27-05-2026 Telangana News Today Live Updates : పరిశ్రమల యజమానులు, కార్మికులతో బండి సంజయ్ సమావేశం

Published : May 27, 2026 at 7:10 AM IST
|Updated : May 27, 2026 at 10:52 PM IST
27-05-2026 Telangana News Today Live Updates : ఈరోజు తెలంగాణ తాజా ప్రధాన వార్తల సమాచారం.
LIVE FEED
పరిశ్రమల యజమానులు, కార్మికులతో బండి సంజయ్ సమావేశం
హనుమకొండ జిల్లా మడికొండ టెక్స్‌టైల్ పార్కును కేంద్రమంత్రి బండి సంజయ్ సందర్శించారు. పరిశ్రమల యజమానులు, కార్మికులతో బండి సంజయ్ సమావేశమయ్యారు. టెక్స్‌టైల్ యూనిట్ల సమస్యలు తెలుసుకున్నారు. పరిశ్రమల యాజమాన్యాలకు బండి సంజయ్ పలు సూచనలు చేశారు.
మడికొండ టెక్స్‌టైల్ పార్కు సందర్శించిన బండి సంజయ్
హనుమకొండ జిల్లా మడికొండ టెక్స్‌టైల్ పార్కును కేంద్ర మంత్రి బండి సంజయ్ సందర్శించారు. పరిశ్రమల యజమానులు, కార్మికులతో సమావేశమయ్యారు. టెక్స్‌టైల్ యూనిట్ల సమస్యలు తెలుసుకున్నారు. అనంతరం పరిశ్రమల యాజమాన్యాలకు సూచనలు చేశారు.
ముగ్గురు కుమార్తెలతో కలిసి అదృశ్యమైన తల్లి
మెదక్ జిల్లాలో ముగ్గురు కుమార్తెలతో కలిసి తల్లి శిరీష అదృశ్యమైంది. ఈ నెల 24 నుంచే వీరు అదృశ్యమయ్యారు. భార్య, కుమార్తెల అదృశ్యంపై శిరీష భర్త స్వామి పోలీసులకు ఫిర్యాదు చేశారు.
ముస్లింలకు బక్రీద్ శుభాకాంక్షలు తెలిపిన కేసీఆర్
ముస్లింలకు మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ బక్రీద్ శుభాకాంక్షలు తెలిపారు. బక్రీద్ త్యాగం, దానగుణానికి ప్రతీక అని అన్నారు. ప్రజల్లో శాంతి, సహనం, సౌభ్రాతృత్వం పెంపొందాలని కేసీఆర్ ఆకాంక్షించారు.
తుమ్మిడిహట్టి బ్యారేజీపై మహారాష్ట్ర సీఎంకు రేవంత్‌రెడ్డి లేఖ
తుమ్మిడిహట్టి బ్యారేజీపై మహారాష్ట్ర సీఎంకు రేవంత్‌రెడ్డి లేఖ రాశారు. ఈ బ్యారేజీపై మహారాష్ట్రతో చర్చించేందుకు సిద్ధమన్న రేవంత్.. ఇందుకోసం తెలంగాణ ప్రతినిధులకు సమయం ఇవ్వాలని కోరారు. ఆ అంశంపై ఇరువురూ చర్చించాల్సిన అవసరం ఉందన్న రేవంత్‌రెడ్డి.. గతంలో 148 మీటర్ల ఎఫ్‌ఆర్‌ఎల్‌కు మహారాష్ట్ర ప్రభుత్వం అంగీకరించిందని లేఖలో పేర్కొన్నారు.
అయితే దీని వల్ల ఉత్తర తెలంగాణ నీటి అవసరాలు తీరవని చెప్పారు. ఎఫ్‌ఆర్‌ఎల్ పెరిగితే గ్రావిటీ ద్వారా తెలంగాణకు నీళ్లొస్తాయని రేవంత్ లేఖలో పేర్కొన్నారు. ఈ పెంపుతో మహారాష్ట్రలో ముంపు ప్రభావం తక్కువేనన్న రేవంత్ రెడ్డి తెలిపారు. ఈ అంశాలపై చర్చించేందుకు తేదీ ఖరారు చేయాలని లేఖలో కోరారు.
జలమండలి వాటర్ ట్యాంకర్ బుకింగ్ సేవలకు అంతరాయం
జలమండలి వాటర్ ట్యాంకర్ బుకింగ్ సేవలకు అంతరాయం కలిగింది. సాంకేతిక సమస్యల వల్ల ఇబ్బందులు తలెత్తాయి. ఐవీఆర్‌ఎస్ ద్వారా ట్యాంకర్లు బుక్ చేసుకోవాలని జలమండలి సూచించింది.
దళిత క్రైస్తవులకు ఎస్సీ హోదా కల్పించాలి : మందకృష్ణ మాదిగ
దళిత క్రైస్తవులకు ఎస్సీ హోదాపై అధ్యయనానికి ఏర్పాటు చేసిన జస్టిస్ కేజీ బాలకృష్ణన్ కమిటీకి మందకృష్ణ మాదిగ నివేదిక సమర్పించారు. దళిత క్రైస్తవులకు ఎస్సీ హోదా కల్పించాలని విజ్ఞప్తి చేశారు. ఈ సందర్భంగా 1950 నాటి రాష్ట్రపతి ఉత్తర్వులు, ఇతర అంశాలు ప్రస్తావించారు. సమస్య పరిష్కారానికి కొన్ని ప్రతిపాదనలు సమర్పించారు.
