ETV Bharat / state

'ల్యాబ్‌ ఆన్‌ వీల్స్‌' - ఏపీ ప్రభుత్వం సరికొత్త కార్యక్రమం

ప్రభుత్వ బడి విద్యార్థుల కోసం ఏపీ ప్రభుత్వం సరికొత్త కార్యక్రమం - ల్యాబ్‌ ఆన్‌ వీల్స్‌ పేరుతో విద్యార్థులకు సాంకేతికతపై శిక్షణ - రోబోటిక్, మైక్రో కంట్రోలర్, 3డీ డిజైనింగ్‌పై అవగాహన

Lab on Wheels Programme In AP Government Schools and Colleges
Lab on Wheels Programme In AP Government Schools and Colleges (ETV Bharat)
author img

By ETV Bharat Andhra Pradesh Team

Published : June 27, 2026 at 1:36 PM IST

3 Min Read
Choose ETV Bharat

Lab on Wheels Programme In AP Government Schools and Colleges: ప్రస్తుత ఏఐ ప్రపంచంలో నైపుణ్యాలే విద్యార్థి భవితకు సోపానాలు. ఎలాంటి స్కిల్స్‌ లేకుండా ఉద్యోగాలు సాధించడం అంటే అసాధ్యమనే అనాలి. అదే అంశంపై ఆలోచన చేసింది ఏపీ ప్రభుత్వం. టెక్నాలజీ, స్కిల్స్‌ పరంగా కార్పొరేట్‌ విద్యార్థులకు దీటుగా ప్రభుత్వ విద్యాలయాల విద్యార్థులు రాణించాలనే ఉద్దేశంతో సరికొత్త కార్యక్రమానికి శ్రీకారం చుట్టింది. నైపుణ్యాభివృద్ధి సంస్థ ఆధ్వర్యంలో ఇన్ఫోసిస్‌ స్పింగ్‌ బోర్డు ల్యాబ్‌ ఆన్‌ వీల్స్‌ పేరుతో శిక్షణ ఇస్తోంది. ఇప్పటికే 9 జిల్లాల్లో శిక్షణ పూర్తి చేసుకున్న ఈ ల్యాబ్‌ ఆన్‌ వీల్స్‌ విశేషాలు ఈ కథనంలో ద్వారా తెలుసుకుందాం.

'ల్యాబ్‌ ఆన్‌ వీల్స్‌': ప్రభుత్వ విద్యాసంస్థల్లో అధునాతన టెక్నాలజీని అందుబాటులోకి తీసుకొచ్చారు. ఇంజినీరింగ్‌ కళాశాలలో లాగా ల్యాబ్‌ను తీర్చిదిద్దారు. ప్రభుత్వ పాఠశాల, జూనియర్‌ కళాశాల విద్యార్థుల కోసం ప్రత్యేకంగా ఒక మొబైల్‌ ల్యాబ్‌ రూపొందించారు. ప్రభుత్వ విద్యార్థులు సాంకేతికంగా అన్ని రంగాల్లో నైపుణ్యాలు నేర్చుకోవాలనే ఉద్దేశంతో ఏపీ ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన కార్యక్రమమే 'ల్యాబ్‌ ఆన్‌ వీల్స్‌'. ప్రముఖ ఐటీ దిగ్గజం ఇన్ఫోసిస్‌తో కుదుర్చుకున్న ఒప్పందంలో భాగంగా నైపుణ్యాభివృద్ధి సంస్థ ఆధ్వర్యంలో రాష్ట్రవ్యాప్తంగా ఈ శిక్షణ కొనసాగుతోంది. ఇప్పటికే 9 జిల్లాల్లో వందల మందికి పైగా విద్యార్థులకు శిక్షణా పూర్తి చేసుకుంది.

అడ్వాన్స్‌డ్‌ అంశాలపై అవగాహన: ఇన్ఫోసిస్ సంస్థ ఈ ల్యాబ్ ఆన్ వీల్స్ కార్యక్రమం కోసం ఒక ప్రత్యేకమైన బస్సును అత్యాధునిక పరికరాలతో ల్యాబ్‌గా తీర్చిదిద్దింది. ఇందులో కేవలం ఒక్కరోజులోనే విద్యార్థులకు ప్రాక్టికల్‌ శిక్షణ అందిస్తున్నారు. మండలానికి ఒక ప్రభుత్వ ఉన్నత పాఠశాలతో పాటు జూనియర్ కళాశాలను ఎంపిక చేసి 8వ తరగతి నుంచి ఇంటర్మీడియట్ చదువుతున్న విద్యార్థులకు ఎలక్ట్రానిక్స్, రోబోటిక్, మైక్రో కంట్రోలర్, 3డీ డిజైనింగ్‌ వంటి అడ్వాన్స్‌డ్‌ అంశాలపై అవగాహన కల్పిస్తున్నారు.

