28th June 2026 News Today AP Live News Updates: శ్రీకాకుళం జిల్లా భావనపాడు సముద్రంలో మునిగి ఇద్దరు మృతి

By ETV Bharat Andhra Pradesh Team
Published : June 28, 2026 at 7:13 AM IST
|Updated : June 28, 2026 at 10:48 PM IST
28th June 2026 News Today AP Live News Updates : ఈరోజు ఏపీ తాజా ప్రధాన వార్తల సమాచారం
LIVE FEED
శ్రీకాకుళం జిల్లా భావనపాడు సముద్రంలో మునిగి ఇద్దరు మృతి
శ్రీకాకుళం జిల్లా భావనపాడు సముద్రంలో మునిగి ఇద్దరు మృతి చెెందారు. స్నానం కోసం సముద్రంలోకి దిగి అలల ఉద్ధృతికి ఇద్దరు విద్యార్థులు గల్లంతయ్యారు. మృతులు విశాఖకు చెందిన అగస్త్య, విజయనగరం జిల్లాకు చెందిన యశ్వంత్‌గా గుర్తించారు. విద్యార్థుల మృతిపై మంత్రి అచ్చెన్నాయుడు దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు.
సీఎం సంక్షేమం, అభివృద్ధి విషయంలో వెనకడుగు వేయట్లేదు: మంత్రి నారాయణ
కాకినాడ జిల్లా జగ్గంపేటలో టీడీపీ జిల్లా కార్యవర్గ సమావేశం జరిగింది. సమావేశంలో మంత్రి నారాయణ, జ్యోతుల నవీన్ పాల్గొన్నారు. జిల్లాలో పార్టీ పరిస్థితి, ప్రభుత్వ పథకాల అమలు తీరు, పార్టీ బలోపేతంపై ప్రధానంగా చర్చించారు. 'సీఎం సంక్షేమం, అభివృద్ధి విషయంలో వెనకడుగు వేయట్లేదు. అర్హులందరికీ సంక్షేమ పథకాలు అందేలా చర్యలు తీసుకున్నాం. జిల్లాలో పార్టీని మరింత బలోపేతం చేసేలా అందరూ కృషి చేయాలని' నారాయణ అన్నారు.
అమెరికా వరదల్లో తెలుగు యువకుడు గల్లంతు
అమెరికాలో వరదల్లో గల్లంతైన బాపట్ల జిల్లాకు చెందిన యువకుడి ఆచూకీ కోసం చర్యలు తీసుకోవాలని పర్చూరు ఎమ్మెల్యే ఏలూరి సాంబశివరావు కోరారు. ఈ మేరకు కేంద్ర, రాష్ట్ర మంత్రులకు ఆయన లేఖలు రాశారు. పర్చూరు మండలం దేవరపల్లికి చెందిన దొప్పలపూడి రాంబాబు కుమారుడు వెంకటేశ్ ప్రస్తుతం అమెరికాలోని ఒమాహా నగరంలో నివాసముంటున్నాడు. ఇటీవల భారీ వర్షాలు, వరదల కారణంగా కాన్సాస్ రాష్ట్రం వెల్లింగ్టన్ సమీపంలోని ఎస్.ఆలివర్ రోడ్ ప్రాంతంలో వెంకటేశ్ కొట్టుకుపోయాడు. యువకుడి ఆచూకీ ఇంకా లభ్యం లేదు. ఈ విషయాన్ని యువకుడి కుటుంబసభ్యుల ద్వారా తెలుసుకున్న ఎమ్మెల్యే.. గాలింపు చేపట్టేలా చర్యలు తీసుకోవాలని కోరుతూ కేంద్రమంత్రులు రామ్మోహన్ నాయుడు, పెమ్మసాని చంద్రశేఖర్, రాష్ట్ర మంత్రి నారా లోకేశ్‌కు లేఖలు రాశారు. గల్లంతైన వెంకటేశ్ ఆచూకీ కోసం గాలింపు చర్యలు చేపట్టేలా అమెరికా రాయబార కార్యాలయంతో సంప్రదింపులు జరపాలని రామ్మోహన్‌నాయుడు, పెమ్మసాని చంద్రశేఖర్‌ను ఏలూరి సాంబశివరావు కోరారు. రాష్ట్ర ప్రభుత్వం తరఫున ఈ విషయాన్ని కేంద్రం దృష్టికి తీసుకెళ్లాలని లోకేశ్‌కు ఎమ్మెల్యే విజ్ఞప్తి చేశారు.
