ETV Bharat / state

02-09-2026 Telangana News Today Live Updates : ఖర్గేతో అరగంట పాటు సాగిన భట్టి, ఉత్తమ్‌ చర్చలు

Telangana News Today Live Updates
Telangana News Today Live Updates (ETV Bharat)
author img

By ETV Bharat Telangana Team

Published : September 2, 2026 at 7:18 AM IST

|

Updated : September 2, 2026 at 10:53 PM IST

Choose ETV Bharat

02-08-2026 Telangana News Today Live Updates : ఈరోజు తాజా ప్రధాన వార్తల సమాచారం

LIVE FEED

10:50 PM, 2 Sep 2026 (IST)

కొండా సురేఖపై వేటు అంశం నాకేం తెలియదు: మంత్రి ఉత్తమ్‌

ఏఐసీసీ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గేతో ఉపముఖ్యమంత్రి భట్టి విక్రమార్క, ఉత్తమ్​ కుమార్ రెడ్డి భేటీ అయ్యారు. సుమారు అరగంట పాటు చర్చించారు. అనంతరం మంత్రి ఉత్తమ్​ కుమార్ రెడ్డి మాట్లాడుతూ ఖర్గేను మర్యాదపూర్వకంగా కలిసినట్లు వివరించారు. రాజకీయాలేవీ చర్చించలేదన్నారు. కొండా సురేఖపై వేటు అంశం తనకేం తెలియదన్నారు. ఏమైనా ఉంటే పార్టీ అధ్యక్షుడితో మాట్లాడాలన్నారు.

8:58 PM, 2 Sep 2026 (IST)

ఖర్గేతో సమావేశమైన భట్టి విక్రమార్క, ఉత్తమ్‌కుమార్‌రెడ్డి

దిల్లీలో ఖర్గేతో భట్టి విక్రమార్క, ఉత్తమ్‌కుమార్‌రెడ్డి సమావేశమయ్యారు. రాష్ట్రంలో రాజకీయ పరిణామాలపై ఖర్గే, భట్టి, ఉత్తమ్‌ చర్చిస్తున్నారు.

8:35 PM, 2 Sep 2026 (IST)

ఎక్సైజ్‌శాఖలో 562 మంది ఏఈఎస్, సీఐ, ఎస్‌ఐలు బదిలీలు

ఎక్సైజ్‌శాఖలో 562 మంది ఏఈఎస్, సీఐ, ఎస్‌ఐలను బదిలీలు చేశారు. పదోన్నతులతో పాటు 562 మందికి పోస్టింగ్‌లు ఎక్సైజ్‌శాఖ కమిషనర్ ఇచ్చారు.

7:23 PM, 2 Sep 2026 (IST)

ఖర్గేను కలిసిన సీఎం రేవంత్‌రెడ్డి, డిప్యూటీ సీఎం భట్టి

దిల్లీలో ఖర్గేను సీఎం రేవంత్‌రెడ్డి, డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క కలిశారు. కొండా సురేఖ వివాదం, మంత్రివర్గం విస్తరణపై చర్చించినట్లు సమాచారం. రాష్ట్రంలో పార్టీ, ప్రభుత్వ వ్యవహారాలపై చర్చించినట్లు సమాచారం. భేటీ అనంతరం ఖర్గే కారులోనే వైఎస్ఆర్ అవార్డ్‌ కార్యక్రమానికి వెళ్లారు.

7:20 PM, 2 Sep 2026 (IST)

బీఆర్‌ఎస్ నేత జక్కుల కిరణ్‌కుమార్‌పై అత్యాచారం కేసు నమోదు

బీఆర్‌ఎస్ నేత జక్కుల కిరణ్‌పై నేరెడ్‌మెట్ పీఎస్‌లో అత్యాచారం, ఎస్సీ, ఎస్టీ అట్రాసిటీ కేసు నమోదైంది. జక్కుల కిరణ్‌కుమార్ తనను మోసం చేశాడని, పెళ్లి అయిన విషయాన్ని దాచిపెట్టి తనను మోసం చేశాడని మహిళ ఫిర్యాదు చేసింది. పెళ్లి చేసుకుంటానని చెప్పి సన్నిహితంగా మెలిగాడని, వ్యాపారంలో భాగస్వామ్యం ఇస్తానంటూ డబ్బు తీసుకున్నాడని ఆరోపించింది. రూ.30 లక్షలు తీసుకుని తిరిగివ్వమని అడిగితే దూషించాడని, కులం పేరుతో దూషించాడని, తన కుమారుడిపై దాడి చేశాడని, తన ఫొటోలను మార్ఫింగ్ చేసి పరువు తీశాడని జక్కుల కిరణ్‌పై మహిళ ఫిర్యాదు చేసింది. జక్కుల కిరణ్‌పై బీఎన్‌ఎస్‌ 69, 74, 79, 115(2), 351(2) సెక్షన్ల కింద కేసు నమోదు చేశారు.

