ETV Bharat / state

31-08-2026 Telangana News Today Live Updates : మైదానంలో కొన్ని నిమిషాలు మెస్సీతో గడపడం ఒక గొప్ప అదృష్టం: సీఎం

telangana latest news
తెలంగాణ తాజా వార్తలు (ETV Bharat)
author img

By ETV Bharat Telangana Team

Published : August 31, 2026 at 7:08 AM IST

|

Updated : August 31, 2026 at 11:05 PM IST

Choose ETV Bharat

31-08-2026 Telangana News Today Live Updates : ఈరోజు తాజా ప్రధాన వార్తల సమాచారం

LIVE FEED

11:03 PM, 31 Aug 2026 (IST)

సాకర్‌ దిగ్గజ ప్లేయర్ మెస్సీ వీడ్కోలుపై స్పందించిన సీఎం రేవంత్‌రెడ్డి

సాకర్‌ దిగ్గజ ప్లేయర్ మెస్సీ వీడ్కోలుపై సీఎం రేవంత్‌రెడ్డి స్పందించారు. ఈ సందర్భంగా హైదరాబాద్‌లో మెస్సీతో ఆడిన క్షణాలను గుర్తు చేసుకున్నారు. మైదానంలో కొన్ని నిమిషాలు మెస్సీతో గడపడం ఒక గొప్ప అదృష్టమన్నారు. యావత్ ఫుట్‌బాల్ ప్రపంచాన్ని మెస్సీ ఉర్రూతలూగించారు రేవంత్ రెడ్డి కొనియాడారు. అద్భుతమైన ఆటతో ప్రేక్షకులను అలరించారు, ఉత్తేజపరిచారని రేవంత్ రెడ్డి అన్నారు. మెస్సీ లేకుండా ఫుట్‌బాల్‌ మునుపటిలా ఉండదని భావిస్తున్నట్లు వివరించారు. రిటైర్‌మెంట్‌ తర్వాత కూడా మెస్సీ అందరికీ స్ఫూర్తినిస్తూనే ఉండాలని ఆకాంక్షించారు.

10:55 PM, 31 Aug 2026 (IST)

అంతర్జాతీయ కెరీర్‌కు వీడ్కోలు పలికిన ఫుట్‌బాల్‌ దిగ్గజ ప్లేయర్‌ మెస్సీ

అర్జెంటీనా స్టార్‌ ఫుట్‌బాల్‌ ప్లేయర్‌ లియోనెల్‌ మెస్సి అంతర్జాతీయ కెరీర్‌కు వీడ్కోలు పలికాడు. ఈమేరకు సోషల్‌ మీడియా వేదికగా రిటైర్మెంట్‌ ప్రకటించాడు. ఇటీవల ఫిఫా ప్రపంచకప్‌ ఫైనల్‌లో ఓడిపోయిన సమయంలోనే ఈమేరకు నిర్ణయం తీసుకున్నట్లు వెల్లడించాడు. అర్జెంటీనా తరఫున మెస్సి 207 మ్యాచ్‌లలో 125 గోల్స్‌ చేశాడు. 2022 ఫిఫా ప్రపంచ కప్, రెండు కోపా అమెరికా టైటిళ్ల (2021, 2024)ను అందించాడు. 2026 ఫిఫా ప్రపంచ కప్‌లో అతడి సారథ్యంలో అర్జెంటీనా రన్నరప్‌గా నిలిచింది.

8:22 PM, 31 Aug 2026 (IST)

మహారాష్ట్రలో ఘోర ప్రమాదం, నలుగురు నిర్మల్ జిల్లా వాసులు మృతి

మహారాష్ట్రలో జరిగిన ఘోర ప్రమాదంలో నలుగురు నిర్మల్ జిల్లా వాసులు మృతి చెందారు. మహారాష్ట్రలోని సాసర్ జలపాతం చూసి తిరిగొస్తుండగా ఈ ప్రమాదం జరిగింది. చనిపోయిన వారిని నిర్మల్‌ జిల్లా కుబీర్‌ మండలం పార్డి(బి) గ్రామస్థులుగా గుర్తించారు. ప్రమాదంలో మరికొందరికి తీవ్రగాయాలు కావడంతో ఆస్పత్రికి తరలించారు.

