ETV Bharat / state

20th May 2026 News Today AP Live News Updates: పల్నాడు జిల్లాలో ఈదురుగాలుల బీభత్సం - నేలకూలిన విద్యుత్ స్తంభాలు

AP_Live_News_Updates
AP_Live_News_Updates (ETV Bharat)
author img

By ETV Bharat Andhra Pradesh Team

Published : May 20, 2026 at 7:09 AM IST

|

Updated : May 20, 2026 at 10:32 PM IST

Choose ETV Bharat

20th May 2026 News Today AP Live News Updates: పల్నాడు జిల్లా: బొల్లాపల్లి మండలంలో ఈదురుగాలుల బీభత్సం - ఈదురుగాలులకు నేలకూలిన విద్యుత్ స్తంభాలు, ఇంటి పైకప్పు రేకులు - భారీ ఈదురుగాలులకు నేలకూలిన 20 విద్యుత్‌ స్తంభాలు - తీవ్రంగా దెబ్బతిన్న బొప్పాయి పంట

LIVE FEED

10:28 PM, 20 May 2026 (IST)

పల్నాడు జిల్లా: కోనూరు సర్వేయర్, వీఆర్వోపై చర్యలు - ప్రతి పనికీ లంచాలు డిమాండ్ చేస్తున్నారని వాపోయిన గ్రామస్థులు

పల్నాడు జిల్లా అచ్చంపేట మండలం కోనూరు సర్వేయర్, వీఆర్వోలపై చర్యలు తీసుకున్నారు. సర్వేయర్ కిరణ్ కుమార్, వీఆర్‌వో వెంకయ్యను ఇన్‌ఛార్జ్‌ కలెక్టర్‌ సస్పెండ్ చేశారు. పెదకూరపాడు నియోజకవర్గస్థాయి సమీక్షలో కలెక్టర్‌కు ఫిర్యాదు చేశారు. సర్వేయర్, వీఆర్వోపై గ్రామస్థులు, రైతులు ఫిర్యాదు చేశారు. ప్రతి పనికీ లంచాలు డిమాండ్ చేస్తున్నారని గ్రామస్థులు వాపోయారు.

10:01 PM, 20 May 2026 (IST)

విశాఖ: మెట్రో రైల్ ప్రాజెక్టు సమగ్ర రవాణా ప్రణాళిక రూపకల్పనపై కలెక్టర్ అధ్యక్షతన సమీక్ష

విశాఖ మెట్రో రైల్ ప్రాజెక్టుకు అనుబంధంగా ఏర్పాటు చేయవలసిన సమగ్ర రవాణా ప్రణాళిక రూపకల్పనపై స్టేక్ హోల్డర్స్ తో కలెక్టర్ ఎం. అభిషిక్త్ కిషోర్ అధ్యక్షతన సమీక్ష నిర్వహించారు. మెట్రో రైల్ ప్రాజెక్టులు ఏర్పాటులో విశేష అనుభవం కలిగి సిస్ట్రా సంస్థ ప్రతినిధులుచే 2055 నాటికి విశాఖ జనాభా అనుగుణంగా సర్వే, విశాఖ రీజియన్​లో కీలకపాత్ర వహించే సమగ్ర రవాణా ప్రణాళికలో భాగస్వాములైన జీవీఎంసీ, విఎంఆర్డీఏ, పోలీస్ రైల్వే, నేషనల్ హైవేస్, తదితర అధికారులు సలహాలు, సూచనలు,అభ్యంతరాలను వ్రాత పూర్వకంగా తెలియజేయాలని ఆదేశించారు.

9:33 PM, 20 May 2026 (IST)

పల్నాడు: అంధకారంలో చిలకలూరిపేట ప్రభుత్వ ఆసుపత్రి - ఈదురుగాలుల ధాటికి నిలిచిపోయిన విద్యుత్ సరఫరా

పల్నాడు చిలకలూరిపేట ప్రభుత్వ ఆసుపత్రి అంధకారంలో ఉంది. విద్యుత్ సరఫరా లేక రోగులు తీవ్ర అవస్థలు పడుతున్నారు. ఈదురుగాలుల ధాటికి ఆస్పత్రికి కరెంట్ నిలిచిపోయింది. జనరేటర్ ఉన్నా డీజిల్ లేకపోవడంతో చీకట్లోనే రోగులకు ఇక్కట్లు పడుతున్నారు. దాదాపు 2 గంటలుగా విద్యుత్ లేక రోగులు ఇబ్బందులు పడుతున్నారు.

8:55 PM, 20 May 2026 (IST)

పల్నాడు జిల్లా: బొల్లాపల్లి మండలంలో ఈదురుగాలుల బీభత్సం

పల్నాడు జిల్లా బొల్లాపల్లి మండలంలో ఈదురుగాలుల బీభత్సం సృష్టించాయి. ఈదురుగాలులకు విద్యుత్ స్తంభాలు, నేలకూలగా, ఇంటి పైకప్పు రేకులు ఎగిరిపోయాయి. ఈదురుగాలులకు బొప్పాయి పంట సైతం నేలకొరిగింది. పలుచోట్ల రహదారిపై చెట్లు నేలకూలగా , రాకపోకలకు తీవ్ర అంతరాయం ఏర్పడింది. వినుకొండ, వెల్లటూరు సబ్‌స్టేషన్ల పరిధిలో విద్యుత్ సరఫరా నిలిచింది. భారీ ఈదురుగాలులకు 20 విద్యుత్‌ స్తంభాలు నేలకూలాయి. ఈదురుగాలులతో 10 ఎకరాల్లో బొప్పాయి పంట తీవ్రంగా దెబ్బతింది.

8:42 PM, 20 May 2026 (IST)

పశ్చిమ గోదావరి: మురుగు కాలువ పూడికతీస్తుండగా విషవాయువులు పీల్చి ఒకరు మృతి

పశ్చిమ గోదావరి జిల్లా భీమవరంలోని ఉండి రోడ్డులో మురుగు కాలువ పూడికతీస్తుండగా విషవాయువులు పీల్చి ఒకరు మృతి చెందారు. 2 రోజులుగా మురుగు కాలువ పూడికతీత పనులు జరుగుతుండగా విషవాయువులు పీల్చి సొమ్మసిల్లి ముగ్గురు కూలీలు పడిపోయారు. అనంతరం ప్రైవేటు ఆస్పత్రికి తరలించగా ఒకరు మృతి చెందగా, మరో ఇద్దరి పరిస్థితి విషమంగా ఉన్నట్లు సమాచారం.

8:33 PM, 20 May 2026 (IST)

కేంద్రమంత్రి మనోహర్‌లాల్ ఖట్టర్‌తో మంత్రి నారాయణ భేటీ

కేంద్రమంత్రి మనోహర్‌లాల్ ఖట్టర్‌తో మంత్రి నారాయణ భేటీ అయ్యారు. విశాఖ, విజయవాడ మెట్రో ప్రాజెక్టులకు త్వరగా అనుమతులు ఇవ్వాలని మంత్రి కోరారు. విశాఖ మెట్రో రైలు ప్రాజెక్టుపై కేంద్రానికి రైట్స్ సంస్థ నివేదిక ఇచ్చింది. విశాఖ మెట్రో మార్గంలో 13 కి.మీ డబుల్ డెక్కర్ లైన్ ఏర్పాటు చేసేలా సంస్థ నివేదిక ఇచ్చింది. అనుమతులు ఇచ్చి త్వరగా ప్రాజెక్టులు ప్రారంభించేలా చూడాలని మంత్రి ఈ సందర్భంగా కోరారు.

