31st August 2026 AP News Today Live Updates : పెద్దారవీడు మండలం కలనూతల వద్ద వాగులో కారు గల్లంతు

By ETV Bharat Andhra Pradesh Team
Published : August 31, 2026 at 7:19 AM IST
|Updated : August 31, 2026 at 10:51 PM IST
31st August 2026 AP News Today Live Updates : విశాఖలో ఆల్ ఇండియా రేడియో జంక్షన్‌లో కొణిజేటి రోశయ్య విగ్రహావిష్కరణలో మంత్రి నారా లోకేశ్ ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. ఈ సందర్భంగా లోకేశ్ రోశయ్య విగ్రహానికి పూలమాల వేసి నివాళులర్పించారు.
LIVE FEED
పెద్దారవీడు మండలం కలనూతల వద్ద వాగులో కారు గల్లంతు
మార్కాపురం జిల్లా పెద్దారవీడు మండలం కలనూతల వద్ద వాగులో కారు గల్లంతయింది. గంటవానిపల్లి వద్ద కృష్ణా జలాల విడుదలతో వాగు ప్రవాహం ఉద్ధృతంగా ఉంది. కలనూతల వాగు దాటే క్రమంలో వరదలో కారు కొట్టుకుపోయింది. కారులో ఉన్న ఒకరు గల్లంతైనట్లు సమాచారం. మరో ముగ్గురు సమీపంలోని చెట్టు ఎక్కి రక్షించమంటూ ఆర్తనాదాలు పెట్టారు. ఘటనాస్థలానికి మార్కాపురం డీఎస్పీ నాగరాజు చేరుకున్నారు. చెట్టు మీద ఉన్నవారిని కాపాడేందుకు పోలీసులు, ఫైర్ సిబ్బంది యత్నిస్తున్నారు. వాగు ఉద్ధృతితో సహాయక చర్యలకు ఆటంకమని డీఎస్పీ నాగరాజు తెలిపారు.
రియల్ టైమ్ గవర్నెన్స్‌పై సీఎం చంద్రబాబు సమీక్ష
అమరావతి క్యాంపు కార్యాలయంలో రియల్ టైమ్ గవర్నెన్స్‌పై ముఖ్యమంత్రి చంద్రబాబు అధికారులతో సమీక్ష నిర్వహించారు. డేటా అనలిటిక్స్ ఆధారంగా పౌరసేవలను మరింత సమర్థంగా అందించాలని ఆదేశించారు. అన్ని రకాల ధ్రువపత్రాలను ఆన్‌లైన్‌లోనే జారీ చేయాలని సూచించారు. రైతులకు సాగు పరిస్థితులపై నిరంతరం సూచనలు ఇవ్వాలని, ప్రకృతి సేద్యాన్ని ప్రోత్సహించాలని తెలిపారు. రాష్ట్రంలో శానిటేషన్ విషయంలో ఎలాంటి రాజీ పడవద్దని స్పష్టం చేశారు. సంక్షేమ హాస్టళ్లలో పరిస్థితులు, భోజన వసతులపై వివరించేందుకు ప్రతి నెలా మొదటి ఆదివారం తల్లిదండ్రులను ఆహ్వానించాలని ఆదేశించారు. ప్రజల నుంచి వచ్చే పీజీఆర్ఎస్ దరఖాస్తుల సత్వర పరిష్కారానికి ప్రాధాన్యం ఇవ్వాలని సీఎం స్పష్టం చేశారు.
రేపటి నుంచి రాష్ట్ర పోలీస్ స్పోర్ట్స్ మీట్
పోలీసు శాఖ ఆధ్వర్యంలో తొలిసారిగా రాష్ట్రస్థాయి పోలీసు క్రీడా పోటీలు నిర్వహించనున్నారు. మంగళగిరిలోని ఏపీఎస్పీ ఆరో బెటాలియన్‌లో రేపు సాయంత్రం 4 గంటలకు డీజీపీ హరీశ్ కుమార్ గుప్తా ఈ పోటీలను ప్రారంభించనున్నారు. రాష్ట్రవ్యాప్తంగా వివిధ పోలీస్ రేంజ్‌లు, యూనిట్ల నుంచి సుమారు 1,900 మంది క్రీడాకారులు తరలివస్తున్నారు. విట్ ఏపీ, నాగార్జున విశ్వవిద్యాలయాల వేదికలుగా సెప్టెంబర్ 1 నుంచి 4 వరకు ఈ క్రీడా సంబరాలు జరగనున్నాయి.
