రాష్ట్రంలోనే తొలి లీప్ స్కూల్- మంగళగిరిలో అంతర్జాతీయ ప్రమాణాలతో విద్య
నిడమర్రులో లీప్ మోడల్ స్కూల్ ప్రారంభం - 16 కోట్లతో అత్యాధునిక వసతులు - ఎల్‌కేజీ నుంచి ఇంటర్ వరకు ఒకేచోట - మంత్రి లోకేశ్ చొరవతో కార్పొరేట్‌కు దీటుగా ప్రభుత్వ బడి

By ETV Bharat Andhra Pradesh Team
Published : May 25, 2026 at 2:37 PM IST
LEAP School in Nidamarru: అత్యాధునిక సౌకర్యాలు, అంతర్జాతీయ ప్రమాణాలతో కూడిన విద్యాబోధనను ప్రభుత్వ పాఠశాలల్లో అందించాలనే లక్ష్యంతో రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్ఠాత్మకంగా చేపట్టిన 'లీప్ – లెర్నింగ్ ఎక్స్‌లెన్స్ ఇన్ ఏపీ' కార్యక్రమం కింద తొలి మోడల్ స్కూల్ మంగళగిరి నియోజకవర్గంలోని నిడమర్రులో కొలువుదీరింది. ఐటీ, విద్యాశాఖ మంత్రి నారా లోకేశ్ ప్రాతినిధ్యం వహిస్తున్న ఈ నియోజకవర్గంలో రూ.16 కోట్ల వ్యయంతో కార్పొరేట్ స్కూళ్లకు దీటుగా ప్రభుత్వ పాఠశాలను తీర్చిదిద్దారు. ఈ విద్యా సంవత్సరం నుంచే విద్యార్థులకు అన్ని వసతులు అందుబాటులోకి రానున్నాయి.
1983 నాటి బడి నుంచి 2026 మోడల్ స్కూల్ వరకు: నిడమర్రు జెడ్పీ ఉన్నత పాఠశాలను 1983లో 5.2 ఎకరాల విస్తీర్ణంలో కేవలం 12 తరగతి గదులతో నిర్మించారు. కాలక్రమంలో భవనాలు శిథిలావస్థకు చేరడంతో పాటు పెరుగుతున్న విద్యార్థులకు సరిపడా వసతులు లేకుండా పోయాయి. ఈ నేపథ్యంలో మంత్రి లోకేశ్ ప్రత్యేక చొరవ తీసుకొని పాఠశాలను పూర్తిస్థాయి లీప్ మోడల్ స్కూల్‌గా అభివృద్ధి చేయించారు. ప్రస్తుతం గదుల సంఖ్యను 12 నుంచి 25కు పెంచడంతో పాటు ప్రతి గదినీ డిజిటల్ బోధనకు అనుగుణంగా తీర్చిదిద్దారు.
రాష్ట్రంలోనే తొలిసారి యాంఫీ థియేటర్: ఈ పాఠశాల ప్రత్యేకత ఏమిటంటే రాష్ట్రంలోని ప్రభుత్వ స్కూళ్లలోనే తొలిసారిగా యాంఫీ థియేటర్‌ను ఏర్పాటు చేయడం. విద్యార్థుల్లో సృజనాత్మకత, వక్తృత్వ నైపుణ్యాలు పెంపొందించేందుకు ఇది దోహదపడనుంది. దీంతో పాటు అన్ని కాలాలకు అనుకూలంగా ఇండోర్ స్టేడియం, విశాలమైన ఫుట్‌బాల్ గ్రౌండ్, చిన్నారుల కోసం ప్రత్యేక ప్లే ఏరియాను అభివృద్ధి చేశారు. ఒకేసారి 400 మంది విద్యార్థులు కూర్చుని భోజనం చేసేలా అత్యాధునిక డైనింగ్ హాల్‌ను నిర్మించారు.
ప్రయోగశాలలకు పెద్దపీట - ఆరు ప్రత్యేక ల్యాబ్‌లు: విద్యార్థుల్లో శాస్త్రీయ దృక్పథం పెంపొందించేందుకు ప్రయోగాలకు ప్రత్యేకంగా ఆరు గదులను కేటాయించారు. వీటిలో బయాలజీ, ఫిజిక్స్, కెమిస్ట్రీ, మేథమేటిక్స్, కంప్యూటర్, ఒకేషనల్ ల్యాబ్‌లతో పాటు స్పెషల్ ఇన్నోవేషన్ హబ్‌ను ఏర్పాటు చేశారు. ఈ హబ్ ద్వారా విద్యార్థులు కొత్త ఆవిష్కరణలకు బాటలు వేసుకోవచ్చు. ప్రతి ల్యాబ్‌ను అంతర్జాతీయ ప్రమాణాలతో కూడిన పరికరాలతో సమకూర్చారు.
రెట్టింపైన విద్యార్థుల సంఖ్య - ఎల్‌కేజీ నుంచి ఇంటర్ వరకు: అత్యాధునిక వసతులతో పాఠశాల రూపురేఖలు మారడంతో విద్యార్థుల తాకిడి ఒక్కసారిగా పెరిగింది. భవనాల నిర్మాణానికి ముందు ఇక్కడ కేవలం 510 మంది విద్యార్థులు ఉండగా, ఈ విద్యా సంవత్సరంలో ఆ సంఖ్య 1,100కు చేరడం విశేషం. ఎల్‌కేజీ నుంచి ఇంటర్మీడియట్ వరకు పూర్తిగా ఆంగ్ల మాధ్యమంలోనే బోధన సాగించడం మరో ప్రత్యేకత. దీంతో పేద, మధ్యతరగతి విద్యార్థులకు కార్పొరేట్ స్థాయి విద్య ప్రభుత్వ బడిలోనే అందుతోంది.
లీప్ లక్ష్యం - ప్రభుత్వ బడుల్లో నాణ్యమైన విద్య: "ప్రభుత్వ పాఠశాల అంటే చిన్నచూపు ఉండకూడదు. ప్రైవేటుకు దీటుగా అన్ని వసతులు కల్పించి నాణ్యమైన విద్యను అందించడమే లీప్ లక్ష్యం" అని మంత్రి లోకేశ్ పలుమార్లు స్పష్టం చేశారు. నిడమర్రు మోడల్‌ను రాష్ట్రవ్యాప్తంగా విస్తరించేందుకు ప్రభుత్వం కార్యాచరణ రూపొందిస్తోంది. ఈ స్కూల్ విజయవంతమైతే రాబోయే రోజుల్లో ప్రతి నియోజకవర్గంలో ఒక లీప్ స్కూల్ ఏర్పాటు చేసే యోచనలో విద్యాశాఖ ఉంది.
దేశానికే ఆదర్శంగా 'ఆంధ్ర మోడల్ ఎడ్యుకేషన్' - సరికొత్త యాక్షన్ ప్లాన్ సిద్ధం చేసిన మంత్రి లోకేశ్
"ఉద్యోగ క్యాలెండర్లో ముందడుగు - మరో వాగ్దానం నెరవేర్చుకున్నాం" : మంత్రి నారా లోకేశ్