8:28 PM, 20 May 2026 (IST)

కర్నూలు: విద్యుదాఘాతంతో పంప్‌హౌస్‌ వాటర్‌ మ్యాన్‌ మృతి

కర్నూలు జిల్లా హలహర్వి మండలం బాపురం పంప్‌హౌస్‌లో విద్యుదాఘాతానికి గురై వాటర్‌ మ్యాన్‌ మృతి చెందారు. మృతుడు పంప్‌హౌస్‌ ఔట్ సోర్సింగ్‌ ఉద్యోగిగా గుర్తించారు. ఆలూరు చెక్‌పోస్ట్ వద్ద రహదారిపై మృతుడి బంధువుల బైఠాయించి ఘటనపై నిరసన వ్యక్తం చేశారు. న్యాయం జరిగే వరకు కదిలేది లేదన్న మృతుడి బంధువులు తెగ్గేసి చెప్పారు. దాంతో రహదారిపై భారీగా వాహన రాకపోకలు నిలిచిపోయాయి.

8:27 PM, 20 May 2026 (IST)

విశాఖ పోర్టు నూతన ఛైర్‌పర్సన్‌గా బాధ్యతలు స్వీకరించిన జస్మిత్ సింగ్ బింద్రా

విశాఖ పోర్టు నూతన ఛైర్‌పర్సన్‌గా జస్మిత్ సింగ్ బింద్రా బాధ్యతలను స్వీకరించారు. డాక్టర్ అంగముత్తు బదిలీతో జస్మిత్ సింగ్ బింద్రా బాధ్యతలు స్వీకరించారు.
జస్మిత్ సింగ్ బింద్రా 1997 బ్యాచ్ ఇండియన్ రైల్వే ట్రాఫిక్ సర్వీస్ అధికారిగా పనిచేశారు.

8:24 PM, 20 May 2026 (IST)

శాంతి బెయిల్‌ పిటిషన్‌పై విచారణ రేపటికి వాయిదా

ఆదాయానికి మించిన ఆస్తుల కేసులో శాంతి బెయిల్‌ పిటిషన్‌పై విచారణ వాయిదా పడింది. మే 23 నుంచి 28 వరకు బెయిల్ కోరుతూ శాంతి మధ్యంతర బెయిల్‌ పిటిషన్ వేయగా బెయిల్ పిటిషన్‌పై సీబీఐ కోర్టులో విచారణ పూర్తి కాగా, ఊటీలోని తన కుమార్తె స్కూల్‌ ప్రవేశం కోసం బెయిల్‌ కోరుతూ పిటిషన్‌ కోరింది. అయితే శాంతి బెయిల్‌ పిటిషన్‌పై తీర్పును సీబీఐ కోర్టు రేపటికి వాయిదా వేసింది.

8:12 PM, 20 May 2026 (IST)

కువైట్‌లో చిక్కుకున్న చంద్రగిరి మహిళకు అండగా రాష్ట్ర ప్రభుత్వం

కువైట్‌లో చిక్కుకున్న చంద్రగిరి మహిళకు రాష్ట్ర ప్రభుత్వం నిలిచింది. బాధితురాలిని సురక్షితంగా స్వదేశానికి తీసుకురావాలని సీఎం ఆదేశించారు. మీడియా కథనాలపై ముఖ్యమంత్రి కార్యాలయం తక్షణం స్పందించింది. తిరుపతి జిల్లాకు చెందిన భాగ్యవతి కువైట్‌లో ఇబ్బందులపై బాధిత మహిళను భారత్‌కు తీసుకురావడానికి సీఎం ఆదేశం చర్యలు చేపట్టాలని అధికారులను కోరారు. కువైట్‌లోని భారత రాయబార కార్యాలయంతో సీఎంవో సంప్రదింపులు జరుపుతున్నారు. బాధితురాలి భద్రతకు ప్రాధాన్యం ఇస్తూ స్వదేశానికి రప్పించే దిశగా ప్రయత్నం అడుగులు వేస్తోంది.

7:24 PM, 20 May 2026 (IST)

బెంగళూరు: ఆర్ట్ ఆఫ్ లివింగ్ వార్షికోత్సవంలో పాల్గొనడం గొప్ప గౌరవం: సీఎం చంద్రబాబు

బెంగళూరులో ఆర్ట్ ఆఫ్ లివింగ్ వార్షికోత్సవంలో సీఎం చంద్రబాబు పాల్గొన్నారు. ఆర్ట్‌ ఆఫ్‌ లివింగ్‌ వార్షికోత్సవంలో పాల్గొనడం గొప్ప గౌరవమని సీఎం అభిప్రాయపడ్డారు. ఇది వ్యక్తిగత, వ్యవస్థ వేడుక కాదని, మానవత్వ విలువలకు వేడుకని సీఎం భావించారు. నేను సీఎంగా కాకుండా భారతీయుడిగా వేడుకకు వచ్చానని పేర్కొన్నారు. గురుదేవ్‌ రవిశంకర్‌ ఆధ్యాత్మిక నాయకుడే కాదు, గొప్ప మానవతావాదని సీఎం చంద్రబాబు కొనియాడారు. సామరస్య సందేశం చేరవేతతో పాటు ఆధునిక భారత్‌కు వారధిగా నిలిచారని ప్రశంసించారు. జాతి నిర్మాణానికి తోడ్పడుతున్న రవిశంకర్‌కు ఈ సందర్భంగా సీఎం ధన్యవాదాలను తెలియజేశారు.

7:02 PM, 20 May 2026 (IST)

మద్యం కుంభకోణం కేసులో నిందితుల రిమాండ్ పొడిగింపు

మద్యం కుంభకోణం కేసులో నిందితుల రిమాండ్ పొడిగించారు. నిందితుడు ప్రణయ్ ప్రకాశ్‌ను విజయవాడ సీబీఐ కోర్టులో అధికారులు హాజరుపరిచారు. విచారణకు బెయిల్‌పై ఉన్న ఐదుగురు నిందితులు హాజరయ్యారు. నిందితుల రిమాండ్‌ను జూన్ మూడో తేదీకి పొడిగిస్తూ కోర్టు ఉత్తర్వులను జారీ చేసింది. ఈ కేసులో ప్రణయ్ ప్రకాశ్‌ మినహా మిగతా నిందితులు బెయిల్‌పై ఉన్నారు. గుంటూరు జైలులో ప్రణయ్‌ ప్రకాశ్‌ జ్యుడీషియల్ రిమాండ్‌లో ఉన్నారు. విచారణకు కృష్ణమోహన్‌రెడ్డి, నవీన్ కృష్ణ, బాలాజీకుమార్, వెంకటేశ్​లు హాజరయ్యారు. దీనికి సంబంధించి రాజ్ కెసిరెడ్డి, సజ్జల శ్రీధర్ రెడ్డి, చెవిరెడ్డి భాస్కర్‌రెడ్డి, బాలాజీ గోవిందప్ప, మిథున్‌రెడ్డి, అనిల్​లు ఆబ్సెంట్ పిటిషన్ వేయడం గమనార్హం.

