21st August 2026 News Today AP Live News Updates : ఏఈ కుటుంబం ఆత్మహత్య కేసులో కీలక పరిణామం - పోలీసుల అదుపులో సాదిక్‌ఖాన్!

By ETV Bharat Andhra Pradesh Team
Published : August 21, 2026 at 7:01 AM IST
|Updated : August 21, 2026 at 10:29 PM IST
21st August 2026 News Today AP Live News Updates :ఆయుర్వేద చికిత్స కోసం రేపు కేరళం వెళ్లనున్న ఉపముఖ్యమంత్రి పవన్ కల్యాణ్
LIVE FEED
ఏఈ నూకరాజు కుటుంబం ఆత్మహత్య కేసులో కీలక పరిణామం
కాకినాడకు చెందిన పంచాయతీరాజ్ ఏఈ నూకరాజు కుటుంబం సామూహిక ఆత్మహత్యకు కారకుడైన రైఫిల్ షూటింగ్ కోచ్ షేక్ సాధిక్ ఖాన్ ఎట్టకేలకు పోలీసులకు చిక్కినట్లు సమాచారం. గత అయిదు రోజులుగా నిందితుడిని పట్టుకునేందుకు పదిమంది ఎస్ఐలు సహా 40 మంది పోలీసులు ప్రత్యేక బృందాలుగా గాలిస్తున్నారు. శుక్రవారం పక్కా సమాచారంతో దిల్లీలో పోలీసు బృందాలు చేపట్టిన తనిఖీల్లో సాధిక్ చిక్కినట్లు తెలిసింది. నిందితుడ్ని ఆదివారం నాటికి కాకినాడకు తీసుకువచ్చే అవకాశం ఉంది. రాష్ట్రంలో సంచలనం కలిగించిన ఇంజినీరు నూకరాజు కుటుంబం ఆత్మహత్యతో పాటు, అతని అల్లుడు జగదీశ్వరరెడ్డి మృతి వెనుక సాధిక్ హస్తంపైనా పోలీసులు విచారించనున్నారు.
మార్గదర్శి అంశంలో సుప్రీంకోర్టు తీర్పుపై వెంకయ్యనాయుడు ట్వీట్
మార్గదర్శి అంశంలో సుప్రీంకోర్టు తీర్పుపై వెంకయ్యనాయుడు ట్వీట్ చేశారు. సుప్రీంకోర్టు చారిత్రాత్మక తీర్పు నిజాయతీకి దక్కిన మహోన్నత విజయంమని అభిప్రాయం వ్యక్తం చేశారు. హిమాలయమంత ధైర్యంతో రామోజీరావు సుదీర్ఘ న్యాయపోరాటం చేశారన్నారు. రామోజీరావు ఆత్మవిశ్వాసంతో నిందారోపణలు ఎదుర్కొని పోరాడారన్నారు. మార్గదర్శి వ్యవహారంలో అంతిమంగా ధర్మమే గెలిచిందన్నారు.
ఉయ్యూరులో 5 డయేరియా కేసులు నమోదైనట్లు తెలిపిన అధికారులు
కృష్ణా: ఉయ్యూరులో డయేరియా కేసులపై మంత్రి సత్యకుమార్ సమీక్ష నిర్వహించారు. 5 కేసులు నమోదైనట్లు అధికారులు తెలిపారు. డయేరియా రోగుల ఆరోగ్యం నిలకడగా ఉందని వివరించారు. వైద్యశిబిరం నిర్వహించి ఇంటింటి సర్వే కొనసాగిస్తున్నట్లు వివరించారు.
మద్యం తాగేందుకు డబ్బు అప్పు ఇవ్వలేదని కత్తితో దాడి
గుంటూరు: మద్యం తాగేందుకు డబ్బు అప్పు ఇవ్వలేదని దేవిరెడ్డి సాంబయ్య అనే వృద్ధుడిపై మరో వృద్ధుడు శరాబంది కత్తితో దాడి చేశారు. శరాబంది దాడిలో దేవిరెడ్డి సాంబయ్యకు తీవ్రగాయాలు కాగా ఆస్పత్రికి తరలించారు. పొన్నూరు మండలం మామిళ్లపల్లిలో ఈ ఘటన జరిగింది. పొన్నూరు రూరల్ పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు.
రేపు కేరళం వెళ్లనున్న ఉపముఖ్యమంత్రి పవన్ కల్యాణ్
ఉపముఖ్యమంత్రి పవన్ కల్యాణ్ రేపు కేరళం వెళ్లనున్నాారు. అక్కడ ప్రకృతి వైద్య కేంద్రంలో చికిత్స చేయించుకోనున్నట్లు తెలిసింది. ఆయుర్వేద చికిత్స కోసం కేరళం వెళ్లనున్నారు. ఇటీవల ముంబయిలో భుజానికి శస్త్రచికిత్స చేయించుకున్న సంగతి తెలిసింది.
షావుకారు జానకి మృతిపట్ల పవన్ కల్యాణ్ దిగ్భ్రాంతి
షావుకారు జానకి మృతిపట్ల పవన్ కల్యాణ్, మంత్రి కందుల దుర్గేశ్ దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. ఆమె ఆత్మకు శాంతి చేకూరాలి పవన్ కోరుకున్నారు. సినిమా పేరునే ఇంటి పేరుగా మార్చుకున్న నటి జానకి కథానాయికగా, క్యారెక్టర్ ఆర్టిస్టుగా విభిన్న పాత్రల్లో నటించారని అన్నారు. షావుకారు జానకి కుటుంబసభ్యులకు ప్రగాఢ సానుభూతి ప్రకటించారు.
'జీతాలు తీసుకుంటున్న గొడ్డలి పార్టీ నాయకులు ప్రజా సమస్యల కోసం అసెంబ్లీకి ఎందుకు రావట్లేదు'
జీతాలు తీసుకుంటున్న 11మంది గొడ్డలి పార్టీ నాయకులు ప్రజా సమస్యల కోసం అసెంబ్లీకి ఎందుకు రావట్లేదు చీఫ్ విప్ జీవీ కృష్ణ ధ్వజమెత్తారు. ప్రజా సమస్యల్ని గాలికి వదిలేశారు కాబట్టే అసెంబ్లీకి రాలేదన్నారు. అసెంబ్లీ నుంచి పారిపోయి పులివెందుల పిల్లుల్లా గొడ్డలి పార్టీ ఎమ్మెల్యేలు మారారన్నారు. గొడ్డలి పార్టీ నాయకులకు దేవాలయం లాంటి అసెంబ్లీకి వచ్చి మాట్లాడే దమ్ము లేదన్నారు. డీఎస్సీ నిర్వాహణ పై లోకేశ్ బయట పెట్టిన వాస్తవాలకు గొడ్డలి పార్టీ నేతకు మైండ్ బ్లాక్ అయిందని ఎద్దేవా చేశారు. 4 రోజుల పాటు జరిగిన అసెంబ్లీ సమావేశాల్లో ప్రభుత్వం వివిధ అంశాలపై అర్ధవంతమైన చర్చ చేపట్టిందన్నారు. 25గంటల 15నిమిషాలు పాటు సాగిన సభా సమయంలో 103 మంది సభ్యులు మాట్లాడారని, ఆ 11మంది కూడా వచ్చి ఉంటే 114మంది మాట్లాడినట్లయ్యేదన్నారు.
