ETV Bharat / state

30-08-2026 Telangana News Today Live Updates : పరిగి మండలం చింతల్ చెరువు వద్ద రోడ్డు ప్రమాదం - ఇద్దరు మృతి

Telangana News Today
తెలంగాణ తాజా వార్తాలు (ETV Bharat)
author img

By ETV Bharat Telangana Team

Published : August 30, 2026 at 7:18 AM IST

|

Updated : August 30, 2026 at 9:53 PM IST

Choose ETV Bharat

30-08-2026 Telangana News Today Live Updates : ఈరోజు తాజా ప్రధాన వార్తల సమాచారం

LIVE FEED

9:51 PM, 30 Aug 2026 (IST)

తాండూరులోని లాడ్జిలో వ్యక్తి మృతి

వికారాబాద్ జిల్లా తాండూరులోని ఓ లాడ్జిలో వ్యక్తి మృతి అనుమానాస్పద స్థితిలో మృతి చెందాడు. తాండూరు మండలం కొల్లాపూర్‌కు చెందిన దశరథరెడ్డి 5 రోజుల క్రితం లాడ్జిలో రూమ్ తీసుకున్నాడు. నిన్నటి నుంచి బయటికి రాకపోవడంతో ఇవాళ సిబ్బంది గదిని తెరిచి చూశారు. దశరథరెడ్డి చనిపోయి ఉండటం చూసి పోలీసులకు సమాచారం ఇచ్చారు. పోలీసులు వచ్చి మృతదేహాన్ని పోస్ట్​మార్టమ్ కోసం తరలించి దర్యాప్తు చేపట్టారు.

8:59 PM, 30 Aug 2026 (IST)

పరిగి మండలం చింతల్ చెరువు వద్ద రోడ్డు ప్రమాదం - ఇద్దరు అక్కడికక్కడే మృతి

వికారాబాద్ జిల్లా పరిగి మండలం చింతల్ చెరువు వద్ద రోడ్డు ప్రమాదం జరిగింది. లారీని వెనుక నుంచి కారు ఢీకొన్న ఘటనలో ఇద్దరు అక్కడికక్కడే మృతి చెందారు. చనిపోయిన వారిని దోమ మండలం కిష్టాపూర్‌ వాసులుగా గుర్తించారు. కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు ప్రారంభించారు.

6:35 PM, 30 Aug 2026 (IST)

ములుగులోని గణేశ్‌రావుపల్లిలో విషాదం, చెరువులో జారిపడి అన్నదమ్ములు మృతి

ములుగులోని గణేశ్‌రావుపల్లిలో విషాద ఘటన జరిగింది. చెరువు వద్దకు వెళ్లి అందులో జారిపడి అన్నదమ్ములు మృతి చెందారు. చనిపోయిన ఇద్దరిని వినయ్(15), రాజేశ్‌(12)గా గుర్తించారు.

6:24 PM, 30 Aug 2026 (IST)

గద్వాల వ్యవసాయమార్కెట్‌లో గంజాయి పట్టివేత

జోగులాంబ గద్వాల జిల్లా వ్యవసాయ మార్కెట్‌లో పోలీసులు గంజాయి పట్టుకున్నారు. పక్కా సమాచారంతో దాడి చేసి ముగ్గురు నిందితులను అరెస్టు చేసి వారి వద్ద ఉన్న 8 కిలోల గంజాయిను సీజ్ చేశారు.

4:52 PM, 30 Aug 2026 (IST)

మట్టి లోడుతో వెళ్తుండగా ట్రాక్టర్‌ బోల్తా పడి ఇద్దరు మృతి

ఖమ్మం జిల్లా ఎర్రుపాలెం మండలం బుచ్చిరెడ్డిపాలెంలో విషాదం చోటుచేసుకుంది. మట్టి లోడుతో వెళ్తుండగా ట్రాక్టర్‌ బోల్తా పడి ఇద్దరు మృతి చెందారు. చనిపోయిన వారిని బుచ్చిరెడ్డిపాలెం వాసి నాగరాజు, కొత్తపల్లి గ్రామవాసి రమేశ్​గా గుర్తించారు. సమాచారం అందుకున్న పోలీసులు మృతదేహాలను పోస్ట్​మార్టమ్​ కోసం తరలించారు.