6:20 PM, 20 May 2026 (IST)

గుంటూరు: పదో తరగతిలో రాణించిన ప్రభుత్వ స్కూళ్ల విద్యార్థులకు దిల్లీ ట్రిప్

గుంటూరు జిల్లాలో పదో తరగతిలో రాణించిన ప్రభుత్వ స్కూళ్ల విద్యార్థులకు దిల్లీ ట్రిప్​కు వెళ్లనున్నారు. దాదాపు 39 మంది విద్యార్థులను గుంటూరు పశ్చిమ ఎమ్మెల్యే గళ్లా మాధవి దిల్లీకి తీసుకెళ్తున్నారు. అదే విధంగా విద్యార్థుల అభినందన సభకు ఎమ్మెల్సీ ఆలపాటి రాజేంద్రప్రసాద్ హాజరయ్యారు. పదో తరగతి విద్యార్థులకు ప్రత్యేకంగా వంద రోజుల కార్యక్రమమని గళ్లా మాధవి వివరించారు. కార్యక్రమం వల్లే ప్రభుత్వ స్కూళ్లలో పిల్లలు మంచి మార్కులు సాధించారన్నారు. శ్రీ భ్రమర ట్రస్టు, ఎల్వీఆర్ క్లబ్ సహకారంతో దిల్లీ తీసుకెళ్తున్నామని ఈ సందర్భంగా ఎమ్మెల్యే గళ్లా మాధవి వివరించారు.

6:18 PM, 20 May 2026 (IST)

పాస్టర్‌ అభినయ్‌పై దాడి పూర్తి కల్పితమన్న అల్లూరి జిల్లా ఎస్పీ అమిత్‌ బర్దర్‌

పాస్టర్‌ అభినయ్‌పై దాడి పూర్తి కల్పితమని అల్లూరి జిల్లా ఎస్పీ అమిత్‌ బర్దర్‌ అన్నారు. కల్పిత దాడి ఘటనలో 8 మందిపై కేసులు నమోదయ్యాయని ఎస్పీ పేర్కొన్నారు. ఏ1 పాస్టర్‌ అభినయ్‌ దర్శన్, ఏ2 బిల్లా కిరణ్, ఏ3 కె.బెన్హర్, ఏ4 భానుప్రసాద్ లుగా గుర్తించారు. అంతేకాకుండా దాడికి సహకరించిన వసంతకుమార్, ప్రేమ్‌కుమార్, సత్యరాజు, ఇంద్రకుమార్‌పైనా కేసులు నమోదు చేశారు. మతవిద్వేషాలు రెచ్చగొట్టే ప్రయత్నం చేశారనే అభియోగాలపై కేసులు నమోదైనట్లు సమాచారం.

6:16 PM, 20 May 2026 (IST)

కృష్ణా: గుడివాడ శ్రీ కళ్యాణ వెంకటేశ్వరస్వామి ఆలయ కమిటీ సభ్యుల ఘరానా మోసం

కృష్ణా జిల్లా గుడివాడ కల్యాణ వెంకటేశ్వరస్వామి ఆలయానికి బంగారు కిరీటాన్ని వృద్ధ దంపతులు బహుకరించారు. ప్రత్యేక కార్యక్రమాల సమయంలో స్వామివారికి అలంకరించాలని ఈ సందర్భంగా దాతలు సూచించారు. అయితే బంగారు కిరీటం బ్యాంకులో ఉందని ఆలయ కమిటీ చెబుతూ వచ్చారు. స్వామివారికి బంగారు కిరీటం అలంకరించకపోవడంపై దాతలు విచారించారు. స్వామివారికి బహూకరించిన కిరీటం తాకట్టుపెట్టినట్లు దాతలు గుర్తించారు. దాంతో గుడివాడ రెండో పట్టణ పోలీసులకు దాత కుటుంబసభ్యులకు ఫిర్యాదు చేశారు.

6:13 PM, 20 May 2026 (IST)

శ్రీకాకుళం: నాగావళి నదిలో స్నానానికి వెళ్లి ఇద్దరు బాలురు గల్లంతు

శ్రీకాకుళం జిల్లా నాగావళి నదిలో స్నానానికి వెళ్లి ఇద్దరు బాలురు గల్లంతయ్యారు. శ్రీకాకుళం గ్రామీణ మండలం పెద్దగనగళ్లవానిపేటలో ఈ ఘటన చోటుచేసుకుంది. నాగావళి నది, సముద్రం కలిసే చోట స్నానానికి బాలురు వెళ్లారు. స్నానానికి శ్రీకాకుళం గుడివీధికి చెందిన ముగ్గురు పదో తరగతి విద్యార్థులు వెళ్లారు. నదిలో గల్లంతైన సాయితారక్ (15), లీలా కృష్ణ (15), గల్లతు కాగా, వీరిలో ఒకరైన మణికంఠ క్షేమంగా బయటపడ్డారు. గల్లంతైన వారి కోసం పోలీసులు, అగ్నిమాపక సిబ్బంది, జాలర్ల కోసం గాలింపు చర్యలను చేపట్టారు.

6:10 PM, 20 May 2026 (IST)

దిల్లీ: ఏపీలో స్వచ్ఛ భారత్ కార్యక్రమాల అమలును వివరించిన మంత్రి నారాయణ

స్వచ్ఛ భారత్ 2.0 కార్యక్రమాల అమలు తీరుపై దిల్లీ వేదికగా జాతీయ సదస్సు జరిగింది. జాతీయ స్థాయి సదస్సుకు ఏపీ మంత్రి నారాయణ హాజరయ్యారు. కేంద్రమంత్రి మనోహర్ లాల్ ఖట్టర్, పలు రాష్ట్రాల మున్సిపల్ శాఖ మంత్రులు సైతం హాజరయ్యారు. ఏపీ నుంచి మున్సిపల్ శాఖ డైరెక్టర్, స్వచ్ఛాంధ్ర కార్పొరేషన్ ఎండీ హాజరయ్యారు. ఏపీలో స్వచ్ఛ భారత్ కార్యక్రమాల అమలును ఈ సందర్భంగా మంత్రి నారాయణ వివరించారు. ఘన, ద్రవ వ్యర్థాల నిర్వహణకు చేపట్టిన చర్యలను మంత్రి నారాయణ వివరించారు. వేస్ట్ టు ఎనర్జీ ప్లాంట్లు నెలకొల్పుతున్న విధానాన్ని సైతం తెలియజేశారు. స్వచ్ఛభారత్‌ను ప్రజల్లోకి తీసుకెళ్లేలా ప్రతి నెలా మూడో శనివారం కార్యక్రమాలను చేపట్టాలన్నారు.

5:20 PM, 20 May 2026 (IST)

రాజమహేంద్రవరం: ప్రత్యేక పబ్లిక్ ప్రాసిక్యూటర్ ముప్పాళ్ల సుబ్బారావుకు అస్వస్థత

రాజమహేంద్రవరం ప్రత్యేక పబ్లిక్ ప్రాసిక్యూటర్ ముప్పాళ్ల సుబ్బారావు అస్వస్థతకు గురయ్యారు. డ్రైవర్ వీధి సుబ్రహ్మణ్యం హత్య కేసులో బాధితుల తరఫు వాదనలు సుబ్బారావు వినిపిస్తోన్న తరుణంలో కోర్టు ఆవరణలో ముప్పాళ్ల సుబ్బారావు కళ్లు తిరిగి పడిపోయారు. అధిక వేడి వల్ల డీహైడ్రేషన్‌తో కళ్లు తిరిగి పడిపోయిన ముప్పాళ్లను హుటాహుటిన ప్రైవేట్ ఆస్పత్రిలో చేర్పించి చికిత్సను అందిస్తున్నారు. ముప్పాళ్ల సుబ్బారావు అస్వస్థతకు గురవడంతో విచారణ రేపటికి వాయిదా పడింది. రేపు డ్రైవర్ సుబ్రహ్మణ్యం తండ్రి, మరో ఇద్దరు సాక్షుల వాంగ్మూలాన్ని కోర్టు రికార్డు చేయనుండటం గమనార్హం. రాజమహేంద్రవరం ప్రత్యేక కోర్టులో డ్రైవర్ వీధి సుబ్రమణ్యం హత్య కేసు విచారణ జరుగుతున్న సంగతి తెలిసిందే.

