ETV Bharat / state

21 May 2026 News Today AP Live News Updates: పవన్‌ కల్యాణ్‌, నాదెండ్లపై వివాదాస్పద వ్యాఖ్యలు - ప్రొ.నాగేశ్వర్‌పై జనసేన నేతల ఫిర్యాదు

AP_Live_News
AP_Live_News (ETV Bharat)
author img

By ETV Bharat Andhra Pradesh Team

Published : May 21, 2026 at 7:18 AM IST

|

Updated : May 21, 2026 at 10:57 PM IST

Choose ETV Bharat

21 May 2026 Today AP Live News Updates : సీఎం చంద్రబాబు అధ్యక్షతన నేడు తెలుగుదేశం పార్టీ పొలిట్ బ్యూరో సమావేశం జరిగింది. పొదుపు చర్యల్లో భాగంగా ఆన్‌లైన్‌లో పొలిట్ బ్యూరో భేటీ జరిగింది. రెండేళ్ల పాలనా విజయాలు ప్రజల్లోకి తీసుకెళ్లేలా అలానే ఎమ్మెల్యేలు, ఎంపీలు, ఎమ్మెల్సీలు క్షేత్రస్థాయిలో ఇంటింటికీ వెళ్లేలా కార్యాచరణ రూపొందించారు. పశ్చిమాసియా యుద్ధప్రభావం వల్ల తలెత్తుతున్న ఆర్థిక ఇబ్బందులపై ఈ సమావేశంలో చర్చించారు.

LIVE FEED

10:05 PM, 21 May 2026 (IST)

ప్రొ.నాగేశ్వర్‌పై మూడు చోట్ల జనసేన నేతల ఫిర్యాదు

ప్రొ.నాగేశ్వర్‌పై మూడు చోట్ల జనసేన నేతలు ఫిర్యాదు చేశారు. పవన్‌ కల్యాణ్‌, నాదెండ్లపై వివాదాస్పద వ్యాఖ్యలు చేశారని ఫిర్యాదు చేశారు. కాకినాడ జిల్లా ఇంద్రపాలెం, సర్పవరం, మచిలీపట్నం పీఎస్‌లలో జనసేన నేతలు ఫిర్యాదు చేశారు. అలాగే చర్చలు నిర్వహించిన ఛానెళ్లు, జర్నలిస్టులపైనా ఫిర్యాదు చేశారు.

7:51 PM, 21 May 2026 (IST)

ఏపీలో రూ.1,990 కోట్ల విలువైన అర్బన్ ఛాలెంజ్ ఫండ్ ప్రాజెక్టులకు కేంద్రం ఆమోదం

రాష్ట్రంలో రూ.1,990.83 కోట్ల విలువైన అర్బన్ చాలెంజ్ ఫండ్ ప్రాజెక్టులకు కేంద్ర ఆమోదం తెలిపిందని మంత్రి నారాయణ తెలిపారు. నాలుగు కీలకమైన పట్టణ మౌలిక వసతుల ప్రాజెక్టులకు గ్రీన్ సిగ్నల్ కేంద్రం ఇచ్చిందన్నారు. ఈ ఫండ్ ద్వారా మొత్తం రూ.497.71 కోట్ల కేంద్ర సాయం మంజూరు చేసిందన్నారు. విశాఖపట్నం, మంగళగిరి–తాడేపల్లి మున్సిపల్ కార్పొరేషన్ లలో ప్రాజెక్టులకు ఆమోదం లభించింది. అర్బన్ చాలెంజ్ ఫండ్ కింద నాలుగు ప్రాజెక్టులకు ఆమోదం రావడం రాష్ట్రానికి గొప్ప గుర్తింపు అని మంత్రి అన్నారు. సీఎం చంద్రబాబు నాయకత్వంలో మౌలిక వసతుల అభివృద్ధికి ప్రభుత్వం ప్రత్యేక ప్రాధాన్యత ఇస్తుందని వెల్లడించారు. సాధారణ మున్సిపల్ పనులకు మించి ఆధునిక పట్టణాభివృద్ధిపై ఫోకస్ చేశామన్నారు.

తాగునీరు, అండర్‌గ్రౌండ్ డ్రైనేజ్, మురుగు నీటి శుద్ధిపై ప్రభుత్వం ప్రధాన దృష్టి సారించిందని వెల్లడించారు. ఈ ప్రాజెక్టుల ద్వారా విశాఖ, మంగళగిరి–తాడేపల్లిలో ప్రజారోగ్యం, జీవన ప్రమాణాలు మెరుగుపడతాయని అన్నారు. పట్టణాల్లో కోర్ ఇన్‌ఫ్రాస్ట్రక్చర్ ముందుగా పూర్తి చేయాలని సీఎం ఆదేశాలు ఇచ్చారని తెలిపారు. అర్బన్ చాలెంజ్ ఫండ్ అవకాశాన్ని రాష్ట్రం పూర్తిస్థాయిలో వినియోగించుకుంటుందని స్పష్టం చేశారు. ఆంధ్రప్రదేశ్‌ను దేశంలో అత్యుత్తమ పట్టణ మౌలిక వసతుల రాష్ట్రంగా తీర్చిదిద్దుతామని అన్నారు. పట్టణాభివృద్ధిలో ఆంధ్రప్రదేశ్ దేశానికి మోడల్‌గా నిలుస్తుందని స్పష్టం చేశారు.