6:43 PM, 2 Sep 2026 (IST)

దిల్లీలో పలువురు కేంద్రమంత్రులను కలిసిన మంత్రి తుమ్మల నాగేశ్వరరావు

దిల్లీలో పలువురు కేంద్రమంత్రులను మంత్రి తుమ్మల నాగేశ్వరరావు కలిశారు. కేంద్ర వ్యవసాయశాఖమంత్రి శివరాజ్‌సింగ్‌ను మంత్రి కలిశారు. సాగు, రైతుల సంక్షేమ అంశాలపై కేంద్రమంత్రికి విజ్ఞప్తులు చేశారు. ఆయిల్‌పామ్‌కు కనీస హామీ ధర రూ.25 వేలు నిర్ణయించాలని విజ్ఞప్తి చేశారు. కేంద్ర గ్రామీణాభివృద్ధిశాఖ సహాయమంత్రి పెమ్మసానితో తుమ్మల భేటీ అయ్యారు. కొత్తగూడెంలో ప్రాంతీయ కొబ్బరి అభివృద్ధి బోర్డు ఏర్పాటు చేయాలని, ప్రాంతీయ ఆయిల్‌పామ్‌ పరిశోధనా కేంద్రం ఏర్పాటు చేయాలని, పీఎం-ఆర్‌కేవీవై కింద తెలంగాణకు కేటాయింపులు పెంచాలని కోరారు.

6:01 PM, 2 Sep 2026 (IST)

నర్సుపై హత్యాచారం కేసుపై జాతీయ మహిళా కమిషన్ సుమోటో విచారణ

నర్సుపై హత్యాచారం కేసుపై జాతీయ మహిళా కమిషన్ సుమోటో విచారణ జరపనుంది. ఈ ఘటనపై వారం రోజుల్లో నివేదిక ఇవ్వాలని జాతీయ మహిళా కమిషన్‌ ఆదేశించింది. రాష్ట్ర డీజీపీకి ఎన్‌సీడబ్ల్యూ ఛైర్‌పర్సన్ విజయ రహత్కర్ లేఖ రాశారు. నిందితుడిపై తక్షణమే కఠిన చర్యలు తీసుకోవాలని ఎన్‌సీడబ్ల్యూ ఆదేశించింది. కేసులో వేగవంతమైన దర్యాప్తు చేయాలని జాతీయ మహిళా కమిషన్‌ సూచించింది. పోస్టుమార్టం, ఫోరెన్సిక్, డిజిటల్ ఆధారాలను భద్రపరచాలని ఆదేశించింది. 7 రోజుల్లో యాక్షన్ టేకెన్ రిపోర్ట్ సమర్పించాలని పోలీసులకు సూచించింది.

5:11 PM, 2 Sep 2026 (IST)

కేపీహెచ్‌బీలో రూ.2.70 లక్షలు ధర పలికిన గజం భూమి

కేపీహెచ్‌బీలో గజం భూమి రూ.2.70 లక్షల ధర పలికింది. కేపీహెచ్‌బీ ఫేజ్-7లోని 16 ఎంఐజీ ప్లాట్లకు హౌసింగ్ బోర్డు వేలం వేయగా, ప్లాట్ల వేలం ద్వారా రూ.47.14 కోట్ల ఆదాయం వచ్చినట్లు హౌసింగ్ బోర్డు వీసీ వి.పి గౌతం వెల్లడించారు.

5:08 PM, 2 Sep 2026 (IST)

శంషాబాద్‌లో నకిలీ కరెన్సీ తయారు చేస్తున్న ముఠా అరెస్టు

శంషాబాద్‌లో నకిలీ కరెన్సీ తయారు చేస్తున్న ముఠాను పోలీసులు అరెస్టు చేశారు. సామాజిక మాధ్యమాల్లో చూసి నకిలీ నోట్లు తయారు చేస్తున్న ఒకే కుటుంబానికి చెందిన ముగ్గురిని అరెస్టు చేయగా, మరో వ్యక్తి పరారీలో ఉన్నాడు. నిందితుల నుంచి రూ.2.91 లక్షల విలువ జేసే నకిలీ కరెన్సీ స్వాధీనం చేసుకున్నారు. నకిలీ రూ.500, రూ.200, రూ.100 నోట్లు తయారీ చేస్తున్న కుటుంబం, ఎక్కువగా రాత్రివేళల్లో నకిలీ నోట్లు చెలామణి చేస్తున్నట్లు గుర్తించారు. మద్యం దుకాణాలు, పాన్‌ డబ్బాల వద్ద నకిలీ నోట్లు ఇస్తున్నట్లు గుర్తించారు. నిందితుల నుంచి కలర్‌ ప్రింటర్‌, ఇంక్‌ డబ్బాలు, పేపర్‌ స్వాధీనం చేసుకున్నారు.