7:31 PM, 31 Aug 2026 (IST)

దిల్లీలో రేపు, ఎల్లుండి కేంద్ర జల్‌శక్తిశాఖ ఆధ్వర్యంలో జాతీయ సదస్సు

దిల్లీలో రేపు, ఎల్లుండి కేంద్ర జల్‌శక్తిశాఖ ఆధ్వర్యంలో జాతీయ సదస్సు జరగనుంది. దేశవ్యాప్తంగా సుస్థిర జలవనరుల నిర్వహణ - కార్యాచరణపై సదస్సులో చర్చిస్తారు. దిల్లీలోని భారత్ మండపంలో రెండు రోజులపాటు ఈ సదస్సు నిర్వహిస్తారు.

7:31 PM, 31 Aug 2026 (IST)

చేయూత పింఛన్ల దరఖాస్తు గడువు సెప్టెంబర్ 15 వరకు పెంచిన ప్రభుత్వం

చేయూత పింఛన్ల దరఖాస్తు గడువును ప్రభుత్వం పొడిగించింది. ఇవాళ్టితో ముగిసిన గడువును సెప్టెంబర్ 15 వరకు పెంచుతూ ఆదేశాలు జారీచేసింది.

6:06 PM, 31 Aug 2026 (IST)

రాష్ట్రాన్ని మూడు విభాగాలుగా విభజించి... అభివృద్ధి చేస్తున్నాం : సీఎం రేవంత్ రెడ్డి

రాష్ట్రాన్ని మూడు విభాగాలుగా విభజించి... అభివృద్ధి చేస్తున్నామని సీఎం రేవంత్ రెడ్డి తెలిపారు. ప్రణాళికబద్ధంగా రాష్ట్రంలో మౌలిక వసతులు అభివృద్ధి చేస్తున్నామని, ప్రపంచంలోని ప్రధాన నగరాలతో హైదరాబాద్‌ పోటీ పడుతుందని ముఖ్యమంత్రి ఆశాాభావం వ్యక్తం చేశారు. అన్ని పరిశ్రమలు హైదరాబాద్‌కు వచ్చినందునే అభివృద్ధి చెందుతోందన్నారు. విద్య, ఉపాధి అవకాశాలకు హైదరాబాద్‌ ఆశ్రయమిచ్చిందని, రాబోయే రోజుల్లో గ్లోబల్ హబ్​గా తన స్థానం సుస్థిరం చేసుకుటుందని రేవంత్ రెడ్డి ప్రకటించారు.

6:05 PM, 31 Aug 2026 (IST)

నల్గొండలోని మంత్రి కోమటిరెడ్డి వెంకట్‌రెడ్డి క్యాంపు కార్యాలయంపై దాడి

నల్గొండలోని మంత్రి కోమటిరెడ్డి వెంకట్‌రెడ్డి క్యాంపు కార్యాలయంపై బీజేపీ కార్యకర్తలు దాడి చేశారు. క్యాంపు కార్యాలయంపై కోడిగుడ్లు, టమాటాలు విసిరారు. ఇవాళ హైదరాబాద్‌లో బీజేపీ కార్యాలయంపై నిరసనగా ప్రతిదాడి చేశారు.

5:30 PM, 31 Aug 2026 (IST)

టీఆర్‌ఎస్‌ సభలో కంటతడి పెట్టుకున్న కవిత

నిజామాబాద్‌లో జరిగిన తెలంగాణ రక్షణ సేన సభలో పార్టీ అధ్యక్షురాలు కవిత కంటతడి పెట్టుకున్నారు. పాంచజన్య సంకల్ప సభలో కవిత భావోద్వేగ ప్రసంగం చేశారు. తాను ఏం తప్పు చేశానని తిహాడ్‌ జైలులో పెట్టారని కవిత వాపోయారు. ఈడీ, సీబీఐ కేసులు పెట్టి నాలుగేళ్లపాటు తనను వేధించారని కవిత కన్నీటి పర్యంతమయ్యారు.