6:54 PM, 21 May 2026 (IST)

డ్రైవర్ సుబ్రహ్మణ్యం హత్య కేసులో రెండో రోజు ముగిసిన విచారణ

డ్రైవర్ సుబ్రహ్మణ్యం హత్య కేసులో రాజమహేంద్రవరం ప్రత్యేక కోర్టులో రెండో రోజు విచారణ ముగిసింది. ప్రత్యేక పబ్లిక్ ప్రాసిక్యూటర్, డిఫెన్స్ లాయర్ల సమక్షంలో సాక్ష్యుల వాంగ్మూలం సేకరించారు. సుబ్రహ్మణ్యం తండ్రి సత్యనారాయణ, సోదరుడు నవీన్‌ సాక్ష్యాలను జడ్జి నమోదు చేశారు. అలాగే వైఎస్సార్సీపీ ఎమ్మెల్సీ అనంతబాబు, ఆయన భార్యను పోలీసులు కోర్టులో ప్రవేశపెట్టారు.

5:29 PM, 21 May 2026 (IST)

నిప్పుల కుంపటిని తలపిస్తున్న రాష్ట్రం

రాష్ట్రంలో నిప్పుల కుంపటిని తలపిస్తోంది. ఈ రోజు పిడుగురాళ్లలో అత్యధికంగా 48.1 డిగ్రీల ఉష్ణోగ్రత నమోదయ్యింది. వేటపాలెం (బాపట్ల), నందివాడ (కృష్ణా) 47.6 డిగ్రీలు, ఎన్టీఆర్ జిల్లా తొర్రగుడిపాడు, ప్రకాశం జిల్లా అద్దంకిలో 47.4 డిగ్రీలు నమోదయ్యింది. ఏలూరు జిల్లా అల్లిపల్లిలో 47.3 డిగ్రీలు, నందనమారెళ్ల (మార్కాపురం)లో 46.6, కూనవరం (పోలవరం)లో 46.5 డిగ్రీలు, కావలి (నెల్లూరు)లో 46.4, తెనాలి (గుంటూరు)లో 46 డిగ్రీలు ఉష్ణోగ్రత నమోదయ్యింది.

5:28 PM, 21 May 2026 (IST)

దేవాదాయ శాఖ ఉద్యోగి శాంతికి 5 రోజులు బెయిల్​

దేవాదాయ శాఖ సస్పెండ్ అయిన అసిస్టెంట్ కమిషనర్ శాంతికి స్వల్ప ఊరట లభించింది. న్యాయస్థానం శాంతికి 5 రోజులు మద్యంతర బెయిల్ మంజూరు చేస్తూ ఆదేశాలు జారీ చేసింది. 23వ తేదీ నుంచి ఐదు రోజులపాటు మద్యంతర బెయిలు మంజూరు చేస్తూ ఉత్తర్వులు జారీ అయ్యాయి. గతంలో రెండుసార్లు రెగ్యులర్ బెయిల్ కోసం పిటిషన్ దాఖలు చేయగా న్యాయస్థానం డిస్మిస్ చేసింది. ఆదాయానికి మించిన ఆస్తులు కలిగి ఉన్నారనే కేసులో శాంతి విజయవాడ జిల్లా జైలులో జ్యుడీషియల్ రిమాండ్​లో ఉన్నారు. తన కుమార్తెకు ఊటీలో స్కూల్ అడ్మిషన్ కోసం వెళ్లాల్సి ఉందని బెయిల్ మంజూరు చేయాల్సిందిగా కోరుతూ శాంతి మద్యంతర బెయిల్ పిటిషన్ దాఖలు చేసారు. దీనిపై విచారించిన న్యాయస్థానం ఐదురోజుల పాటు బెయిల్ మంజూరు చేస్తూ న్యాయమూర్తి ఆదేశాలు జారీ చేశారు.

3:40 PM, 21 May 2026 (IST)

దళిత డాక్టర్ సుధాకర్ వర్ధంతి సందర్భంగా వీడియో విడుదల చేసిన లోకేశ్‌

దళిత డాక్టర్ సుధాకర్ వర్ధంతి సందర్భంగా మంత్రి నారా లోకేశ్ ఓ వీడియో విడుదల చేశారు. కష్టపడి చదువుకుని, దశాబ్దాల పాటు డాక్టర్​గా సుధాకర్ ప్రజలకు సేవలందించారని కొనియాడారు. చివరికి దయనీయ స్థితిలో గొడ్డలి పార్టీ చేతిలో పిచ్చివాడని ముద్ర వేయబడి చనిపోయారని ఆవేదన వ్యక్తం చేశారు. డాక్టర్ సుధాకర్ గురించి వారి కుటుంబ సభ్యుల మాటల్లో అంటూ వీడియోను ఏక్స్ లో పోస్ట్ చేశారు.

