'అప్పటి వరకు టెలిమెట్రీల ఏర్పాటు కుదరదు' : తెలుగు రాష్ట్రాలకు కేఆర్ఎంబీ లేఖ
తెలుగు రాష్ట్రాలకు కేఆర్ఎంబీ లేఖ -టెలిమెట్రీల ఏర్పాటు అంశంపై ఇరు రాష్ట్రాలకు ప్రతిపాదనలు- నీటి వాటా ట్రైబ్యునల్లో తేలాక, ప్రాజెక్టులు అప్పగించాకే ఏర్పాటు చేస్తామని వెల్లడి -అప్పటి వరకు టెలిమెట్రీల ఏర్పాటు సాధ్యంకాదని స్పష్టీకరణ

Published : January 8, 2026 at 9:55 AM IST
KRMB To Delay Telemetry Devices : సుప్రీంకోర్టులో కేసులు, బ్రిజేశ్ కుమార్ ట్రైబ్యునల్ విచారణ తేలే వరకు ఉమ్మడి ప్రాజెక్టులపై తదుపరి దశల టెలిమెట్రీ యంత్రాల ఏర్పాటు వాయిదా వేయాలని కృష్ణా నదీ యాజమాన్య బోర్డు అభిప్రాయపడింది. ప్రాజెక్టుల వారీగా కేటాయింపులు లేకపోవడం, బోర్డుకు ప్రాజెక్టులు అప్పగించకపోవడంతో పూర్తి స్థాయిలో టెలిమెట్రీకి ఇబ్బందులు తలెత్తుతాయని పేర్కొంది. మొదటి దశ టెలిమెట్రీ యంత్రాల్లో అన్నింటి ఫలితాలు సరిగ్గా లేకపోవడం, పరికరాల ధర, నిర్వహణ లాంటి అంశాలను కూడా పరిగణలోకి తీసుకోవాలని సూచించింది. ఈ మేరకు తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాలకు కృష్ణా నదీ యాజమాన్య బోర్డు లేఖ రాసింది.
టెలిమెట్రీ పరికరాల ఏర్పాటు కుదరదు : కృష్ణా జలాల పంపిణీపై బ్రిజేశ్ కుమార్ ట్రైబ్యునల్ విచారణ పూర్తయి, నీటి కేటాయింపులు తేలి ప్రాజెక్టులను బోర్డుకు అప్పగించిన తర్వాత గానీ పరీవాహకంలో ప్రవాహాలను లెక్కించేందుకు టెలిమెట్రీ పరికరాల ఏర్పాటు కుదరదని కృష్ణా నదీ యాజమాన్య బోర్డు స్పష్టం చేసింది. కీలకమైన ఈ రెండు అంశాలపై న్యాయ విచారణ కొనసాగుతున్నందున నిర్ణయం తీసుకోలేదని తెలిపింది. 2016-18 కాలంలో మొదటి దశ టెలిమెట్రీ ప్రారంభమైనప్పటికీ సాంకేతిక సమస్యలు, ఖచ్చితత్వం, డేటా నిలకడ, ఇరు రాష్ట్రాల అంగీకారం విషయాల్లో ఇబ్బందులు ఎదురయ్యాయని కేఆర్ఎంబీ తెలిపింది. బోర్డుకు స్పష్టమైన పరిధి, అమలు చేయగల అధికారాలు లేకుండా స్వతంత్ర టెలిమెట్రీ డేటాతో నియంత్రణ చేయడాన్ని రాష్ట్రాలు అంగీకరించకపోవచ్చని, అమలు సామర్థ్యం ప్రశ్నార్థకం అవుతుందని పేర్కొంది.
18 రాడార్ సెన్సర్లలో కేవలం ఏడు మాత్రమే : మొదటి దశ టెలిమెట్రీలో ఏర్పాటు చేసిన 18 రాడార్ సెన్సర్లలో కేవలం ఏడు మాత్రమే పూర్తిగా సంతృప్తికరంగా పని చేస్తున్నాయని, డేటా స్థిరత్వం విషయంలో ఇబ్బందులు ఉన్నాయని తెలిపింది. టెలీమెట్రీలో ఉపయోగించే సైడ్ లుకింగ్ డాప్లర్ పరికరాలు ఖరీదైనవని, మారుమూల ప్రాంతాల్లోని కాల్వల వద్ద భద్రత, నిర్వహణ లాంటి సమస్యలు ఎక్కువగా ఉంటాయని బోర్డు తెలిపింది. వీటన్నింటిని దృష్టిలో ఉంచుకొని బోర్డు పరిధి విషయమై సుప్రీంకోర్టు తీర్పు, బ్రిజేశ్ కుమార్ ట్రైబ్యునల్ ద్వారా ప్రాజెక్టుల వారీ కేటాయింపులు, ఆపరేషన్ ప్రొటోకాల్‌పై స్పష్టత వచ్చే వరకు రెండు, మూడు దశల టెలిమెట్రీ విస్తరణను వాయిదా వేయాలని కేఆర్ఎంబీ సూచించింది.
