27-08-2026 Telangana News Today Live Updates : రాష్ట్ర ప్రజలకు రాఖీపౌర్ణమి శుభాకాంక్షలు తెలిపిన సీఎం రేవంత్‌రెడ్డి

Published : August 27, 2026 at 6:49 AM IST
|Updated : August 27, 2026 at 9:28 PM IST
27-08-2026 Telangana News Today Live Updates : ఈరోజు తాజా ప్రధాన వార్తల సమాచారం
LIVE FEED
రాష్ట్ర ప్రజలకు రాఖీ శుభాకాంక్షలు తెలిపిన కేసీఆర్
రాష్ట్ర ప్రజలకు కేసీఆర్ రాఖీ శుభాకాంక్షలు తెలిపారు. "మానవ సంబంధాలలో అత్యంత గొప్పదైన బంధం సహోదరత్వం. అక్కా తమ్ముళ్లు, అన్నాచెల్లెళ్లు అనుబంధం అజరామరం. రాఖీ బంధన్ భారత కుటుంబ జీవనంలో ప్రత్యేక సంప్రదాయ వేడుక. ప్రజలంతా సౌభ్రాతృత్వంతో జీవించడంతోనే వసుదైక కుటుంబ భావన పరిఢవిల్లుతుంది." అని కేసీఆర్ పేర్కొన్నారు.
రాష్ట్ర ప్రజలకు రాఖీపౌర్ణమి శుభాకాంక్షలు తెలిపిన సీఎం రేవంత్‌రెడ్డి
రాష్ట్ర ప్రజలకు సీఎం రేవంత్‌రెడ్డి రాఖీపౌర్ణమి శుభాకాంక్షలు తెలిపారు. "మహిళలను ఆర్థికంగా బలోపేతం చేసే లక్ష్యంతో ప్రభుత్వం అడుగులు వేస్తోంది. కోటి మంది మహిళలను కోటీశ్వరులను లక్ష్యంతో ప్రభుత్వం పథకాలు అమలు చేస్తున్నాం" అని రేవంత్ రెడ్డి తెలిపారు.
హైదరాబాద్-విజయవాడ హైవేపై 17 బ్లాక్ స్పాట్స్ ఫ్లైఓవర్లు త్వరలో పూర్తి చేయాలి
హైదరాబాద్-విజయవాడ హైవేపై 17 బ్లాక్ స్పాట్స్ ఫ్లైఓవర్లు త్వరలో పూర్తి చేయాలని మంత్రి కోమటిరెడ్డి అధికారులను ఆదేశించారు. చిట్యాల ఫ్లైఓవర్ దసరా నాటికి పూర్తి చేయాలన్నారు. మిగతా ఫ్లైఓవర్లు డిసెంబర్ చివరి నాటికి అందుబాటులోకి తేవాలని సూచించారు. ప్రమాదాలు నివారించాలంటే రహదారి విస్తరణ పనులు త్వరగా చేపట్టాలన్న కోమటిరెడ్డి, 6+2 రహదారి విస్తరణ కోసం ఇప్పటికే నితిన్ గడ్కరీని సీఎం కలిశారని స్పష్టం చేశారు.
రాఖీ పౌర్ణమి సందర్భంగా 5 వేల ప్రత్యేక బస్సులు
రాఖీ పౌర్ణమి సందర్భంగా ప్రభుత్వం 5 వేల ప్రత్యేక బస్సులను ఏర్పాటు చేసింది. ప్రయాణికుల రద్దీకి అనుగుణంగా ఆర్టీసీ విస్తృత ఏర్పాట్లు చేసినట్లు ఆ శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్ తెలిపారు.
నేపాల్ వరదల పరిస్థితులపై మంత్రి పొంగులేటి టెలీకాన్ఫరెన్స్
నేపాల్ వరదల పరిస్థితులపై మంత్రి పొంగులేటి టెలీకాన్ఫరెన్స్ నిర్వహించారు. నేపాల్‌లో తెలంగాణ రాష్ట్రానికి చెందిన 23 మంది చిక్కుకున్నట్లు గుర్తించామని, నేపాల్‌లో చిక్కుకున్న రాష్ట్ర వాసుల వివరాలు విదేశాంగశాఖకు పంపించామని తెలిపారు. కేంద్రం, నేపాల్‌లోని రాయబార కార్యాలయంతో సమన్వయం చేస్తున్నామని, దిల్లీ, హైదరాబాద్‌లో హెల్ప్‌లైన్, కోఆర్డినేషన్ సెంటర్లు ఏర్పాటు చేశామని వెల్లడించారు.
