లో పనులు చేస్తున్నామని స్పష్టం చేశారు. చక్రపాణిని వాహనాలు ఢీకొట్టడంతోనే ఆయన చనిపోయారని తాము పేపర్లలో చూసి తెలుసుకున్నామని చెప్పారు. అలాగే రోడ్డుపై అనుకోకుండా జరిగేదాన్ని యాక్సిడెంట్ అంటారని, కానీ అక్కడ ప్రమాదం జరిగితే ప్రకాశ్‌రెడ్డి దానిపై రాజకీయం చేస్తున్నారని పరిటాల శ్రీరామ్ మండిపడ్డారు. మాజీ ఎమ్మెల్యే ప్రకాశ్‌రెడ్డి మతి భ్రమించి మాట్లాడుతున్నారని టీడీపీ నాయకుడు ఎంఎస్ రాజు విమర్శించారు. ప్రకాశ్‌రెడ్డి తన స్వంత కార్యకర్తలను తనే కేసుల్లో ఇరికించి, ఆ నెపాన్ని టీడీపీపై నెట్టేస్తున్నారని ఆరోపించారు. కేవలం తన రాజకీయ ఉనికి కోసమే పరిటాల కుటుంబాన్ని, మంత్రి నారా లోకేశ్‌ను తిడుతున్నారని దుయ్యబట్టారు.

6:54 PM, 3 Jul 2026 (IST)

రాజధాని పనుల పురోగతిపై మంత్రి నారాయణ సమీక్ష

రాజధాని పనుల పురోగతిపై మంత్రి నారాయణ సమీక్షించారు. అమరావతిలో ప్రాజెక్టుల వారీగా పనుల పురోగతిపై చర్చించారు. ఆటంకం లేకుండా పనులు జరుగుతున్నాయని ఇంజినీర్లు వివరించారు. పరిపాలన అనుమతులు పొందిన ప్రాజెక్టులకు టెండర్లు పిలవాలని మంత్రి ఆదేశించారు. రైతుల నుంచి అందిన ఫిర్యాదుల పరిష్కారంపై మంత్రి నారాయణ చర్చించారు. వీలైనంత త్వరగా అధికారులు, ఉద్యోగుల నివాసాలు పూర్తి చేయాలని ఆదేశాలు జారీ చేశారు.

6:45 PM, 3 Jul 2026 (IST)

అరకు పార్లమెంట్‌లో పరిస్థితులపై మంత్రి లోకేశ్‌తో మంత్రి సంధ్యారాణి చర్చ

అరకు పార్లమెంట్‌లో పరిస్థితులపై మంత్రి లోకేశ్‌తో మంత్రి సంధ్యారాణి చర్చించారు. అరకు లోక్‌సభ నియోజకవర్గంలో కార్యక్రమాల పురోగతి నివేదికను సంధ్యారాణి మంత్రి లోకేశ్​కు అందించారు. అనంతరం ఆ నియోజకవర్గ పరిధిలో పార్టీ బలోపేతంపై చేపట్టాల్సిన కార్యాచరణపై చర్చించిన ఇరువులు మంత్రులు సుదీర్ఘంగా చర్చించారు. ఈ సమావేశంలో రాష్ట్రంలోని 9 ఐటీడీఏల ప్రస్తుత పరిస్థితులు, గిరిజన ప్రాంతాల అభివృద్ధిపై ప్రత్యేకంగా దృష్టి సారించారు. గిరిజన ప్రాంతాల్లో విషజ్వరాల నివారణకు ముందస్తు చర్యలు చేపట్టాలని లోకేశ్‌ సూచించారు. ఈ క్రమంలో త్వరలోనే అరకులోని 7 నియోజకవర్గాల ఇన్‌ఛార్జులతో సమావేశం నిర్వహించాలని మంత్రులు నిర్ణయించారు.

6:16 PM, 3 Jul 2026 (IST)

మచిలీపట్నం ప్రభుత్వ ఆస్పత్రికి యూట్యూబర్ రావణ్ తరలింపు

పవన్‌పై అనుచిత వ్యాఖ్యలు చేసిన కేసులో రావణ్‌ను పోలీసులు అరెస్టు చేసిన సంగతి తెలిసిందే. ఇనగుదురు పీఎస్ నుంచి భారీ బందోబస్తుతో మచిలీపట్నం ప్రభుత్వ ఆస్పత్రికి యూట్యూబర్ రావణ్ తరలించారు. వైద్య పరీక్షలు నిర్వహించిన అనంతరం కోర్టులో హాజరుపర్చనున్నారు.

6:15 PM, 3 Jul 2026 (IST)

సిట్‌ అధికారుల పిటిషన్‌పై విచారణ ఆదివారానికి వాయిదా వేసిన హైకోర్టు

నాగరాజు కస్టడీ విచారణపై సిట్‌ అధికారుల లంచ్ మోషన్ పిటిషన్‌పై హైకోర్టులో విచారణ జరిగింది. పోలీసుల కస్టడీ విచారణపై దిగువ కోర్టు ఇచ్చిన నిబంధనల్లో మార్పు కోరుతూ సిట్‌ పిటిషన్‌ చేసింది. సిట్‌ అధికారుల పిటిషన్‌పై విచారణను హైకోర్టు ఆదివారానికి వాయిదా వేసింది.

6:14 PM, 3 Jul 2026 (IST)

కుప్పంలో ఎంఎస్‌ఎంఈ పార్క్ ప్రారంభించిన సీఎం చంద్రబాబు

కుప్పంలో ఎంఎస్‌ఎంఈ పార్క్​ను సీఎం చంద్రబాబు ప్రారంభించారు. గుడిపల్లె మండలం పొగురుపల్లెలో 44.58 ఎకరాల్లో ఎంఎస్ఎంఈ పార్క్ ఏర్పాటు చేయనున్నారు. ఈనెల నుంచి పారిశ్రామికవేత్తలకు ప్లాట్లు కేటాయించాలని సీఎం ఆదేశించారు. కుప్పంలో చిన్న, మధ్యతరహా పరిశ్రమలను ఒకే వేదిక పైకి ఎంఎస్ఎంఈ పార్క్ తీసుకురానుంది.

6:11 PM, 3 Jul 2026 (IST)

కడప స్టీల్‌ ప్లాంట్‌ నిర్మాణ కర్త, కర్మ, క్రియ అన్నీ చంద్రబాబే: ప్రత్తిపాటి పుల్లారావు

కడప స్టీల్‌ ప్లాంట్‌ నిర్మాణ కర్త, కర్మ, క్రియ అన్నీ చంద్రబాబే అని ప్రత్తిపాటి పుల్లారావు స్పష్టం చేశారు. రాయలసీమ బిడ్డనని చెప్పడం తప్ప, జగన్ సీమకు చేసింది శూన్యమని విమర్శించారు. జగన్ హయాంలో కేవలం ఉత్తుత్తి శంకుస్థాపనలు తప్ప, ఉక్కు ఉత్పత్తి, ఉపాధి కల్పించడంపై జగన్ ఏమాత్రం దృష్టి పెట్టలేదని ప్రత్తిపాటి పుల్లారావు ఆరోపించారు.