హైకోర్టు ఆర్బిట్రేషన్, మీడియేషన్ సెంటర్లకు పోస్టుల మంజూరు
హైకోర్టులోని ఆర్బిట్రేషన్ సెంటర్, మీడియేషన్ సెంటర్ల నిర్వహణకు ప్రభుత్వం పోస్టులను మంజూరు చేసింది. ఆర్బిట్రేషన్ సెంటర్‌కు 15, మీడియేషన్ సెంటర్‌కు 14 పోస్టులను కేటాయించింది. ఆర్బిట్రేషన్ సెంటర్ డైరెక్టర్ సారథ్యంలో, మీడియేషన్ సెంటర్ కోఆర్డినేటర్ పర్యవేక్షణలో పనిచేయనున్నాయి. ఈ విభాగాలకు జిల్లా జడ్జి స్థాయి న్యాయాధికారులను హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి (సీజే) నియమించనున్నారు.
జగన్ కుట్రలు చేసినా ఎన్నికలు ఆగవు: మంత్రి కొల్లు రవీంద్ర
మచిలీపట్నంలో మంత్రి కొల్లు రవీంద్ర ప్రజాదర్బార్‌లో పాల్గొన్నారు. ఈ సందర్భంగా బీసీ రిజర్వేషన్లు, ఓటర్ల జాబితాపై కేసులు వేయడం పట్ల ఆయన ఆగ్రహం వ్యక్తం చేశారు. జగన్ ఎన్ని కుట్రలు పన్నినా స్థానిక సంస్థల ఎన్నికలు ఆగవని స్పష్టం చేశారు. పాత ఓటర్ల జాబితా ప్రకారమే తాము ఎన్నికలకు వెళ్తున్నామన్నారు. దమ్ముంటే పోటీ చేసి గెలవాలని జగన్‌కు సవాల్ విసిరారు. స్థానిక ఎన్నికల విషయంలో జగన్ ద్వంద్వ వైఖరి అవలంబిస్తున్నారని విమర్శించారు. ఏకగ్రీవాలను సైతం అడ్డుకునేందుకు ఆయన కుట్రలు చేస్తున్నారని మండిపడ్డారు. జగన్ ఎన్ని కుతంత్రాలు చేసినా ప్రజలు తమనే ఏకపక్షంగా గెలిపిస్తారని ధీమా వ్యక్తం చేశారు. పెండింగ్ ప్రాజెక్టులన్నింటినీ పూర్తి చేసి ప్రజలకు అంకితం చేస్తామని మంత్రి రవీంద్ర హామీ ఇచ్చారు.
కేవీపీ కాలనీ హత్య కేసు ఛేదింపు
గుంటూరు కేవీపీ కాలనీలో నిన్న జరిగిన హత్య కేసును పోలీసులు విజయవంతంగా ఛేదించారు. ఈ కేసుకు సంబంధించి నగరంపాలెం పోలీసులు మొత్తం 11 మంది నిందితులను అరెస్టు చేశారు. మరో ముగ్గురు నిందితులు పరారీలో ఉన్నట్లు తెలిపారు. అరెస్టయిన నిందితుల నుంచి హత్యకు ఉపయోగించిన కత్తులు, ద్విచక్ర వాహనాలను పోలీసులు స్వాధీనం చేసుకున్నారు.
మంత్రి సత్యకుమార్ కారును అడ్డుకున్న పోలీసులు
హైదరాబాద్ బర్కత్‌పురాలోని బీజేపీ కార్యాలయం వద్ద మంత్రి సత్యకుమార్ కారును పోలీసులు అడ్డుకున్నారు. ఆయన కారులో యువమోర్చా రాష్ట్ర అధ్యక్షుడు గణేశ్ కూడా ఉన్నారు. కారులో నుంచి గణేశ్‌ను దించి మంత్రి ముందుకు వెళ్లాలని పోలీసులు సూచించారు. సోమవారం యూత్ కాంగ్రెస్, బీజేపీ నిరసనల నేపథ్యంలో పోలీసులు అప్రమత్తమై ఈ చర్యలు చేపట్టారు. ఈ క్రమంలో బీజేపీ కార్యాలయం వద్ద కాసేపు ఉద్రిక్తత నెలకొంది. పోలీసులకు, బీజేపీ కార్యకర్తలకు మధ్య వాగ్వాదం, తోపులాట జరిగింది. అనంతరం మంత్రి వాహనాన్ని బీజేపీ శ్రేణులు అక్కడి నుంచి ముందుకు పంపించారు.
