ETV Bharat / state

22nd August 2026 News Today AP Live News Updates : కాకినాడ ఎస్‌కే నర్సింగ్‌ కాలేజ్‌లో విద్యార్థినుల మధ్య ఘర్షణ

22nd August 2026 News Today AP Live News Updates
ఈటీవీ భారత్ డైలీ​ తెలుగు న్యూస్​ అప్​డేట్స్​ (ETV Bharat)
author img

By ETV Bharat Andhra Pradesh Team

Published : August 22, 2026 at 7:00 AM IST

|

Updated : August 22, 2026 at 10:01 PM IST

Choose ETV Bharat

22nd August 2026 News Today AP Live News Updates : విశాఖ నోవాటెల్‌లో రెండో బ్రిక్స్‌ యువజన, క్రీడా మంత్రుల సమావేశం - బ్రిక్స్‌ సమావేశంలో పాల్గొన్న ముఖ్యమంత్రి చంద్రబాబు -సదస్సు ముగిశాక అమరావతి రానున్న సీఎం చంద్రబాబు

LIVE FEED

9:58 PM, 22 Aug 2026 (IST)

కాకినాడ ఎస్‌కే నర్సింగ్‌ కాలేజ్‌లో విద్యార్థినుల మధ్య ఘర్షణ

కాకినాడ ఎస్‌కే నర్సింగ్‌ కాలేజ్‌లో విద్యార్థినుల మధ్య ఘర్షణ చోటుచేసుకుంది. ఫోన్‌ పోయిందని మణిపుర్ విద్యార్థిని పోలీసులకు ఫిర్యాదు చేసింది. అనంతరం విద్యార్థినులు పరస్పరం కొట్టుకున్నారు, కొందరికి గాయాలయ్యాయి. కాకినాడ ప్రభుత్వాస్పత్రిలో ఇద్దరు విద్యార్థినులకు చికిత్స కొనసాగుతోంది. పోలీసులు వచ్చి నచ్చజెప్పడంతో వివాదం సద్దుమణిగింది. మణిపుర్ విద్యార్థినులను అధికారులు మరో హాస్టల్‌కు తరలించారు.

9:56 PM, 22 Aug 2026 (IST)

విదేశాల్లో ఉద్యోగాల పేరుతో ఘరానా మోసం

విదేశాల్లో ఉద్యోగాల పేరుతో ఘరానా మోసం విశాఖలో వెలుగులోకి వచ్చింది. మోసంపై గాజువాక పోలీసులకు బాధితులు ఫిర్యాదు చేశారు. 10 మంది నుంచి రూ.78 లక్షలు వసూలు చేసి నిందితులు పరారయ్యారు. గాజువాక పోలీసులు ముగ్గురు నిందితులను అరెస్టు చేశారు.

9:55 PM, 22 Aug 2026 (IST)

త్రిసూర్‌ చేరుకున్న ఉపముఖ్యమంత్రి పవన్ కల్యాణ్

కేరళం త్రిసూర్​కు ఉపముఖ్యమంత్రి పవన్ కల్యాణ్ చేరుకున్నారు. ఆయుర్వేద ఆస్పత్రిలో చికిత్స కోసం పవన్‌ కల్యాణ్‌ త్రిసూర్ వెళ్లారు.

8:18 PM, 22 Aug 2026 (IST)

జోగి రమేశ్‌, ఆయన కుటుంబసభ్యులకు ముందస్తు బెయిల్ మంజూరు

జోగి రమేశ్‌, ఆయన కుటుంబసభ్యులకు ముందస్తు బెయిల్ మంజూరు అయ్యింది. గృహహింస, హత్యాయత్నం కేసులో విజయవాడ కోర్టు బెయిల్ ఇచ్చింది. అలాగే రెండు వారాల్లోగా ఇబ్రహీంపట్నం స్టేషన్‌లో లొంగిపోవాలని కోర్టు ఆదేశించింది. రూ.25 వేలు చొప్పున వ్యక్తిగత పూచీకత్తు సమర్పించాలని షరతు విధించింది. పోలీసుల విచారణకు ఎప్పుడూ అందుబాటులో ఉండాలని కోర్టు ఆదేశించింది. సాక్షులను ప్రలోభపెట్టడం, బెదిరించడం చేయవద్దని కోర్టు ఆదేశించింది. కోర్టు ముందస్తు అనుమతి లేకుండా దేశం విడిచి వెళ్లరాదని ఆదేశించింది.

7:37 PM, 22 Aug 2026 (IST)

బ్రిక్స్‌ సమావేశంలో పాల్గొన్న ముఖ్యమంత్రి చంద్రబాబు

విశాఖలోని నోవాటెల్‌లో రెండో బ్రిక్స్‌ యువజన, క్రీడా మంత్రుల సమావేశం జరుగుతోంది. ఈ బ్రిక్స్‌ సమావేశంలో ముఖ్యమంత్రి చంద్రబాబు పాల్గొన్నారు. సదస్సు ముగిశాక సీఎం అమరావతికి రానున్నారు.