4:43 PM, 30 Aug 2026 (IST)

హైదరాబాద్ - విజయవాడ జాతీయ రహదారిపై వాహనాల రద్దీ

హైదరాబాద్ - విజయవాడ జాతీయ రహదారిపై వాహనాల రద్దీ పెరిగింది. వరుస సెలవులు, రాఖీ పండగ తర్వాత నగరవాసులు తిరుగుపయనం కావడంతో జాతీయ రహదారులు కిక్కిరిసిపోయాయి. గ్రామాల నుంచి హైదరాబాద్‌కు తిరిగివస్తున్న వారితో అక్కడక్కడా ట్రాఫిక్ జామ్ ఏర్పడుతున్నాయి.

4:27 PM, 30 Aug 2026 (IST)

పహాడీషరీఫ్‌లో నర్సు శిరీష హత్య కేసులో నిందితుడి అరెస్ట్

పహాడీషరీఫ్‌లో నర్సు శిరీష అనుమానాస్పద మృతి కేసులో పురోగతి లభించింది. నర్సు శిరీషను బిహార్‌ వాసి హత్య చేసినట్లు పోలీసులు తేల్చారు. శిరీషపై బిహార్ వాసి సైనా ఉల్లా (35) అత్యాచారానికి యత్నించగా ఆమె ప్రతిఘటించింది. దీంతో గొంతు నులిమి చంపిన నిందితుడు పరారయ్యాడు. దర్యాప్తు జరిపిన పోలీసులు నిందితుడిని అరెస్ట్ చేశారు.

3:28 PM, 30 Aug 2026 (IST)

రంగారెడ్డి జిల్లాలోని అంగన్వాడీ టీచర్ల పోస్టుల భర్తీకి నోటిఫికేషన్

రంగారెడ్డి జిల్లాలోని అంగన్వాడీ టీచర్ల పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ విడుదలైంది. ఐసీడీఎస్‌ ప్రాజెక్టుల పరిధిలో 125 అంగన్వాడీ టీచర్ల ఖాళీలు ఉన్నాయి. రేపటి నుంచి సెప్టెంబర్ 10 వరకు ఆన్‌లైన్ లో దరఖాస్తులు స్వీకరిస్తారు. పూర్తి వివరాలు www.wdcw.tg.nic.inలో తెలుసుకోవచ్చు.

2:28 PM, 30 Aug 2026 (IST)

కసాపురం వద్ద హంద్రీనీవా కాలువలోకి దూకిన దంపతులు

ఏపీలోని కర్నూలు కసాపురం వద్ద హంద్రీనీవా కాలువలోకి బెల్డోనకు చెందిన చిదానంద(55), రామలింగమ్మ(50) దూకారు. హంద్రీనీవా కాలువ నుంచి రామలింగమ్మ మృతదేహం వెలికితీశారు. చిదానందం కోసం హంద్రీనీవా కాలువలో గాలింపు చర్యలు కొనసాగుతున్నాయి. కుటుంబ కలహాలతోనే దంపతులు కాలువలో దూకినట్లు అనుమానిస్తున్నారు.

2:12 PM, 30 Aug 2026 (IST)

సీఎం రేవంత్‌రెడ్డికి బహిరంగ లేఖ రాసిన మాజీ మంత్రి హరీశ్‌రావు

సీఎం రేవంత్‌రెడ్డికి మాజీ మంత్రి హరీశ్‌రావు బహిరంగ లేఖ రాశారు. "రూ.500 కోట్ల విలువైన భూమిని 87 కోట్లకే కట్టబెడుతున్నారు. రూ.87 కోట్లు చెల్లించేందుకు ప్రభుత్వ సంస్థ ఆయిల్‌ఫెడ్‌ సిద్ధంగా ఉంది. భూమి కొనుగోలుకు ఆయిల్‌ఫెడ్ సిద్ధంగా ఉన్నా ప్రైవేటు వ్యక్తులకే ఇస్తున్నారు. రేవంత్‌రెడ్డి సర్కార్ రియల్‌ఎస్టేట్ ఏజెన్సీగా మారిపోయింది" అని హరీశ్‌రావు పేర్కొన్నారు.