ఎంబీబీఎస్ వెబ్ ఆప్షన్లకు రేపే ఆఖరు
ఎంబీబీఎస్ కన్వీనర్ కోటా సీట్ల భర్తీకి వెబ్ ఆప్షన్ల నమోదు ప్రక్రియ కొనసాగుతోంది. తొలి విడత కౌన్సెలింగ్‌లో భాగంగా ఈ వెబ్ ఆప్షన్ల నమోదుకు రేపు సాయంత్రం 4 గంటల వరకు గడువు ఇచ్చారు. తుది మెరిట్ జాబితాలో చోటు దక్కించుకున్న అభ్యర్థులు మాత్రమే ఈ ఆప్షన్లు నమోదు చేసుకునేందుకు అర్హులు.
కారుమూరి సునీల్ రిమాండ్ పొడిగింపు
మద్యం రవాణా టెండర్ల కేసులో నిందితుడైన కారుమూరి సునీల్ రిమాండ్‌ను న్యాయస్థానం పొడిగించింది. ప్రస్తుతం చంచల్‌గూడ జైలులో రిమాండ్‌లో ఉన్న ఆయనను అధికారులు వర్చువల్ విధానంలో విజయవాడ కోర్టులో హాజరుపరిచారు. ఈ మేరకు విచారణ చేపట్టిన న్యాయస్థానం.. సునీల్ రిమాండ్‌ను సెప్టెంబర్ 11 వరకు పొడిగిస్తూ ఆదేశాలు జారీ చేసింది.
నాయుడుపాలెం వద్ద రోడ్డు ప్రమాదం
నెల్లూరు జిల్లా వెంకటాచలం మండలం నాయుడుపాలెం వద్ద రోడ్డు ప్రమాదం జరిగింది. ఆగి ఉన్న లారీని ఓ ఆటో బలంగా ఢీకొట్టింది. ఈ ఘటనలో ఒకరు మృతి చెందగా, మరో ఐదుగురికి తీవ్ర గాయాలయ్యాయి. బాధితులను ముత్తుకూరు మండలం కృష్ణపట్నం వాసులుగా గుర్తించారు.
రూ.30 కోట్ల దేవదాయ భూముల రక్షణ
తాడేపల్లి మండలంలో రూ.30 కోట్ల విలువైన దేవదాయ శాఖ భూములను అధికారులు రక్షించారు. గుండిమెడలోని దాదాపు 3 ఎకరాల భూమిపై కోర్టు తీర్పు రాకముందే కొందరు అక్రమార్కులు విక్రయానికి యత్నించారు. దీన్ని ముందే పసిగట్టిన అధికారులు.. ఆ భూమిలో ఎలాంటి క్రయవిక్రయాలు జరగకూడదని హెచ్చరిక బోర్డును ఏర్పాటు చేశారు.
పులుల సంరక్షణకు స్టీరింగ్ కమిటీ
నాగార్జున సాగర్-శ్రీశైలం పులుల సంరక్షణ ప్రాంతం కోసం వన్యప్రాణుల సంరక్షణ చట్టం కింద రాష్ట్ర ప్రభుత్వం స్టీరింగ్ కమిటీని ఏర్పాటు చేసింది. ఈ రాష్ట్రస్థాయి కమిటీకి ముఖ్యమంత్రి అధ్యక్షుడిగా వ్యవహరించనుండగా, అటవీశాఖ మంత్రి ఉపాధ్యక్షుడిగా బాధ్యతలు నిర్వర్తించనున్నారు.
పీఎంఏవై లబ్ధిదారులకు నిధులు మంజూరు
రాష్ట్రంలో పీఎంఏవై పథకం కింద 17,912 అర్బన్ 2.0 బీఎల్‌సీ ఇళ్ల నిర్మాణానికి ప్రభుత్వం రూ.447.8 కోట్లు మంజూరు చేసింది. ఒక్కో ఇంటికి రూ.2.50 లక్షలు కేటాయించారు. అత్యధికంగా అనంతపురంలో 1,387, అత్యల్పంగా పశ్చిమ గోదావరిలో 212 యూనిట్లు నిర్మిస్తున్నారు. లబ్ధిదారులకు దశలవారీగా చెల్లింపులు చేయాలని కలెక్టర్లను ఆదేశించారు.