- దిల్లీలో హెల్ప్‌లైన్ నంబర్లు : 9871999044, 9949351270, 9618597969
- సచివాలయంలో హెల్ప్‌లైన్ నంబర్లు : 9885371189, 7997959754, 9440854433
భూపాలపల్లి జిల్లా భూగర్భగనులశాఖ ఏడీ జయరాజు అరెస్టు
భూపాలపల్లి జిల్లా భూగర్భ గనుల శాఖ ఏడీ జయరాజును అధికారులు అరెస్టు చేశారు. భూపాలపల్లి, హైదరాబాద్‌లోని జయరాజు ఇళ్లల్లో సోదాలు నిర్వహించిన ఏసీబీ అధికారులు సుమారు రూ.100 కోట్ల ఆస్తులు గుర్తించారు. సూర్యాపేట, తాండూరు సహా 12 చోట్ల దాడులు జరిపారు. జయరాజు ఇటీవల ఉత్తమ అధికారిగా అవార్డు అందుకోవడం గమనార్హం.
ఆస్ట్రేలియాతో మల్టీ డే మ్యాచ్‌కు ఎంపికైన హైదరాబాద్ మహిళా క్రికెటర్ మమత
ఆస్ట్రేలియాతో మల్టీ డే మ్యాచ్‌కు హైదరాబాద్ మహిళా క్రికెటర్ మమత ఎంపికైంది. ఆస్ట్రేలియా ఏ జట్టు భారత పర్యటనలో భాగంగా ఇండియా ఏ మహిళ జట్టు ప్రకటించారు. అందులో మమతకు చోటు దక్కింది. ధర్మశాల వేదికగా సెప్టెంబర్ 29న జరిగే మల్టీ డే మ్యాచ్‌లో మమత బరిలోకి దిగనుంది. మమత హైదరాబాద్ జట్టులో వికెట్ కీపర్, బ్యాటర్‌గా రాణిస్తోంది.
తుమ్మిడిహెట్టి ఆనకట్ట అంశంపై సమావేశం ఏర్పాటు చేసిన కేంద్ర ప్రభుత్వం
తుమ్మిడిహెట్టి ఆనకట్ట అంశంపై కేంద్ర ప్రభుత్వం సమావేశం ఏర్పాటు చేసింది. సెప్టెంబర్ 1న కేంద్ర జల సంఘం ఛైర్మన్ అధ్యక్షతన సమావేశం జరగనుంది. తెలంగాణ, మహారాష్ట్ర అధికారులు, కేంద్ర ప్రభుత్వ సంస్థల ప్రతినిధులతో సమావేశం కానున్నారు. సీఎం రేవంత్‌రెడ్డి లేఖకు స్పందించి కేంద్రం ఈ సమావేశం ఏర్పాటు చేయడం గమనార్హం.
మేడ్చల్: రాజబొల్లారంలో అక్రమ గ్యాస్ రీఫిల్లింగ్ ముఠా అరెస్ట్
మేడ్చల్: రాజబొల్లారంలో అక్రమ గ్యాస్ రీఫిల్లింగ్ ముఠాను పోలీసులు అరెస్ట్ చేశారు. ఓ ఇంట్లో గ్యాస్ రీఫిల్లింగ్ చేస్తున్నారనే సమాచారంతో ఎస్‌వోటీ పోలీసులు దాడులు చేసి నలుగురిని అదుపులోకి తీసుకున్నారు. 200 గ్యాస్ సిలిండర్లను స్వాధీనం చేసుకున్నారు. నిందితులు బిహార్, యూపీ రాష్ట్రాలకు చెందిన వారిగా గుర్తించారు.