5:39 PM, 3 Jul 2026 (IST)

లోక్‌భవన్‌లో గవర్నర్‌ను కలిసిన ఉపముఖ్యమంత్రి పవన్‌కల్యాణ్‌

లోక్‌భవన్‌లో గవర్నర్‌ను ఉపముఖ్యమంత్రి పవన్‌కల్యాణ్‌ కలిశారు. గవర్నర్ అబ్దుల్ నజీర్‌తో ఉపముఖ్యమంత్రి పవన్‌ కల్యాణ్‌ భేటీ అయ్యారు. సామాజిక మాధ్యమాల్లో వ్యక్తిత్వ హననంపై గవర్నర్‌కు పవన్‌ వివరించారు. ప్రభుత్వం, చట్టపరంగా తీసుకునే చర్యలను గవర్నర్‌కు పవన్ వివరించే అవకాశముంది.

5:36 PM, 3 Jul 2026 (IST)

ఈ-పంట నమోదుపై జగన్, సాక్షి ప్రచారం పూర్తిగా అసత్యం: మంత్రి అచ్చెన్నాయుడు

ఈ-పంట నమోదుపై జగన్, సాక్షి ప్రచారం పూర్తిగా అసత్యమని వ్యవసాయశాఖ మంత్రి కింజరాపు అచ్చెన్నాయుడు పేర్కొన్నారు. జగన్ అబద్ధాలకు బ్రాండ్ అంబాసిడర్ అని, అసత్యాల ప్రచారానికి సాక్షి వేదికగా మారిందని ఆయన విమర్శించారు. రైతులను తప్పుదోవ పట్టించే ఇలాంటి కుట్రలను ప్రజలు తిప్పికొడతారని హెచ్చరించారు. రబీ 2025-26 సీజన్‌కు సంబంధించి రాష్ట్రంలో ఇప్పటికే 99.7 శాతం ఈ-పంట నమోదు పూర్తయిందని మంత్రి అచ్చెన్నాయుడు స్పష్టం చేశారు. రైతులకు ప్రభుత్వ సబ్సిడీలు, పంట బీమా వేగంగా పారదర్శకంగా అందించేందుకే డిజిటల్ క్రాప్ సర్వేను నిర్వహిస్తున్నామని వివరించారు. ఆంధ్రప్రదేశ్ చేపట్టిన ఈ డిజిటల్ క్రాప్ సర్వే దేశంలోనే ఆదర్శంగా నిలిచిందని ఆయన కొనియాడారు

5:30 PM, 3 Jul 2026 (IST)

దొంగనోట్ల చలామణి కేసులో మరో ఇద్దరు అరెస్ట్

ఎన్టీఆర్ జిల్లాలో దొంగనోట్ల చలామణి కేసులో మరో ఇద్దరిని ఇబ్రహీంపట్నం పోలీసులు అరెస్ట్ చేశారు. నిందితులు రాజా, పొదిలి భాస్కర్ నుంచి నకిలీ రూ.500, రూ.100 నోట్ల తయారీకి ఉపయోగించే పరికరాలను పోలీసులు స్వాధీనం చేసుకున్నారు.

5:25 PM, 3 Jul 2026 (IST)

రాయలసీమ ప్రాంతం ఒక మేజర్ ఇండస్ట్రియల్ హబ్‌గా మారబోతోంది: లోకేశ్‌

రాయలసీమ స్టీల్ ప్లాంట్ పనుల ప్రారంభంతో మరో చారిత్రాత్మక అడుగు వేశామని మంత్రి నారా లోకేశ్ అన్నారు. తాము ఇచ్చిన మాట ప్రకారం క్షేత్రస్థాయిలో పనులు వేగవంతం చేశామని లోకేశ్‌ వెల్లడించారు. స్లీల్‌ ప్లాంట్‌ ద్వారా వేలాది మంది యువతకు ఉపాధి అవకాశాలు లభిస్తాయని, రాబోయే రోజుల్లో రాయలసీమ ప్రాంతం ఒక మేజర్ ఇండస్ట్రియల్ హబ్‌గా మారబోతోంది మంత్రి లోకేశ్ ఆశాభావం వ్యక్తం చేశారు.

5:19 PM, 3 Jul 2026 (IST)

రాయలసీమను హార్టికల్చర్‌ హబ్‌గా మార్చబోతోంది: సీఎం చంద్రబాబు

ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు మీరు పెట్టే పెట్టుబడికి తానే హామీ ఇస్తున్నానని ప్రకటించారు. ప్రస్తుతం వ్యవసాయం పూర్తిగా మారిపోతోందని, రాయలసీమకు పెద్దఎత్తున పరిశ్రమలు వస్తున్నాయని పేర్కొన్నారు. కేవలం రాయలసీమ ప్రాంతానికే రూ.4.50 లక్షల కోట్ల పెట్టుబడులు వచ్చాయని సీఎం చంద్రబాబు వెల్లడించారు. ప్రజల జీవన ప్రమాణాలు పెంచే విధంగా ప్రభుత్వం కృషి చేస్తోందని, లింగాల మండలంలో హార్టికల్చర్‌ ద్వారా తలసరి ఆదాయం రూ.7.30 లక్షలకు చేరిందని చంద్రబాబు వివరించారు. భవిష్యత్తులో రాయలసీమను హార్టికల్చర్‌ హబ్‌గా మార్చబోతున్నామని స్పష్టం చేశారు. అలాగే యువత ఉద్యోగాలు ఇచ్చే స్థితికి ఎదగాలని ఆయన పిలుపునిచ్చారు.

5:15 PM, 3 Jul 2026 (IST)

దేశంలో గ్రీన్ఎనర్జీ ద్వారా నిర్మితమయ్యే తొలి ఉక్కు కర్మాగారం ఇదే: మంత్రి గొట్టిపాటి రవికుమార్

సీఎంతో కడపలో స్టీల్ ప్లాంట్ పనులు ప్రారంభం కావడం శుభపరిణామని మంత్రి గొట్టిపాటి రవికుమార్ హర్షం వ్యక్తం చేశారు. దేశంలో గ్రీన్ఎనర్జీ ద్వారా నిర్మితమయ్యే తొలి ఉక్కు కర్మాగారం ఇదేనన్నారు. 400 మెగావాట్ల సామర్థ్యంతో రూ.2వేల కోట్లతో నిర్మాణం చేపట్టమన్నారు. చంద్రబాబుపై నమ్మకంతోనే పారిశ్రామికవేత్తలు పెట్టుబడులకు ముందుకు వస్తున్నారని తెలిపారు. యువతకు ఉద్యోగ, ఉపాధి అవకాశాలే లక్ష్యంగా ప్రభుత్వం పనిచేస్తుందని పేర్కొన్నారు.