2:09 PM, 30 Aug 2026 (IST)

పదేళ్లలో దివ్యాంగులకు ఏం చేశారో బీఆర్‌ఎస్‌ చెప్పాలి? : మంత్రి అడ్లూరి లక్ష్మణ్

"పదేళ్లలో దివ్యాంగులకు ఏం చేశారో బీఆర్‌ఎస్‌ చెప్పాలి?. పదేళ్లు అధికారంలో ఉండి ఏం చేశారు?. రాష్ట్రంలో దళితులకు 3 ఎకరాల భూమి ఇస్తామన్నారు. నిరుద్యోగ భృతి ఇస్తామన్నారు.. అమలు చేశారా?. దివ్యాంగులకు బ్యాటరీ వీల్‌ఛైర్లు, వాహనాలు అందించాం. దివ్యాంగుల సంక్షేమానికి రూ.50 కోట్లు ఖర్చు పెట్టాం. ఇంకా మిగిలినవారికి కూడా సంక్షేమం అందించేందుకు సిద్ధంగా ఉన్నాం. దివ్యాంగ దంపతులు ఒకేచోట పనిచేసేలా సవరణలు చేశాం. 34 జీవో తీసుకొచ్చి దివ్యాంగులకు ప్రయోజనం చేకూర్చాం. అర్హత ఉన్న దివ్యాంగులందరికీ కొత్తగా పింఛన్లు ఇచ్చాం. కార్పొరేట్‌ ఆస్పత్రుల్లో వైద్య చికిత్సలు అందిస్తున్నాం. పుట్టిన వెంటనే అంగవైకల్యం ఉంటే బాల భరోసా పథకం తీసుకొచ్చాం. అంగవైక్యలం ఉన్న పిల్లలకు అవసరమైన పరికరాలు అందిస్తున్నాం. రాబోయే రోజుల్లో ప్రజలకు ఇచ్చిన మాట ఈ ప్రభుత్వం అమలు చేస్తుంది. తలసేమియాతో ఉన్నవారికి పింఛన్లు ఇస్తున్నాం." అని మంత్రి అడ్లూరి లక్ష్మణ్ తెలిపారు.

12:56 PM, 30 Aug 2026 (IST)

హైదరాబాద్‌ : మైనర్లకు సిగరెట్లు విక్రయిస్తున్న పాన్‌షాప్ యజమాని అరెస్ట్

హైదరాబాద్‌లో మైనర్లకు సిగరెట్లు విక్రయిస్తున్న పాన్‌షాప్ యజమానిని పోలీసులు అరెస్ట్ చేశారు. లిమ్రా పాన్ మహల్‌ షాప్ యజమాని యూసఫ్ ఉద్దీన్​ను అరెస్టు చేసి, నిందితుడి నుంచి రూ.60 వేల విలువైన సిగరెట్లు, పొగాకు ఉత్పత్తులు స్వాధీనం చేసుకున్నారు.