సినీపరిశ్రమలో సద్దుమణిగిన పర్సంటేజీల వివాదం
సినీపరిశ్రమలో పర్సంటేజీల వివాదం సద్దుమణిగింది. చిరంజీవితో ఎగ్జిబిటర్ల సమావేశం ముగిసిన అనంతరం.. 'పెద్ది' చిత్రాన్ని రెంటల్ విధానంలోనే ప్రదర్శించాలని ఎగ్జిబిటర్లు నిర్ణయం తీసుకున్నారు. అయితే జూన్ 30 తర్వాత విడుదలయ్యే చిత్రాలకు పర్సంటేజీ విధానం వర్తించనుంది. తెలంగాణ ఎగ్జిబిటర్ల నిర్ణయం పట్ల చిరంజీవి హర్షం వ్యక్తం చేశారు. ఫిలిం ఛాంబర్ కమిటీ నివేదిక మేరకు నడుచుకోవాలని సూచించారు.
బాల్కసుమన్ వ్యాఖ్యలపై కేంద్రమంత్రి కిషన్‌రెడ్డి ఆగ్రహం
బీఆర్‌ఎస్ నేత బాల్కసుమన్ వ్యాఖ్యలపై కేంద్రమంత్రి కిషన్‌రెడ్డి ఆగ్రహం వ్యక్తం చేశారు. బాధ్యతారాహిత్యమైన వ్యాఖ్యలు చేశారన్నారు. సింగరేణి భవనాలు కాలబెట్టండి, రైలుపట్టాలు కోయండనడం సరికాదని కిషన్‌రెడ్డి సూచించారు. యువతను హింస, విధ్వంసం వైపు ప్రేరేపిస్తున్నారన్నారు.
నేతలు చేసే ఏ విమర్శ అయినా.. చట్టానికి లోబడి ఉండాలని కేంద్రమంత్రి కిషన్‌రెడ్డి అభిప్రాయం వ్యక్తం చేశారు. ప్రభుత్వ ఆస్తులు ధ్వంసం చేయాలనడం చట్టవ్యతిరేక చర్యన్న కిషన్‌రెడ్డి... అధికారం పోయాక బీఆర్‌ఎస్‌లో అసహనం పెరిగిపోయిందని విమర్శించారు.
టీఫైబర్ ప్రాజెక్టుపై వీడియో కాన్ఫరెన్స్
టీఫైబర్ ప్రాజెక్టుపై కేంద్రమంత్రి జ్యోతిరాధిత్యతో సీఎం వీడియో కాన్ఫరెన్స్ లో పాల్గొన్నారు. మంత్రి శ్రీధర్‌బాబు, సీఎస్ రామకృష్ణారావు హాజరయ్యారు.
విద్యుత్‌రంగాన్ని ప్రైవేటీకరించే కుట్ర: హరీశ్‌రావు
ఎలక్ట్రిసిటీ రెగ్యులేటరీ కమిషన్‌కు మాజీమంత్రి హరీశ్‌రావు లేఖ రాశారు. మూడో డిస్కమ్ ఏర్పాటుపై తొందరపాటు నిర్ణయం తీసుకున్నారని అందులో పేర్కొన్నారు. డిస్కమ్ ఏర్పాటు వెనుక విద్యుత్ రంగాన్ని ప్రైవేటీకరించే కుట్ర ఉందని ఆరోపించారు. 'రైతు డిస్కమ్' ఏర్పాటుపై ప్రజాభిప్రాయం తీసుకోలేదన్న హరీశ్.. డిస్కమ్ ఏర్పాటు చేయాలని రైతులు ఎవరూ కోరలేదన్నారు. ఈ నిర్ణయం రైతుల సంక్షేమం కోసం కాదని.. కొత్త డిస్కమ్‌లో క్రాస్ సబ్సిడీ లేనందున ప్రభుత్వంపై భారం పడుతుందన్నారు.మూడో డిస్కమ్ లైసెన్స్ దరఖాస్తును తిరస్కరించాలని హరీశ్‌రావు కోరారు.
చొక్కాలు పట్టుకొని కొట్టుకున్న కాంగ్రెస్ నేతలు
గాంధీభవన్‌లో హైదరాబాద్ జిల్లా కాంగ్రెస్ నేతల సమావేశంలో ఘర్షణ చోటుచేసుకుంది. మంత్రులు అజారుద్దీన్, పొన్నం ముందే చొక్కాలు పట్టుకొని కాంగ్రెస్ నేతలు కొట్టుకున్నారు. మంత్రి అజారుద్దీన్ పక్కన కూర్చునే అంశంలో ఫిరోజ్‌ఖాన్, కార్వాన్ ఉస్మాన్ అల్ హజ్రీ మధ్య వివాదం చోటుచేసుకుంది. ఉస్మాన్ అల్ హజ్రీ తోసేయడంతో ఫిరోజ్‌ఖాన్ కిందపడిపోయారు. ఈ ఘటనను అడ్డుకొనేందుకు ప్రయత్నించిన సీనియర్ నేత వీహెచ్ ను కూడా తోసేసేందుకు యత్నించగా.. అక్కడున్ననేతలు అడ్డుకున్నారు. ఘర్షణ నేపథ్యంలో సమావేశం నుంచి మంత్రి అజారుద్దీన్ వెళ్లిపోయారు. గొడవ కారణంగా సమావేశం ముగిసినట్లు మంత్రి పొన్నం ప్రకటన చేశారు.
ప్రధాని మోదీని కలిసిన తమిళనాడు సీఎం విజయ్
దిల్లీ సేవాతీర్థ్‌లో ప్రధాని మోదీతో తమిళనాడు సీఎం విజయ్ భేటీ అయ్యారు. సీఎం అయ్యాక తొలిసారి ప్రధానిని కలిశారు. మోదీతో భేటీ అనంతరం సీఎం విజయ్ కాంగ్రెస్ అగ్రనేతలను కలవనున్నారు.