ముగిసిన ఈడీ సోదాలు
మాజీ మంత్రి వైఎస్ వివేకానందరెడ్డి హత్య కేసులో ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టరేట్ (ఈడీ) చేపట్టిన సోదాలు ముగిశాయి. మనీలాండరింగ్, నగదు లావాదేవీల కోణంలో శుక్రవారం ఉదయం నుంచి ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రాష్ట్రాల్లోని మొత్తం ఆరు ప్రాంతాల్లో ఈడీ అధికారులు ఏకకాలంలో ముమ్మర సోదాలు నిర్వహించారు. వైఎస్సార్సీపీ కడప ఎంపీ వైఎస్ అవినాశ్ రెడ్డి ఇళ్లతో పాటు కేసులోని ఇతర నిందితుల నివాసాల్లో ఈ తనిఖీలు చేయడంతో తెలుగు రాష్ట్రాల్లో సంచలనంగా మారింది. హైదరాబాద్, కడప సహా 7 చోట్ల చేసిన సోదాల్లో పలు పత్రాలు, డిజిటల్ పరికరాలు స్వాధీనం చేసుకున్నారు. అవినాశ్ రెడ్డి నివాసంలో లెక్కచూపని రూ.24 లక్షలు సీజ్ చేశారు. అలాగే 2 లాకర్ల తాళాలను స్వాధీనం చేసుకున్నారు.
షావుకారు జానకి ఆత్మకు భగవంతుడు శాంతి చేకూర్చాలి: సీఎం
అలనాటి ప్రముఖ నటి షావుకారు జానకి (94) ఆకస్మిక మరణం తనకు తీవ్ర దిగ్భ్రాంతి కలిగించిందని ముఖ్యమంత్రి చంద్రబాబు అన్నారు. 400కు పైగా చిత్రాల్లో నటించి ఎన్నో అవార్డులు, రివార్డులు పొందిన షావుకారు జానకి భౌతికంగా మనకు దూరం అయినా ఆమె నటించిన పాత్రల ద్వారా చిరస్థాయిగా మన మనసుల్లో నిలిచిపోతారని కొనియాడారు. షావుకారు జానకి ఆత్మకు ఆ భగవంతుడు శాంతి చేకూర్చాలని కోరుకుంటున్నానని అన్నారు. వారి కుటుంబ సభ్యులకు ప్రగాఢ సానుభూతి వ్యక్తం చేసారు.
షావుకారు జానకి సినీ రంగానికి అందించిన సేవలు చిరస్మరణీయం: నారా లోకేశ్
ప్రముఖ సినీ నటి, పద్మశ్రీ షావుకారు జానకి మృతిపట్ల విద్య, ఐటీ శాఖల మంత్రి నారా లోకేశ్ సంతాపం వ్యక్తం చేశారు. తెలుగు, తమిళ, కన్నడ భాషల్లో సుమారు 400 చిత్రాల్లో నటించి ప్రేక్షకులను అలరించిన షావుకారు జానకి, తాను నటించిన ‘షావుకారు’ చిత్రాన్నే ఇంటిపేరుగా మార్చుకున్నారని గుర్తు చేశారు. వైవిధ్యమైన పాత్రలతో తెలుగు ప్రేక్షకుల హృదయాల్లో చెరగని స్థానం సంపాదించుకున్నారని కొనియాడారు. సినీ రంగానికి ఆమె అందించిన సేవలు చిరస్మరణీయమన్నారు. షావుకారు జానకి పవిత్ర ఆత్మకు శాంతి చేకూరాలని భగవంతుడిని ప్రార్థిస్తూ, కుటుంబ సభ్యులకు ప్రగాఢ సానుభూతి తెలిపారు.
మార్గదర్శిపై ప్రజల్లో విశ్వాసానికి ప్రధాన కారణం నిజాయతీ, నిబద్ధత: ఎంపీ కలిశెట్టి
శ్రీకాకుళం: ఎంపీ కలిశెట్టి అప్పలనాయుడు మార్గదర్శి చిట్‌ఫండ్స్ కార్యాలయానికి వచ్చారు. తమ కుమార్తె నిఖిల తొలి జీతంతో రూ.25 లక్షల చిట్ వేయించారు. మార్గదర్శిపై రామోజీరావు ఆనాడే చెప్పిన మాట నిజమైందని ఎంపీ కలిశెట్టి అన్నారు. సుప్రీంకోర్టు తీర్పు దృష్ట్యా కేక్ కట్ చేసి ఎంపీ శుభాకాంక్షలు తెలిపారు. మార్గదర్శి కార్యాలయంలో మిఠాయిలు పంచారు. నిజం నిప్పులాంటిదని, ధర్మం ఎప్పటికైనా గెలుస్తుందని ఈ సందర్బంగా అన్నారు. న్యాయం ఆలస్యం కావొచ్చు కానీ అంతిమంగా దానిదే విజయమని స్పష్టం చేశారు. మార్గదర్శిపై ప్రజల్లో విశ్వాసానికి ప్రధాన కారణం నిజాయతీ, నిబద్ధత అని కలిశెట్టి వెల్లడించారు.
వైఎస్సార్సీపీ సభ్యులు “గద్దల్లా” వ్యవహరించారు: వర్ల రామయ్య
పెద్దల సభగా పిలిచే శాసనమండలిలో వైఎస్సార్సీపీ సభ్యుల తీరు మండలి ఔన్నత్యాన్ని దిగజార్చిందని ఎమ్మెల్సీ వర్ల రామయ్య విమర్శించారు. వైఎస్సార్సీపీ సభ్యులు “పెద్దల్లా” కాకుండా “గద్దల్లా” వ్యవహరించారని దుయ్యబట్టారు. మండలి ఛైర్మన్‌ను చుట్టుముట్టి ప్లకార్డులతో నినాదాలు చేయడం క్షమించరాని చర్యని మండిపడ్డారు. దళిత వర్గానికి చెందిన ఛైర్మన్‌ను అవమానించేలా వైఎస్సార్సీపీ సభ్యులు వ్యవహరించారని ధ్వజమెత్తారు. మెగా డీఎస్సీలో అవకతవకలు జరిగితే అసెంబ్లీలో చర్చిద్దామని మంత్రి లోకేశ్ సవాల్ చేశారని గుర్తు చేశారు. అసెంబ్లీకి రాకుండా మండలిని అగౌరవపరచడం జగన్ వైఖరికి నిదర్శనమని విమర్శించారు. మెగా డీఎస్సీలో ఎలాంటి అవకతవకలు జరగలేదని అధికారులు స్పష్టం చేసినా జగన్ అదే అంశాన్ని పట్టుకుని వేలాడుతున్నారని వర్ల రామయ్య ఆక్షేపించారు.