4:30 PM, 2 Sep 2026 (IST)

నేను చెప్పాల్సినవన్నీ పార్టీ పెద్దలకు చెప్పాను : మంత్రి కొండా సురేఖ

తాను చెప్పాల్సినవన్నీ పార్టీ పెద్దలకు చెప్పానని మంత్రి కొండా సురేఖ పేర్కొన్నారు. తనకు షోకాజ్‌ నోటీసు ఇవ్వడమే తప్పన్నారు. తన వివరణ అంతా కేసీ వేణుగోపాల్‌కు వాట్సప్‌ చేశానన్నారు. పార్టీ ఏం నిర్ణయం తీసుకుంటుందనేది తనకు తెలియదని, తన కుమార్తె వ్యాఖ్యల గురించి ఏమీ మాట్లాడనని అన్నారు. సుస్మిత వ్యాఖ్యలను ఖండించటం, సమర్థించటం చేయనన్న సురేఖ, ఒక ఇండిపెండెంట్‌ మహిళ మాట్లాడవద్దని చెప్పే హక్కు తనకు లేదన్నారు. తన కుమార్తె కావడంతో తనను బాధ్యురాలిని చేయటం సరికాదన్నారు.

3:33 PM, 2 Sep 2026 (IST)

ఖర్గేను కలిశాను - ఏం చేస్తారో వేచి చూస్తున్నా : మంత్రి కొండా సురేఖ

ఏఐసీసీ అధ్యక్షుడు మల్లిఖార్జున ఖర్గేను కలిసినట్లు మంత్రి కొండా సురేఖ వెల్లడించారు. కేసీ వేణుగోపాల్​తో ఇంకా మాట్లాడలేదని, వాళ్లు ఏం చేస్తారో అని వేచి చూస్తున్నానని తెలిపారు. అధిష్ఠానం పిలుపు మేరకు దిల్లీ వెళ్లిన కొండా సురేఖ, అక్కడ మీడియాతో ఇష్టాగోష్టిగా మాట్లాడారు. 'నన్ను రాజీనామా చేయమని ఇప్పటివరకు చెప్పలేదు. బీసీనైన నాకు ఒక న్యాయం. ఇతర సామాజికవర్గాలకు మరో న్యాయం పాటిస్తారా? కేబినెట్​లో ఉన్న ఇతర సామాజికవర్గాల వారిపై అనేక ఆరోపణలు పెద్ద ఎత్తున ఉన్నాయి. మరి వాటన్నింటికీ ఏం సమాధానం చెబుతారు. ఏం చర్యలు తీసుకుంటారు. మొత్తం జరుగుతున్న అన్ని వ్యవహారాలపైన ఇప్పటికే ఖర్గే, రాహుల్, ప్రియాంక గాంధీ సహా అధిష్ఠాన ముఖ్యులందరికీ అన్ని విషయాలు రాతపూర్వకంగానూ తెలియజేశాను. అన్ని విషయాలు పరిగణనలోకి తీసుకోండని ఇవాళ ఖర్గేను కలిసిన సందర్భంగా చెప్పాను' అని స్పష్టం చేశారు.

2:34 PM, 2 Sep 2026 (IST)

రైతును రాజును చేసేలా పరిపాలన : పొంగులేటి

1000 రోజుల పాలనపై మంత్రులు మీడియా సమావేశం ఏర్పాటు చేశారు. ప్రజాపాలనకు వెయ్యి రోజులు అయ్యిందని, సామాన్య ప్రజల కష్టాలు తీర్చేందుకు కృషి చేశామని మంత్రి పొంగులేటి శ్రీనివాస్​ రెడ్డి పేర్కొన్నారు. ముఖ్యమైన అనేక అభివృద్ధి కార్యక్రమాలు చేపట్టామన్నారు. ప్రజల అవసరాలకు అనుగుణంగా పరిపాలన చేశామన్న ఆయన, గత ప్రభుత్వం పెట్టిన బకాయిలను చెల్లించామని తెలిపారు. రైతును రాజును చేసేలా పరిపాలన చేస్తున్నామని స్పష్టం చేశారు.

2:24 PM, 2 Sep 2026 (IST)

కరీంనగర్: వ్యవసాయ బావిపైకి దూసుకెళ్లిన ఆర్టీసీ బస్సు - తప్పిన ప్రమాదం

కరీంనగర్ జిల్లా చిగురుమామిడి మండలం సుందరగిరి శివారులో పెను ప్రమాదం తప్పింది. సుందరగిరి శివారులో వ్యవసాయ బావిపైకి ఆర్టీసీ బస్సు దూసుకెళ్లింది. బావిపై ఉన్న ఇనుప చువ్వలకు తగిలి బస్సు ఆగిపోయింది. ఘటనలో ప్రయాణికులు స్వల్ప గాయాలతో బయటపడ్డారు. కరీంనగర్ నుంచి హుస్నాబాద్‌ వెళ్తుండగా ఈ ఘటన చోటుచేసుకుంది.