5:12 PM, 3 Jul 2026 (IST)

ప్రస్తుతం మావిగన్ ప్రతిపాదనపై జగన్‌ వైఖరిలో స్థిరత్వం లేదు: సంధ్యారాణి

అమరావతిపై జగన్ మరోసారి రాజకీయ గందరగోళం సృష్టిస్తున్నారని మంత్రి సంధ్యారాణి అన్నారు. ప్రస్తుతం మావిగన్ ప్రతిపాదనపై జగన్‌ వైఖరిలో స్థిరత్వం లేదన్నారు. రాష్ట్రానికి శాశ్వత అభివృద్ధే కూటమి ప్రభుత్వ లక్ష్యమని వెల్లడించారు. మూడు రాజధానుల ప్రతిపాదనను ప్రజలు గత ఎన్నికల్లోనే తిరస్కరించారని మంత్రి పేర్కొన్నారు.

5:07 PM, 3 Jul 2026 (IST)

రూ.200 కోట్లతో నిర్మించిన ఏబీఐఎస్ ప్రోటీన్స్ పరిశ్రమను ప్రారంభించిన సీఎం

చిత్తూరు జిల్లా గుడుపల్లె మండలం పొగురుపల్లె గ్రామానికి సీఎం చంద్రబాబు చేరుకున్నారు. రూ.200 కోట్లతో నిర్మించిన ఏబీఐఎస్ ప్రోటీన్స్ పరిశ్రమను సీఎం ప్రారంభించారు. యూనిట్ పనితీరును సీఎం చంద్రబాబుకు కంపెనీకి ప్రతినిధులు వివరించారు. 30.75 ఎకరాల్లో అత్యాధునిక గ్రీన్‌ఫీల్డ్ చికెన్ ప్రాసెసింగ్ పరిశ్రమ ఏర్పాటు చేయనున్నారు. ఏబీఐఎస్ పరిశ్రమ ద్వారా 1,400 మందికి ప్రత్యక్ష, పరోక్షంగా ఉపాధి కల్పించనున్నారు. ప్రారంభ దశలోనే 400 మందికి ఉద్యోగ నియామక పత్రాలు అందజేశారు. చికెన్ ప్రాసెసింగ్ పరిశ్రమ ఏర్పాటుతో స్థానిక కోళ్ల పెంపకందారులకు లబ్ధి చేకూరనుంది.

5:04 PM, 3 Jul 2026 (IST)

కేంద్రమంత్రి సర్బానందా సోనోవాల్‌తో మంత్రి బీసీ జనార్ధన్‌రెడ్డి భేటీ

దిల్లీలో కేంద్రమంత్రి సర్బానందా సోనోవాల్‌తో మంత్రి బీసీ జనార్ధన్‌రెడ్డి భేటీ అయ్యారు. ఏపీలో తీర ప్రాంత మౌలిక సదుపాయాల బలోపేతంపై చర్చించారు. పోర్టు ఆధారిత అభివృద్ధికి చేపట్టాల్సిన చర్యలపై విస్తృత చర్చలు జరిపారు. పోర్టుల అభివృద్ధికి ఉప్పు భూముల కేటాయింపులో కేంద్ర సహకారాన్ని మంత్రి కోరారు. సాగర్‌మాల పథకం ద్వారా గంగవరం పోర్టు, అనకాపల్లిలో ఏఎంఎన్‌ఎస్ పోర్టులకు అనుసంధాన రహదారులు మంజూరు చేయాలని విజ్ఞప్తి చేశారు. సాగర్‌మాల 2.0 కింద ఫిషింగ్ హార్బర్ ప్రాజెక్టులకు ఆర్థిక సహాయం కోరారు. అలాగే దుగ్గరాజపట్నం మెగా షిప్ బిల్డింగ్ క్లస్టర్‌కు కేంద్ర సహకారాన్ని మంత్రి బీసీ జనార్ధన్‌రెడ్డి కోరారు. ఈ సమావేశంలో కేంద్రమంత్రి రామ్మోహన్‌నాయుడు పాల్గొన్నారు.

4:39 PM, 3 Jul 2026 (IST)

మూలపేట జడ్పీ హైస్కూలు సిబ్బందిని అభినందించిన పవన్‌

కాకినాడ జిల్లాలో పది, ఇంటర్‌లో అత్యుత్తమ ఫలితాలను మూలపేట స్కూల్ విద్యార్థులు సాధించారు. ఈ నేపథ్యంలో మూలపేట జడ్పీ హైస్కూలు సిబ్బందిని డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ అభినందించారు. స్కూలులో నో అడ్మిషన్ బోర్డులు పెట్టే స్థాయికి ఎదగటంపై పవన్‌కల్యాణ్‌ సంతోషం వ్యక్తం చేశారు.

4:33 PM, 3 Jul 2026 (IST)

సజ్జల వ్యాఖ్యలపై ఆగ్రహం వ్యక్తం చేసిన మంత్రి కొలుసు పార్థసారథి

వైఎస్సార్సీపీ నాయకుడు సజ్జల రామకృష్ణారెడ్డి రాజధాని అమరావతిపై అవాకులు, చెవాకులు పేలడం పూర్తిగా హాస్యాస్పదమని మంత్రి కొలుసు పార్థసారథి మండిపడ్డారు. రాష్ట్రాన్ని నిలబెట్టిన ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు మీ దృష్టిలో విలన్‌గాను, గత ప్రభుత్వంలో జేసీబీలతో వ్యవస్థలను కూల్చేసిన వారు హీరోలుగాను కనిపించడంపై ఆయన తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. అసలు చంద్రబాబు విలన్ ఎలా అయ్యారో సజ్జల ప్రజలకు సమాధానం చెప్పాలని ఆయన డిమాండ్ చేశారు.

అమరావతిని పీకేస్తామనడం కాదని, అక్కడ కనీసం చిన్న మొక్కను కూడా ఎవరూ పీకలేరని మంత్రి స్పష్టం చేశారు. వైఎస్సార్సీపీ నేతలు చెప్పే 'మావిగన్' ప్రణాళికలో గుంటూరు ఉందని, అమరావతి కూడా గుంటూరు పరిధిలోనే ఉందనే విషయాన్ని వారు మరిచిపోయారని ఎద్దేవా చేశారు. అమరావతిపై వైఎస్సార్సీపీ పూటకో మాట మారుస్తూ, నిమిషానికొక విష ప్రచారం చేస్తోందని ధ్వజమెత్తారు. ఎవరు ఎన్ని కుట్రలు, కుతంత్రాలు పన్నినా రాష్ట్రమంతా అమరావతితోనే ఉంటుందని అమరావతి అజేయమని, నిత్యశాశ్వతమని మంత్రి పార్థసారథి స్పష్టం చేశారు.