వైఎస్సార్ కడప జిల్లాలో రైతును చంపేసిన ప్రత్యర్థులు
వైఎస్సార్ కడప జిల్లా కలసపాడు మండలం ముదిరెడ్డిపల్లి గ్రామంలో రైతు శ్రీనివాసులు దారుణ హత్యకు గురయ్యారు. వ్యవసాయ పొలానికి నీరు కట్టుకునేందుకు వెళ్లిన శ్రీనివాసులును ప్రత్యర్థులు అతికరాతకంగా నరికి చంపేశారు. హత్యకు దారి తీసిన కారణాలను పోరుమామిళ్ల పోలీసులు ఆరా తీస్తున్నారు.
ముగిసిన పోలీసు కస్టడీ - జైలుకు తరలింపు
వైద్య విద్యార్థిని ప్రియాంక మృతి కేసులో నిందితుల రిమాండ్ పొడిగించారు. నిందితులైన సురవరపు దస్వంత్, ఆండ్రూ జోసఫ్ అడ్వర్డ్స్ రిమాండ్‌ను న్యాయస్థానం మరో 14 రోజుల పాటు పొడిగించింది. దర్యాప్తు జరుగుతున్నందున రిమాండ్ పొడిగించాలని పోలీసులు కోర్టును కోరారు. దీంతో న్యాయస్థానం సెప్టెంబర్ 3 వరకు పొడిగించింది. మరోవైపు నిందితుల రెండు రోజుల పోలీసు కస్టడీ ముగియడంతో రాజమహేంద్రవరం సెంట్రల్ జైలుకు తరలించారు.
డీఎస్సీలో అక్రమాలు జరగలేదని అధికారులే ఆధారాలతో వివరించారు: శాప్ ఛైర్మన్
మెగా డీఎస్సీలో ఎలాంటి అక్రమాలు జరగలేదని విద్యాశాఖ అధికారులే ఆధారాలతో సహా స్పష్టంగా వివరించారని స్పోర్ట్స్ అథారిటీ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ (శాప్) ఛైర్మన్ అనిల్‌కుమార్ రవినాయుడు స్పష్టం చేశారు. డీఎస్సీ నియామకాలపై ప్రభుత్వం ఎప్పుడో చర్చకు సిద్ధమని పిలిచినా, ప్రతిపక్ష నేత వైఎస్ జగన్ మోహన్ రెడ్డి కేవలం తప్పుడు ఆరోపణలు చేసి బెంగళూరు పారిపోతున్నారని ఆయన విమర్శించారు. అసలు అక్రమాలే జరగని డీఎస్సీపై సీబీఐ విచారణ అవసరం ఏముందని ప్రశ్నించిన రవినాయుడు, వైఎస్ వివేకానందరెడ్డి హత్య, తిరుమల పరకామణి, కల్తీ నెయ్యి వంటి తీవ్రమైన కేసులపై జగన్ ఎందుకు సీబీఐ విచారణ కోరడం లేదని నిలదీశారు. గతంలో తమ ప్రభుత్వ హయాంలో జరిగిన గ్రూప్-1 పరీక్షల అక్రమాలపై మీడియా ప్రశ్నిస్తే సమాధానం చెప్పలేక జగన్ సమావేశం నుంచి ఎందుకు లేచి వెళ్లిపోయారని ఆయన గుర్తుచేశారు. జగన్‌కు కనీసం డీఎస్సీ, ఏపీపీఎస్సీ వ్యవస్థల గురించి కనీస అవగాహన ఉండాలని, కొత్త స్పోర్ట్స్ పాలసీపై ఏమీ తెలియకుండా మాట్లాడుతున్నారని రవినాయుడు మండిపడ్డారు. ఉపాధ్యాయ నియామకాల్లో భాగంగా టెట్ (TET) పరీక్షలో అర్హత సాధించిన అభ్యర్థులకు మాత్రమే నిబంధనల ప్రకారం స్పోర్ట్స్ కోటాలో ఉద్యోగాలు కేటాయించామని శాప్ ఛైర్మన్ స్పష్టం చేశారు.
తుళ్లూరులో శివాలయం జీర్ణోద్ధరణకు హాజరైన మంత్రి నారాయణ
రాజధాని అమరావతి పరిధిలోని తుళ్లూరులో వందల ఏళ్లనాటి శివాలయ జీర్ణోద్ధరణ కార్యక్రమానికి మున్సిపల్ పరిపాలన, పట్టణాభివృద్ధి శాఖ మంత్రి పి. నారాయణ హాజరయ్యారు. ప్రభుత్వ సహకారంతో గ్రామస్థులు తిరిగి నిర్మిస్తున్న గంగా పార్వతీ సమేత శ్రీరామలింగేశ్వరస్వామి, బాలకోటేశ్వర స్వామివార్ల ఆలయ నిర్మాణ పనులకు ఆయన ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఈ సందర్భంగా తుళ్లూరు శివాలయానికి ఎంతో ప్రాశస్త్యం ఉందని కొనియాడిన మంత్రి, రాజధాని ల్యాండ్ పూలింగ్‌లో తుళ్లూరు రైతులు అందించిన సహకారాన్ని ప్రత్యేకంగా గుర్తుచేసుకున్నారు. ల్యాండ్ పూలింగ్ సమయంలో తాను కూడా రాజధాని రైతుల కుటుంబంలో ఒకడిగా ఉండి ఆ ప్రక్రియను పూర్తి చేశానని భావోద్వేగంగా పేర్కొన్నారు.అదే సమయంలో రాజధాని అభివృద్ధి పనులపై మంత్రి నారాయణ కీలక ప్రకటనలు చేశారు. రాజధానిలో ప్రాజెక్టుల వారీగా ల్యాండ్ పూలింగ్ జరుగుతోందని, ప్రతి నెలా ప్రాజెక్టుల వారీగా భవనాలను పూర్తిచేసి ప్రభుత్వానికి అందజేస్తామని స్పష్టం చేశారు. ప్రస్తుతం ప్రభుత్వం స్పోర్ట్స్ సిటీ, ఇన్నర్ రింగ్ రోడ్డు పనులపై ప్రత్యేకంగా దృష్టి సారించిందని వెల్లడించారు. రాబోయే 15 రోజుల్లో సీడ్ యాక్సెస్ రోడ్డును నేషనల్ హైవేకి కలిపే పనులను అధికారికంగా ప్రారంభిస్తామని మంత్రి నారాయణ ప్రకటించారు.