దేశ రాజకీయాల్లో వెంకయ్య చూపించిన చొరవ అసామాన్యం: కొల్లు రవీంద్ర
మాశర్మ వెంకయ్య నాయుడు వ్యక్తిత్వాన్ని చక్కగా ఆవిష్కరించారని మంత్రి కొల్లు రవీంద్ర పేర్కొన్నారు. సాధారణ రైతు కుటుంబంలో పుట్టి ఆయన ఉన్నత శిఖరాలు అధిరోహించారని చెప్పారు. దేశ రాజకీయాల్లో వెంకయ్య చూపించిన చొరవ అసామాన్యమని కొల్లు రవీంద్ర వివరించారు.
చెప్పాల్సిన విషయాన్ని సూటిగా చెప్పడం రాజకీయ నేతలు నేర్చుకోవాలి : వెంకయ్యనాయుడు
చెప్పాల్సిన విషయాన్ని సూటిగా చెప్పడం రాజకీయ నేతలు నేర్చుకోవాలని వెంకయ్యనాయుడు అన్నారు. జై ఆంధ్ర ఉద్యమం నాడే రాష్ట్ర విభజన జరిగి ఉంటే ఇవాళ ఏపీ ఎక్కడో ఉండేదని, రెండు రాష్ట్రాలు బాగా అభివృద్ధి చెందేవన్నారు. విభజన అనివార్యం అని తెలిసిందని, నేను ఏదో రకంగా విభజన అడ్డుకుంటానని అందరూ అనుకున్నారన్నారు. కాంగ్రెస్ సీనియర్ నాయకులు నా వద్దకు వచ్చి మాట్లాడారని, పార్టీ సిద్ధాంతానికి అనుగుణంగా వ్యవహరిస్తామని చెప్పానని స్పష్టం చేశారు.
అమరావతి ఘర్షణలో లేళ్ల అప్పిరెడ్డి అనుచరులు గుర్తింపు
అమరావతి ఘర్షణల్లో వైఎస్సార్సీపీ నేత లేళ్ల అప్పిరెడ్డి అనుచరులను పోలీసులు గుర్తించారు. ఆయన ప్రధాన అనుచరుడు నూనె ఉమామహేశ్వరరెడ్డి ఇందులో పాల్గొన్నాడు. గతంలో టీడీపీ ఆఫీస్‌పై దాడికి ఇతనే వాహనాలు సమకూర్చాడు. తాజాగా అమరావతి దాడిలోనూ తన అనుచరులతో కలిసి ఉమామహేశ్వరరెడ్డి పాల్గొన్నాడు. కాగా ఈ ఘర్షణల ఘటనలో ఇప్పటికే వైఎస్సార్సీపీ నేత పానుగంటి చైతన్యను పోలీసులు గుర్తించిన సంగతి తెలిసిందే.