7:35 PM, 22 Aug 2026 (IST)

గుడివాడలో నాలుగేళ్ల పాప దామిని అదృశ్యం

కృష్ణా జిల్లా గుడివాడలో నాలుగేళ్ల పాప దామిని అదృశ్యం అయ్యింది. పాప అదృశ్యంపై తల్లిదండ్రులు పోలీసులకు ఫిర్యాదు చేశారు. పెద్దకాలువ సెంటర్‌లో పనికి వెళ్లిన తల్లి వద్దకు పాప ఒంటరిగా వెళ్లినట్లు గుర్తించారు. కేసు నమోదు చేసుకుని పోలీసులు దర్యాప్తు చేపట్టారు.

7:33 PM, 22 Aug 2026 (IST)

ఎన్టీఆర్‌ జిల్లాలో స్కూలు బస్సు బోల్తా

ఎన్టీఆర్‌ జిల్లా కొండూరు మండలం కట్టుబడిపాలెం వద్ద స్కూలు బస్సు బోల్తా పడింది. తారకరామ ఎత్తిపోతల కాలవలో ప్రైవేట్‌ స్కూల్‌ బస్సు బోల్తా పడింది. కాలవలో నీళ్లు తక్కువగా ఉండటంతో విద్యార్థులు సురక్షితంగా బయటపడ్డారు.

5:57 PM, 22 Aug 2026 (IST)

నిరుద్యోగులకు ప్రభుత్వం తీపికబురు

నిరుద్యోగులకు ప్రభుత్వం తీపికబురు చెప్పింది. 10,060 పోస్టులతో 'జాబ్ క్యాలెండర్ 2026' విడుదల చేసింది. నాలుగు దశల్లో ఉద్యోగాల భర్తీకి ప్రభుత్వం గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. సెప్టెంబరు, అక్టోబరు నెలల్లో ఈ నోటిఫికేషన్లు రానున్నాయి. గ్రూప్‌-1లో 149 పోస్టులు, గ్రూప్‌-2లో 673 పోస్టులను ప్రభుత్వం భర్తీ చేయనుంది. అలాగే పోలీసు, ఫైర్‌, జైళ్లు, అటవీ, పశుసంవర్థక శాఖ, ఎక్సైజ్, ఇంజినీరింగ్, విద్యుత్ శాఖల్లో ఖాళీగా ఉన్న పోస్టులను ప్రభుత్వం భర్తీ చేయనుంది. డీఎస్సీ ద్వారా 2,991 ఉపాధ్యాయ పోస్టులను ప్రభుత్వం భర్తీ చేయనుంది. పూర్తి వివరాలు http://goir.ap.gov.in వెబ్‌సైట్‌లో చూడాలని ప్రభుత్వం తెలిపింది. ఈ మేరకు ఆర్థికశాఖ అధికారులు జీవో విడుదల చేశారు.

2:47 PM, 22 Aug 2026 (IST)

హైదరాబాద్‌లో మాదాపూర్‌లో కుప్పకూలిన నిర్మాణంలో ఉన్న భవనం

మాదాపూర్‌లోని అంజయ్య నగర్‌లో నిర్మాణంలో ఉన్న భవనం కుప్పకూలింది. నాలా పక్కనే 50 గజాల స్థలంలో నిర్మాణంలో ఉన్న బహుళ అంతస్థుల భవనం ఒక్కసారిగా కుప్పకూలింది. శిథిలాల కింద ముగ్గురు కార్మికులు చిక్కుకున్నట్టు అనుమానిస్తున్నారు. నిర్మాణంలో ఉన్న భవనం కూలలి ఆ శిథిలాలు పక్కనున్న అపార్ట్‌మెంట్‌పై పడటంతో ఇద్దరికి గాయాలయ్యాయి. పక్కనే ఉన్న హాస్టల్‌ విద్యార్థులు భయంతో పరుగులు తీశారు. ఘటనా స్థలికి చేరుకున్న పోలీసులు సహాయక చర్యలు చేపట్టారు. ఒకవేళ సాయంత్రం వేళ ఈ ప్రమాదం జరిగి ఉంటే మాత్రం ప్రాణ నష్టం ఎక్కువగా ఉండేదని అపార్టుమెంటు వాసులు చెబుతున్నారు.

2:13 PM, 22 Aug 2026 (IST)

యూపీఎస్సీ, ఏపీపీఎస్సీ సంస్థలంటే యువతకు గొప్ప విశ్వాసం: మంత్రి పార్థసారథి

"యూపీఎస్సీ, ఏపీపీఎస్సీ సంస్థలంటే యువతకు గొప్ప విశ్వాసం. దేశ, రాష్ట్ర విధానాలను అమలు చేసే అత్యున్నత ఉద్యోగులను ఎంపిక చేస్తారు. విశ్వసనీయత దెబ్బతీసేలా ఎవరు ప్రవర్తించినా ఊరుకునేది లేదు. ఏపీపీఎస్సీలో జరిగిన పరీక్ష విధానం, మూల్యాంకనంపై యువత ఆలోచించాలి. పారదర్శక విధానాలు రూపొందించాల్సిన బాధ్యత ప్రభుత్వానిది. గొడ్డలి పార్టీ వ్యవహరించిన తీరు వ్యవస్థలపై విశ్వాసం కోల్పోయే పరిస్థితిని తీసుకొచ్చారు. పరీక్ష పత్రాలను స్ట్రాంగ్‌ రూమ్‌లో పెట్టకుండా రిసార్ట్స్‌లో పెడతారా?. రిసార్ట్స్‌కు తీసుకెళ్లి వారికి ఇష్టమొచ్చిన వారితో మూల్యాంకనం చేయిస్తారా?" అని మంత్రి పార్థసారథి ప్రశ్నించారు.