4:30 PM, 3 Jul 2026 (IST)

డిప్యూటీ సీఎం పవన్‌ను కలిసిన ఈగల్ విభాగం చీఫ్‌, సైబర్‌ క్రైమ్ ఐజీ రవికృష్ణ

మంగళగిరిలో డిప్యూటీ సీఎం పవన్‌ను ఈగల్ విభాగం చీఫ్‌, సైబర్‌ క్రైమ్ ఐజీ రవికృష్ణ కలిశారు. ఈగల్ విభాగానికి సంబంధించిన వార్షిక నివేదికను రవికృష్ణ పవన్‌కు అందించారు. గంజాయి, డ్రగ్స్ నివారణకు ఈగల్ విభాగం తీసుకున్న చర్యలపై నివేదిక తయారుచేసింది. అసభ్యకర పోస్టులు పెట్టే వారిపై తీసుకుంటున్న చర్యలను రవికృష్ణ వివరించారు.

4:23 PM, 3 Jul 2026 (IST)

పర్యాటక అభివృద్ధికి రుషికొండ ప్యాలెస్‌ వినియోగిస్తాం: మంత్రి కందుల దుర్గేష్‌

జనసేనను బలహీనపరిస్తే కూటమిని దెబ్బకొట్టవచ్చనేది వైఎస్సార్సీపీ వ్యూహమని మంత్రి కందుల దుర్గేష్‌ పేర్కొన్నారు. ప్రభుత్వాన్ని విమర్శించే హక్కు ఉన్నా, వ్యక్తిత్వ హనన పద్ధతి కాదని హితవు పలికారు. సోషల్ మీడియాలో హద్దుమీరి మాట్లాడితే చట్టప్రకారం కఠిన చర్యలు తప్పవని హెచ్చరించారు. రుషికొండ ప్యాలెస్‌ను ఆతిథ్య రంగానికి వినియోగించాలని ప్రభుత్వం భావిస్తోందని మంత్రి వెల్లడించారు. ప్యాలెస్ వినియోగంపై కేబినెట్ సబ్‌కమిటీ ఇప్పటికే ప్రభుత్వానికి నివేదిక అందించిందని ఆయన స్పష్టం చేశారు.

4:03 PM, 3 Jul 2026 (IST)

మూడు రోజుల పర్యటనలో భాగంగా కుప్పం చేరుకున్న సీఎం చంద్రబాబు

మూడు రోజుల పర్యటనలో భాగంగా సీఎం చంద్రబాబు కుప్పం చేరుకున్నారు. పలు అభివృద్ధి, సంక్షేమ కార్యక్రమాల్లో చంద్రబాబు పాల్గొననున్నారు. రూ.9,322 కోట్లతో పలు పరిశ్రమల ప్రారంభోత్సవాలు, శంకుస్థాపనలు, ఎంవోయూలు కుదుర్చుకున్నారు. కుప్పంలో అడిడాస్ ఫుట్‌వేర్ తయారీ యూనిట్ ఏర్పాటు కానుంది. కుప్పంలో రూ. 899 కోట్లతో హస్యూంగ్ గ్రూప్ యూనిట్​ను ఏర్పాటు చేయనున్నారు.

3:53 PM, 3 Jul 2026 (IST)

సీఐ నాగరాజు సిట్ విచారణలో కీలక పరిణామం

సీఐ నాగరాజు సిట్ విచారణలో కీలక పరిణామం చోటుచేసుకుంది. సిట్ అధికారులు హైకోర్టులో లంచ్ మోషన్ పిటిషన్ దాఖలు చేశారు. నాగరాజు విచారణలో విజయవాడ కోర్టు విధించిన నిబంధనల్లో మార్పు కోరుతూ సిట్​ పిటిషన్ వేసింది. రాజమండ్రి సెంట్రల్ జైలులో నాగరాజు సిట్ విచారణ ఇవాళ ప్రారంభం కావాల్సింది.

3:52 PM, 3 Jul 2026 (IST)

కాకినాడ జిల్లాలో ఉప్పుటేరు కాలువలో గుర్తుతెలియని మృతదేహం లభ్యం

కాకినాడ జిల్లా ఇంద్రపాలెం ఉప్పుటేరు కాలువలో గుర్తుతెలియని మృతదేహం లభ్యమైంది. కాలువలో మృతదేహం చూసి స్థానికులు పోలీసులకు సమాచారమిచ్చారు.

3:41 PM, 3 Jul 2026 (IST)

ఏసీబీకి చిక్కిన మత్స్యశాఖ అధికారి నెల్లూరు రెడ్డయ్య

చేపల పెంపకం రుణాల మంజూరు కోసం లంచం డిమాండ్ చేసిన మత్స్యశాఖ అధికారి నెల్లూరు రెడ్డయ్య రూ.3 లక్షలు లంచం తీసుకుంటూ అవినీతి నిరోధక శాఖ (ఏసీబీ) అధికారులకు దొరికారు. ఒక రైతుకు చేపల పెంపకం కోసం రూ.50 లక్షల రుణం మంజూరైంది. ఈ రుణానికి సంబంధించి రెడ్డయ్య సదరు రైతు నుంచి రూ.6 లక్షలు లంచం డిమాండ్ చేశారు. ఇందులో భాగంగా తొలి విడతగా రూ.3 లక్షలు లంచం తీసుకుంటుండగా ఏసీబీ అధికారులు రెడ్డయ్యను రెడ్‌హ్యాండెడ్‌గా పట్టుకున్నారు. అనంతరం కడపలోని రెడ్డయ్య నివాసంలో ఏసీబీ అధికారులు ముమ్మరంగా సోదాలు నిర్వహిస్తున్నారు.

3:37 PM, 3 Jul 2026 (IST)

రాజధాని నిర్మాణం రాష్ట్రానికి తలమానికం: మంత్రి రాంప్రసాద్‌రెడ్డి

"రాజధాని నిర్మాణం రాష్ట్రానికి తలమానికం మంత్రి రాంప్రసాద్​రెడ్డి పేర్కొన్నారు. అమరావతి అభివృద్ధితో రాష్ట్రం నలుదిశలా పురోగతి సాధిస్తుందని ఆశాభావం వ్యక్తం చేశారు. గతంలో జగన్ 3 రాజధానుల పేరుతో రాష్ట్రాన్ని అయోమయంలోకి నెట్టారని మంత్రి విమర్శించారు. రాజధానిని రాజకీయాలకు బలి చేయడం ఎంతమాత్రం సరికాదని హితవు పలికారు. రాజధాని నిర్మాణాన్ని అడ్డుకోవడానికి కొందరు చేస్తున్న ప్రయత్నాలను ప్రజలందరూ గమనిస్తున్నారని మంత్రి రాంప్రసాద్‌రెడ్డి అన్నారు.