హైదరాబాద్ కోకాపేటలోని ఓపెన్ స్కైస్‌లోని అవినాశ్ రెడ్డి నివాసంలో సోదాలు
హైదరాబాద్ కోకాపేటలోని ఓపెన్ స్కైస్‌లోని అవినాశ్ రెడ్డి నివాసంలో హైదరాబాద్ ఈడీ జోనల్ అధికారుల బృందాలు సోదాలు చేస్తున్నారు. వివేకానందరెడ్డి హత్య కేసులో ఈడీ సోదాలు కొనసాగుతున్నాయి. సీబీఐ కేసు ఆధారంగా ఈడీ మరో కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. హత్యకు ముందు నగదు లావాదేవీల వ్యవహారం బయటకు రావడంతో దర్యాప్తు చేస్తున్నారు. సీబీఐ దర్యాప్తు సమయంలో బయటకొచ్చిన అంశాలపై మరింత విచారణ చేస్తున్నారు.
సభలో ఎలా వ్యవహరించాలో వైఎస్సార్సీపీ సభ్యులకు తెలియదు: వర్ల రామయ్య
సభలో ఎలా వ్యవహరించాలో వైఎస్సార్సీపీ సభ్యులకు తెలియదని ఎమ్మెల్సీ వర్ల రామయ్య తెలిపారు. హుందాగా ప్రవర్తించాల్సిన సభలో ఎలా పడితే అలా మాట్లాడతారా? అని ప్రశ్నించారు. "పెద్దల సభ అంటే అర్థం తెలుసా అని వైసీపీ సభ్యులను ప్రశ్నిస్తున్నా. అల్లరి మూకలా సభలో మాట్లాడేవాళ్లను ఏమనాలి?. సభలో నిన్న జరిగిన తీరు చూస్తే చాలా బాధేస్తోంది. ఇలాంటి అల్లరి మూకల మధ్య సభలో ఎలా ఉండగలమో ఆలోచించాలి. కౌన్సిల్‌లో ఎలా వ్యవహరించాలో వైఎస్సార్సీపీ సభ్యులు తెలుసుకోవాలి" అని వర్ల రామయ్య అన్నారు.
పులివెందులలో వైఎస్సార్సీపీ ఎంపీ అవినాష్‌రెడ్డి ఇంట్లో ముగిసిన ఈడీ సోదాలు
పులివెందులలో వైఎస్సార్సీపీ ఎంపీ అవినాష్‌రెడ్డి ఇంట్లో ఈడీ సోదాలు ముగిశాయి. ఉదయం నుంచి ఈడీ అధికారులు సోదాలు చేపట్టారు. వివేకా హత్య కేసు నిందితులు సునీల్‌యాదవ్, దేవిరెడ్డి ఇళ్లలో సోదాలు ముగిశాయి. శివశంకర్‌రెడ్డి, ఎర్ర గంగిరెడ్డి, దస్తగిరి ఇళ్లలోనూ సోదాలు ముగిశాయి. పులివెందుల నుంచి ఈడీ అధికారులు వెళ్లిపోగా, రెండు బ్యాగుల్లో కీలక డాక్యుమెంట్లు తీసుకెళ్లినట్లు సమాచారం.
ఇంద్రకీలాద్రిపై రెండు సముదాయాలకు ప్రారంభోత్సవం
ఇంద్రకీలాద్రి దుర్గగుడిపై రెండు నూతన సముదాయాలను దేవదాయ శాఖ మంత్రి ఆనం రామనారాయణరెడ్డి అధికారికంగా ప్రారంభించారు. దాదాపు ఒక దశాబ్దం సుదీర్ఘ నిరీక్షణ తర్వాత భక్తుల సౌకర్యార్థం రూ.26 కోట్లతో నిర్మించిన కనకదుర్గ అన్నప్రసాద సదనం, అలాగే రూ.26.50 కోట్లతో నిర్మించిన దుర్గాభవానీ మహా ప్రసాద భవనాన్ని ఆయన ప్రారంభించారు. ఈ సందర్భంగా మంత్రి స్వయంగా భక్తులకు అన్నప్రసాదాన్ని వడ్డించారు. అంతకుముందు ఆలయానికి విచ్చేసిన ప్రజాప్రతినిధులకు దుర్గగుడి ఛైర్మన్ రాధాకృష్ణ, ఈవో శీనానాయక్ ఘనంగా స్వాగతం పలికారు. ఈ ప్రతిష్టాత్మక కార్యక్రమంలో విజయవాడ ఎంపీ కేశినేని శివనాథ్ (చిన్ని), ప్రభుత్వ విప్ యార్లగడ్డ వెంకట్రావు, లంకా దినకర్, కొమ్మారెడ్డి పట్టాభిరామ్ పాల్గొన్నారు. వీరితో పాటు దేవదాయ శాఖ కమిషనర్ రామచంద్రమోహన్, కలెక్టర్ రాంప్రసాద్, నగర పోలీస్ కమిషనర్ రాజశేఖర్‌బాబు తదితర ఉన్నతాధికారులు కూడా ఈ ప్రారంభోత్సవ వేడుకలో భాగస్వాములయ్యారు.
కాకినాడ: ఏఈ నూకరాజు కుటుంబం ఆత్మహత్య కేసులో దర్యాప్తు ముమ్మరం
కాకినాడ ఏఈ నూకరాజు కుటుంబం ఆత్మహత్య కేసులో పోలీసులు దర్యాప్తును తీవ్రతరం చేశారు. ఈ కేసులో ప్రధాన నిందితుడైన సాదిక్ కోసం గాలించేందుకు పోలీసులు మొత్తం 10 ప్రత్యేక బృందాలను రంగంలోకి దించారు. ఇందులో భాగంగా రాజమహేంద్రవరంలో 5 బృందాలు, కాకినాడలో 3 బృందాలు గాలింపు చేపడుతుండగా, మరో రెండు బృందాలు సాంకేతిక అంశాలపై దృష్టి సారించాయి. నిందితుడు విదేశాలకు పారిపోకుండా రాజమహేంద్రవరం పోలీసులు ఇప్పటికే అతని పాస్‌పోర్టును సీజ్ చేసి, లుకౌట్ సర్క్యులర్ జారీ చేశారు. గతంలో అతను పాస్‌పోర్టుపై ఎక్కడికి వెళ్లాడు, ఎవరిని కలిశాడు అనే కోణంలో విచారణ జరుపుతున్నారు.