2:11 PM, 22 Aug 2026 (IST)

స్వచ్ఛ వినుకొండతో పాటు సురక్షిత వినుకొండే లక్ష్యం: జీవీ ఆంజనేయులు

స్వచ్ఛతతో ఆరోగ్య భద్రత. ఆధునిక అగ్నిమాపక సేవలతో ప్రాణ భద్రతే లక్ష్యమని జీవీ ఆంజనేయులు అన్నారు. ప్రజల జీవన ప్రమాణాల మెరుగుదలే కూటమి ప్రభుత్వ లక్ష్యమని తెలిపారు. వినుకొండ ఓబయ్య కాలనీలో స్వచ్ఛాంధ్ర-స్వర్ణాంధ్రలో జీవీ ఆంజనేయులు పాల్గొన్నారు. "పరిశుభ్రమైన పరిసరాలే ఆరోగ్యవంతమైన సమాజానికి పునాది. స్వచ్ఛతను ప్రతి ఇంటి బాధ్యతగా, ప్రజా ఉద్యమంగా మార్చాలి. స్వచ్ఛ వినుకొండతో పాటు సురక్షిత వినుకొండే లక్ష్యం" అని జీవీ ఆంజనేయులు పేర్కొన్నారు.

2:08 PM, 22 Aug 2026 (IST)

విద్యుత్ రంగ సంస్థల్లో ఏఈ ఉద్యోగాల నియామక పరీక్షకు ఏర్పాట్లు: మంత్రి గొట్టిపాటి రవికుమార్

"విద్యుత్ రంగ సంస్థల్లో ఏఈ ఉద్యోగాల నియామక పరీక్షకు ఏర్పాట్లు. 629 ఉద్యోగాలకు లక్షమందికిపైగా దరఖాస్తు చేసుకున్నారు. పారదర్శకంగా నిర్వహిస్తున్న పరీక్షను నిరుద్యోగులు సద్వినియోగం చేసుకోవాలి. దుష్ప్రచారాలు, వదంతులను ఎవరూ నమ్మొద్దు. ఉద్యోగాలు ఇప్పిస్తామంటూ నిరుద్యోగులను మోసగిస్తే కఠిన చర్యలు. ఎన్నికల ముందు ఇచ్చిన మాట ప్రకారం ఉద్యోగ ఖాళీలు భర్తీ చేస్తున్నాం" అని మంత్రి గొట్టిపాటి రవికుమార్ అన్నారు.

2:08 PM, 22 Aug 2026 (IST)

స్వచ్ఛత కోసం ముందుకొస్తున్న ప్రతిఒక్కరినీ అభినందిస్తున్నా: సీఎం

అభివృద్ధి అంటే పరిశ్రమలు, పెట్టుబడులు, కంపెనీలే కాదు. స్వచ్ఛమైన ప్రాంతాలని ముఖ్యమంత్రి చంద్రబాబు అన్నారు. స్వర్ణాంధ్ర- స్వచ్ఛాంధ్ర కార్యక్రమంలో భాగంగా అనకాపల్లి జిల్లా కె.కోటపాడు మండలం ఎ.కోడూరులో పర్యటించిన సీఎం ప్రజావేదికలో మాట్లాడారు. సెప్టెంబరు తొలివారంలోనే అనకాపల్లి, విశాఖకు గోదావరి జలాలు తీసుకొస్తామని ప్రకటించారు. మన ఊరు-మన బాధ్యత సంకల్పం అందరూ తీసుకోవాలని సూచించిన సీఎం స్వచ్ఛత కోసం ముందుకొస్తున్న ప్రతి ఒక్కరినీ అభినందించారు. ఆరోగ్యకర జీవనానికి స్వచ్ఛత మరింత అవసరమన్నారు. 2047 నాటికి మోదీ నాయకత్వంలో అగ్రదేశంగా వికసిత్‌ భారత్‌ వెలుగొందుతుందన్నారు. 2047కు తలసరి ఆదాయం రూ.50లక్షల వరకు పెరిగే అవకాశం ఉందని తెలిపారు.

12:47 PM, 22 Aug 2026 (IST)

ప్రభుత్వ పాఠశాల విద్యార్థి మాటలకు మురిసిపోయిన చంద్రబాబు

ప్రభుత్వ పాఠశాల విద్యార్థి మాటలకు సీఎం చంద్రబాబు మురిసిపోయారు. అభివృద్ధి కార్యక్రమాలు, పథకాలపై చక్కగా మాట్లాడిన విద్యార్థిని సీఎం అభినందించారు. పాఠశాలలో ముస్తాబు కార్యక్రమం చాలా బాగుందని ఓ చిన్నారి సీఎంకు వివరించారు.