వివేకా కేసులో నిందితుల డిశ్చార్జ్ పిటిషన్లు
మాజీ మంత్రి వైఎస్ వివేకానందరెడ్డి హత్య కేసులో నిందితులుగా ఉన్న ఎర్ర గంగిరెడ్డి, ఉమాశంకర్ రెడ్డి, ఉదయ్ కుమార్ రెడ్డిలు నాంపల్లి సీబీఐ కోర్టులో డిశ్చార్జ్ పిటిషన్లు దాఖలు చేశారు. ఈ పిటిషన్లను విచారణకు స్వీకరించిన సీబీఐ న్యాయస్థానం.. తదుపరి విచారణను వచ్చే నెల 15వ తేదీకి వాయిదా వేసింది.
రైతు బైక్ నుంచి నగదు అపహరణ
తిరుపతి జిల్లా నాయుడుపేటలో దొంగలు చేతివాటం ప్రదర్శించారు. స్థానిక ఇండియన్ బ్యాంకు నుంచి ఓ రైతు రూ.3.25 లక్షల నగదును డ్రా చేశాడు. అనంతరం ఆ డబ్బును తన బైక్ డిక్కీలో ఉంచగా, గమనించిన దుండగులు క్షణాల్లో ఆ నగదును అపహరించారు. బాధితుడి ఫిర్యాదు మేరకు పోలీసులు విచారణ చేపట్టారు.
యోగా, ప్రకృతి వైద్య సంస్థకు నిధులు
గుంటూరు జిల్లా ప్రత్తిపాడు మండలం నడింపాలెంలో యోగా, ప్రాకృతిక వైద్య పరిశోధనా సంస్థ ఏర్పాటుకు అడుగులు పడ్డాయి. కేంద్ర ఆయుష్ నిధుల (రూ.100 కోట్లు)తో నిర్మించే ఈ సంస్థకు, రాష్ట్ర ప్రభుత్వం తరఫున భూసేకరణ నిమిత్తం రూ.9.94 కోట్లు మంజూరు చేస్తూ పరిపాలనా అనుమతులు ఇచ్చారు. ఇటీవల అధికారులు ఈ స్థలాన్ని పరిశీలించారు.
ప్రాజెక్టులపై మాట్లాడే అర్హత జగన్‌కు లేదు
వెలిగొండ ప్రాజెక్టును సీఎం చంద్రబాబు ప్రారంభిస్తే, వైఎస్సార్సీపీ క్రెడిట్ దొంగిలిస్తోందని నేత మండిపల్లి విమర్శించారు. సాగునీటి ప్రాజెక్టులకు పునాది వేసింది ఎన్టీఆర్, చంద్రబాబే అన్నారు. చంద్రబాబు హయాంలో వెలిగొండకు రూ.3 వేల కోట్లు ఖర్చు చేస్తే, జగన్ కేవలం రూ.800 కోట్లు మాత్రమే ఖర్చు చేశారని మండిపడ్డారు. ఇరిగేషన్‌పై మాట్లాడే అర్హత ఆయనకు లేదన్నారు.
జగన్ పోస్టుపై మంత్రి లోకేశ్ కౌంటర్
వెలిగొండ ప్రాజెక్టు తన ఘనతేనంటూ మాజీ సీఎం జగన్ పెట్టిన పోస్టుపై మంత్రి లోకేశ్ ఘాటుగా స్పందించారు. 2024లో చుక్క నీరు లేని ప్రాజెక్టును ఘనంగా ప్రారంభించి జగన్ చరిత్ర సృష్టించారని ఎద్దేవా చేశారు. ఇలాంటి నకిలీ ప్రారంభోత్సవాలు చేయడం కేవలం వైసీపీకే సాధ్యమవుతుందని లోకేశ్ సెటైర్లు వేశారు. ఆ ఘనత అంతా వారికే దక్కుతుందని విమర్శించారు.
గంభీరంలో మంత్రి నారా లోకేశ్ పర్యటన
విశాఖ జిల్లా ఆనందపురం మండలం గంభీరంలో మంత్రి నారా లోకేశ్ పర్యటించారు. ఈ సందర్భంగా శ్రీరాధామధనమోహన్ స్వామి ఆలయంలో పూజలు చేశారు. అక్షయపాత్ర ఫౌండేషన్ ఆధునిక వంటశాలను ఆయన పరిశీలించారు. అనంతరం వేంకటేశ్వరస్వామి ఆలయ నిర్మాణానికి శంకుస్థాపన చేశారు. ప్రేమ విద్యాలయం కొత్త క్యాంపస్, స్నేహ సంధ్య ఏజ్ కేర్ ఫౌండేషన్ భవనాలను ప్రారంభించారు.