11:47 AM, 30 Aug 2026 (IST)

నషా ముక్త్ యువ భారత్ కార్యక్రమాన్ని ప్రచారం చేయాలి : ప్రధాని

నషా ముక్త్ యువ భారత్ కార్యక్రమాన్ని ప్రచారం చేయాలని ప్రధాని మోదీ పిలుపునిచ్చారు. మాదకద్రవ్యాల వల్ల నష్టాలు అధికంగా ఉంటాయని సూచించారు. దేశం డ్రగ్స్ రహిత భారత్‌గా మారాలని ఆకాంక్షించిన ప్రధాని, డ్రగ్స్‌కు బానిసైతే వ్యక్తికే కాకుండా సమాజానికీ నష్టమని హెచ్చరించారు. ఈ మేరకు 137వ మన్‌ కీ బాత్ ఎపిసోడ్​లో మాట్లాడారు. డ్రగ్స్‌కు వ్యతిరేకంగా సోషల్‌మీడియాలో పోస్టులు పెట్టాలన్న మోదీ, నషా ముక్త్ యువ హ్యాష్‌ట్యాగ్స్ పేరుతో పోస్టులు పెట్టాలన్నారు.

10:34 AM, 30 Aug 2026 (IST)

తిరుమల ఇండస్ట్రీస్​లో టాస్క్ ఫోర్స్, సివిల్ సప్లై అధికారుల తనిఖీలు

కరీంనగర్ జిల్లా హుజూరాబాద్ మండలం రాంపూర్ తిరుమల ఇండస్ట్రీస్​లో టాస్క్​ఫోర్స్, సివిల్ సప్లై అధికారులు తనిఖీలు చేస్తున్నారు. 340 క్వింటాళ్ల రేషన్ బియ్యం గుర్తించిన సివిల్ సప్లై అధికారులు, రెండు ట్రాలీ ఆటోలను స్వాధీనం చేసుకున్నారు. దాడులు కొనసాగుతున్నాయి.

10:16 AM, 30 Aug 2026 (IST)

వికారాబాద్‌ రైల్వే స్టేషన్‌ను పరిశీలించి - మొక్కలు నాటిన కేంద్రమంత్రి కిషన్‌ రెడ్డి

వికారాబాద్ జిల్లా కేంద్రంలోని రైల్వే స్టేషనను కేంద్రమంత్రి కిషన్​ రెడ్డి పరిశీలించారు. ఈ సందర్భంగా స్టేషన్​ ఆవరణలో మొక్కలు నాటారు. అమృత్ భారత్​లో భాగంగా రూ.25 కోట్లతో చేపట్టిన వివిధ పనులను పరిశీలించి పురోగతిపై రైల్వే అధికారులను అడిగి తెలుసుకున్న మంత్రి, త్వరితగతిన పనులు పూర్తి చేసి ప్రయాణికులకు అందుబాటులో తీసుకురావాలని సూచించారు.

10:14 AM, 30 Aug 2026 (IST)

కరీంనగర్ జిల్లా గంగాధరలో ప్రమాదం

కరీంనగర్ జిల్లా గంగాధరలో ప్రమాదం చోటుచేసుకుంది. కూలీలతో వెళ్తున్న ఆటోను ఓ వ్యాన్​ ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో ఐదుగురు కూలీలకు తీవ్రగాయాలు కాగా, క్షతగాత్రులను సమీప ఆసుపత్రులకు తరలించారు.

9:23 AM, 30 Aug 2026 (IST)

దేశవ్యాప్తంగా నీట్ పీజీ పరీక్ష ప్రారంభం

దేశవ్యాప్తంగా నీట్ పీజీ పరీక్ష ప్రారంభమైంది. మధ్యాహ్నం 12.30 వరకు పరీక్ష కొనసాగనుంది. నీట్ పీజీ పరీక్షకు 2,73,183 మంది దరఖాస్తు చేసుకోగా, దేశవ్యాప్తంగా 1,300 కేంద్రాల్లో పరీక్ష నిర్వహిస్తున్నారు. తెలంగాణలో నీట్ పీజీ పరీక్షకు 17,627 మంది దరఖాస్తు చేసుకోగా, 56 కేంద్రాల్లో పరీక్ష జరుగుతోంది.

8:04 AM, 30 Aug 2026 (IST)

వికారాబాద్: రాజీవ్ గృహకల్పలో ఇంటర్ విద్యార్థిని ఆత్మహత్య

వికారాబాద్: రాజీవ్ గృహకల్పలో ఓ ఇంటర్ విద్యార్థిని ఆత్మహత్య చేసుకుంది. ఉరేసుకొని బలవన్మరణానికి పాల్పడింది.

