08th July 2026 News Today AP Live News Updates : గ్రామపంచాయతీల పాలనా సంస్కరణల్లో ప్రభుత్వం కీలక నిర్ణయం

By ETV Bharat Andhra Pradesh Team
Published : July 8, 2026 at 7:05 AM IST
|Updated : July 8, 2026 at 9:41 PM IST
08-07-2026 AP News Today Live Updates : గ్రామపంచాయతీల పాలనా సంస్కరణల్లో ప్రభుత్వం కీలక నిర్ణయం - రాష్ట్రంలోని 13,351 గ్రామపంచాయతీలను 4 గ్రేడ్‌లుగా వర్గీకరణ - రూర్బన్ పంచాయతీలు 359, గ్రేడ్-1 పంచాయతీలు 3,082 - గ్రేడ్-2 పంచాయతీలు 3,163, గ్రేడ్-3 పంచాయతీలు 6,747
LIVE FEED
అనంతపురం: ఇండస్ట్రియల్ ఎస్టేట్‌లో బయో ఫెర్టిలైజర్స్ గిడ్డంగిపై దాడులు
అనంతపురం ఇండస్ట్రియల్ ఎస్టేట్‌లో బయో ఫెర్టిలైజర్స్ గిడ్డంగిపై ఆకస్మిక దాడులు జరిగాయి. విజిలెన్స్, వ్యవసాయశాఖ అధికారులు సంయుక్తంగా ఈ తనిఖీలు చేశారు. మొక్కల ఎదుగుదల పేరుతో అక్కడ సొంతంగా మందులు తయారు చేస్తున్నట్లు అధికారులు గుర్తించారు. నిబంధనలకు విరుద్ధంగా ఉన్న రూ.77 లక్షల విలువైన 8,155 లీటర్ల మందులను వెంటనే సీజ్ చేశారు.
ఎన్టీఆర్ జిల్లా: జగ్గయ్యపేటలో ఏసుబాబు అదృశ్యంపై పోలీసుల వివరణ
ఎన్టీఆర్ జిల్లా జగ్గయ్యపేటలో ఏసుబాబు అదృశ్యంపై పోలీసులు వివరణ ఇచ్చారు. దీనిపై కుటుంబసభ్యులు హైకోర్టులో హెబియస్ కార్పస్ పిటిషన్ వేశారు. అయితే 2025 సెప్టెంబర్ 18న జరిగిన చోరీ కేసులో అతన్ని అరెస్టు చేశామని పోలీసులు తెలిపారు. కోర్టు అతనికి రిమాండ్ విధించిందన్నారు. ఈ కేసులో చట్టబద్ధంగానే వ్యవహరిస్తున్నామని స్పష్టం చేశారు. ఏసుబాబు అరెస్టుపై ముందే కుటుంబసభ్యులకు సమాచారం ఇచ్చామని వెల్లడించారు.
రాజధాని రైతులతో ఘర్షణ కేసులో వైఎస్సార్సీపీ నేతల పిటిషన్‌పై హైకోర్టులో విచారణ
రాజధాని రైతులతో ఘర్షణ కేసులో వైఎస్సార్సీపీ నేతల పిటిషన్‌పై హైకోర్టులో విచారణ జరిగింది. దర్యాప్తునకు సహకరించాలని వైఎస్సార్సీపీ నేతలను న్యాయస్థానం ఆదేశించింది. పేర్ని నాని, అంబటి రాంబాబు తదితరులకు ఈ మేరకు ఆదేశాలు ఇచ్చింది. అలాగే పిటిషనర్లకు నోటీసులు ఇచ్చి వారి నుంచి వివరణ తీసుకోవాలని సంబంధిత అధికారులకు హైకోర్టు సూచించింది.
సాయికృష్ణ కేసును సీబీఐకి అప్పగించాలంటూ దాఖలైన పిటిషన్‌పై విచారణ
సాయికృష్ణ మృతి కేసును సీబీఐకి అప్పగించాలని కోరుతూ దాఖలైన పీటిషన్ పై హైకోర్టు విచారించింది. కేసులో దర్యాప్తు పురోగతిపై నివేదిక ఇవ్వాలని సిట్‌ను హైకోర్టు ఆదేశించారు. డీజీపీ, విజయవాడ పోలీసులు హైకోర్టును తప్పుదోవపట్టించారని పిటిషనర్ తరఫు న్యాయవాది వాదనలు వినిపించారు. అన్ని కేసులు డీజీపీకి తెలియక పోవచ్చు, ఈ కేసులో దురుద్దేశాలు ఆపాదించడం సరికాదని న్యాయస్థానం అభిప్రాయపడింది. ఈ కేసులో ఆరుగుర్ని నిందితులుగా చేర్చి, అయిదుగుర్ని అరెస్ట్ చేశామని ఏజి తెలిపారు. తదుపరి విచారణను హైకోర్టు 3వారాలకు వాయిదా వేసింది.
రాజధాని రైతులతో ఘర్షణ కేసులో వైసీపీ నేతల పిటిషన్‌పై హైకోర్టులో విచారణ
రాజధాని రైతులతో ఘర్షణ, దూషించిన కేసులో వైసీపీ నేతలు దాఖలు చేసిన పిటిషన్ పై హైకోర్టు విచారణ చేసింది. దర్యాప్తునకు సహకరించాలని వైసీపీ నేతలు పేర్ని నాని, అంబటి, తదితరులకు న్యాయస్థానం ఆదేశించింది. పిటిషనర్లకు నోటీసు ఇచ్చి వివరణ తీసుకోవాలని ఐవోకు ఆదేశించింది. రాజధాని రైతులతో ఘర్షణ పడిన ఘటనలో వైసీపీ నేతలపై తాడేపల్లి పోలీసులు కేసు నమోదు చేశారు.
గ్రామపంచాయతీల పాలనా సంస్కరణల్లో ప్రభుత్వం కీలక నిర్ణయం
గ్రామపంచాయతీల పాలనా సంస్కరణల్లో ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. రాష్ట్రంలోని 13,351 గ్రామపంచాయతీలను 4 గ్రేడ్‌లుగా వర్గీకరించింది. రూర్బన్ పంచాయతీలు 359, గ్రేడ్-1 పంచాయతీలు 3,082, గ్రేడ్-2 పంచాయతీలు 3,163, గ్రేడ్-3 పంచాయతీలు 6,747లుగా విభజించింది. ప్రజలకు సమర్థంగా సేవలు అందించే ఉద్దేశంతో అదనంగా మరో 2 విభాగాలను ఏర్పాటు చేసింది. పారిశుద్ధ్య విభాగం, తాగునీటి సరఫరా విభాగాల ఏర్పాటుకు ప్రభుత్వ నిర్ణయించింది. కొత్త సిబ్బంది వేతనాలను పంచాయతీ నిధుల నుంచే ఖర్చు చేసేలా నిర్ణయం తీసుకుంది.