5:29 PM, 31 Aug 2026 (IST)

ట్రైనీ ఐపీఎస్ ఉదయకృష్ణారెడ్డి పిటిషన్‌పై హైకోర్టులో విచారణ

తనకు లింగపటుత్వ పరీక్ష చేయొద్దని ట్రైనీ ఐపీఎస్ ఉదయకృష్ణారెడ్డి వేసిన పిటిషన్‌పై హైకోర్టులో విచారణ జరిగింది. ఉదయ్‌ కృష్ణారెడ్డికి లింగపటుత్వ పరీక్ష చేయాలంటూ గతంలో రాజేంద్రనగర్ కోర్టు ఉత్తర్వులు జారీచేసింది. దీనిపై ఆయన హైకోర్టును ఆశ్రయించారు. తదుపరి విచారణను హైకోర్టు రేపటికి వాయిదా వేసింది.

5:07 PM, 31 Aug 2026 (IST)

అంబర్‌పేట - మూసారాంబాగ్‌ మధ్య హైలెవల్‌ బ్రిడ్జిని ప్రారంభించిన సీఎం రేవంత్ రెడ్డి

అంబర్‌పేట - మూసారాంబాగ్‌ మధ్య మూసీ నదిపై నిర్మించిన హైలెవల్‌ బ్రిడ్జిని సీఎం రేవంత్ రెడ్డి ప్రారంభించారు. ఈ కార్యక్రమంలో ప్రభుత్వ సలహాదారు వీహెచ్, ఎంఐఎం అధినేత అసదుద్దీన్ ఒవైసీ, అంబర్​ పేట ఎమ్మెల్యే కాలేరు వెంకటేష్, ఉన్నతాధికారులు పాల్గొన్నారు. రూ.52 కోట్ల నిధులతో 400 మీటర్ల పొడవుతో ఈ వంతెన నిర్మించారు. పాత వంతెనను కూల్చివేసి మరింత ఎత్తులో కొత్త వంతెన నిర్మాణం జరిగింది. ఈ వంతెన ప్రారంభం కావడంతో చాదర్‌ఘాట్‌ వంతెనపై ట్రాఫిక్ ఇబ్బందులు తగ్గనున్నాయి.

5:04 PM, 31 Aug 2026 (IST)

మణుగూరులో జరిగిన మూకదాడి ఘటనపై కేసులు నమోదు

భద్రాద్రి జిల్లా మణుగూరులో ఈనెల 27న జరిగిన మూకదాడి ఘటనపై పోలీసులు కేసులు నమోదు చేశారు. ఇద్దరిపై సామూహిక దాడి చేసిన 27 మందిని నిందితులుగా చేర్చారు. వీరిలో 23 మంది అరెస్టు చేశారు. మూకదాడిలో శివకుమార్‌ అనే వ్యక్తి మృతి, మరొకరికి గాయాలయ్యాయి.

4:46 PM, 31 Aug 2026 (IST)

కల్యాణలక్ష్మి, షాదీముబారక్ పథకాలపై అప్పీలు దాఖలు చేసిన ప్రభుత్వం

కల్యాణలక్ష్మి, షాదీముబారక్ పథకాలపై ప్రభుత్వం హైకోర్టులో అప్పీలు దాఖలు చేసింది. అప్పీలు పిటిషన్ విచారణ అర్హతపై సీజే ధర్మాసనంలో వాదనలు జరుగుతున్నాయి. ప్రభుత్వం తరఫున ఏజీ సుదర్శన్ రెడ్డి వాదనలు వినిపించారు. నిరుపేద యువతుల పెళ్లి కోసం ప్రభుత్వం సాయం చేస్తోందని, బాల్య వివాహాలను నిర్మూలించేందుకు ఈ పథకం అమలు చేస్తున్నామని వివరించారు. అనంతరం న్యాయమూర్తి విచారణను రేపటికి వాయిదావేశారు.