7:01 AM, 30 Aug 2026 (IST)

హైదరాబాద్‌ రన్నర్స్‌ ఆధ్వర్యంలో 15వ ఎడిషన్‌ రన్‌ ప్రారంభం

హైదరాబాద్‌ రన్నర్స్‌ ఆధ్వర్యంలో 15వ ఎడిషన్‌ రన్‌ ప్రారంభమైంది. వేలాది మంది రన్నర్స్ ఈ మారథాన్​లో పాల్గొన్నారు. జీహెచ్‌ఎంసీ కమిషనర్ కర్ణన్ హాఫ్ మరథాన్‌ను ప్రారంభించారు. నెక్లెస్‌ రోడ్‌ పీపుల్స్‌ ప్లాజా నుంచి గచ్చిబౌలి స్టేడియం వరకు మారథాన్‌ రన్ ఉండనుంది. హుస్సేన్‌సాగర్‌ లేక్, లోక్‌భవన్‌, కేబీఆర్‌ పార్క్ మీదుగా కొనసాగనునుంది. ఇందులో కెన్యా దేశం నుంచి వచ్చిన 8 మంది రన్నర్స్ కూడా పాల్గొన్నారు. ఈ మారథాన్‌కు 32 వేలకు పైగా రిజిస్ట్రేషన్లు వచ్చాయి. ఫుల్ మారథాన్, హాఫ్ మారథన్, 10కే, విభాగాల్లో రన్ కొనసాగుతోంది. హాఫ్ మారథాన్‌లో 8,500 మంది రన్నర్స్ పాల్గొన్నారు. ఉదయం 4:30 కు ఫుల్ మారథాన్ ప్రారంభించారు. మారథాన్​ కారణంగా అధికారులు పలు ప్రాంతాల్లో ట్రాఫిక్‌ ఆంక్షలు విధించారు. మారథాన్ విజేతలకు గచ్చిబౌలి స్టేడియం వద్ద బహుమతులు ప్రదానం చేయనున్నారు.

6:58 AM, 30 Aug 2026 (IST)

నేపాల్-టిబెట్‌ వరదల్లో పెరుగుతున్న మృతుల సంఖ్య

నేపాల్-టిబెట్‌ వరదల్లో మృతుల సంఖ్య పెరుగుతోంది. నేపాల్-టిబెట్‌ వరదల్లో ఇప్పటివరకు 682 మంది మృతి చెందగా 2,400మంది గల్లంతయ్యారు. ఇందులో 517 మంది విదేశీయులు గల్లంతు కాగా 287 మంది భారతీయులు ఉన్నారు. ఇప్పటివరకు 4,400 మందిని సహాయ సిబ్బంది రక్షించింది. టిబెట్‌లో చిక్కుకున్న 120 మంది భారతీయులను మరోమార్గం ద్వారా నేపాల్‌కు తరలించింది.

6:56 AM, 30 Aug 2026 (IST)

జమ్మూకశ్మీర్, లద్దాఖ్‌ సరిహద్దులో భారత్‌ సైన్యం రెస్క్యూ ఆపరేషన్‌

జమ్మూకశ్మీర్, లద్దాఖ్‌ సరిహద్దులో భారత్‌ సైన్యంలోని ఏవియేషన్ పైలెట్లు రెస్క్యూ ఆపరేషన్‌ చేపట్టారు. 18,600 అడుగుల ఎత్తులో చిక్కుకున్న ఓ బాధితుడిని సురక్షితంగా తరలించారు. హెలికాప్టర్ అడుగుభాగం కొండచరియలను తాకేలా నిలిపి సైన్యం రెస్క్యూ చేసింది.