5:17 PM, 20 May 2026 (IST)

రాష్ట్రంలోనే అత్యధికంగా పిడుగురాళ్లలో 47.6 డిగ్రీల ఉష్ణోగ్రత నమోదు

రాష్ట్రంలోనే అత్యధికంగా పిడుగురాళ్లలో 47.6 డిగ్రీలు ఉష్ణోగ్రత నమోదైెంది. కంకిపాడు (కృష్ణా), నందనమారెళ్ల (మార్కాపురం)లో 46.1 డిగ్రీలు, ప.గో. జిల్లా తణుకులో 46 డిగ్రీల ఉష్ణోగ్రత నమోదు కాగా, మరో 11 జిల్లాల్లో 45 డిగ్రీల ఉష్ణోగ్రత దాటింది. మరో రానున్న 4 రోజులు ఎండల తీవ్రత మరింత పెరగనుంది. ప్రజలు అప్రమత్తంగా ఉండాలని విపత్తుల సంస్థ సూచించింది. రాష్ట్రంలో పలు ప్రాంతాల్లో ఎండలు, వడగాలుల ఉద్ధృతి మొదలైంది.

5:08 PM, 20 May 2026 (IST)

పల్నాడు జిల్లా: పిడుగురాళ్ల ప్రభుత్వ బోధనాసుపత్రిలో ఓపీ సేవలు ప్రారంభం

పల్నాడు జిల్లా పిడుగురాళ్ల ప్రభుత్వ బోధనాసుపత్రిలో ఓపీ సేవలు ప్రారంభమయ్యాయి. ఓపీ సేవలను ఎమ్మెల్యే యరపతినేని శ్రీనివాసరావు ముఖ్య అతిథిగా విచ్చేసి ప్రారంభించించారు. ఆసుపత్రిలో ఉద్యోగాలకు ఎంపికైన అభ్యర్థులకు నియామక పత్రాలను అందజేశారు. ఆసుపత్రిలో 15 రకాల వైద్య సేవలు అందుబాటులోకి ఎమ్మెల్యే యరపతినేని తెచ్చామన్నారు. అందుబాటులోకి జనరల్ మెడిసిన్, సర్జరీ, గైనకాలజీ, పీడియాట్రిక్స్, ఆర్థోపెడిక్, ఈఎన్టీ సేవలు ఉన్నాయన్నారు. ఆసుపత్రి విధుల్లో 65 మంది ప్రొఫెసర్లు, వైద్యులు, స్టాఫ్ నర్సులు, ఫార్మాసిస్టులు ఉన్నారని వెల్లడించారు.

5:06 PM, 20 May 2026 (IST)

విజయవాడ: తుమ్మలపల్లి కళాక్షేత్రంలో శ్రమశక్తి, ఉత్తమ యాజమాన్య పురస్కారాల ప్రదాన కార్యక్రమం

విజయవాడ: తుమ్మలపల్లి కళాక్షేత్రంలో శ్రమశక్తి, ఉత్తమ యాజమాన్య పురస్కారాల ప్రదాన కార్యక్రమం ఘనంగా జరిగింది. ఈ కార్యక్రమానికి ముఖ్యఅతిథిగా కార్మిక శాఖ మంత్రి వాసంశెట్టి సుభాష్ హాజరయ్యారు.

5:03 PM, 20 May 2026 (IST)

హైదరాబాద్‌: సైబర్ నేరగాళ్లకు సిమ్‌ కార్డులు అందజేత - 66 మంది నిందితులు అరెస్టు

హైదరాబాద్‌లో సైబర్ నేరగాళ్లకు సిమ్‌ కార్డులు అందిస్తున్న 66 మందిని పోలీసులు అరెస్టు చేశారు. 'ఆపరేషన్ ఆక్టోపస్ 3.0' పేరిట హైదరాబాద్‌ సైబర్ క్రైమ్‌ పోలీసులు చేపట్టగా, మొత్తం 13 రాష్ట్రాల్లో దాడులు నిర్వహించారు. దాదాపు 18 బృందాలతో ఏడు రోజులపాటు ఆపరేషన్‌ ఆక్టోపస్ 3.0 సాగింది. మొత్తం 1,194 ఘోస్ట్ సిమ్ కార్డులు పోలీసులు గుర్తించారు. అనంతరం 544 సిమ్ కార్డులు స్వాధీనం చేసుకున్నారు. సరఫరా చేస్తున్న వారే లక్ష్యంగా హైదరాబాద్ సైబర్ క్రైమ్‌ పోలీసుల ఘోస్ట్ సిమ్ నెట్‌వర్క్‌పై 'ఆపరేషన్ ఆక్టోపస్ 3.0' చేపట్టడం విశేషం.

5:01 PM, 20 May 2026 (IST)

శంషాబాద్ విమానాశ్రయంలో భారీగా 8.705 కిలోల హైడ్రోఫోనిక్ గంజాయి పట్టివేత

శంషాబాద్ విమానాశ్రయంలో భారీగా హైడ్రోఫోనిక్ గంజాయి పట్టుబడింది. ఇద్దరి నుంచి 8.705 కిలోల హైడ్రోఫోనిక్ గంజాయిని డీఆర్‌ఐ అధికారులు స్వాధీనం చేసుకున్నారు. పట్టుబడిన గంజాయి విలువ రూ.3.05 కోట్లు ఉంటుందని వెల్లడించారు. లగేజీలో అనుమానాస్పదంగా 24 ప్యాకెట్లు గుర్తించిన డీఆర్‌ఐ అధికారులు, ఆలూ చిప్స్, వాటర్‌ బాటిళ్లు, ఇతర డబ్బాల్లో గంజాయి తరలిస్తున్నారని కనుగొన్నారు. బ్యాంకాక్ నుంచి ఇద్దరు శంషాబాద్ విమానాశ్రయానికి రాగా నిందితులను అరెస్టు చేయడం గమనార్హం.

4:58 PM, 20 May 2026 (IST)

మంత్రి అనగాని సత్యప్రసాద్‌ను కలిసిన అసిస్టెంట్ సెక్షన్ ఆఫీసర్లు

మంత్రి అనగాని సత్యప్రసాద్‌ను అసిస్టెంట్ సెక్షన్ ఆఫీసర్లు కలిశారు. సచివాలయ రెవెన్యూ శాఖలో కొత్తగా అసిస్టెంట్ సెక్షన్ ఆఫీసర్లు నియమితులవ్వగా, సచివాలయంలోని రెవెన్యూశాఖలో 25 మంది ఏఎస్‌వోల నియామకం జరిగింది. కొత్తగా విధుల్లో చేరిన సందర్భంగా మంత్రి అనగానిని ఏఎస్‌వోలు మర్యాదపూర్వకంగా సమావేశమయ్యారు. కష్టపడి ప్రభుత్వానికి మంచి పేరు తీసుకురావాలని ఈ సందర్భంగా నూతన కార్యవర్గానికి మంత్రి అనగాని సూచించారు.

