25th August 2026 News Today AP Live News Updates : జూడాల డిమాండ్లపై ప్రభుత్వం సానుకూలంగా ఉంది : మంత్రి సత్యకుమార్

By ETV Bharat Andhra Pradesh Team
Published : August 25, 2026 at 6:57 AM IST
|Updated : August 25, 2026 at 10:46 PM IST
25th August 2026 News Today AP Live News Updates: ఆంధ్రప్రదేశ్‌లో నేటి ముఖ్యమైన తాజా వార్తలు
LIVE FEED
అంతర్వేది సాగరసంగమం వద్ద మత్స్యకారుల బోటుకు ప్రమాదం
కోనసీమలో అంతర్వేది సాగరసంగమం వద్ద మత్స్యకారుల బోటుకు ప్రమాదం జరిగింది. వేట ముగించుకుని వస్తుండగా మత్స్యకారుల బోటు ప్రమాదానికి గురైంది. ప్రమాదానికి గురైన బోటులో ఏడుగురు మత్స్యకారులు చిక్కుకున్నారు. మత్స్యకారులను రక్షించేందుకు ఫిషింగ్ హార్బర్ నుంచి మరో బోటు వెళ్లింది. భారీ అలల తాకిడికి రంధ్రం పడటంతో బోటు వెనక్కి వచ్చేసింది. సముద్రంలో చిక్కుకున్న మత్స్యకారులను రక్షించేందుకు చర్యలు చేపట్టారు.
జూడాల డిమాండ్లపై ప్రభుత్వం సానుకూలంగా ఉంది : మంత్రి సత్యకుమార్
జూడాల డిమాండ్లపై ప్రభుత్వం సానుకూలంగా ఉందని మంత్రి సత్యకుమార్ తెలిపారు." జూడాల స్టయిపెండ్ పెంపుపై ప్రత్యేక కమిటీ ఏర్పాటు చేశాం. ఆరోగ్యశాఖ కార్యదర్శి వీరపాండియన్ ఆధ్వర్యంలో కమిటీ ఏర్పాటు చేశాం. జూడాల ప్రతినిధులతో ఒకట్రెండు రోజుల్లో కమిటీ సమావేశం ఏర్పాటు చేస్తాం. దక్షిణాది రాష్ట్రాలతో పోల్చి నిర్ణయం తీసుకుంటాం. ప్రొఫెసర్ల రిటైర్మెంట్ వయసు పెంపుపై తుది నిర్ణయం తీసుకోలేదు. జూడాల అభ్యంతరం దృష్ట్యా రిటైర్మెంట్ అంశాన్ని పునఃపరిశీలిస్తాం. నాన్‌క్లినికల్ పోస్టుల్లో ఎంఎస్సీ, పీహెచ్‌డీ నియామకాలపైనా సమీక్ష చేస్తాం. ఎన్‌ఎంసీ మార్గదర్శకాల మేరకే నోటిఫికేషన్లు జారీ చేశాం. జూడాల సమస్యలను సీఎం దృష్టికి తీసుకెళ్లాం. చర్చల ద్వారా ఆమోదయోగ్యమైన పరిష్కారం తీసుకొస్తాం. రాష్ట్రంలో 9,500 మంది జూడాలు వైద్యసేవలు అందిస్తున్నారు. సమ్మె విరమించిన జూడాలకు కృతజ్ఞతలు తెలియజేస్తున్నాం" అని మంత్రి సత్యకుమార్ అన్నారు.
ముగిసిన ఉమెన్ ఏపీఎల్ వేలం ప్రక్రియ
ఉమెన్ ఏపీఎల్ వేలం ప్రక్రియ ముగిసింది. మొత్తం 74 మంది క్రీడాకారులను 4 ఫ్రాంచైజీలు కొనుగోలు చేశాయి.
ఏఈ నూకరాజు మనవడుతో కలిసి కలెక్టర్ వద్దకు వెళ్లిన ఎంపీ
కాకినాడ: ఏఈ నూకరాజు మనవడుతో కలిసి కలెక్టర్ వద్దకు వెళ్లిన ఎంపీ ఉదయ్ శ్రీనివాస్.
గోదావరి పుష్కరాల నిర్వహణపై సీఎం చంద్రబాబు సమీక్ష
వచ్చే ఏడాది జూన్ 26 నుంచి జూలై 7 వరకు 12 రోజుల పాటు గోదావరి పుష్కరాలను అత్యంత వైభవంగా నిర్వహించాలని ముఖ్యమంత్రి చంద్రబాబు అధికారులను ఆదేశించారు. పుష్కర ఏర్పాట్లపై సీఎం సమీక్ష నిర్వహించారు. పుష్కరాలకు 8 నుంచి 10 కోట్ల మంది భక్తులు వచ్చే అవకాశం ఉన్నందున 440 ఘాట్లను సిద్ధం చేస్తున్నామని అధికారులు తెలిపారు. రూ. 4వేల కోట్లతో 4వేల932 పనులు చేపట్టాలని నిర్ణయించామని ఇప్పటికే 899 కోట్ల నిధులు కేటాయించినట్లు వెల్లడించారు. భక్తులకు ప్రపంచస్థాయి మౌలిక వసతులు, పారిశుద్ధ్యం, తాగునీరు, వైద్యం, భద్రత కల్పించడంతో పాటు AI క్రౌడ్ అనలిటిక్స్, CCTV, డ్రోన్ సర్వైలెన్స్ వంటి సాంకేతికతను వినియోగించనున్నారు. గోదావరి పరివాహకంలోని పుణ్యక్షేత్రాలను కలుపుతూ టెంపుల్ టూరిజం సర్క్యూట్ అభివృద్ధి చేయాలని సీఎం సూచించారు.
విజయసాయిరెడ్డి కాకమ్మ కథలు, ఉత్తరాంధ్ర ప్రజలకు తెలుసు: ఎంపీ విజయ్
విజయసాయిరెడ్డి కాకమ్మ కథలు ఉత్తరాంధ్ర ప్రజలకు తెలుసని ఎంపీ విజయ్ ఎద్దేవా చేశారు. విజయసాయిరెడ్డి చేసిన అక్రమాలు ఉత్తరాంధ్ర ప్రజలు మర్చిపోలేదని, ఆయన కొత్తగా హిందూత్వం గురించి మాట్లాడుతున్నారన్నారు. ఉత్తరాంధ్ర గుడులపై జరిగిన దాడులు మర్చిపోయారా విజయసాయిరెడ్డి అని సూటిగా ప్రశ్నించారు. సింహాచలం భూములపై కన్నేసి అశోక్‌గజపతిరాజును వేధించారన్నారు. రామతీర్థం ఘటన పక్కదారి పట్టించేందుకు అల్లర్లు సృష్టించారని ఎంపీ విజయ్ మండిపడ్డారు. హిందువులపై దాడులు చేయించి, హత్య కేసులు పెట్టించారని, విశాఖలోని సంపత్ వినాయక గుడి ట్రస్టీలను ఇబ్బంది పెట్టారన్నారు. ఇప్పుడు వచ్చి హిందూత్వం గురించి మాట్లాడటం సిగ్గుచేటని ఎంపీ విజయ్ ధ్వజమెత్తారు.
