ETV Bharat / state

26th June 2026 News Today AP Live News Updates: రేపు వెలిగొండ ప్రాజెక్టును సందర్శించనున్న సీఎం చంద్రబాబు

26th June 2026 News Today AP Live News Updates
26th June 2026 News Today AP Live News Updates (ETV Bharat)
author img

By ETV Bharat Andhra Pradesh Team

Published : June 26, 2026 at 7:01 AM IST

|

Updated : June 26, 2026 at 10:55 PM IST

Choose ETV Bharat

26th June 2026 News Today AP Live News Updates : మనమిత్ర వాట్సప్ గవర్నెన్స్‌పై ప్రజలకు అవగాహన కల్పించాలి - కుల, ఆదాయ ధ్రువపత్రాల మంజూరులో అడ్డంకులు తొలగించాలి - మనమిత్ర వాట్సప్ గవర్నెన్స్‌పై ప్రజలకు అవగాహన కల్పించాలి - ఆర్‌టీజీఎస్‌పై మంత్రి నారా లోకేశ్‌ సమీక్ష

LIVE FEED

8:15 PM, 26 Jun 2026 (IST)

రేపు వెలిగొండ ప్రాజెక్టును సందర్శించనున్న సీఎం

మార్కాపురం జిల్లాలో రేపు ముఖ్యమంత్రి చంద్రబాబు పర్యటించనున్నారు. దోర్నాల మండలం కొత్తూరు సమీపంలోని నిర్మాణంలో ఉన్న పూల సుబ్బయ్య వెలిగొండ ప్రాజెక్టును సందర్శించనున్నారు. గంటవాని పల్లె దగ్గర ఫిడర్ కెనాల్ పనుల పురోగతితో పాటు ముంపు గ్రామాల నిర్వాసితులకు పరిహారం అందించనున్నారు. సీఎం శనివారం ఉదయం 9 గంటల 45 నిమిషాలకు హైదరాబాద్ నుంచి బయలుదేరి 10 గంటల 45 నిమిషాలకు దోర్నాల మండలం గంటవానిపల్లె సమీపంలోని వెలిగొండ ప్రాజెక్టు ప్రాంతానికి చేరుకుంటారు. అధికారులతో మాట్లాడుతారు. రహదారి మార్గంలో ప్రాజెక్టు సమీపంలోకి వెళ్లి నిర్వాసితులకు పరిహారం పంపిణీ చేసి వారితో సంభాషిస్తారు. 12 గంటల 35నిమిషాలకు అక్కడి నుంచి హెలికాప్టర్లో గిద్దలూరు పర్యటనకు బయలుదేరుతారు. ఈ సందర్బంగా సీఎం పర్యటన ఏర్పాట్లను మంత్రి గొట్టిపాటి రవికుమార్, ఎమ్మెల్యే కందుల నారాయణ రెడ్డి, యర్రగొండపాలెం టీడీపీ ఇంచార్జ్ ఎరీక్షన్ బాబు, కలెక్టర్ విజయ సునీత పరిశీలించారు. హెలిప్యాడ్, నిర్వాసితులకు పరిహారం అందజేసే ప్రాంతం పరిశీలించారు. అధికారులను అడిగి వివరాలు తెలుసుకున్నారు

5:56 PM, 26 Jun 2026 (IST)

డ్రగ్స్ లేని సమాజాన్ని నిర్మించేందుకు అందరూ చేతులు కలపాలి: పవన్

మాదకద్రవ్యాలు అనేవి కేవలం వ్యక్తిగత సమస్య మాత్రమే కాకుండా, అవి నిశ్శబ్దంగా ఆరోగ్యాన్ని నాశనం చేస్తూ, కుటుంబాలను ముక్కలు చేస్తూ, మన సమాజ పునాదులనే బలహీనపరిచే ఒక తీవ్రమైన సామాజిక సవాలు అని ఉపముఖ్యమంత్రి పవన్ కల్యాణ్ అన్నారు. ఈ అంతర్జాతీయ మాదకద్రవ్యాల దుర్వినియోగం అక్రమ రవాణా వ్యతిరేక దినోత్సవం సందర్భంగా క్రమశిక్షణ, గౌరవం, సార్థకమైన జీవితం వైపు మన యువతను నడిపిస్తూ, ఒక డ్రగ్స్ లేని సమాజాన్ని నిర్మించేందుకు ఉద్దేశించిన అన్ని ఉమ్మడి ప్రయత్నాలకు తన పూర్తి మద్దతు ఉంటుందని పునరుద్ఘాటించారు.

