ETV Bharat / state

నేపాల్ వరదల్లో కుప్పం వాసి బాలసుబ్రమణ్యం గల్లంతు - కుటుంబసభ్యుల ఆందోళన

నేపాల్‌లో వరదల నేపథ్యంలో అక్కడ చిక్కుకున్న ఆంధ్రప్రదేశ్ వాసులను గుర్తించి, సురక్షిత ప్రాంతాలకు తరలించేందుకు చర్యలు తీసుకోవాలని ముఖ్యమంత్రి చంద్రబాబు అధికారులకు ఆదేశాలు

Kuppam Resident Goes Missing in Nepal Floods
నేపాల్ వరదల్లో కుప్పం వాసి బాలసుబ్రమణ్యం గల్లంతు (ETV Bharat)
author img

By ETV Bharat Andhra Pradesh Team

Published : August 27, 2026 at 4:27 PM IST

2 Min Read
Choose ETV Bharat

Kuppam Resident Goes Missing in Nepal Floods: చిత్తూరు జిల్లా కుప్పం వాసి బాలసుబ్రమణ్యం నేపాల్ వరదల్లో గల్లంతయినట్లు అతడి కుటుంబ సభ్యులు తెలిపారు. బాలసుబ్రమణ్యం సోదరుడు శ్రీకాంత్ తెలిపిన వివరాల మేరకు వి.ఎస్ బాలసుబ్రమణ్యం హైదరాబాద్​లో సాఫ్ట్​వేర్​ ఇంజినీర్​గా స్థిరపడ్డారు. ఈ నెల 13న ఆయన మరి కొంతమందితో కలిసి నేపాల్ మానస సరోవర్ యాత్రకు వెళ్లారు. మంగళవారం నుంచి అతని ఫోన్​ స్విచ్​ఆఫ్ వస్తోంది. ఇప్పటివరకు అతని నుంచి ఎలాంటి సమాచారం లేకపోవడంతో వరదల్లో చిక్కుకుపోయినట్లు కుటుంబ సభ్యులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. బాలసుబ్రమణ్యం ఆచూకీని గుర్తించాల్సిందిగా లాయర్ శ్రీకాంత్ సీఎం చంద్రబాబును ఆశ్రయించారు.

కంట్రోల్​రూం నంబర్లు: నేపాల్‌లో వరదల నేపథ్యంలో అక్కడ చిక్కుకున్న ఆంధ్రప్రదేశ్ వాసులను గుర్తించి, సురక్షిత ప్రాంతాలకు తరలించేందుకు చర్యలు తీసుకోవాలని ముఖ్యమంత్రి చంద్రబాబు అధికారులను ఆదేశించారు. నేపాల్‌లో ఏపీకి చెందిన ఎవరైనా విపత్తులో చిక్కుకున్నారా? అనే దానిపై ప్రభుత్వం సమాచారం సేకరిస్తోంది. కేంద్ర ప్రభుత్వంతో సమన్వయం చేసుకుంటూ బాధిత యాత్రికులకు అవసరమైన సహాయాన్ని అందించాలని సీఎం సూచించారు. దిల్లీలోని ఏపీ భవన్‌లో ప్రత్యేకంగా కంట్రోల్ రూం ఏర్పాటు చేసి పరిస్థితి పర్యవేక్షిస్తున్నారు. ఆర్టీజీ ద్వారా కూడా నిరంతరం పర్యవేక్షణ కొనసాగిస్తూ, నేపాల్‌లోని ఏపీ వాసులకు అవసరమైన సహకారం అందించాలని సీఎం ఆదేశించారు. సహాయం కోసం ఏపీ భవన్ కంట్రోల్ రూమ్‌ 011-23384016, 011-23387089 నంబర్లను, వాట్సాప్ 9059824101ను సంప్రదించవచ్చని అధికారులు తెలిపారు.

175 కు చేరిన మృతులు: నేపాల్‌లో సంభవించిన ఆకస్మిక జలప్రళయం తీవ్ర విషాదాన్ని నింపింది. విపత్తు నిర్వహణ సంస్థ తెలిపిన వివరాల ప్రకారం ఆకస్మిక వరదల కారణంగా 826 మంది ఆచూకీ గల్లంతయ్యింది. దాదాపు 300 మంది వరకు భారతీయులు కొట్టుకుపోయినట్లు నేపాల్ విదేశాంగ శాఖ మంత్రి శిశిర్ ఖనాల్ గురువారం వెల్లడించారు. ఈ విషాదంలో మృతుల సంఖ్య 175కు పెరిగింది.

సురక్షితంగా తీసుకొచ్చేలా సంప్రదింపులు: నేపాల్‌ వెళ్లిన ఏపీ వాసుల వివరాలు మంత్రి కొండపల్లి శ్రీనివాస్​ వెల్లడించారు. ఏపీకి చెందిన ఐదుగురి ఆచూకీ లభ్యం కాలేదని తెలిపారు. ప్రకాశం జిల్లాకు చెందిన సుహాసినిరెడ్డి, కృష్ణా జిల్లాకు చెందిన రమేశ్‌బాబు, కాకినాడ జిల్లాకు చెందిన మ‌రో ముగ్గురి ఆచూకీ తెలియలేదని అన్నారు. మానస సరోవర్‌ యాత్రకు వెళ్లిన నలుగురు ఆదోని యాత్రికులు క్షేమంగా ఉన్నారని, ఆదోని యాత్రికులతో సురక్షితంగా తీసుకొస్తామని మంత్రి కొండపల్లి శ్రీనివాస్ తెలిపారు. తెలుగు యాత్రికులను సురక్షితంగా తీసుకొచ్చేలా సంప్రదింపులు జరుపుతున్నామన్నారు. నేపాల్‌లో చిక్కుకున్న ఏపీ యాత్రికుల భద్రతపై లోకేశ్ పర్యవేక్షిస్తున్నారని కొండపల్లి తెలిపారు.

నేపాల్‌ వరదలతో బయటపడిన చైనా డ్యామ్‌ 'ముప్పు'- భారత్‌కు ప్రమాదమెంత? కేంద్రం వ్యూహమేంటి?

గోదావరికి ఆగస్టు గండం - నాటి వరదకు 40 ఏళ్లు