స్థానిక ఎన్నికల్లో విజయం కోసం కూటమి అభ్యర్థులు కృషి చేయాలి: మంత్రులు నిమ్మల, గొట్టిపాటి
మంత్రాలయంలో మంత్రులు గొట్టిపాటి రవి, నిమ్మల రామానాయుడు పర్యటించారు. మినిస్టర్స్ అవుట్‌రీచ్ కార్యక్రమంలో పాల్గొన్నారు. మంత్రాలయం రాఘవేంద్రస్వామి ఆలయాన్ని దర్శించుకుని, మాధవరం తండాలో పీఎం సూర్యఘర్ పథకాన్ని ప్రారంభించారు. ప్రజావేదిక కార్యక్రమంలో స్థానికుల సమస్యలు తెలుసుకున్న మంత్రులు విజయం కోసం కూటమి అభ్యర్థులు కృషి చేయాలన్నారు. వందశాతం విజయం సాధిస్తేనే కూటమి ప్రభుత్వానికి కొండంత ధైర్యమని మంత్రులు తెలిపారు. తాము పనిచేసినా సరిగా చెప్పుకోలేకపోతున్నామని, కానీ వైఎస్సార్సీపీ నేతలు మాత్రం లేనిపోనివి దుష్ప్రచారం చేస్తున్నారన్ని మంత్రులు ధ్వజమెత్తారు. అనేక మంచిపనులు చేసినా ప్రజలకు చెప్పడంలో వెనకబడే ఉన్నామన్నారు.
పోలవరం ఎడమకాలువ నీటి విడుదల ప్రాంతం పరిశీలించిన హోంమంత్రి
హోంమంత్రి పోలవరం ఎడమకాలువ నీటి విడుదల ప్రాంతం పరిశీలించారు. జలహారతి కార్యక్రమ ఏర్పాట్లపై అధికారులతో సమీక్ష జరిపారు. సీఎం చంద్రబాబు జలహారతి ఇచ్చేందుకు వచ్చేనెల మొదటివారం పాయకరావుపేట రానున్నారు. పోలవరం ఎడమకాలువ నీటితో ఉత్తరాంధ్రలో సాగు విస్తీర్ణం పెరగుతుందని హోం మంత్రి అనిత తెలిపారు.
అమరావతి ఈ-ఛాంపియన్స్ - కీలక క్రీడాకారిణుల వేలం
ఈ వేలంలో అమరావతి ఈ-ఛాంపియన్స్ ఫ్రాంచైజీ పలువురు కీలక క్రీడాకారిణులను సొంతం చేసుకుంది.హేమసాయి రమ్యను రూ.55 వేలకు, కర్రి సాయిపూజితను రూ.50 వేలు, నక్కా సనాను రూ.45 వేలు, ఓరుగంటి సాహితీశ్రీని రూ.40 వేలకు దక్కించుకుంది. బి.సాయిదీప్తి, తాళ్లూరి మల్లిక, బొడ్డుపల్లి తనిష్కను, సహస్రారెడ్డిని ఒక్కొక్కరినీ రూ.30 వేలకు దక్కించుకుంది.
చంద్రబాబు భగీరథ ప్రయత్నం వల్లే కరవు నేలపై కృష్ణమ్మ పరవళ్లు: ప్రత్తిపాటి
చంద్రబాబు భగీరథ ప్రయత్నం వల్లే కరవు నేలపై కృష్ణమ్మ పరవళ్లు తొక్కుతుందని ప్రత్తిపాటి పుల్లారావు తెలిపారు. వెలిగొండ చంద్రబాబు అకుంఠిత పట్టుదల, నిరంతర సాధనకు నిదర్శనమేనని ఆయన తెలిపారు. లక్షల ఎకరాలకు సాగు, వేల కుటుంబాలకు తాగునీటి సంకల్పం నెరవేరుతోందన్నారు. రాయలసీమ, నల్లమలప్రాంత ప్రజల దశాబ్దాల నిరీక్షణ ఫలించిందని ప్రత్తిపాటి పేర్కొన్నారు. సమర్థ నీటినిర్వహణలో చంద్రబాబు ముందుచూపుతో వెళ్తున్నారని, భవిష్యత్తును అంచనావేసే నాయకుడి వల్లే వెలిగొండ కల సాకారమైందని ఆయన అన్నారు.
పులివెందుల అర్బన్ సీఐ శ్రీరామ్‌ను వీఆర్‌కు పంపిన ఉన్నతాధికారులు
పులివెందుల అర్బన్ సీఐ శ్రీరామ్‌ను ఉన్నతాధికారులు వీఆర్‌కు పంపారు. సునీత ఆస్తుల రిజిస్ట్రేషన్‌లో ఆర్డీవో ఫిర్యాదుపై కేసు నమోదులో జాప్యం విషయంలో ఈ నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తుంది. కేసు నమోదు తర్వాత నిందితుల అరెస్టులో నిర్లక్ష్యం ప్రదర్శించారని ఆరోపణలున్నాయి. పులివెందుల అర్బన్ సీఐ శ్రీరామ్‌పై గతంలోనూ అనేక ఆరోపణలున్నట్లు తెలుస్తుంది.
