ఐదారేళ్లుగా ఎస్వీ యూనివర్శిటీలో చిరుతల సంచారం - రెండింటిని బంధించిన అధికారులు
ఎస్వీ పశువైద్య విశ్వవిద్యాలయంలో చిరుతను పట్టుకున్న అటవీశాఖ అధికారులు - వర్సిటీలోని గర్భకోశ వ్యాధుల విభాగంలోకి చొరబడిన చిరుత - మూడు గంటల పాటు శ్రమించి చిరుతను బంధించిన అటవీ అధికారులు

By ETV Bharat Andhra Pradesh Team
Published : May 26, 2026 at 2:17 PM IST
|Updated : May 26, 2026 at 2:40 PM IST
Leopard Triggers Panic at SV Veterinary University: శేషాచలం అడవుల్లో ఉండాల్సిన చిరుతలు తిరుపతిలోని ఎస్వీయూ, ఎస్వీ పశువైద్య వర్సిటీ, వ్యవసాయ కళాశాలల పరిధిలో స్వేచ్ఛగా తిరుగుతూ కలవరపెడుతున్నాయి. వర్సిటీ ప్రాంగణంలోకి హఠాత్తుగా చిరుత ప్రవేశించడంతో సిబ్బంది తీవ్ర భయాందోళనలకు గురయ్యారు. సమాచారం అందుకున్న అటవీశాఖ అధికారులు పెద్ద ఎత్తున రెస్క్యూ ఆపరేషన్ చేపట్టి ఆ చిరుతను బంధించారు.
సోమవారం ఉదయం క్లినికల్ డిపార్ట్‌మెంట్ భవనంలో ఈ ఘటన జరిగింది. సాధారణంగా ఈ భవనం తలుపులన్నీ ఎప్పుడూ మూసి ఉంచుతారు. రోజువారీ పనుల కోసం ఓ అటెండెంట్ లోపలికి వెళ్లి తలుపులు తీయగా ఎదురుగా చిరుతపులి కనిపించింది. దాన్ని చూసి ఒక్కసారిగా షాక్‌కు గురైన ఉద్యోగి భయంతో గట్టిగా కేకలు వేస్తూ బయటకు పరుగులు తీశారు. చుట్టుపక్కల ఉన్న ఇతరులను అప్రమత్తం చేశాడు.
అక్కడికి సిబ్బంది అంతా గుమిగూడటంతో చిరుత వారిపైకి దూకడానికి ప్రయత్నించింది. దీంతో క్యాంపస్‌లో కాసేపు గందరగోళం నెలకొంది. భయాందోళనల మధ్య ఆ జంతువు భవనం లోపలికి పరుగెత్తి చివరకు అక్కడ ఉన్న ఒక గదిలోకి దూరింది. చిరుత లోపల దాక్కోవడంతో దాన్ని బంధించడం అధికారులకు పెద్ద సవాల్‌గా మారింది. సమాచారం అందిన వెంటనే అటవీశాఖ అధికారులు ఘటనా స్థలానికి చేరుకున్నారు. చిరుత బయటకు రాకుండా భవనానికి అన్ని వైపులా దారులు మూసివేశారు. ఉన్నతాధికారుల పర్యవేక్షణలో ప్రత్యేకంగా శిక్షణ పొందిన ‘హనుమాన్ రెస్క్యూ టీమ్’ రంగంలోకి దిగింది. బోన్లు, వలలు, మత్తుమందు తుపాకులతో వారు వర్సిటీకి చేరుకున్నారు.
వైద్యుల పర్యవేక్షణలో ఎస్వీ జూపార్కుకు తరలింపు: సుమారు 3 గంటల పాటు ఈ రెస్క్యూ ఆపరేషన్ సాగింది. భవనం లోపల చిరుత ఒక చోటు నుంచి మరో చోటుకు పదే పదే తిరుగుతూ ఉండటంతో దాన్ని పట్టుకోవడం కష్టంగా మారిందని అధికారులు చెప్పారు. చివరకు మత్తుమందు ఇచ్చి, ఎవరికీ ఎలాంటి గాయాలు కాకుండా చిరుతను బంధించారు. ఆ చిరుత వయసు ఏడాది పైనే ఉంటుందని అధికారులు అంచనా వేస్తున్నారు.
ప్రస్తుతం చిరుత పరిస్థితి నిలకడగానే ఉందని అటవీశాఖ అధికారులు తెలిపారు. వైద్యుల పర్యవేక్షణలో ఆ చిరుతను ఎస్వీ జూపార్కుకు తరలించారు. కొన్ని రోజుల పాటు దాని ఆరోగ్యాన్ని పరీక్షించిన తర్వాత, తిరిగి శేషాచలం అడవుల్లోకి వదిలిపెట్టాలని అధికారులు భావిస్తున్నారు. క్లినికల్ డిపార్ట్‌మెంట్ భవనం వెనుక ఉన్న చెట్టు ఎక్కి చిరుత లోపలికి ప్రవేశించి ఉంటుందని వర్సిటీ అధికారులు అనుమానిస్తున్నారు. తిరుపతి అటవీ సరిహద్దు ప్రాంతాల్లో ఇటీవల వన్యప్రాణుల సంచారం పెరగడం స్థానికులను ఆందోళనకు గురిచేస్తోంది.
వర్సిటీలో మొత్తం 3 చిరుతలు: వర్శిటీ ఆవరణలో ఐదారేళ్లుగా చిరుతల సంచారం వణికిస్తోంది. ఇప్పటివరకు 20కి పైగా శునకాలను అవి మాయం చేసినట్లు తరచూ వాటి కోసం లోపలకు వస్తున్నట్లు అటవీ అధికారులు చెప్తున్నారు. విశాలమైన ఆవరణలో ముళ్లపొదలు ఉండటం వాటికి కలిసివస్తోంది. శేషాచలం అడవి నుంచి పక్కనే ఉన్న జూపార్కు రోడ్డును దాటుకుని లోపలకు ప్రవేశిస్తున్నాయి. వర్సిటీ పాలకులు అటవీ అధికారులను సంప్రదించి సమస్యను వివరించగా సీసీ కెమెరాలతో నిఘా ఏర్పాటు చేశారు. వర్సిటీలో మొత్తం 3 చిరుతలు తిరుగుతున్నట్లు గుర్తించారు. గతంలో పరిపాలనా భవనం వెనుకవైపు ఉన్న బాలికల వసతిగృహం సమీపంలో బోను ఏర్పాటు చేయగా ఒకటి చిక్కింది. తాజాగా సోమవారం మరో చిరుతను బంధించారు. ఇంకో చిరుత మిగిలి ఉండటంతో విద్యార్థులు, ఉద్యోగులు భయాందోళన చెందుతున్నారు.
గండికోటలో రెండు మేకలను చంపేసి - మరో రెండింటిని ఎత్తుకెళ్లిన చిరుతలు
పొలం పని చేసుకుంటున్న మహిళా రైతుపై చిరుత దాడి - భయం నీడలో పల్లెలు