కొండాపూర్ అంజయ్యనగర్‌లో కొనసాగుతున్న హైడ్రా కూల్చివేతలు
కొండాపూర్ అంజయ్యనగర్‌లో హైడ్రా కూల్చివేతలు ఆరో రోజూ కొనసాగుతున్నాయి. కూలిన భవనంతో పాటు చుట్టూ ఉన్న భవనాలను అధికారులు కూల్చివేస్తున్నారు. కుప్పకూలిన భవనంతో పాటు మరో 5 భవనాలను హైడ్రా, సీఎంసీ అధికారులు కూల్చేశారు. తక్కువ స్థలంలో ఎక్కువ అంతస్తులతో కట్టిన భవనాలను సీఎంసీ అధికారులు గుర్తించి వాటిని కూల్చే పనిలో ఉన్నారు.
యశోద ఆస్పత్రి నుంచి గవర్నర్ శివప్రతాప్ శుక్లా డిశ్చార్జ్
హైటెక్ సిటీ యశోద ఆస్పత్రి నుంచి గవర్నర్ శివప్రతాప్ శుక్లా డిశ్చార్జ్ అయ్యారు. ఆయనకు నిన్న యశోద ఆసుపత్రి వైద్యులు స్టెంట్ వేశారు. గవర్నర్‌ను ఇవాళ ఉదయం ముఖ్యమంత్రి పరామర్శించారు.
నీళ్లు లేని బావిలో పడిన కారు, వృద్ధురాలు మృతి
హనుమకొండ జిల్లా భీమదేవరపల్లి మం. మంగళపల్లి శివారులో నీళ్లు లేని బావిలో కారు పడిపోయిన ఘటనలో వృద్ధురాలు మృతి చెందింది. అతి వేగంతో వెళ్లిన కారు అదుపుతప్పి పల్టీలు బావిలో పడింది. కారు టైర్ల కింద చిక్కుకుని రాధమ్మ(70) మృతి చెందగా, కారులో ఉన్న మరో ముగ్గురికి తీవ్ర గాయాలయ్యాయి. వీరంతా కరీంనగర్ జిల్లా బొమ్మకల్‌కు చెందినవారిగా గుర్తించారు.
నేపాల్ వైపు సుమారు 484 మంది గల్లంతయ్యారు: ఈశా ఫౌండేషన్
నేపాల్‌లో ఆకస్మిక వరదలపై ఈశా ఫౌండేషన్ ప్రకటన విడుదల చేసింది. నేపాల్ వరదల్లో సుమారు 484 మంది గల్లంతయ్యారని ప్రకటించింది. ఇవాళ ఉదయం అక్కడికి నేను స్వయంగా బయలుదేరినట్లు ఈశా ఫౌండేషన్ ఛైర్మన్ సద్గురు తెలిపారు.
మెట్‌పల్లి తహసీల్దార్ నీత సస్పెన్షన్
జగిత్యాల జిల్లా మెట్‌పల్లి తహసీల్దార్ నీతను సస్పెండ్ చేస్తూ కలెక్టర్ సత్యప్రసాద్ ఆదేశాలు జారీచేశారు. సర్, భూభారతి పురోగతిలో నిర్లక్ష్యమే సస్పెన్షన్‌కు కారణమని తెలుస్తోంది. నీత స్థానంలో ముఫ్తర్ పాషాను మెట్‌పల్లి తహసీల్దార్‌గా నియామించారు.
నేపాల్‌లో మేం క్షేమంగానే ఉన్నాం: డీఆర్‌డీవో మాజీ ఛైర్మన్
నేపాల్‌లో తాము క్షేమంగా ఉన్నామని డీఆర్‌డీవో మాజీ ఛైర్మన్ సతీశ్‌రెడ్డి వెల్లడించారు. ప్రస్తుతం మానస సరోవర్ యాత్రలో ఉన్నామని, యాత్రకు వెళ్తున్నామని తెలిపారు. బుధవారం నేపాల్‌లో వరదలు వచ్చిన ప్రాంతాన్ని దాటి ముందుకెళ్లినట్లు వివరించారు.
ఆస్పత్రిలో గవర్నర్ శివప్రతాప్‌శుక్లాను పరామర్శించిన సీఎం రేవంత్‌రెడ్డి
హైటెక్ సిటీ యశోద ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న గవర్నర్ గవర్నర్ శివప్రతాప్ శుక్లాను సీఎం రేవంత్ రెడ్డి పరామర్శించారు. గవర్నర్‌కు యశోద వైద్యులు బుధవారం స్టెంట్ వేసిన సంగతి తెలిసిందే.