3:06 PM, 31 Aug 2026 (IST)

అగ్రిస్టాక్ అమలులో రాష్ట్రానికి కేంద్రం నుంచి రూ.175 కోట్ల ప్రోత్సాహకం

అగ్రిస్టాక్ అమలులో రాష్ట్రానికి కేంద్రం నుంచి ప్రోత్సాహకం లభించింది. తొలి మైలురాయి అందుకున్నందుకు రూ.175 కోట్ల ప్రోత్సాహకం అందుకుంది. ఇప్పటికే ఫార్మర్ రిజిస్ట్రీ పూర్తి చేసినందుకు రూ.424 కోట్లు మంజూరయ్యాయి.

2:49 PM, 31 Aug 2026 (IST)

సీఎం రేవంత్‌రెడ్డికి బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు రామచందర్‌రావు బహిరంగ లేఖ

సీఎం రేవంత్‌రెడ్డికి బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు రామచందర్‌రావు బహిరంగ లేఖ రాశారు. ఫీజు రీయింబర్స్‌మెంట్ బకాయిలు వెంటనే విడుదల చేయాలని లేఖలో పేర్కొన్నారు. 8 లక్షల మంది విద్యార్థులు రాసిన లేఖలను సీఎంకు అందిస్తామని వెల్లడించారు. ఈ మేరకు సీఎం అపాయింట్‌మెంట్ కోరుతూ రామచందర్‌రావు లేఖ రాశారు.

2:13 PM, 31 Aug 2026 (IST)

బీజేపీ కార్యాలయం, గాంధీభవన్ ముందు పోటాపోటీ ధర్నాలు

హైదరాబాద్​లో యూత్ కాంగ్రెస్ ఆధ్వర్యంలో బీజేపీ కార్యాలయం ముట్టడి ఉద్రిక్తతకు దారితీసింది. ప్రధాని మోదీ, హోం మంత్రి అమిత్ షాకు వ్యతిరేకంగా నినాదాలు చేస్తూ బీజేపీ కార్యాలయ గేటుకు నల్లరంగు పూశారు. జంతర్‌మంతర్‌, బిహార్‌లో విద్యార్థులపై కాల్పులకు నిరసనగా వారు ఈ ఆందోళన చేపట్టారు. దీనికి పోటీగా బీజేవైఎం కార్యకర్తలు గాంధీభవన్‌కు ముట్టడి చేపట్టారు. దీంతో పోలీసులు బీజేవైఎం కార్యకర్తలను అడ్డుకుని అరెస్టు చేశారు.

2:12 PM, 31 Aug 2026 (IST)

వివాదం లేకుండా రైతుకు భూమిని అప్పగించాలనేదే మా లక్ష్యం : మంత్రి పొంగులేటి

తాము అధికారంలోకి వచ్చాక భూ తగాదాలు అన్నీ పరిష్కరిస్తున్నామని మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి తెలిపారు. ధరణిని బంగాళాఖాతంలో వేశామని, భూ భారతి తెచ్చామని వెల్లడించారు. మహబూబాబాద్ జిల్లా కేసముద్రంలో సబ్‌స్టేషన్‌ ప్రారంభించిన పొంగులేటి శ్రీనివాసరెడ్డి రూ.4.6 కోట్లతో మున్సిపల్ కార్యాలయ భవన నిర్మాణానికి శంకుస్థాపన చేశారు. ఇనుగుర్తి, దంతాలపల్లి, సీరోలులో తహసీల్దార్ కార్యాలయాలకు శంకుస్థాపన చేశారు. ఈ కార్యక్రమంలో సీతక్క, వేం నరేందర్‌ రెడ్డి, బలరామ్‌ నాయక్ తదితరులు పాల్గొన్నారు.

1:13 PM, 31 Aug 2026 (IST)

చంచల్‌గూడ జైలులో ఖైదీ ఆత్మహత్యాయత్నం

చంచల్‌గూడ జైలులో రిమాండ్ ఖైదీగా ఉన్న కండి సాగర్ ఆత్మహత్యాయత్నం చేశాడు. గమనించిన జైలు సిబ్బంది సాగర్‌ను ఉస్మానియా ఆసుపత్రికి తరలించారు. అయితే ఆసుపత్రికి తరలించే మార్గమధ్యంలోనే మృతి చెందినట్లు వైద్యులు వెల్లడించారు.