11:55 AM, 22 Aug 2026 (IST)

ఫ్లయింగ్ బోర్డర్స్ సంస్థ ద్వారా నిరుద్యోగులకు కుచ్చుటోపి - సౌజన్యను అరెస్టు చేసిన పోలీసులు

విశాఖ: యూరప్ దేశాల్లో ఉద్యోగాల పేరుతో ఓ మహిళ భారీగా వసూళ్లు చేసింది. ఫ్లయింగ్ బోర్డర్స్ అనే సంస్థ ద్వారా నిరుద్యోగులకు సౌజన్య కుచ్చుటోపి పెట్టింది. విశాఖ, అల్లూరి, విజయనగరం, శ్రీకాకుళం జిల్లాల యువత నుంచి రూ.కోట్లు వసూళ్లు చేసింది. ఫేక్ మెయిల్‌తో నమ్మించిన సౌజన్య, ఉద్యోగాలు రాకపోవడంతో బాధితులు పోలీసులకు ఫిర్యాదు చేశారు. బాధితుల ఫిర్యాదు మేరకు ద్వారకా పోలీసులు కేసు నమోదు చేశారు. కృష్ణా జిల్లా తాడిగడపలోని సౌజన్య ఇంటికి విశాఖ పోలీసులు వెళ్లారు. సౌజన్యను అరెస్టు చేసి విశాఖకు తీసుకొచ్చారు.

11:48 AM, 22 Aug 2026 (IST)

బీసీల ద్రోహి జగన్, బీసీల బాంధవుడు చంద్రబాబు: పంచుమర్తి అనురాధ

"బీసీల ద్రోహి జగన్, బీసీల బాంధవుడు చంద్రబాబు. బీసీల రిజర్వేషన్లు 24 శాతం కుదించి జగన్ బీసీలకు అన్యాయం చేశారు. 34 శాతం పెంపు నిర్ణయంతో చంద్రబాబు సామాజిక న్యాయం చేశారు. బీసీల రక్షణ కోసం సీఎం చంద్రబాబు చట్టాన్ని తీసుకొస్తున్నారు. వైఎస్సార్సీపీ పాలనలో రాష్ట్రంలో ఎక్కడ చూసినా బీసీల ఆర్తనాదాలే. బీసీలపై చేయి వేయాలంటేనే భయపడేలా సీఎం, బీసీ రక్షణ చట్టం తెస్తున్నారు" అని పంచుమర్తి అనురాధ తెలిపారు.

11:46 AM, 22 Aug 2026 (IST)

తాడిపత్రిలో లారీల్లో అక్రమ మద్యం రవాణాపై సమగ్ర విచారణ జరపాలి: జేసీ ప్రభాకర్​రెడ్డి

తాడిపత్రి గోవా మద్యం వ్యవహారంపై జగన్‌ వ్యాఖ్యలపై జేసీ ప్రభాకర్‌రెడ్డి స్పందించారు. తాడిపత్రిలో లారీల్లో అక్రమ మద్యం రవాణాపై సమగ్ర విచారణ జరపాలన్నారు. "అక్రమ మద్యం కేసుపై పీఎస్‌ ఎదుట ధర్నాకు సిద్ధమయ్యాం. త్వరలోనే నిందితులను బయటపెడతామని పోలీసులు హామీ ఇచ్చారు. దర్యాప్తులో ఉన్నప్పుడు పోలీసులను ఇబ్బంది పెట్టకూడదని నిరసన విరమించా. మరికొందరి ప్రమేయం ఉందని, త్వరలోనే పట్టుకుంటామని పోలీసులు తెలిపారు. కొన్నిరోజుల్లో సమగ్ర విచారణ పూర్తిచేసి నిందితులను బహిర్గతం చేయాలి. నిందితుల వివరాలు వెల్లడించకపోతే మళ్లీ నిరసనకు దిగుతా" అని జేసీ ప్రభాకర్‌రెడ్డి పేర్కొన్నారు.

11:44 AM, 22 Aug 2026 (IST)

స్వర్ణాంధ్ర-స్వచ్ఛాంధ్ర కార్యక్రమంలో పాల్గొన్న సీఎం చంద్రబాబు

అనకాపల్లి జిల్లా కె.కోటపాడు మండలం ఎ.కోడూరులో సీఎం పర్యటిస్తున్నారు. స్వర్ణాంధ్ర-స్వచ్ఛాంధ్ర కార్యక్రమంలో సీఎం చంద్రబాబు పాల్గొన్నారు. ఎ.కోడూరులో ధర్మకోనేరు సుందరీకరణ పనులను సీఎం పరిశీలించారు. స్వర్ణాంధ్ర-స్వచ్ఛాంధ్రలో భాగంగా మొక్కలు నాటారు. ప్రభుత్వ పథకాల వల్ల ప్రయోజనాలను లబ్ధిదారుల నుంచి తెలుసుకున్నారు. ప్రభుత్వ పథకాలపై లబ్ధిదారులు సంతృప్తి వ్యక్తం చేశారు.

11:02 AM, 22 Aug 2026 (IST)

స్వర్ణాంధ్ర-స్వచ్ఛాంధ్ర కార్యక్రమంలో పాల్గొననున్న సీఎం చంద్రబాబు

అనకాపల్లి జిల్లా కె.కోటపాడు మండలం ఎ.కోడూరులో సీఎం పర్యటిస్తున్నారు. స్వర్ణాంధ్ర-స్వచ్ఛాంధ్ర కార్యక్రమంలో సీఎం చంద్రబాబు పాల్గొననున్నారు. ఎ.కోడూరు జెడ్పీ హైస్కూల్ సమీపంలోని సీఎం చంద్రబాబు ప్రజావేదికకు హాజరయ్యారు. ప్రసంగం అనంతరం పార్టీ కార్యకర్తల సమావేశంలో సీఎం పాల్గొంటారు.

