ETV Bharat / state

కుప్పంలోనూ బంగారు గనులు - కేజీఎఫ్‌కు చేరువలో ‘చిగురుగుంట’ స్వర్ణ నిక్షేపాలు

చిగురుగుంట-బిసానత్తం బ్లాక్‌ వేలానికి రంగం సిద్ధం - టన్నుకు 5.73, 4.70 గ్రాముల చొప్పున బంగారం - క్షేత్రస్థాయికి వచ్చి పరిశీలిస్తున్న పలు సంస్థల ప్రతినిధులు - జులై 9న బిడ్డింగ్‌కు ఆఖరి గడువు

Kuppam Gold Mine Revival Plans to Restart AP Chigurugunta Gold Project
Kuppam Gold Mine Revival Plans to Restart AP Chigurugunta Gold Project (ETV Bharat)
author img

By ETV Bharat Andhra Pradesh Team

Published : June 28, 2026 at 9:02 AM IST

3 Min Read
Choose ETV Bharat

Gold Mines in Kuppam : కుప్పం నియోజకవర్గంలోనూ బంగారు గనులు రాబోతున్నాయి. నియోజకవర్గ పరిధిలోని గుడుపల్లె మండలె "చిగురుగుంట-బిసానత్తం" గోల్డ్ బ్లాక్​ను లీజుకు ఇచ్చేందుకు కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు వేలం ప్రక్రియను ప్రారంభించాయి. ఈ వేలంలో పాల్గొనేందుకు (బిడ్డింగ్ దాఖలు చేయడానికి) వచ్చే జులై 9వ తేదీని చివరి గడువుగా నిర్ణయించారు.

రంగంలోకి ప్రముఖ సంస్థలు: ఈ గోల్డ్ మైనింగ్ ప్రాజెక్ట్‌ దక్కించుకునేందుకు ప్రముఖ మైనింగ్ సంస్థలు ఆసక్తి చూపుతున్నాయి. ఇప్పటికే రెండు సంస్థల ప్రతినిధులు చిగురుగుంట, బిసానత్తం ప్రాంతాల్లో క్షేత్రస్థాయి పరిశీలన జరిపారు. గతంలో ఈ ప్రాంతంలో మైనింగ్ జరిగినప్పటి పరిస్థితులు, అప్పట్లో గనులు మూతపడటానికి గల కారణాలను అధికారులను అడిగి తెలుసుకున్నారు.

సీఎం చంద్రబాబు అధికారిక ప్రకటన: చిత్తూరు జిల్లా పరిధిలో త్వరలోనే బంగారు గనుల తవ్వకాలు (గోల్డ్ మైన్స్) ప్రారంభం కాబోతున్నాయని ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఇటీవల అధికారికంగా ప్రకటించారు. ఈ మైనింగ్ ప్రాజెక్ట్ గనుక పట్టాలెక్కితే స్థానికంగా వందలాది మంది యువతకు ఉపాధి అవకాశాలు లభించడంతో పాటు, రాయలసీమ ప్రాంత ఆర్థిక ముఖచిత్రం మారిపోతుందని నిపుణులు అంచనా వేస్తున్నారు.

దేశ చరిత్రలో ప్రత్యేక ముద్ర వేసిన కర్ణాటకలోని కోలార్‌ గోల్డ్‌ఫీల్డ్స్‌ (కేజీఎఫ్‌)కు కేవలం 27 కిలోమీటర్ల దూరంలోనే చిగురుగుంట-బిసానత్తం బంగారు గనులు విస్తరించి ఉన్నాయి. సుమారు 272.987 హెక్టార్ల భారీ విస్తీర్ణంలో ఉన్న ఈ ప్రాంతంలో లక్షల టన్నుల మేలిమి బంగారు నిక్షేపాలు భూగర్భంలో నిగూఢంగా దాగి ఉన్నట్లు అంచనా.