12:30 PM, 31 Aug 2026 (IST)

మార్కాపురం జిల్లా వెలిగొండకు కృష్ణమ్మ పరుగులు

ఆంధ్రప్రదేశ్​లోని మార్కాపురం జిల్లా వెలిగొండకు కృష్ణమ్మ పరుగులు పెడుతోంది. వెలిగొండ ప్రాజెక్టు తొలిదశను ఏపీ సీఎం చంద్రబాబు జాతికి అంకితం చేశారు. కృష్ణా జలాలకు జల హారతి, ప్రత్యేక పూజలు చేసిన సీఎం, కృష్ణమ్మకు సాష్టాంగ నమస్కారం చేశారు. అనంతరం ప్రాజెక్టు ప్రారంభోత్సవ పైలాన్‌ ఆవిష్కరించిన ఆయన, స్థానిక రైతులతో కలిసి గేట్లు ఎత్తి నీటిని విడుదల చేశారు.

12:09 PM, 31 Aug 2026 (IST)

త్వరలో సీఎం రేవంత్‌రెడ్డి గౌరవెల్లి ప్రాజెక్టును సందర్శిస్తారు: మంత్రి పొన్నం

సిద్దిపేట జిల్లా అక్కన్నపేట మండలంలోని పలు గ్రామాల్లో పల్లె పల్లెకు పొన్నం అన్న - పల్లె పల్లెల్లో ప్రజాపాలన కార్యక్రమంలో భాగంగా మంత్రి పొన్నం ప్రభాకర్​ పర్యటించారు. కట్కూర్ గ్రామంలో ప్రభుత్వ పథకాల అమలు, సమస్యలపై ప్రజలు, రైతులతో మంత్రి ముఖాముఖి సమావేశమయ్యారు. ప్రజల నుంచి వినతులు స్వీకరించిన మంత్రి ఈ సందర్భంగా మాట్లాడారు. ప్రజా సమస్యల పరిష్కారమే ప్రజా పాలన ప్రభుత్వ లక్ష్యమని వెల్లడించారు. త్వరలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గౌరవెళ్లి ప్రాజెక్ట్ సందర్శిస్తారని, గౌరవెల్లి ప్రాజెక్టు కాలువల భూసేకరణకు రూ.250 కోట్లు విడుదల అయ్యాయని తెలిపారు. త్వరలో కాలువల పనులకు టెండర్ ప్రక్రియ, 20 ఏళ్ల తర్వాత రైతులకు పరిహారం ఇస్తున్నామని వివరించారు. కట్కూరు గ్రామాన్ని అన్ని రంగాల్లో అభివృద్ధి చేస్తామన్న మంత్రి, రూ.20 లక్షలతో నూతనంగా నిర్మించిన గ్రామ పంచాయతీ భవనం ప్రారంభించామని, కట్కూరు - కన్నారం రోడ్డు విస్తరణకు ప్రాధాన్యత ఇస్తామని స్పష్టం చేశారు.

12:08 PM, 31 Aug 2026 (IST)

మహబూబాబాద్ జిల్లాలో మంత్రి పొంగులేటి పర్యటన

మహబూబాబాద్ జిల్లాలో మంత్రి పొంగులేటి పర్యటించారు. 780 మందికి భూఆధార్ పాస్ పుస్తకాలు పంపిణీ చేశారు. కేసముద్రంలో ఏర్పాటు చేసిన ఫ్లెక్సీల్లో కొండా సురేఖ పేరు లేకపోవడం గమనార్హం. శంకుస్థాపన ఫలకాలపైనా మంత్రి పేరు ఎక్కడా కనిపించకపోవడం చర్చనీయాంశంగా మారింది.