2:23 PM, 2 Sep 2026 (IST)

ఏఐసీసీ అధ్యక్షుడు ఖర్గేను కలిసిన సీఎం రేవంత్‌రెడ్డి

సీఎం రేవంత్‌ రెడ్డి ఏఐసీసీ అధ్యక్షుడు ఖర్గే, ఏఐసీసీ ప్రధాన కార్యదర్శి జైరాం రమేశ్‌ను కలిశారు. అనంతరం కేంద్రమంత్రి రామ్మోహన్‌నాయుడితో సీఎం భేటీ అయ్యారు. ఆదిలాబాద్, మామునూరు సహా ఇతర ఎయిర్‌పోర్టులపై చర్చించారు.

2:18 PM, 2 Sep 2026 (IST)

కీసర మాజీ సబ్‌రిజిస్ట్రార్‌ యూసఫ్‌ ఉర్‌ రెహ్మాన్‌ అరెస్ట్

కీసర మాజీ సబ్‌రిజిస్ట్రార్‌ యూసఫ్‌ ఉర్‌ రెహ్మాన్‌ అరెస్టయ్యారు. స్థిరాస్తి నకిలీ రిజిస్ట్రేషన్ కేసులో యూసఫ్‌ ఉర్‌ రెహ్మాన్​ను పోలీసులు అరెస్టు చేశారు. ఇప్పటి వరకు రూ.4.11 కోట్ల మోసాలకు పాల్పడినట్లు గుర్తించారు. నకిలీ రిజిస్ట్రేషన్లు, హౌసింగ్‌ లోన్లు తీసుకొని మోసాలకు పాల్పడినట్లు కీసరలో నమోదైన ఈ కేసులో యూసఫ్​ రెహమాన్​ ఏ9గా ఉన్నారు.

1:46 PM, 2 Sep 2026 (IST)

హైదరాబాద్‌లో సెప్టెంబర్ 4న మాంసం దుకాణాలు మూసివేత

సెప్టెంబర్ 4న హైదరాబాద్‌లో మాంసం దుకాణాలు మూసివేయనున్నారు. మాంసం దుకాణాల మూసివేయాలని జీహెచ్​ఎంసీ ఆదేశాలు జారీ చేసింది. శ్రీకృష్ణ జన్మాష్టమి సందర్భంగా మాంసం దుకాణాలు మూసివేయాలని ఆదేశించింది.

1:45 PM, 2 Sep 2026 (IST)

తెలంగాణ భవన్‌లో రాఖీ వేడుకలు

తెలంగాణ భవన్‌లో రాఖీ వేడుకలు నిర్వహించారు. పలువురు మహిళా నేతలు కేటీఆర్‌కు రాఖీలు కట్టి శుభాకాంక్షలు తెలిపారు. రక్షాబంధన్‌ రోజు విదేశాల్లో ఉండడంతో కేటీఆర్​ అందుబాటులో లేరు. విదేశాల నుంచి వచ్చిన తర్వాత మొదటిసారి తెలంగాణ భవన్‌కు రావడంతో పలువురు మహిళా నేతలు కేటీఆర్​కు రాఖీ కట్టారు.

1:43 PM, 2 Sep 2026 (IST)

దిల్లీ: రక్షణమంత్రి రాజ్‌నాథ్‌సింగ్‌తో సీఎం రేవంత్‌రెడ్డి భేటీ

దిల్లీ: రక్షణమంత్రి రాజ్‌నాథ్‌సింగ్‌తో సీఎం రేవంత్‌రెడ్డి భేటీ అయ్యారు. ఇన్వెస్ట్ తెలంగాణ గ్లోబ‌ల్ స‌మ్మిట్‌-2026కు రాజ్‌నాథ్‌సింగ్‌ను ఆహ్వానించిన సీఎం, గ్లోబల్ సమ్మిట్ రక్ష ఎక్స్‌పోలో భాగ‌స్వాములు కావాలని విజ్ఞప్తి చేశారు. దేవ‌ర‌క‌ద్ర డీఆర్‌డీఎల్ ప్రాజెక్టుకు ఉచితంగా భూమి కేటాయించాలని కోరిన సీఎం, ఆదిలాబాద్‌ విమానాశ్రయానికి సంబంధించి రాజ్‌నాథ్‌తో చర్చించారు. విమానాశ్రయానికి ఇప్పటికే 750 ఎకరాలు భూసేకరణ చేపట్టినట్లు తెలిపిన సీఎం, మరో 750 ఎకరాలు సేకరించేందుకు సిద్ధంగా ఉన్నట్లు అంగీకారం తెలిపారు.

12:36 PM, 2 Sep 2026 (IST)

మేడ్చల్ జిల్లాలో ఐదుగురు నకిలీ వైద్యులు అరెస్ట్

మేడ్చల్ జిల్లాలో ఐదుగురు నకిలీ వైద్యులను పోలీసులు అరెస్ట్ చేశారు. నకిలీ వైద్యులను అదుపులోకి తీసుకున్న కుత్బుల్లాపూర్‌ ఎస్‌వోటీ పోలీసులు నిందితుల నుంచి వైద్య పరికరాలు, నకిలీ మందులు స్వాధీనం చేసుకున్నారు. ఎలాంటి డిగ్రీలు లేకుండా అల్లోపతి మందులు విక్రయిస్తున్నట్లు గుర్తించారు.