చిరంజీవితో మరోసారి తెలంగాణ ఎగ్జిబిటర్ల సమావేశం
చిరంజీవితో తెలంగాణ ఎగ్జిబిటర్లు మరోసారి సమావేశం అయ్యారు. పర్సంటేజీ విధానంపై చిరంజీవితో చర్చిస్తున్నారు. ఈ సమావేశంలో తమ నిర్ణయాన్ని చిరంజీవికి వివరించనున్నారు. రెండు రోజుల క్రితమే ఈ అంశంపై చిరంజీవితో పలువురు సమావేశం అయ్యారు.
మేం ఇళ్లు కట్టినట్లు నిరూపిస్తే మీరు పోటీ చేయకుండా ఉంటారా? : పొంగులేటి
ఇందిరమ్మ ఇళ్ల పంపిణీపై మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి కీలక వివరాలు వెల్లడించారు. ఇప్పటికే సుమారు లక్షకుపైగా ఇళ్లు నిర్మాణం పూర్తయ్యాయని.. జూన్ చివరికి మరో లక్ష ఇళ్లు పూర్తవుతాయని తెలిపారు. జీహెచ్ఎంసీ పరిధిలో స్థలం కొరత కారణంగా కేవలం 18 వేల ఇళ్లనే మంజూరు చేసినట్లు తెలిపారు.
గత ప్రభుత్వం పట్టణాలకు దూరంగా ఇళ్లు నిర్మించడంతో.. పేదలకు ఇబ్బంది కలిగిందని మంత్రి అన్నారు. గత ప్రభుత్వం నియోజకవర్గానికి 10 ఇళ్లు కూడా కట్టలేదని విమర్శించారు. పేదల జీవనోపాధికి అనుగుణంగా ఉండే ప్రాంతాల్లో ఇళ్లు నిర్మిస్తామని తెలిపారు. ఒక్క రూపాయి ఫీజు తీసుకోకుండా మహిళల పేరుమీదుగా రిజిస్ట్రేషన్ చేస్తామన్నారు. సీఎం చేతులమీదుగా పేదలకు ఇళ్ల పంపిణీ చేస్తామన్నారు.
తొలిదశలో హైదరాబాద్‌లో లక్ష ఇళ్లు ఇవ్వాలని లక్ష్యంగా పెట్టుకున్నామని మంత్రి తెలిపారు. ఇందుకోసం 13 ప్రాంతాల్లో స్థలాలు పరిశీలించామన్నారు. కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడ్డాక నియోజకవర్గానికి 3,500 ఇళ్లకుపైగా ఇచ్చామని, రెండో విడతలో నియోజకవర్గానికి 2 వేల ఇళ్లు ఇస్తామన్నారు.
పట్టణాల్లో బీఆర్‌ఎస్ కంటే కాంగ్రెస్ ప్రభుత్వమే ఎక్కువ ఇళ్లు నిర్మించిందని.. అయితే మాజీ మంత్రి హరీశ్‌రావు తాము పట్టణాల్లో ఇళ్లే నిర్మించలేదని విమర్శలు చేస్తున్నారన్నారు. ఒకవేళ కాంగ్రెస్ ప్రభుత్వం ఇళ్లు కట్టలేదని నిరూపిస్తే తాను ఎన్నికల్లో పోటీచేయనని.. మేం ఇళ్లు కట్టినట్లు నిరూపిస్తే మీరు పోటీ చేయకుండా ఉంటారా? అంటూ సవాల్ విసిరారు.
అద్దె బస్సు డ్రైవర్ తొలగింపు వివాదం.. జగిత్యాల డీఎం బదిలీ
అద్దె బస్సు డ్రైవర్ తొలగింపు ఘటనలో కీలక పరిణామం చోటుచేసుకుంది. జగిత్యాల ఆర్టీసీ డిపో మేనేజర్ కల్పనను ఆర్టీసీ అధికారులు బదిలీ చేశారు. ధాన్యం, మక్కలు కొనాలంటూ డ్రైవర్ అశోక్ ఇటీవల వ్యాఖ్యానించారు. ఆ వ్యాఖ్యలు వైరల్ కావడంతో.. డైవర్‌ను తొలగించాలంటూ డీఎం కల్పన ఉన్నతాధికారులకు లేఖ ఇచ్చారు. డ్రైవర్ అశోక్‌కు బీఆర్‌ఎస్, బీజేపీలు మద్దతుగా నిలిచాయి. ఈ ఘటనపై రవాణా శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్ కూడా ఇప్పటికే స్పందించారు. డ్రైవర్‌ను తొలగించవద్దంటూ అధికారులకు సూచన చేసినట్లు తెలిపారు.
బీఆర్‌ఎస్ నేతలతో హరీశ్‌రావు సమావేశం
మాజీ మంత్రి హరీశ్‌రావు ఉమ్మడి మెదక్ జిల్లా బీఆర్‌ఎస్ నేతలతో సమావేశమయ్యారు. తెలంగాణ భవన్‌లో జరిగిన భేటీలో ఎమ్మెల్యేలు, మాజీ ఎమ్మెల్యేలు పాల్గొన్నారు. ఎస్‌ఐఆర్ ప్రక్రియ, పార్టీ సభ్యత్వ నమోదుపై నేతలతో హరీశ్‌రావు చర్చించారు.
మరోసారి ఈడీ సోదాలు
రాష్ట్రంలో మరోసారి ఈడీ సోదాలు చేస్తోంది. కరీంనగర్, హైదరాబాద్‌లో ఇసుక, గ్రానైట్ వ్యాపారుల ఇళ్లు, కార్యాలయాల్లో తనిఖీలు నిర్వహిస్తోంది. మొత్తంగా నాలుగు కంపెనీలకు సంబంధించి 8 చోట్ల సోదాలు చేస్తోంది.