కారుణ్య మరణాలకు మార్గం సుగమం
కారుణ్య మరణాలకు మార్గం సుగమం అయ్యింది. సుప్రీంకోర్టు ఆదేశాల మేరకు రాష్ట్ర ప్రభుత్వం చర్యలు చేపట్టింది. మార్గదర్శకాలకు మంత్రి సత్యకుమార్ ఆమోదం తెలిపారు. వైద్యులు, రోగుల కుటుంబసభ్యుల నిర్ణయాలకు చట్టబద్ధత కల్పించారు. చివరి దశలో ఉన్న రోగులకు తాజా మార్గదర్శకాలతో ఊరట లభించింది.
నంద్యాల జిల్లా ఆళ్లగడ్డలో ఉద్రిక్త వాతావరణం
నంద్యాల జిల్లా ఆళ్లగడ్డలో టీడీపీ, వైసీపీ నేతల మధ్య మాటలు యుద్ధం ఉద్రిక్తతకు దారితీసింది. అహోబిలం మఠంలో తలనీలాల టెండర్ల విషయంలో ఇరు పార్టీల నేతల మధ్య రగిలిన వ్యవహారం సవాళ్లు ప్రతి సవాళ్లతో వేడెక్కింది. అహోబిలంలో తలనీలాలను విక్రయించకుండా టీడీపీ ఎమ్మెల్యే అఖిలప్రియ అడ్డుకుంటున్నారని అక్రమాలకు పాల్పడుతున్నారని వైసీపీ మాజీ ఎమ్మెల్యే గంగుల నాని ఆరోపించారు. వైసీపీ మాజీ ఎమ్మెల్యే వ్యాఖ్యలపై తీవ్రంగా స్పందించిన టీడీపీ ఎమ్మెల్యే అఖిలప్రియ, అక్రమాలు నిరూపించడానికి అహోబిలం మఠానికి ఇవాళ సాయంత్రం లోపు రావాలని సవాల్ విసిరారు.
సాయంత్రం ఐదు గంటలకు టీడీపీ ఎమ్మెల్యే ఆళ్లగడ్డ నుంచి నేరుగా అహోబిలం మఠానికి చేరుకున్నారు. వైసీపీ మాజీ ఎమ్మెల్యే కోసం ఎదురుచూస్తుండగా ఆళ్లగడ్డ నుంచి గంగుల నాని అహోబిలం మఠానికి బయలు దేరుతుండగా పోలీసులు అడ్డుకున్నారు. పెద్ద సంఖ్యలో అనుచరులతో బయలుదేరడానికి ప్రయత్నించడంతో పోలీసులు అడ్డుకుని నిలవరించారు. పార్టీ నేతలు అక్కడికి వెళ్తే ఘర్షణ మరింత పెరుగుతుందని పోలీసులు నచ్చజెప్పి ప్రయత్నం చేశారు. నిన్న రాత్రి అహోబిలం మఠం తలనీలాలను చెన్నైకి చెందిన గుత్తేదారు సంస్థకు అప్పగించేందుకు వాహనంలో తీసుకెళ్తుండగా ఎమ్మెల్యే సోదరుడు అడ్డుకుని పోలీసులు అప్పగించారు. దీంతో ఇరు పార్టీ నేతల మధ్య వాదోపవాదాలు చోటు చేసుకున్నయి. ప్రస్తుతం వాతావరణ సద్దుమణిగింది.
బోటు గల్లంతుపై త్రిసభ్య కమిటీ వాస్తవ నివేదిక విడుదల
విశాఖ: బోటు గల్లంతుపై త్రిసభ్య కమిటీ వాస్తవ నివేదిక విడుదల చేసింది. ఈ నెల 4న బోటు ప్రమాదం జరిగిందని నిర్ధారించింది. ఈ నెల 5 ఉదయం నుంచి గాలింపు చర్యలు చేపట్టినట్లు వెల్లడించింది. ప్రమాద సమయంలో ఏడుగురు మత్స్యకారులు ఉన్నారని, ప్రమాదం నుంచి కారె చిన్న అనే వ్యక్తి బయటపడ్డారని నివేదికలో వెల్లడించారు. 72 గంటలపాటు గాలింపు చర్యలు చేపట్టారని కమిటీ నివేదికలో పేర్కొంది. కారె చిన్నయ్య, కారె సితోడు, కారె గరగయ్య, రాగోతు బండయ్య, మేడా చినఅమ్మోరు, అప్పలరాజు గల్లంతైనట్లు ప్రకటించింది. గల్లంతైనవారి కుటుంబసభ్యులకు బీమా, ఇతర సాయానికి సమ్మతించినట్లు వివరించింది.
సీఐ రాములు నాయక్ మోసం చేసి పెళ్లి చేసుకున్నాడని మహిళ ఫిర్యాదు
సీఐ రాములు నాయక్ మోసం చేసి పెళ్లి చేసుకున్నాడని బాధిత మహిళ గుంటూరు ఎస్పీకి ఫిర్యాదు చేసింది. భర్తతో విభేదాలతో ఫిర్యాదు చేసేందుకు ఒంగోలు వన్‌టౌన్ పీఎస్‌కు మహిళ వెళ్లగా తనను అప్పటి ఎస్ఐ రాములు నాయక్ లొంగదీసుకున్నట్లు ఆమె ఆరోపించింది. శ్రీశైలంలో రాములు నాయక్ తనను పెళ్లి చేసుకున్నాడని మహిళ తెలిపింది. రాములు నాయక్ వేధిస్తున్నాడని గతంలో డీఎస్పీకి ఫిర్యాదు చేసింది. ప్రస్తుతం సీఐ రాములు నాయక్ వీఆర్‌లో ఉన్నారు. సీఐ రాములు నాయక్ నుంచి ప్రాణహాని ఉందని మహిళ ఆరోపిస్తుంది. ఏకాంతంగా ఉన్న వీడియోలు సోషల్ మీడియాలో పెడతానని బెదిరిస్తున్నాడన్న మహిళ ఆందోళన వ్యక్తం చేసింది.
రావణ్‌లు, ప్రకాశ్ రాజ్‌లు ఎక్కడినుంచి పుట్టుకు వస్తున్నారు? వీరికి మద్దతు ఇస్తున్నది ఎవరు: విజయసాయిరెడ్డి
రావణ్‌లు, ప్రకాశ్ రాజ్‌లు ఎక్కడినుంచి పుట్టుకు వస్తున్నారు? వీరికి మద్దతు ఇస్తున్నది ఎవరు అని విజయసాయిరెడ్డి ప్రశ్నించారు. రావణ్, ప్రకాశ్‌రాజ్‌ను వైఎస్సార్సీపీ సమర్థించటం హిందుత్వంపై దాడే అని అన్నారు. ఇలాంటి ఆలోచనల్ని మతపరమైన ఉగ్రవాదంగా భావించాలని, చట్టం వేసే శిక్షలతోపాటు సమాజం కూడా వీరందరినీ వెలివేయాలని ఆయన అన్నారు. ఏపీ, తెలంగాణ ప్రభుత్వాలతోపాటు కేంద్రం వీరిపై చర్యలు తీసుకోవాలని విజయసాయిరెడ్డి కోరారు.