రాష్ట్రంలో మరో రెండు రోజులపాటు మోస్తరు నుంచి భారీ వర్షాలు
రాష్ట్రంలో మరో రెండు రోజులపాటు మోస్తరు నుంచి భారీ వర్షాలు కురుస్తాయని విపత్తుల సంస్థ తెలిపింది. ఉత్తరాంధ్ర నుంచి మహారాష్ట్ర వరకు ఒక ద్రోణి, కర్ణాటక నుంచి కొమోరిన్ వరకు మరో ద్రోణి విస్తరించి ఉన్నాయి. దీని ప్రభావంతో రేపు కోస్తాంధ్రలో మోస్తరు వర్షాలు పడతాయని తెలిపింది. రాయలసీమలో పలుచోట్ల తేలికపాటి జల్లులు కురుస్తాయని వెల్లడించింది. పిడుగులు పడే అవకాశం ఉన్నందున రైతులు ఎట్టి పరిస్థితుల్లోనూ చెట్ల కింద ఉండొద్దని విపత్తుల సంస్థ హెచ్చరించింది.
అమరావతి మహిళలు గొడ్డలి మూకలకు తగిన గుణపాఠం చెప్పారు: మంత్రి సంధ్యారాణి
అమరావతి మహిళలు గొడ్డలి మూకలకు తగిన గుణపాఠం చెప్పారని మంత్రి సంధ్యారాణి అన్నారు. గత జగన్ పాలనలో మహిళలు ఎన్నో దాడులు, అవమానాలు భరించారని గుర్తుచేశారు. గొడ్డలి బ్యాచ్ అంటే భయపడే రోజులు పోయాయన్నారు. ఇప్పుడు మహిళలు ఎదురించి తిరగబడే రోజులు వచ్చాయని స్పష్టం చేశారు. రాష్ట్రంలో వైసీపీ నేతల కుట్రలకు ఇక కాలం చెల్లిందని మంత్రి విమర్శించారు.
జగన్ వైఖరి మార్చుకోని అమరావతికి సహకరించాలి: సీపీఐ నేత రామకృష్ణ
"ప్రతిపక్ష హోదాలో అమరావతికి జగన్ స్వాగతం పలికారు. జగన్ అధికారంలోకి రాగానే మూడు రాజధానులన్నారు. ఇప్పుడు మావిగాన్ అంటూ ప్రజలను గందరగోళానికి గురిచేస్తున్నారు. జగన్ వైఖరి మార్చుకోని అమరావతికి సహకరించాలి" అంటూ సీపీఐ నేత రామకృష్ణ హితవుపలికారు.
విజయవాడలో 'వెంకయ్య నాయకుడు' పుస్తక పరిచయ కార్యక్రమం
విజయవాడలో సీనియర్ పాత్రికేయులు మాశర్మ రచించిన 'వెంకయ్య నాయకుడు' పుస్తక పరిచయ కార్యక్రమం జరిగింది. వెంకయ్య నాయుడు జీవన ప్రస్థానాన్ని ఆవిష్కరిస్తూ ఈ పుస్తకాన్ని రచించారు. పుస్తక పరిచయ కార్యక్రమానికి మాజీ ఉపరాష్ట్రపతి వెంకయ్య నాయుడు హజరయ్యారు. కార్యక్రమంలో మంత్రి కొల్లు రవీంద్ర, సుజనా చౌదరి, గద్దె రామ్మోహన్‌రావు, బొండా ఉమామహేశ్వరరావు, కామినేని శ్రీనివాసరావు తదితరులు పాల్గొన్నారు.
పేరుపాలెం వద్ద సముద్రంలో స్నానానికి వెళ్లి యువకుడు మృతి
పశ్చిమ గోదావరి జిల్లా పేరుపాలెం వద్ద సముద్రంలో స్నానానికి వెళ్లి యువకుడు మృతి చెందాడు. మృతుడు మహేశ్వరరావుగా పోలీసులు గుర్తించారు.
రహదారి పక్కన బజ్జీలు తిని వాంతులు, విరేచనాలకు గురైన బాధితులు
కాకినాడ జిల్లా కాజులూరు మండలం దుగ్గుదూరులో రహదారి పక్కన బజ్జీలు తిని 23 మందికి అస్వస్థతకు లోనయ్యారు. బాధితులు వాంతులు, విరేచనాలకు గురికావడంతో ఆసుపత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు.
