ETV Bharat / state

ఉద్రిక్తతల నడుమ క్యాతనపల్లి చైర్మన్‌ ఎన్నిక వాయిదా - కాంగ్రెస్​, బీఆర్​ఎస్​ శ్రేణుల మధ్య ఘర్షణ

మంత్రి వివేక్ భయభ్రాంతులకు గురిచేశారని బీఆర్‌ఎస్‌ ఆరోపణ - తనపై కుర్చీలు విసిరే ప్రయత్నం చేశారని మంత్రి వివేక్ వెల్లడి - బీఆర్‌ఎస్‌ నేతలు దౌర్జన్యం చేస్తున్నారని మంత్రి వివేక్‌ ఆరోపణ

Telangana Municipal Elections 2026
Telangana Municipal Elections 2026 (ETV Bharat)
author img

By ETV Bharat Telangana Team

Published : February 18, 2026 at 8:28 AM IST

3 Min Read
Choose ETV Bharat

Telangana Municipal Elections 2026 : మంచిర్యాల జిల్లా చెన్నూర్ నియోజకవర్గం క్యాతనపల్లి పురపాలక ఎన్నిక రెండోసారి వాయిదాపడింది. కోరం సరిపడా సభ్యులు లేనందున సోమవారం చైర్మన్‌ ఎన్నిక వాయిదా పడగా కాంగ్రెస్, బీఆర్​ఎస్​ శ్రేణుల మధ్య ఘర్షణతో మంగళవారం ఎన్నిక ప్రక్రియ పూర్తికాలేదు. ఎన్నిక సమయంలో కాంగ్రెస్, బీఆర్‌ఎస్‌ సభ్యులు పరస్పరం కుర్చీలు విసురుకోవటం మహిళా అభ్యర్థులని తోసేయటంతో సమావేశంలో గందరగోళం నెలకొంది.

బీఆర్​ఎస్​ సభ్యులపై దౌర్జన్యం : మరో అరగంటలో పాలకవర్గం ఎన్నిక జరిగిపోతుందనుకునే క్రమంలో బీఆర్​ఎస్​ సభ్యులు తమపై దౌర్జన్యం చేశారని ఆరోపిస్తూ మంత్రి వివేక్, ఎంపీ వంశీకృష్ణ సహ కాంగ్రెస్ సభ్యులంతా బయటకు వెళ్లిపోయారు. ఆనతంరం ఉన్నతాధికారులు సూచనలకు మేరకు ఎన్నిక వాయిదా వేస్తున్నట్లు అధికారులు ప్రకటించారు.

''ఇరువర్గాల కొట్టుకోవడం, కుర్చిలు ఎత్తివేయడం వల్ల ఆ సమయంలో ఎన్నికలు నిర్వహించలేకపోవడంతో ఈ ఎన్నికను వాయిదా వేశారు. ఈ విషయాన్ని ఎన్నికల సంఘానికి తెలియజేసి వాయిదా వేశాము''- ఎన్నికల అధికారులు

మంత్రి కాన్వాయ్​పై రాళ్లతో దాడి : మంగళవారం ఉదయం బీఆర్​ఎస్​, సీపీఐ సభ్యులతో కలిసి మున్సిపల్ కార్యాలయానికి వెళ్లేందుకు ప్రయత్నించిన బీఆర్​ఎస్​ ఎమ్మెల్యే కోవలక్ష్మి, మాజీ ఎమ్మెల్యే బాల్క సుమన్‌లను క్యాతనపల్లి ఫైఓవర్ వద్ద పోలీసులు అడ్డుకున్నారు. ఉద్రిక్తతల నడుము అభ్యర్థులను పోలీసులు మున్సిపల్ కార్యాలయానికి పంపారు. కోవలక్ష్మి, బాల్క సుమన్‌ సహా పార్టీశ్రేణులు అక్కడే ఉండగా అటుగా మంత్రి వివేక్, పెద్దపల్లి ఎంపీ వంశీకృష్ణ కాన్వాయ్‌ వచ్చింది. ఇరువర్గాల కార్యకర్తలు పోటాపోటీ నినాదాలు చేశారు. ఈ క్రమంలో కొందరు మంత్రి కాన్వాయ్‌పై రాళ్ల దాడికి పాల్పడ్డారు. ఆ దాడిలో ఓ కానిస్టేబుల్​తో పాటు ఇద్దరు కాంగ్రెస్ నాయకులకు తీవ్ర గాయాలుకాగా వారిని ఆసుపత్రికి తరలించారు. పదేళ్లు ప్రజాప్రతినిధిగా పనిచేసిన సుమన్ ఎన్నికల్లో ఓడిపోయాననే అక్కసుతో ఇలాంటి దాడులకు పాల్పడుతున్నారని మంత్రి వివేక్‌ వెంకటస్వామి ఆరోపించారు.