పట్టిసీమ, తాడిపూడి ఎత్తిపోతల మోటార్లు ఆన్ చేసిన మంత్రి నిమ్మల
పట్టిసీమ ద్వారా గోదావరి జలాలను, కృష్ణా జలాలతో అనుసంధానం చేసి నదుల అనుసంధానానికి ముఖ్యమంత్రి చంద్రబాబు శ్రీకారం చుట్టారని రాష్ట్ర జల వనరుల శాఖ మంత్రి నిమ్మల రామానాయుడు అన్నారు. పట్టిసీమ ఎత్తిపోతల పథకం వద్ద బుధవారం పూజలు చేసిన ఆయన మోటార్ల స్విచ్ ఆన్‌చేసి పోలవరం కుడి కాలవలోకి నీటిని విడుదల చేశారు. ఈ సందర్భంగా నిమ్మల మాట్లాడుతూ 2014-19లో రూ.1300 కోట్లతో నిర్మించిన పట్టిసీమ నేడు రూ.50 వేల కోట్ల ఆదాయం సృష్టించిందన్నారు.
రాజధాని రైతుల సమస్యల పరిష్కారంపై ప్రభుత్వం దృష్టి
రాజధాని రైతుల సమస్యల పరిష్కారంపై ప్రభుత్వం దృష్టి సారించింది. ఈ మేరకు అమరావతి రైతు ఐకాస ప్రతినిధులతో మంత్రి నారాయణ భేటీ అయ్యారు. సీఆర్డీఏ కమిషనర్ విజయరామరాజు, అదనపు కమిషనర్లు ఈ సమావేశానికి హాజరయ్యారు. రైతుల సమస్యలు, గ్రామాల్లోని సమస్యల పరిష్కారం, గ్రామకంఠం సమస్యలు, ఎఫ్‌ఎస్‌ఐ పెంపు, ప్లాట్‌ల రిజిస్ట్రేషన్లు, గ్రామాల్లో చెత్త డంపింగ్, ట్రాఫిక్ సమస్యలు, రోడ్ల కనెక్టివిటీ సహా పలు అంశాలపై చర్చించారు. సమావేశంలో తీసుకున్న నిర్ణయాలపై రైతులు సంతృప్తి వ్యక్తం చేశారు.
దెహ్రాదూన్‌లో న్యాయ పోరాటం చేస్తున్న రాధాగాయత్రి తల్లిదండ్రులు
విశాఖ: టెకీ రాధాగాయత్రి అనుమానాస్పద మృతి కేసులో రాధాగాయత్రి తల్లిదండ్రులు దెహ్రాదూన్‌లో న్యాయ పోరాటం చేస్తున్నారు. మసూరి కలెక్టర్ ఇప్పటికే న్యాయ విచారణకు ఆదేశించారు. రాధ గాయత్రిని భర్త శ్రీ చరణ్ ఈ హత్య చేశాడని, సంఘటన జరిగిన రోజు రాత్రి 11 గంటలకి ఈప్రాంతం రావడానికి కచ్చితంగా మూడో వ్యక్తి సహకరించాడని మృతురాలి తండ్రి సుధాకర్ ఆరోపించారు. ముమ్మాటికి పథకం ప్రకారమే రాధా గాయత్రిని అడ్డు తొలగించుకున్నాడని ఆరోపించారు. ఉత్తరాఖండ్ ప్రభుత్వం మీద, ముస్సోరి పోలీస్ శాఖపై తమకు నమ్మకం ఉందిని రాధ గాయత్రి తల్లి సత్యవతి తెలిపారు.
నిరంజన్ మృతి వార్త నా హృదయాన్ని కలచివేసింది: పవన్ కల్యాణ్
అభిమాని నిరంజీన్ మృతిపై ప్రముఖ డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ సంతాపం తెలిపారు. పొనుగంటి నిరంజన్ (17) చికిత్స పొందుతూ మంగళవారం మృతి చెందిన విషయం తెలిసిందే. అతడిని గుర్తుచేసుకుంటూ పవన్ పోస్ట్ పెట్టారు. నిరంజన్ ఇక లేడనే వార్త తన హృదయాన్ని తీవ్రంగా కలచి వేసిందన్నారు.
ఎగువన కురుస్తున్న వర్షాలతో గోదావరికి జలకళ
ఎగువన కురుస్తున్న వర్షాలతో గోదావరికి జలకళ సంతరించుకుంది. ధవళేశ్వరం బ్యారేజ్ వద్ద నీటిమట్టం 10.9 అడుగులకు చేరింది. ఎగువ నుంచి ధవళేశ్వరం బ్యారేజ్‌కు 60,933 క్యూసెక్కుల నీరు వస్తుంది. ధవళేశ్వరం బ్యారేజ్ నుంచి అవుట్‌ఫ్లో 57,387 క్యూసెక్కులు, కాలువలకు 13,600 క్యూసెక్కులు, గేట్ల ద్వారా 43,387 క్యూసెక్కులు నీటిని అధికారులు సముద్రంలోకి వదులుతున్నారు.
గోదావరి నదికి ఎట్టకేలకు వరద వచ్చింది. గోదావరి పరీవాహక ప్రాంతాల్లో కురుస్తున్న వర్షాలకు వరద నీరు వస్తోంది. దేవీపట్నం మండలం వద్ద గోదావరి నది రంగు మారింది. నీలి, ఎరుపు రంగులతో పర్యాటకులకు గోదావరి నది కనువిందు చేస్తోంది. గండి పోచమ్మ అమ్మవారి ఆలయం వద్ద వరద ఉద్ధృతి క్రమంగా పెరుగుతోంది. అమ్మవారి ఆలయ పరిసర ప్రాంతాల్లోకి వరద నీరు చేరడంతో అధికారులు అప్రమత్తమయ్యారు. ఆలయంలో హుండీ లెక్కింపును అధికారులు పూర్తి చేశారు. ధవళేశ్వరం బ్యారేజీ వద్ద కూడా నీటిమట్టం క్రమంగా పెరుగుతోంది.
పీఎఫ్ చందాదారులకు శుభవార్త - రూ.5లక్షల వరకు ఆటోమేటిక్ క్లెయిమ్ సెటిల్మెంట్
పీఎఫ్ చందాదారులకు గుడ్ న్యూస్. ఈపీఎఫ్ఓ కొత్త డిజిటల్ వ్యవస్థను ప్రారంభించింది. ఆటోమేటిక్ క్లెయిమ్ సెటిల్మెంట్ను రూ.5 లక్షల వరకు పెంచుతూ కీలక నిర్ణయం తీసుకుంది. ఈ నెల 15 నాటికి పీఎఫ్ చందాదారాల ఖాతాల్లో వడ్డీ జమ చేయనున్నట్లు తెలిపింది. గతంలో చందాదారులు తమ ఖాతాల్లో వడ్డీ జమ కావడానికి సెప్టెంబర్ లేదా అక్టోబర్ వరకు వేచి చూడాల్సి ఉండేది.