పూల సుబ్బయ్య కుమార్తెలకు సీఎం సన్మానం
వెలిగొండ ప్రాజెక్టు సాధన కోసం అప్పట్లో అలుపెరగని పోరాటం చేసిన పూల సుబ్బయ్య కుమార్తెలకు అరుదైన గౌరవం దక్కింది. మార్కాపురంలో వెలిగొండ ప్రాజెక్టు తొలిదశను ప్రారంభించిన సీఎం చంద్రబాబు, పూల సుబ్బయ్య కుమార్తెలు విలాసిని, సునందలను సన్మానించారు. తమ తండ్రి ఆశయాన్ని నెరవేర్చినందుకు సీఎంకు వారు కుటుంబం తరఫున కృతజ్ఞతలు తెలిపారు.
ట్రాక్ మరమ్మతులు, రైళ్ల వేళల్లో మార్పులు
మద్రాస్ డివిజన్ పరిధిలో ట్రాక్ మరమ్మతు పనులు జరుగుతున్నాయి. దీంతో ఎంజీఆర్ చెన్నై సెంట్రల్ - హౌరా మెయిల్ ఎక్స్‌ప్రెస్ వేళల్లో అధికారులు మార్పులు చేశారు. ఆగస్టు 31, సెప్టెంబర్ 3, 10 తేదీల్లో ఈ రైలు ఒక గంట ఆలస్యంగా నడవనుంది. అలాగే సెప్టెంబర్ 5, 12 తేదీల్లో రెండు గంటల ఆలస్యంగా బయలుదేరుతుందని దక్షిణ మధ్య రైల్వే వెల్లడించింది.
మహిళా కాంట్రాక్టర్‌పై కత్తులతో దాడి
గుంటూరులోని గోరంట్ల పరిధిలో హౌస్ కీపింగ్ కాంట్రాక్ట్ పనులు చేస్తున్న సునీతపై దుండగులు దాడికి తెగబడ్డారు. కాంట్రాక్ట్ పనులు వదిలేయాలంటూ మరో కాంట్రాక్టర్ శివ అనుచరులు తనపై రాళ్లు, కత్తులతో దాడి చేశారని బాధితురాలు ఆరోపించారు. తీవ్ర గాయాలతో ఎస్పీ కార్యాలయానికి ఆమె వెళ్లగా, పోలీసులు వెంటనే చికిత్స నిమిత్తం జీజీహెచ్‌కు తరలించారు.
మద్యం కేసులో సిట్ తీరుపై సుప్రీంకోర్టు అసహనం
ఏపీలో మద్యం అక్రమ రవాణా కేసులో సిట్ దర్యాప్తు తీరుపై సుప్రీంకోర్టు తీవ్ర అసహనం వ్యక్తం చేసింది. రెండేళ్లుగా కేసు నడుస్తున్నా ఏమీ కనుగొనలేకపోయారని ధర్మాసనం ప్రశ్నించింది. ఒకవైపు కస్టడీ కావాలంటూనే, మరోవైపు పోలీసులు ప్రిపేర్ కాలేదనడంపై ఆశ్చర్యం వ్యక్తం చేసింది. నిందితులు రాజ్ కెసిరెడ్డి, వాసుదేవరెడ్డిలకు న్యాయస్థానం నోటీసులు జారీ చేసింది. సిట్ ప్రవర్తనను పరిశీలిస్తామని పేర్కొంటూ తదుపరి విచారణను సీజేఐ ధర్మాసనం వాయిదా వేసింది.
ప్రేమ పేరిట ఆరుగురిని పెళ్లాడిన వ్యక్తిపై ఫిర్యాదు
కాకినాడలో ప్రేమ పేరుతో పలువురిని మోసం చేసిన వ్యక్తిపై బాధితురాలు పోలీసులకు ఫిర్యాదు చేసింది. జగన్నాథపురానికి చెందిన మటన్ షాప్ నిర్వాహకుడు గౌస్ మొహిద్దీన్ ప్రేమ పేరిట ఇప్పటికే ఆరుగురిని వివాహం చేసుకున్నాడని పేర్కొంది. తనను కూడా ప్రేమ పేరుతో పెళ్లి చేసుకుని, తీవ్రంగా వేధింపులకు గురిచేస్తున్నాడని ఎస్పీ కార్యాలయంలో ఆవేదన వ్యక్తం చేసింది. నిందితుడిపై కఠిన చర్యలు తీసుకోవాలని ఆమె కోరింది.