సీబీఎస్‌ఈ విధానంపై స్టే ఇచ్చేందుకు సుప్రీం నిరాకరణ
సీబీఎస్‌ఈ విధానంపై స్టే ఇచ్చేందుకు సుప్రీంకోర్టు నిరాకరించింది. 6-9 వ తరగతి వరకు 2 ప్రాంతీయ భాషలను తప్పనిసరి చేస్తూ సీబీఎస్‌ఈ ఇటీవల నిర్ణయం తీసుకుంది. ఇందుకు వ్యతిరేకంగా దేశ సర్వోన్నత న్యాయస్థానంలో పిటిషన్లు దాఖలయ్యాయి. వీటిపై విచారించిన సుప్రీం స్టే ఇచ్చేందుకు నిరాకరించింది. అయితే వివరణ ఇవ్వాలని సీబీఎస్‌ఈకి నోటీసులు జారీచేసింది. అనంతరం విచారణను జులై 15, 16 తేదీలకు వాయిదా వేసింది.
సీన్ రీకన్‌స్ట్రక్షన్.. అరణ్య ఫామ్‌హౌస్‌కు బండి భగీరథ్
బండి భగీరథ్‌ను తమ కస్టడీలోకి తీసుకున్న పోలీసులు.. సీన్ రీకన్‌స్ట్రక్షన్ కోసం అరణ్య ఫామ్‌హౌస్‌కు తీసుకెళ్లారు. పోక్సో కేసులో నిందితుడిగా ఉన్న భగీరథ్‌ను కోర్డు అనుమతితో మూడు రోజులపాటు పోలీసులు కస్టడీకి తీసుకున్నారు. ఇవాళ అదుపులోకి తీసుకున్న అనంతరం వైద్య పరీక్షలు నిర్వహించి, పెట్‌బషీరాబాద్ పోలీస్ స్టేషన్‌కు తరలించారు.
కేరళ మాజీ సీఎం పినరయి విజయన్ ఇంటి వద్ద ఉద్రిక్తత
కేరళ మాజీ సీఎం విజయన్ ఇంట్లో ఈడీ సోదాల సందర్భంగా ఉద్రిక్తత నెలకొంది. ఈడీ అధికారులపై సీపీఎం కార్యకర్తలు దాడి చేశారు. ఈడీ అధికారుల కారును ధ్వంసం చేశారు. పలువురు పోలీసులకు గాయాలయ్యాయి.
గొంతు కోసి మహిళ దారుణ హత్య
రంగారెడ్డి జిల్లా చేవెళ్ల మండలం ఈర్లపల్లికి చెందిన మహిళ దారుణ హత్యకు గురయ్యారు. మైసమ్మ(50) అనే మహిళను దుండగులు గొంతు కోసి హతమార్చారు. ఆభరణాల కోసమే మైసమ్మను చంపినట్లు అనుమానం వ్యక్తం చేస్తున్నారు.
ఆర్టీఏ కార్యాలయాల్లో ఏసీబీ సోదాలు
హైదరాబాద్ పలు ఆర్టీఏ కార్యాలయాల్లో ఏసీబీ సోదాలు చేస్తోంది. నాగోల్, మేడ్చల్, కొండాపూర్ కార్యాలయాల్లో హైదరాబాద్ రేంజ్ డీఎస్పీ శ్రీధర్ నేతృత్వంలో దాడులు చేసింది. ఏజెంట్ల ద్వారా కార్యకలాపాలు నడుస్తున్నాయనే సమాచారంతో తనిఖీలు నిర్వహిస్తోంది. ఆర్టీఏ ఏజెంట్లు, డ్రైవింగ్స్ స్కూల్ నిర్వాహకులు, ఎంవీఐలు, ఏఎంవీఐలను ఏసీబీ అధికారులు ప్రశ్నిస్తున్నారు. తనిఖీల సమయంలో ఎంవీఐలు, ఏఎంవీఐలు, ఏజెంట్ల ఫోన్లను అధికారులు స్వాధీనం చేసుకున్నారు.
తాగు నీటిని వృధా చేస్తున్న వ్యక్తికి జరిమానా విధించిన జలమండలి
- తాగు నీటిని వృధా చేస్తున్న వ్యక్తికి జలమండలి జరిమానా విధించింది. బంజారాహిల్స్‌లోని ఆరెంజ్ ట్రీ ఫర్నిచర్ దుకాణం తాగునీరు దుర్వినియోగం గుర్తించిన అధికారులు దుకాణానికి రూ. 10 వేల జరిమానా విధించారు. దుకాణం ముందు పైపుతో నీటిని వృథా చేయడంపై జలమండలి ఎండీ అశోక్‌రెడ్డి ఆగ్రహం వ్యక్తం చేశారు. జలమండలి ఎండీ ఆదేశాలతో అధికారులు రూ. 10వేల జరిమానా విధించారు.
తడిసిన ధాన్యం కొనేందుకు ఎన్ని కొర్రీలు పెడతారో?: బండి సంజయ్
- రాష్ట్ర ప్రభుత్వ నిర్లక్ష్యంతో రైతులు అరిగోస పడుతున్నారని బండి సంజయ్ ఆరోపించారు. ఐకేపీ సెంటర్లు, రోడ్లు ధాన్యం రాశులతో నిండిపోయాయని ప్రభుత్వం మాత్రం ధాన్యం తరలించేందుకు చర్యలు తీసుకోవడం లేదన్నారు. అకాల వర్షాలకు ధాన్యం మొత్తం తడిసిపోయిందని, ఇప్పుడా ధాన్యాన్ని కొనేందుకు ఎన్ని కొర్రీలు పెడతారో అని వాపోయారు. రైతుల పట్ల కాంగ్రెస్ ప్రభుత్వం ఇంకా నిర్లక్ష్యంగా ఉందన్నారు. బీజేపీ బస్సు యాత్రతోనే ప్రభుత్వంలో కదలిక వచ్చిందన్నారు. ధాన్యం కొనుగోలు డబ్బులు కేంద్రమే భరిస్తున్నప్పుడు మీకొచ్చిన ఇబ్బందేంటని బండి సంజయ్ ప్రశ్నించారు. తడిసిన ధాన్యాన్ని ఎలాంటి కోతలు లేకుండా కొనాలని బండి సంజయ్ డిమాండ్ చేశారు.