11:20 AM, 31 Aug 2026 (IST)

సీడ్ గణేశా ప్రతిమలు ఆవిష్కరించిన మెగాస్టార్ చిరంజీవి, మాజీ ఎంపీ సంతోశ్​

ప్రకృతి సంరక్షణ, పచ్చదనం పెంపును ఒక సామాజిక బాధ్యతగా భావించి ఈసారి వినాయక చవితికి అందరూ సీడ్ గణేషుడిని పూజించాలని మెగాస్టార్ చిరంజీవి పిలుపునిచ్చారు. మట్టి వినాయకులను పూజించడం వల్ల పర్యావరణానికి ఎంతో మేలు జరుగుతుందని ఆయన ఆకాంక్షించారు. గ్రీన్ ఇండియా ఛాలెంజ్ రూపొందించిన సీడ్ గణేషా ప్రతిమలను హైదరాబాద్‌లోని తన స్వగృహంలో చిరంజీవి ఆవిష్కరించారు. ఈ కార్యక్రమంలో గ్రీన్ ఇండియా ఛాలెంజ్ రూపకర్త, మాజీ MP జోగినపల్లి సంతోష్ కుమార్ పాల్గొన్నారు. గ్రీన్ ఇండియా ఛాలెంజ్‌ను ఒక మహా యజ్ఞంలా భావించి, ఇప్పటివరకు 20 కోట్ల మొక్కలు నాటేలా లక్షలాది మందిని ప్రోత్సహించిన సంతోష్ కుమార్‌ను చిరంజీవి అభినందించారు.

11:16 AM, 31 Aug 2026 (IST)

నిజామాబాద్ : యూరియా కోసం రైతుల ఆందోళన

నిజామాబాద్: యూరియా కోసం రైతులు ఆందోళన బాట పట్టారు. ఇందల్​వాయి సొసైటీలో ఆన్‌లైన్‌లో ఉంచిన 2 నిమిషాలకే 900 బస్తాలు ఖాళీ అయ్యాయని, అందరికీ సరిపడా యూరియా అందించాలని డిమాండ్ చేశారు. యాప్‌ను వ్యతిరేకిస్తూ సొసైటీ ఎదుట రైతులు ధర్నాకు దిగారు.

10:36 AM, 31 Aug 2026 (IST)

హైదరాబాద్‌: హైదర్‌షా కోట్ డివిజన్‌లో అగ్నిప్రమాదం

హైదరాబాద్‌ : హైదర్‌షా కోట్ డివిజన్‌లో అగ్నిప్రమాదం చోటుచేసుకుంది. రాజేంద్రనగర్ సర్కిల్‌ పరిధిలోని హైదర్‌షాకోట్‌ డివిజన్ సాయిరాం నగర్‌ కాలనీలో అర్ధరాత్రి ప్రమాదం సంభవించింది. ఇంట్లో పార్క్ చేసి ఉంచిన 5 బైక్‌లలో ఒక్కసారిగా మంటలు చెలరేగాయి. క్రమంగా మంటలు విస్తరించడంతో ఐదు ద్విచక్ర వాహనాలు పూర్తిగా దగ్ధమయ్యాయి. బైక్‌లలో పెట్రోల్ ఉండటంతో మంటలు భారీగా ఎగిసిపడ్డాయి. దట్టమైన పొగలు అలుముకోవడంతో స్థానికులు భయాందోళనకు గురయ్యారు. మంటల నుంచి తప్పించుకుని సురక్షితంగా బయటకు వచ్చారు.

9:04 AM, 31 Aug 2026 (IST)

గద్వాల: అలంపూర్ జోగులాంబను దర్శించుకున్న కేంద్రమంత్రి కిషన్‌రెడ్డి

గద్వాల : అలంపూర్ జోగులాంబను కేంద్రమంత్రి కిషన్‌ రెడ్డి దర్శించుకున్నారు. ఎంపీలు డీకే అరుణ, మల్లు రవి సైతం జోగులాంబ అమ్మవారిని దర్శించుకున్నారు.