9 జిల్లాలు - వందలాది విద్యార్థులు: ప్రభుత్వ పాఠశాలల విద్యార్థులను భవిష్యత్‌తరం సాంకేతిక నిపుణులుగా తీర్చిదిద్దడమే లక్ష్యంగా ఏపీ ప్రభుత్వం అడుగులు వేస్తోంది. ఇందులో భాగంగానే నైపుణ్యాభివృద్ధి సంస్థ ఆధ్వర్యంలో రాష్ట్రవ్యాప్తంగా అన్ని జిల్లాల్లోని ప్రభుత్వ విద్యాలయాల విద్యార్థులకు సాంకేతిక పరిజ్ఞానంతో శిక్షణ కార్యక్రమం నిర్వహించారు. రోజుకు 4 బ్యాచ్‌లుగా విభజించి ఒక్కో బ్యాచ్‌లో 25 మంది విద్యార్థులు చొప్పున వందల మందికి ఆయా సాంకేతికతపై అవగాహన కల్పిస్తున్నారు. ఇప్పటికే 9 జిల్లాల్లో వందలాది విద్యార్థులు ఈ శిక్షణను విజయవంతంగా పూర్తి చేసుకున్నారు.

కేవలం థియరీ క్లాసులకే పరిమితం కాకుండా, విద్యార్థుల చేతికే స్వయంగా పరికరాలు అందించి వారితోనే ప్రయోగాలు చేయిస్తున్నారు. ఎలక్ట్రానిక్స్‌ విభాగంలో బ్యాటరీలు అమర్చడం, లైట్లు, ఇన్వెర్టర్లు వంటి వస్తువుల తయారీపై శిక్షణ ఇస్తున్నారు. మైక్రో కంట్రోలర్లలో సెన్సర్లు నిత్య జీవితంలో ఎలా ఉపయోగపడతాయి? రోబోలను ఎలా తయారు చేయాలి? త్రీడీ డిజైనింగ్‌లో మనకు కావాల్సిన ఆకారం, పరిమాణంలో వస్తువులను ఎలా డిజైన్‌ చేయాలో ప్రాక్టీకల్‌గా వివరిస్తున్నారని విద్యార్థులు ఆనందం వ్యక్తం చేస్తున్నారు.

'విద్యార్థులు ఎంతో ఆసక్తిగా ఈ సాంకేతికతను నేర్చుకుంటున్నారు. శిక్షణ పూర్తి చేసుకున్న విద్యార్థులకు సర్టిఫికెట్‌ లభిస్తుంది. ఇది వారి భవిష్యత్‌లో ఉద్యోగాలు సాధించేందుకు ఉపయోగపడుతుంది.' -భాను, శిక్షకుడు

గ్రామీణ ప్రాంత విద్యార్థులకు సైతం గ్లోబల్ టెక్నాలజీని చేరువ చేయడమే ఈ ప్రాజెక్ట్ ముఖ్య ఉద్దేశమని చెబుతున్నారు నైపుణ్యాభివృద్ధి సంస్థ అధికారి సాయికుమార్. డిజిటల్ యుగంలో ప్రభుత్వ పాఠశాలల పిల్లలు ఎవరికీ తీసిపోకూడదనే సంకల్పంతో ఈ బస్సు రాష్ట్రవ్యాప్తంగా పర్యటిస్తోందని వివరిస్తున్నారు. ఒకప్పుడు పెద్ద పెద్ద ఇంజినీరింగ్‌ కళాశాలలకే పరిమితమైన రోబోటిక్స్‌, త్రీడీ డిజైనింగ్‌ వంటి కోర్సులు నేడు ల్యాబ్‌ ఆన్‌ వీల్స్‌ ద్వారా ప్రభుత్వ పాఠశాలల విద్యార్థుల వద్దకే రావడం అభినందనీయం. ఈ ప్రాక్టికల్‌ నాలెడ్జ్‌ భవిష్యత్‌లో విద్యార్థులను సరికొత్త ఆవిష్కరణల వైపు నడిపిస్తుందని ఆశిద్దాం.

ప్రభుత్వ పాఠశాల విద్యార్థుల వినూత్న ఆవిష్కరణలు

ప్రభుత్వ పాఠశాలల్లో డిజిటల్‌ పాఠాలు - కంటెంట్‌ సృష్టికర్తలుగా మారనున్న విద్యార్థులు