ఇంద్రకీలాద్రిపై కుంభాభిషేక మహోత్సవం - మార్చి 6 నుంచి మూడు రోజులపాటు వేడుకలు
భక్తులకు అన్ని రకాల సదుపయాలు కల్పిస్తామంటున్న కలెక్టర్ - రానున్న భక్తులపై భారీ అంచనాలు

By ETV Bharat Andhra Pradesh Team
Published : February 24, 2026 at 5:33 PM IST
Kumbhabhishekm at Indrakeeladri : దేశంలోని ప్రధాన శక్తి ఆలయాల్లో ఒకటైన విజయవాడ ఇంద్రకీలాద్రి దుర్గామల్లేశ్వరస్వామి దేవస్థానంలో మార్చి 6 నుంచి మూడు రోజులపాటు కుంభాభిషేక మహోత్సవాన్ని నిర్వహించనున్నారు. ఇందుకు సంబంధించిన ఏర్పాట్లపై విజయవాడ ఎంపీ కేశినేని శివనాథ్ ఆధ్వర్యంలో ఎన్టీఆర్ జిల్లా కలెక్టర్ జి.లక్ష్మీశ, విజయవాడ పోలీసు కమిషనర్ ఎస్.వి. రాజశేఖరబాబు, దుర్గగుడి పాలకమండలి ఛైర్మన్ బొర్రా రాధాకృష్ణ గాంధీ, ఈవో శీనానాయక్ సంబంధిత అధికారులు, పండితులతో సమీక్ష సమావేశం నిర్వహించారు.
కుంభాభిషేక మహోత్సవంపై భారీ అంచనాలు : ఇంద్రకీలాద్రిపై ఈ కుంభాభిషేక మహోత్సవాలు మూడు రోజులపాటు జరగనున్నాయి. ఈ వేడుకలో ముఖ్యమంత్రి, ఉపముఖ్యమంత్రి, మంత్రులు పాల్గొంటారని, భారీగా ప్రజలు తరలివస్తారనే అంచనాలు ఉండడంతో అధికారులు, పండితులు తీసుకోవాల్సిన చర్యలపై చర్చలు చేశారు. ఆగమశాస్త్రం ప్రకారం ప్రతి పన్నెండేళ్లకు ఒకసారి ద్వాదశ వర్ష నియమం ప్రకారం ఆలయంలోని దైవిక శక్తిని పునరుద్ధరించడానికి కుంభాభిషేకం నిర్వహించడం శాస్త్రోక్తమని పండితులు పేర్కొన్నారు.
కైంకర్యాలు ఎలా జరగనున్నాయంటే : దేవాలయ కలశం ముఖభాగంలో కుంభానికి దేశంలోని పుణ్య నదులు, తీర్థాలు, సప్త సముద్రాల జలాలను ఉంచుతారు. యాగశాలలో వాటిని మంత్రాలతో పూజించి, అభిషేకం చేస్తారు. ఆ తర్వాత కంచికామకోఠి పీఠాధిపతి స్వామి విజయేంద్ర సరస్వతి చేతుల మీదుగా మార్చి 6 నుంచి కుంభాభిషేక మహోత్సవ కార్యక్రమాలు ప్రారంభం అవుతాయి.
కుంభాభిషేక మహోత్సవాల షెడ్యూల్ :
- మార్చి 6న యాగశాల ప్రవేశం, గణపతి పూజ, దీక్షాధారణ, అఖండదీపారాదన, అంకుకార్పణ, అగ్రిప్రతిష్టాపన వంటివి ఉంటాయి.
- మార్చి7న వివిధ పవిత్ర నదీ, సముద్ర జలాలతో అష్టోత్తర కలశస్థాపన పూజ వంటివి నిర్వహిస్తారు.
- మార్చి 8 విశ్వావసు నామ సంవత్సర ఫాల్గుణ బహుళ పంచమి రోజున ఉదయం 9.34 గంటలకు కనకదుర్గమ్మ అమ్మవారి ప్రధాన ఆలయ ప్రాంగణంలో కుంభాభిషేకం జరుగుతుందని అధికారులు వెల్లడించారు.