4:58 PM, 20 May 2026 (IST)

కుప్పం పర్యటన ముగించుకుని బెంగళూరు బయలుదేరిన సీఎం చంద్రబాబు

కుప్పం పర్యటన ముగించుకుని సీఎం చంద్రబాబు బెంగళూరు బయలుదేరారు. ఈ సందర్భంగా శాంతిపురం మండలం తుమ్మిసి హెలిప్యాడ్‌లో సీఎంకు నేతలు వీడ్కోలు పలికారు.

4:55 PM, 20 May 2026 (IST)

వైద్య విద్యార్ధుల మాస్ కాపీయింగ్ ఘటనపై విచారణ జరిపిన కమిటీ

వైద్య విద్యార్ధుల మాస్ కాపీయింగ్ ఘటనపై కమిటీ విచారణ జరిపింది. మొత్తం 21 మంది వైద్య విద్యార్ధులపై చర్యలకు కమిటీ సిఫార్సులు చేసింది. కమిటీ నివేదికను పరిశీలించి ఎన్టీఆర్ హెల్త్ వర్సిటీ వీసీ చంద్రశేఖర్ చర్యలు తీసుకోనున్నారు. వైద్య విద్య పరీక్షల్లో మాస్ కాపీయింగ్ చేస్తూ 21 మంది విద్యార్ధులు పట్టుబడ్డారు. కాపీ చేస్తూ ఎంబీబీఎస్, బీడీఎస్, ఆయుష్ విభాగ విద్యార్థులు పట్టుబడ్డారు. కాపీ చేస్తూ కమాండ్ కంట్రోల్ సీసీ కెమెరాలకు విద్యార్థులు చిక్కడం గమనార్హం.

4:52 PM, 20 May 2026 (IST)

ఆంధ్ర మోడల్ ఎడ్యుకేషన్ లక్ష్యం: మంత్రి లోకేశ్‌

డీఈవోలు, ఏపీసీలతో మంత్రి నారా లోకేశ్‌ సమీక్ష నిర్వహించారు. ఆంధ్ర మోడల్ ఎడ్యుకేషన్ లక్ష్యమని మంత్రి లోకేశ్‌ స్పష్టం చేశారు. నూరుశాతం ఎన్‌రోల్‌మెంట్‌పై దృష్టి పెట్టాలని అధికారులకు మంత్రి లోకేశ్‌ సూచించారు. ప్రభుత్వ పాఠశాల పిల్లలను సొంత బిడ్డల్లా భావించాలన్నారు. లక్ష మంది డ్రాపవుట్స్ గుర్తింపు-ట్రాకింగ్ మెకానిజంపై దృష్టి పెట్టామన్నారు. జీఎఫ్ఎల్ఎన్‌ను ఉద్యమంలా అమలు చేయాలన్నారు. ప్రభుత్వ స్కూళ్లలో మౌలిక సౌకర్యాలకు స్టార్ రేటింగ్ విధానాన్ని అవలంభించాలన్నారు. రెండేళ్లలో రాష్ట్రవ్యాప్తంగా స్మార్ట్ కిచెన్ల ఏర్పాటు లక్ష్యమన్నారు. అంతర్జాతీయ స్థాయికి నిడమర్రు పాఠశాల అభివృద్ధి చేయాలని పేర్కొన్నారు. టీచర్లు బోధనపైనే దృష్టిపెట్టాలని, అడ్మిన్ బాధ్యతలు అధికారులకే పర్యవేక్షించాలని మంత్రి లోకేశ్‌ ఆదేశించారు. టెక్నాలజీతో పాటు నైతిక విలువల బోధనకు ప్రాధాన్యమివ్వాలని లోకేశ్‌ పేర్కొన్నారు.

4:51 PM, 20 May 2026 (IST)

అల్లూరి జిల్లా: పాస్టర్‌ అభినయ్ దర్శన్‌ను అదుపులోకి తీసుకున్న పోలీసులు

అల్లూరి జిల్లాలో పాస్టర్‌ అభినయ్ దర్శన్‌ను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. ఫేక్‌ దాడి ఘటనలో పాస్టర్‌ను చింతపల్లి పోలీసులు అదుపులోకి తీసుకోగా, పాస్టర్‌ అభినయ్ దర్శన్‌ను జిల్లా ఎస్పీ అమిత్ బర్దార్ విచారిస్తున్నారు.

4:48 PM, 20 May 2026 (IST)

ఒంగోలులో పర్యటించిన మంత్రి డీఎస్‌బీవీ స్వామి

ఒంగోలులో మంత్రి డీఎస్‌బీవీ స్వామి పర్యటించారు. ఇందులో భాగంగా దామచర్ల సక్కుబాయమ్మ మహిళా కళాశాలలో భవన నిర్మాణ పనులను పరిశీలించారు. రూ.5 కోట్లతో పోస్ట్ మెట్రిక్ కాలేజ్ హాస్టల్ అదనపు భవనాల నిర్మాణం చేశారు. ఎస్సీల అభివృద్ధి, సంక్షేమానికి కూటమి ప్రభుత్వం కృషి చేస్తోందన్నారు. రూ.200 కోట్లతో హాస్టళ్లకు మరమ్మతులు, అదనపు భవనాల నిర్మాణం చేస్తామన్నారు. అంతేకాకుండా రూ.143 కోట్లతో 700 హాస్టళ్లకు మరమ్మతులు చేశామని గుర్తు చేశారు. ఒంగోలులో దివ్యాంగ విద్యార్థులకు రూ.3 కోట్లతో హాస్టల్ నిర్మిస్తామని ఈ సందర్భంగా మంత్రి డీఎస్‌బీవీ స్వామి ఈ సందర్భంగా వివరించారు.

4:42 PM, 20 May 2026 (IST)

మార్కాపురం: అదృశ్యమైన యువకుడు దారుణ హత్య

మార్కాపురం జిల్లాలో అదృశ్యమైన యువకుడు దారుణ హత్యకు గురయ్యారు. ఈనెల 13న యర్రగొండపాలెంలో ఆంజనేయులు అదృశ్యం కాగా, యువకుడి కుటుంబసభ్యుల ఫిర్యాదు మేరకు పోలీసుల విచారణ చేశారు. ఆంజనేయులును వెంకట నారాయణ, రమణ దంపతులు చంపినట్లు గుర్తించారు. తమ కుమార్తెతో సన్నిహితంగా ఉండటం చూసి భరించలేక చంపినట్లు దంపతులు వెల్లడించారు. ఆంజనేయులును కత్తితో ముక్కలుగా నరికి బోరు బావిలో పడేసినట్లు తెలిపారు. నిందితులను యర్రగొండపాలెం పోలీసులు అదుపులోకి తీసుకున్నారు.

2:06 PM, 20 May 2026 (IST)

గుంటూరు జీజీహెచ్​లో పెచ్చులు ఊడిపడి రోగి సహాయకురాలికి గాయాలు

గుంటూరు జీజీహెచ్ పాత భవనంలో పెచ్చులు ఊడిపడి రోగి సహాయకురాలకు గాయాలయ్యాయి. పాత భవనంలోని మూడో అంతస్తు 337వ వార్డు వద్ద పెచ్చులు ఊడిపడ్డాయి. గాయపడిన కుమారి అనే మహిళకు జీజీహెచ్ వైద్యులు వైద్యం అందిస్తున్నారు. స్వల్ప గాయం కావడంతో అధికారులు ఊపిరి పీల్చుకున్నారు.