ప్రభుత్వ నిర్ణయాలపై విభేదించి పోరాడే హక్కు ఎవరికైనా ఉంది: మంత్రి పొన్నం
- ప్రభుత్వ నిర్ణయాలపై విభేదించి పోరాడే హక్కు ఎవరికైనా ఉందన్నారు మంత్రి పొన్నం. అయితే ఇది ప్రజలకు ఇబ్బందులు కలిగించే విధంగా ఉండవద్దన్నారు. ఎంపీగా చేసిన వ్యక్తి రైల్వే పట్టాలు కోసేయాలని చెప్తున్న బాల్క సుమన్ వ్యాఖ్యలను మంత్రి తప్పుపట్టారు. ఆయనపై రైల్వేశాఖ కేసులు నమోదు చేయాలని కోరారు. సింగరేణి భవనాన్ని కాల్చేయాలన్న బాల్కసుమన్‌ను బీఆర్‌ఎస్ బహిష్కరించాలని పొన్నం సూచించారు.
దిల్లీ చేరుకున్న తమిళనాడు ముఖ్యమంత్రి విజయ్
- తమిళనాడు ముఖ్యమంత్రి విజయ్ దిల్లీ చేరుకున్నారు. ముఖ్యమంత్రి అయ్యాక తొలిసారి విజయ్ దిల్లీ వెళ్లారు. ఇవాళ సాయంత్రం 4.30 గం.కు ప్రధాని మోదీని కలవనున్నారు. అనంతరం సోనియా గాంధీ, రాహుల్, ఖర్గేను కూడా కలవనున్నారు. దిల్లీ జేఎన్‌టీయూలో తమిళ కవి తిరువళ్లువర్ విగ్రహం విజయ్ ఆవిష్కరించనున్నారు.
బండి భగీరథ్‌ను కస్టడీలోకి తీసుకున్న పోలీసులు
- బండి భగీరథ్‌ను పోలీసులు తమ కస్టడీలోకి తీసుకున్నారు. భగీరథ్‌ను ప్రశ్నించేందుకు కోర్టు 3 రోజుల సమయం ఇవ్వడంతో ఇవాళ అదుపులోకి తీసుకునన్నారు. ముందుగా వైద్య పరీక్షలు నిర్వహించి పెట్‌బషీరాబాద్ పీఎస్‌కు తరలించారు. కూకట్‌పల్లి డీసీపీ ఆధ్వర్యంలో బండి భగీరథ్‌ను ప్రశ్నించనున్నారు. పోక్సో కేసులో బండి భగీరథ్ నిందితుడిగా ఉన్నాడు.
నా వ్యాఖ్యలను ఫ్యాబ్రికేట్ చేస్తున్నారు: బాల్క సుమన్
- కాంగ్రెస్ నేతలు తనపై డీజీపీకి ఫిర్యాదు చేశారని బీఆర్‌ఎస్ నేత బాల్క సుమన్ తెలిపారు. నిన్న బొగ్గు గని కార్మిక సంఘం సమావేశంలో తాను మాట్లాడానని.. తన వ్యాఖ్యలను అటూ ఇటు తిప్పి ఫ్యాబ్రికేట్ చేస్తున్నారని ఆరోపించారు. సింగరేణిలో అవినీతిని దృష్టి మళ్లించేందుకే కాంగ్రెస్ నేతలు ప్రయత్నం చేస్తున్నారని విమర్శించారు.
మొక్కజొన్న సేకరణలో రాష్ట్రప్రభుత్వం రికార్డు : మంత్రి తుమ్మల
- మొక్కజొన్న సేకరణలో రాష్ట్రప్రభుత్వం రికార్డు నెలకొల్పిందని వ్యవసాయశాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు తెలిపారు.ఇప్పటికే 14 లక్షల మెట్రిక్ టన్నుల మొక్కజొన్న సేకరించినట్లు వివరించారు. లక్ష మంది మొక్కజొన్న రైతుల ఖాతాల్లో 3 రోజుల్లో రూ.1,173 కోట్లు జమకానున్నాయన్నారు.
రూ.50 కోట్లతో అంతర్‌జిల్లా రోడ్డు పనులకు కేంద్ర మంత్రి శంకుస్థాపన
- కరీంనగర్ జిల్లా చొప్పదండి మండలం ఆర్నకొండలో రూ.50 కోట్లతో చేపట్టిన అంతర్‌జిల్లా రోడ్డు పనులకు కేంద్ర మంత్రి బండి సంజయ్ శంకుస్థాపన చేశారు. కరీంనగర్ లోక్‌సభ పరిధిలో రూ.300 కోట్ల కేంద్ర నిధులతో అభివృద్ధి పనులు చేపడుతున్నట్లు చెప్పారు. చొప్పదండి నియోజకవర్గంలోనూ పలు అభివృద్ధి పనులు చేపట్టామని సంజయ్ తెలిపారు.
ఎంసెట్ మెరిట్ విద్యార్థులు ప్రభుత్వ కాలేజీల్లో చేరాలి : పొన్నం
- ప్రభుత్వ కాలేజీల్లో చేరాలని ఎంసెట్ మెరిట్ విద్యార్థులను కోరుతున్నట్లు మంత్రి పొన్నం ప్రభాకర్ తెలిపారు. ప్రైవేట్ కళాశాలలతో దీటుగా సౌకర్యాలు ఏర్పాటు చేశామని చెప్పారు. శాతవాహన వర్సిటీలో కంప్యూటర్ సైన్స్ సీట్లు ఉన్నాయని, 5 కోర్సుల్లో 60 సీట్లు చొప్పున ఉన్నాయన్నారు. రాష్ట్రంలో 22 ప్రభుత్వ ఇంజినీరింగ్ కళాశాలలతోపాటు 157 ప్రైవేటు కాలేజీలు ఉన్నట్లు చెప్పారు.