హరీశ్‌రావు రాక నేపథ్యంలో వరంగల్ పాలిటెక్నిక్ కాలేజీ వద్ద భారీగా పోలీసుల మోహరింపు
వరంగల్ పాలిటెక్నిక్ కాలేజీకి బీఆర్ఎస్ నేత హరీశ్ రావు వస్తున్నారన్న సమాచారంతో పోలీసులు అప్రమత్తం అయ్యారు. కాలేజీ వద్ద భారీగా పోలీసులను మోహరించారు. ప్రతి
విద్యార్థిని క్షుణ్ణంగా తనిఖీ చేసిన తరువాతే లోపలికి అనుమతిస్తున్నారు. ప్రభుత్వం కొత్తగా తీసుకొచ్చిన శక్తి పాలసీని పాలిటెక్నిక్ విద్యార్థులు వ్యతిరేకిస్తున్నారు. ఈ సందర్భంగా వారికి సంఘీభావం తెలిపేందుకు హరీశ్‌రావు వస్తారని సమాచారంతో పోలీసులు ముందస్తు చర్యలు చేపట్టారు.
ఎమ్మెల్యే పాడి కౌశిక్‌రెడ్డికి నోటీసులు ఇచ్చిన ఎథిక్స్ కమిటీ
ఎమ్మెల్యే పాడి కౌశిక్‌రెడ్డికి నోటీసులు అసెంబ్లీ ఎథిక్స్ కమిటీ(Ethics Commitee) నోటీసులు జారీ చేసింది. ఎమ్మెల్యే కడియం శ్రీహరిపై చేసిన వ్యాఖ్యలపై ఈనెల 29న అసెంబ్లీ కమిటీ హాల్‌లో ఉ. 11 గం.కు ఎథిక్స్ కమిటీ భేటీ విచారణ జరపనుంది. ఈ మేరకు నోటీసులు పంపింది.
కేటీఆర్‌కు హరియాణాలోని జిందాల్ గ్లోబల్ యూనివర్సిటీ ఆహ్వానం
బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్‌ను(KTR) హరియాణాలోని జిందాల్ గ్లోబల్ యూనివర్సిటీ ఆహ్వానించింది. ఓపీ జిందాల్ గ్లోబల్ యూనివర్సిటీలో ‘డిస్టింగ్విష్డ్ పబ్లిక్ లెక్చర్ ఇవ్వాలని జిందాల్ గ్లోబల్ వర్సిటీ విజ్ఞప్తి చేసింది.
కువైట్‌లో హత్యకు గురైన యువకుడి మృతదేహం స్వగ్రామం తరలింపు
కువైట్‌లో హత్యకు గురైన యువకుడి మృతదేహాన్ని 6 నెలల తర్వాత నిజామాబాద్ జిల్లాలోని స్వస్థలానికి తరలించారు. మృతుడు కైలాస్ డిచ్‌పల్లి మండలం కొరట్‌పల్లి తండా వాసి. 6 నెలల క్రితం కువైట్‌లో హత్యకు గురయ్యాడు. సాంపల్లి తాండ వాసి గణేశ్ హత్య చేశాడని కైలాస్ కుటుంబం ఆరోపిస్తోంది. ఈ సందర్భంగా గణేశ్ నివాసం ముందు కైలాస్ కుటుంబ సభ్యులు ఆందోళనకు దిగారు.
బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు రామచందర్‌రావు గృహనిర్బంధం
బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు రామచందర్‌రావును తార్నాకలోని ఆయన నివాసంలో పోలీసులు గృహ నిర్బంధం చేశారు. ఇవాళ రామంతాపూర్ పాలిటెక్నిక్ విద్యార్థులను కలిసి వారికి సంఘీభావం తెలిపేందుకు వెళ్లాల్సి ఉంది. ఈ నేపథ్యంలోనే రామచందర్‌రావును పోలీసులు హౌస్ అరెస్ట్ చేశారు.