3:34 PM, 3 Jul 2026 (IST)

మదనపల్లె కిడ్నీ రాకెట్ వ్యవహారం - నలుగురు అరెస్టు

మదనపల్లె గ్లోబల్ ఆస్పత్రి కిడ్నీ రాకెట్ వ్యవహారంలో పోలీసుల దర్యాప్తును ముమ్మరం చేశారు. ఈ కేసులో తాజాగా మరో నలుగురు నిందితులను పోలీసులు అరెస్టు చేశారు. ఈ వ్యవహారంలో పోలీసులు మొత్తం 22 మందిపై కేసులు నమోదు చేశారు. ఈ కేసు దర్యాప్తులో భాగంగా పోలీసులు ఇప్పటికే 15 మందిని అరెస్టు చేశారు. తాజాగా నలుగురిని అరెస్టు చేయడంతో ఈ కేసులో ఇప్పటివరకు అరెస్టయిన వారి సంఖ్య 19కి చేరింది.

3:31 PM, 3 Jul 2026 (IST)

లోక్‌భవన్‌లో గవర్నర్‌ను కలవనున్న డిప్యూటీ సీఎం పవన్

లోక్‌భవన్‌లో గవర్నర్ అబ్దుల్ నజీర్​ను ఉపముఖ్యమంత్రి పవన్ కల్యాణ్ కలవనున్నారు. సాయంత్రం 4 గంటలకు గవర్నర్​తో పవన్ కల్యాణ్ భేటీకానున్నారు.

2:48 PM, 3 Jul 2026 (IST)

జేఎస్‌డబ్ల్యూ రాయలసీమ ఉక్కు కర్మాగార పనులు ప్రారంభించిన సీఎం

రాయలసీమకు స్వర్ణయుగం ప్రారంభమైందని ముఖ్యమంత్రి చంద్రబాబు అన్నారు. కడప జిల్లా జమ్మలమడుగు మండలం సున్నపురాళ్లపల్లెలో రూ.16,350 కోట్ల భారీ వ్యయంతో నిర్మించనున్న ప్రతిష్ఠాత్మక జేఎస్‌డబ్ల్యూ రాయలసీమ ఉక్కు కర్మాగార పనులను చంద్రబాబు ప్రారంభించారు. ఆ తర్వాత విజయనగరం జిల్లాలోని జిందాల్‌ పారిశ్రామిక పార్కును వర్చువల్‌గా ప్రారంభించారు. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన సభలో సీఎం మాట్లాడారు.

2:46 PM, 3 Jul 2026 (IST)

వేదాద్రి-కంచల ఎత్తిపోతల పథకం మరమ్మతు పనులకు మంత్రి నిమ్మల శంకుస్థాపన

ఎన్టీఆర్ జిల్లా జగ్గయ్యపేట మండలం వేదాద్రి వద్ద కృష్ణా నదిపై మరమ్మతులు చేపట్టారు. వేదాద్రి-కంచల ఎత్తిపోతలకు మంత్రి నిమ్మల మరమ్మతు పనులకు శంకుస్థాపన చేశారు.

2:43 PM, 3 Jul 2026 (IST)

ప్రశాంతి ఎక్స్‌ప్రెస్‌ రైలులో దొంగల బీభత్సం

ప్రశాంతి ఎక్స్‌ప్రెస్‌ రైలులో దొంగల బీభత్సం సృష్టించారు. అనకాపల్లి సమీపంలో నిన్న ఉదయం రైలులో ఆరుగురు దొంగలు చొరబడి కత్తులతో బెదిరింపులకు పాల్పడ్డారు. ఈ ఘటన ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. సుమారు రూ.38 వేలు, 3 సెల్‌ఫోన్లు అపహరణకు గురైనట్లు ఫిర్యాదులో పేర్కొన్నారు. రైల్వే పోలీసులు విశాఖలో బాధితుల ఫిర్యాదు, దర్యాప్తు చేపట్టారు.

2:39 PM, 3 Jul 2026 (IST)

ఒకప్పుడు రాయలసీమ నుంచి వలసలు వెళ్లేవారు, కూటమి ప్రభుత్వ హయాంలో ఇక్కడ అభివృద్ధి పరిగెడుతోంది: శ్రీనివాసవర్మ

ఒకప్పుడు రాయలసీమ నుంచి వలసలు వెళ్లేవారని కేంద్రమంత్రి శ్రీనివాసవర్మ అన్నారు. ఇప్పుడు కూటమి ప్రభుత్వ హయాంలో రాయలసీమలో అభివృద్ధి పరిగెడుతోందని హర్షం వ్యక్తం చేశారు. చంద్రబాబు విజన్‌, లోకేశ్‌ ఆలోచనలు, పవన్‌ నేతృత్వంలో అభివృద్ధి సాధ్యమయ్యిందని ఆయన అన్నారు. అతిపెద్ద పారిశ్రామిక హబ్‌గా రాయలసీమ మారబోతోందని, అభివృద్ధి నినాదాలు కాదు నిర్మాణ పనులు ప్రారంభమవుతున్నాయని శ్రీనివాసవర్మ స్పష్టం చేశారు. గత పాలకులు రాయలసీమ అభివృద్ధిని పట్టించుకోలేదని వైఎస్‌ కుటుంబానికి రాయలసీమ అభివృద్ధి అంటే ఇష్టం ఉండదని శ్రీనివాసవర్మ పేర్కొన్నారు. దిగ్గజ సంస్థ జేఎస్‌డబ్ల్యూ కడప జిల్లాలో స్టీల్‌ప్లాంట్ నెలకొల్పడం అదృష్టమని ఆయన అన్నారు. రాయలసీమలో దిగ్గజ సంస్థలు పెట్టుబడులకు ముందుకొస్తున్నాయని శ్రీనివాసవర్మ వివరించారు.

2:38 PM, 3 Jul 2026 (IST)

బాపట్ల సమీపంలో అప్పికట్ల వద్ద రైలు దోపిడీ కేసులో కీలక నిందితుడు అరెస్టు

బాపట్ల సమీపంలో అప్పికట్ల వద్ద రైలు దోపిడీ కేసులో కీలక నిందితుడు భవారియా గ్యాంగ్‌కు చెందిన ముకేష్‌ను రైల్వే పోలీసులు అరెస్టు చేశారు. సర్కార్ ఎక్స్‌ప్రెస్ కేసులో ఇప్పటికే ఇద్దరిని అరెస్ట్ చేసి రిమాండ్‌కు పంపినట్లు పోలీసులు వివరించారు.