రాజమహేంద్రవరం వద్ద కళకళలాడుతోన్న గోదావరి నది
ఎగువన కురుస్తున్న వర్షాలతో గోదావరికి జలకళ సంతరించుకుంది. రాజమహేంద్రవరం వద్ద గోదావరి నది కళకళలాడుతోంది. నీటితో నిండుకుండలా ధవళేశ్వరం కాటన్ బ్యారేజ్ కనిపిస్తుంది. ధవళేశ్వరం బ్యారేజీ వద్ద నీటిమట్టం 10.90 అడుగులకు చేరింది. ఎగువ నుంచి ధవళేశ్వరం బ్యారేజీకి 60,933 క్యూసెక్కుల నీరు వస్తోంది.బ్యారేజ్ నుంచి ఔట్‌ఫ్లో 57,387 క్యూసెక్కులు కాగా బ్యారేజీ నుంచి 13,600 క్యూసెక్కుల నీటిని కాలువలకు వదులుతున్నారు. బ్యారేజీ గేట్లు ఎత్తి 43, 387 క్యూసెక్కుల నీటిని సముద్రంలోకి అధికారులు వదులుతున్నారు.
బోటు ప్రమాదంలో చికిత్స పొందుతున్న కారె చిన్నాను పరామర్శించిన మంత్రి కొల్లు
బోటు ప్రమాదంలో గాజువాక కిమ్స్ ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న కారె చిన్నాను మంత్రి కొల్లు పరామర్శించారు. ప్రభుత్వం తరఫున అన్నివిధాలుగా సాయం అందిస్తామని మంత్రి కొల్లు హామీ ఇచ్చారు.
కడప రిమ్స్ మెడికల్ విద్యార్థినుల అస్వస్థతపై మంత్రి సవిత ఆరా
కడప రిమ్స్ మెడికల్ విద్యార్థినుల అస్వస్థతపై మంత్రి సవిత ఆరా తీశారు. ఈ మేరకు కలెక్టర్, డీఎంహెచ్‌వో, సూపరింటెండెంట్‌తో ఆమె ఫోన్‌లో మాట్లాడారు.విద్యార్థినుల అస్వస్థత ఘటనపై నివేదికి ఇవ్వాలని మంత్రి ఆదేశించారు. విద్యార్థినులకు అస్వస్థత కారణాలను మంత్రి సవితకు కలెక్టర్ శ్రీధర్ వివరించారు. విద్యార్థినుల ఆరోగ్యం నిలకడగా ఉందని తెలిపారు. హాస్టల్‌లో మిగిలిన విద్యార్థినులకు కూడా వైద్య పరీక్షలు నిర్వహించాలని సవిత సూచించారు.
టీటీడీకి రూ.10 లక్షలు విరాళం
టీటీడీకి బ్రిక్ అండ్ బ్రిక్ నిర్మాణ సంస్థ రూ.10 లక్షలు విరాళం అందిచింది. ఈ మేరకు అదనపు ఈవో కార్యాలయంలో వెంకయ్యచౌదరికి దాత అందజేశారు.
రుషికొండ భవనాల వినియోగంపై హైకోర్టులో దాఖలైన పిల్‌పై వాదనలు
రుషికొండ భవనాల వినియోగంపై హైకోర్టులో దాఖలైన పిల్‌పై వాదనలు జరిగాయి. విశాఖకు చెందిన మాజీ కార్పొరేటర్ మూర్తియాదవ్ ఈ పిల్ దాఖలు చేశారు. భవనాలను పర్యాటక వినియోగానికి ప్రతిపాదనలు ఆహ్వానించామని ప్రభుత్వం తరఫు న్యాయవాది ధర్మాసనానికి తెలిపారు. ప్రతిపాదనలు వచ్చాక మంత్రివర్గ ఉపసంఘం నిర్ణయం తీసుకుంటుందని చెప్పారు. భవనాలను ఏ సంస్థకు కేటాయించలేదని హైకోర్టుకు నివేదించారు. ప్రస్తుతానికి అలాంటి ప్రతిపాదన కూడా లేదని వివరించారు. పిటిషనర్ వేసిన అనుబంధ పిటిషన్‌పై కౌంటర్ దాఖలుకు హైకోర్టు ఆదేశించింది. వివరాలను నమోదు చేసిన ధర్మాసనం, విచారణ వాయిదా వేసింది.
జంగారెడ్డిగూడెం ప్రభుత్వ ఏరియా ఆసుపత్రి మార్చురీ వద్ద ఉద్రిక్తత
ఏలూరు జిల్లాలో జంగారెడ్డిగూడెం ప్రభుత్వ ఏరియా ఆసుపత్రి మార్చురీ వద్ద ఉద్రిక్తత చోటుచేసుకుంది. హత్యకు గురైన దుర్గారెడ్డి మృతదేహాన్ని చూసేందుకు ఎంపీ పుట్ట మహేశ్ వచ్చారు. పోలీసుల అలసత్వం వల్లే ఈ ఘటన జరిగిందని కుటుంబసభ్యులు ఆరోపించారు. ఎస్‌ఐను విధుల నుంచి తప్పించాలంటూ వారు డిమాండ్ చేశారు.
రాజధాని రైతుల సమస్యలు పరిష్కారంపై ప్రభుత్వం ఫోకస్
రాజధాని రైతుల సమస్యల పరిష్కారంపై ప్రభుత్వం ఫోకస్ పెట్టింది. ఈ మేరకు అమరావతి రైతు జేఏసీ ప్రతినిధులతో మంత్రి నారాయణ సమావేశమయ్యారు.
ఈ సమావేశానికి సీఆర్డీఏ కమిషనర్ విజయరామరాజు హాజరయ్యారు. రైతుల సమస్యల పరిష్కారమే అజెండాగా సమావేశంలో చర్చిస్తున్నారు. ఫ్లాట్ల రిజిస్ట్రేషన్లు, గ్రామాల్లో చెత్త, రోడ్ల కనెక్టివిటీ అంశాలను రైతులు ముందుచారు.
ప్రొద్దుటూరులో 24 క్యారెట్ల 10 గ్రా. బంగారం ధర రూ.1,42,100
ప్రొద్దుటూరులో 24 క్యారెట్ల 10 గ్రా. బంగారం ధర రూ.1,42,100 కాగా 22 క్యారెట్ల 10 గ్రా. బంగారం ధర రూ. 1,30,730గా ఉంది. కిలో వెండి ధర రూ. 2,31,000గా ఉంది.
కర్నూలు ఎస్పీ కార్యాలయంలో సెల్‌ఫోన్ల రికవరీ మేళా
కర్నూలు ఎస్పీ కార్యాలయంలో సెల్‌ఫోన్ల రికవరీ మేళా నిర్వహించారు. రూ.1.36 కోట్ల విలువ చేసే 679 సెల్ ఫోన్లను పోలీసులు రికవరీ చేశారు. రికవరీ చేసిన సెల్ ఫోన్లను ఎస్పీ విక్రాంత్ పాటిల్ బాధితులకు అందజేశారు. జిల్లాలో రూ.6.24 కోట్ల విలువ చేసే 3,080 ఫోన్లు రికవరీ చేసినట్లు ఎస్పీ విక్రాంత్ పాటిల్ వెల్లడించారు.