మైలార్‌దేవ్‌పల్లిలో భారీగా గుట్కా పట్టివేత
రంగారెడ్డి జిల్లా మైలార్‌దేవ్‌పల్లిలో భారీగా గుట్కాను పట్టుకున్నారు. ఉడమ్‌గడ్డ జీఎంఆర్ పార్కింగ్‌లో 2 రోజులుగా ఉన్న లారీ గురించి అనుమానం వచ్చిన స్థానికులు పోలీసులకు సమాచారమిచ్చారు. వారు దానిని తనిఖీ చేయగా 52 బ్యాగుల గుట్కా లభించింది. లారీ ఓనర్ సయ్యద్ అన్వర్‌ను అదుపులోకి తీసుకుని పోలీసులు ప్రశ్నిస్తున్నారు.
జయశంకర్ భూపాలపల్లి జిల్లాలో ఏసీబీ అధికారుల సోదాలు
జయశంకర్ భూపాలపల్లి జిల్లాలో భూగర్భగనులశాఖ ఏడీ జయరాజు నివాసాల్లో ఏసీబీ సోదాలు చేస్తోంది. ఆదాయానికి మించిన ఆస్తుల ఆరోపణలతో తనిఖీలు చేపట్టింది. భూపాలపల్లి, హైదరాబాద్, సూర్యా పేట, తాండూరు ప్రాంతాలు సహా 12 చోట్ల ఏసీబీ తనిఖీలు చేస్తోంది. వరంగల్ రేంజ్ ఏసీబీ డీఎస్పీ సాంబయ్య నేతృత్వంలో సోదాలు జరుగుతున్నాయి.
మీరాలం చెరువును ఆకస్మికంగా సందర్శించిన సీఎం రేవంత్‌రెడ్డి
మీరాలం చెరువును సీఎం రేవంత్‌రెడ్డి ఆకస్మికంగా సందర్శించారు. చెరువు చుట్టూ అభివృద్ధి పనులను పరిశీలించారు. ఈ చెరువుపై ప్రభుత్వం సస్పెన్షన్ బ్రిడ్జిని నిర్మిస్తోంది. మూసీ రివర్ ఫ్రంట్ డెవలప్‌మెంట్ కార్పొరేషన్ ఆధ్వర్యంలో పనులు జరుగుతున్నాయి.
కారు ప్రమాదంలో పారిశుద్ధ్య కార్మికురాలు మృతి
ఖమ్మం జిల్లా కారు ప్రమాదంలో పారిశుద్ధ్య కార్మికురాలు నాగమ్మ(55) మృతి చెందారు. బోనకల్లు జమ్మిబండ సమీపంలో వీధిశుభ్రం చేస్తున్న నాగమ్మ, కారు ఢీకొట్టడంతో అక్కడికక్కడే మరణించారు. కారు డ్రైవర్ పరారీలో ఉన్నట్లు పోలీసులు తెలిపారు.
తిరుమలలో టోకెన్లు లేని భక్తులకు శ్రీవారి సర్వదర్శనానికి 24 గంటలు
తిరుమలలో టోకెన్లు లేని భక్తులకు శ్రీవారి సర్వదర్శనానికి 24 గంటల సమయం పడుతోంది. అన్ని కంపార్టుమెంట్లు భక్తులతో నిండి పోయాయి. శిలాతోరణం క్యూలైన్ వరకు భక్తులు వేచి ఉన్నారు. బుధవారం శ్రీవారిని 77,568 మంది భక్తులు దర్శించుకున్నారు. నిన్న శ్రీవారి హుండీ ఆదాయం రూ.4.19 కోట్లుగా ఉంది.
జీవీ నారాయణరావు మృతి పట్ల సంతాపం తెలిపిన సినీ ప్రముఖులు
జీవీ నారాయణరావు మృతి పట్ల సినీ ప్రముఖులు సంతాపం తెలిపారు. అలాగే మూవీ ఆర్టిస్ట్స్ అసోసియేషన్ కూడా నారాయణరావు మృతి పట్ల సంతాపం తెలిపారు.