భవిష్యత్ తరాల కోసమే నా రాజకీయం: సీఎం చంద్రబాబు
రాజకీయం అంటే తనకు ఎన్నికలు కావని, ప్రజల జీవితాల్లో శాశ్వత మార్పు తేవడమేనని సీఎం చంద్రబాబు నాయుడు అన్నారు. ఓట్ల కోసం కాకుండా వ్యవస్థలో మార్పు కోసమే తాను నిరంతరం పనిచేస్తానని స్పష్టం చేశారు. రాబోయే ఎన్నికల కంటే భవిష్యత్ తరాల శ్రేయస్సే తనకు ముఖ్యమన్నారు. తన ఊపిరి ఉన్నంతవరకు తెలుగు జాతి కోసం కష్టపడతానని, ప్రపంచంలోనే మన జాతిని అగ్రస్థానంలో నిలపడానికి అందరూ కలిసి రావాలని పిలుపునిచ్చారు.
వెలిగొండను పూర్తి చేసిన ఘనత చంద్రబాబుదే: నిమ్మల
ఎన్నో అడ్డంకులను అధిగమించి వెలిగొండ ప్రాజెక్టును పూర్తి చేశామని మంత్రి నిమ్మల రామానాయుడు తెలిపారు. ఈ ప్రాజెక్టుకు శంకుస్థాపన చేసి, పూర్తి చేసింది ముమ్మాటికీ సీఎం చంద్రబాబేనని స్పష్టం చేశారు. కూటమి ప్రభుత్వం రాగానే రెండేళ్లలో ప్రాజెక్టు పూర్తి చేయాలని సీఎం లక్ష్యంగా నిర్దేశించారన్నారు. ఎన్ని ఆర్థిక ఇబ్బందులు ఎదురైనా పనులు ఆగకుండా నిరంతరం పర్యవేక్షించారని తెలిపారు. ఈ సందర్భంగా సీఎం చంద్రబాబుతో పాటు ప్రాజెక్టు నిర్వాసితులకు ఆయన కృతజ్ఞతలు తెలియజేశారు.
ఆల్ ఇండియా రేడియో జంక్షన్‌లో కొణిజేటి రోశయ్య విగ్రహావిష్కరణ
విశాఖలో ఆల్ ఇండియా రేడియో జంక్షన్‌లో కొణిజేటి రోశయ్య విగ్రహావిష్కరణలో మంత్రి నారా లోకేశ్ ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. ఈ సందర్భంగా లోకేశ్ రోశయ్య విగ్రహానికి పూలమాల వేసి నివాళులర్పించారు.
బెంగళూరు నుంచి విజయవాడ రావాల్సిన ఎయిరిండియా విమానం ఆలస్యం
బెంగళూరు నుంచి విజయవాడ రావాల్సిన ఎయిరిండియా విమానం తీవ్రంగా ఆలస్యమైంది. ఉదయం 7 గంటలకు బయల్దేరాల్సి ఉన్న ఎయిరిండియా విమానం ఇంతవరకూ బయల్దేరకపోడంతో విమానాశ్రయంలో ప్రయాణికులు ఆందోళనకు దిగారు. విమానయాన సిబ్బంది తమకు సరైన సమాచారం ఇవ్వట్లేదంటూ ప్రయాణికులు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. సోమవారం కోర్టుకు, ఇతర ముఖ్యమైన పనులకు వెళ్లాల్సి ఉన్నందున ప్రయాణికులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. ఈ విమానంలో ప్రయాణించాల్సిన వారిలో మంత్రి మండిపల్లి రాంప్రసాద్ రెడ్డి సహా పలువురు ప్రముఖులు కూడా ఉన్నారు.
కొవ్వూరు స్టేషన్ వద్ద పట్టాలు తప్పిన గూడ్స్
తూర్పు గోదావరి జిల్లా కొవ్వూరు స్టేషన్ వద్ద గుూడ్స్ రైలు పట్టాలు తప్పింది. విజయవాడ వైపు వెళ్తున్న గూడ్స్కి ఈ ప్రమాదం జరగడంతో రైళ్లకు అంతరాయం కలిగింది.
రైల్వే సిబ్బంది వెంటనే మరమ్మతు చర్యలు చేపట్టారు.