6:55 AM, 30 Aug 2026 (IST)

సెప్టెంబర్ 7 నుంచి అసెంబ్లీ వర్షాకాల సమావేశాలు

తెలంగాణ శాసనసభ వర్షాకాల సమావేశాలకు ముహూర్తం ఖరారైంది. సెప్టెంబర్ 7వ తేదీ నుంచి అసెంబ్లీ, శాసనమండలి సమావేశాలు ప్రారంభం కానున్నాయి. ఈ మేరకు ఉభయ సభల సభ్యులకు శాసనసభ, మండలి కార్యదర్శుల నుంచి అధికారికంగా సమాచారం అందింది.

6:53 AM, 30 Aug 2026 (IST)

నేడు రాష్ట్రవ్యాప్తంగా నీట్‌ పీజీ పరీక్ష

నేడు రాష్ట్రవ్యాప్తంగా నీట్‌ పీజీ పరీక్ష జరగనుంది. రాష్ట్రవ్యాప్తంగా 56 కేంద్రాల్లో 17,627 మంది పరీక్ష రాయనున్నారు. 56 కేంద్రాల్లో పరీక్ష నిర్వహణకు రాష్ట్రప్రభుత్వం ఏర్పాట్లు పూర్తి చేసింది. ఉదయం 9 నుంచి మ.12.30 గంటల వరకు సీబీటీ విధానంలో పరీక్ష జరగనుంది. ఉదయం 7 గంటల నుంచే అభ్యర్ధులు పరీక్ష కేంద్రాల్లోకి అనుమతించనున్నారు. సెప్టెంబర్ 30న నీట్‌పీజీ ఫలితాలు విడుదలకానున్నాయి.

6:49 AM, 30 Aug 2026 (IST)

నీట్‌ పీజీ పరీక్ష సందర్భంగా హైదరాబాద్‌లో ట్రాఫిక్ రద్దీకి అవకాశం

నీట్‌ పీజీ పరీక్ష సందర్భంగా హైదరాబాద్‌లో ట్రాఫిక్ రద్దీ ఏర్పడే అవకాశం ఉంది. నగరంలో ఇవాళ ఉదయం 9 నుంచి మ.12.30 గంటల వరకు రద్దీ కొనసాగే అవకాశముంది. ప్యారడైజ్ సర్కిల్, కింగ్‌కోఠి, తాజ్‌మహల్ జంక్షన్, బండ్లగూడల రహదారుల్లో ట్రాఫిక్​ ఎక్కువగా ఉండనుంది. ఈ మేరకు విద్యార్థులు వీలైనంత త్వరగా పరీక్ష కేంద్రాలకు వెళ్లాలని అధికారులు సూచిస్తున్నారు. అత్యవసర ప్రయాణం కోసం 9010203626 నెంబర్‌కు ఫోన్‌ చేయాలని విజ్జప్తి చేస్తున్నారు.

6:47 AM, 30 Aug 2026 (IST)

గందరగోళంగా తయారైన ఓటరు జాబితా సమగ్ర సవరణ

ఓటరు జాబితా సమగ్ర సవరణ (ఎస్​ఐఆర్) గందరగోళంగా మారింది. 4.3 లక్షల మంది ఓటర్లు ఉన్నట్లు ముసాయిదా జాబితా విడుదల చేయగా 17,601 మంది ఓటర్లకు అధికారులు నోటీసులు జారీ చేశారు. తహసీల్దార్‌, గ్రామ పంచాయతీ కార్యాలయాల్లో ప్రత్యేక కౌంటర్లు ఏర్పాటు చేశారు. ఏ ఒక్క ఓటు తొలగిపోకుండా చూస్తామని అధికారులు చెబుతున్నారు.