సంక్షేమం, అభివృద్ధి రెండు కళ్లుగా ప్రభుత్వం ముందడుగు వేస్తోంది: గొట్టిపాటి
అద్దంకిలో మంత్రి గొట్టిపాటి రవికుమార్ పర్యటించారు. సంతమాగులూరు పుట్టవారిపాలెం క్యాంప్ కార్యాలయంలో సీఎంఆర్ఎఫ్ చెక్కుల పంపిణీ చేశారు. 103 మంది లబ్ధిదారులకు సీఎంఆర్ఎఫ్ చెక్కులు, 27 మందికి ఎల్‌వోసీ పత్రాలు అందించారు. సీఎం సహాయనిధి పేదల పాలిట వరంగా మారిందని చెప్పారు. సంక్షేమం, అభివృద్ధి రెండు కళ్లుగా ప్రభుత్వం ముందడుగు వేస్తోందని గొట్టిపాటి పేర్కొన్నారు.
అమరావతిపై జగన్ కుట్రలను ప్రజలు క్షమించరు: ఎంపీ కలిశెట్టి అప్పలనాయుడు
'అమరావతిపై జగన్ కుట్రలను ప్రజలు క్షమించరు. జగన్ కుట్రలు, విధ్వంసకర ఆలోచనలు మరోసారి బయటపడ్డాయి. జగన్ ఐదేళ్లు అమరావతిని పూర్తిగా నిర్వీర్యం చేశారు. గతంలో ఉద్యమించిన మహిళలను బూటు కాళ్లతో తొక్కించారు. కొద్ది నెలల్లోనే భారీగా అభివృద్ధి పనులు ప్రారంభంకానున్నాయని' ఎంపీ కలిశెట్టి అప్పలనాయుడు పేర్కొన్నారు.
బాపట్ల జిల్లాలో రోడ్డు ప్రమాదం - ఇద్దరు మృతి
బాపట్ల జిల్లా రేపల్లె మండలం ఓల్డ్‌టౌన్ రోడ్డు ప్రమాదం చోటుచేసుకుంది. రెండు బైకులు ఢీకొని ఇద్దరు మృతి చెందగా మరొకరి పరిస్థితి విషమంగా ఉంది.
తోతాపురి మామిడి రైతులను ఆదుకోవాలంటూ కేంద్రానికి సీఎం లేఖ
కేంద్రమంత్రి శివరాజ్‌సింగ్ చౌహాన్‌కు సీఎం చంద్రబాబు లేఖ రాశారు. తోతాపురి మామిడి రైతులను ఆదుకోవాలంటూ కేంద్రానికి సీఎం లేఖ రాశారు. మామిడి పల్ప్ ఎగుమతులు నిలిచిపోయాయని లేఖలో పేర్కొన్నారు. తోతాపురి మామిడి రైతులకు కేంద్రం అండగా నిలవాలని కోరారు. మామిడి రైతుల కోసం ప్రైస్ డెఫిషియన్సీ పేమెంట్ స్కీం అమలు చేయాలని విజ్ఞప్తి చేశారు. తోతాపురి రైతులను ఆదుకునేలా రూ.281 కోట్ల ఆర్థికసాయం చేయాలన్నారు. 7.03 లక్షల మెట్రిక్ టన్నుల కొనుగోళ్లకు రూ.281 కోట్ల ఆర్థికసాయం చేయాలని లేఖలో వివరించారు.
మద్యం తాగడానికి డబ్బులు ఇవ్వలేదని భార్యను చంపిన భర్త
అనంతపురం జిల్లా శెట్టూరు మండలం గొల్లపల్లిలో దారుణం చోటుచేసుకుంది. మద్యం మత్తులో భార్యను చంపిన భర్త. మద్యం తాగడానికి డబ్బులు ఇవ్వలేదని నిందితుడు ఈ ఘాతుకానికి పాల్పడ్డాడు.