మరోవైపు నూకరాజు కుమార్తె సౌజన్య రాసిన ఆత్మహత్య లేఖలపై పోలీసులు విచారణ ముమ్మరం చేశారు. తమను మతం మారాలని, ఇస్లాం పుస్తకాలు చదవాలంటూ సాదిక్ వేధించినట్లు ఆమె ఆ లేఖలో పేర్కొనడంతో, ఈ మతమార్పిడి అంశంపై పోలీసులు లోతుగా దర్యాప్తు చేస్తున్నారు. ఈ ఒత్తిళ్ల వెనుక సాదిక్ ఒక్కడే ఉన్నాడా లేక ఇతరుల ప్రమేయం ఏదైనా ఉందా అనే కోణంలో కాల్ డేటా ఆధారంగా పలువురిని విచారిస్తున్నారు. ఇప్పటికే సాదిక్ కుటుంబసభ్యులు, బంధువులు, స్నేహితులను ప్రశ్నించిన పోలీసులు.. నిందితుడి ఫొటోలు, వివరాలను సోషల్ మీడియాలో విడుదల చేశారు. సాదిక్ ఆచూకీ తెలిపిన వారికి ప్రత్యేక రివార్డు అందజేస్తామని రాజమహేంద్రవరం, కాకినాడ పోలీసులు ప్రకటించారు.
వరలక్ష్మీ వ్రతం మన సంస్కృతి సంప్రదాయాలకు ప్రతీక: పవన్‌కల్యాణ్
వరలక్ష్మీ వ్రతం మన సంస్కృతి సంప్రదాయాలకు ప్రతీక అని ఉపముఖ్యమంత్రి పవన్‌కల్యాణ్ పేర్కొన్నారు. ఈ పవిత్ర పర్వదినం మన ఆధ్యాత్మిక వారసత్వంలోని గొప్ప విశిష్టతను ప్రతిబింబిస్తుందని ఆయన తెలిపారు. లోకమాతను వరలక్ష్మీ స్వరూపంగా పూజిస్తూ, అందరూ ఆరోగ్యం, ఆనందం, ఐశ్వర్యం కోసం ప్రార్థిస్తారని వివరించారు. ఆ వరలక్ష్మీ అమ్మవారి కరుణాకటాక్షాలు అందరికీ అందాలని కోరుకుంటూ, ప్రజలందరికీ ఆయన తన హృదయపూర్వక వరలక్ష్మీ వ్రతం శుభాకాంక్షలు తెలియజేశారు.
పులివెందులలో అప్రూవర్ దస్తగిరి ఇంట్లో ఈడీ అధికారుల సోదాలు
వైఎస్ వివేకానందరెడ్డి హత్య కేసుకు సంబంధించి ఈడీ అధికారులు పులివెందులలో అప్రూవర్‌గా మారిన దస్తగిరి నివాసంలో అధికారులు తనిఖీలు నిర్వహించారు. అదే సమయంలో, ఈ కేసులో మరో నిందితుడైన దేవిరెడ్డి శివశంకర్ రెడ్డి ఇంట్లో కూడా సోదాలు చేస్తూ, ఆయన కుమారుడు డాక్టర్ చైతన్యరెడ్డిని ఈడీ అధికారులు సుదీర్ఘంగా విచారించారు.
శ్రీశైల దేవస్థానం చీఫ్ సెక్యూరిటీ ఆఫీసర్ విధుల నుంచి తొలగింపు
శ్రీశైల దేవస్థానం చీఫ్ సెక్యూరిటీ ఆఫీసర్ బి.శ్రీనివాసరావును విధుల నుంచి తొలగిస్తూ దేవస్థాన కార్యనిర్వహణాధికారి నిర్ణయం తీసుకున్నారు. ఇటీవల శ్రీశైలం సర్కిల్ ఇన్‌స్పెక్టర్ మరియు సీఎస్‌వో శ్రీనివాసరావు మధ్య జరిగిన ఒక ఫోన్ సంభాషణ తీవ్ర వివాదానికి దారితీసింది. ఈ నేపథ్యంలో నిబంధనలను అతిక్రమించి, ఆ ఆడియోను లీక్ చేసినట్లు నిర్ధారణ కావడంతో క్రమశిక్షణా చర్యల్లో భాగంగా ఈవో ఆయనను బాధ్యతల నుంచి తప్పించారు.
మహిళలకు సౌభాగ్యం, ఐశ్వర్యాన్ని ఇచ్చే పండుగ వరలక్ష్మీ వ్రతం: మంత్రి లోకేశ్
మహిళలకు సౌభాగ్యం, ఐశ్వర్యాన్ని ఇచ్చే పండుగ వరలక్ష్మీ వ్రతం అని మంత్రి నారా లోకేశ్ పేర్కొన్నారు.ఆ వరలక్ష్మీ దేవి కృపతో రాష్ట్ర ప్రజలందరూ ఆయురారోగ్యాలు, అష్టైశ్వర్యాలు, సుఖసంతోషాలతో వర్ధిల్లాలని ఆయన మనస్ఫూర్తిగా కోరుకున్నారు.
అన్నవరం ఆర్టీసీ బస్టాండ్‌ను ఆకస్మికంగా తనిఖీ చేసిన మంత్రి మండిపల్లి
అన్నవరం ఆర్టీసీ బస్టాండ్‌ను మంత్రి మండిపల్లి రాంప్రసాద్‌రెడ్డి ఆకస్మికంగా తనిఖీ చేశారు. ఈ సందర్భంగా అన్నవరం బస్టాండ్‌లో ప్రయాణికులకు అందుతున్న మౌలిక సదుపాయాలపై ఆయన ఆరా తీశారు. ప్రయాణికులకు మెరుగైన సదుపాయాలు కల్పించాలని అధికారులకు మంత్రి సూచించారు. అనంతరం అన్నవరం బస్టాండ్‌లో ప్రయాణికులతో మాట్లాడిన మంత్రి మండిపల్లి రాంప్రసాద్‌రెడ్డి, స్త్రీశక్తి ఉచిత బస్సు ప్రయాణ పథకంపై మహిళల అభిప్రాయాలను తెలుసుకున్నారు. ఈ సందర్భంగా స్త్రీశక్తి పథకం అమలుపై మహిళా ప్రయాణికులు హర్షం వ్యక్తం చేశారు. ఆ తర్వాత అన్నవరం ఆర్టీసీ క్యాంటీన్‌ను సందర్శించిన మంత్రి మండిపల్లి రాంప్రసాద్‌రెడ్డి, అక్కడ ఆర్టీసీ డ్రైవర్లు, కండక్టర్లు, సిబ్బందితో కలిసి అల్పాహారం చేశారు. అలాగే ఆర్టీసీ కార్మికులతో ఆత్మీయంగా మాట్లాడి వారి సమస్యలను తెలుసుకున్నారు.