స్థానిక సంస్థల ఎన్నికలపై నియోజకవర్గస్థాయి నేతలకు జగన్ దిశానిర్దేశం
స్థానిక సంస్థల ఎన్నికలపై నియోజకవర్గస్థాయి నేతలకు జగన్ దిశానిర్దేశం చేశారు. ప్రభుత్వం, స్థానిక సంస్థల స్థానిక సంస్థలకు ప్రత్యక్ష ఎన్నికలు జరపాలని భావిస్తున్నారని, అలా జరగడం ఒక విధంగా మనకు మంచిదే అని జగన్ నేతలతో అన్నారు. ప్రత్యక్ష ఎన్నికల వల్ల బలమైన అభ్యర్థిని నిలబెట్టే అవకాశం ఉంటుందన్నారు. ఎక్కడైనా ఏకగ్రీవమైతే వచ్చే ఎన్నికల్లో మీకు సీటు ఉండదని ఆ నియోజకవర్గ నేత ఎమ్మెల్యే పోటీలో ఉండరన్నారు. అన్ని స్థానాల్లో అభ్యర్థులు పెట్టారా? లేద? అని పరిశీలిస్తాన్నారు. నిలబెట్టిన అభ్యర్థులకు ఏ మేరకు అండగా నిలిచారనేది చూస్తానని జగన్ నేతలతో అన్నారు.
సమ్మె విరమిస్తున్నట్లు హైకోర్టుకు నివేదించిన జూడాల సంఘం
జూడాల సంఘం సమ్మె విరమిస్తున్నట్లు హైకోర్టుకు నివేదించింది. తమ డిమాండ్లు పరిష్కరించేలా ప్రభుత్వాన్ని ఆదేశించాలని అభ్యర్థించింది. రెండు వారాల్లో నిర్ణయం తీసుకోవాలని ప్రభుత్వానికి హైకోర్టు ఆదేశించింది. జూడాల సమ్మెపై దాఖలైన పిటిషన్‌పై హైకోర్టులో విచారణ చేపట్టింది.
యూకే ప్రభుత్వంతో రాష్ట్ర మున్సిపల్ శాఖ ఒప్పందం
యూకే ప్రభుత్వంతో రాష్ట్ర మున్సిపల్ శాఖ ఒప్పందం కుదిరింది. ఈ పత్రాలపై మంత్రి నారాయణ సమక్షంలో మున్సిపల్‌శాఖ ముఖ్యకార్యదర్శి, యూకే ప్రతినిధులు సంతకాలు చేశారు. సమావేశానికి ఏపీ, తెలంగాణ బ్రిటిష్ డిప్యూటీ హైకమిషనర్ హాజరయ్యారు. విన్ ఒవెన్ ఇన్‌ఫ్రాస్ట్రక్చర్, ప్రభుత్వ భాగస్వామ్యాలపై చర్చించారు. పురపాలికల అభివృద్ధికి యూకే ప్రభుత్వం సహకారం అందించనున్నట్లు మంత్రి నారాయణ తెలిపారు. ప్రపంచంలోని టాప్-5 నగరాల్లో అమరావతి ఒకటిగా మారుతుందన్నారు. ఇన్‌ఫ్రాస్ట్రక్చర్, అర్బన్ ప్లానింగ్, టెక్నాలజీ ట్రాన్స్‌ఫర్, అర్బన్ మొబిలిటీపై కలిసి పనిచేస్తాయన్నారు. పురపాలికల్లో రూ.40 వేల కోట్ల విలువైన పనులు ప్రారంభించినట్లు మంత్రి నారాయణ వివరించారు. రాష్ట్ర ఆర్థిక పరిస్థితి ఇబ్బందిగా ఉన్నా మౌళిక వసతులకు సీఎం ప్రాధాన్యత ఇస్తున్నారన్నారు.
వెలిగొండ జలసిరులు - అభివృద్ధికి రెక్కలు: సీఎం చంద్రబాబు
వెలిగొండ జలసిరులు - అభివృద్ధికి రెక్కలు అంటూ సీఎం చంద్రబాబు ట్వీట్ చేశారు. 30 ఏళ్ల క్రితం తీసుకున్న సంకల్పం నెరవేరిందంటూ ఎక్స్ వేదికగా తన భావాలను వ్యక్తం చేశారు. ఈ నెల 31న వెలిగొండ ప్రాజెక్టును ప్రారంభించబోతున్నట్టు వెల్లడించారు. రైతుల పొలాలకు నీరు, యువకులకు ఉపాధి, ప్రతి కుటుంబానికి భరోసా సంకల్పించామన్నారు. పశ్చిమ ప్రకాశం జిల్లా ప్రజలను ఫ్లోరైడ్ సమస్యకు శాశ్వత పరిష్కా - రం చూపిస్తామంటూ సీఎం భరోసా ఇచ్చారు. ఇంటింటికి కుళాయి ద్వారా ఫ్లోరైడ్ సమస్యకు శాశ్వత పరిష్కారం చూపిస్తామన్నారు. 30 ఏళ్ల క్రితం వెలిగొండ ప్రాజెక్టుకు తాను శంకుస్థాపన చేసిన ఫొటోను జతచేసిన సీఎం ఈ ట్వీట్ పంచుకున్నారు.
ఐఏఎస్ అధికారి విజయనగరం జిల్లా మాజీ జాయింట్ కలెక్టర్ కిషోర్ కుమార్‌పై విచారణ
ఐఏఎస్ అధికారి విజయనగరం జిల్లా మాజీ జాయింట్ కలెక్టర్ కిషోర్ కుమార్‌పై విచారణ కొనసాగుతున్నట్లు సంబంధిత అధికారులు తెలుపుతున్నారు. క్రమశిక్షణ చర్యల్లో భాగంగా విచారణ చేపట్టాలని ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. విచారణాధికారిగా విశ్రాంత ఐఏఎస్ అధికారి లక్ష్మీనరసింహంను నియమిస్తూ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది.
అమరావతి ఈ-ఛాంపియన్స్ జోరు
ఈ వేలంలో అమరావతి ఈ-ఛాంపియన్స్ ఫ్రాంచైజీ పలువురు కీలక క్రీడాకారిణులను సొంతం చేసుకుంది. విశాఖకు చెందిన షబ్నంను రూ.1.30 లక్షలకు ఆ జట్టు కొనుగోలు చేసింది. నీరగట్టు అనూషను అత్యధికంగా రూ.2.10 లక్షలకు దక్కించుకుంది. అలాగే బ్యాటర్ పరసా రంగలక్ష్మిని రూ.లక్షకు సొంతం చేసుకుంది. వికెట్ కీపర్ కాట్రగడ్డ దీక్షను రూ.1.90 లక్షలకు అమరావతి ఈ-ఛాంపియన్స్ కొనుగోలు చేసింది.