ఎస్‌ఐఆర్ నిర్వహణను సమర్థించిన సుప్రీంకోర్టు
- ఎస్‌ఐఆర్ నిర్వహణను సుప్రీంకోర్టు సమర్థించింది. సర్ నిర్వహించే అధికారం ఈసీకి ఉందని స్పష్టం చేసింది. పలు రాష్ట్రాల్లో సర్ నిర్వహణపై దాఖలైన పిటిషన్లపై సుప్రీంకోర్టు తీర్పు వెల్లడించింది. సీజేఐ జస్టిస్ సూర్యకాంత్ నేతృత్వంలోని ధర్మాసనం ఈ తీర్పు వెల్లడించింది.
సికింద్రాబాద్ దేవగిరి ఎక్స్‌ప్రెస్‌లో నగదు పట్టివేత
- సికింద్రాబాద్ వద్ద దేవగిరి ఎక్స్‌ప్రెస్‌లో భారీగా నగదును రైల్వే పోలీసులు పట్టుకున్నారు. ముంబయి నుంచి తెస్తున్న రూ.కోటీ 20 లక్షలను పక్కా సమాచారంతో సీజ్ చేశారు. నిందితుడి వద్ద నగదు రవాణా పత్రాలు, అనుమతులు లేవని రైల్వే పోలీసులు తెలిపారు. ఇదంతా హవాలా మనీగా భావిస్తున్నారు.
తడిసిన ధాన్యాన్ని కొనుగోలు చేయాలని చిన్నఘనపూర్‌లో రైతుల ధర్నా
- మెదక్ జిల్లా కొల్చారం మండలం చిన్నఘనపూర్‌లో రైతులు మెదక్-సంగారెడ్డి ప్రధాన రహదారిపై బైఠాయించారు. తడిసిన ధాన్యాన్ని కొనుగోలు చేయాలని, తరుగు పేరుతో మిల్లు యజమానులు కొర్రీలు పెట్టవద్దని రైతుల డిమాండ్ చేశారు. వెంటనే లారీల కొరత తీర్చి ధాన్యాన్ని వెంటనే మిల్లులకు పంపాలని కోరారు. రైతుల ధర్నాతో రహదారిపై భారీగా ట్రాఫిక్ నిలిచిపోయింది. దీంతో పోలీసులు లారీలు పంపుతామని నచ్చజెప్పడంతో రైతులు ధర్నా విరమించారు.
త్వరలో ఆర్టీసీ విలీన ప్రక్రియ చేపడతాం: మంత్రి పొన్నం ప్రభాకర్
- త్వరలో ఆర్టీసీ విలీన ప్రక్రియ చేపడతామని మంత్రి పొన్నం ప్రభాకర్ అన్నారు. ఆర్టీసీ కార్మికుల సమస్యల పరిష్కారానికి కట్టుబడి ఉన్నామన్నారు. ప్రయాణికుల సౌకర్యం, కార్మికుల సంక్షేమం దృష్ట్యా చర్యలు తీసుకుంటున్నామని గుర్తుచేశారు. హైదరాబాద్‌లో 272 కొత్త రూట్లలో బస్సులు ప్రారంభించామని పొన్నం తెలిపారు.
వర్షాలపై అధికారులను అప్రమత్తం చేసిన సీఎం రేవంత్‌రెడ్డి
- అకాల వర్షాలపై అధికారులను సీఎం రేవంత్‌రెడ్డి అప్రమత్తం చేశారు. ధాన్యం కొనుగోలు కేంద్రాల్లో అదనపు ఏర్పాట్లు చేయాలని ఆదేశించారు. ధాన్యం కొనుగోళ్లను వేగవంతం చేయాలని, కల్లాల్లో ఉన్న ధాన్యం తడవకుండా టార్పాలిన్లు ఇవ్వాలన్నారు. వాతావరణ కేంద్రం హెచ్చరికల దృష్ట్యా ప్రజలు అప్రమత్తంగా ఉండాలని, భారీ వర్షాలు, బలమైన గాలుల దృష్ట్యా జాగ్రత్తలు తీసుకోవాలని సీఎం సూచించారు.
కేరళ మాజీ సీఎం విజయన్ ఇంట్లో ఈడీ సోదాలు
- కేరళ మాజీ సీఎం విజయన్ ఇంట్లో ఈడీ సోదాలు జరుగుతున్నాయి. సీఎంఆర్‌ఎల్ కేసులో విజయన్ సహా మరికొందరి ఇళ్లలో సోదాలు నిర్వహిస్తున్నారు. కేరళలోని 10 ప్రాంతాల్లో తనిఖీలు జరుగుతున్నాయి. విజయన్ కుమార్తె కంపెనీకి సీఎంఆర్‌ఎల్ రూ.1.72 కోట్లు చెల్లించినట్లు ఆరోపణలొచ్చాయి. ఎలాంటి సేవలు అందించకుండానే డబ్బు చెల్లించినట్లు ఆరోపణలు రావడంతో మనీలాండరింగ్ కోణంలో ఈడీ అధికారులు దర్యాప్తు చేస్తున్నారు.