2:36 PM, 3 Jul 2026 (IST)

యానాం సీపేజ్ ట్రీట్‌మెంట్‌ ప్లాంట్ నిర్మాణంపై వివాదం

యానాం సీపేజ్ ట్రీట్‌మెంట్‌ ప్లాంట్ నిర్మాణంపై వివాదం జరిగింది. తాళ్లరేవు మం. తూర్పుపేట వద్ద ప్లాంట్ నిర్మాణాన్ని గ్రామస్థులు అడ్డుకున్నారు. ప్లాంట్ వల్ల కాలుష్యం, ఆరోగ్య సమస్యలు వస్తాయని గ్రామస్థులు ఆందోళన వ్యక్తం చేశారు. ఆర్డీవో మల్లిబాబు రెవెన్యూ, ఇరిగేషన్ అధికారులతో కలిసి పరిశీలించించారు. ఉన్నతాధికారుల ఆదేశాల మేరకు తదుపరి నిర్ణయం ఉంటుందని ఆర్డీవో వివరించారు.

2:32 PM, 3 Jul 2026 (IST)

ఎన్డీఏ ప్రభుత్వం రైతులకు అధిక ప్రాధాన్యత ఇస్తోంది: అనిత

విజయనగరం ఇండస్ట్రియల్‌ పార్కుల నిర్మాణానికి ప్రభుత్వం కీలక అడుగు వేసింది. శృంగవరపుకోట మండల పరిధిలో కడప జిల్లా జమ్ములమడుగు నుంచి సీఎం వర్చువల్‌గా భూమిపూజ చేశారు. కార్యక్రమంలో మంత్రులు అనిత, కొండపల్లి శ్రీనివాస్‌, ఎంపీ శ్రీభరత్ ఎమ్మెల్యే లలిత కుమారి, ఎమ్మెల్సీలు రఘురామరాజు, శ్రీనివాస్ పాల్గొన్నారు. రైతులు భూములను త్యాగం చేశారని హోంమంత్రి అనిత అన్నారు. రాష్ట్రం అభివృద్ధి చెందాలంటే పరిశ్రమలు, పెట్టుబడులు రావాలని, రైతులకు భూమికి ఉన్న సంబంధం- తల్లీబిడ్డకు ఉన్న సంబంధం లాంటిదని అనిత అన్నారు.

ఎన్డీఏ ప్రభుత్వం రైతులకు అధిక ప్రాధాన్యత ఇస్తోందన్నారు. మొదటి దశలో 535 ఎకరాల్లో ఎంఎస్‌ఎంఈ పార్కు వస్తుందని సుమారు 45 వేలమందికి ఉద్యోగ, ఉపాధి అవకాశాలు రానున్నాయని తెలిపారు. ఇప్పుడు భోగాపురం ఎయిర్‌పోర్ట్ ప్రారంభానికి సిద్ధంగా ఉందని, పరిశ్రమల రాకతో పరిసర ప్రాంతాలు అభివృద్ధి చెందుతాయని, పరిశ్రమలకు ప్రభుత్వం అన్ని విధాలుగా ప్రోత్సాహం ఇస్తోందని అనిత వివరించారు.

1:01 PM, 3 Jul 2026 (IST)

రాయలసీమ స్టీల్‌ప్లాంట్ పనులకు శ్రీకారం చుట్టిన సీఎం చంద్రబాబు

ముఖ్యమంత్రి చంద్రబాబు చేతుల మీదుగా రాయలసీమ ఉక్కు పరిశ్రమ పనులు ప్రారంభమయ్యాయి. 2 మిలియన్ టన్నుల వార్షిక ఉత్పత్తి సామర్థ్యంతో నిర్మిస్తున్న స్టీల్ ప్లాంట్‌ రెండు దశల్లో పూర్తిచేయాలని లక్ష్యంగా పెట్టుకున్నారు. మొదటి దశలో 4వేల 500 కోట్లతో ఒక మిలియన్ టన్నుల సామర్థ్యంతో యూనిట్ నిర్మిస్తారు. రెండేళ్లలో అందుబాటులోకి వచ్చే తొలిదశ ద్వారా వెయ్యి మందికి ఉపాధి లభిస్తుంది. రెండో దశలో 11వేల 850 కోట్ల పెట్టుబడితో మరో మిలియన్ టన్నుల సామర్థ్యానికి ప్లాంటును విస్తరిస్తారు. అప్పుడు మరో 15వందల మందికి ఉద్యోగాలు వస్తాయి. వేలాది మందికి పరోక్ష ఉపాధి అవకాశాలు లభించనున్నాయి.

12:58 PM, 3 Jul 2026 (IST)

వినుకొండ ప్రజాదర్బార్‌లో పాల్గొన్న ప్రభుత్వ చీఫ్ విప్ జీవీ ఆంజనేయులు

వినుకొండ ప్రజాదర్బార్‌లో పాల్గొన్న ప్రభుత్వ చీఫ్ విప్ జీవీ ఆంజనేయులు ప్రజల నుంచి నేరుగా వినతులు స్వీకరించారు. అర్హులందరికీ న్యాయం జరిగేలా చర్యలు తీసుకుంటామన్నారు. మౌలిక సదుపాయాల సమస్యల పరిష్కారానికి ప్రత్యేక దృష్టి పెడ్తామని వివరించారు. సంబంధిత శాఖల అధికారులతో మాట్లాడి త్వరితగతిన పరిష్కారిస్తామని ప్రజల చెంతకు పాలనను తీసుకెళ్లడమే ప్రభుత్వ లక్ష్యమని పేర్కొన్నారు.

12:17 PM, 3 Jul 2026 (IST)

ప్రశ్నరావన్‌ని అదుపులోకి తీసుకున్న గుడివాడ రూరల్ పోలీసులు

కాకినాడ: మరో కేసులో యుట్యూబర్ ప్రశ్న రావణ్‌ను గుడివాడ రూరల్ పోలీసులు అరెస్ట్​ చేశారు. అక్కడ నుంచి మచిలీపట్నం తరలిస్తున్నారు. కాకినాడ మొబైల్ కోర్టు జడ్జి ఉషా లక్ష్మికుమారి యూట్యూబర్ ప్రశ్న రావణ్‌కు బెయిల్ మంజూరు చేశారు.

12:16 PM, 3 Jul 2026 (IST)

ట్రాక్టర్‌ కింద పడి పదో తరగతి విద్యార్థి అజయ్‌ మృతి

అనంతపురం: విడపనకల్లు మండలం పాల్తూరులో ట్రాక్టర్‌ కింద పడి పదో తరగతి విద్యార్థి అజయ్‌ మృతి చెందాడు.