పిల్లల పెంపకంలో తండ్రి బాధ్యత తీసుకోవాలి: సీఎం చంద్రబాబు
మనకు మళ్లీ ఉమ్మడి కుటుంబ వ్యవస్థ రావాలని సీఎం చంద్రబాబు పేర్కొన్నారు. పిల్లల పెంపకంలో తండ్రి బాధ్యత తీసుకోవాలన్నారు. పరిస్థితులు మారాయని, ఇప్పుడు సంతానం భారం కాదని, సంపదని చెప్పారు. చిన్నారులకు పోలియో చుక్కలు వేసి తల్లిదండ్రులతో ముఖ్యమంత్రి మాట్లాడారు.
బుట్టాయగూడెం నుంచి తెలంగాణ ప్రాంతం వైపు వెళ్లిన పెద్దపులి
ఏలూరు జిల్లా బుట్టాయగూడెం నుంచి తెలంగాణ ప్రాంతం వైపు పెద్దపులి వెళ్లింది. అశ్వారావుపేట మండలం కావిడగుల్ల, కంట్లంలో బెబ్బులి సంచరిస్తుంది. రేడియో కాలర్ ద్వారా పెద్దపులి సంచారాన్ని అటవీ శాఖ అధికారులు గుర్తించారు. పులిని పాపికొండల అడవుల్లోకి పంపేందుకు వైల్డ్‌లైఫ్ బృందం దిల్లీ నుంచి వచ్చింది.
అనకాపల్లి జిల్లాలో 2 ఫిష్ ల్యాండింగ్ సెంటర్లకు శంకుస్థాపన చేసిన మంత్రులు
అనకాపల్లి జిల్లాలో 2 ఫిష్ ల్యాండింగ్ సెంటర్లకు మంత్రులు అనిత, జనార్దన్‌రెడ్డి శంకుస్థాపన చేశారు. బోయపాడు, దొండవాకలో వీటిని నిర్మించనున్నారు. 'జెట్టీ కోసం మత్స్యకారులు ఎన్నో ఏళ్లుగా ఎదురుచూస్తున్నారు. 'రాష్ట్రవ్యాప్తంగా 3 కేటాయిస్తే ఈ ప్రాంతానికే 2 తీసుకొచ్చాం. కూటమి ప్రభుత్వంలో అభివృద్ధి, సంక్షేమానికి పెద్దపేట వేశాం. రెండేళ్లలో పాయకరావుపేటను రూ.600 కోట్లతో అభివృద్ధి చేశాం. ఎన్నికల్లోనే పార్టీలు తర్వాత అభివృద్ధి, సంక్షేమంపైనే దృష్టి. మత్స్యకార గ్రామాలను అన్ని విధాలుగా అభివృద్ధి చేస్తామని' మంత్రి అనిత పేర్కొన్నారు.
'గొడ్డలి పార్టీ నేతలు ఎప్పుడైనా అభివృద్ధి గురించి మాట్లాడారా? అభివృద్ధిని చూసి ఓర్వలేక ఇష్టానుసారం మాట్లాడుతున్నారు. వేల మత్స్యకార కుటుంబాలకు ఈ జెట్టీలు ఎంతో ఉపయోగపడతాయి. వైఎస్సార్సీపీ నాయకులు రాజధాని పనులకు అడ్డు తగులుతున్నారని' మంత్రి జనార్దన్‌రెడ్డి మండిపడ్డారు.