5:14 PM, 26 Jun 2026 (IST)

ఆర్‌టీజీఎస్‌పై సమీక్షలో మంత్రి నారా లోకేశ్‌

మంత్రి నారా లోకేశ్‌ ఆర్‌టీజీఎస్‌పై సమీక్ష నిర్వహించారు. మనమిత్ర వాట్సాప్ గవర్నెన్స్ వినియోగంపై ప్రజల్లో అవగాహన కల్పించండని అధికారులకు సూచించారు. కుల, ఆదాయ ధృవీకరణ పత్రాల మంజూరులో అడ్డంకులు తొలగించాలని, రేషన్ కార్డుల విభ‌జ‌న‌ను మరింత సులభతరం చేయండని సూచించారు. అభ్యర్థి ఆధార్ నంబర్​తో సర్టిఫికెట్లన్నీ డీజీ వెరిఫై చేసేలా ఉండాలని ఆదేశించారు.

4:58 PM, 26 Jun 2026 (IST)

పెద్దపప్పూరులో ఆర్టీసీ డ్రైవర్‌పై గుర్తుతెలియని వ్యక్తుల దాడి

అనంతపురం: పెద్దపప్పూరులో ఆర్టీసీ డ్రైవర్‌పై గుర్తుతెలియని వ్యక్తులు దాడికి పాల్పడ్డారు. వరదాయపల్లెకు చెందిన వెంకటనారాయణపై వేటకొడవళ్లతో దాడి చేశారు. డ్రైవర్‌ వెంకటనారాయణకు తీవ్ర గాయాలవగా అతడ్ని అనంతపురం ఆస్పత్రికి తరలించారు. దాడి ఘటనపై కేసు నమోదు చేసిన పోలీసులు దర్యాప్తు చేపట్టారు.

4:56 PM, 26 Jun 2026 (IST)

పీసీబీ జోనల్ అధికారి అధికారి మునిప్రసాద్ ఇంట్లో ఏసీబీ సోదాలు

కర్నూలు: చాణక్యపురి కాలనీలో పీసీబీ జోనల్ అధికారి మునిప్రసాద్ ఇంట్లో ఏసీబీ సోదాలు ఏసీబీ సోదాలు నిర్వహించింది. యుగంధర్ మునిప్రసాద్ తిరుపతి పీసీబీ కార్యాలయంలో పనిచేస్తున్నారు. ఆదాయానికి మించిన ఆస్తుల ఆరోపణలతో ఏసీబీ సోదాలు చేపట్టింది.

4:27 PM, 26 Jun 2026 (IST)

ద్రాక్షారామం అగ్నిప్రమాద బాధితులకు అండగా సానా సతీశ్‌బాబు

కాకినాడ: ద్రాక్షారామం అగ్నిప్రమాద బాధితులకు సానా సతీశ్‌బాబు అండగా నిలిచారు. మార్కెట్ పునర్నిర్మాణానికి ఎంపీ సానా సతీశ్‌బాబు ఫౌండేషన్ తరఫున రూ.5 లక్షల ఆర్థిక సాయం ప్రకటించారు. ద్రాక్షారామం మార్కెట్ పునర్నిర్మాణం, వ్యాపారులకు అండగా ఉంటామన్న భరోసా ఇచ్చారు.

4:26 PM, 26 Jun 2026 (IST)

ఆసియా క్రీడలకు అర్హత సాధించిన జ్యోతికి మంత్రి లోకేశ్‌ అభినందనలు

ఆసియా క్రీడలకు అర్హత సాధించిన జ్యోతికి మంత్రి లోకేశ్‌ అభినందనలు తెలిపారు. వంద మీటర్ల హర్డిల్స్‌లో ఆసియా క్రీడలకు అర్హత సాధించిన జ్యోతి యర్రాజీ ఆసియా క్రీడల్లో జ్యోతి పతకం సాధించాలని ఆకాంక్షించారు.