12:12 PM, 3 Jul 2026 (IST)

సాయికృష్ణ మృతి కేసులో నాగరాజుకు పోలీస్‌ కస్టడీ

సాయికృష్ణ మృతి కేసులో నాగరాజును 8 రోజుల పాటు పోలీస్‌ కస్టడీకి అప్పగిస్తూ కోర్టు ఉత్తర్వులు జారీ చేసింది. నాగరాజును ఈనెల 10 వరకు రాజమహేంద్రవరం జైలులో విచారించాలని కోరింది. ఉదయం 10 నుంచి సాయంత్రం 5 వరకు న్యాయవాది సమక్షంలో ఆడియో, వీడియో రికార్డుతో విచారణ జరపాలని కోర్టు సూచించింది. విచారణ అనంతరం రికార్డులను కోర్టుకు సమర్పించాలని కోరింది. సాయికృష్ణ మృతి కేసులో నాగరాజు జ్యుడీషియల్‌ రిమాండ్‌లో ఉన్న సంగతి తెలిసిందే.

11:02 AM, 3 Jul 2026 (IST)

టీటీడీ ఛైర్మన్ బి.ఆర్.నాయుడు‌ను మర్యాదపూర్వకంగా కలిసిన కేంద్రమంత్రి ప్రహ్లాద్ జోషి

కేంద్రమంత్రి ప్రహ్లాద్ జోషి టీటీడీ ఛైర్మన్ బి.ఆర్.నాయుడు‌ను మర్యాదపూర్వకంగా కలిశాపరు. క్యాంపు కార్యాలయానికి సతీసమేతంగా విచ్చేసి బి.ఆర్.నాయుడును కలిసిన ప్రహ్లాద్ జోషి ఆయనతో కలిసి అల్పాహారం స్వీకరించారు.

10:51 AM, 3 Jul 2026 (IST)

తిరుపతి అసెంబ్లీ నియోజకవర్గం టీడీపీ ఇన్‌ఛార్జిగా మన్నెం శ్రీనివాస్ నియామకం

తిరుపతి అసెంబ్లీ నియోజకవర్గ టీడీపీ ఇంఛార్జిగా మన్నెం శ్రీనివాస ప్రసాద్‌ను నియమించారు. అధినేత చంద్రబాబు ఆదేశాలతో శ్రీనివాస ప్రసాద్‌ను ఇంఛార్జిగా నియమిస్తున్నట్లు టీడీపీ రాష్ట్ర అధ్యక్షుడు పల్లా శ్రీనివాసరావు ప్రకటన విడుదల చేశారు. వైఎస్సార్సీపీ మాజీ ఎమ్మెల్యే భూమన కరుణాకర్‌రెడ్డి అరాచకాలను ఎదుర్కొనేందుకు అర్థబలం, రాజకీయ బలగం ఉన్న నేతను ఇంఛార్జిగా నియమించాలని టీడీపీ అధిష్టానం నిర్ణయించింది. అందుకు మన్నెం శ్రీనివాస ప్రసాద్‌ సరైన నేతగా భావించింది. కొంతకాలం క్రితమే ఒక నిర్ణయానికి వచ్చినా నియోజకవర్గ నాయకులను ఒప్పించిన తర్వాత అధికారికంగా ప్రకటించారు.

10:34 AM, 3 Jul 2026 (IST)

కళాశాలలో ఉరేసుకుని ఇంటర్‌ విద్యార్థి అనిల్‌ ఆత్మహత్య

అల్లూరి జిల్లాలో కళాశాలలో ఉరేసుకుని ఇంటర్‌ విద్యార్థి అనిల్‌ ఆత్మహత్యకు పాల్పడ్డాడు. అతడ్ని పెదబయలు మండలం మొయ్యలగుమ్మికి చెందిన విద్యార్థిగా గుర్తింతారు. చింతపల్లిలో గిరిజన గురుకుల జూనియర్‌ కళాశాలలో ఈ ఘటన జరిగింది.

10:32 AM, 3 Jul 2026 (IST)

మరమ్మతులు చేస్తూ విద్యుదాఘాతంతో అసిస్టెంట్‌ లైన్‌మెన్‌ మృతి

అన్నమయ్య జిల్లా సంబేపల్లి మండలం దేవపట్ల వద్ద విషాదం చోటుచేసుకుంది. ఉదయం మరమ్మతులు చేస్తూ విద్యుదాఘాతంతో అసిస్టెంట్‌ లైన్‌మెన్‌ రౌతుకుంట గ్రామానికి చెందిన బత్తిన మనోహర్(28) మృతి చెందాడు. నిర్లక్ష్యంగా వ్యవహరించిన విద్యుత్ అధికారులపై చర్యలు తీసుకోవాలంటూ, మృతుడి కుటుంబానికి న్యాయం చేయాలంటూ రోడ్డుపై బైఠాయించిన గ్రామస్థులు ఆందోళన చేశారు.

8:58 AM, 3 Jul 2026 (IST)

ఆటోను ఢీకొని దుకాణాలు, పాదచారులపైకి దూసుకెళ్లిన ప్రైవేటు బస్సు

నెల్లూరు జిల్లా కోట మండలం చంద్రశేఖరపురం వద్ద బస్సు బీభత్సం నెలకొంది. ఆటోను ఢీకొన్న ప్రైవేటు బస్సు (గాయత్రి రొయ్యల కంపెనీ బస్సు) దుకాణాలు, పాదచారులపైకి దూసుకెళ్లింది. ఈ క్రమంలో ఇద్దరు కేశవరానికి చెందిన శివ(22), వంజివాకకు చెందిన వినోద్(21) మృతి చెందగా ఐదుగురికి గాయాలయ్యాయి.

8:57 AM, 3 Jul 2026 (IST)

మార్కాపురం జిల్లా రోడ్డుప్రమాదంపై మంత్రి గొట్టిపాటి దిగ్భ్రాంతి

మార్కాపురం జిల్లా రోడ్డుప్రమాదంపై మంత్రి గొట్టిపాటి దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. ఒకే కుటుంబానికి చెందిన నలుగురు చనిపోవడం బాధాకరమన్నారు. ఘటనపై అధికారులతో మాట్లాడిన మంత్రి ప్రమాద స్థలాలు గుర్తించి ముందుజాగ్రత్త చర్యలు తీసుకోవాలని ఆదేశించారు. సూచికలు ఏర్పాటు చేసి ప్రమాదాలను అరికట్టే చర్యలు చేపట్టాలన్నారు.

8:54 AM, 3 Jul 2026 (IST)

కేంద్రమంత్రి సర్బానంద సోనోవాల్‌తో జనార్దన్‌రెడ్డి భేటీ - దుగరాజపట్నం మెగా షిఫ్ బిల్డింగ్ క్లస్టర్‌పై చర్చ

మంత్రి బీసీ జనార్దన్‌రెడ్డి దిల్లీలో రెండో రోజు పర్యటన కొనసాగుతుంది. నేడు కేంద్రమంత్రి సర్బానంద సోనోవాల్‌తో భేటీలో రాష్ట్రంలో దుగరాజపట్నం మెగా షిఫ్ బిల్డింగ్ క్లస్టర్‌పై చర్చించనున్నారు. పోర్టుల అనుసంధాన రోడ్లు, అంతర్గత జలమార్గాల అభివృద్ధిపై చర్చ జరపనున్నారు.