6:45 AM, 30 Aug 2026 (IST)

తిరుపతి శ్రీహరికోట నుంచి జీఎస్‌ఎల్‌వీ-ఎఫ్‌17 ప్రయోగానికి ఇస్రో సన్నాహకాలు

తిరుపతి శ్రీహరికోట నుంచి జీఎస్‌ఎల్‌వీ-ఎఫ్‌17 ప్రయోగానికి ఇస్రో సన్నాహకాలు చేస్తోంది. సెప్టెంబర్1 న మిషన్‌ రెడినోస్ రివ్యూ, లాంచ్‌ ఆథరైజేషన్ బోర్డు సమీక్షలు నిర్వహించనుంది. సమీక్షల అనంతరం తదుపరి ప్రక్రియ చేపట్టనున్న అధికారులు తెలిపారు. ఈ రాకెట్‌ ద్వారా ఈవోఎస్‌-05ను సబ్‌-జియోసింక్రనస్ ట్రాన్స్‌ఫర్​ ఆర్బిట్‌లోకి ప్రవేశించనుంది.

6:43 AM, 30 Aug 2026 (IST)

ఉక్రెయిన్‌ రాజధాని కీవ్‌ సమీపంలో రష్యా దాడి

ఉక్రెయిన్‌ రాజధాని కీవ్‌ సమీపంలో రష్యా దాడి చేసింది. ఈ దాడుల్లో 37మంది మృతి చెందగా, దాదాపు 50 నివాస భవనాలు ధ్వంసమైనట్లు అధికారులు వెల్లడించారు. గత మూడు రోజులుగా ఉక్రెయిన్‌పై రష్యా దాడులు చేస్తోంది. ఈ దాడులతో కీవ్ ఆర్థిక వ్యవస్థ స్తంభించిపోయింది.

6:33 AM, 30 Aug 2026 (IST)

సెప్టెంబర్ 1 వరకు ఉజ్బెకిస్థాన్, కిర్గిస్థాన్‌లో ప్రధాని పర్యటన

ఎస్​సీఓ శిఖరాగ్ర సమావేశంలో పాల్గొనేందుకు ప్రధాని నరేంద్ర మోదీ శనివారం ఉజ్బెకిస్థాన్, కిర్గిస్థాన్ పర్యటనకు బయల్దేరారు. ఆగస్టు 29 నుంచి సెప్టెంబర్ 1 వరకు ఉజ్బెకిస్థాన్, కిర్గిస్థాన్‌లో ఆయన పర్యటించనున్నారు. ఉజ్బెక్ అధ్యక్షుడు షవ్కత్ మిర్జియోయెవ్ ఆహ్వానం మేరకు ఆగస్టు 29, 30 తేదీల్లో తాష్కెంట్‌లో మోదీ అధికారిక పర్యటన కొనసాగుతుంది. తాష్కెంట్ పర్యటనలో భాగంగా ఆయన లాల్‌బహదూర్ శాస్త్రి మెమోరియల్‌ను సందర్శించనున్నారని మోదీ ఎక్స్​ వేదికగా ఓ ప్రకటన విడుదల చేశారు. అలాగే తాష్కెంట్ స్టేట్ యూనివర్సిటీ ఆఫ్ ఓరియంటల్ స్టడీస్‌లోని మహాత్మాగాంధీ కేంద్రాన్ని కూడా సందర్శిస్తారని వెల్లడించారు. ఉజ్బెకిస్థాన్ పర్యటన అనంతరం మోదీ కిర్గిస్థాన్ రాజధాని బిష్కెక్‌కు వెళ్లనున్నారని ప్రకటనలో ప్రేర్కొన్నారు. కిర్గిస్థాన్ అధ్యక్షుడు సాదిర్ జాపరోవ్ ఆహ్వానం మేరకు అక్కడ జరిగే 26వ షాంఘై సహకార సంస్థ (ఎస్‌సీఓ) శిఖరాగ్ర సదస్సులో పాల్గొంటారని తెలిపారు. చివరిరోజు ప్లీనరీలో ప్రధాని మోదీ ప్రసంగించనున్నారు. రష్యా అధ్యక్షుడు పుతిన్‌తోనూ సమావేశంకానున్నారు. ఎస్‌సీవో సదస్సుకు చైనా అధ్యక్షుడు, పాక్ ప్రధాని హాజరయ్యే అవకాశం ఉంది.

Last Updated : August 30, 2026 at 9:53 PM IST