3:57 PM, 26 Jun 2026 (IST)

ప్రమాద స్థలాలు గుర్తించి ముందుజాగ్రత్త చర్యలు తీసుకోవాలి: మంత్రి గొట్టిపాటి రవి

పల్నాడు జిల్లాలో వరుస రోడ్డు ప్రమాదాలపై మంత్రి గొట్టిపాటి రవి సమీక్ష నిర్వహించారు. జిల్లా కలెక్టర్, ఎస్పీతో మాట్లాడిన మంత్రి ప్రమాద స్థలాలు గుర్తించి ముందుజాగ్రత్త చర్యలు తీసుకోవాలని ఆదేశించారు. ప్రమాద సూచికలు ఏర్పాటు చేసి నష్ట నివారణ చర్యలు చేపట్టాలని సూచించారు. మాచర్ల వద్ద ప్రమాదంలో నలుగురు మరణించడంపై మంత్రి దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు.

3:32 PM, 26 Jun 2026 (IST)

పథకం ప్రకారమే మా అమ్మాయి రాధాగాయత్రిని హత్య చేశాడు: సుధాకర్‌

మా అల్లుడు శ్రీచరణ్‌ అందరినీ తప్పుదారి పట్టించాడని రాధాగాయత్రి తండ్రి తెలిపారు. పథకం ప్రకారమే తమ అమ్మాయి రాధాగాయత్రిని హత్య చేశాడని ఆవేదన చెందారు. భార్యపై ప్రేమ ఉన్నవాడు ఆమె దశదినకర్మకు ఎందుకు రాలేదని? సుధాకర్‌ ప్రశ్నించారు. సింహాచలం నుంచి ఒక్కసారిగా ఇల్లు ఎందుకు ఖాళీ చేశాడని? అడిగారు. మసూరీ పోలీసులు వేగంగా దర్యాప్తు చేయాలని రాధాగాయత్రి తండ్రి సుధాకర్‌ విజ్ఞప్తి చేశారు.

3:28 PM, 26 Jun 2026 (IST)

నాగరాజుకు అతడి స్నేహితుడు, ఇద్దరు సిబ్బంది సహకరించినట్లు సిట్ గుర్తింపు

విజయవాడ: సాయికృష్ణ అదృశ్యం కేసులో సిట్ విచారణ వేగవంతం చేసింది. నాగరాజుకు అతడి స్నేహితుడు, ఇద్దరు సిబ్బంది సహకరించినట్లు సిట్​ గుర్తించింది. నాగరాజు అరెస్టుతో హెడ్‌కానిస్టేబుళ్లు అశోక్, నాని అజ్ఞాతంలోకి వెళ్లారు. హెడ్‌కానిస్టేబుల్ అశోక్ ఇంటికి వెళ్లిన సిట్ పోలీసులు అతను ఇంట్లో లేకపోవటంతో వెనుతిరిగారు. ఇతడు సీఐ నాగరాజుకు అసిస్టెంట్‌గా ఉండేవాడు. ఇటివలే కృష్ణలంక పీఎస్‌లో హెడ్‌కానిస్టేబుల్‌గా నానికి పోస్టింగ్ వచ్చింది. మే 29న సాయికృష్ణ బంధువుల వద్దకు సురేశ్‌, అశోక్, నాని వడ్డేశ్వరం వెళ్లారని గుర్తించారు. పరారీలో ఉన్న ముగ్గురి కోసం సిట్ అధికారులు గాలిస్తున్నారు. మే 29న వడ్డేశ్వరం వెళ్లి సీసీ ఫుటేజ్ స్వాధీనం చేసుకున్నారు. సీడీఆర్‌, సీసీ ఫుటేజ్ ఆధారంగా ముగ్గురు కీలకంగా ఉన్నారని సిట్ వెల్లడించింది.

3:24 PM, 26 Jun 2026 (IST)

సంతమాగులూరు క్యాంపు కార్యాలయంలో సీఎంఆర్ఆఫ్ చెక్కుల పంపిణీ

ప్రకాశం: అద్దంకిలో మంత్రి గొట్టిపాటి రవికుమార్ పర్యటించారు. సంతమాగులూరు క్యాంపు కార్యాలయంలో సీఎంఆర్ఆఫ్ చెక్కుల పంపిణీ చేపట్టారు. సీఎం సహాయనిధి చెక్కులు, ఎల్‌వోసీ పత్రాలు పంపిణీ చేసిన మంత్రి గొట్టిపాటి 60 మంది లబ్ధిదారులకు రూ.44 లక్షలకు పైగా చెక్కులు అందజేశారు. 23 మంది లబ్ధిదారులకు ఎల్‌వోసీ పత్రాలు పంపిణీ చేశారు. అనంతరం అద్దంకి మున్సిపల్ అధికారులతో సమావేశమయ్యారు. అద్దంకి మంచినీటి పథకంపై అధికారులతో సమీక్షించారు. రూ.101 కోట్లతో అద్దంకిలో మంచినీటి పథకం ఏర్పాటుకు ఏఐఐబీ ముందుకొచ్చింది. తమ్మవరం నుంచి అద్దంకికి నీటి సరఫరా వ్యవస్థ ఏర్పాటు చేయనున్నట్లు అధికారులు వివరించారు. 5 వేల మంచినీటి కనెక్షన్లతో 85 కి.మీ మేర నీటి పంపిణీ వ్యవస్థ సిద్ధం కానుంది.