11:01 AM, 22 Aug 2026 (IST)

పెదకాకాని శివాలయంలో ప్రత్యేక పూజలు చేసిన ఎమ్మెల్యే ధూళిపాళ్ల

గుంటూరు: పెదకాకాని శివాలయంలో ఎమ్మెల్యే ధూళిపాళ్ల ప్రత్యేక పూజలు చేశారు. ఆలయ ఈవో, పాలక మండలితో ధూళిపాళ్ల నరేంద్ర సమావేశమయ్యారు. ఆలయంలో అమ్మవారి మంగళసూత్రం మాయంపై పోలీసు కేసు నమోదు చేసుకున్నారు. మంగళసూత్రం మాయంపై ఎమ్మెల్యే ధూళిపాళ్ల నరేంద్ర వివరణ అడిగారు. తరచుగా ఆలయంలో ఇలాంటి ఘటనలు జరగడంపై ధూళిపాళ్ల నరేంద్ర ఆగ్రహం వ్యక్తం చేశారు.

10:55 AM, 22 Aug 2026 (IST)

11 బ్రిక్స్ దేశాల యువజన, క్రీడా శాఖల మంత్రులు, ప్రతినిధుల పర్యటన

విశాఖ: సాయంత్రం నోవాటెల్‌లో బ్రిక్స్ యువజన, క్రీడల మంత్రుల సమావేశం జరగనుంది. బ్రిక్స్ యువజన, క్రీడల మంత్రుల సమావేశం-2026లో సీఎం చంద్రబాబు పాల్గొననున్నారు. తొట్లకొండలో కేంద్రమంత్రి మన్‌సుఖ్‌ మాండవీయ మొక్కలు నాటారు. 11 బ్రిక్స్ దేశాల యువజన, క్రీడా శాఖల మంత్రులు, ప్రతినిధులు తొట్లకొండలో పర్యటించారు. తొట్లకొండను బ్రిక్స్ దేశాల క్రీడా శాఖ మంత్రుల బృందం సందర్శించింది. తొట్లకొండలోని మహాస్థూపం, బావులు, పాకశాల, ధ్యాన కేంద్రాల పరిశీలించారు. పురావస్తు అవశేషాలు, బౌద్ధ జీవన విధాన విశేషాలను అధికారులు వివరించారు.

10:40 AM, 22 Aug 2026 (IST)

విశాఖ టీడీపీ కార్యాలయంలో కార్యకర్తలను కలిసిన మంత్రి నారా లోకేశ్‌

విశాఖ టీడీపీ కార్యాలయంలో కార్యకర్తలను మంత్రి నారా లోకేశ్‌ కలిశారు. చంద్రపాలెం జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో లోకేశ్‌కు ఘనస్వాగతం పలికారు. రూ.6.48 కోట్లతో చేపట్టిన పాఠశాల పునర్నిర్మాణ పనులను లోకేశ్‌ ప్రారంభించారు. తాగునీటి ఆర్వో ప్లాంట్‌, వాలీబాల్‌ కోర్టు, వాకింగ్ ట్రాక్‌లు ప్రారంభించారు. విద్యార్థులతో కలిసి మంత్రి లోకేశ్ వాలీబాల్, బాస్కెట్ బాల్ ఆడారు.

10:39 AM, 22 Aug 2026 (IST)

ప్రతి నిర్వాసితుడు ఆనందంగా ఉండాలనేదే మా లక్ష్యం: మంత్రి నిమ్మల

"ప్రతి నిర్వాసితుడు ఆనందంగా ఉండాలనేదే మా లక్ష్యం. ఆర్థికంగా ఎన్ని కష్టాలు ఉన్నా, వెనక్కి తగ్గట్లేదు. గొడ్డలి పార్టీ ఐదేళ్లలో ఏ ప్రాజెక్టుకు అయినా కనీసం రూపాయి కూడా ఇచ్చారా?. నిర్వాసితులను మోసం చేసిన ఘనత ఒక్క జగన్‌కే దక్కింది. ఆఖరి నిర్వాసితుడి వరకు న్యాయం చేసే బాధ్యత మా ప్రభుత్వానిది. పూర్తికాని ప్రాజెక్టులను పూర్తయినట్లు చెప్పి ప్రజలను మోసం చేశారు. ఎన్నో దశాబ్దాల కలను సాకారం చేయబోతున్నాం. భవిష్యత్తులో వెలిగొండ ప్రాంతమంతా సస్యశ్యామలం కాబోతోంది. ఈనెల 31న వెలిగొండను ప్రారంభిస్తున్నాం" అని మంత్రి నిమ్మల రామానాయుడు తెలిపారు.