11:48 AM, 2 Sep 2026 (IST)

రాష్ట్రంలో దరిద్రం దండయాత్ర మొదలుపెట్టి 1000 రోజులు : కేటీఆర్

కాంగ్రెస్‌ 1000 రోజుల పాలన కాదని, ఇది పీడన అని బీఆర్​ఎస్​ కార్యనిర్వాహక అధ్యక్షుడు కేటీఆర్ మండిపడ్డారు. రాష్ట్రంలో దరిద్రం దండయాత్ర మొదలుపెట్టి వెయ్యి రోజులు అయ్యిందని విమర్శించారు. అన్ని రంగాల్లో కాంగ్రెస్ ప్రభుత్వం విఫలమైందని, కాంగ్రెస్‌ వెయ్యి రోజుల పాలన క్రిమినల్ వేస్ట్ అని వ్యాఖ్యానించారు. కాంగ్రెస్‌ది రైతులను రాచిరంపాన పెడుతున్న రాక్షస పాలన అంటూ ధ్వజమెత్తారు.

11:47 AM, 2 Sep 2026 (IST)

1000 రోజుల కాంగ్రెస్ పాలనపై ఛార్జిషీట్‌ విడుదల చేసిన బీఆర్‌ఎస్

1000 రోజుల కాంగ్రెస్ పాలనపై బీఆర్​ఎస్​ ఛార్జిషీట్‌ విడుదల చేసింది. మాజీ మంత్రి కేటీఆర్ తెలంగాణ భవన్‌లో ఛార్జిషీట్ విడుదల చేశారు. కార్యక్రమంలో హరీశ్‌ రావు, తలసాని, సబితా ఇంద్రారెడ్డి తదితరులు పాల్గొన్నారు.

11:44 AM, 2 Sep 2026 (IST)

యాదాద్రి: ఆస్పత్రిలో ఉన్న బీజేపీ కార్యకర్తలకు రాంచందర్​రావు పరామర్శ

యాదాద్రి : ఆస్పత్రిలో ఉన్న బీజేపీ కార్యకర్తలను ఆ పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు రాంచందర్​రావు పరామర్శించారు. ఇటీవల బీజేపీ-కాంగ్రెస్ నేతల ఘర్షణలో పలువురు గాయపడగా, ఆసుపత్రికి వెళ్లి వారిని పరామర్శించారు.

11:43 AM, 2 Sep 2026 (IST)

దిల్లీ: కేసీ వేణుగోపాల్​తో మహేశ్‌కుమార్‌గౌడ్, మీనాక్షి నటరాజన్ భేటీ

దిల్లీ: మహేశ్‌ కుమార్‌ గౌడ్, మీనాక్షి నటరాజన్ దిల్లీలోని ఇందిరాభవన్ చేరుకున్నారు. కేసీ వేణుగోపాల్‌తో భేటీ అయ్యారు. కాంగ్రెస్‌ సంస్థాగత అంశాలు, 1000 రోజుల పాలనపై చర్చిస్తామని మహేశ్‌ గౌడ్ పేర్కొన్నారు. కొండా సురేఖ అంశమూ చర్చకు వచ్చే అవకాశం ఉందన్నారు. కాంగ్రెస్ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గేనూ కలుస్తామని స్పష్టం చేశారు.

10:46 AM, 2 Sep 2026 (IST)

హైదరాబాద్​ బాచుపల్లి పీఎస్‌ పరిధిలోని కౌసల్య కాలనీలో నకిలీ వైద్యుడు

హైదరాబాద్​లోని బాచుపల్లి పీఎస్‌ పరిధిలోని కౌసల్య కాలనీలో నకిలీ వైద్యుడు ఇంటర్మీడియట్ చదివి గీత క్లినిక్ నిర్వహిస్తున్నాడు. నకిలీ డాక్టర్ నారాయణను ఎస్‌వోటీ బృందం పోలీసులకు అప్పగించారు.

10:44 AM, 2 Sep 2026 (IST)

హైదరాబాద్‌ మైలార్‌దేవుపల్లిలో రౌడీషీటర్‌ దారుణ హత్య : కత్తులతో పొడిచి చంపిన దుండగులు

హైదరాబాద్‌లోని మైలార్‌దేవుపల్లిలో రౌడీషీటర్‌ దారుణ హత్యకు గురయ్యారు. రౌడీషీటర్ మహ్మద్ ఖాజీ సోహెల్‌ను దుండగులు కత్తులతో పొడిచి చంపారు. నిందితులను గుర్తించేందుకు పోలీసులు సీసీ ఫుటేజీ పరిశీలిస్తున్నారు.