ప్రముఖ సీనియర్ నటుడు, నిర్మాత జీవీ నారాయణరావు(73) కన్నుమూత
ప్రముఖ సీనియర్ నటుడు, నిర్మాత జీవీ నారాయణరావు(73) కన్నుమూశారు. అనారోగ్య సమస్యలతో జీవీ నారాయణరావు కన్నుమూశారు. 1976 లో 'అంతులేని కథ' ద్వారా వెండితెరకు పరిచయమయ్యాడు. పలు సినిమాలు, టీవీ సీరియళ్లలో నటించారు. చిరంజీవి, రజనీకాంత్‌కు జీవీ నారాయణరావు మంచి మిత్రులు. గ్యాంగ్‌లీడర్, హిట్లర్, యముడికి మొగుడు చిత్రాల్లో జీవీ నారాయణరావు నటించారు. ముత్యాల పల్లకి, అంగడిబొమ్మ , చిలకమ్మ చెప్పింది చిత్రాల్లో నటించారు.
దేవాంతకుడు, ఇంటికో రుద్రమ్మ చిత్రాల్లో కూడా నటించారు.
పల్నాడు జిల్లాలో రోడ్డు ప్రమాదం, ఏడుగురు మృతి
పల్నాడు జిల్లాలో రోడ్డు ప్రమాదం జరిగి ఏడుగురు మృతి చెందారు. చిలకలూరిపేట వద్ద ఆటోను ప్రైవేటు ట్రావెల్స్ బస్సు ఢీకొట్టింది. ప్రైవేటు ట్రావెల్స్ బస్సు విజయవాడ నుంచి తిరుపతి వెళ్తుంది. ఆటోలో ప్రయాణిస్తున్న ఏడుగురు మృతి, సుమారు 10 మంది పరిస్థితి విషమంగా ఉంది. మృతులు చిలకలూరిపేట మం. వేలూరు గ్రామానికి చెందిన వారిగా గుర్తించారు. ప్రకాశం జిల్లా కొండమంజులూరు నుంచి వేలూరు వెళ్తుండగా ప్రమాదం సంభవించింది. గాయపడిన వారిని గుంటూరు జీజీహెచ్‌కు తరలించారు.
నేపాల్ వరదలపై హెల్ప్‌లైన్, కోఆర్డినేషన్ సెంటర్ ఏర్పాటు చేసిన రాష్ట్ర ప్రభుత్వం
నేపాల్ వరదలపై రాష్ట్ర ప్రభుత్వం హెల్ప్‌లైన్, కోఆర్డినేషన్ సెంటర్ ఏర్పాటు చేసింది. దిల్లీలోని తెలంగాణ భవన్‌లో హెల్ప్‌లైన్, కోఆర్డినేషన్ సెంటర్‌ను ఏర్పాటు చేసింది. ఏర్పాటు చేసిన హెల్ప్‌లైన్ నంబర్లు ఇవే. రెసిడెంట్ కమిషనర్ పీఎస్ వందన- 9871999044, పీఆర్ఓ చక్రవర్తి నంబర్- 9949351270, లైజన్ ఆఫీసర్ జి.రక్షిత్ నాయక్ నంబర్- 9618597969
నేపాల్-టిబెట్ సరిహద్దుల్లో ఆకస్మిక వరదలు, 160కు పెరిగిన మృతులు
నేపాల్-టిబెట్ సరిహద్దుల్లో ఆకస్మిక వరదలతో మృతుల సంఖ్య 160కు పెరిగింది. సుమారు 750 మంది గల్లంతయ్యారు. గల్లంతైన వారిలో 133 మంది భారతీయులు ఉన్నారని అధికారులు తెలిపారు. నేపాల్-టిబెట్ సరిహద్దుల్లోని భోటేకోశీ నదికి వరద భారీగా పోటెత్తింది. ఈ వరదల్లో పలు వంతెనలు కొట్టుకుపోవటంతో పాటు 13 జలవిద్యుత్ ప్రాజెక్టులు ధ్వంసమయ్యాయి.
బెంగళూరు వెళ్లిన ఉపముఖ్యమంత్రి భట్టి విక్రమార్క
ఉపముఖ్యమంత్రి భట్టి విక్రమార్క బెంగళూరు వెళ్లారు. కర్ణాటకలోని దేవదుర్గ బంగారం, రాగి బ్లాక్‌లను పరిశీలించనున్నారు. నేడు సింగరేణి అధికారులతో కలిసి గనులు పరిశీలించనున్నారు.