10:34 AM, 22 Aug 2026 (IST)

దిల్లీలో సాదిక్‌ను అదుపులోకి తీసుకున్న పోలీసులు

కాకినాడ: ఏఈ నూకరాజు కుటుంబం ఆత్మహత్య ఘటనలో ఆరోరోజు గాలింపు చర్యలు కొనసాగుతున్నాయి. ఈనెల 16న రాత్రి కుటుంబసభ్యులతో కలిసి నూకరాజు గోదావరిలో దూకారు. నూకరాజు భార్య మీనా మృతదేహం కోసం గాలింపు కొనసాగుతోంది. ఆత్మహత్యకు ముందు ఏఈ నూకరాజు మరణ వాంగ్మూలం రాశారు. తమ చావుకు సాదిక్ కారణమని మరో లేఖలో నూకరాజు కుమార్తె సౌజన్య రాసింది. తన భర్త చావుకు కూడా సాదిక్ కారణమని లేఖలో సౌజన్య పేర్కొంది. సాదిక్‌ఖాన్‌పై రాజమండ్రి టూటౌన్, సర్పవరం పీఎస్‌లలో కేసులు నమోదు చేశారు. సాదిక్‌పై 103(1), 308(5), 127(7), 351(3),108, 299 సెక్షన్ల కింద కేసు నమోదు చేశారు. రాత్రి దిల్లీలో సాదిక్‌ను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. సాదిక్ అరెస్టు విషయాన్ని పోలీసులు గోప్యంగా ఉంచారు. సాదిక్‌ను రేపు కాకినాడ తీసుకొచ్చేందుకు పోలీసులు ఏర్పాట్లు చేశారు. సాదిక్‌ను విచారిస్తే పూర్తి వివరాలు తెలుస్తాయన్నారు.

10:31 AM, 22 Aug 2026 (IST)

వెలిగొండ ప్రాజెక్టు నిర్వాసితులకు మూడో విడత పరిహారం అందజేత

వెలిగొండ నిర్వాసితులకు మూడోవిడత పరిహారాన్ని సీఎం చంద్రబాబునాయుడు అందజేశారు. శనివారం సీఎం క్యాంపు కార్యాలయంలో 2,027 కుటుంబాలకు గాను రూ.250 కోట్ల పరిహారాన్ని సీఎం చంద్రబాబునాయుడు నిర్వాసితులకు అందజేశారు. మొదటి విడతలో 2,557 కుటుంబాలకు రూ.318 కోట్లు ప్రభుత్వం చెల్లించింది. రెండో విడతలో 1,622 కుటుంబాలకు రూ.200 కోట్లను పరిహారంగా అందించింది. మూడో విడతగా ఇవాళ మరో 2,027 కుటుంబాలకు రూ.250 కోట్లు ఇచ్చింది. ఇవాళ్టి పరిహారంతో కలిపి 6,206 కుటుంబాలకు రూ.768 కోట్ల పంపిణీ చేసింది. ఇప్పటివరకూ 85 శాతం మేర ఆర్​అండ్​ఆర్ పూర్తి అయ్యింది. త్వరలో ఈ ప్రాజెక్టు మొదటి దశను సీఎం ప్రారంభించనున్నారు.

9:03 AM, 22 Aug 2026 (IST)

పార్వతీపురం జిల్లా ప్రభుత్వ ఆసుపత్రి మేడ పైనుంచి దూకిన యువకుడు

పార్వతీపురం జిల్లా ప్రభుత్వ ఆసుపత్రి మేడ పైనుంచి యువకుడు దూకాడు. గాయాలతో ఉన్న వ్యక్తిని మెరుగైన చికిత్స కోసం విజయనగరం తరలిస్తుండగా మృతి చెందాడు. యువకుడికి మతిస్థిమితం సరిగా లేదని ఆసుపత్రి వర్గాలు చెబుతున్నాయి. పార్వతీపురం పట్టణ పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.

8:59 AM, 22 Aug 2026 (IST)

నటుడు, కేంద్ర మాజీమంత్రి, పద్మభూషణ్ చిరంజీవికి జన్మదిన శుభాకాంక్షలు: సీఎం

నటుడు, కేంద్ర మాజీమంత్రి, పద్మభూషణ్ చిరంజీవికి సీఎం చంద్రబాబు జన్మదిన శుభాకాంక్షలు తెలిపారు. 1978లో తెలుగు చిత్రసీమలో అడుగు పెట్టి అంచెలంచెలుగా ఎదిగారన్నారు. ఎనలేని కీర్తి ప్రతిష్టలను, ఎంతోమంది అభిమానులను సొంతం చేసుకున్నారని చంద్రబాబు అన్నారు. రక్తనిధి, నేత్ర నిధి ఏర్పాటు చేసి మానవత్వాన్ని చాటుకున్నారని కొనియాడారు. ఇలాంటి పుట్టినరోజులు మరెన్నో జరుపుకోవాలని కోరుకుంటున్నానని సీఎం ఆకాంక్షించారు.

8:54 AM, 22 Aug 2026 (IST)