3:22 PM, 26 Jun 2026 (IST)

డ్రగ్స్‌ను మించిన అతిపెద్ద రాజకీయ మహమ్మారి వైఎస్సార్సీపీ: ప్రత్తిపాటి

డ్రగ్స్‌ను మించిన అతిపెద్ద రాజకీయ మహమ్మారి వైఎస్సార్సీపీ అని ఎమ్మెల్యే ప్రత్తిపాటి పుల్లారావు అన్నారు. జగన్ పాలనలో రాష్ట్రం స్కామ్‌లు, డ్రగ్స్‌ అడ్డాగా మారిందని ధ్వజమెత్తారు. వైఎస్సార్సీపీ విష ప్రచారం మత్తు పదార్థాల కంటే ప్రమాదకరమన్నారు. ఆ పార్టీ నాయకుల గాలి, మనుగడ ప్రజల ఉనికికే ప్రమాదకరమని ప్రత్తిపాటి వివరించారు.

3:20 PM, 26 Jun 2026 (IST)

ఏపీలో డ్రగ్స్‌ అక్రమ రవాణా పట్ల 'జీరో టాలరెన్స్' విధానం: సీఎం

డ్రగ్స్‌పై పోరాటం యువత భవిష్యత్తు కోసమే అని గుర్తించాలని సీఎం చంద్రబాబు అన్నారు. డ్రగ్స్‌ అక్రమ రవాణాపై ఉక్కుపాదం మోపుతామని, నిందితులను చట్టం ముందుంచుతామన్నారు. డ్రగ్స్‌ బాధితులు తిరిగి జీవితాలు నిర్మించుకోవడానికి సహాయం చేస్తామని సీఎం తెలిపారు. ఆంధ్రప్రదేశ్ డ్రగ్స్ కేంద్రమనేది ఇక గత చరిత్రని, ఏపీలో డ్రగ్స్‌ అక్రమ రవాణా పట్ల 'జీరో టాలరెన్స్' విధానం అమలు చేస్తున్నామన్నారు.

3:16 PM, 26 Jun 2026 (IST)

బారా షహీద్ దర్గాను టూరిజం హబ్‌గా తీర్చిదిద్దుతున్నాం: నారాయణ

బారా షహీద్ దర్గాను టూరిజం హబ్‌గా తీర్చిదిద్దుతున్నామని మంత్రి నారాయణ అన్నారు. ఎంతో నమ్మకంతో దేశ, విదేశాల నుంచి భక్తులు వస్తున్నారని, స్వర్ణాల చెరువులో నీటి శుభ్రతపై ప్రత్యేక దృష్టిపెట్టామని చెప్పారు. రొట్టెల పండుగ విధుల్లో 6,315 మంది మున్సిపల్ సిబ్బంది, 1,870 మంది పోలీసులు, గజ ఈతగాళ్లు పని చేస్తున్నారన్నారు. స్వర్ణాల చెరువులో షికారు కోసం 8 బోట్లు ఏర్పాటు చేసినట్లు వివరించారు. రాష్ట్రం అభివృద్ధి చెందాలి, అందరూ బాగుండాలని రొట్టె స్వీకరించనని నారాయణ అన్నారు.

3:15 PM, 26 Jun 2026 (IST)

ప్రజాస్వామ్యంలో నిలువెత్తు మానవత్వ రాజసం అశోక్ గజపతిరాజు: లోకేశ్‌

ముఖ్యమంత్రి చంద్రబాబు, మంత్రి లోకేశ్‌ గోవా గవర్నర్ అశోక్ గజపతిరాజుకు పుట్టినరోజు శుభాకాంక్షలు తెలిపారు. ప్రజాస్వామ్యంలో ఆయన నిలువెత్తు మానవత్వ రాజసం అని కొనియాడారు. రాజ‌కీయాల్లో అంద‌రి మ‌న్నన‌లు అందుకున్న అజాత‌శ‌త్రువని, ఆయన ఆయురారోగ్యాలతో వందేళ్లు వ‌ర్థిల్లాల‌ని ప్రార్థిస్తున్నట్లు లోకేశ్‌ పేర్కొన్నారు.