హిందూ దేవతలను దూషిస్తే అరెస్టు చేయరా?: పీవీఎన్ మాధవ్
విజయవాడలో బీజేపీ ఎస్సీ మోర్చా రాష్ట్ర పదాధికారుల సమావేశంలో ఆ పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు పీవీఎన్ మాధవ్ పాల్గొన్నారు. 'ఎస్సీ మోర్చా ఆధ్వర్యంలో రాష్ట్రంలో ఎన్నో కార్యక్రమాలు చేపట్టాం. హిందూ దేవతలను దూషిస్తే అరెస్టు చేయరా? దూషిస్తారు అరెస్ట్ చేస్తే హక్కుల ఉల్లంఘన అంటున్నారు. సినీతారలు, యూట్యూబర్లు ఇష్టం వచ్చినట్లు మాట్లాడుతున్నారు. ఇష్టమొచ్చినట్లు మాట్లాడితే దేశద్రోహం కేసులు ఎందుకు పెట్టకూడదు. ఉపా చట్టం కింద కేసులు ఎందుకు పెట్టకూడదో చెప్పాలి. జోసెఫ్ తన పేరును రావణ్ అని మార్చుకున్నారు. హిందువులపై జోసెఫ్ విషం కక్కుతున్నారు. సంఘ విద్రోహశక్తులను రాష్ట్రంలో తిరగనివ్వకూడదని' పీవీఎన్ మాధవ్ వ్యాఖ్యానించారు.
రావణ్ ఫోన్‌లో నుంచి వెలుగులోకి వచ్చిన సంచలన వీడియోలు
యూట్యూబర్ బచ్చలకూరి జోసెఫ్ అలియాస్ ప్రశ్న రావణ్ అకృత్యాలు వెలుగులోకి వస్తున్నాయి. ఫోరెన్సిక్ ల్యాబ్ నివేదికతో రావణ్ ఫోన్‌లో నుంచి సంచలన వీడియోలు వెలుగులోకి వచ్చాయి. నిందితుడు అశ్లీల వీడియోలతో అమాయక యువతులను లైంగికంగా వేధించినట్లు సమాచారం. డేటా ఆధారంగా సుమారు 10 మంది బాధితులను గుర్తించినట్లు తెలుస్తోంది. ఈ కోణంలోనూ పోలీసులు దర్యాప్తు సాగిస్తున్నారు.
పవన్‌కల్యాణ్ అభిమాని నిరంజన్ కుటుంబానికి సోనూసూద్ పరామర్శ
పవన్‌కల్యాణ్ అభిమాని నిరంజన్ కుటుంబాన్ని వీడియో కాల్ ద్వారా సోనూసూద్ పరామర్శించారు. సాయం అందించేందుకు ఎల్లప్పుడూ తాను సిద్ధంగా ఉంటానని ఆయన తెలిపారు.
బోటు ప్రమాదంలో ఏ రాష్ట్రం ఇవ్వనంత సాయం చేస్తున్నాం: మంత్రి కొల్లు రవీంద్ర
విశాఖలోని ఫిషింగ్ హార్బర్ మెకనైజ్‌డ్ బోట్ ఆపరేటర్స్ అసోసియేషన్‌లో మత్స్యకార బాధిత కుటుంబాలకు మంత్రి కొల్లు రవీంద్ర చెక్కులు పంపిణీ చేశారు. ఒక్కో కుటుంబానికి రూ.10 లక్షల చొప్పున చెక్కులు అందించారు. 'ప్రభుత్వానికి సమాచారం రాగానే సహాయచర్యలు చేపట్టాం. చిన్న ఇచ్చిన సమాచారంతో వారంతా చనిపోయారని అనుకుంటున్నాం. రూ.10 లక్షలు చొప్పున చెక్కులు బాధిత కుటుంబాలకు అందజేశాం. బాధిత కుటుంబాల పిల్లల చదువులకు సాయం చేస్తాం. బోటు ప్రమాదంలో ఏ రాష్ట్రం ఇవ్వనంత సాయం చేస్తున్నాం. వేట నిషేధ సమయంలోనూ ఆర్థికంగా ఆదుకుంటున్నామని' మంత్రి కొల్లు రవీంద్ర వివరించారు.
వైఎస్ జయంతి వేడుకల్లో కార్యకర్తల మధ్య ఘర్షణ
ఒంగోలు వైఎస్సార్సీపీ కార్యాలయంలో వైఎస్ జయంతి వేడుకల్లో కార్యకర్తల మధ్య ఘర్షణ చోటు చేసుకుంది. మహిళల కాళ్లు తొక్కారని ప్రశ్నించినందుకు రెండు వర్గాలుగా ఏర్పడి ఆ పార్టీ కార్యకర్తలు కొట్టుకొన్నారు. జుట్లు పట్టుకుని ఒకరిపై ఒకరు మహిళా కార్యకర్తలు దాడి చేసుకున్నారు.
పవన్‌కల్యాణ్ అభిమాని నిరంజన్ కుటుంబానికి సోనూసూద్ పరామర్శ
పవన్‌కల్యాణ్ అభిమాని నిరంజన్ కుటుంబాన్ని నటుడు సోనూసూద్ పరామర్శించారు. నిరంజన్ కుటుంబాన్ని వీడియో కాల్ ద్వారా పరామర్శించిన సోనూసూద్ సాయం అందించేందుకు తాను ఎల్లప్పుడూ సిద్ధంగా ఉంటానన్న భరోసా ఇచ్చారు.
మత్స్యకార బాధిత కుటుంబాలకు చెక్కులు పంపిణీ చేసిన మంత్రి కొల్లు
విశాఖ: మంత్రి కొల్లు మత్స్యకార బాధిత కుటుంబాలకు చెక్కులు పంపిణీ చేశారు. ఒక్కో కుటుంబానికి రూ.10 లక్షలు చొప్పున చెక్కులు పంపిణీ చేశారు. విశాఖలోని ఫిషింగ్ హార్బర్ మెకనైజ్‌డ్ బోట్ ఆపరేటర్స్ అసోసియేషన్‌లో చెక్కుల పంపిణీ కార్యక్రమం చేపట్టారు.