10:40 AM, 2 Sep 2026 (IST)

తిరుమల శ్రీవారి ఆలయ డిప్యూటీ ఈవో లోకనాథం ఇంట్లో ఏసీబీ తనిఖీలు

తిరుమల తిరుపతి దేవస్థానం డిప్యూటీ ఈవో మెండు లోకనాథం నివాసంలో ఏసీబీ అధికారులు సోదాలు నిర్వహించారు. ఆదాయానికి మించి అస్తుల ఆరోపణల నేపథ్యంలో ఇవాళ ఉదయం నుంచి తిరుపతి పెదకాపు లేఔట్‌లోని లోకనాథం ఇంటితో పాటు ఆయన బంధువుల ఇళ్లలోనూ ఏకకాలంలో తనిఖీలు చేపట్టారు. ఏసీబీ డీఎస్పీ శ్రీనివాసరావు ఆధ్వర్యంలో ఉదయం 6 గంటల నుంచి 7 బృందాలుగా ఏర్పడిన అధికారులు తనిఖీలు చేస్తున్నారు.

10:36 AM, 2 Sep 2026 (IST)

భద్రాద్రి: గోవులను తరలిస్తున్న కంటైనర్ స్వాధీనం

భద్రాద్రిలో గోవులను తరలిస్తున్న కంటైనర్‌ను భాగ్యనగర్ గో రక్షక్ బృందం పట్టుకున్నారు. దమ్మపేట శివారులో పట్టుబడిన కంటైనర్‌లో వందకుపైగా గోవులు ఉన్నాయి. ఒడిశా నుంచి హైదరాబాద్‌కు అక్రమంగా గోవులను తరలిస్తున్నారు.

9:55 AM, 2 Sep 2026 (IST)

వేములవాడ సబ్‌రిజిస్ట్రార్ కార్యాలయానికి తాళం వేసిన యజమాని

వేములవాడ సబ్‌రిజిస్ట్రార్ కార్యాలయానికి యజమాని తాళం వేశారు. అద్దె రూ.60 వేలు, కరెంట్ బిల్లు రూ.2 లక్షలు చెల్లించాలని యజమాని ఆరోపించారు. అద్దె, కరెంట్ బిల్లు చెల్లించాకే భవనం యజమాని తాళం తీస్తానంటున్నారు. సబ్‌రిజిస్ట్రార్ కార్యాలయాన్ని ప్రభుత్వ భవనంలోకి తరలించేందుకు ఏర్పాట్లు చేస్తున్నారు.

9:11 AM, 2 Sep 2026 (IST)

రంగారెడ్డి: బాలాపూర్‌లో రూ.2.90 లక్షల నకిలీ కరెన్సీ నోట్లు స్వాధీనం

రంగారెడ్డి జిల్లా బాలాపూర్ పోలీస్​ స్టేషన్ పరిధిలో నిర్వహించిన తనిఖీలలో రూ. 25 లక్షల విలువైన నకిలీ కరెన్సీ నోట్లు స్వాధీనం చేసుకున్నారు. పోలీసులు నకిలీ కరెన్సీ నోట్లు చెలామణి చేస్తున్న ముగ్గురిని అరెస్టు చేసి, దర్యాప్తు చేస్తున్నారు.

8:40 AM, 2 Sep 2026 (IST)

నేడు రక్షణమంత్రి రాజ్‌నాథ్‌సింగ్‌ను భేటీకానున్న సీఎం రేవంత్‌రెడ్డి

ఇవాళ సీఎం రేవంత్‌రెడ్డి రక్షణమంత్రి రాజ్‌నాథ్‌సింగ్‌ను భేటీకానున్నారు. డిఫెన్స్‌ కంపెనీలతో ఒప్పందాలతో చర్చించనున్నారు.

8:36 AM, 2 Sep 2026 (IST)

కామారెడ్డిలో 310 క్వింటాళ్ల రేషన్ బియ్యాం

కామారెడ్డి జిల్లాలోని భిక్కనూరు శివారులో 310 క్వింటాళ్ల రేషన్‌ బియ్యాన్ని పౌరసరఫరాల శాఖ అధికారులు స్వాధీనం చేసుకున్నారు. బియ్యం విలువ రూ.9 లక్షలు ఉంటుందని అంచనా. హైదరాబాద్ నుంచి గుజరాత్‌కు రేషన్ బియ్యం తరలిస్తుండగా స్వాధీనం చేసుకున్నారు.

7:08 AM, 2 Sep 2026 (IST)

సీఎం రేవంత్‌రెడ్డి సహా ముఖ్యనేతలంతా దిల్లీలోనే మకాం

ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి సహా తెలంగాణ కాంగ్రెస్‌కు చెందిన పలువురు ముఖ్య నేతలు దేశ రాజధాని దిల్లీలో మకాం వేశారు. రాష్ట్ర మంత్రివర్గ విస్తరణ, ఒకరిద్దరు మంత్రులపై వేటు, పార్టీ అంతర్గత పరిణామాలు, అసెంబ్లీ వర్షాకాల సమావేశాల వ్యూహాలపై చర్చించేందుకు కాంగ్రెస్ అధిష్ఠానం పిలుపు మేరకు నేతలంతా దిల్లీ చేరుకున్నారు.