స్క్రబ్బర్ స్కామ్ నిందితుల రిమాండ్ పెంపు
మాషా అల్లా స్క్రబ్బర్ స్కామ్‌లో నిందితుల రిమాండ్ గడువు నేటితో ముగిసింది. వారిని అధికారులు వర్చువల్ విధానంలో విజయవాడ కోర్టు ముందు ప్రవేశపెట్టారు. కేసును విచారించిన న్యాయమూర్తి, ఆ నిందితుల రిమాండ్‌ను కూడా సెప్టెంబర్ 8 వరకు పొడిగిస్తూ ఉత్తర్వులు ఇచ్చారు.
సాయికృష్ణ కేసు నిందితుల రిమాండ్ పొడిగింపు
సాయికృష్ణ అదృశ్యం కేసులో నిందితుల జ్యుడీషియల్ కస్టడీ నేటితో ముగిసింది. దీంతో రిమాండ్‌లో ఉన్న నాగరాజు సహా ఇతర నిందితులను అధికారులు వర్చువల్ విధానంలో విజయవాడ కోర్టులో హాజరుపరిచారు. విచారణ జరిపిన న్యాయమూర్తి, వారి రిమాండ్‌ను సెప్టెంబర్ 8 వరకు పొడిగిస్తూ ఆదేశాలు జారీ చేశారు.
స్థానిక ఎన్నికలను తేలిగ్గా తీసుకోవద్దు: వైఎస్ జగన్
స్థానిక ఎన్నికలను ఎవరూ ఆషామాషీగా తీసుకోవద్దని వైఎస్సార్సీపీ అధినేత వైఎస్ జగన్ సూచించారు. ఇవి కేవలం గెలుపోటములను నిర్ణయించే ఎన్నికలు మాత్రమే కావన్నారు. పార్టీ కోసం నిరంతరం కష్టపడే కార్యకర్తల కోసం నిలబడాల్సిన కీలకమైన ఎన్నికలని ఆయన స్పష్టం చేశారు.
ప్రొద్దుటూరులో బంగారం, వెండి ధరలు
కడప జిల్లా ప్రొద్దుటూరులో 24 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ.1,57,550గా నమోదైంది. అలాగే 22 క్యారెట్ల 10 గ్రాముల బంగారం రూ.1,44,850 పలుకుతోంది. మరోవైపు కిలో వెండి ధర రూ.2,43,000 కు చేరుకుంది.
సాదిక్ ఖాన్ కస్టడీ కోరుతూ పోలీసుల పిటిషన్
సాదిక్ ఖాన్ కస్టడీ కోసం సర్పవరం పోలీసులు మొబైల్ కోర్టులో పిటిషన్ వేశారు. నిందితుడిని వారం రోజుల పాటు విచారణ నిమిత్తం తమ కస్టడీకి ఇవ్వాలని వారు కోరారు. దీనిపై త్వరలోనే విచారణ జరిపి కోర్టు తగిన నిర్ణయం తీసుకోనుంది.
191 మంది ప్లేయర్లకు వేలం
విజయవాడ: ఉమెన్ ఏపీఎల్ వేలం ప్రారంభమైంది. డబ్ల్యూఏపీఎల్‌లో 191 మంది ప్లేయర్లకు ఈ వేలం నిర్వహిస్తున్నారు. మేటి ఆటగాళ్లను వేలంలో 4 ఫ్రాంచైజీలు కొనుగోలు చేస్తున్నాయి. ప్లేయర్ల కొనుగోలు కోసం ఒక్కో ఫ్రాంచైజీ రూ.15 లక్షలు ఖర్చు చేయవచ్చు. సెప్టెంబర్ 15 నుంచి 26 వరకు మంగళగిరి వేదికగా డబ్ల్యూఐపీఎల్ మ్యాచ్‌లు నిర్వహించనున్నారు.
ఐదుగురు ఎర్రచందనం దొంగలు అరెస్ట్
అన్నమయ్య జిల్లా లక్కిరెడ్డిపల్లి మండలం బి.యర్రగుడి వద్ద అక్రమంగా తరలిస్తున్న ఎర్రచందనం దుంగలను పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. ఐదుగురు ఎర్రచందనం దొంగలను అరెస్టు చేశారు. వీరి నుంచి 6 దుంగలు, ఓ కారు స్వాధీనం చేసుకున్నారు. వీటి విలువ 9 లక్షలు ఉంటుందని నలుగురు లక్కిరెడ్డిపల్లి, ఒకరు కుప్పంకు చెందిన వారని రాయచోటి డీఎస్పీ కృష్ణమోహన్ తెలిపారు.
గ్రేట్ గ్రీన్ వాల్ ప్రాజెక్టులో తాటి వనాలు: పవన్‌కల్యాణ్
సుదీర్ఘ తీర ప్రాంతానికి సహజ రక్షణ కవచం ఓ భాగంగా ఏర్పాటు చేస్తున్న గ్రేట్ గ్రీన్ వాల్ ప్రాజెక్టులో తాటి వనాల పెంచే ప్రక్రియ మొదలైందని ఉప ముఖ్యమంత్రి పవన్ కల్యాణ్ వెల్లడించారు. రాష్ట్రవ్యాప్తంగా తీర ప్రాంతం వెంబడి 5,499 హెక్టార్ల పరిధిలో తాటి వనాల ఏర్పాటు చేస్తున్నట్లు తెలిపారు. తాటి కాయల సీజన్ ప్రారంభం కావడంతో తాటి గింజలు సేకరించి, నాటే కార్యక్రమానికి అటవీ శాఖ శ్రీకారం చుట్టిందని పవన్ వివరించారు. ప్రకృతి విపత్తుల సమయంలో తాటి వనాలు తీర ప్రాంత గ్రామాలకు తీవ్ర గాలుల నుంచి రక్షణ కల్పిస్తాయన్నారు. ఉప్పు నీరు, హోరు గాలులతో ఉండే తీర ప్రాంతాల్లోని కఠిన వాతావరణ పరిస్థితులను తాటి చెట్టు తట్టుకుని నిలబడుతుందని తెలిపారు. ఉప్పు నేలలు, ఇసుక, బుసకతో కూడిన తీర ప్రాంత ఒండ్రు నేలల్లో సైతం పెరిగే సామర్థ్యం తాటి చెట్టుకు ఉందన్నారు. ఎత్తుగా పెరిగే జాతి కావడంతో బలమైన సముద్ర గాలులకు సహజ నిరోధక వ్యవస్థగా పని చేస్తుందని తాటి వేర్లు నేలను గట్టిగా పట్టి ఉండడం వల్ల తీర ప్రాంతాల్లో కోత నిరోధక వ్యవస్థగా కూడా ఉంటుందని వివరించారు.