3:38 PM, 21 May 2026 (IST)

మంత్రుల కమిటీతో సీఎం చంద్రబాబు సమీక్ష

భాగస్వామ్య సదస్సులో ఒప్పందాలు, ఎస్ఐపీబీలో ఆమోదించిన ప్రాజెక్టులపై మంత్రుల కమిటీతో ముఖ్యమంత్రి చంద్రబాబు సమీక్షా సమావేశం నిర్వహించారు. ఐటీశాఖ మంత్రి నారా లోకేశ్ నేతృత్వంలోని మంత్రుల కమిటీకి ఎంఓయూలు, ప్రాజెక్టుల పురోగతిపై సీఎం దిశానిర్దేశం చేశారు. ఎస్ఐపీబీల ద్వారా ఇప్పటికి రూ.11.47 లక్షల కోట్ల పెట్టుబడులతో 282 ప్రాజెక్టులకు ఆమోదం తెలిపామని సీఎం గుర్తు చేశారు. వీటిలో 114 ప్రాజెక్టులు గ్రౌండ్ అయినట్టు ఉద్యోగాల కల్పన మంత్రుల కమిటీ ఛైర్మన్ నారా లోకేశ్ ముఖ్యమంత్రికి వివరించారు. విశాఖ భాగస్వామ్య సదస్సులో ఒప్పందాలు చేసుకున్న ప్రాజెక్టులకు అనుమతులు, భూ కేటాయింపులతో పాటు ప్రాజెక్టులు గ్రౌండింగ్‌కు వెళ్లేలా చర్యలు చేపట్టాలని సీఎం సూచించారు. సమావేశానికి సీఎస్ సాయిప్రసాద్, మంత్రులు పయ్యావుల కేశవ్, కందుల దుర్గేష్, టీజీ భరత్, కొండపల్లి శ్రీనివాస్, బీసీ జనార్ధన్ రెడ్డి, గొట్టిపాటి రవికుమార్, ఉన్నతాధికారులు హాజరైయ్యారు.

2:14 PM, 21 May 2026 (IST)

అబ్బూరులో విద్యుత్ ఉపకేంద్రంలో అగ్నిప్రమాదం

పల్నాడు జిల్లా సత్తెనపల్లి మండలం అబ్బూరులో విద్యుత్ ఉపకేంద్రంలో అగ్నిప్రమాదం చోటుచేసుకుంది. ఇద్దరు ఇంజినీర్లు, ఎలక్ట్రీషియన్‌కు తీవ్రగాయాలయ్యాయి. విద్యుత్‌ ఉపకేంద్రంలో మరమ్మతు చేస్తుండగా ట్రాన్స్‌ఫార్మర్‌ ఒక్కసారిగా పేలింది. ప్రత్తిపాటి శివనారాయణ, శశాంక్, ప్రత్తిపాటి రాంబాబు, రహీమ్‌కు గాయాలయ్యాయి.

2:14 PM, 21 May 2026 (IST)

కర్నూలు జిల్లాలో మంత్రి కొల్లు రవీంద్ర పర్యటన

కర్నూలు జిల్లాలో మంత్రి కొల్లు రవీంద్ర పర్యటించారు. కోడుమూరు నియోజకవర్గం ఈర్లదిన్నెలో డీ సిల్టేషన్ ఇసుక రీచ్​ను పరిశీలించారు. బుకింగ్ కౌంటర్ పరిశీలించి లోడింగ్, బుకింగ్‌పై వివరాలు తెలుసుకున్నారు. అలానే పడవలో నదిలోకి వెళ్లి తవ్వకాన్నీ పరిశీలించారు. కూటమి అధికారంలోకి వచ్చాక ఉచిత ఇసుక పాలసీ అమలు చేస్తున్నామని కాని గత ప్రభుత్వంలో ఇసుకను ఆదాయ వనరుగా చేసుకుని దోచుకున్నారని విమర్శించారు. రాష్ట్రంలో ఇసుక కొరత లేకుండా చర్యలు తీసుకుంటున్నామని అలానే వర్షాకాలంలో ఇసుక కొరత వేధించకుండా డీ సిల్టేషన్ చేపడుతున్నామని మంత్రి కొల్లు రవీంద్ర వెల్లడించారు.

2:14 PM, 21 May 2026 (IST)