8:37 AM, 31 Aug 2026 (IST)

హుస్నాబాద్ మండలం ఉమ్మాపూర్‌లో మంత్రి పొన్నం పర్యటన

హుస్నాబాద్ మండలం ఉమ్మాపూర్‌లో మంత్రి పొన్నం ప్రభాకర్​ పర్యటించారు. ఇందులో భాగంగా రూ.7.28 కోట్ల అంచనా వ్యయంతో నిర్మించనున్న శాతవాహన యూనివర్సిటీ ఇంజనీరింగ్ కళాశాల బాలికలు, బాలుర నూతన హాస్టల్ భవనాలకు మంత్రి శంకుస్థాపన చేశారు.

7:00 AM, 31 Aug 2026 (IST)

1000 రోజుల పాలనపై సీఎం రేవంత్‌రెడ్డి సర్కార్‌ ప్రగతి నివేదిక

రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చి రేపటితో వెయ్యిరోజులు పూర్తిచేసుకోనుంది. ఈ నేపథ్యంలో సీఎం రేవంత్‌రెడ్డి సర్కార్‌ ప్రగతి నివేదిక విడుదల చేసింది. కాంగ్రెస్ పాలనలో సంక్షేమం, అభివృద్ధికి సమప్రాధాన్యమిచ్చినట్లు సర్కార్‌ తెలిపింది. 2034 నాటికి రాష్ట్రాన్ని ట్రిలియన్‌ డాలర్ల ఆర్థికవ్యవస్థగా, 2047 నాటికి 3 ట్రిలియన్‌ డాలర్ల ఆర్థికవ్యవస్థగా తీర్చిదిద్దాలన్నదే లక్ష్యమని ప్రభుత్వం స్పష్టం చేసింది.

6:57 AM, 31 Aug 2026 (IST)

ప్రభుత్వ వైఫల్యాలు ప్రజల్లో ఎండగట్టేందుకు పోరుబాటకు సిద్ధమైన బీఆర్‌ఎస్‌

ప్రభుత్వ వైఫల్యాలు ప్రజల్లో ఎండగట్టేందుకు ప్రతిపక్ష బీఆర్‌ఎస్‌ పోరుబాటకు సిద్ధమైంది. సెప్టెంబర్‌ 2 నుంచి వరుస నిరసన కార్యక్రమాలకు పార్టీ పిలుపునిచ్చింది. కాంగ్రెస్ 420 హామీలు, 13 డిక్లరేషన్లు అమలు చేయడంలో విఫలమైందంటూ పార్టీ శ్రేణులు పోరుబాట చేపట్టనున్నారు. హస్తం ఆరు గ్యారెంటీలు అమలు చేయడంలో విఫలమైందంటూ బీఆర్‌ఎస్‌ ఈ కార్యక్రమానికి సిద్ధమైంది.

6:54 AM, 31 Aug 2026 (IST)

రాష్ట్ర మంత్రివర్గ విస్తరణపై దిల్లీలో రేపు, ఎల్లుండి కీలక చర్చలు జరిగే అవకాశం

రాష్ట్ర మంత్రివర్గ విస్తరణపై రేపు, ఎల్లుండి దిల్లీలో కీలక చర్చలు జరిగే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది. రేపు తుమ్మిడిహట్టి ప్రాజెక్టు ఎత్తు పెంపు అంశంపై భేటీ జలశక్తిశాఖ నిర్వహించనుంది. ఈ మేరకు జలశక్తిశాఖ భేటీలో పాల్గొనేందుకు ఇవాళ లేదా రేపు సీఎం రేవంత్​రెడ్డి దిల్లీ వెళ్లే అవకాశం ఉంది. సెప్టెంబర్ 2న దిల్లీలో వైఎస్ అవార్డు ప్రదానోత్సవంలో ముఖ్యమంత్రి పాల్గొనే అవకాశాలున్నాయి. ఈ కార్యక్రమానికి భట్టివిక్రమార్క, మహేశ్‌కుమార్‌గౌడ్‌ కూడా హాజరుకానున్నారు.