మళ్లీ రీడిజైన్ చేసి ఏర్పాటు : తీర్పులు, కేటాయింపుల తర్వాత మొత్తం కృష్ణా బేసిన్ కోసం టెలిమెట్రీ అవసరాలు, లొకేషన్లు, టెక్నాలజీని సమగ్రంగా మళ్లీ రీడిజైన్ చేసి ఏర్పాటు చేయడం సముచితమని కేఆర్‌ఎంబీ అభిప్రాయపడింది. రెండో దశలో తెలంగాణలో రెండు, ఏపీలో ఏడు టెలిమెట్రీ స్టేషన్ల ఏర్పాటుకు సుమారు రూ.7.5 కోట్ల వ్యయం అంచనా వేశారు. అందుకోసం తెలంగాణ ఇప్పటికే రూ.4 కోట్లకు పైగా నిధులు కూడా ఇచ్చింది. ఏపీ ఇవ్వాల్సి ఉంది. మూడో దశలో తెలంగాణ మరో 11 టెలిమెట్రీ స్టేషన్లను ప్రతిపాదించింది. ఈ ప్రతిపాదనను పరిశీలించేందుకు ఇరు రాష్ట్రాల అధికారులు, బోర్డు సభ్యుడు నేతృత్వంలో సంయుక్త కమిటీ ఏర్పాటు చేయాలని ఛైర్మన్ సూచించినప్పటికీ, ఏపీ అంగీకరించలేదు.
ఇద్దరూ కలిసినా పని అవ్వలేదు : రెండు నెలల కిందట ఇరు రాష్ట్రాల ముఖ్యమంత్రులు, అధికారులతో కేంద్ర జలశక్తి శాఖ మంత్రి నిర్వహించిన సమావేశంలో టెలిమెట్రీ యంత్రాల ఏర్పాటు విషయమై సానుకూల నిర్ణయం తీసుకున్నారు. అయినప్పటికీ ప్రక్రియ ముందుకు సాగలేదు. నిర్వహణ కోసం కృష్ణానదీ యాజమాన్య బోర్డుకు రెండు రాష్ట్రాలు సరైన సమయంలో నిధులు ఇవ్వడం లేదు. దీంతో బోర్డు ఆర్థిక ఇబ్బందులు ఎదుర్కొంటోంది. ఉద్యోగులకు వేతనాలు కూడా ఇచ్చే పరిస్థితి లేనందున టెలిమెట్రీ కోసం తెలంగాణ ఇచ్చిన రూ.4 కోట్ల నిధుల నుంచి చెల్లింపులు చేస్తామని బోర్డు గతంలో తెలిపింది. అందులో నుంచే ఉద్యోగాలకు జీతాలు ఇచ్చినట్లు రెండు రాష్ట్రాలకు బోర్డు సమాచారం ఇచ్చింది.
సీఎం చొరవతో రూ.4.18 కోట్లు : టెలిమెట్రీల ఏర్పాటుకు రాష్ట్రం విడుదల చేసిన నిధులను నిర్వహణకు వినియోగించుకుంటామంటూ బోర్డు చేసిన ప్రతిపాదనపై సర్కారు గుర్రుగా ఉన్నట్లు తెలిసింది. కృష్ణా పరీవాహకంలో పరిమితికి మించి ఏపీ నీటిని తీసుకెళ్లడాన్ని పక్కాగా లెక్కించేందుకు రెండో దశ టెలిమెట్రీ పరికరాల ఏర్పాటుకు సీఎం రేవంత్ రెడ్డి ప్రత్యేక చొరవతో రూ.4.18 కోట్లు కేటాయించారని నీటి పారుదల శాఖ వర్గాలు చెబుతున్నాయి. మరోవైపు బోర్డు ప్రతిపాదనను తెలియజేస్తూ ఈఎన్సీ అంజద్ హుస్సేన్ ప్రభుత్వానికి లేఖ రాశారు. దీనిపై నీటి పారుదల శాఖ మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డికి వివరాలు అందజేయగా, టెలిమెట్రీల కోసం కేటాయించిన నిధులను మళ్లించుకునే ప్రతిపాదనలు ఏంటంటూ ప్రశ్నించినట్లు సమాచారం. బోర్డు నిర్వహణ, టెలిమెట్రీల నిర్వహణను వేటికవే ప్రత్యేకంగా పరిగణనలోకి తీసుకోవాలని అన్నట్లు తెలిసింది. ఈ మేరకు ఈఎన్సీ బోర్డుకు లేఖ రాసినట్లు సమాచారం.
తాగునీటి కోసం 10 టీఎంసీలు ఇవ్వండి - కేఆర్ఎంబీ భేటీలో తెలంగాణ విజ్ఞప్తి
కృష్ణానది ప్రాజెక్టులపై కేంద్రం, ఏపీ ప్రభుత్వానికి సుప్రీం నోటీసులు