లోకేశ్‌ ఆధ్వర్యంలో జాతీయ వర్క్‌షాప్‌ నిర్వహణ ఆనందకరం: మంత్రి సుభాష్‌

లోకేశ్‌ ఆధ్వర్యంలో జాతీయ వర్క్‌షాప్‌ నిర్వహించడం ఆనందకరమని మంత్రి సుభాష్‌ కొనియాడారు. అధునాతన నిర్మాణ కార్యకలాపాలు, నిర్మాణ సాంకేతికతలపై వర్క్‌షాప్‌ ఉంటుందని చెప్పారు. నిర్మాణ రంగ అభివృద్ధికి నైపుణ్య కార్మిక శక్తి అందించడంలో వర్క్‌షాప్ దోహదం చేస్తుందని అభిప్రాయబడ్డారు. గత ఐదేళ్ల వైసీపీ పాలనలో పరిశ్రమలు మూసివేసే విధానాలు అమలయ్యాయని ఉపాధి అవకాశాలు లేక యువత ఇబ్బందులు ఎదుర్కొన్నారని ఆరోపించారు. చంద్రబాబు, లోకేశ్‌ కృషితో రాష్ట్రానికి లక్షల కోట్ల పెట్టుబడులు వస్తున్నాయని కార్మిక శాఖ సేవలను డిజిటలైజేషన్ దిశగా ప్రభుత్వం ముందుకు తీసుకెళ్తోందని మంత్రి సుభాష్‌ తెలిపారు.

2:09 PM, 21 May 2026 (IST)

ఈపూరులో దివంగత దళిత డాక్టర్ సుధాకర్ వర్ధంతి

పల్నాడు జిల్లాలోని ఈపూరులో దివంగత దళిత డాక్టర్ సుధాకర్ వర్ధంతి జరిగింది. ఈ కార్యక్రమంలో ప్రభుత్వ చీఫ్ విప్ జీవీ ఆంజనేయులు పాల్గొన్నారు. కరోనా వేళ డాక్టర్ సుధాకర్ ఎనలేని సేవలు అందించారని జీవీ ఆంజనేయులు కొనియాడారు. వైద్యులకు కనీస రక్షణ పరికరాలు అడిగినందుకే గత ప్రభుత్వంలో సుధాకర్‌ను వేధించారని దళిత మేధావిపై పిచ్చివాడిగా ముద్ర వేశారని మండిపడ్డారు. మానసిక క్షోభ వల్లే సుధాకర్ అకాల మరణం చెందారని అన్నారు. కూటమి ప్రభుత్వంలో దళితులకు పూర్తి రక్షణ ఉంటుందని జీవీ ఆంజనేయులు తెలిపారు.

12:50 PM, 21 May 2026 (IST)

జగన్ బటన్ నొక్కడం తప్పితే ఏం చేశారు?: బాలినేని

నాగార్జున వర్సిటీ దగ్గర రాజధాని నిర్మించాలని జగన్‌కు ఆనాడే చెప్పానని మాజీ మంత్రి, జనసేన నేత బాలినేని శ్రీనివాసరావు తెలిపారు. రాజధానిపై సజ్జల రామకృష్ణకి ఎన్నో సార్లు విన్నవించానని అన్నారు. జగన్ మూర్కత్వపు నిర్ణయాలతో మావిగన్ తీసుకొస్తున్నారని మండిపడ్డారు. జగన్ సీఎంగా ఉన్నప్పుడు బటన్ నొక్కడం తప్పితే ఏం చేశారని ప్రశ్నించారు. జగన్ వల్లే నేను ఓడిపోయాను నా వ్యక్తిగత కారణాల వల్ల కాదని చెప్పారు. పార్టీని అభివృద్ధి చేయడం జగన్‌కు చేతకావడం లేదని బాలినేని అన్నారు.

12:50 PM, 21 May 2026 (IST)

సీఎం చంద్రబాబు అధ్యక్షతన టీడీపీ పొలిట్ బ్యూరో సమావేశం

సీఎం చంద్రబాబు అధ్యక్షతన తెలుగుదేశం పొలిట్ బ్యూరో సమావేశం నిర్వహించారు. పొదుపు చర్యల్లో భాగంగా ఆన్లైన్ లో పొలిట్ బ్యూరో భేటీ అయ్యింది. 2 ఏళ్ల పాలనా విజయాలు నేతలు ప్రజల్లోకి తీసుకెళ్లేలా కార్యాచరణపై చర్చించారు. ఎమ్మెల్యేలు, ఎంపీలు, ఎమ్మెల్సీలు క్షేత్రస్థాయిలో ఇంటింటికీ వెళ్లి ప్రభుత్వ పాలనపై ప్రజలకు అవగాహన కల్పించే కార్యక్రమంపై చర్చ జరిగింది. హైబ్రీడ్ విధానంలో మహానాడు నిర్వహణ, పశ్చిమాసియా యుద్ధప్రభావం వల్ల తలెత్తుతున్న ఆర్థిక ఇబ్బందులు తదితర అంశాలపైనా సమావేశంలో చర్చించారు.

12:49 PM, 21 May 2026 (IST)

నిత్యానందరెడ్డికి ముగిసిన కస్టడీ

పెద్ద దస్తగిరి హత్య కేసులో నిందితుడుగా ఉన్న కడప మాజీ డిప్యూటీ మేయర్ నిత్యానంద రెడ్డి రెండు రోజుల కస్టడీ ముగిసింది. కస్టడీ అనంతరం ఆయన్ని ఇవాళ పోలీసులు కోర్టులో హాజరుపరిచారు. అనంతరం నిత్యానందరెడ్డిని తిరిగి జైలుకు తరలించారు. ఇప్పటికే నిత్యానందరెడ్డి 14 రోజుల రిమాండ్‌లో ఉన్నారు.