వైఎస్ జయంతి వేడుకలలో వైఎస్సార్సీపీ కార్యకర్తల మధ్య ఘర్షణ
ఒంగోలు వైఎస్సార్సీపీ కార్యాలయంలో కార్యకర్తల మధ్య ఘర్షణ చోటుచేసుకుంది. వైఎస్ జయంతి వేడుకల్లో మహిళల కాళ్లు తొక్కారని ప్రశ్నించినందుకు దాడి చేసినట్లు సమాచారం. ఈ క్రమంలో వైఎస్సార్సీపీ కార్యకర్తలు రెండు వర్గాలుగా ఏర్పడి కొట్టుకున్నట్లు తెలుస్తుంది. మహిళా కార్యకర్తలు జుట్లు పట్టుకుని ఒకరిపై ఒకరు దాడి చేసుకున్నారు. ఘర్షణలో కార్యకర్తలు చొక్కాలు చింపుకొన్న
చర్మకారుల అభివృద్ధి, సంక్షేమానికి కూటమి ప్రభుత్వం కృషిచేస్తోంది: మంత్రి డీఎస్‌బీవీ స్వామి
వెలగపూడి సచివాలయంలో లిడ్ క్యాప్ లెదర్ షోరూమ్ మంత్రులు డీఎస్‌బీవీ స్వామి, సవిత ప్రారంభించారు. ఈ సందర్భంగా షోరూమ్‌లో లెదర్ చెప్పులు, బెల్ట్ మంత్రి స్వామి కొనుగోలు చేయగా లెదర్ బ్యాగ్, పర్సును మంత్రి సవిత కొనుగోలు చేశారు. 'వైఎస్సార్సీపీ హయాంలో లిడ్ క్యాప్‌ను నిర్వీర్యం చేశారు. కూటమి ప్రభుత్వం వచ్చాక లిడ్ క్యాప్‌నకు పూర్వ వైభవం తీసుకొస్తున్నాం. వైఎస్సార్సీపీ కబ్జాకోరుల చేతుల నుంచి లిడ్‌క్యాప్ భూములను కాపాడాం. చర్మకారుల అభివృద్ధి, సంక్షేమానికి కూటమి ప్రభుత్వం కృషిచేస్తోందని' మంత్రి డీఎస్‌బీవీ స్వామి పేర్కొన్నారు.
కడప రిమ్స్ డెంటల్ కాలేజీ హాస్టల్‌లో విద్యార్థులకు అస్వస్థత
కడప రిమ్స్ డెంటల్ కాలేజీ హాస్టల్‌లో ఆహారం కలుషితమై 15 మంది డెంటల్ విద్యార్థులకు అస్వస్థతకు గురయ్యారు. ప్రస్తుతం వీరు రిమ్స్ ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నారు.
సంక్షేమ శాఖలపై సీఎం చంద్రబాబు సమీక్ష
సచివాలయంలో ఇవాళ ఉదయం సంక్షేమ శాఖలపై సీఎం చంద్రబాబు సమీక్ష నిర్వహించనున్నారు. మధ్యాహ్నం పొగాకు కొనుగోలు సమస్యపై ముఖ్యమంత్రి సమీక్షించనున్నారు.
రాష్ట్రంలో పెట్టుబడులకు అపెక్స్ కొరియా అనుసంధానకర్తగా పనిచేస్తుంది: లోకేశ్
దక్షిణకొరియాలో మంత్రి నారా లోకేశ్ పర్యటిస్తున్నారు. బుసాన్‌లో 'అపెక్స్-కొరియా' పెట్టుబడిదారుల అనుసంధాన విభాగాన్ని ఆయన ప్రారంభించారు. 'రాష్ట్రంలో పెట్టుబడులకు అపెక్స్ కొరియా అనుసంధానకర్తగా పనిచేస్తుంది. పెట్టుబడులకు ఆసక్తిచూపే సంస్థలకు, ఏపీ ప్రభుత్వానికి అనుసంధాన కర్తగా అపెక్స్ కొరియా. ఇప్పటికే యూనిట్లను ఏర్పాటుచేసిన సంస్థలకు అపెక్స్ కొరియా సేవలు అందిస్తుందని' లోకేశ్ పేర్కొన్నారు.
ఆ తర్వాత బీఎన్‌కే ఫైనాన్షియల్ గ్రూప్ ఉన్నతస్థాయి బృందంతో మంత్రి లోకేశ్ భేటీ అయ్యారు. 'అమరావతిలో బీఎన్‌కే ఫైనాన్షియల్ శాఖను ఏర్పాటు చేయండి. ఏపీలోని ఆర్‌టీఐహెచ్‌లో మెంబర్, మెంటార్‌గా చేరాలని ఆహ్వానిస్తున్నాను. ఇన్‌ఫ్రాస్ట్రక్చర్ ఫైనాన్సింగ్ అందించే అవకాశాలను పరిశీలించాలని' లోకేశ్ పేర్కొన్నారు.
నదుల అనుసంధానానికి చంద్రబాబు శ్రీకారం చుట్టారు: మంత్రి నిమ్మల
పట్టిసీమ డెలివరీ పాయింట్, తాడిపూడి ఎత్తిపోతల వద్ద గోదావరికి నిమ్మల రామానాయుడు జలహారతి ఇచ్చారు. 'నదుల అనుసంధానానికి చంద్రబాబు శ్రీకారం చుట్టారు. ఒట్టిసీమ అన్న జగన్ ఇప్పుడు ఏముఖం పెట్టుకుని సమాధానం చెబుతారు. ఇప్పటివరకు పట్టిసీమ ద్వారా 442కు పైగా టీఎంసీలను కృష్ణా డెల్టాకు తరలించాం. దూరదృష్టి, ముందుచూపు ఉన్న నాయకుడు ఉంటే అన్నీ ప్రయోజనాలే. ముందుచూపు లేకపోవడం వల్లే పట్టిసీమ వైపు జగన్ కన్నెత్తి చూడలేదు. గోదావరికి ఎగువనుంచి వస్తున్న నీటిని వృథా కాకుండా కృష్ణా డెల్టాకు తరలిస్తున్నామని' నిమ్మల రామానాయుడు పేర్కొన్నారు.
అల్లూరి జిల్లాలో విషాదం - కళ్లెదుట కుమారుడి మృతిని తట్టుకోలేక తల్లి కూడా మృతి
అల్లూరి జిల్లా కొయ్యూరు మండలం గాంకొండలో విషాదం చోటుచేసుకుంది. జ్వరాలతో తల్లి పొత్తూరు రాజులమ్మ(68), కుమారుడు సత్తిబాబు(40) మృతి చెందాడు. తల్లిని చూసేందుకు చింతపల్లి నుంచి వచ్చి మలేరియాతో కుమారుడు మృతి చెందాడు. కళ్లెదుట కుమారుడి మృతిని తట్టుకోలేక తల్లి కూడా మృతి చెందింది. గత కొంతకాలంగా మూర్ఛ వ్యాధితో తల్లి బాధపడుతోంది.
పట్టిసీమ ఎత్తిపోతల నుంచి గోదావరి జలాలు కృష్ణా డెల్టాకు విడుదల
ఏలూరు జిల్లాలో మంత్రి నిమ్మల రామానాయుడు పర్యటించారు. పట్టిసీమ ఎత్తిపోతల నుంచి 12 పంపుల ద్వారా గోదావరి జలాలను కృష్ణా డెల్టాకు విడుదల చేశారు. ఈ మేరకు పోలవరం మండలం పట్టిసీమ ఎత్తిపోతల పథకం వద్ద మెటార్లు ఆన్‌చేశారు. ప్రాజెక్టు కుడి కాల్వలోకి 4,248 క్యూసెక్కుల నీటిని విడుదల చేశారు.