న్యాయం జరిగే వరకు పోరాడతా: మాజీ మంత్రి జోగి రమేశ్ కోడలు మేఘన
మాజీ మంత్రి జోగి రమేశ్ కోడలు మేఘన మీడియాతో మాట్లాడారు. తన మామ జోగి రమేశ్ చేసిన వ్యాఖ్యలు తీవ్ర మనస్తాపం కలిగించాయని ఆవేదన వ్యక్తం చేశారు. అసలు నిజాలన్నీ ఎఫ్‌ఐఆర్‌లో పొందుపరిచానని, ఆధారాలన్నీ పోలీసులకు అప్పగించానని తెలిపారు. భార్యాభర్తల సమస్యను సామరస్యంగా పరిష్కరించకుండా రాజకీయం చేశారని, తనకు న్యాయం జరిగే వరకూ పోరాటం కొనసాగిస్తానని స్పష్టం చేశారు.
వైఎస్సార్సీపీ హయాంలో బలహీనవర్గాలకు తీవ్ర అన్యాయం: మంత్రి అచ్చెన్నాయుడు
2019-24 మధ్య వైఎస్సార్‌సీపీ ప్రభుత్వం ప్రకృతి వనరులను విచ్చలవిడిగా దోచుకుందని మంత్రి అచ్చెన్నాయుడు విమర్శించారు. బీసీల మెడపై కత్తిపెట్టి అవినీతికి పాల్పడ్డారని, ఆర్థికంగా జగన్ బలపడితే బీసీలు నష్టపోయారని ఆరోపించారు. ఎలాంటి తప్పు చేయకపోయినా గత ప్రభుత్వంలో తనను రెండుసార్లు అక్రమంగా జైలుకు పంపారని ఆయన మండిపడ్డారు.
రాయదుర్గంలో వర్షంలోనూ మంత్రి లోకేశ్ రోడ్డుషో
మంత్రి నారా లోకేశ్ అనంతపురం జిల్లా రాయదుర్గం పర్యటనకు వచ్చారు. శాంతినగర్‌లో ఎన్టీఆర్ విగ్రహానికి ఆయన పూలమాలలు వేసి నివాళులు అర్పించారు. అనంతరం వర్షంలోనే భారీ రోడ్డుషో నిర్వహించారు. ఈ కార్యక్రమంలో మంత్రులు పయ్యావుల కేశవ్, కాలవ శ్రీనివాసులుతో పాటు పలువురు ఎంపీలు, ఎమ్మెల్యేలు పాల్గొన్నారు.
సుప్రీంకోర్టులో వైఎస్సార్సీపీకి ఎదురుదెబ్బ
వైఎస్సార్సీపీ నేత లేళ్ల అప్పిరెడ్డి దాఖలు చేసిన రిట్ పిటిషన్‌ను సుప్రీంకోర్టు కొట్టివేసింది. ప్రభుత్వ ఆదేశాలతో తమ సోషల్ మీడియా ఖాతాలు నిలిపివేశారని, అలాగే కర్నూలు, గుంటూరు జిల్లాల్లోని 4 కేసులపై వైఎస్సార్సీపీ అత్యున్నత న్యాయస్థానాన్ని ఆశ్రయించింది. అయితే ఈ పిటిషన్‌ను విచారించేందుకు జస్టిస్ దీపాంకర్ దత్తా, జస్టిస్ షీల్‌నాగు ధర్మాసనం నిరాకరించింది. ఏవైనా అభ్యంతరాలు ఉంటే హైకోర్టును ఆశ్రయించాలని సూచించింది.
నిబంధనలు ఉల్లంఘించిన సత్రం యాజమాన్యంపై చర్యలు: దేవస్థానం ఛైర్మన్, ఈవో
ఈ ఘటనపై శ్రీశైలం దేవస్థానం ఛైర్మన్ రమేష్‌నాయుడు, ఈవో శ్రీనివాసరావు తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. నిబంధనల ప్రకారం గదుల్లో భక్తులు బస చేయడానికి 48 గంటలు మాత్రమే అనుమతి ఉంటుందని, అయితే వడ్డెర సత్రం నిర్వాహకులు నిబంధనలు ఉల్లంఘించారని స్పష్టం చేశారు. ఈ వివాదంపై విచారణ జరిపి సత్రం యాజమాన్యంపై కఠిన చర్యలు తీసుకుంటామని తెలిపారు. గతంలో సీజ్ అయిన ఈ సత్రం, హైకోర్టు ఉత్తర్వులతో తిరిగి ప్రారంభమైంది.
ఆర్థిక ఇబ్బందులే కారణం: డీఎస్పీ రామాంజనేయులు
మృతులు గత నెల 28న ఆటోలో శ్రీశైలానికి వచ్చి, రోజుకు రూ.800 అద్దెతో వడ్డెర సత్రంలో ఉంటున్నారని డీఎస్పీ తెలిపారు. సుధాకర్‌కు పెళ్లి కాలేదని, ఇద్దరు చెల్లెళ్లు భర్తలను వదిలి ఇంట్లోనే ఉంటున్నారని చెప్పారు. తీవ్ర ఆర్థిక ఇబ్బందుల వల్లే ఈ ఐదుగురు ఆత్మహత్యకు పాల్పడినట్లు ప్రాథమిక విచారణలో తేలిందని, దీనిపై అన్ని కోణాల్లో దర్యాప్తు చేస్తున్నామని డీఎస్పీ వివరించారు.
శ్రీశైలంలో ఒకే కుటుంబానికి చెందిన ఐదుగురు ఆత్మహత్య
శ్రీశైలంలోని వడ్డెర సత్రం రూమ్ నెం.11లో ఒకే కుటుంబానికి చెందిన ఐదుగురు ఆత్మహత్య చేసుకున్నారు. మృతులను శ్రీసత్యసాయి జిల్లా బత్తలపల్లికి చెందిన పల్లపు సుధాకర్ (50), గోగుల ఆదిలక్ష్మి (36), మల్లేశ్వరి (45), శ్రీదేవి (33), మణికంఠ (15)గా పోలీసులు గుర్తించారు. ఇద్దరు పురుషులు ఫ్యాన్‌కు, ముగ్గురు మహిళలు కబోర్డు, బాత్రూం డోర్లకు ఉరేసుకుని చనిపోయారు. ఈ ఘటన మూడు రోజుల కిందట జరిగి ఉండవచ్చని పోలీసులు భావిస్తున్నారు.