2:04 PM, 20 May 2026 (IST)

ఎన్టీఆర్ భవన్‌లో మహానాడు తీర్మానాల కమిటీ సమావేశం

పార్టీ కేంద్ర కార్యాలయం ఎన్టీఆర్ భవన్‌లో మహానాడు తీర్మానాల కమిటీ సమావేశమయింది. రెండు రోజుల మహానాడులో మొత్తం 19 తీర్మానాలు ఉంటాయని సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి తెలిపారు. తెలంగాణకు సంబంధించి 2, తొలిసారిగా అండమాన్‌కు ఒక తీర్మానం మహానాడులో ఉంటుందని అన్నారు. ఈ రెండేళ్లలో సాధించిన పెట్టుబడులు గతంలో ఎప్పుడూ లేదని చెప్పారు. చంద్రబాబు బ్రాండ్, లోకేశ్‌ కృషి, పవన్ తోడ్పాటు, కేంద్ర మద్దతుతోనే పెట్టుబడుల సాధించామని తెలిపారు. బాధ ఉన్నా పొదుపు చర్యల కోసం హైబ్రిడ్ విధానం తప్పలేదని సోమిరెడ్డి వెల్లడించారు.

2:04 PM, 20 May 2026 (IST)

రాష్ట్రంలో భారీగా పెరిగిన ఎండల తీవ్రత

రాష్ట్రంలో ఎండల తీవ్రత భారీగా పెరిగింది. మే నెల కావడంతో భానుడు ప్రతాపం చూపిస్తున్నాడు. నిప్పులు చెరిగే ఎండతో ప్రజలు బయటకు రావాలంటేనే భయపడుతున్నారు. వడగాల్పుల తీవ్రత కూడా తోడవడంతో వేడిగాలులు పెరిగాయి. ఎండల దృష్ట్యా ప్రజలు అప్రమత్తంగా ఉండాలని అధికారులు సూచిస్తున్నారు. దాహం వేయకపోయినా ప్రతి గంటకూ నీళ్లు తాగాలని అత్యవసరమైతే తప్ప మధ్యాహ్నం వేళల్లో బయటకు వెళ్లొద్దని అధికారులు చెప్తున్నారు.

2:04 PM, 20 May 2026 (IST)

లేపాక్షి షోరూమ్‌లు, హస్తకళా రూపాల విక్రయాలపై మంత్రి సవిత సమీక్ష

లేపాక్షి షోరూమ్లు్​ హస్తకళా రూపాల విక్రయాలపై మంత్రి సమీక్ష నిర్వహించారు. లేపాక్షి ఎండీ విశ్వ, ఇతర అధికారులు సమావేశంలో పాల్గొన్నారు. లేపాక్షి షో రూమ్ లకు నూతన హంగులు రానున్నట్లు మంత్రి సవిత వెల్లడించారు. మరమ్మతులు పూర్తిచేసుకున్న దిల్లీ, కాకినాడ లేపాక్షి షో రూమ్​లు త్వరలో ప్రారంభించనున్నట్లు మంత్రి తెలిపారు. త్వరలో రాజమండ్రి విమానాశ్రయంలో నూతన లేపాక్షి షో రూమ్ ఏర్పాటు చేయనున్నామన్నారు. ఈ-కామర్స్​లో హస్త కళారూపాల అమ్మకాలు, నేరుగా వినియోగదారుల ఇళ్లకే డోర్ డెలివరీ చేయనున్నట్లు మంత్రి సవిత తెలిపారు.

2:04 PM, 20 May 2026 (IST)

రాజకీయం కోసం ఎంత నీచానికైనా జగన్ పాల్పడతారు: మంత్రి కొల్లు రవీంద్ర

రాజకీయం కోసం ఎంత నీచానికైనా జగన్ పాల్పడతారని కల్తీ మద్యం భాగోతంతో మరోసారి బట్టబయలైందని మంత్రి కొల్లు రవీంద్ర ధ్వజమెత్తారు. గొడ్డలి పార్టీ ప్రజల ప్రాణాల్ని పణంగా పెట్టడమే లక్ష్యంగా పని చేస్తోందని మండిపడ్డారు. ఈ కల్తీ మద్యం కుంభకోణం 5 రాష్ట్రాలతో సంబంధం ఉందని ఆరోపించారు. చంద్రబాబు ఇంటిపై దాడి చేసినందుకు మంత్రి పదవి వచ్చినందున, కల్తీ మద్యం ద్వారా మరో పెద్ద పదవి జోగి రమేష్​కు జగన్ ఆశ చూపాడన్నారు. తాడేపల్లి ప్యాలెస్​కు కల్తీ మద్యం భాగోతం లింక్ అయునందుకే జగన్ నోరు విప్పలేకపోతున్నాడని కొల్లు రవీంద్ర విమర్శించారు.

2:04 PM, 20 May 2026 (IST)

మంత్రి నారా లోకేశ్‌ను కలిసిన సీనియర్ ఆర్చర్ జ్యోతి సురేఖ

అంతర్జాతీయ విలువిద్య పోటీల్లో సరికొత్త చరిత్ర సృష్టిస్తోన్న స్టార్ క్రీడాకారిణి వెన్నం జ్యోతి సురేఖ మంత్రి నారా లోకేశ్‌ను కలిశారు. ప్రతిష్టాత్మక 2026 ఆసియా క్రీడలకు భారత జట్టులో ఆమె చోటు దక్కించుకున్నారు. వరుసగా నాలుగోసారి దేశానికి ప్రాతినిధ్యం వహిస్తున్నారు. ఈ నేపథ్యంలో కుటుంబ సభ్యులతో కలిసి జ్యోతి సురేఖ మంత్రిని కలిశారు. ఆసియా క్రీడల్లో పోటీపడే అవకాశం దక్కించుకున్న జ్యోతి సురేఖను లోకేశ్ అభినందించారు. విలువిద్య పోటీల్లో రాణిస్తూ రాష్ట్రానికి గర్వకారణంగా నిలిచారని ప్రశంసించారు. ఆసియా క్రీడల్లో సత్తా చాటి దేశ కీర్తిప్రతిష్టలు పెంచాలని ఆకాంక్షించారు. ప్రభుత్వం తరపున అన్ని విధాల అండగా ఉంటామని భరోసా ఇచ్చారు.

2:04 PM, 20 May 2026 (IST)

మంగళగిరిలో ఏబీవీపీ ఆందోళన

మంగళగిరిలోని రాష్ట్ర ఉన్నత విద్యామండలి కార్యాలయం వద్ద ఏబీవీపీ ఆందోళన చేపట్టింది. కళాశాలల్లో ప్రవేశాలు త్వరగా నిర్వహించాలని ఏబీవీపీ నేతలు ధర్నా చేశారు. పోలీసులను నెట్టుకుంటూ ఏబీవీపీ విద్యార్థులు కార్యాలయం లోపలికి వెళ్లి ఉన్నత విద్యామండలి ఛైర్మన్‌ ఛాంబర్‌ వద్ద బైఠాయించి నినాదాలు చేశారు. ఈ క్రమంలో పోలీసులకు, ఏబీవీపీ విద్యార్థుల మధ్య వాగ్వాదం చోటుచేసుకుంది.

1:50 PM, 20 May 2026 (IST)

ఉరివేసుకుని దివ్యాంగుడు ఆత్మహత్య

కాకినాడ జిల్లా గొల్లప్రోలులో ఉరివేసుకుని దివ్యాంగుడు ఆత్మహత్య చేసుకున్నాడు. చెరువుగట్టు వద్ద ఫ్లెక్సీ కోసం ఏర్పాటు చేసిన ఇనుప స్టాండ్‌కు వీరేంద్ర ఉరివేసుకున్నాడు. మద్యానికి బానిసై మానసికంగా సరిగా లేకపోవడంతో ఆత్మహత్య చేసుకునాడు. గతంలోనూ రెండుసార్లు ఆత్మహత్యకు యత్నించినట్లు స్థానికులు చెబుతున్నారు.