భార్య, ఇద్దరు పిల్లలను చంపి కుటుంబ యజమాని ఆత్మహత్య
- వనపర్తి జిల్లా ఘనపురం మండలం సలికలాపురంలో దారుణం వెలుగుచూసింది. భార్య, ఇద్దరు పిల్లలను చంపి కుటుంబ యజమాని ఆత్మహత్య చేసుకున్నాడు. మృతుల స్వస్థలం మహబూబ్‌నగర్ జిల్లా దేవరకద్ర మండలం దోకూర్ గ్రామం. భార్య హేమలత, కుమారుడు సాయినిహాల్, కుమార్తె సాయిశ్రీని నరసింహ హత్య చేశాడు. హోమ్ లోన్ బాధలు భరించలేకే అని సెల్ఫీ వీడియో తీసుకొని ఆత్మహత్య చేసుకున్నాడు. అప్పు ఇచ్చినవారు ఇబ్బందులకు గురిచేస్తున్నారని, అప్పు ఉన్నానని గోడపై రాయించి ఇంటిని సీజ్ చేశారని, ఇంట్లో ఉన్న బంగారు, వెండి ఆభరణాలు తీసుకెళ్లారని నరసింహ వీడియోలో పేర్కొన్నాడు.
తడిసిన ధాన్యాన్ని తరుగు లేకుండా కొనుగోలు చేయాలని రైతుల డిమాండ్
- అకాలవర్షాలతో తడిసిన ధాన్యాన్ని తరుగు లేకుండా కొనుగోలు చేయాలని రైతులు డిమాండ్ చేస్తున్నారు. మెదక్, హవేలీఘనపూర్, చేగుంట, వెల్దుర్తి, కౌడిపల్లి కొనుగోలు కేంద్రాల్లో రాత్రి వర్షంతో ధాన్యం తడిచింది. పలు కొనుగోలు కేంద్రాల్లో వేల ధాన్యపు బస్తాలు తూకం కోసం తీసుకొచ్చారు. అయితే నిన్నటి వరకు లారీలు లేవని ఆపారు. దీంతో రాత్రి వర్షం వచ్చి ధాన్యం అంతా తడిచిపోయింది. లారీల సమస్య అధిగమించి ఉంటే ఈ పరిస్థితి వచ్చేది కాదని రైతులు ఆగ్రహం వ్యక్తం చేశారు.
న్యాయవాది మొయిజుద్దీన్ హత్య కేసులో పురోగతి
- హైదరాబాద్‌లో న్యాయవాది మొయిజుద్దీన్ హత్య కేసులో పురోగతి కనిపిస్తోంది. హత్యకు ఉపయోగించిన స్కార్పియో కారును పోలీసులు గుర్తించారు. సూత్రధారిగా భావిస్తున్న ముజాహిద్‌ను అదుపులోకి తీసుకున్న పోలీసులు దర్యాప్తు వేగవంతం చేశారు.
తల్లి మృతిని తట్టుకోలేక ఆటో డ్రైవర్ ఆత్మహత్య
- హైదరాబాద్ మైలార్‌దేవ్‌పల్లి పరిధిలో విషాదం చోటు చేసుకుంది. తల్లి మృతిని తట్టుకోలేక ఆటో డ్రైవర్ కొమురా రెడ్డి ఆత్మహత్య చేసుకున్నాడు. తల్లి మృతితో రెండు నెలలుగా మద్యానికి బానిసైన కొమురారెడ్డి ఇంట్లో ఉరి వేసుకుని ఆత్మహత్యకు పాల్పడ్డాడు.
హైదరాబాద్‌లో పలుచోట్ల నీటిసరఫరాలో అంతరాయం
- హైదరాబాద్‌లో పలుచోట్ల నీటిసరఫరాలో(Water Problem) అంతరాయం ఏర్పడింది. మంజీరా ఫేజ్-1, 2కు చెందిన పంపింగ్ స్టేషన్లలో అర్ధరాత్రి నుంచి అంతరాయం నెలకొంది. విద్యుత్ సరఫరా అంతరాయంతో పంపింగ్ పూర్తిగా నిలిచిపోయింది. ఈదురుగాలులకు చెట్లు కూలడంతో పలుచోట్ల లైన్లు ట్రిప్ అయ్యాయి. దీంతో విద్యుత్ శాఖ సిబ్బంది వెంటనే మరమ్మతు చేపట్టింది. విద్యుత్ సరఫరా పునరుద్ధరించాక పంపులు తిరిగి ప్రారంభం కానున్నాయి. అప్పటి వరకు నీటిని పొదుపుగా వాడుకోవాలని జలమండలి ఎండీ సూచించారు.
పెద్దపల్లి మార్కెట్ యార్డులో భారీ వర్షానికి కొట్టుకుపోయిన ధాన్యం
- పెద్దపల్లి మార్కెట్ యార్డులో భారీ వర్షానికి ధాన్యం కొట్టుకుపోయింది. తూకానికి సిద్ధంగా ఉన్న మక్కల బస్తాల్లోకి వర్షపునీరు చేరింది. మక్కలను మద్దతు ధరకు కొనుగోలు చేయాలని రైతుల డిమాండ్ చేస్తున్నారు.
జగిత్యాల: మెట్‌పల్లి వ్యవసాయ మార్కెట్‌లో తడిచిన ధాన్యం, మక్కలు
- జగిత్యాల జిల్లా మెట్‌పల్లి వ్యవసాయ మార్కెట్‌లో ధాన్యం, మక్కలు తడిచిపోయ్యాయి. ఆ ధాన్యం, మక్కలను ఆరబోసుకుంటూ రైతులు అవస్థలు పడుతున్నారు. మెట్‌పల్లి మార్కెట్‌లో 4 వేల క్వింటాళ్ల మక్కలు, 6 వేల క్వింటాళ్ల ధాన్యం ఉన్నట్లు సమాచారం.