మార్చి 6, 7, 8 తేదీల్లో అమ్మవారికి ప్రతి పన్నెండేళ్లకు ఒకసారి జరిగే పూర్ణ కుంభాభిషేక మహోత్సవాలు జరుగుతాయి. ఇందులో ముఖ్యమంత్రి, ఉపముఖ్యమంత్రి, లోకేశ్, మంత్రులు పాల్గొంటారు. లక్షలాది భక్తులు వస్తారు. కంచికామకోఠి పీఠాధిపతి స్వామి విజయేంద్ర సరస్వతి చేతుల మీదుగా 6వ తేదీన ఉదయం 8 గంటలకు ప్రారంభం కానుంది. అందరూ పూర్తి భక్తి శ్రద్ధలతో విజయవంతం చేయగలరు. ఇందుకు కావలసిన ఏర్పాట్లు అన్ని చేయనున్నాం. క్రతువు ద్వారా ఆలయ విమాన గోపురాలను సంప్రోక్షణ చేయడం. దీనివల్ల ఆలయ తేజస్సు మరింత పెరుగుతుంది. ఆలయంలోని పండితులు ఈ క్రతువును నిర్వర్తిస్తారు. దీనివల్ల ఆలయం మళ్లీ పునర్జీవనం అయ్యి, శక్తిమంతగా తయారవుతుంది. - కేశినేని శివనాథ్, ఎంపీ
అన్ని రకాల సదుపాయాలు కల్పిస్తాం :
కుంభాభిషేకానికి వచ్చే భక్తులకు ఎలాంటి అసౌకర్యాలు కలగకుండా ఏర్పాట్లు చేస్తామని కలెక్టర్ జి. లక్ష్మీశ అన్నారు. ఎంత భక్తి భావంతో భక్తులు వస్తారో, అంతే పవిత్రంగా ఈ కార్యక్రమాన్ని నిర్వహిస్తామని పేర్కొన్నారు. పిల్లలు, వృద్ధులకు కావలసిన సదుపాయాలను కల్పిస్తామని అన్నారు. దసరా పండుగ సమయంలో రోజుకు లక్ష మంది వచ్చినప్పుడు ఎలాగైతే అన్ని సదుపాయాలు కల్పించామో, ఇప్పుడు కూడా రోజుకు మూడు లక్షల మంది వచ్చినా ఎలాంటి ఇబ్బందులు రాకుండా జిల్లా యంత్రాంగం చూసుకుంటుందని చెప్పారు. ప్రభుత్వం అందిస్తున్న సహకారంతో ఈసారి కూడా కుంభాభిషేకాన్ని విజయవంతంగా జరిగేలా చేస్తామని అన్నారు.
భక్తుల సంఖ్యపై అంచానా వేయాలి : ఆలయాన్ని సందర్శించే భక్తుల సంఖ్య ప్రతి ఏడాది పెరుగుతుందని పోలీసు కమిషనర్ ఎస్వీ రాజశేఖర బాబు అన్నారు. గత సంవత్సరం మూల నక్షత్రం రోజున లక్షా ముప్ఫై వేల మంది అమ్మవారిని దర్శించుకుంటే, ఈ ఏడాది రెండు లక్షల మంది వచ్చారని చెప్పారు. మహిళలకు ఫ్రీ బస్సు సౌకర్యం ఉండడం, ఆలయాన్ని దర్శించుకుంటే మంచి జరుగుతుందనే ఆలోచనతో భక్తులు అధికంగా వస్తున్నారనన్నారు. అందువలన కుంభాభిషేకానికి కూడా ఎలా వస్తారో అంచనా వేయాల్సిన అవసరం ఉందని పేర్కొన్నారు.
విజయవాడ దుర్గగుడిలో రూ.1.20 కోట్లతో వాటర్ ప్లాంట్ ఏర్పాటు
'దుర్గమ్మ చెంత - పార్కింగ్ చింత' - సమస్యకు శాశ్వత పరిష్కారం చూపాలని భక్తుల వినతులు