11:29 AM, 20 May 2026 (IST)

డ్రైవర్ సుబ్రమణ్యం హత్య కేసుపై కోర్టులో రెగ్యులర్ విచారణ ప్రారంభం

డ్రైవర్ సుబ్రమణ్యం హత్య కేసుపై రాజమహేంద్రవరం స్పెషల్ కోర్టులో రెగ్యులర్ విచారణ ప్రారంభమైంది. హత్య కేసులో ప్రధాన నిందితుడిగా ఉన్న వైసీపీ ఎమ్మెల్సీ అనంతబాబును పోలీసులు కోర్టులో హాజరుపరిచారు. రెండో నిందితురాలిగా ఉన్న అనంతబాబు భార్య లక్ష్మీదుర్గనూ కోర్టు ముందు ప్రవేశపెట్టారు. డ్రైవర్ హత్య కేసులో సాక్షులను న్యాయమూర్తి విచారిస్తున్నారు. సాక్షులను బెదిరించిన కేసులో రెగ్యులర్ బెయిల్ ఇవ్వాలన్న అంనంతబాబు పిటిషన్‌పైనా కోర్టు విచారణ చేస్తోంది. అనంతబాబుపై పీటీ వారెంట్ జారీ చేయాలన్న పోలీసుల వినతిపై ప్రత్యేక న్యాయస్థానం నిర్ణయం తీసుకోనుంది.

11:29 AM, 20 May 2026 (IST)

వ్యవ‌సాయేత‌ర ప‌నుల‌కు ఎరువుల వాడ‌కంపై మంత్రి అచ్చెన్న ఆగ్రహం

రాష్ట్రంలోని ప‌లు జిల్లాల్లో వ్యవ‌సాయేత‌ర ప‌నుల‌కు ఎరువుల వాడ‌కంపై మంత్రి అచ్చెన్నాయుడు సీరియస్‌ అయ్యారు. రైతులకు అందాల్సిన ఎరువులు ఇతర ప్రాంతాలకు తరలింపుపై ఆగ్రహం వ్యక్తంచేశారు. డీలర్లు, గోదాములపై ప్రత్యేక తనిఖీలు చేయాలని వ్యవ‌సాయ శాఖ క‌మిష‌న‌ర్‌ను ఆదేశించారు. అక్రమ నిల్వలు, బ్లాక్ మార్కెట్‌పై కఠిన చర్యలు తీసుకుంటామని తెలిపారు. ఎరువుల కొరత సృష్టించే వారిపై చ‌ట్టప‌ర‌మైన చ‌ర్యలు తీసుకుంటామ‌ని మంత్రి అచ్చెన్నాయుడు హెచ్చరించారు. వ్యవసాయ శాఖ అధికారుల నిర్లక్ష్యంపై కూడా విచారణ చేపట్టారు. రైతులకు సరైన సమయంలో ఎరువులు అందేలా చర్యలు తీసుకోవాలన్నారు. జిల్లాల వారీగా ఎరువుల స్టాక్‌లపై రోజువారీ మానిటరింగ్ చేస్తామన్నారు. రైతులను మోసం చేసే వారిని ఉపేక్షించమని స్పష్టంచేశారు. ఎరువులను ప‌క్కదారి ప‌ట్టిస్తున్నట్లు రుజువైతే డీల‌ర్ల లైసెన్సులు రద్దు చేసి, క్రిమిన‌ల్ కేసులు నమోదు చేస్తామని హెచ్చరించారు.

11:29 AM, 20 May 2026 (IST)

నిత్యానందరెడ్డిని రెండో రోజు ప్రశ్నిస్తున్న పోలీసులు

నిత్యానందరెడ్డిని పోలీసులు రెండో రోజు ప్రశ్నిస్తున్నారు. చిన్నచౌక్ పీఎస్‌లో సీఐ రామకృష్ణారెడ్డి ప్రశ్నిస్తున్నారు. వైసీపీ కార్యకర్త, స్థిరాస్తి వ్యాపారి పెద్దదస్తగిరి హత్య కేసులో నిత్యానందరెడ్డి కీలక నిందితుడిగా ఉన్నారు. ఈ హత్య కేసులో 11 మంది నిందితులను ఇప్పటికే పోలీసులు అరెస్టు చేశారు. నిన్న నిత్యానందరెడ్డిని కస్టడీకి తీసుకోగా ఇవాళ రెండో రోజు ప్రశ్నిస్తున్నారు. నిన్న పోలీసులు అడిగిన ఏ ప్రశ్నకూ నిత్యానందరెడ్డి సమాధానం ఇవ్వలేదు.

11:29 AM, 20 May 2026 (IST)

పార్వతీపురంలో దంపతులు ఆత్మహత్యాయత్నం

పార్వతీపురం మన్యం జిల్లాలో పురుగుల మందు తాగి భార్యాభర్తలు ఆత్మహత్యాయత్నానికి పాల్పడ్డారు. కేంద్రం పురపాలక సంఘం 24 అవార్డులో సంక శ్రీనివాసరావు ఆయన భార్య శోభారాణి(45) పురుగుల మందు తాగారు. భార్య మృతి చెందగా భర్త కొన ఊపిరితో కొట్టుమిట్టాడుతున్నాడు. ఈ ఆత్మహత్యకు ఆర్థిక ఇబ్బందులే కారణమని స్థానికులు చెప్తున్నారు.

11:29 AM, 20 May 2026 (IST)

అమెరికాలో బాపట్ల జిల్లాకు చెందిన కుటుంబానికి రోడ్డు ప్రమాదం

అమెరికాలో బాపట్ల జిల్లాకు చెందిన కుటుంబానికి రోడ్డు ప్రమాదం జరిగింది. బాపట్ల యాదవపాలేనికి చెందిన పూర్ణ గోపి మృతి చెందగా ముగ్గురికి తీవ్రగాయాలయ్యాయి. క్షతగాత్రులు ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నారు.

11:19 AM, 20 May 2026 (IST)

వైసీపీ ఐదేళ్ల పాలన దళితులకు నరకయాతనగా మారింది: మంత్రి డీఎస్‌బీవీ స్వామి

వైసీపీ ఐదేళ్ల పాలన దళితులకు నరకయాతన పెట్టిందని మంత్రి డోలా శ్రీ బాల వీరాంజనేయస్వామి ఆరోపించారు. గత 5 ఏళ్లు దళితులు రాష్ట్రంలో రెండవ తరగతి పౌరుల్లా బిక్కుబిక్కుమంటూ బ్రతికారన్నారు. నాడు రాష్ట్రంలో ఏ ప్రాంతంలో చూసినా దళితులపై దాడులు, దౌర్జన్యాలు, అఘాయిత్యాలు నిత్య కృత్యమని తెలిపారు. డ్రైవర్ సుబ్రహ్మణ్యం నుంచి డాక్టర్ సుధాకర్ వరకు ఎంతో మంది దళితుల్ని వైసీపీ బలి తీసుకుందని డోలా శ్రీబాల వీరాంజనేయస్వామి మండిపడ్డారు. దళితుల ఉసురు తగిలే వైసీపీ 11కి పడిపోయిందన్నారు.