7:08 AM, 2 Sep 2026 (IST)

నేడు కేసీ వేణుగోపాల్‌తో సీఎం రేవంత్‌రెడ్డి మరోసారి భేటీ

నేడు ఉదయం 11 గం.కు కేసీ వేణుగోపాల్‌తో సీఎం రేవంత్‌రెడ్డి మరోసారి భేటీ కానున్నారు. రాష్ట్రంలో జరుగుతున్న తాజా రాజకీయ పరిణామాలు, కాంగ్రెస్ పార్టీ అంతర్గత వ్యవహారాలపై ఇరువురి మధ్య సుదీర్ఘ చర్చలు జరిగనున్నాయి.

7:03 AM, 2 Sep 2026 (IST)

హైదరాబాద్‌లో అర్ధరాత్రి నుంచి మొదలైన ఆర్టీసీ నైట్‌ బస్‌ సర్వీసులు

హైదరాబాద్‌లో అర్ధరాత్రి నుంచి ఆర్టీసీ నైట్‌ బస్‌ సర్వీసులు మొదలయ్యాయి. రాత్రి 10 నుంచి ఉదయం 5 వరకు ఆర్టీసీ నైట్‌ బస్‌ సర్వీసులు నడవనున్నాయి. ప్రతి 30నిమిషాల నుంచి గంటవ్యవధిలో బస్సులు ఉండేలా అధికారులు ఏర్పాట్లు చేశారు. తొలిదశలో 6 ప్రధాన మార్గాల్లో రాత్రి సర్వీసులు మొదలయ్యాయి.

7:03 AM, 2 Sep 2026 (IST)

కాంగ్రెస్ వెయ్యి రోజుల పాలనపై నేటి నుంచి బీఆర్ఎస్ పోరుబాట - 7 రోజుల పాటు కార్యక్రమాలు

కాంగ్రెస్ ప్రభుత్వం వెయ్యి రోజుల పాలన పూర్తి చేసుకున్న సందర్భంగా బీఆర్ఎస్ పార్టీ రాష్ట్రవ్యాప్తంగా నిరసన కార్యక్రమాలకు పోరుబాట ప్రారంభించింది. వారం రోజుల పాటు గులాబీ పార్టీ వివిధ కార్యక్రమాలు చేయనుంది. హామీల అమలు, సర్కార్ పాలనా వైఫల్యాలను ప్రజల్లోకి తీసుకెళ్లేలా కార్యక్రమాలు చేయనున్నారు. కాంగ్రెస్ పాలనపై ఇవాళ హైదరాబాద్‌లో ఛార్జ్ షీట్ కేటీఆర్ విడుదల చేయనున్నారు. ఆరు గ్యారెంటీల వైఫల్యాలపై ఇవాళ నియోజకవర్గ కేంద్రాల్లో ధర్నాలు, భారీ ఫ్లెక్సీల ప్రదర్శన చేయనున్నారు. ప్రజలకు బకాయి ఉన్న హామీలను గుర్తుచేస్తూ బాకీ కార్డుల పంపిణీ బీఆర్ఎస్ చేయనుంది.

6:51 AM, 2 Sep 2026 (IST)

ఉక్రెయిన్​పై రష్యా క్షిపణుల దాడి - భారతీయుడు మృతి

ఉక్రెయిన్‌ రాజధాని కీవ్ లక్ష్యంగా రష్యా విరుచుకుపడింది. ఏకధాటిగా 12 గంటల పాటు బాలిస్టిక్, క్రూయిజ్ క్షిపణులు, 218 డ్రోన్లతో దాడులు చేసింది. రష్యా దాడుల్లో కీవ్‌లోని ముగ్గురు చిన్నారులు సహా 12 మంది మృతి చెందారు. నాలుగన్నరేళ్ల యుద్ధంలో కీవ్‌పై రష్యా భారీస్థాయిలో దాడులు జరగడం ఇదే తొలిసారి. పౌరులే లక్ష్యంగా రష్యా దాడులకు తెగబడిందని ఉక్రెయిన్ ఆరోపించింది. రైల్వే డిపోపై బాలిస్టిక్ క్షిపణి పడటంతో ఆరుగురు ఉద్యోగులు మృతి చెందినట్లు ఇరాన్​ పేర్కొంది. వీరిలో భారత పౌరుడు కూడా ఉన్నట్లు ఉక్రెయిన్ అధ్యక్షుడు జెలెన్‌స్కీ వెల్లడించారు.