6:49 AM, 31 Aug 2026 (IST)

నేపాల్-టిబెట్‌ వరదల్లో 790కి పెరిగిన మృతుల సంఖ్య

నేపాల్-టిబెట్‌ వరదల్లో మృతుల సంఖ్య 790కి పెరిగింది. ఈ విపత్తులో 2,500 మందికి పైగా గల్లంతయ్యారు. టన్నెల్‌లో చిక్కుకున్నవారిని కాపాడేందుకు సహాయ చర్యలు కొనసాగుతున్నాయి. ప్రత్యేక రెస్క్యూ బృందాలతో భారత్‌ కూడా సహాయ చర్యలు చేపట్టింది.

6:46 AM, 31 Aug 2026 (IST)

యూరప్‌ దేశం సైప్రస్‌లో పడవ బోల్తా - ఎనిమిది మంది మృతి

యూరప్‌ దేశం సైప్రస్‌లో పడవ బోల్తాపడటంతో ఎనిమిది మంది మృతిచెందారు. ప్రమాద సమయంలో 270 మంది పడవలో ప్రయాణికులున్నారు. 237 మందిని రెస్క్యూ బృందాలు రక్షించినట్లు అధికారులు తెలిపారు. మిగిలినవారి కోసం ముమ్మరంగా గాలింపు చర్యలు కొనసాగుతున్నాయన్నారు. సైప్రస్‌లోని కైరేనియా నుంచి తుర్కియేలోని టౌచుకు వెళ్తుండగా బోటు బోల్తాపడింది. వాతావరణం అనుకూలించకపోవడం వల్లే ప్రమాదం జరిగినట్లు అధికారులు చెబుతున్నారు. పడవ ఘటనపై తుర్కియే అధ్యక్షుడు రెసెప్ ఎర్డోగాన్ దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు.

6:44 AM, 31 Aug 2026 (IST)

కిర్గిస్థాన్‌ చేరుకున్న ప్రధాని నరేంద్ర మోదీ

ప్రధాని నరేంద్ర మోదీ 2 రోజుల ఉజ్బెకిస్థాన్ పర్యటనలో భాగంగా కిర్గిస్థాన్‌ చేరుకున్నారు. నేడు, రేపు కిర్గిస్థాన్‌లో జరగనున్న షాంఘై సహకార సంస్థ (ఎస్‌సీవో) సదస్సులో పాల్గొననున్నారు. పుతిన్‌, కిర్గిస్థాన్‌ అధ్యక్షుడు ఝపరోవ్‌లతో మోదీ చర్చలు జరపనున్నారు.

6:42 AM, 31 Aug 2026 (IST)

అసోంలోని కామ్‌రూప్‌ జిల్లా ఖేత్రీ ప్రాంతంలో ఘోర రోడ్డు ప్రమాదం

అసోంలోని కామ్‌రూప్‌ జిల్లా ఖేత్రీ ప్రాంతంలో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. వ్యాన్‌-ట్రక్కు ఢీ కొనడంతో ఐదుగురు మృతి చెందగా పలువురికి గాయాలయ్యాయి. ఖేత్రీ జాతీయ రహదారి సమీపంలోని నల్గేడ్రా వద్ద ఈ ఘటన చోటుచేసుకుంది. వ్యాన్ డ్రైవర్‌ నియంత్రణ కోల్పోవడంతోనే ప్రమాదం జరిగిందని పోలీసులు తెలిపారు.

6:38 AM, 31 Aug 2026 (IST)

ఇరాన్‌పై అమెరికా దాడి

ఇరాన్‌కు చెందిన రెండు రాకెట్ లాంచర్లను అమెరికా లక్ష్యంగా చేసుకొని దాడులు చేసింది. హర్మూజ్ జలసంధి సమీపంలోని లారక్ ద్వీపంలో రాకెట్ లాంచర్లపై విరుచుకుపడింది. సీమైన్లతో కూడిన రాకెట్లను ప్రయోగించేందుకు ఇరాన్ సిద్ధమైన నేపథ్యంలో అగ్రరాజ్యం దాడులకు దిగింది. ఈ నేపథ్యంలో లారక్ ద్వీపం పరిసరాల్లో భారీ పేలుళ్ల శబ్దాలు వచ్చాయి.

Last Updated : August 31, 2026 at 11:05 PM IST