ETV Bharat / state

బతికున్న వారు చనిపోయినట్లు నకిలీ డెత్ సర్టిఫికెట్లు - వెలుగులోకి ఎల్​ఐసీ ఏజెంట్ల భారీ స్కామ్

ఎలాంటి అనుమానాలు రాకుండా 39 ఖాతాదారుల పేరిట పాలసీలు - పాలసీదారులు చనిపోయారంటూ నకిలీ మరణ ధ్రువీకరణ పత్రాల సృష్టీకరణ - అనుమానంతో విచారించగా బయటపడ్డ స్కామ్

ఎల్​ఐసీ స్కామ్​
LIC Agents Scam (ETV Bharat)
author img

By ETV Bharat Telangana Team

Published : March 3, 2026 at 5:33 PM IST

3 Min Read
Choose ETV Bharat

LIC Agents Scam in Bhadrachalam : డబ్బుకు ఆశపడి ఎన్నో అడ్డదారులను ఎంచుకుంటున్నారు అక్రమార్కులు. చిన్న, చితకా బిజినెస్​ అంటూ అనేక దందాలను అధికారుల కళ్లు గప్పి కొనసాగిస్తున్నారు. దొరికినంత దోచుకుంటూ అమాయకులను మోసం చేస్తున్నారు. తాజాగా ఇదే తరహ స్కామ్​ భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలో బయటపడింది. భద్రాచలం ఎల్ఐసి శాఖ పరిధిలోని ఇద్దరు ఎల్​ఐసీ ఏజెంట్లు నిబంధనలను పాతరేసి చేతికి అందినంత దండుకున్నారు. బతికి ఉన్న వారిపై మరణ ధ్రువీకరణ పత్రాలను సృష్టించి కోట్లను కాజేశారు. ఎవరికి ఎలాంటి అనుమానం రాకుండా గుట్టుగా వారి కార్యకలాపాల్ని సాగించారు.

39 ఖాతాదారుల పేరిట పాలసీలు : పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం అశ్వాపురం మండలం సీతారామపురానికి చెందిన ఏజెంట్లు వెంకటేశ్వర్లు, సరస్వతి కలిసి గతకొంత కాలంగా ఈ దందాను సాగిస్తున్నారు. వీరిద్దరు కలిసి మొత్తం 39 మంది ఖాతాదారుల పేరిట పాలసీలు తీసుకొన్నారు. ఇలా ఎస్ఐఐసీకి అనుమానం రాకుండా కొంతకాలం వరకు ప్రీమియం చెల్లించారు. ఆ తర్వాత ఈ ఖాతాదారులు చనిపోయినట్టు సంస్థను నమ్మించారు. దీనికి సంబంధించిన నకిలీ మరణ ధ్రువీకరణ పత్రాలతో పాటు అవసరమయ్యే వాటిని సంస్థకు సమర్పించేవారు. ఈ విధంగా ఇప్పటివరకు వారి పేరు మీద వచ్చిన ఒక కోటి యాభై రెండు లక్షల రూపాయల బీమా సొమ్మును కాజేశారు.

అనుమానంతో వివరాల సేకరణ : గత కొంతకాలంగా వారిద్దరు ఇదే తరహాలో ఎవరికీ అనుమానం రాకుండా అక్రమంగా నగదును సంపాదిస్తున్నారు. అయితే ఖాతాదారుల్లో ఎక్కువ మంది అశ్వాపురం మండల వాసులే ఉండటంతో అధికారులకు అనుమానం వచ్చింది. వెంటనే వారు విచారణ చేపట్టారు. కొంతమంది ఖాతాదారుల కుటుంబాలను నేరుగా కలిసి వివరాలు సేకరించారు. ఈ క్రమంలో పాలసీదారులంతా బతికే ఉన్నట్లు తేలింది. నకిలీ పత్రాలు సమర్పిస్తూ వారిని మోసం చేస్తున్నారని గుర్తించిన మేనేజర్ చక్రవర్తి పోలీసులకు ఫిర్యాదు చేశారు. ఈ మేరకు నిందితులిద్దరిపై కేసు నమోదైంది.

కొంతమంది ఖాతాదారులకు తెలిసినప్పటికీ : వీరిద్దరు కలిసి జరుపుతున్న ఈ దందా గురించి కొంతమంది ఖాతాదారులకు ముందే తెలుసని విచారణలో బయటపడింది. ఆ ఖాతాదారులు నిందితుల నుంచి బీమా సొమ్ములో వాటా తీసుకుని పరోక్షంగా చేతులు కలిపినట్టు తేలింది. ఈ క్రమంలో అసలు నిందితులకు మరణ ధ్రువీకరణ పత్రాలు ఎలా వచ్చాయి, ఇతర బ్రాంచిల్లోనూ ఈ తరహా మోసాలకు పాల్పడుతున్నారా అనే కోణంలో పోలీసులు విచారిస్తున్నారు. దీనికి సంబంధించి మరింత లోతుగా విచారణ చేస్తున్నామని, ఈ దందాలో పాల్గొన్న వారందరినీ త్వరలోనే అరెస్టు చేస్తామని పోలీసులు తెలిపారు. ఈ విధంగా స్కామ్​లు రోజుకు ఎక్కడో ఓ చోట బయటపడుతూనే ఉన్నాయి.

ఆదిలాబాద్​లో ప్రభుత్వ ఉద్యోగాల స్కామ్ : ​ఇటీవల ఇలాంటి నకిలీ సర్టిఫికెట్ల బాగోతమే ఆదిలాబాద్​లోనూ వెలుగుచూసింది. ​కేంద్ర పారామిలిటరీ బలగాల్లో ప్రభుత్వ ఉద్యోగాలంటూ ఆశ చూపి డబ్బును కాజేసిన ముఠాను పోలీసులు పట్టుకున్నారు. ఆదిలాబాద్‌ జిల్లా ఇచ్చోడలో గతేడాది మే నెలలో అక్రమ నివాస ధృవీకరణ పత్రాల జారీ వ్యవహారం తీవ్ర కలకలం రేపింది. ఉత్తర భారతదేశానికి చెందిన 110 మంది ఇచ్చోడ మండలంలో నివాసం ఉంటున్నట్లు నివాస ధృవీకరణ పత్రాల కోసం 181 సార్లు దరఖాస్తు చేసుకున్నట్లు తెలియడంతో రాష్ట్రవ్యాప్తంగా సంచలనం సృష్టించింది. భారత సైన్యంలో ఉద్యోగాలు పొందిన అభ్యర్థుల చిరునామా ఆధారంగా స్పెషల్‌ బ్రాంచి పోలీసులు క్షేత్రస్థాయిలో విచారణ చేపట్టగా నివాస ధృవీకరణ పత్రాలు తహసీల్దార్‌ జారీ చేసినవి కావని తేలడంతో ఈ ఘటన వెలుగుచూసింది.

సొంతింటి కోసం ఫ్లాట్​కు అడ్వాన్స్​ ఇస్తున్నారా? - మూడోవంతు మోసాలే చేస్తున్నారట జాగ్రత్త!

చిట్టీల పేరుతో భారీ స్కామ్​ - 30 ఏళ్లుగా నమ్మించి ఒక్కసారిగా రూ.4 కోట్లతో పరార్