నెల్లూరు ఎ.ఎస్.పేటలో మద్యం మత్తులో అర్ధరాత్రి యువకుల హల్‌చల్
నెల్లూరు జిల్లా ఎ.ఎస్.పేటలో అర్ధరాత్రి వేళ మద్యం మత్తులో కొందరు యువకులు తీవ్ర హల్‌చల్ చేశారు. స్థానికంగా మద్యం సేవిస్తున్న ఆ యువకులను అక్కడి స్థానికులు ప్రశ్నించారు. దాంతో ఆగ్రహానికి గురైన ఆ యువకులు కత్తులు, బీరు సీసాలతో స్థానికులతో పాటు ఘటనాస్థలికి వచ్చిన పోలీసులపై కూడా దాడికి యత్నించారు. వీరంతా కేవలం రెండు రోజుల క్రితమే జైలు నుంచి బయటకొచ్చిన నెల్లూరుకు చెందిన రౌడీషీటర్లుగా స్థానికులు అనుమానం వ్యక్తం చేస్తున్నారు. ఈ గొడవలో స్థానికులు ధైర్యంగా వ్యవహరించి ముగ్గురు యువకులను పట్టుకుని పోలీసులకు అప్పగించగా, మరో నలుగురు అక్కడి నుంచి పరారయ్యారు.
నెల్లూరు జిల్లా ముత్తుకూరులో గుర్తుతెలియని మృతదేహం కలకలం
నెల్లూరు జిల్లా ముత్తుకూరులోని బీసీకాలనీ సాయిబాబా గుడి సమీపంలో గల కృష్ణపట్నం కాల్వలో ఒక గుర్తుతెలియని మృతదేహం లభ్యం కావడం తీవ్ర కలకలం రేపింది. కాల్వలో తేలుతున్న మృతదేహాన్ని గమనించిన స్థానికులు వెంటనే పోలీసులకు సమాచారం అందించారు. ఈ మేరకు ఘటనాస్థలికి చేరుకున్న పోలీసులు మృతదేహాన్ని స్వాధీనం చేసుకుని, కేసు నమోదు చేసి దర్యాప్తు ప్రారంభించారు.
శ్రీశైలం మల్లన్న సేవలో మంత్రి పార్థసారథి
శ్రీశైలం మల్లన్న సేవలో మంత్రి పార్థసారథి పాల్గొన్నారు . స్వామి, అమ్మవార్లకు రుద్రాభిషేకం, కుంకుమార్చన పూజలు చేశారు. పండితులు మంత్రికి వేదాశీర్వచనం చేసి తీర్థ ప్రసాదాలు అందజేశారు.
దేవరపల్లి మం. యర్నగూడెం హైవేపై కానిస్టేబుల్‌పై దాడి
తూర్పుగోదావరి జిల్లా దేవరపల్లి మండలం యర్నగూడెం జాతీయ రహదారిపై తెల్లవారుజామున ఒక కానిస్టేబుల్‌పై గుర్తుతెలియని వ్యక్తులు చాకుతో దాడి చేశారు.అక్కడ రెండు లారీలు ఢీకొన్న విషయం తెలుసుకుని హైవే పోలీసులు ఘటనాస్థలికి చేరుకున్నారు. యర్నగూడెంలోని కనకదుర్గమ్మ గుడి సమీపంలో ఉన్న ఫ్లైఓవర్‌పై ఈ ప్రమాదం జరిగింది. ఆ సమయంలో అక్కడి బస్సు షెల్టర్‌లో నలుగురు వ్యక్తులు అనుమానాస్పదంగా కనిపించడంతో కానిస్టేబుల్ వెంకటేశ్వరరావు వారి వద్దకు వెళ్లారు. పోలీసులను చూడగానే వారిలో ఇద్దరు పారిపోగా, మిగిలిన ఇద్దరు కానిస్టేబుల్ కడుపులో చాకుతో పొడిచి అక్కడి నుంచి పరారయ్యారు. తీవ్రంగా గాయపడిన కానిస్టేబుల్ వెంకటేశ్వరరావును వెంటనే రాజమహేంద్రవరంలోని ఒక ప్రైవేటు ఆస్పత్రికి తరలించారు. ప్రస్తుతం దాడి చేసి పరారైన ఆ వ్యక్తుల కోసం పోలీసులు, గ్రామస్థులు కలిసి ముమ్మరంగా గాలిస్తున్నారు.
టోకెన్లు లేని శ్రీవారి భక్తులకు సర్వదర్శనానికి 8 గంటలు
తిరుమల టోకెన్లు లేని శ్రీవారి భక్తులకు సర్వదర్శనానికి ప్రస్తుతం 8 గంటల సమయం పడుతోంది. ఇందుకోసం స్వామివారి సర్వదర్శనానికి భక్తులు 12 కంపార్టుమెంట్లలో వేచి ఉన్నారు. ఇకపోతే నిన్న ఒక్కరోజే శ్రీవారిని 81,687 మంది భక్తులు దర్శించుకోగా, వారిలో 34,938 మంది భక్తులు స్వామివారికి తలనీలాలు సమర్పించి మొక్కులు తీర్చుకున్నారు. ఈ క్రమంలో నిన్న శ్రీవారి హుండీ ఆదాయం రూ. 4.36 కోట్లు వచ్చినట్లు తిరుమల తిరుపతి దేవస్థానం అధికారులు వెల్లడించారు.