మావిగన్ అంటే ఏ బస్సు ఎక్కాలంటూ ప్రజలు నవ్వుకుంటున్నారు: మంత్రి నారాయణ
అమరావతి నిర్మాణ పనుల పురోగతిపై కాంట్రాక్ట్ సంస్థల ప్రతినిధులతో మంత్రి నారాయణ సమీక్ష నిర్వహించారు నిర్మాణంలో ఉన్న ప్రభుత్వ భవనాలు, రోడ్లు, ఎల్పీఎస్ లే అవుట్ పనుల పురోగతిపై చర్చించారు. ప్రాజెక్టుల వారీగా పనులు ఎంత మేరకు పూర్తయ్యాయి అనే దానిపై కాంట్రాక్ట్ సంస్థలను వివరాలు అడిగి తెలుసుకున్నారు. వర్షాకాలంలో పనులకు ఆటంకం లేకుండా తీసుకున్న చర్యలను ఇంజినీర్లు మంత్రికి వివరించారు. నిర్దేశిత లక్ష్యం మేరకు పనులు పూర్తి చేసేలా తీసుకోవాల్సిన చర్యలపై మంత్రి నారాయణ దిశానిర్దేశం చేశారు. 'జగన్ మావిగన్ రాజకీయ ఎత్తుగడను నమ్మే పరిస్థితిలో ప్రజలు లేరు. మావిగన్ అంటే ఏ బస్సు ఎక్కాలంటూ ప్రజలు నవ్వుకుంటున్నారు. ప్రజలకు పరిపాలన సులభతరానికి అన్ని వ్యవస్థలు ఒకచోటకు తెచ్చాం. వ్యవస్థలన్నీ ఒకచోటికి తెస్తే అవగాహన లేకుండా జగన్ మావిగన్ అంటున్నారు. ఎన్ని కుట్రలు పన్నినా అనుకున్న సమయానికే తొలిదశ పనులు పూర్తి చేస్తామని' నారాయణ పేర్కొన్నారు.
కదిరి ప్రభుత్వ ఆసుపత్రిలో దారుణం - భార్యను గొంతుకోసి చంపిన భర్త
శ్రీ సత్యసాయి జిల్లా కదిరి ప్రాంతీయ వైద్యశాల ఆవరణలో దారుణం చోటు చేసుకుంది.. ముదిగుబ్బ మండలం ఈదులపల్లికి చెందిన గంగరాజు తన భార్య సునీత (32)ను ఆసుపత్రి ఆవరణలో గొంతు కోసి హత్య చేశాడు. పోలీసుల కథనం ప్రకారం దంపతుల మధ్య జరిగిన గొడవలో గంగరాజు తన భార్యను చితకబాదాడు. గాయపడిన ఆమెను కుటుంబ సభ్యులు కదిరి ప్రభుత్వ ఆసుపత్రికి తీసుకువచ్చారు. మెరుగైన చికిత్స కోసం ప్రైవేట్ ఆసుపత్రికి వెళ్దామని భార్యకు నచ్చచెప్పిన గంగరాజు మహిళా వార్డు నుంచి బయటికి తీసుకొచ్చి తన వద్ద ఉన్న కత్తితో గొంతు కోసం హత్య చేశాడు. విషయం తెలుసుకున్న కదిరి పట్టణ సీఐ నారాయణరెడ్డి తన సిబ్బందితో ఆసుపత్రికి చేరుకుని నిందితుడిని అదుపులోకి తీసుకున్నారు.
తిరుమలలో టోకెన్లు లేని శ్రీవారి భక్తులకు సర్వదర్శనానికి 24 గంటలు
తిరుమలలో టోకెన్లు లేని శ్రీవారి భక్తులకు సర్వదర్శనానికి 24 గంటల సమయం పడుతోంది. అన్ని కంపార్టుమెంట్లు భక్తులతో నిండిపోయాయి. కంపార్టుమెంట్లన్నీ నిండి శిలాతోరణం క్యూలైన్ వరకు భక్తులు వేచి ఉన్నారు. మంగళవారం నాడు శ్రీవారిని 80,706 మంది భక్తులు దర్శించుకోగా, 34,838 మంది భక్తులు తలనీలాలు సమర్పించారు. నిన్న శ్రీవారి హుండీ ఆదాయం రూ.4.86 కోట్లు సమకూరింది.
పొలంలో విద్యుదాఘాతం - వెలమకూరు మాజీ సర్పంచ్ మురళీరెడ్డి మృతి
అనంతపురం జిల్లా తాడిపత్రి మండలంలో విషాదం చోటుచేసుకుంది. పొలంలో విద్యుదాఘాతంతో వెలమకూరు మాజీ సర్పంచ్ మురళీరెడ్డి మృతిచెందాడు.
విజయవాడ బస్టాండ్‌లో ప్రయాణికుడిని ఢీకొట్టిన బస్సు
విజయవాడ బస్టాండ్‌లో అవనిగడ్డ డిపో ఆర్టీసీ అద్దె బస్సు ఢీకొని ప్రయాణికుడు మృతి చెందాడు. ఆర్టీసీ అద్దె బస్సు డ్రైవర్‌ను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు.
విజయవాడ వించిపేటలో మరోసారి ఎన్‌ఐఏ సోదాలు
విజయవాడ వించిపేటలో మరోసారి ఎన్‌ఐఏ సోదాలు చేపట్టింది. ఉగ్ర లింక్స్ కేసులో ఎన్‌ఐఏ అధికారులు ఇవాళ తెల్లవారుజామున ఐదు గంటల నుంచి సోదాలు చేస్తున్నారు. గతంలోనూ ఇదే ప్రాంతంలో ఎన్‌ఐఏ విస్తృత తనిఖీలు చేసింది. ఈ ఏడాది మార్చి, మే నెలల్లో సోదాలు జరిపి విజయవాడకు చెందిన మహమ్మద్ డానిష్, సుహైల్, మహమ్మద్ రహంతుల్లాను అరెస్ట్ చేసింది. ఉగ్ర లింక్స్ కేసు ఇటీవల ఎన్‌ఐఏకు బదిలీ అయింది. ఈ క్రమంలోనే ముగ్గురికి మరెవరితోనైనా సంబంధాలు ఉన్నాయా అనే కోణంలో నిందితుల ఇళ్లలో సోదాలు నిర్వహిస్తోంది.
చెరువుకొమ్మపాలెంలో విషాదం - నిపించకుండా పోయిన రిచర్డ్స్ మృతదేహం గుర్తింపు
ఒంగోలు మండలం చెరువుకొమ్మపాలెంలో విషాదం చోటుచేసుకుంది. మంగళవారం నాడు కనిపించకుండా పోయిన రిచర్డ్స్(6) మృతదేహాన్ని గుర్తించారు. తల్లి ప్రత్యూష పనిచేస్తున్న కాలేజీ నుంచి ఆడుకుంటూ రిచర్డ్స్ అదృశ్యమయ్యాడు. సమాచారం తెలిసి 20 బృందాలతో పోలీసులు గాలింపు చేపట్టారు. ఈ క్రమంలోనే ఇవాళ చెరువులో బాలుడి మృతదేహాన్ని పోలీసులు గుర్తించారు.