12:49 PM, 21 May 2026 (IST)

మావిగన్ అంటే చంద్రబాబుకు బీపీ వస్తోంది: జగన్‌

మావిగన్ అంటే చంద్రబాబుకు బీపీ వస్తోందని మాజీ సీఎం జగన్‌ అన్నారు. మావిగన్ అంటే చంద్రబాబు భయపడుతున్నారని విమర్శించారు. చంద్రబాబు రాష్ట్రానికి రాజధాని లేకుండా చేస్తున్నారని మండిపడ్డారు. అమరావతిలో మౌలికసదుపాయాలకే రూ.2 లక్షల కోట్లు అవుతుందని స్కాముల కోసం అమరావతి పేరుతో ప్రజలను మోసగిస్తున్నారని ఆరోపించారు. మావిగన్‌కు ప్రజా మద్దతు ఉందని రాష్ట్రంలో పరిస్థితులను పరిగణలోకి తీసుకునే మావిగన్‌ ప్రతిపాదించామని జగన్‌ తెలిపారు.

12:49 PM, 21 May 2026 (IST)

ఏపీ ఎస్‌ఎఫ్‌టీవీటీడీసీ ఛైర్మన్, డైరెక్టర్ల నియామకం

ఆంధ్రప్రదేశ్ స్టేట్ ఫిల్మ్, టెలివిజన్, అండ్ థియేటర్ డెవలప్​మెంట్ కార్పోరేషన్ ఛైర్మన్, డైరెక్టర్లను ప్రభుత్వం నియమించింది. ఏపీఎస్ఎఫ్ టీవీటీడీసీ(APSFTVTDC) ఛైర్మన్​గా పీ.భరత్ భూషణ్‌, వైస్ ఛైర్మన్​గా చిక్కాల మెహర్ రమేష్ కుమార్‌ను నియమించారు. ఛైర్మన్, వైస్ ఛైర్మన్​లతోపాటు మరో 14 మందిని సభ్యులుగా ప్రభుత్వం నియమించింది.

12:48 PM, 21 May 2026 (IST)

దోర్నాలలో మంత్రి గొట్టిపాటి రవి పర్యటన

మార్కాపురం జిల్లా దోర్నాలలో మంత్రి గొట్టిపాటి రవి పర్యటించారు. రూ.49 లక్షలతో ఆర్టీసీ బస్టాండ్ నిర్మాణానికి మంత్రి శంకుస్థాపన చేశారు. అలానే దూపాడు సాగర్ నీటి పథకాన్ని ప్రారంభించారు. అనంతరం చిన్న గుడిపాడులో పీఎం సూర్యఘర్ పథకాన్ని ప్రారంభించారు.

12:48 PM, 21 May 2026 (IST)

గుడివాడలో కిరీటం మాయంపై విచారణ

కృష్ణా జిల్లా గుడివాడ శ్రీ కళ్యాణ వెంకటేశ్వర స్వామి దేవస్థానంలో కోటి రూపాయల బంగారు కిరీటం మాయంపై దేవాదాయ శాఖ విచారణ జరిపింది. దేవాదాయ శాఖ ఏసీ లలిత ఆలయానికి హుటాహుటిన చేరుకుని అర్చకుడి నుంచి వివరాలు సేకరించారు. దేవస్థానం నిర్వహణ ట్రస్ట్ కార్యాలయానికి తాళాలు, రికార్డులు అడిగారు. ట్రస్టులోని 31 మంది సభ్యులు అందుబాటులో లేమని ఫోన్లో సమాధానం ఇవ్వడంతో ఏసీ విస్మయం వ్యక్తం చేశారు. ముందస్తు సమాచారం ఇచ్చినా అందుబాటులో లేకపోవడమేంటని ట్రస్ట్ సభ్యులపై ఏసీ లలిత ఆగ్రహంవ్యక్తంచేశారు. దాత కుటుంబ సభ్యులతో మాట్లాడి పూర్తి వివరాలు సేకరించారు. దేవాదాయ శాఖ కమిటీ పరిధిలో లేకపోవడంతో ట్రస్ట్ బోర్డుపై ఎటువంటి చర్యలు తీసుకోలేమని, బంగారు కిరీటం తాకట్టు వ్యవహారంలో కమిటీ సభ్యుల తీరుపై అనుమానాలు వ్యక్తంచేశారు. రికార్డులు పరిశీలిస్తేనే ఏ విషయమైనా చెప్పగలమని అన్నారు. మధ్యాహ్నంలోపు విచారణ నివేదిక అందించాల్సి రావడంతో అసిస్టెంట్ కమిషనర్ లలిత దేవస్థానంలోనే వేచి ఉన్నారు. వ్యవహారం ముదరడంతో తాకట్టు కొట్టు వ్యాపారి పరారీలో ఉన్నాడు. తన ఎకౌంట్లోకి తాకట్టు డబ్బులు పంపితేనే ఊర్లోకి వస్తానంటూ తాకట్టు వ్యాపారి మధ్య వర్తులతో ట్రస్టుబోర్డుకి సమాచారం అందించారు.