ముందు వెళ్తున్న లారీని బలంగా ఢీకొన్న కారు, డ్రైవర్ మృతి
విశాఖపట్నం జిల్లా ఆనందపురం-పెందుర్తి రహదారిపై ప్రమాదం చోటుచేసుకుంది. ముందు వెళ్తున్న లారీని కారు బలంగా ఢీకొన్నది. కారు ఇంజిన్ నుంచి చెలరేగిన మంటల కారణంగ కారు దగ్ధమైంది. ఈ ప్రమాదంలో డ్రైవర్ మృతి చెందారు.
భాకరాపేట రహదారిలో లారీ దగ్ధం
తిరుపతి జిల్లా: చంద్రగిరి మం. భాకరాపేట రహదారిలో కొండగుట్టను ఢీకొని పైపుల లోడుతో వెళ్తున్న లారీ దగ్ధమయ్యింది. మహారాష్ట్రలోని బరంపూర్ నుంచి తిరుపతి వైపు వస్తుండగా ఈ ఘటన జరిగింది. సకాలంలో కిందకు దూకి లారీ డ్రైవర్ ప్రాణాలు దక్కించుకున్నాడు. అగ్నిమాపక సిబ్బంది మంటలను అదుపు చేసింది.
ముందు వెళ్తున్న లారీని బలంగా ఢీకొన్న కారు, డ్రైవర్ మృతి
విశాఖ: ఆనందపురం-పెందుర్తి రహదారిపై ప్రమాదం జరిగింది. ముందు వెళ్తున్న లారీని కారు బలంగా ఢీకొట్టడా డ్రైవర్ మృతి చెందారు. కారు ఇంజిన్ నుంచి చెలరేగిన మంటల కారణందా కారు దగ్ధమయ్యింది. గండిగుండ సత్తరువ కూడలి వద్ద ఈ ఘటన చోటుచేసుకుంది.
తిరుమలలో టోకెన్లు లేని శ్రీవారి భక్తులకు సర్వదర్శనానికి 8 గంటల సమయం
తిరుమలలో టోకెన్లు లేని శ్రీవారి భక్తులకు సర్వదర్శనానికి 8 గంటల సమయం పడుతోంది. శ్రీవారి సర్వదర్శనానికి 12 కంపార్టుమెంట్లలో భక్తులు వేచి ఉన్నారు. నిన్న శ్రీవారిని 81,687 మంది భక్తులు దర్శించుకున్నారు. నిన్న శ్రీవారికి రూ.4.36 కోట్ల హుండీ ఆదాయం వచ్చింది. నిన్న శ్రీవారికి 34,938 మంది భక్తులు తలనీలాలు సమర్పించారు.
విశాఖకు రానున్న మరో అంతర్జాతీయస్థాయి ఆస్పపత్రి
విశాఖకు మరో అంతర్జాతీయస్థాయి ఆసుపత్రి రానుంది. నేడు గంభీరం వద్ద ఏఐజీ ఆస్పత్రి నిర్మాణానికి మంత్రి లోకేశ్ శంకుస్థాపన చేయనున్నారు. రూ.2 వేల కోట్లతో చేపట్టే ప్రాజెక్టుతో 9 వేల మందికి ఉద్యోగ అవకాశాలు లభించనున్నాయి. రోజుకు 5 వేలమంది రోగులకు ఓపీడీ సేవలు అందించేలా సదుపాయాలు కల్పించనున్నారు. 9 ఎకరాల్లో ఆస్పత్రి క్యాంపస్, మరో 2.5 ఎకరాల్లో నర్సింగ్ కళాశాల ఏర్పాటు చేయనున్నారు. ఎనిమిది సెంటర్స్ ఆఫ్ ఎక్సలెన్స్‌లో 50కి పైగా ప్రత్యేక వైద్య విభాగాలు ఏర్పాటు కానున్నాయి. ల్యాబ్, ఏఐ సెంటర్, పారామెడిక్ సెంటర్, 500 సీట్ల ఆడిటోరియం ఏర్పాటు చేయనున్నారు. తొలి దశలో టవర్-ఏ, టవర్-బీ నిర్మాణాలు 2028 అక్టోబర్ నాటికి పూర్తి చేయనున్నారు.