ఏపీ లోకాయుక్తగా జస్టిస్ తల్లాప్రగడ మల్లికార్జునరావు ప్రమాణం
ఏపీ లోకాయుక్తగా జస్టిస్ తల్లాప్రగడ మల్లికార్జునరావు ప్రమాణం చేశారు. జస్టిస్ తల్లాప్రగడ మల్లికార్జునరావు ఐదేళ్లపాటు పదవిలో కొనసాగనున్నారు. మల్లికార్జునరావుతో గవర్నర్ జస్టిస్ అబ్దుల్ నజీర్ ప్రమాణం చేయించారు. ప్రమాణ కార్యక్రమంలో ముఖ్యమంత్రి చంద్రబాబు పాల్గొన్నారు.
శ్రీశైలంలోని వడ్డెర సత్రంలో ఐదుగురు ఆత్మహత్య
శ్రీశైలంలోని వడ్డెర సత్రంలో ఘోరం జరిగింది. ఒకే కుటుంబానికి చెందిన ఐదుగురు సామూహిక ఆత్మహత్యకు పాల్పడ్డారు. గదిలోని హాలులో ఇద్దరు ఫ్యాన్‌కు ఉరేసుకుని చనిపోగా, మరో ముగ్గురు మహిళలు స్నానాల గదిలో బలవన్మరణం పొందారు. ఆర్థిక ఇబ్బందుల వల్లే వీరు ఈ నిర్ణయం తీసుకుని ఉంటారని పోలీసులు అనుమానిస్తున్నారు. మృతులంతా అనంతపురం జిల్లా బత్తలపల్లి మండలానికి చెందిన వారిగా ప్రాథమికంగా గుర్తించారు. సమాచారం అందుకున్న ఆత్మకూరు డీఎస్పీ రామాంజనేయులు వెంటనే ఘటనా స్థలాన్ని పరిశీలించి కేసు దర్యాప్తు చేపట్టారు.
అభ్యర్థుల ప్రచారాన్ని నమ్మొద్దు: జనసేన
స్థానిక సంస్థల ఎన్నికల్లో పోటీ చేసే స్థానాలు, అభ్యర్థులపై వస్తున్న వార్తలను జనసేన ఖండించింది. అలాంటి తప్పుడు ప్రచారాలను నమ్మొద్దని పార్టీ కేంద్ర కార్యాలయం కోరింది. పవన్ కల్యాణ్ సూచనల మేరకే ఎన్నికల చర్చలు జరుగుతున్నాయని స్పష్టం చేసింది. కూటమి పక్షాలతో చర్చలు ఇంకా ప్రాథమిక దశలోనే ఉన్నాయని తెలిపింది. క్షేత్రస్థాయి పరిస్థితులను సమీక్షించాకే స్థానాలపై స్పష్టత వస్తుందని పేర్కొంది. అభ్యర్థుల ఎంపికపై తుది నిర్ణయం పవన్ తీసుకుంటారని తేల్చి చెప్పింది. ప్రతి ఒక్కరూ పార్టీ విధివిధానాలు, క్రమశిక్షణ పాటించాలని ఆదేశించింది.
హైదరాబాద్‌కు దీటుగా క్వాంటమ్ హబ్: మంత్రి నారాయణ
అమరావతిలో క్వాంటమ్ కంప్యూటింగ్ భవన నిర్మాణ పనులను మంత్రి నారాయణ పరిశీలించారు. డిసెంబర్ నాటికి ఈ భవనం సిద్ధమవుతుందని ఆయన తెలిపారు. జనవరి నుంచి క్వాంటమ్ సేవలు ప్రారంభం కానున్నాయని చెప్పారు. జర్మన్ టెక్నాలజీతో దీన్ని ఏర్పాటు చేస్తున్నట్లు వివరించారు. అమరావతి త్వరలోనే గొప్ప నాలెడ్జ్ హబ్‌గా మారుతుందని ధీమా వ్యక్తం చేశారు. హైదరాబాద్ ఐటీ హబ్ తరహాలో అమరావతిలో క్వాంటమ్ నిలుస్తుందన్నారు. చంద్రబాబు ముందుచూపు వల్లే ప్రపంచవ్యాప్తంగా తెలుగువారు ఐటీలో దూసుకెళ్తున్నారని మంత్రి ప్రశంసించారు.
మంత్రి లోకేశ్‌కు బళ్లారిలో ఘనస్వాగతం
బళ్లారి తాలూకా కుడితినిలో మంత్రి నారా లోకేశ్‌కు ఘనస్వాగతం లభించింది. రాయదుర్గం వెళ్తూ ఆయన కొద్దిసేపు ఇక్కడ ఆగారు. స్థానిక తెలుగు ప్రజలు, టీడీపీ అభిమానులు ఆయనకు బ్రహ్మరథం పట్టారు. కమ్మ సంఘం అధ్యక్షుడు రాము ఆధ్వర్యంలో గజమాలతో సత్కరించారు. యువత పెద్ద ఎత్తున బాణసంచా కాల్చి సంబరాలు జరుపుకున్నారు. ఉపాధి కోసం కర్ణాటకలో ఉన్నా టీడీపీకి అండగా నిలిచారని లోకేశ్ వారిని కొనియాడారు. పార్టీ కష్టకాలంలో ఉన్నప్పుడు వెన్నుదన్నుగా నిలిచారని ప్రశంసించారు. వారు ఏపీకి వచ్చి స్థిరపడేందుకు అన్ని రకాల ఏర్పాట్లు చేస్తామని హామీ ఇచ్చారు.
వింజమూరులో వైఆర్ కళాశాల స్వర్ణోత్సవాలు
నెల్లూరు జిల్లా వింజమూరులోని వైఆర్ జూనియర్ కళాశాల స్వర్ణోత్సవ వేడుకలకు మాజీ ఉపరాష్ట్రపతి వెంకయ్యనాయుడు ముఖ్య అతిథిగా హాజరయ్యారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. చదువుకున్న విద్యాసంస్థలో పూర్వ విద్యార్థులంతా ఇలా ఏకతాటిపైకి రావడం ఎంతో గొప్ప విషయమని కొనియాడారు. విద్యార్థులు ఉన్నత శిఖరాలను అధిరోహించాలని ఆకాంక్షించారు.