3:13 PM, 26 Jun 2026 (IST)

వినుకొండలో అంతర్రాష్ట్ర దొంగ పొట్టి రఫీ అరెస్టు

పల్నాడు జిల్లా: వినుకొండలో అంతర్రాష్ట్ర దొంగ పొట్టి రఫీ అరెస్టయ్యారు. వినుకొండకు చెందిన వజ్రాల వీరేంద్రరెడ్డి ఫిర్యాదుతో కేసు నమోదు చేశారు. నిందితుడి నుంచి రూ.27 లక్షల విలువైన చోరీ సొత్తు స్వాధీనం చేసుకున్నారు. దొంగతనాలకు వాడిన బైకు, ఆటోను పోలీసులు సీజ్ చేశారు. రాష్ట్రవ్యాప్తంగా 25 నేరాల్లో పొట్టి రఫీ నిందితుడిగా ఉన్నాడు.

3:11 PM, 26 Jun 2026 (IST)

భవిష్యత్తు బాగుండాలంటే డ్రగ్స్‌కు దూరంగా ఉండాలి: అనిత

మత్తు పదార్థాలకు బానిసలై జీవితాన్ని నాశనం చేసుకోవద్దని యువతకు హోంమంత్రి అనిత పిలుపునిచ్చారు. స్నేహితుడు చెప్పాడనో, తెలిసిన వాళ్లు చెప్పారనో అనవసర వ్యసనాలు అలవాటు చేసుకోవద్దని హితవు పలికారు. అంతర్జాతీయ మాదకద్రవ్యాల వ్యతిరేక దినోత్సవం సందర్భంగా విజయవాడలో నిర్వహించిన కార్యక్రమంలో హోంమంత్రి అనిత పాల్గొన్నారు. డ్రగ్స్‌ నివారణకు రెండేళ్లలో కూటమి ప్రభుత్వం చేసిన కార్యక్రమాలు, ఈగల్‌ వ్యవస్థతో తీసుకువచ్చిన మార్పును ఆమె వివరించారు. గంజాయి తీసుకోవడంతోపాటు రవాణా చేసినా కఠినమైన శిక్షలు పడతాయనే విషయాన్ని గుర్తుంచుకోవాలన్నారు. యువతే ఈ దేశానికి అతిపెద్ద ఆస్తి అన్న హోంమంత్రి చెడు వ్యసనాలకు దూరంగా ఉండి, ఉత్తమ సిటిజన్‌గా ఎదగాలని సూచించారు.

11:32 AM, 26 Jun 2026 (IST)

అనంతపురం: తాడిపత్రిలో ఉద్రిక్తత

అనంతపురం: తాడిపత్రిలో ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. వైఎస్సార్​సీపీ కార్యకర్తలపై దాడులు చేశారంటూ గాంధీ కూడలిలో దీక్షకు కేతిరెడ్డి పిలుపు నిచ్చారు. ఈ నేపథ్యంలో పోలీసులు ఆయనను గృహనిర్భందం చేశారు. ఫలితంగా ఇంటి వద్దే నాయకులు, కార్యకర్తలతో కలిసి కేతిరెడ్డి ఆందోళనకు దిగారు. గాంధీ కూడలిలో తలపెట్టిన దీక్షకు వెళ్లేందుకు కేతిరెడ్డి యత్నించగా పోలీసులు అడ్డుకున్నారు. పోలీసుల తీరుని నిరసిస్తూ కేతిరెడ్డి ఆందోళనకు దిగారు. దీంతో ఆయనను అనంతపురం తరలించేందుకు పోలీసులు యత్నించగా కార్యకర్తలు అడ్డుకున్నారు. పోలీసుల వాహనాలకు అడ్డుగా సిమెంట్ బెంచీలు నిరసన తెలుపుతున్నారు. పరిస్థితి అదుపులోకి తీసుకువచ్చేందుకు పోలీసుల యత్నిస్తున్నారు.