అనకాపల్లి, విజయనగరం, విశాఖ జిల్లాల్లో సీఎం చంద్రబాబు పర్యటన

నేడు ఉత్తరాంధ్రలో ముఖ్యమంత్రి చంద్రబాబు పర్యటించున్నారు. కె.కోటపాడు మండలం అలమండ సీఎం చంద్రబాబు వెళ్లనున్నారు. స్వర్ణాంధ్ర-స్వచ్ఛాంధ్ర కార్యక్రమంలో చంద్రబాబు పాల్గొననున్నారు. ఏ.కోడూరు జెడ్పీ హైస్కూల్ సమీపంలోని ప్రజావేదిక కార్యక్రమంలో పాల్గొని సీఎం ప్రసంగించనున్నారు. ప్రసంగం అనంతరం పార్టీ కార్యకర్తల సమావేశంలో పాల్గొననున్నారు. అనకాపల్లి జిల్లా పర్యటన అనంతరం విజయనగరం జిల్లా ఎస్.కోటకు సీఎం బయల్దేరనున్నారు. సాయంత్రం ఎమ్మెల్యే కె.లలితకుమారి నివాసానికి సీఎం వెళ్లనున్నారు. ఈనెల 27న శృంగవరపుకోట ఎమ్మెల్యే కోళ్ల లలితకుమారి కుమార్తె వివాహం జరగనుంది. ఈ క్రమంలో ముందస్తుగా వధూవరులను సీఎం చంద్రబాబు ఆశీర్వదించనున్నారు. సాయంత్రం విశాఖలో బ్రిక్స్ సదస్సులో సీఎం చంద్రబాబు పాల్గొననున్నారు. సాయంత్రం నోవాటెల్‌లో బ్రిక్స్ యువజన, క్రీడల మంత్రుల సమావేశాలకు హాజరుకానున్నారు. బ్రిక్స్ యువజన, క్రీడల మంత్రుల సమావేశం-2026లో సీఎం పాల్గొననున్నారు. విశాఖ పర్యటన ముగించుకుని రాత్రికి అమరావతికి సీఎం తిరుగుపయనం కానున్నారు.

8:51 AM, 22 Aug 2026 (IST)

వెలిగొండ ప్రాజెక్టు నిర్వాసితులకు నేడు మూడో విడత పరిహారం

వెలిగొండ ప్రాజెక్టు నిర్వాసితులకు నేడు మూడో విడత పరిహారం ముఖ్యమంత్రి చంద్రబాబు అందించనున్నారు. సీఎం క్యాంపు కార్యాలయంలో 2,027 కుటుంబాలకు రూ.250 కోట్ల చెక్కు సీఎం అందజేయనున్నారు. మొదటి విడతలో 2,557 కుటుంబాలకు రూ.318 కోట్లు ప్రభుత్వం చెల్లించింది. రెండో విడతలో 1,622 కుటుంబాలకు రూ.200 కోట్లను పరిహారంగా అందించింది. మూడో విడతగా నేడు మరో 2,027 కుటుంబాలకు రూ.250 కోట్లు ఇవ్వనుంది. నేడు అందించే పరిహారంతో కలిపి 6,206 కుటుంబాలకు రూ.768 కోట్ల పంపిణీ చేయనుంది. త్వరలోనే వెలిగొండ ప్రాజెక్టు మొదటి దశను సీఎం చంద్రబాబు ప్రారంభించనున్నారు.

8:47 AM, 22 Aug 2026 (IST)

శ్రీశైలం ప్రాజెక్టుకు కొనసాగుతున్న వరద

శ్రీశైలం ప్రాజెక్టుకు కొనసాగుతున్న వరద కొనసాగుతోంది. జూరాల నుంచి శ్రీశైలానికి 45,192 క్యూసెక్కులు నీటిని విడుదల చేశారు. శ్రీశైలం ప్రాజెక్టు పూర్తిస్థాయి నీటిమట్టం 885 అడుగులు కాగా ప్రస్తుత నీటిమట్టం 875.70 అడుగులకు చేరింది. ప్రాజెక్టు పూర్తిస్థాయి నీటి నిల్వ సామర్థ్యం 215.80 టీఎంసీలు కాగా ప్రస్తుత నీటి నిల్వ 166.70 టీఎంసీలగా నమోదైంది. ఎడమ జల విద్యుత్ కేంద్రంలో విద్యుదుత్పత్తి చేసి 35,315 క్యూసెక్కులు సాగర్‌కు విడుదల చేస్తున్నారు. హంద్రీనీవా ఎత్తిపోతల పథకానికి 3,050 క్యూసెక్కులు, కల్వకుర్తి ఎత్తిపోతల పథకానికి 2,400 క్యూసెక్కులు, పోతిరెడ్డిపాడు హెడ్ రెగ్యులేటర్‌కు 8 వేల క్యూసెక్కులు విడుదల చేస్తున్నారు.

8:44 AM, 22 Aug 2026 (IST)

నేడు శ్రీవారి ఆలయంలో పవిత్రోత్సవాలకు అంకురార్పణ

నేడు శ్రీవారి ఆలయంలో పవిత్రోత్సవాలకు అంకురార్పణ జరుగుతోంది. ఈ పవిత్రోత్సవాలు మూడు రోజుల పాటు సాగనున్నాయి. పవిత్రోత్సవాల సందర్బంగా ప్రతిరోజు ఉదయం 9 నుంచి 11 వరకు స్నపన తిరుమంజనం నిర్వహించనున్నారు. సాయంత్రం తిరువీధుల్లో మలయప్పస్వామి భక్తులకు దర్శనమివ్వనున్నారు.

8:39 AM, 22 Aug 2026 (IST)

తిరుమలలో టోకెన్లు లేని శ్రీవారి భక్తులకు సర్వదర్శనానికి 12 గంటలు

తిరుమలలో శ్రీవారి సర్వదర్శనానికి టోకెన్లు లేని భక్తులకు 12 గంటల సమయం పడుతోంది. శ్రీవారి సర్వదర్శనానికి 31 కంపార్టుమెంట్లలో భక్తులు వేచి ఉన్నారు. నిన్న శ్రీవారిని దర్శించుకున్న 78,057 మంది భక్తులు దర్శించుకోగా, హుండీ ఆదాయం రూ.4.15 కోట్లు వచ్చింది. నిన్న శ్రీవారికి 33,406 మంది భక్తులు తలనీలాలు సమర్పించారు.