నేడు ఇంద్రకీలాద్రిపై రెండు సముదాయాలకు ప్రారంభోత్సవం
నేడు ఇంద్రకీలాద్రిపై రెండు సముదాయాలకు ప్రారంభోత్సవం జరగనుంది. దశాబ్దం తర్వాత దుర్గగుడికి అన్నదానం, ప్రసాదం తయారీ భవనాలు అందుబాటులోకి వచ్చాయి. ఇందులో భాగంగా రూ.26 కోట్లతో కనకదుర్గ అన్నప్రసాద సదనం నిర్మాణం, అలాగే రూ.26.50 కోట్లతో దుర్గాభవానీ మహా ప్రసాద భవనం నిర్మాణం పూర్తి చేశారు. ఈ నూతన భవనాలను మంత్రి ఆనం, ఇతర ప్రజాప్రతినిధులతో కలిసి నేడు ప్రారంభించనున్నారు.
ఇంద్రకీలాద్రి: దుర్గమ్మను దర్శించుకున్న ఎంపీ పురందేశ్వరి
ఇంద్రకీలాద్రిపై వెలిసిన కనకదుర్గమ్మను ఎంపీ పురందేశ్వరి దర్శించుకున్నారు. అక్కడ అమ్మవారి సన్నిధిలో జరిగిన ఖడ్గమాల పూజలో కూడా ఎంపీ పురందేశ్వరి పాల్గొన్నారు. శ్రావణమాసం, వరలక్ష్మీ వ్రతం సందర్భంగా ఇంద్రకీలాద్రిని పుష్పాలంకరణతో శోభాయమానంగా అలంకరించారు. ఈ పవిత్ర పర్వదినాన కనకదుర్గమ్మ లక్ష్మీదేవి అలంకరణలో భక్తులకు దర్శనమిస్తున్నారు.
వరలక్ష్మీ వ్రతం సందర్భంగా శుభాకాంక్షలు తెలిపిన సీఎం చంద్రబాబు
వరలక్ష్మీ వ్రతం సందర్భంగా రాష్ట్ర ప్రజలకు సీఎం చంద్రబాబు శుభాకాంక్షలు తెలిపారు. వరలక్ష్మీ దేవి దివ్య ఆశీస్సులు రాష్ట్ర ప్రజలందరిపై ఎల్లవేళలా ఉండాలని సీఎం ఆకాంక్షించారు. పాడిపంటలు, సుఖసంతోషాలతో రాష్ట్రం సుభిక్షంగా, సమృద్ధిగా ముందుకు సాగాలని సీఎం కోరుకున్నారు. మహిళామూర్తులందరికీ ఈ పవిత్ర పండుగ శుభాలు, శాంతిని ప్రసాదించాలని సీఎం చంద్రబాబు పేర్కొన్నారు.
కడప జిల్లా పులివెందులలోనూ ఈడీ అధికారుల సోదాలు
కడప జిల్లా పులివెందులలోనూ ఈడీ అధికారుల సోదాలు కొనసాగుతున్నాయి. ఇందులో భాగంగా కడప ఎంపీ వైఎస్ అవినాష్‌రెడ్డి నివాసానికి ఈడీ అధికారులు వెళ్లారు. అక్కడ ఇంటికి తాళం వేసి ఉండటంతో అధికారులు కొద్దిసేపు బయటే వేచి ఉండాల్సి వచ్చింది. కాసేపటికి అవినాష్‌రెడ్డి చిన్నాన్న మనోహర్‌రెడ్డిని అధికారులు అక్కడికి పిలిపించారు. ఆ తర్వాత అవినాష్‌రెడ్డి ఇంటి తాళం తెరిపించి ఈడీ అధికారులు సోదాలు జరుపుతున్నారు. వీటితో పాటు వివేకా హత్య కేసు నిందితులు సునీల్‌యాదవ్, దేవిరెడ్డి శివశంకర్‌రెడ్డి ఇళ్లలోనూ సోదాలు జరుగుతున్నాయి. అలాగే కడప జిల్లా తొండూరు మండలం టి.తుమ్మలపల్లిలో ఎర్ర గంగిరెడ్డి నివాసంలోనూ అధికారులు సోదాలు నిర్వహిస్తున్నారు.
కాకినాడ: ఏఈ నూకరాజు కుటుంబం ఆత్మహత్య కేసులో ఐదోరోజు గాలింపు
కాకినాడలో ఏఈ నూకరాజు కుటుంబం ఆత్మహత్య కేసులో ఐదోరోజు గాలింపు చర్యలు కొనసాగుతున్నాయి. ఈనెల 16 రాత్రి కుటుంబంతో కలిసి ఏఈ నూకరాజు గోదావరిలో దూకగా, ఈనెల 17 సాయంత్రం ఆయన మృతదేహం, ఈనెల 19 సాయంత్రం కుమార్తె సౌజన్య మృతదేహం లభ్యమయ్యాయి. ప్రస్తుతం నూకరాజు భార్య మీనా మృతదేహం కోసం ఐదో రోజు గాలింపు జరుగుతోంది. ఏఈ నూకరాజు కుటుంబం ఆత్మహత్యకు సాదిక్‌ఖాన్ కారణమని గుర్తించగా, అతనిపై రాజమండ్రి టూటౌన్, సర్పవరం పీఎస్‌లలో కేసులు నమోదయ్యాయి. సాదిక్‌ఖాన్ కోసం పోలీసులు ముమ్మరంగా గాలిస్తున్నారు. రాజమహేంద్రవరం నుంచి 2, కాకినాడ నుంచి 3 పోలీసు బృందాలు రంగంలోకి దిగాయి.
ఇదే క్రమంలో సర్పవరం పోలీసులకు నూకరాజు వియ్యంకుడు భాస్కర్‌రెడ్డి ఫిర్యాదు చేస్తూ, తమ కుమారుడు జగదీశ్‌రెడ్డిని కూడా సాదిక్‌ఖాన్ హత్య చేశాడని పేర్కొన్నారు. దీనిపై సాదిక్‌పై 103(1), 308(5), 127(7), 351(3), 108, 299 సెక్షన్ల కింద కేసు నమోదు చేసి, నిందితుడి కోసం గాలింపు చర్యలు ముమ్మరం చేశారు. విజయవాడ, హైదరాబాద్, విశాఖ, బెంగళూరు, రాయగడ ప్రాంతాల్లో గాలిస్తుండగా, హైదరాబాద్ పాతబస్తీలో ఉన్నారన్న సమాచారంతో అక్కడ మరింత ముమ్మరంగా వెతుకుతున్నారు. నూకరాజు కుటుంబసభ్యులు, సాదిక్ బ్యాంక్ లావాదేవీలపై పోలీసులు ఆరా తీస్తున్నారు.