స్మార్ట్ కిచెన్ల ద్వారా ప్రభుత్వ బడుల్లో మంచి భోజనం పెడుతున్నాం: లోకేశ్
స్మార్ట్ కిచెన్ల ద్వారా ప్రభుత్వ బడుల్లో మంచి భోజనం పెడుతున్నామని మంత్రి లోకేశ్ తెలిపారు. " మహిళలు, పేదలకు ఉపాధి కల్పిస్తుంటే జగన్ తట్టుకోలేకపోతున్నారు. కడప జిల్లాలో 5 స్మార్ట్ కిచెన్లను పైలట్ ప్రాజెక్టుగా చేపట్టాం. హెడ్ కుక్స్, అసిస్టెంట్ కుక్స్, హెల్పర్లు, డ్రైవర్లకు ఉపాధి కల్పిస్తున్నాం. స్మార్ట్ కిచెన్లలో వేలమందికి ఉపాధి కల్పిస్తుంటే జగన్‌కు బాధ ఎందుకు?. పేదలు బాగుపడితే చూడలేకపోతున్నారా? జగన్?. కడప జిల్లాలో 3,450 మందికి వేతనాలు పూర్తిగా చెల్లించాం. మే నెలలో వేసవి సెలవుల వల్ల వేతనాలు చెల్లింపు ఉండదని తెలియదా? " అని మంత్రి లోకేశ్ అన్నారు.
ఆటోను ఢీకొన్న లారీ - ముగ్గురు మహిళలు మృతి
శ్రీకాకుళం జిల్లా కవిటి మండలం జమేదారిపుట్టుగ వద్ద ఆటోను లారీ ఢీకొట్టింది. ఈ ఘటనలో ఆటోలో ప్రయాణిస్తున్న ముగ్గురు మహిళలు మృతి చెందారు.
వైఎస్సార్సీపీ నేతల పర్యటనలో రౌడీషీటర్లు పాల్గొన్నట్లు గుర్తించిన పోలీసులు
వైఎస్సార్సీపీ నేతల నిన్నటి అమరావతి పర్యటనలో రౌడీషీటర్లు పాల్గొన్నట్లు పోలీసులు గుర్తించారు. గతంలో టీడీపీ కార్యాలయంపై దాడి చేసిన వారే నిన్న రైతులపై దాడి, కవ్వింపు చర్యల్లో పాల్గొన్నట్లు గుర్తించారు. పోలీసు కానిస్టేబుల్‌పై దాడి వెనకా ఆ రౌడీ బ్యాచే ఉందనే అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. తొలుత రాళ్ల దాడికి పాల్పడి రైతుల్ని రెచ్చకొట్టింది వైఎస్సార్సీపీ వెంట వచ్చిన రౌడీషీటర్లే అనే కోణంలో పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. గతంలో టీటీపీ ఆఫీస్‌పై దాడికి పాల్పడిన చైతన్య నిన్న వైఎస్సార్సీపీ నేతల వెంటా ఉన్నట్లు ఇప్పటికే పోలీసులు గుర్తించారు. ఈ ఘటనలోనే వైఎస్సార్సీపీ నేతల్ని నిలువరిస్తున్న పోలీసు అధికారిని ఆ పార్టీ నేత అంబటి రాంబాబు కాలర్ పట్టుకుని తోసేశారు. పోలీసుల్ని తోస్తూ వీడియోలో అంబటి అడ్డంగా దొరికిపోయారు. దీనిపైనా మరిన్ని ఆధారాలను పోలీసులు సేకరిస్తున్నారు.