8:38 AM, 22 Aug 2026 (IST)

కర్నూలు జిల్లాలో రోడ్డు ప్రమాదం - ఇద్దరు యువకులు మృతి

కర్నూలు జిల్లా తుగ్గలి మండలం జొన్నగిరి వద్ద రోడ్డు ప్రమాదం చోటు చేసుకుంది. జొన్నగిరి వద్ద లారీ ఢీకొని బైక్‌పై వస్తున్న ఇద్దరు యువకులు మృతి చెందారు. మృతులు మదనంతపురం వాసులు బాలమధు, మహేంద్రగా గుర్తించారు.

6:47 AM, 22 Aug 2026 (IST)

విజయవాడలో నేడు, రేపు భారతీయ జనతా యువమోర్చా ఆధ్వర్యంలో యువ సదస్సు

విజయవాడలో నేడు, రేపు భారతీయ జనతా యువమోర్చా ఆధ్వర్యంలో యువ సదస్సు నిర్వహించనున్నారు. వికసిత్ భారత్@2047–యంగ్ పొలిటికల్ లీడర్స్ డైలాగ్ పేరిట సదస్సు ఏర్పాటు చేయనున్నారు. యువ సదస్సును గోవా ముఖ్యమంత్రి ప్రమోద్ సావంత్ ప్రారంభించనున్నారు. యువ సదస్సులో కేంద్ర మంత్రి భూపతిరాజు శ్రీనివాస వర్మ, బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు మాధవ్, సుజనా చౌదరి పాల్గొననున్నారు.

6:45 AM, 22 Aug 2026 (IST)

ఉత్తరాంధ్రలో నేడు సీఎం చంద్రబాబు, లోకేశ్​ పర్యటన

ఉత్తరాంధ్రలో నేడు సీఎం చంద్రబాబు, మంత్రి లోకేశ్​ పర్యటించనున్నారు. ఉత్తరాంధ్రలోని మూడు జిల్లాల్లో సీఎం చంద్రబాబు పర్యటించనున్నారు. అనకాపల్లి, విజయనగరం, విశాఖలో సీఎం చంద్రబాబు పర్యటించనున్నారు. స్వర్ణాంధ్ర స్వచ్ఛాంద్ర కార్యక్రమంలో సీఎం చంద్రబాబు పాల్గొననున్నారు. ప్రజలు, ప్రజాప్రతినిధులు, పార్టీ శ్రేణులతో చంద్రబాబు, లోకేశ్​ మమేకం కానున్నారు. ఏ.కొడూరు జెడ్పీ హైస్కూలు సమీపంలోని ప్రజావేదిక సభలో సీఎం ప్రసంగించనున్నారు. అనంతరం టీడీపీ కార్యకర్తలతో సమావేశంకానున్నారు. సాయంత్రం విజయనగరం జిల్లా ఎస్.కోటకు సీఎం చంద్రబాబు వెళ్లనున్నారు. ఎమ్మెల్యే కె. లలితకుమారి నివాసానికి సీఎం చంద్రబాబు వెళ్లనున్నట్లు సమాచారం. అనంతరం విశాఖలో జరుగుతోన్న బ్రిక్స్‌ సదస్సులో సీఎం పాల్గొననున్నారు.

6:44 AM, 22 Aug 2026 (IST)

ఆయుర్వేద చికిత్స కోసం కేరళం వెళ్లనున్న ప‌వ‌న్ కల్యాణ్

నేడు ఉపముఖ్యమంత్రి పవన్‌ కల్యాణ్‌ కేరళం వెళ్లనున్నారు. ప్రకృతి వైద్య కేంద్రంలో పవన్‌ కల్యాణ్ చికిత్స చేయించుకోనున్నారు. ఆయుర్వేద చికిత్స కోసం ప‌వ‌న్ కేరళం వెళ్లనున్నారు. ఇటీవల ముంబయిలో పవన్‌ కల్యాణ్‌ భుజానికి శస్త్రచికిత్స చేయించుకున్నారు.

6:37 AM, 22 Aug 2026 (IST)

పోలవరం జిల్లాలో రోడ్డుప్రమాదం - ఇద్దరు మృతి

పోలవరం జిల్లా: చింతూరు మండలంలో రోడ్డు ప్రమాదం జరిగింది. రాత్రి బొడ్డుగూడెం-ఏడుగురాళ్లపల్లి జాతీయ రహదారిపై లారీని తప్పించబోయి మరో లారీని కారు ఢీకొంది. ఈ ఘటనలో ఇద్దరు మృతి చెందారు. ప్రమాద తీవ్రతకు కారులోనే ఒకరు సజీవ దహనం, మరో వ్యక్తికి తీవ్రగాయాలు అయ్యాయి. క్షతగాత్రుడిని ఆసుపత్రికి తరలించగా చికిత్స పొందుతూ మృతి చెందాడు. మృతులు తెలంగాణకు చెందిన వారిగా పోలీసులు గుర్తించారు.

Last Updated : August 22, 2026 at 10:01 PM IST