12:47 PM, 21 May 2026 (IST)

పెద్దాపురంలో రాధా మనోహర్ దాస్‌పై కేసు నమోదు

కాకినాడ జిల్లా పెద్దాపురంలో ధర్మ ప్రచారకుడు రాధా మనోహర్ దాస్‌పై కేసు నమోదైంది. మతపరమైన మనోభావాలను దెబ్బతీసేలా వ్యాఖ్యలు చేశారంటూ ఫిర్యాదు చేశారు. ఈనెల12న హనుమాన్ శోభాయాత్రలో గుడి వద్ద రాధా మనోహర్ దాస్ ప్రసంగించగా అన్యమతస్థులు, వారి మనోభావాలను కించపరిచారని కానిస్టేబుల్‌ శేషారావు ఫిర్యాదు చేశారు. దీంతో పెద్దాపురం పోలీసులు రాధా మనోహర్ దాస్‌పై బీఎన్‌ఎస్‌ సెక్షన్లు 299, 196 కింద కేసు నమోదు చేశారు.

12:47 PM, 21 May 2026 (IST)

డ్రైవర్ వీధి సుబ్రమణ్యం హత్య కేసుపై కోర్టులో విచారణ

డ్రైవర్ వీధి సుబ్రమణ్యం హత్య కేసు విచారణ రాజమహేంద్రవరం ప్రత్యేక న్యాయస్థానంలో రెండో రోజు కొనసాగుతోంది. ఈ కేసులో ప్రధాన నిందితులుగా ఉన్న వైసీపీ ఎమ్మెల్సీ అనంతబాబుతో పాటు ఆయన భార్యను పోలీసులు కోర్టులో హాజరుపరిచారు. కేసుకు సంబంధించిన కీలక సాక్ష్యాల నమోదులో భాగంగా ముగ్గురు సాక్షులను కోర్టు ముందు ప్రవేశపెట్టేందుకు పోలీసులు ఏర్పాట్లు చేశారు. ప్రత్యేక పబ్లిక్ ప్రాసిక్యూటర్ ముప్పాళ్ల సుబ్బారావు, డిఫెన్స్ న్యాయవాదుల సమక్షంలో సాక్ష్యుల వాగ్మూలాల నమోదు కొనసాగుతోంది. సాక్షులు చెప్పిన అంశాలను ప్రత్యేక కోర్టు న్యాయమూర్తి సాక్ష్యాలను నమోదు చేస్తున్నారు. తొలుత మృతుడు వీధి సుబ్రమణ్యం తండ్రి వీధి సత్యనారాయణ వాంగ్మూలాన్ని కోర్టు రికార్డు చేస్తోంది అనంతరం సుబ్రమణ్యం సోదరుడు వీధి నవీన్ సాక్ష్యాన్ని నమోదు చేయనుంది. అలాగే సుబ్రమణ్యం భార్య వీధి అపర్ణ వాంగ్మూలాన్ని కూడా కోర్టు నమోదు చేయనుంది. కేసు విచారణ దృష్ట్యా కోర్టు పరిసరాల్లో పోలీసులు పటిష్ట నిఘా భద్రతా ఏర్పాట్లు చేశారు. ఎటువంటి అవాంఛనీయ ఘటనలు చోటుచేసుకోకుండా బందోబస్తును ఏర్పాటు చేశారు.

12:47 PM, 21 May 2026 (IST)

ఆర్టీసీ బస్సులో పొగలు

నెల్లూరు జిల్లా మర్రిపాడు మండలం నందవరం వద్ద ఆర్టీసీ బస్సులో పొగలు వ్యాపించాయి. నెల్లూరు నుంచి బద్వేల్‌కు వెళ్తున్న ఆర్టీసీ ఎక్స్‌ప్రెస్‌ బస్సు పొగలు రావడంతో ప్రయాణికులు భయాందోళనకు గురయ్యారు. నందవరం కూడలి పెట్రోల్ బంక్ వద్ద బస్సు నిలిపి డ్రైవర్ ప్రయాణికులను దించారు.

12:47 PM, 21 May 2026 (IST)

రాధామనోహర్ దాస్​పై కేసులు పెట్టడం తగదు: భానుప్రకాశ్‌రెడ్డి

హిందూధర్మ ప్రచారకుడు రాధా మనోహర్ దాస్​పై కాకినాడ జిల్లా పెద్దాపురం పోలీస్ స్టేషన్​లో కుట్రపూరితంగానే తప్పుడు కేసు నమోదు చేశారని టీటీడీ బోర్డు సభ్యుడు భానుప్రకాష్ రెడ్డి మండిపడ్డారు. రాధా మనోహర్ దాస్​కు హిందూ సమాజం మొత్తం అండగా ఉంటుందన్నారు. హిందూ మత విశ్వాసాలకు వ్యతిరేకంగా అన్యమతస్థులు చేస్తున్న దుష్ప్రచారంపై డీజీపీకి ఫిర్యాదు చేస్తామన్నారు.