కరీంనగర్: చొప్పదండి, రామడుగు, గంగాధర మండలాల్లో తడిసిన ధాన్యం
- కరీంనగర్ జిల్లా చొప్పదండి, రామడుగు, గంగాధర మండలాల్లో ధాన్యం తడిసిపోయింది. నెలరోజులుగా ధాన్యం విక్రయానికి ఎదురుచూస్తున్న రైతులకు తీవ్ర నష్టం వాటిల్లింది. ఈదురుగాలుల బీభత్సంతో పెంచాలపల్లిలో విద్యుత్ స్తంభాలు విరిగిపడ్డాయి.
లంగర్‌హౌస్, గోల్కొండ, రాందేవ్ పరిసర ప్రాంతాలలో చిరుజల్లులు
- లంగర్‌హౌస్, గోల్కొండ, రాందేవ్ పరిసర ప్రాంతాలలో(Rain in Hyderabad) చిరుజల్లులు పడ్డాయి. వరంగల్‌లో ఉరుములతో కూడిన మోస్తరు వర్షం కురిసింది.
రేపు కర్ణాటక సీఎం సిద్ధరామయ్య రాజీనామా చేసే అవకాశం
- రేపు కర్ణాటక సీఎం సిద్ధరామయ్య రాజీనామా చేసే అవకాశం ఉంది. రేపు మంత్రులకు విందు ఇచ్చాక రాజీనామా చేస్తారని అధికారులు స్పష్టం చేశారు. కర్ణాటకలో డీకే శివకుమార్, జి.పరమేశ్వర్ సీఎం రేసులో ఉన్నట్లు సమాచారం. నాయకత్వ మార్పుపై నిన్న అధిష్ఠానం వద్ద చర్చలు జరిగినట్లు సమాచారం. సిద్ధరామయ్యకు రాజ్యసభ సీటు, ఆ సభలో విపక్ష నేతగా అవకాశం ఇచ్చేలా చర్చలు జరుగుతున్నాయి. సిద్ధరామయ్య కుమారుడు యతీంద్రకు డిప్యూటీ సీఎం ఇస్తారని సమాచారం. తన మద్దతుదారులతో చర్చించాక నిర్ణయం ప్రకటిస్తానని సిద్ధరామయ్య తెలిపారు.
తిరుమలలో టోకెన్లు లేని భక్తులకు సర్వదర్శనానికి 24 గంటలు
తిరుమలలో టోకెన్లు లేని భక్తులకు సర్వదర్శనానికి 24 గంటలు సమయం పడుతోంది. వైకుంఠ క్యూ కాంప్లెక్సులు, నారాయణగిరి షెడ్లు భక్తులతో నిండింది. శ్రీవారి దర్శనం కోసం శిలాతోరణం క్యూలైన్ వరకు భక్తులు వేచి ఉన్నారు. నిన్న శ్రీవారిని 89,404 మంది భక్తులు దర్శించుకున్నారు. శ్రీవారి హుండీ ఆదాయం రూ.4 కోట్లు వచ్చింది. శ్రీవారికి తలనీలాలు 44,234 మంది భక్తులు సమర్పించారు.
బండి భగీరథ్‌ను కస్టడీలోకి తీసుకోనున్న పోలీసులు
బండి భగీరథ్‌ను (Bandi Bhagirath Police Custody) పోలీసులు కస్టడీలోకి తీసుకోనున్నారు. వైద్యపరీక్షలు నిర్వహించాక బండి భగీరథ్‌ను మూడ్రోజులపాటు ప్రశ్నించనున్నారు. కూకట్‌పల్లి డీసీపీ రితిరాజ్ ఆధ్వర్యంలో బాలిక, ఆమె తల్లి వాంగ్మూలం ఆధారంగా విచారించనున్నారు. పోక్సో కేసులో చర్లపల్లి జైలులో బండి భగీరథ్ రిమాండ్ ఖైదీగా ఉన్నాడు.
మహబూబ్‌నగర్‌లో ఉరుములు, మెరుపులతో కూడిన వర్షం
మహబూబ్‌నగర్‌లో ఉరుములు, మెరుపులతో కూడిన (Heavy Rains in Telangana) వర్షం కురిసింది. పలు ప్రాంతాల్లో వర్షానికి విద్యుత్ సరఫరా నిలిచిపోయింది.
హైదరాబాద్‌లోని పలు ప్రాంతాల్లో ఉరుములు, మెరుపులతో కూడిన వర్షం
హైదరాబాద్‌లోని పలు ప్రాంతాల్లో ఉరుములు, మెరుపులతో కూడిన (Heavy Rains in Hyderabad) వర్షం కురిసింది. కుత్బుల్లాపూర్, మియాపూర్, చందానగర్, లింగంపల్లి, గచ్చిబౌలి, మాదాపూర్, రాయదుర్గం, కూకట్‌పల్లి, జేఎన్టీయూ, నిజాంపేట, బాచుపల్లి తదితర ప్రాంతాల్లో వర్షం పడింది.
ఉమ్మడి మెదక్ జిల్లాలో ఈదురుగాలులు, ఉరుములు, మెరుపులతో వర్షం
ఉమ్మడి మెదక్ జిల్లాలో ఈదురుగాలులు, ఉరుములు, మెరుపులతో వర్షం పడింది. కొల్చారం, వెల్దుర్తి, మండలాల్లో భారీ వర్షానికి విద్యుత్ సరఫరాలో అంతరాయం కలిగింది. పలు ప్రాంతాల్లో కొనుగోలు కేంద్రాల్లోధాన్యం తడిసిపోయింది. సంగారెడ్డిలో వర్షంతో విద్యుత్ సరఫరాకు అంతరాయం వల్ల స్థానికుల ఇబ్బందులు ఎదుర్కోంటున్నారు.
నేడు హైదరాబాద్-రాజస్థాన్ ఎలిమినేటర్ మ్యాచ్
నేడు రాత్రి 7.30 గం.కు ముల్లాన్‌పుర్‌లో హైదరాబాద్-రాజస్థాన్ ఎలిమినేటర్ మ్యాచ్ జరగనుంది.