8:53 AM, 3 Jul 2026 (IST)

మంగళగిరి లక్ష్మీనరసింహస్వామి ఆలయంలో అభివృద్ధి పనులకు శంకుస్థాపన

మంగళగిరి లక్ష్మీనరసింహస్వామి ఆలయంలో అభివృద్ధి పనులకు మంత్రి లోకేశ్​ శంకుస్థాపన చేశారు. ముఖ మండపం, యాగశాల జీర్ణోద్ధరణకు రూ.6 కోట్లతో లక్ష్మీనరసింహస్వామి ఆలయంలో అభివృద్ధి పనులు ప్రారంభించారు. అనంతరం స్వామివారిని దర్శించుకున్నారు.

7:47 AM, 3 Jul 2026 (IST)

తిరుమల శ్రీవారి సర్వదర్శన 12 గంటలు

తిరుమలలో శ్రీవారి సర్వదర్శనానికి టోకెన్లు లేకపోయిన భక్తులు 12 గంటల వరకు వేచి ఉండాల్సి వస్తోంది. సర్వదర్శనానికి సంబంధించిన అన్ని కంపార్టుమెంట్లు భక్తులతో నిండిపోయాయి. నారాయణగిరి షెడ్ల వరకు భక్తులు వేచి ఉన్నారు. నిన్న శ్రీవారిని 66,304 మంది భక్తులు దర్శించుకున్నారు. శ్రీవారి హుండీ ఆదాయం రూ.4.51 కోట్లు నమోదు అయింది. అలాగే 31,811 మంది భక్తులు తలనీలాలు సమర్పించారు.

7:43 AM, 3 Jul 2026 (IST)

మృతుల కుటుంబాలకు ప్రగాఢ సానుభూతి - మంత్రులు

మార్కాపురం ప్రాంతంలో జరిగిన రోడ్డు ప్రమాదం అత్యంత విషాదకరమని మంత్రి మండిపల్లి, మంత్రి డీఎస్‌బీవీ స్వామి పేర్కొన్నారు. వివాహ వేడుకల మధ్య జరిగిన ఈ ప్రమాదం హృదయ విదారకమని పేర్కొంటూ, మృతుల కుటుంబాలకు మంత్రులు తమ ప్రగాఢ సానుభూతిని తెలియజేశారు. అలానే ప్రమాదంలో గాయపడిన వారికి మెరుగైన వైద్యం అందించాలిని అధికారులను ఆదేశించారు.

6:50 AM, 3 Jul 2026 (IST)

కంభంలో ఘోర రోడ్డు ప్రమాదం

వివాహ వేడుకల సందడిలో ఉన్న ఒక కుటుంబానికి ఘోర విషాదం ఎదురైంది. మర్కాపురం జిల్లా, కంభం పట్టణంలోని అమరావతి-అనంతపురం జాతీయ రహదారిపై, ఆలయం సమీపంలో నిలిపి ఉంచిన ఆటో-రిక్షాను అతివేగంతో వచ్చిన లారీ ఢీకొట్టడంతో నాలుగేళ్ల చిన్నారితో సహా నలుగురు మృతి చెందారు. మరో ఏడుగురు గాయపడ్డారు. ఈ ఘటన గురువారం తెల్లవారుజామున 1:15 గంటల ప్రాంతంలో జరిగింది. మృతులంతా ఒకే కుటుంబానికి చెందినవారిగా పోలీసులు గుర్తించారు.

6:48 AM, 3 Jul 2026 (IST)

వైఎస్సార్‌ కడపలో ముఖ్యమంత్రి పర్యటన

నేడు వైఎస్సార్‌ కడప జిల్లా ముఖ్యమంత్రి జమ్మలమడుగులో పర్యటించనున్నారు. ఉదయం సున్నపురాళ్లపల్లి హెలిప్యాడ్‌కు చేరుకొని, జేఎస్‌డబ్ల్యూ రాయలసీమ ప్లాంట్‌ నిర్మాణ పనులకు శంకుస్థాపన చేస్తారు. తరువాత 'కన్యతీర్థం'లో బాలా త్రిపురసుందరి సుందరేశ్వరస్వామిని దర్శించుకుంటారు. ఆ తర్వాత జేఎస్‌డబ్ల్యూ హెవీ సెక్షన్‌ మిల్‌లో కాంక్రీట్‌ ఫ్లోరింగ్ కార్యక్రమంలో పాల్గొననున్నారు.

6:46 AM, 3 Jul 2026 (IST)

యూట్యూబర్ ప్రశ్న రావణ్‌కు బెయిల్

యూట్యూబర్ ప్రశ్న రావణ్‌కు కాకినాడ మొబైల్ కోర్టు జడ్జి ఉషా లక్ష్మికుమా బెయిల్ మంజూరు చేశారు. ఆ తర్వాత కాకినాడలో మరో కేసులో యూట్యూబర్ ప్రశ్న రావణ్‌ను గుడివాడ రూరల్ పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. అనంతరం మచిలీపట్నానికి తరలించారు.

6:42 AM, 3 Jul 2026 (IST)

అల్పపీడనం - 3 రోజులు ఉత్తరాంధ్రలో భారీ వర్షాలు

వాయవ్య బంగాళాఖాతం - ఒడిశా-బెంగాల్ తీరంలో అల్పపీడనం ఏర్పడింది. దీని కారణంగా వచ్చే 3 రోజుల్లో ఉత్తరాంధ్ర రాష్ట్రంలో కొన్ని చోట్ల భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ నిపుణులు తెలుపుతున్నారు. పలుచోట్ల ఉరుములు, మెరుపులతో పిడుగులు పడే అవకాశం కూడా ఉందని హెచ్చరించారు. తీరం వెంబడి గంటకు 40-50 కిలోమీటర్ల వేగంతో ఈదురుగాలులు వీస్తాయని అంచనా వేశారు. మత్స్యకారులు సముద్రంలో వేటకు వెళ్లొద్దని హెచ్చరిక జారీ చేశారు. ఈ రోజు శ్రీకాకుళం, పోలవరం, కోనసీమ, పశ్చిమ గోదావరి, ఏలూరు జిల్లాల్లో వర్షాలు కురిసే అవకాశం ఉందని తెలిపారు. మిగతా జిల్లాల్లో అక్కడక్కడ తేలికపాటి వర్షాలు పడే అవకాశమున్నట్లు అంచనా వేశారు. వర్షాలు - ఈదురుగాలుల కారణంగా ప్రజలు అప్రమత్తంగా ఉండాలని సూచించారు.

Last Updated : July 3, 2026 at 10:51 PM IST