9:21 AM, 20 May 2026 (IST)

తెలుగువారి ఆత్మగౌరవానికి ప్రతీక టంగుటూరి ప్రకాశం పంతులు: సీఎం చంద్రబాబు

ప్రముఖ స్వాతంత్ర్య సమరయోధులు, ఆంధ్ర రాష్ట్ర తొలి ముఖ్యమంత్రి టంగుటూరి ప్రకాశం పంతులు వర్ధంతి సందర్భంగా సీఎం చంద్రబాబు, మంత్రి నారా లోకేశ్ నివాళులర్పించారు. తెలుగువారి ధైర్యసాహసాలకు, ఆత్మగౌరవానికి ప్రతీక టంగుటూరి ప్రకాశం పంతులు అని చంద్రబాబు కొనియాడారు. అచంచల దేశభక్తి, నిజాయితీ, నిబద్ధతలతో ప్రజల కోసమే జీవించిన మహనీయుడన్నారు. ఆ మహోన్నత నాయకుడి సేవలను స్మరించుకుందామని చంద్రబాబు ఆకాంక్షించారు. దేశం కోసం జీవితాన్ని అంకితం చేసిన వ్యక్తి టంగుటూరి ప్రకాశం పంతులు అని లోకేశ్ అన్నారు. ధైర్య సాహసాలు, ప్రజాసేవ, దేశభక్తికి ఆయన ప్రతీకగా నిలిచారని తెలిపారు. స్వాతంత్ర్య పోరాటం నుంచి రాష్ట్ర నిర్మాణం వరకు ఆయన చేసిన సేవలు చిరస్మరణీయమన్నారు.

9:21 AM, 20 May 2026 (IST)

వైసీపీ నేత బైరెడ్డి సిద్ధార్థరెడ్డిపై కేసు నమోదు

వైఎస్సార్సీపీ బైరెడ్డి సిద్ధార్థ రెడ్డిపై కర్నూలు 3 టౌన్ పోలీస్ స్టేషన్లో కేసు నమోదయింది. మంత్రి టీజీ భరత్ ఇచ్చిన ఫిర్యాదు మేరకు పోలీసులు బైరెడ్డి సిద్ధార్థ రెడ్డిపై వివిధ సెక్షన్లతో కేసు నమోదు చేశారు. ఇటీవల కర్నూలు కలెక్టరేట్ వద్ద వైసీపీ నేతలు నిర్వహించిన ధర్నా కార్యక్రమంలో బైరెడ్డి సిద్ధార్థ రెడ్డి మంత్రినీ ఉద్దేశించి తీవ్రమైన ఆరోపణలు చేశారు. ఓ ఫార్మా కంపెనీ నుంచి మంత్రి టీజీ భరత్​కు 45 కోట్ల రూపాయలు లంచం తీసుకున్నారని బహిరంగంగా ఆరోపించారు. దీనిపై తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేసిన మంత్రి భరత్ సిద్ధార్థ రెడ్డిపై పోలీసులకు ఫిర్యాదు చేశారు.

9:20 AM, 20 May 2026 (IST)

కంచర్లపాలెంలో యువకుడి హత్య

గుంటూరు జిల్లా తెనాలి మండలం కంచర్లపాలెంలో యువకుడు దారుణ హత్యకు గురయ్యాడు. గ్రామ శివారులోని వాలీబాల్ కోర్టు వద్ద కోపల్లె కార్తీక్(18) మృతదేహం గుర్తించారు. వాలీబాల్ నెట్ వైరు గొంతుకు బిగించి కార్తీక్​ని హత్య చేసినట్లు పోలీసుల విచారణలో తేలింది.

9:20 AM, 20 May 2026 (IST)

టిప్పర్ కిందపడి రెండు దుప్పిలు మృతి

నెల్లూరు జిల్లాలోని దుత్తలూరు మండలం నర్రవాడ హైవేపై ప్రమాదం జరిగింది. వేగంగా వెళ్తున్న టిప్పర్ కిందపడి రెండు దుప్పిలు మృతి చెందాయి. సమాచారం అందుకున్న అటవీశాఖ సిబ్బంది ఘటనాస్థలికి చేరుకున్నారు. ప్రమాదంపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు.

9:20 AM, 20 May 2026 (IST)

మద్యం కేసు నిందితులకు నేటితో ముగియనున్న రిమాండ్

మద్యం కేసు నిందితులకు రిమాండ్ నేటితో ముగియనుంది. గుంటూరు జైలులో ఉన్న ప్రణయ్‌ ప్రకాశ్‌ను అధికారులు సీబీఐ కోర్టులో హాజరుపరచనున్నారు. ఈ కేసులో మరికొందరు నిందితులు ఇప్పటికే బెయిల్‌పై ఉన్నారు. రాజ్ కెసిరెడ్డి సహా బెయిల్‌పై ఉన్న ఇతర నిందితులు విచారణకు హాజరుకానున్నారు.

9:13 AM, 20 May 2026 (IST)

బీఎస్ఎన్ఎల్ కార్యాలయంలో అగ్నిప్రమాదం

కర్నూలులోని కొత్తపేట వద్ద పాత బీఎస్ఎన్ఎల్ కార్యాలయంలో అగ్నిప్రమాదం చోటుచేసుకుంది. షాక్‌సర్క్యూట్ అవడంతో మంటలు భారీగా వ్యాపించాయి. సమాచారం అందుకున్న అగ్నిమాపక సిబ్బంది మంటలను అదుపులోకి తీసుకొచ్చాయి. మంటల ధాటికి సామగ్రి పూర్తిగా కాలిపోయింది.

7:00 AM, 20 May 2026 (IST)

తల్లి, ముగ్గురు చిన్నారులు అదృశ్యం

కడపలోని రవీంద్రనగర్‌లో రాత్రి తల్లి, ముగ్గురు చిన్నారులు అదృశ్యమయ్యారు. తల్లి రకిబు పిల్లలు సైజ్, మైను, అబ్దుల్ అజీజ్ అదృశ్యమయ్యారు. అదృశ్యమైన తల్లి, పిల్లల కోసం పోలీసులు గాలిస్తున్నారు. భర్త వేధింపుల వల్లే మహిళ వెళ్లిపోయినట్లు పోలీసులు భావిస్తున్నారు.

7:00 AM, 20 May 2026 (IST)

నేడు దేశవ్యాప్తంగా మందుల దుకాణాల బంద్‌

నేడు దేశవ్యాప్తంగా మందుల దుకాణాల బంద్‌ అవనున్నాయి. ఆన్‌లైన్‌లో మందుల అమ్మకాలను వ్యతిరేకిస్తూ నిరసన చేయనున్నారు. ఆన్‌లైన్‌లో నకిలీ, ప్రమాదకర మందుల సరఫరా అరికట్టాలని డిమాండ్ ఉన్న నేపథ్యంలో ఆల్‌ ఇండియా ఆర్గనైజేషన్‌ ఆఫ్ కెమిస్ట్‌, డ్రగ్గిస్ట్‌ బంద్‌కు పిలుపునిచ్చాయి. ఈ క్రమంలో రాష్ట్రంలో 40వేలకు పైగా మందుల దుకాణాలు మూతపడనున్నాయి. దేశవ్యాప్తంగా సుమారు 12లక్షలకు పైగా మెడికల్‌ దుకాణాలు మూతపడనున్నాయి. ప్రత్యామ్నాయ చర్యలు చేపడుతుని డ్రగ్స్ కంట్రోల్ అడ్మినిస్ట్రేషన్ అధికారులు చెప్తున్నారు.

Last Updated : May 20, 2026 at 10:32 PM IST