రాష్ట్రవ్యాప్తంగా పల్స్ పోలియో కార్యక్రమం ప్రారంభం
రాష్ట్రవ్యాప్తంగా "పల్స్ పోలియో" కార్యక్రమం ప్రారంభమైంది. ఐదేళ్లలోపు వయసున్న పిల్లలకు తల్లిదండ్రులు పోలియో చుక్కలు వేస్తున్నారు. రాష్ట్రంలో 49.20 లక్షల మంది పిల్లలకు పోలియో చుక్కలు వేయనున్నారు. రైల్వేస్టేషన్లు, బస్ స్టాండ్లు, విమానాశ్రయాలు, మార్కెట్లు వంటి రద్దీ ప్రదేశాల్లో పోలియో చుక్కల కేంద్రాలు ఏర్పాటు చేశారు. దీంతో ఎన్టీఆర్, పశ్చిమగోదావరి, కోనసీమ జిల్లాల్లో పల్స్ పోలియో కార్యక్రమం కొనసాగుతోంది. ఆరోగ్యకరమైన సమాజ ఏర్పాటుకు రెండు పల్స్ పోలియో చుక్కలు అమృతం లాంటివని పశ్చిమగోదావరి జిల్లా కలెక్టర్ నాగరాణి అన్నారు. తణుకులో పల్స్ పోలియో కార్యక్రమాన్ని ఆమె ప్రారంభించారు. అధికారులతో కలిసి పిల్లలకు పోలియో చుక్కలు వేశారు. పోలియో రహిత సమాజాన్ని నిర్మించడంలో భాగస్వాములు కావాలని ఎమ్మెల్యే కాగిత కృష్ణ ప్రసాద్ అన్నారు. కృష్ణా జిల్లా పెడనలో బంటుమిల్లి బస్టాండ్ నందు "పల్స్ పోలియో" కార్యక్రమాన్ని ఆయన ప్రారంభించారు. రాష్ట్రవ్యాప్తంగా అన్ని ప్రధాన కూడలిలో పల్స్ పోలియో సెంటర్‌లు ఉన్నాయన్నారు.
టీటీడీకి భారీగా విరాళాలు ప్రకటించిన అనంత్ అంబానీ
టీటీడీకి అనంత్ అంబానీ భారీగా విరాళాలు ప్రకటించారు. టీటీడీకి 25 ఎలక్ట్రిక్ బస్సులు, 50 మంది బస్సు డ్రైవర్ల జీతభత్యాలు రిలయన్స్ చెల్లించనుంది. అలాగే తిరుమలలో ఛార్జింగ్ స్టేషన్లను రిలయన్స్ సంస్థ ఏర్పాటు చేయనుంది. అదేవిధంగా గుజరాత్ వంతారాలో ఉన్నట్లు టీటీడీ గోశాల ఆధునికీకరణకు అంగీకారం తెలిపింది. టీటీడీ అదనపు ఈవో వెంకయ్యచౌదరి చొరవతో అనంత్ అంబానీ భారీ విరాళం ప్రకటించారు.
తిరుమల : టోకెన్లు లేని భక్తులకు సర్వదర్శనానికి 30 గంటల సమయం
తిరుమలలో భక్తుల రద్దీ కొనసాగుతుంది. టోకెన్లు లేని భక్తులకు సర్వదర్శనానికి 30 గంటల సమయం పడుతోంది. కంపార్టుమెంట్లు నిండి బాటగంగమ్మ క్యూలైన్ వరకు భక్తులు వేచివున్నారు. నిన్న శ్రీవారిని 85,582 మంది భక్తులు దర్శించుకున్నారు. అలాగే నిన్న శ్రీవారి హుండీ ఆదాయం రూ.3.76 కోట్లు వచ్చింది. నిన్న శ్రీవారికి 44,155 మంది భక్తులు తలనీలాలు సమర్పించారు. నిన్న 4.66 లక్షల లడ్డూ ప్రసాదాల విక్రయం అయ్యాయి.
ఉండవల్లి ఘటనపై 3 కేసులు నమోదు చేసిన తాడేపల్లి పోలీసులు
ఉండవల్లి ఘటనపై తాడేపల్లి పోలీసులు 3 కేసులు నమోదు చేశారు. పెనుమాక వాసి ఫిర్యాదు మేరకు వైఎస్సార్సీపీ నేతలపై అట్రాసిటీ కేసు నమోదు చేశారు. అలాగే విధుల్లో ఉన్న పోలీసు అధికారిని నెట్టినందుకు అంబటిపై కేసు నమోదు చేశారు. వైఎస్సార్సీపీ నేత కారు అద్దం పగలగొట్టిన రైతులపై కేసు నమోదు చేశారు.