12:27 PM, 21 May 2026 (IST)

తిరుమలలో భక్తుల రద్దీ

తిరుమలలో భక్తుల రద్దీ కొనసాగుతుంది. వేసవి సెలవుల దృష్ట్యా తిరుమలకు భక్తులు పోటెత్తారు. భక్తులను తిరుమల శ్రీవారి సర్వదర్శన క్యూలైన్లలోకి టీటీడీ అనుమతించలేదు. వైకుంఠం క్యూకాంప్లెక్సులు, నారాయణగిరి షెడ్లు నించి వెలుపలికి క్యూలైన్ ఉంది. బాట గంగమ్మ ఆలయం వరకు దర్శనానికి భక్తులు క్యూలైన్లలో వేచి ఉన్నారు. రేపు ఉదయం 6 గంటలకు క్యూలైన్‌లోకి రావాలని టీటీడీ ప్రకటించింది.

10:13 AM, 21 May 2026 (IST)

కడప జిల్లాలో పర్యటించనున్న మంత్రి లోకేశ్‌

నేడు, రేపు కడప జిల్లాలో మంత్రి నారా లోకేశ్‌ పర్యటించనున్నారు. ఇవాళ సాయంత్రం కడప చేరుకోనున్న లోకేశ్‌ సాయంత్రం కడప నియోజకవర్గ కార్యకర్తలు, నాయకులతో సమావేశం కానున్నారు. రేపు ఉదయం జమ్మలమడుగు నియోజకవర్గం పెనికలపాడులో సేంద్రియ రైతులతో సమావేశం అవుతారు. తర్వాత మధ్యాహ్నం టి.కోడూరులో 600 మెగావాట్ల సోలార్ విద్యుత్ ప్లాంట్‌ను ప్రారంభిస్తారు. అనంతరం సాయంత్రం దత్తాపురంలో జమ్మలమడుగు నియోజకవర్గ కార్యకర్తలు, నేతలతో సమావేశం అవుతారు. ఆ తర్వాత పర్యటన ముగించుకొని తిరుగుపయనం కానున్నారు.

10:13 AM, 21 May 2026 (IST)

తిరుమల శ్రీవారిని దర్శించుకున్న మంత్రి ఆనం

తిరుమల శ్రీవారిని మంత్రి ఆనం రామనారామణరెడ్డి దర్శించుకున్నారు. కూటమి ప్రభుత్వం హిందూ ధర్మం, సనాతన ఆచారానికి పెద్దపీట వేసిందని చెప్పారు. సీఎం నాయకత్వంలో అన్ని వర్గాలకు సంక్షేమ, అభివృద్ధి కార్యక్రమాలు చేస్తున్నారని సీఎం చంద్రబాబుకు, ప్రభుత్వానికి శ్రీవారి ఆశీస్సులు ఉండాలని కోరుకున్నామని మంత్రి ఆనం తెలిపారు.

10:13 AM, 21 May 2026 (IST)

3 ప్రాజెక్టులకు కేంద్రం ఆమోదం

విశాఖ మౌలిక సదుపాయాలు, పట్టణాభివృద్ధికి 3 ప్రాజెక్టులకు కేంద్రం ఆమోదం తెలిపింది. జీవీఎంసీ ప్రతిపాదించిన 3 కీలక మౌలిక సదుపాయాల ప్రాజెక్టులకు అంగీకారం తెలిపింది. అర్బన్ ఛాలెంజ్ ఫండ్ పథకం కింద నేషనల్‌ అపెక్స్‌ కమిటీ ఆమోదం తెలిపింది. రూ.1,501.03 కోట్ల అంచనా వ్యయంతో 3 ప్రాజెక్టుల అమలు కానుంది. మధురవాడ జోన్‌ అండర్‌గ్రౌండ్ డ్రైనేజ్ వ్యవస్థ అభివృద్ధి ప్రాజెక్టుకు రూ.658.61 కోట్లు, మధురవాడ జోన్‌లో స్మార్ట్ తాగునీటి సరఫరా వ్యవస్థ అభివృద్ధి ప్రాజెక్టుకు రూ.725.18 కోట్లు, బల్క్ అండ్ సెమీ-బల్క్ నీటిసరఫరా వ్యవస్థ ఆధునీకరణ, పునరుద్ధరణ ప్రాజెక్టుకు రూ. 117.24 కోట్లతో ఈ ప్రాజెక్టులు నిర్మాణం కానున్నాయి. ఈ సందర్భంగా వీటి వివరాలను ఎంపీ శ్రీభరత్ సామాజిక మాధ్యమాల వెల్లడించారు.

9:32 AM, 21 May 2026 (IST)

టీచర్స్ కాలనీలో అగ్నిప్రమాదం

గుంటూరు ఇన్నర్ రింగ్ రోడ్డులోని టీచర్స్ కాలనీలో అగ్నిప్రమాదం సంభవించింది. ఖాళీ ప్రదేశంలో డ్రైనేజ్ పైపులు నిల్వ చేసిన ప్రాంతంలో ప్రమాదం జరిగింది. మంటలు ఎగిసిపడి భారీగా పొగలు అలుముకున్నాయి. స్థానికులు అగ్నిమాపక సిబ్బందికి సమాచారం అందించడంతో సంఘటనాస్థలికి చేరుకున్న సిబ్బంది మంటలను అదుపుచేశారు.

