దంపతులను బురిడీ కొట్టించి రూ.3.5 కోట్లు దోపిడీ - ఎమ్మెల్యేను ఆశ్రయించిన బాధితులు
క్షుద్రపూజలతో భయపెట్టాడు, మాయమాటలు చెప్పాడు - అందినకాడికి దోచుకుని ఆపై బెదిరింపులు

By ETV Bharat Andhra Pradesh Team
Published : November 29, 2025 at 1:05 PM IST
Kurnool Man Cheated 3 Crores From Vanaparti District Couple : ఆరోగ్యం బాగు చేయాలని తనను ఆశ్రయించిన దంపతులను క్షుద్రపూజల పేరుతో భయపెట్టి ఏకంగా రూ.3.50 కోట్లు కొట్టేశాడో నకిలీ గురువు. ఈ ఘటన కర్నూలు జిల్లా ఆదోని మండలం బైచిగేరిలో చోటు చేసుకుంది. దీనిపై పోలీసులకు ఫిర్యాదు చేసినా పట్టించుకోవట్లేదని ఆదోని ఎమ్మెల్యే పార్థసారథి శుక్రవారం నిర్వహించిన ప్రజాదర్బార్‌లో బాధితులు గోడు వెళ్లబోసుకున్నారు.
తెలంగాణలోని వనపర్తి జిల్లా పెబ్బేరులో ఉంటున్న వెంకటయ్య, పద్మ దంపతులు ఆరోగ్య సమస్యలతో బాధపడుతున్నారు. బైచిగేరి గ్రామానికి చెందిన దుర్గాసింగ్‌కు దేవుడు వస్తాడని, అక్కడికి వెళ్తే ఆరోగ్యం కుదుట పడుతుందని ఎవరో చెబితే కొన్ని రోజుల కిందట దంపతులు అక్కడికి వెళ్లారు. దీన్ని ఆసరాగా చేసుకున్న దుర్గాసింగ్ వారికి కట్టుకథలు చెప్పారు.
ఐదు సార్లు దిల్లీకి : మీ పొలంలో నిధి ఉందని, అది తీసేంత వరకూ మీకు, మీ పిల్లలకు ప్రాణహాని ఉంటుందని భయపెట్టాడు. ఆ నిధి తీస్తానని చెప్పి వారి నుంచి రూ.80 లక్షలు కాజేశాడు. ఓ రోజు రాత్రి బాధితుల స్వగ్రామమైన ఉండవల్లి శివారులోని వారి పొలంలో క్షుద్రపూజలు చేశాడు. అనంతరం ఇక్కడ అమ్మవారి విగ్రహం బయటపడిందని చెప్పి మూడడుగుల ఎత్తున్న విగ్రహాన్ని దంపతులకు చూపించాడు. ఈ విగ్రహాన్ని ఇంట్లో పెట్టుకుంటే ప్రాణహాని ఉంటుందని, అమ్మేస్తే రూ.కోట్లు వస్తాయని నమ్మబలికాడు. విగ్రహం కొనుగోలుకు విదేశాల నుంచి కొందరు దిల్లీకి వచ్చారని చెప్పి, ఐదు సార్లు బాధితులను దిల్లీకి తీసుకెళ్లాడు. ఈ క్రమంలో వారి నుంచి సుమారు రూ.3.50 కోట్లు వసూలు చేశాడు. చివరికి మోసపోయామని గ్రహించిన దంపతులు తమ డబ్బు తిరిగివ్వాలని దుర్గాసింగ్‌ను కోరారు.
దాంతో అతడు బెదిరింపులకు దిగాడు. గ్రామంలోకి అడుగు పెడితే చంపేస్తామని దుర్గాసింగ్‌తో పాటు ముకుంద అనే వ్యక్తి మమ్మల్ని బెదిరించారని బాధితులు వాపోతున్నారు. దీనిపై పెబ్బేరు పోలీసుస్టేషన్లో ఫిర్యాదు చేస్తే పట్టించుకోలేదని, గత నెల ఆదోనికి వచ్చి డీఎస్పీతో పాటు తాలూకా పోలీసు సీఐకి ఫిర్యాదు చేస్తే పట్టించుకోలేదని దంపతులు ఎమ్మెల్యే వద్ద బోరున విలపించారు. ఎమ్మెల్యే ఆదోని డీఎస్పీతో ఫోన్‌లో మాట్లాడగా, సాక్ష్యాలు లేకపోవడంతో కేసు నమోదు చేయలేదని డీఎస్పీ తెలిపారు.
మూడు అడుగుల లక్ష్మీ విగ్రహాం : తెలంగాణలోని పెబ్బేరు ప్రాంతానికి చెందిన వెంకటయ్య, పద్మ దంపతులు తమ ఆరోగ్యం మెరుగుపరుస్తానని నమ్మించి, కర్నూలు జిల్లా ఆదోని మండలం బైచిగేరి గ్రామానికి చెందిన దుర్గా సింగ్ క్షుద్ర పూజల పేరుతో తమను మూడున్నర కోట్ల రూపాయలు మోసం చేశాడని తీవ్ర ఆవేదన వ్యక్తం చేశారు. ఆదోని ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో జరిగిన ప్రజాదర్బార్‌లో బాధితులు కన్నీటి పర్యంతమయ్యారు. దుర్గా సింగ్ తమ పొలంలో పూజలు చేయాలని నమ్మించి, అక్కడ మూడు అడుగుల లక్ష్మీ విగ్రహాన్ని బయటకు తీశాడని, పూజలు చేయకపోతే తమకు హాని జరుగుతుందని భయపెట్టడంతో తాము విడతలవారీగా డబ్బు చెల్లించామని దంపతులు వాపోయారు.
విగ్రహం అమ్మేసి డబ్బులు తిరిగి ఇస్తానని చెప్పి ఐదుసార్లు ఢిల్లీకి తీసుకెళ్లాడని ఆరోపించారు. చివరకు మోసపోయామని గ్రహించి డబ్బు తిరిగి అడగగా, దుర్గా సింగ్, ముకుంద అనే వ్యక్తి 'గ్రామంలోకి అడుగుపెడితే చంపేస్తామని' బెదిరించారని దంపతులు తెలిపారు. దీనిపై పెబ్బేరు, ఆదోని పోలీసులకు ఫిర్యాదు చేసినా పట్టించుకోలేదని వారు ఎమ్మెల్యేకు మొర పెట్టుకున్నారు. సాక్ష్యాలు లేకపోవడంతో కేసు నమోదు చేయలేదని డీఎస్పీ ఎమ్మెల్యేకు ఫోన్‌లో వివరించారు.
చేతబడి నెపంతో వృద్ధుడి సజీవ దహనం- తొమ్మిదిమంది అరెస్టు
డెడ్ బాడీ పార్సిల్ కేసు : వర్మ ఇంట్లో మరో చెక్క పెట్టె, చేతబడి సామగ్రి