11:30 AM, 26 Jun 2026 (IST)

ఒంగోలులో మాదకద్రవ్యాల వ్యతిరేక దినోత్సవ ర్యాలీ

రాష్ట్రంలో గంజాయి, డ్రగ్స్​పై ఉక్కుపాదం మోపుతున్నామని మంత్రి డోలా శ్రీబాలవీరాంజనేయస్వామి అన్నారు. మాదకద్రవ్యాల వ్యతిరేక దినోత్సవం సందర్భంగా ఒంగోలులో ర్యాలీ నిర్వహించారు. ఈ ర్యాలీలో మంత్రి డోలా శ్రీబాలవీరాంజనేయస్వామి పాల్గొన్నారు. ఈగల్, రైల్వే వ్యవస్థలతో గంజాయి అక్రమ రవాణాకు చెక్ పెట్టామని, దేశంలో తొలిసారి అల్లూరి జిల్లాలో జీరో గంజాయి సాగు సాధించామని అన్నారు. ప్రభుత్వ ఆస్పత్రుల్లో డీ అడిక్షన్ సెంటర్లు ఏర్పాటు చేస్తున్నామని, విశాఖ, కడప, గుంటూరులో మోడల్ డీ అడిక్షన్ సెంటర్లు ఏర్పాటు చేశామని అన్నారు. గంజాయి, డ్రగ్స్ నేరస్థుల ఆస్తులు జప్తు చేస్తున్నామని అన్నారు.

10:12 AM, 26 Jun 2026 (IST)

నెల్లూరులో బారా షహీద్‌ దర్గా రొట్టెల పండుగ ప్రారంభం

నెల్లూరులో బారా షహీద్‌ దర్గా రొట్టెల పండుగ ప్రారంభమైంది. ఐదు రోజులపాటు బారా షహీద్‌ దర్గా రొట్టెల పండుగ కొనసాగనుంది. అమరుల సమాధుల దర్శనానికి భక్తులు భారీగా తరలివస్తున్నారు. వివిధ రాష్ట్రాల నుంచి కూడా భక్తులు తరలివస్తున్నారు. బారా షహీద్‌ల సమాధులకు పూజలు నిర్వహిస్తున్నారు. సమాధుల వద్ద పూజల కోసం క్యూలైన్లలో భక్తులు వేచి ఉన్నారు. స్వర్ణాల చెరువు వద్ద వరాల రొట్టెలను భక్తులు పంచుకుంటున్నారు. స్వర్ణాల చెరువు వద్ద పది ఘాట్లు భక్తులతో కిటకిటలాడుతున్నాయి. బారా షహీద్‌ రొట్టెల పండుగని రాష్ట్ర ప్రభుత్వం నిర్వహిస్తోంది.

9:29 AM, 26 Jun 2026 (IST)

టెకీ రాధా గాయత్రి మృతి ఘటనలో కొనసాగుతున్న విచారణ

విశాఖ: టెకీ రాధా గాయత్రి మృతి ఘటనలో విచారణ కొనసాగుతోంది. న్యాయం చేయాలని గాయత్రి తండ్రి సుధాకర్​ మసూరీ కలెక్టర్‌ ఆశిష్ చౌహాన్‌ని ఆశ్రయించారు. కలెక్టర్‌ ఆశిష్ చౌహాన్‌కు వినతిపత్రం ఇచ్చి విశాఖకు వచ్చారు. రాధా గాయత్రి ఐఫోన్ లాక్ తీయడానికి ప్రయత్నిస్తున్నారు. గాయత్రి కేసుని విచారణాధికారి సంపూర్ణానంద్‌ గైరోలా దర్యాప్తు చేస్తున్నారు. అల్లుడిపై అనుమానం వ్యక్తం చేస్తూ ఇప్పటికే విశాఖ డీసీపీతో పాటు మసూరీ పోలీసులకు గాయత్రి తండ్రి ఫిర్యాదు చేశారు. సుధాకర్ ఫిర్యాదుతో శ్రీచరణ్‌పై హత్యా నేరం కింద మసూరీలో కేసు నమోదు చేశారు. హత్యా నేరం కేసు తర్వాత శ్రీచరణ్​ కనిపించకుండా వెళ్లిపోయాడు.

8:53 AM, 26 Jun 2026 (IST)

మొహర్రం అంటేనే త్యాగం: సీఎం చంద్రబాబు

మొహర్రం అంటేనే త్యాగం అని సీఎం చంద్రబాబు అన్నారు. సత్య మార్గంలో నడవాలనే స్ఫూర్తిని మొహర్రం అందిస్తుందని అన్నారు. సత్యం, న్యాయం కోసం ఇమామ్‌ హుస్సేన్‌ పోరాడారని, ఇమామ్‌ హుస్సేన్‌ త్యాగాన్ని మొహర్రం సందర్భంగా స్మరించుకుందామని అన్నారు. మొహర్రం అందరికీ శాంతిని తీసుకురావాలి అన్నారు.