''ఆయన ఎందుకు మాపై దాడి చేశాడు అనేది అర్థం కాలేదు. వాళ్లు నా కారుపైన రాళ్లు, సెంటర్​ బోర్డ్స్​ నా కారుపైన విసిరేయడం జరిగింది. పాపం ఆ గొడవలో ఒక పోలీసు కానిస్టేబుల్​ గాయాలయ్యాయి. అతను 8 సూచర్​లతో ఆసుపత్రిలో ఉన్నారు. మరో ఇద్దరికి గాయాలయ్యాయి. బీఆర్​ఎస్ హయంలో ఏమైంది పోలీసు వాళ్లను తీసుకుపోవడం, రైడ్​ చేపించడం, అందరిని ప్యాక్​ చేసేయడం ఇవన్నీ కూడా నిజంగా ప్రజాస్వామ్యం ఖూని అయ్యింది బీఆర్​ఎస్​ లోనే.'' -వివేక్‌ వెంకటస్వామి, మంత్రి

కౌన్సిలర్లతో అసభ్యకరంగా ప్రవర్తణ : క్యాతనపల్లి మున్సిపాలిటీలో పాలకవర్గం ఎన్నిక ప్రక్రియ దుశ్శాసన పర్వాన్ని తలపించిందని మాజీ ఎమ్మెల్యే బాల్కసుమన్ విమర్శించారు. చైర్మన్‌ ఎన్నికలో కాంగ్రెస్ పార్టీకి చెందిన కౌన్సిలర్లు మద్యం సేవించి బీఆర్​​ఎస్​, సీపీఐ కౌన్సిలర్లతో అసభ్యకరంగా ప్రవర్తించారని ఆరోపించారు. తమకు స్పష్టమైన మేజార్టీ ఉన్నా మంత్రి వివేక్ వెంకటస్వామి ఎన్నిక జరగకుండా అడ్డుకుంటున్నారని మండిపడ్డారు. క్యాతనపల్లిలో మంత్రి వివేక్ వెంకటస్వామి, ఎంపీ వంశీ కృష్ణలపై దాడిని మాల మాహనాడు జాతీయ అధ్యక్షులు చెన్నయ్య ఖండించారు. దాడిని నిరసిస్తూ హైదరాబాద్‌ ట్యాంక్ బండ్ వద్దనున్న అంబేద్కర్ విగ్రహం ముందు ఆందోళన చేపట్టారు.

''పూర్తి స్థాయి కోరం ఉన్నప్పటికీ కూడా 14 మంది సభ్యులు ఉన్నప్పటికి కూడా ఎన్నిక జరగనియకుండా వాయిదా వేయించి ఇవాళ ప్రజాస్వామ్యానికి పట్టపగలే మంత్రి వివేక్​ క్యాతనపల్లిలో హత్య చేశాడు. ఒక మున్సిపల్​ కౌన్సిల్​ స్థానం కోసం ఇంత దిగజారుడా? మంత్రి, ఎంపీ కుర్చొని కాంగ్రెస్​ కౌన్సిలర్లకు తాగిపించి, లోపలికి తీసుకొచ్చి ఆడబిడ్డల మీద మీ ఇష్టమొచ్చినట్టు చేతులు వేయడం, వారిని గుంజుకపోవడం, ఎత్తుకొని పోతున్నారట. ఇదేం పద్ధతి.'' - బాల్కసుమన్‌, మాజీ ఎమ్మెల్యే

వాయిదాపడ్డ స్థానాల్లో ఛైర్మన్‌, వైస్‌ ఛైర్మన్‌ ఎన్నికలు - 2 చోట్ల కాంగ్రెస్​ను వరించిన అదృష్టం

'నాకు సహకరిస్తే నేను నీకు సహకరిస్తా' - పదవుల కోసం వైరం పక్కనపెట్టిన రాజకీయ పార్టీలు