పోలీసులు సాదిక్‌ఖాన్ కాల్‌డేటాతో పాటు అనుమానాస్పద కాల్స్‌ను క్షుణ్ణంగా పరిశీలిస్తున్నారు. సాదిక్ ఆచూకీ తెలిపినవారికి రివార్డు ఇస్తామని సర్పవరం పోలీసులు ప్రకటించారు. సాదిక్ ఫొటోలు, వివరాలు, అడ్రస్, పోలీసుల నంబర్లతో కూడిన పోస్టర్లను విడుదల చేయడంతో పాటు సామాజిక మాధ్యమాల్లోనూ పోలీసులు పోస్టులు పెట్టారు.
కృష్ణా జిల్లా గుడివాడలో చిట్టీల ముసుగులో రూ.70 లక్షలు టోకరా
కృష్ణా జిల్లా గుడివాడలో చిట్టీల ముసుగులో రూ.70 లక్షలు టోకరా పడింది. వైఎస్సార్సీపీ నేత, మాజీ మంత్రి కొడాలి నాని ప్రధాన అనుచరుడు ఈ చీటింగ్‌కు పాల్పడ్డారు. మోసానికి పాల్పడిన వైసీపీ నాయకుడు మండాది శ్రీనివాసరావు, అతని భార్య మహాలక్ష్మిగా తేలింది. దీనివల్ల బాధితులంతా మత్స్యకార కుటుంబాలుగా గుర్తింపు పొందారు. శ్రీనివాసరావు గత 20 ఏళ్లుగా చిట్టీల వ్యాపారం చేస్తూ, ఉత్తరాంధ్రలో కోట్ల ఆస్తులు కూడబెట్టారు. ఇప్పుడు పైసా కూడా ఇవ్వలేమంటూ బాధితులకు ఐపీ నోటీసులు ఇచ్చారు. కూలీనాలి చేసుకున్న సొమ్ము పోయిందంటూ బాధితులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ప్రస్తుతం 32 మందికి రూ.51.79 లక్షలు ఎగవేతపై పోలీసులు చీటింగ్ కేసు నమోదు చేశారు. అయితే, చిట్టీల పేరుతో మోసం చేస్తే ఐపీ చెల్లదంటున్నట్లు పోలీసులు తెలిపారు.
శ్రీశైలం ప్రాజెక్టుకు కొనసాగుతున్న వరద
శ్రీశైలం ప్రాజెక్టుకు వరద ఉధృతి కొనసాగుతోంది. ఎగువన ఉన్న జూరాల ప్రాజెక్టు నుంచి శ్రీశైలానికి ప్రస్తుతం 44,730 క్యూసెక్కుల వరద నీరు వచ్చి చేరుతోంది. దీనితో ప్రాజెక్టు ప్రస్తుత నీటిమట్టం 875.80 అడుగులకు చేరగా, పూర్తిస్థాయి నీటిమట్టం 885 అడుగులుగా ఉంది. అలాగే, ప్రాజెక్టు పూర్తిస్థాయి నీటి నిల్వ సామర్థ్యం 215.80 టీఎంసీలు కాగా, ప్రస్తుతం 167.48 టీఎంసీల నీటి నిల్వ ఉంది. మరోవైపు శ్రీశైలం ఎడమ జల విద్యుత్ కేంద్రంలో విద్యుదుత్పత్తి ముమ్మరంగా సాగుతోంది. ఇక్కడ విద్యుత్ తయారు చేస్తూ 82,368 క్యూసెక్కుల నీటిని దిగువన ఉన్న నాగార్జున సాగర్‌కు విడుదల చేస్తున్నారు. వీటితో పాటు వివిధ కాలువలు, ఎత్తిపోతల పథకాలకు నీటి విడుదల వివరాలు ఇలా ఉన్నాయి. పోతిరెడ్డిపాడు హెడ్ రెగ్యులేటర్: 8,000 క్యూసెక్కులు, హంద్రీనీవా ఎత్తిపోతల పథకం 3,050 క్యూసెక్కులు, కల్వకుర్తి ఎత్తిపోతల పథకం: 2,400 క్యూసెక్కులు.
శ్రీశైల దేవస్థానం ఆధ్వర్యంలో ఉచిత సామూహిక వరలక్ష్మీ వ్రతాలు
శ్రీశైల దేవస్థానం ఆధ్వర్యంలో రెండో శ్రావణ శుక్రవారం సందర్భంగా ఉచిత సామూహిక వరలక్ష్మీ వ్రతాలు అత్యంత వైభవంగా ప్రారంభమయ్యాయి. చంద్రావతి కల్యాణ మండపంలో ఈ రోజు ఉదయం 9.30 గంటలకు ఈ వ్రత పూజలు మొదలయ్యాయి. ఈ పవిత్ర పూజా కార్యక్రమంలో పాల్గొనేందుకు దాదాపు 1,500 మంది మహిళలు తరలివచ్చారు.భక్తుల సౌకర్యార్థం ఆలయ అధికారులు ప్రత్యేక ఏర్పాట్లు చేశారు. వ్రతంలో పాల్గొనే ప్రతి ఒక్క మహిళకు దేవస్థానమే ప్రత్యేకంగా కలశాలను ఏర్పాటు చేసింది. పూజలో కూర్చునే భక్తులకు ఆలయ అధికారులు ఉచితంగా చీర, రవికె, పూలు, గాజులను అందజేస్తున్నారు.
తిరుమలలో టోకెన్లు లేని భక్తులకు శ్రీవారి సర్వదర్శనానికి 20 గంటలు
తిరుమలలో శ్రీవారి సర్వదర్శనానికి భక్తుల రద్దీ విపరీతంగా పెరిగింది. టోకెన్లు లేని భక్తులకు స్వామివారి దర్శనం కలగడానికి దాదాపు 20 గంటల సమయం పడుతోంది. భక్తుల రాకతో వైకుంఠం క్యూ కాంప్లెక్స్‌లోని అన్ని కంపార్టుమెంట్లు పూర్తిగా నిండిపోయాయి. కంపార్టుమెంట్లు దాటి నారాయణగిరి షెడ్ల వరకు భక్తులు క్యూ లైన్లలో వేచి ఉన్నారు. మరోవైపు తిరుమల తిరుపతి దేవస్థానం (TTD) నిన్నటి భక్తుల వివరాలను వెల్లడించింది. నిన్న ఒక్కరోజే 70,114 మంది భక్తులు శ్రీవారిని దర్శించుకున్నారు.స్వామివారికి భక్తులు సమర్పించిన కానుకల ద్వారా హుండీ ఆదాయం రూ. 4.86 కోట్లు వచ్చింది. మొక్కులు చెల్లించుకోవడానికి నిన్న 28,963 మంది భక్తులు స్వామివారికి తలనీలాలు సమర్పించారు.