ఏఈ నూకరాజు కుటుంబం కేసులో ముమ్మర దర్యాప్తు
కాకినాడలో ఏఈ నూకరాజు కుటుంబం ఆత్మహత్య కేసు విచారణ వేగవంతమైంది. ప్రధాన నిందితుడు సాదిక్ ఖాన్‌ను పోలీసులు అరెస్టు చేసి రిమాండ్‌కు తరలించారు. జగదీశ్‌రెడ్డిది హత్యగా గుర్తించిన పోలీసులు, మరిన్ని వివరాల కోసం నిందితుడిని వారం రోజుల కస్టడీకి కోరనున్నారు. రాజమహేంద్రవరం టూటౌన్ పోలీసులు సైతం పీటీ వారెంట్‌పై విచారణ జరిపేందుకు సిద్ధమవుతున్నారు.
వంశధార కాల్వలో కారు బోల్తా
శ్రీకాకుళం జిల్లా నరసన్నపేట సమీపంలో వంశధార కాల్వలో కారు పడిన ఘటనలో మృతుల సంఖ్య రెండుకు చేరింది. కిన్నెరవాడ వద్ద కాల్వలో కారు బోల్తా పడగా, తాజాగా మరో యువకుడి మృతదేహాన్ని వెలికితీశారు. పోలీసులు ఘటనా స్థలానికి చేరుకుని వివరాలు సేకరిస్తున్నారు.
తునివాడ వద్ద స్కూల్ బస్సు బోల్తా
విజయనగరం జిల్లా రేగిడి మండలం తునివాడ సమీపంలో రోడ్డు ప్రమాదం జరిగింది. ఆరుగురు విద్యార్థులతో పాలకొండ వైపు వెళ్తున్న ఓ ప్రైవేట్ స్కూల్ బస్సు అదుపుతప్పి పొలాల్లోకి దూసుకెళ్లింది. ఈ ఘటనలో బస్సు బోల్తా పడటంతో ఓ విద్యార్థినికి గాయాలయ్యాయి. గమనించిన స్థానికులు వెంటనే బాధితురాలిని చికిత్స కోసం రాజాం ఆసుపత్రికి తరలించారు.
బళ్లారి విమానాశ్రయానికి చేరుకున్న మంత్రి నారా లోకేశ్
మంత్రి నారా లోకేశ్ బళ్లారి విమానాశ్రయానికి చేరుకున్నారు. కర్ణాటక మంత్రి నాగేంద్ర, మంత్రి పయ్యావుల కేశవ్, ఎంపీలు పార్థసారథి, లక్ష్మీనారాయణ ఆయనకు ఘన స్వాగతం పలికారు. అనంతరం హాలకుందిలోని సుజ్లాన్ బ్లేడ్ స్టాక్ యార్డును మంత్రి సందర్శించనున్నారు. అక్కడి నుంచి రాయదుర్గం చేరుకుని భారీ రోడ్‌షోలో పాల్గొంటారు. హులికెరలో 1,325 మెగావాట్ల పవన విద్యుత్ ప్రాజెక్టులతో పాటు సుజ్లాన్ ఎస్144 బ్లేడ్ ఉత్పత్తి లైన్లను ప్రారంభిస్తారు. నల్లంపల్లి వద్ద పార్టీ శ్రేణులతో ఆయన భేటీ అవుతారు.
స్నాప్‌చాట్ పరిచయంతో రూ.1.38 కోట్లకు మోసం
విజయవాడలో స్నాప్‌చాట్ పరిచయంతో రూ.1.38 కోట్లకు మోసం చేశారు. ఓ యువకుడు యువతిని బెదిరించి విడతలవారీగా డబ్బులు కాజేశాడు. యువతి లోన్ యాప్‌లు, ఇంట్లో నగలు అమ్మి యువకుడికి ఇచ్చింది. యువకుడు మళ్లీ బెదిరించడంతో సైబర్ పోలీసులను ఆశ్రయించింది.
తిరుపతిలో ఉత్సాహంగా రాష్ట్రస్థాయి క్రీడా పోటీలు
తిరుపతిలో అమరావతి ఛాంపియన్‌షిప్ రాష్ట్రస్థాయి క్రీడా పోటీలు రెండో రోజు ఉత్సాహంగా జరుగుతున్నాయి. రాష్ట్రంలోని 26 జిల్లాల నుంచి వచ్చిన క్రీడాకారులు ఈ పోటీల్లో పాల్గొంటున్నారు. అథ్లెటిక్స్, చెస్, యోగా, కబడ్డీ, బ్యాడ్మింటన్, బాక్సింగ్ విభాగాల్లో పోటీలు నిర్వహిస్తున్నారు. వీటితో పాటు వాలీబాల్, వెయిట్ లిఫ్టింగ్, బాస్కెట్‌బాల్, హాకీ, ఖో-ఖో, ఆర్చరీలోనూ క్రీడాకారులు ఉత్సాహంగా తలపడుతున్నారు.
క్రెడిట్ కార్డు వివరాలు కాజేసి సైబర్ మోసం
విజయవాడలో ఆన్‌లైన్ మోసం వెలుగుచూసింది. సైబర్ నేరగాళ్లు ఓ రైల్వే ఉద్యోగి క్రెడిట్ కార్డు వివరాలను కాజేశారు. ఆ కార్డు ఉపయోగించి బీహార్‌లోని ఓ చిరునామాకు ఏకంగా 8 మొబైల్ ఫోన్లను ఆన్‌లైన్‌లో ఆర్డర్ చేశారు. ఈ మోసం గురించి తెలుసుకున్న బాధితుడు వెంటనే పటమట పోలీసులను ఆశ్రయించి ఫిర్యాదు చేశారు.
పంచాయతీ నిధుల గోల్ మాల్ - వైఎస్సార్సీపీ నేత దంపతుల అరెస్టు
పల్నాడు జిల్లా నాదెండ్ల మండలం చిరుమామిళ్ల వైసీపీ నేత కోటిరెడ్డి దంపతులను పోలీసులు అరెస్టు చేశారు. గత ప్రభుత్వ హయాంలో రూ.47 లక్షల పంచాయతీ నిధులు దుర్వినియోగం చేశారని గ్రామస్థులు కలెక్టర్‌కు ఫిర్యాదు చేశారు. కలెక్టర్ ఆదేశాలతో విచారణ జరిపిన డిప్యూటీ ఎంపీడీవో అవకతవకలు జరిగినట్లు నిర్ధారించారు. దీంతో కేసు నమోదు కాగా, కోర్టు వారికి ముందస్తు బెయిల్ నిరాకరించింది. వెంటనే నరసరావుపేటలో కోటిరెడ్డి, ఆయన భార్య లక్ష్మిని పోలీసులు అరెస్టు చేశారు.