మైదుకూరు దంపతుల మృతిపై మంత్రి గొట్టిపాటి రవికుమార్ ఆరా
మైదుకూరు దంపతుల మృతిపై మంత్రి గొట్టిపాటి రవికుమార్ ఆరా తీశారు. ఈ మేరకు సీఎండీతో మాట్లాడి వివరణ కోరారు. మృతుల కుటుంబానికి గొట్టిపాటి రవికుమార్ ప్రగాఢ సానుభూతి తెలిపారు. ప్రమాదకర తీగలు, స్తంభాలు గుర్తించి ముందస్తు నష్టనివారణ చర్యలకు ఆదేశించారు.
విశాఖలో ముగిసిన నేవీ కోస్ట్ గార్డ్ సెర్చ్ ఆపరేషన్
విశాఖలో గల్లంతైన మత్స్యకారుల కోసం నేవీ కోస్ట్ గార్డ్ సెర్చ్ ఆపరేషన్ ముగిసింది. అర్ధరాత్రి 12 వరకు సాగిన గాలింపు చర్యలు కొనసాగాయి. తమ వారి కోసం గంగపుత్రులు కన్నీరు మున్నీరుగా విలపిస్తున్నారు. కుటుంబానికి రూ.10 లక్షలు చొప్పున సాయానికి కలెక్టర్‌కు మంత్రి అచ్చెన్నాయుడు ఆదేశించారు. ఇవాళ మత్స్యకార కుటుంబాలను మంత్రి కొల్లు రవీంద్ర పరామర్శించనున్నారు. ప్రభుత్వం నుంచి మరింత పరిహారం అందించే అవకాశం ఉంది.
రైలులో బుసాన్ బయల్దేరిన మంత్రి నారా లోకేశ్
దక్షిణ కొరియాలో మంత్రి లోకేశ్ పర్యటిస్తున్నారు. ఈ క్రమంలో రైలులో బుసాన్ బయల్దేరారు. బుసాన్‌లో 'అపెక్స్-కొరియా' పెట్టుబడిదారుల అనుసంధాన విభాగాన్ని ఆయన ప్రారంభించనున్నారు. కొరియా మెరైన్ ఎక్విప్‌మెంట్ అసోసియేషన్ నిర్వహించే సమావేశానికి హాజరుకానున్నారు. పారిశ్రామికవేత్తలతో సమావేశాల అనంతరం షూఆల్స్ ఫుట్‌వేర్ ఫ్యాక్టరీ సందర్శించనున్నారు. పారిశ్రామికవేత్తలతో భేటీల అనంతరం ఇవాళ రాత్రికి లోకేశ్ సియోల్ రానున్నారు.
ఆసుపత్రిలో చికిత్స పొందుతూ పవన్ అభిమాని నిరంజన్ మృతి
హనుమకొండలో అరుదైన వ్యాధితో బాధపడుతున్న పవన్ అభిమాని నిరంజన్ ఆసుపత్రిలో చికిత్స పొందుతూ మరణించాడు. ఇటీవల నిరంజన్‌ను ఉప ముఖ్యమంత్రి పవన్ కల్యాణ్ పరామర్శించి రూ.లక్ష ఆర్థికసాయం చేశారు.
గోదావరి నదికి ఎట్టకేలకు వరద
గోదావరి నదికి ఎట్టకేలకు వరద కొనసాగుతోంది. ఎగువ గోదావరి పరివాహ ప్రాంతాల్లో వర్షం వల్ల వరద ప్రవాహం పెరుగుతోంది. దీంతో దేవీపట్నం మండలం వద్ద గోదావరి నది రంగు మారింది. నీలి, ఎరుపు రంగులతో పర్యాటకులకు కనువిందు చేస్తోంది. గండి పోచమ్మ అమ్మవారి ఆలయం వద్ద ప్రవాహం పెరుగుతోంది. ఆలయ పరిసర ప్రాంతాల్లోకి వరద నీరు చేరడంతో అధికారులు అప్రమత్తమయ్యారు. వరదతో ధవళేశ్వరం బ్యారేజీ వద్ద నీటిమట్టం పెరుగుతోంది.
గంటావారిగూడెం వద్ద రోడ్డుప్రమాదం - ఇద్దరు మహిళలకు, ఇద్దరు పురుషులకు గాయాలు
తూర్పుగోదావరి జిల్లా నల్లజర్ల మండంల గంటావారిగూడెం వద్ద రోడ్డుప్రమాదం చోటుచేసుకుంది. విశాఖ నుంచి హైదరాబాద్ వెళ్తున్న కారు డివైడర్ పైకి దుసుకెళ్లింది. ఈ ఘటనలో ఇద్దరు మహిళలకు, ఇద్దరు పురుషులకు గాయాలయ్యాయి. క్షతగాత్రులను ఏలూరు ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు.
రేపు నంద్యాల జిల్లా బనగానపల్లిలో సీఎం చంద్రబాబు పర్యటన
రేపు (గురువారం) నంద్యాల జిల్లా బనగానపల్లిలో సీఎం చంద్రబాబు పర్యటించనున్నారు. 'మీ భూమి మీ హక్కు' కార్యక్రమంలో భాగంగా భూ యజమానులకు పట్టాదారు పాస్ పుస్తకాలు పంపిణీ చేయనున్నారు.
మైదుకూరులో విషాదం - విద్యుత్ స్తంభం విరిగిపడి వృద్ధ దంపతులు మృతి
వైఎస్‌ఆర్ కడప జిల్లా మైదుకూరులో ఇవాళ తెల్లవారుజామున విషాదం చోటుచేసుకుంది. విద్యుత్ స్తంభం విరిగిపడి వృద్ధ దంపతులు మృతి చెందారు. వరి పొట్టు తీసుకెళ్తున్న లారీ విద్యుత్ తీగలకు తగలడంతో స్తంభం విరిగిపడి ఇంటి ముందు నిద్రిస్తున్న వృద్ధ దంపతులపై పడింది. ఈ ఘటనలో ఇద్దరూ అక్కడికక్కడే ప్రాణాలు కోల్పోయారు.
గల్లంతైన మత్స్యకారులు క్షేమంగా తిరిగి రావాలని ప్రార్థిస్తున్నాం: అచ్చెన్నాయుడు
విశాఖ సముద్ర తీరంలో గల్లంతైన బాధిత కుటుంబాల ఆవేదన కలిచివేస్తోందని మంత్రి అచ్చెన్నాయుడు అన్నారు. గల్లంతైన మత్స్యకారులు క్షేమంగా ఒడ్డుకు తిరిగి రావాలని ప్రార్థిస్తున్నట్లు చెప్పారు. తక్షణ సాయంగా రూ.10 లక్షలు చొప్పున బాధిత కుటుంబాలకు నగదు అందించాలని విశాఖ కలెక్టర్‌ను మంత్రి అచ్చెన్నాయుడు ఆదేశించారు. గల్లంతైన మత్స్యకార కుటుంబాలకు అన్ని విధాలుగా అండగా ఉంటామని మంత్రి అచ్చెన్నాయుడు భరోసా ఇచ్చారు.