కడప జిల్లా పులివెందులలోనూ ఈడీ అధికారుల సోదాలు
వైఎస్ వివేకానందరెడ్డి హత్య కేసు దర్యాప్తులో భాగంగా కడప జిల్లా పులివెందులలో కూడా ఈడీ అధికారులు సోదాలు నిర్వహిస్తున్నారు. ఈ కేసులో నిందితులుగా ఉన్న సునీల్‌యాదవ్, దేవిరెడ్డి శివశంకర్‌రెడ్డి ఇళ్లలో ఈడీ బృందాలు తనిఖీలు చేపట్టాయి. అదే సమయంలో కడప ఎంపీ వైఎస్ అవినాష్‌రెడ్డి నివాసానికి కూడా ఈడీ అధికారులు వెళ్లారు. అయితే ప్రస్తుతం అవినాష్‌రెడ్డి నివాసానికి తాళం వేసి ఉండటంతో అధికారులు లోపలికి వెళ్లలేక, నివాసం వెలుపలే వేచి ఉన్నారు
డీఎస్సీ, ఏపీపీఎస్సీ అంశంలో వైఎస్సార్సీపీ వ్యాఖ్యలపై లోకేశ్ స్పందన
ఏపీ డీఎస్సీ, ఏపీపీఎస్సీ నియామకాలపై అధికార కూటమి, ప్రతిపక్ష వైఎస్సార్సీపీ మధ్య తీవ్ర స్థాయిలో ఎక్స్ వేదికగా సవాల్-ప్రతిసవాల్ నడుస్తున్నాయి. మెగా డీఎస్సీ అక్రమాలపై సీబీఐ విచారణకు ఆదేశించే ధైర్యం ఉందా అంటూ వైఎస్సార్సీపీ విసిరిన సవాల్‌కు రాష్ట్ర మంత్రి నారా లోకేశ్ ఘాటుగా స్పందించారు. "ముందు మీ నాయకుడిని డీఎస్సీ, ఏపీపీఎస్సీ మధ్య ఉన్న తేడా ఏంటో అడగండి" అంటూ లోకేశ్ కౌంటర్ ఇచ్చారు. అసలు ఈ రెండు రిక్రూట్‌మెంట్లపై జగన్‌కు కనీస అవగాహన ఉందా అంటూ ప్రశ్నిస్తూ ఆయన ఒక రీపోస్ట్ చేశారు.
గత వైఎస్సార్సీపీ ప్రభుత్వ హయాంలో డీఎస్సీ నియామకాల్లో పెద్ద ఎత్తున అక్రమాలు జరిగాయని ఆరోపిస్తూ లోకేశ్ వరుస పోస్టులు పెట్టారు. ఈ సందర్భంగా #DSCFakesByYCP#JaganAPPSCrecruitmentScam అనే హ్యాష్‌ట్యాగ్‌లను జోడిస్తూ ఆయన ఘాటు విమర్శలు గుప్పించారు. వేరే అంశాలపై మాట్లాడే ముందు, తమ హయాంలో జరిగిన ఈ తప్పులపై మీ నాయకుడితో సమాధానం చెప్పించాలని వైఎస్సార్సీపీ నేతలకు లోకేశ్ సవాల్ విసిరారు.
వివేకానందరెడ్డి హత్య కేసులో కొనసాగుతున్న ఈడీ సోదాలు
ఎస్ వివేకానందరెడ్డి హత్య కేసులో ఈడీ సోదాలు కొనసాగుతున్నాయి. హైదరాబాద్, కడపలో మొత్తం 6 చోట్ల ఈడీ సోదాలు జరుగుతుండగా, కడపలోని అవినాష్‌రెడ్డి నివాసం సహా మరో మూడుచోట్ల తనిఖీలు చేస్తున్నారు. హైదరాబాద్ కోకాపేటలోని ఓపెన్ స్కైస్‌లోని అవినాష్‌రెడ్డి నివాసంలో హైదరాబాద్ ఈడీ జోనల్ అధికారుల బృందాలు ఈ సోదాలు నిర్వహిస్తున్నాయి. సీబీఐ కేసు ఆధారంగా మరో కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్న ఈడీ, ఈ కేసులో రాజకీయ నేతల ప్రమేయం, మనీలాండరింగ్‌పై ఆరా తీస్తోంది. హత్యకు ముందు నగదు లావాదేవీల వ్యవహారం బయటకు రావడంతో ఈ దర్యాప్తు చేపట్టారు. సీబీఐ దర్యాప్తు సమయంలో బయటకొచ్చిన అంశాలపై మరింత విచారణ చేస్తున్న అధికారులు, నిందితులకు ఇచ్చిన రూ.4 కోట్లు ఎక్కణ్నుంచి, ఎలా వచ్చిందన్న అంశంపై దర్యాప్తు జరుపుతున్నారు.
ఇరవై ఏళ్ల సుదీర్ఘ న్యాయపోరాటంలో గెలిచిన మార్గదర్శి
మార్గదర్శి ఫైనాన్షియర్స్‌పై మాజీ ఎంపీ ఉండవల్లి అరుణ్‌కుమార్ దాఖలు చేసిన పిటిషన్‌ను సుప్రీంకోర్టు కొట్టేయడంతో ఇరవై ఏళ్ల సుదీర్ఘ న్యాయపోరాటం ముగిసింది. నిబంధనలకు విరుద్ధంగా డిపాజిట్లు సేకరిస్తున్నారని 2008లో అప్పటి వైఎస్ రాజశేఖర రెడ్డి ప్రభుత్వం ఈ కేసును నమోదు చేయగా, దీనిపై సుదీర్ఘ విచారణ జరిగింది. తాజాగా ఈ పిటిషన్‌ను పరిశీలించిన దేశ అత్యున్నత న్యాయస్థానం, ఇందులో వ్యక్తిగత తగాదా తప్ప ప్రజాప్రయోజనాలు గానీ, ఇంకేమీ కనిపించలేదని సంచలన వ్యాఖ్యలు చేస్తూ కేసును కొట్టివేసింది. దీంతో ఈ సుదీర్ఘ న్యాయపోరాటంలో మార్గదర్శి సంస్థకు భారీ ఉపశమనం లభించినట్లయింది.
రాష్ట్రంలో పలు చోట్ల మోస్తరు వర్షాలు కురిసే అవకాశం
రాష్ట్రంలో పలు చోట్ల మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణశాఖ వెల్లడించింది. ముఖ్యంగా పోలవరం, ఏలూరు జిల్లాల్లో పిడుగులతో కూడిన మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉందని పేర్కొంది. అలాగే కాకినాడ, కోనసీమ జిల్లాల్లో అక్కడక్కడ మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉందన్న వాతావరణశాఖ, తూర్పుగోదావరి, పశ్చిమగోదావరి జిల్లాల్లో కూడా మోస్తరు వర్షాలు పడే అవకాశం ఉందని స్పష్టం చేసింది. మొత్తంగా రాష్ట్రంలోని పలు జిల్లాల్లో మోస్తరు వర్షాలు పడే అవకాశం ఉందని అధికారులు తెలిపారు.