8:52 AM, 26 Jun 2026 (IST)

తిరుమల శ్రీవారి అభిషేక సేవలో డీజీపీ హరీశ్‌కుమార్ గుప్తా

తిరుమల శ్రీవారి అభిషేక సేవలో డీజీపీ హరీశ్‌కుమార్ గుప్తా పాల్గొన్నారు. సతీసమేతంగా స్వామివారి అభిషేక సేవలో డీజీపీ హరీశ్‌ పాల్గొన్నారు. శ్రీవారిని దర్శనం చేసుకుని మొక్కులు చెల్లించారు.

8:51 AM, 26 Jun 2026 (IST)

ద్రాక్షారామం అగ్నిప్రమాదంపై స్పందించిన మంత్రి అచ్చెన్న

కోనసీమ: ద్రాక్షారామం అగ్నిప్రమాదంపై మంత్రి అచ్చెన్న స్పందించారు. ఘటనపై జిల్లా కలెక్టర్‌తో ఫోన్‌లో మాట్లాడారు. మంత్రి వాసంశెట్టి సుభాష్‌తో ఫోన్‌లో పరిస్థితి సమీక్షించారు. బాధితులకు ప్రభుత్వం అన్ని విధాలా అండగా ఉంటుందని హామీ ఇచ్చారు. దుకాణదారులు ధైర్యంగా ఉండాలని, ప్రభుత్వం తోడు ఉంటుందని అన్నారు.

8:49 AM, 26 Jun 2026 (IST)

శాంతి, సామరస్యాల ప్రతీకగా మొహర్రం జరగాలి: లోకేశ్‌

శాంతి, సామరస్యాల ప్రతీకగా మొహర్రం జరగాలని మంత్రి లోకేశ్‌ ఆకాంక్షించారు. హజ్రత్ హుస్సేన్ త్యాగం స్మరించుకునే సందర్భం మొహర్రం జరుపుకొంటారని అన్నారు. ధర్మ పరిరక్షణకు పాటుపడటమే మొహర్రం ఇచ్చే సందేశం అని అన్నారు.

8:47 AM, 26 Jun 2026 (IST)

తాడిపత్రిలో వైఎస్సార్​సీపీ నేత కేతిరెడ్డి పెద్దారెడ్డి గృహనిర్బంధం

అనంతపురం: తాడిపత్రిలో వైఎస్సార్​సీపీ నేత కేతిరెడ్డి పెద్దారెడ్డిని గృహనిర్బంధం చేశారు. వైఎస్సార్​సీపీ కార్యకర్తలపై దాడులు చేశారంటూ గాంధీ కూడలిలో దీక్షకు కేతిరెడ్డి పిలుపు నిచ్చారు. ఫలితంగా భగత్ సింగ్ కాలనీలోని కేతిరెడ్డి పెద్దారెడ్డి ఇంటి వద్ద పోలీసులను మోహరించారు. వైఎస్సార్​సీపీ దీక్ష చేస్తే అడ్డుకుంటామని టీడీపీ నాయకులు పేర్కొన్నారు.

8:05 AM, 26 Jun 2026 (IST)

పల్నాడు జిల్లాలో ఘోర రోడ్డుప్రమాదం - నలుగురు మృతి

పల్నాడు జిల్లాలో జరిగిన రోడ్డుప్రమాదంలో నలుగురు మృతి చెందారు. మాచర్ల నగరవనం వద్ద ఆగి ఉన్న లారీని తుఫాన్​ వాహనం ఢీకొంది. ఈ ప్రమాదంలో నలుగురు అక్కడికక్కడే మృతి చెందగా 9 మందికి గాయాలయ్యాయి. క్షతగాత్రులను మాచర్ల, నరసరావుపేట తరలించి చికిత్స అందిస్తున్నారు. మృతులు హైదరాబాద్ వాసులుగా గుర్తించారు. బంధువు అంత్యక్రియలకు పామూరు వెళ్తుండగా ప్రమాదం జరిగింది. మృతి చెందిన వారిలో కదిరి వెంకటేశ్వర్లు, కదిరి శారద, పిడుగు శారద, పిడుగు సత్యనారాయణ ఉన్నారు. ప్రమాద సమయంలో వాహనంలో డ్రైవర్‌ సహా 13 మంది ప్రయాణికులు ఉన్నట్లు సమాచారం.