8:53 AM, 21 May 2026 (IST)

గొడిచెర్లలో జ్వరాలపై స్పందించిన హోంమంత్రి అనిత

అనకాపల్లి జిల్లా నక్కపల్లి మండలం గొడిచెర్లలో జ్వరాలపై హోంమంత్రి అనిత స్పందించారు. వైద్య ఆరోగ్యశాఖ అధికారులతో ఫోనులో మాట్లాడిన హోంమంత్రి అధికారులకు పలు ఆదేశాలు జారీచేశారు. గొడిచెర్లలో మెడికల్ క్యాంపులు ఏర్పాటు చేయాలని గ్రామాన్ని పరిశుభ్రంగా ఉంచాలని అధికారులకు మంత్రి అనిత సూచించారు.

8:53 AM, 21 May 2026 (IST)

విద్యుత్‌ షాక్‌తో చిన్నారి మృతి

చిత్తూరు జిల్లా కుప్పం మండలం మంకలదొడ్డి పంచాయతీ అగ్రహారంలో విద్యుత్‌ షాక్‌తో చిన్నారి మృతి చెందింది. ఇంటి ముందు ఆడుకుంటూ విద్యుత్ స్తంభం ఎర్త్‌ వైర్‌ను తాకి నేత్రశ్రీ(6) మృతి చెందింది. వర్షాలకు నేల తడిగా ఉండటంతో పాటు విద్యుత్ సరఫరా కావడంతో ఘటన చోటుచేసుకుంది.

8:50 AM, 21 May 2026 (IST)

సెయిల్ థర్మల్ విద్యుత్ కేంద్రం ఎదుట కార్మికుల ఆందోళన

నెల్లూరు జిల్లా నేలటూరులోని సెయిల్ థర్మల్ విద్యుత్ కేంద్రం ఎదుట కార్మికుల ఆందోళన చేపట్టారు. కోల్ హ్యాండ్లింగ్ ప్లాంట్‌లో పనిచేస్తున్న కార్మికులకు జీతాలు పెంచాలని డిమాండ్‌ చేశారు. యాజమాన్యం స్పందించకపోవడంతో డిమాండ్ల సాధన కోసం కార్మికుల ఆందోళన చేపట్టారు. తెల్లవారుజాము నుంచే ప్రధాన గేటు ఎదుట సీహెచ్‌పీ విభాగం కార్మికులు నిరసన చేస్తున్నారు.

7:11 AM, 21 May 2026 (IST)

కడపలో సోలార్ విద్యుదుత్పత్తి ప్రాజెక్టు ఏర్పాటు

కడపలో 2,400 కోట్లతో సోలార్ విద్యుదుత్పత్తి ప్రాజెక్టు ఏర్పాటు కానుంది. 11 నెలల్లో 600 మెగావాట్ల సోలార్‌ ప్లాంట్స్‌ను ఎస్‌ఏఈఎల్‌ సంస్థ సిద్ధం చేసింది. రేపు ఈ సోలార్‌ ప్లాంట్లను మంత్రి లోకేశ్‌ ప్రారంభించనున్నారు.

7:11 AM, 21 May 2026 (IST)

సర్వేయర్, వీఆర్వోపై అధికారులు చర్యలు

పల్నాడు జిల్లా జిల్లాలోని అచ్చంపేట మండంలం కోనూరు సర్వేయర్, వీఆర్వోపై అధికారులు చర్యలు తీసుకున్నారు. సర్వేయర్ కిరణ్ కుమార్, వీఆర్‌వో వెంకయ్యను ఇన్‌ఛార్జ్‌ కలెక్టర్‌ సస్పెండ్ చేశారు. పెదకూరపాడు నియోజకవర్గస్థాయి సమీక్షలో సర్వేయర్, వీఆర్వోపై కలెక్టర్‌కు గ్రామస్థులు, రైతులు ఫిర్యాదు చేశారు. ప్రతి పనికీ లంచాలు డిమాండ్ చేస్తున్నారని గ్రామస్థులు వాపోయారు.

7:11 AM, 21 May 2026 (IST)

కారంచేడు- చీరాల మధ్య రోడ్డు ప్రమాదం - యువకుడు మృతి

బాపట్ల జిల్లాలో రాత్రి కారంచేడు- చీరాల మధ్య రోడ్డు ప్రమాదం జరిగింది. ఈ ప్రమాదాంలో యువకుడు మృతి చెందాడు. అదుపుతప్పి కారు కాలువలోకి దూసికెళ్లగా మనోజ్‌ అనే యువకుడు మృతి చెందాడు. కాగా ఈ ప్రమాదంలో మరో ఇద్దరికి తీవ్రగాయాలయ్యాయి. క్షతగాత్రులను ఆస్పత్రికి తరలించారు.

Last Updated : May 21, 2026 at 10:57 PM IST