కేజీఎఫ్‌తో పాటే మూతపడిన చరిత్ర: కేంద్ర ప్రభుత్వ ఆధ్వర్యంలోని ‘భారత్‌ గోల్డ్‌మైన్స్‌ లిమిటెడ్‌’ (బీజీఎంఎల్‌) 1972లోనే ఇక్కడ తవ్వకాలకు శ్రీకారం చుట్టింది. అప్పట్లో ఇక్కడి నుంచి ముడిమట్టిని సేకరించి శుద్ధి కోసం కేజీఎఫ్‌కు తరలించేవారు. అయితే, కాలక్రమేణా పైపైన ఉన్న నిక్షేపాలు తగ్గిపోవడం, భూగర్భంలోకి లోతుగా వెళ్లి తవ్వకాలు జరపడానికి ఖర్చులు భారీగా పెరగడంతో ఈ గనులు నష్టాల బాట పట్టాయి. దీంతో 2001లో కేజీఎఫ్‌తో పాటే ఈ చిగురుగుంట-బిసానత్తం గనులనూ కేంద్ర ప్రభుత్వం పూర్తిగా మూసేసింది. ఆ సమయంలో ఇక్కడ 156 మంది ఉద్యోగులతో పాటు వందలాది మంది కార్మికులు ఉపాధి కోల్పోయారు.

అనుమతుల చిక్కుముడి, వెనక్కి తగ్గిన ఎన్‌ఎండీసీ: దీర్ఘకాలం పాటు మూతపడిన ఈ గనులను తిరిగి ప్రారంభించేందుకు 2018లో కేంద్రం తొలిసారి ఈ-వేలం నిర్వహించింది. అప్పట్లో ప్రభుత్వరంగ సంస్థ ‘ఎన్‌ఎండీసీ’ (NMDC) ఈ బిడ్‌ను దక్కించుకుంది. అయితే పర్యావరణ అనుమతులు, మైనింగ్‌ ప్రణాళిక ఆమోదం, భూసేకరణ వంటి ప్రక్రియలు పూర్తి కావాల్సి ఉండగా ప్రతిపాదిత మైనింగ్ పరిధిలో పట్టా భూములు ఎక్కువగా ఉండటంతో స్థానిక రైతులు తీవ్ర అభ్యంతరం వ్యక్తంచేశారు. భూసేకరణ కొలిక్కి రాకపోవడంతో సుదీర్ఘ నిరీక్షణ తర్వాత 2025లో ఎన్‌ఎండీసీ ఈ ప్రాజెక్ట్ నుంచి వెనక్కి తగ్గింది. ఈ ఏడాది ప్రారంభంలోనూ టెండర్లు పిలిచినా ఖరారు కాకుండానే రద్దు చేేశారు. తాజాగా మూడోసారి టెండర్లు పిలిచారు.

బంగారం ధరల జోరు.. ఈసారైనా దక్కేనా?: ప్రస్తుతం మార్కెట్‌లో బంగారం ధరలు రికార్డు స్థాయిలో పలుకుతుండటంతో కంపెనీలు ఆసక్తి చూపవచ్చనే అభిప్రాయం వ్యక్తమవుతోంది.

నిక్షేపాల అంచనా ఇలా:

  • చిగురుగుంట బ్లాక్: ఇక్కడ దాదాపు 20.43 లక్షల టన్నుల ముడి ఖనిజ నిల్వలు ఉన్నట్లు గుర్తించారు. ఇక్కడి ఒక టన్ను ముడిఖనిజాన్ని శుద్ధి చేస్తే సగటున 5.73 గ్రాముల మేర బంగారం లభిస్తుంది.
  • బిసానత్తం బ్లాక్: ఇక్కడ 1.73 లక్షల టన్నుల ఖనిజ నిల్వలు ఉండగా, టన్నుకు సగటున 4.70 గ్రాముల చొప్పున బంగారం వచ్చే అవకాశం ఉందని అంచనా వేశారు.

ఒకప్పుడు కేజీఎఫ్‌ గురించి దేశవ్యాప్తంగా చర్చ - ఇప్పుడు జొన్నగిరి: సీఎం చంద్రబాబు

బులియన్ మార్కెట్​లోకి 'జొన్నగిరి' గోల్డ్​ - ఏపీ మ్యాప్‌తో మెరుస్తున్న 24 క్యారెట్ల స్వచ్ఛత