మేడ్చల్: గృహ ప్రవేశం జరిగిన ఇంటిపై సామూహిక దాడి
మేడ్చల్: తెలంగాణలోని మేడ్చల్ జిల్లాలో గృహ ప్రవేశం జరిగిన ఇంటిపై సామూహిక దాడి జరిగింది. బోడుప్పల్ దేవేంద్రనగర్‌లో కుటుంబంపై దుండగుల సామూహిక దాడికి పాల్పడ్డారు. ఇంట్లోకి చొరబడి మహిళలు, పిల్లలు, వృద్ధులపై దాడి చేశారు. గృహప్రవేశానికి వచ్చిన బంధువుల్లో పలువురికి తీవ్రగాయాలు అయ్యాయి. కర్రలు, రాళ్లతో దాడి చేసినట్లు బాధితుల ఆరోపిస్తున్నారు. దుండగుల దాడిలో వాహనం ధ్వంసమైనట్లు ఆవేదన వ్యక్తం చేశారు. 40-50 మంది దుండగులు దాడికి పాల్పడినట్లు బాధితులు ఆరోపిస్తున్నారు.
ద్రోణి ప్రభావంతో పలు జిల్లాల్లో వర్షాలు - దక్షిణకోస్తా తీరప్రాంతంపై ఉపరితల ఆవర్తనం
రాష్ట్ర తీరప్రాంతం నుంచి మహారాష్ట్ర వరకు ద్రోణి విస్తరించింది. దీంతో నేడు రాష్ట్రంలోని పలు జిల్లాల్లో వర్షాలు కురిసే అవకాశం ఉంది. పలు జిల్లాల్లో మోస్తరు నుంచి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉంది. పశ్చిమ మధ్య బంగాళాఖాతం, దక్షిణకోస్తా తీరప్రాంతంపై ఉపరితల ఆవర్తనం విస్తరించింది. వీటి ప్రభావంతో రేపు పలు జిల్లాల్లో మోస్తరు నుంచి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని, గాలులుతో ప్రజలు అప్రమత్తంగా ఉండాలని రాష్ట్ర విపత్తుల నిర్వహణ సంస్థ సూచించింది. శ్రీకాకుళం, ఎన్టీఆర్, అనంతపురం, సత్యసాయి, కడప, అన్నమయ్య, చిత్తూరు, తిరుపతి జిల్లాల్లో తేలికపాటి వర్షాలు కురిసే అవకాశం ఉంది. 20 జిల్లాల్లో తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉంది.
బారా షహీద్ దర్గాలో మూడో రోజు రొట్టెల పండుగ
నెల్లూరులో మూడో రోజు రొట్టెల పండుగ సందడిగా కొనసాగుతోంది. బారా షహీద్ దర్గా భక్తులతో కిటకిటలాడుతోంది. లక్షల మంది భక్తులు వేర్వేరు ప్రాంతాల నుంచి రొట్టెల పండుగకు వచ్చి మొక్కులు తీర్చుకున్నారు. నేడు రొట్టెల పండుగలో ప్రధాన కార్యక్రమం జరుగనుంది.
రాష్ట్రవ్యాప్తంగా పల్స్ పోలియో - 49.20 లక్షల మంది పిల్లలకు పోలియో చుక్కలు
నేడు రాష్ట్రవ్యాప్తంగా పల్స్ పోలియో కార్యక్రమం నిర్వహించనున్నారు. దాదాపు 49.20 లక్షల మంది పిల్లలకు పోలియో చుక్కలు వేసేందుకు విస్తృత ఏర్పాట్లు చేస్తున్నారు. ఉండవల్లి క్యాంప్ ఆఫీసులో సీఎం చంద్రబాబు పల్స్ పోలియో కార్యక్రమాన్ని ప్రారంభించనున్నారు. విశాఖలో మంత్రి సత్యకుమార్ యాదవ్ పల్స్ పోలియో కార్యక్రమంలో పాల్గొననున్నారు.