6:51 AM, 2 Sep 2026 (IST)

ఇరాన్​పై అమెరికా దళాలు మళ్లీ దాడులు

పశ్చిమాసియాలో మరోసారి యుద్ధ మేఘాలు కమ్ముకున్నాయి. నెలరోజుల విరామం తర్వాత ఇరాన్‌ లక్ష్యంగా అమెరికా దళాలు దాడులకు దిగాయి. ఇరాన్‌ రెవల్యూషనరీ గార్డ్‌ కోర్‌ లక్ష్యంగా అమెరికా భీకర దాడులు చేసింది. అమెరికా దాడుల్లో చిన్నారి సహా నలుగురు మృతిచెందినట్లు ఇరాన్ తెలిపింది. వాణిజ్య నౌకలు సహా సైనికులపై దాడులకు ఐఆర్‌జీసీ ప్రయత్నం చేసిందని యూఎస్​ఏ తెలిపింది. ప్రతికారంగా జోర్డాన్‌లోని అమెరికా స్థావరాలపైకి ఇరాన్ క్షిపణులను ప్రయోగించింది. తమ జలాల మీదుగా వచ్చిన ఇరాన్ డ్రోన్‌ను అడ్డుకున్నట్లు యూఏఈ వెల్లడించింది. అమెరికాకు తగిన గుణపాఠం చెబుతామని ఇరాన్‌ సుప్రీం లీడర్‌ మొజాబ్తా ఖమేని పేర్కొన్నారు.

6:51 AM, 2 Sep 2026 (IST)

నేపాల్‌కు మరో వరదముప్పు

నేపాల్‌కు మరో వరదముప్పు పొంచి ఉంది. తూర్పు, పశ్చిమ ప్రాంతాల్లో నదులలో నీటిమట్టాలు పెరుగుతున్నాయి. నదీతీర ప్రాంతాల ప్రజలు సురక్షిత ప్రాంతాలకు వెళ్లాలని ప్రభుత్వం హెచ్చరికలు జారీ చేస్తుంది.

6:47 AM, 2 Sep 2026 (IST)

బొల్లారం మద్రాస్‌ రెజిమెంట్‌లో ఆయుధాల చోరీ కేసులో కొనసాగుతున్న దర్యాప్తు

బొల్లారం 20 మద్రాస్‌ రెజిమెంట్‌లో జరిగిన భారీ ఆయుధాల చోరీ కేసుపై పోలీసులు, ఆర్మీ ఉన్నతాధికారులు సంయుక్తంగా అత్యంత గోప్యంగా, ముమ్మరంగా దర్యాప్తు జరుపుతున్నారు. ఆగస్టు 30 రాత్రి సమయంలో కట్టుదిట్టమైన భద్రత ఉండే ఆయుధాగారం తాళాలు పగలగొట్టి ఈ చోరీకి పాల్పడ్డారు. అందులో 12 తుపాకులు దొంగలించారు.

6:46 AM, 2 Sep 2026 (IST)

కుటుంబ కలహాలతో డీజిల్ పోసుకుని నిప్పంటించుకున్న వివాహిత

వికారాబాద్ జిల్లా పరిగి మండలం తొండపల్లిలో కుటుంబ కలహాలతో డీజిల్ పోసుకుని వివాహిత సుజాత నిప్పంటించుకుంది. మంటలార్పి సుజాతను భర్త యాదయ్య, స్థానికులు ఆస్పత్రికి తరలించారు. సుజాత పరిస్థితి విషమంగా ఉండడంతో వైద్యులు చికిత్సను అందిస్తున్నారు.

6:45 AM, 2 Sep 2026 (IST)

భూపాలపల్లి జిల్లాలో పెట్రోల్ పోసుకొని వ్యక్తి ఆత్మహత్య

భూపాలపల్లి జిల్లాలోని కొయ్యూరు సమీపంలోని నాగులమ్మ అటవీ ప్రాంతంలో పెట్రోల్ పోసుకొని వ్యక్తి ఆత్మహత్య చేసుకున్నాడు. మృతుడు పెద్దపల్లి జిల్లా రామగిరికి చెందిన బత్తుల కష్టచైతన్య (32)గా పోలీసులు గుర్తించారు.

6:39 AM, 2 Sep 2026 (IST)

మలేరియా మాత్రలు వికటించి ఒకరు మృతి - 53 మందికి అస్వస్థత

పోలవరం జిల్లాలోని ఎటపాక మండలం గొల్లగుప్పలో మలేరియా నివారణ మాత్రలు వికటించడంతో ఒకరు మృతి చెందారు. మరో 53 మందికి అస్వస్థత. మృతురాలు గొల్లగుప్పకు చెందిన రెండో తరగతి విద్యార్థిని జమున (7). బాధితుల్లో 46 మంది చిన్నారులు ఉండగా, ఏడుగురు పెద్దవారు ఉన్నారు. ఇవాళ 71 మందికి క్లోరోఫిన్ మాత్రలు వైద్య సిబ్బంది పంపిణీ చేసింది. బాధితులకు భద్రాచలం ఏరియా ఆస్పత్రిలో చికిత్సను అందించారు. బాధితుల ఆరోగ్య పరిస్థితి నిలకడగా ఉందని కలెక్టర్ దినేష్ కుమార్ తెలిపారు.

Last Updated : September 2, 2026 at 10:53 PM IST