8:04 AM, 26 Jun 2026 (IST)

విశాఖలో డిప్యూటీ స్పీకర్ రఘురామకు చెందిన స్థలం కబ్జా

విశాఖలో డిప్యూటీ స్పీకర్ రఘురామకు చెందిన స్థలం కబ్జాకు గురైంది. మధురవాడ మారుతీనగర్ లేఅవుట్‌లోని డిప్యూటీ స్పీకర్​ రఘురామకు 333 గజాల స్థలం ఉంది. ఆ స్థలాన్ని ఫోర్జరీ సంతకాలు, నకిలీ పత్రాలతో కబ్జా చేసినట్లు గుర్తించారు. ఈ విషయంపై పీఎం పాలెం పోలీసులకు రఘురామ ఫిర్యాదు చేశారు.

8:02 AM, 26 Jun 2026 (IST)

తిరుమల సమాచారం

తిరుమలలో శ్రీవారి సర్వదర్శనానికి టోకెన్లు లేని భక్తులకు 24 గంటల సమయం పడుతోంది. సర్వదర్శనానికి బాట గంగమ్మ ఆలయం వరకు భక్తులు వేచి ఉన్నారు. నిన్న శ్రీవారిని 62,925 మంది భక్తులు దర్శించుకున్నారు. హుండీ ద్వారా రూ.3.77 కోట్లు ఆదాయం వచ్చింది. నిన్న శ్రీవారికి 36,297 మంది భక్తులు తలనీలాలు సమర్పించగా 4.23 లక్షల లడ్డూ ప్రసాదాల విక్రయాలు జరిగాయి.

6:44 AM, 26 Jun 2026 (IST)

ఘోర రోడ్డు ప్రమాదం - మృతులంతా హైదరాబాద్‌ వాసులుగా గుర్తింపు

పల్నాడు జిల్లాలో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. మాచర్ల నగరవనం వద్ద ఆగి ఉన్న లారీని తుఫాను వాహనం వెనుక నుంచి ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో నలుగురు అక్కడికక్కడే ప్రాణాలు కోల్పోయారు. పలువురు గాయపడ్డారు. క్షతగాత్రులను మాచర్ల ప్రభుత్వాసుపత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు. మృతదేహాలు వాహనంలోనే ఇరుక్కుపోవడంతో వాటిని బయటకు తీసేందుకు సహాయక చర్యలు చేపట్టారు. మృతులంతా హైదరాబాద్‌ వాసులుగా గుర్తించారు. బంధువులు మృతి చెందడంతో వాహనంలో పామూరు వెళ్తుండగా ప్రమాదం జరిగినట్టు సమాచారం. ఘటనపై మాచర్ల పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.

6:41 AM, 26 Jun 2026 (IST)

నెల్లూరులో బారా షహీద్‌ దర్గా రొట్టెల పండగ

నేటి నుంచి నెల్లూరులో బారా షహీద్‌ దర్గా రొట్టెల పండగ ప్రారంభం కానుంది. ఏటా 12 మంది అమరవీరుల సమాధులను దర్శించుకునేందుకు చుట్టుపక్కల జిల్లాలతో పాటు దేశంలోని వివిధ రాష్ట్రాల నుంచి భక్తులు భారీ సంఖ్యలో నెల్లూరుకు చేరుకుంటున్నారు. ఈనెల 30 వరకు బారా షహీద్‌ దర్గా రొట్టెల పండగ జరగనుంది.

6:37 AM, 26 Jun 2026 (IST)

చెట్టును ఢీకొట్టిన లారీ - డ్రైవర్ సజీవ దహనం

అనంతపురం జిల్లా బుదగవి సమీపంలో ప్రమాదం జరిగింది. కర్ణాటక నుంచి నెల్లూరుకు గ్రానైట్ గుండు తరలిస్తున్న లారీ చెట్టును ఢీకొట్టింది. ఈ ఘటనలో డ్రైవర్ సజీవ దహనం. క్లీనర్ సురక్షితంగా బయటపడ్డాడు. ఘటనాస్థలికి చేరుకుని పోలీసులు దర్యాప్తు చేపట్టారు.

Last Updated : June 26, 2026 at 10:55 PM IST