తిరుమల శ్రీవారి సర్వదర్శనానికి 8 గంటల సమయం
తిరుమలలో భక్తుల రద్దీ కొనసాగుతోంది. టోకెన్లు లేని భక్తులకు స్వామివారి సర్వదర్శనానికి 8 గంటల సమయం పడుతోంది. ప్రస్తుతం 14 కంపార్టుమెంట్లలో భక్తులు వేచి ఉన్నారు. నిన్న ఒక్కరోజే 77,085 మంది భక్తులు శ్రీవారిని దర్శించుకున్నారు. నిన్న శ్రీవారి హుండీ ఆదాయం రూ.4.61 కోట్లు రాగా, 33,766 మంది భక్తులు తలనీలాలు సమర్పించారు.
జగన్.. తనను తాను రక్షించుకోవడానికి ఏమైనా చేస్తారు: యనమల
తనను తాను రక్షించుకోవడానికి జగన్ ఏమైనా చేస్తారని టీడీపీ నేత యనమల విమర్శించారు. తన అవినీతి కేసుల్లో బీసీ నేతలను ఇరికిస్తున్నారని మండిపడ్డారు. బలహీన వర్గాలు రాజకీయంగా, ఆర్థికంగా ఎదగడం జగన్‌కు ఏమాత్రం ఇష్టం లేదన్నారు. బీసీల సమస్యల పరిష్కారానికి టీడీపీ మాత్రమే ప్రాధాన్యత ఇస్తుందని చెప్పారు. పార్టీ ఆవిర్భావం నుంచి బీసీలే టీడీపీకి వెన్నెముకగా ఉన్నారని యనమల స్పష్టం చేశారు.
నేడు మంత్రాలయం నియోజకవర్గంలో మంత్రులు నిమ్మల, గొట్టిపాటి పర్యటన
నేడు మంత్రాలయం నియోజకవర్గంలో మంత్రులు నిమ్మల, గొట్టిపాటి పర్యటించనున్నారు. మినిస్టర్స్ అవుట్ రీచ్ కార్యక్రమంలో మంత్రులు పాల్గొననున్నారు. ఈ సందర్భంగా రాఘవేంద్రస్వామి ఆలయాన్ని మంత్రులు దర్శించుకోనున్నారు. మాధవరంతాండాలో పర్యటించి ప్రజల సమస్యలు తెలుసుకోనున్నారు. ఇరువురి శాఖల అంశాలపై అధికారులతో సమీక్ష నిర్వహించనున్నారు. కూటమి పార్టీల నేతలతో విడివిడిగా సమావేశం కానున్నారు.
నేడు శ్రీశైలం దేవస్థానం ధర్మకర్తల మండలి సమావేశం
నేడు శ్రీశైలం దేవస్థానం ధర్మకర్తల మండలి సమావేశం జరగనుంది. ఛైర్మన్ రమేశ్ నాయుడు అధ్యక్షతన సభ్యులు సమావేశం కానున్నారు. శ్రీశైలం దేవస్థానం అభివృద్ధి, సౌకర్యాలపై ధర్మకర్తల మండలి చర్చించనున్నారు.
సాదిక్‌ఖాన్‌ను వారంపాటు కస్టడీకి ఇవ్వాలని ఇవాళ పిటిషన్ వేయనున్న పోలీసులు
ఏఈ నూకరాజు కుటుంబం ఆత్మహత్య కేసులో నిందితుడు సాదిక్‌ఖాన్‌ను 7 రోజుల కస్టడీకి కోరుతూ పోలీసులు నేడు కోర్టులో పిటిషన్ వేయనున్నారు. మరిన్ని విషయాలు రాబట్టేందుకు అతడిని ప్రశ్నించాలని పోలీసులు భావిస్తున్నారు. కాగా, నిన్న కోర్టు సాదిక్‌ఖాన్‌కు 14 రోజుల జ్యుడీషియల్ రిమాండ్ విధించిన విషయం తెలిసిందే.
ఉమెన్ ఏపీఎల్ వేలానికి సర్వం సిద్ధం
ఉమెన్ ఆంధ్రా ప్రీమియర్ లీగ్ వేలానికి విజయవాడలో సర్వం సిద్ధమైంది. 191 మంది క్రీడాకారిణులు ఈ వేలంలో పాల్గొంటున్నారు. నాలుగు ఫ్రాంచైజీలు ఒక్కొక్కటి రూ.15 లక్షలతో ప్లేయర్లను కొనుగోలు చేస్తాయి. ఈ లీగ్‌కు అంబాసిడర్‌గా మిథాలీరాజ్ వ్యవహరిస్తారు. సెప్టెంబర్ 15 నుంచి 26 వరకు మంగళగిరిలో డబ్ల్యూఏపీఎల్ మ్యాచ్‌లు జరగనున్నాయి.
ఇన్‌సర్వీస్ టీచర్లకు ప్రత్యేక టెట్
ఇన్‌సర్వీస్ టీచర్ల కోసం విద్యాశాఖ మంత్రి లోకేశ్ ప్రత్యేక టెట్ నోటిఫికేషన్ విడుదల చేశారు. వీరు టెట్ అర్హత సాధించేందుకు ఈ అవకాశం కల్పించారు. ఆగస్టు 25 నుంచి సెప్టెంబర్ 24 వరకు దరఖాస్తు చేసుకోవచ్చు. అక్టోబర్ 11 నుంచి 21 వరకు పరీక్షలు జరుగుతాయి. వివరాలకు cse.ap.gov.in, tet2dsc.apcfss.in వెబ్‌సైట్లను చూడవచ్చు.
నేడు అనంతపురంలో మంత్రి లోకేశ్ పర్యటన
మంత్రి నారా లోకేశ్ నేడు అనంతపురం జిల్లాలో పర్యటించనున్నారు. రాయదుర్గం, గోవిందవాడల్లో 1,325 మెగావాట్ల పవన విద్యుత్ ప్రాజెక్టులకు శ్రీకారం చుడతారు. హులికెరలో సుజ్లాన్ బ్లేడ్ల ఉత్పత్తి లైన్లను ప్రారంభిస్తారు. నల్లంపల్లిలో టీడీపీ శ్రేణులతో భేటీ అవుతారు. అంతకుముందు కర్ణాటకలోని జిందాల్ విమానాశ్రయం చేరుకుని, బళ్లారిలోని సుజ్లాన్ బ్లేడ్ స్టాక్ యార్డును సందర్శిస్తారు.

