దిల్లీ కృష్ణా-2 ట్రైబ్యునల్ ఎదుట ఏపీ వాదనలు - రాజకీయ కారణాలతో నీళ్లు కేటాయిస్తే జలయుద్ధాలే
తెలంగాణ వాదనలు ఏరకంగా సహేతుకం కాదో వివరణ - నీటి కేటాయింపులకు నిర్దిష్ట విధానాలున్నాయన్న ఏపీ

By ETV Bharat Andhra Pradesh Team
Published : December 18, 2025 at 9:38 AM IST
Krishna Water Disputes Tribunal 2: రాజకీయ కారణాలతో నీళ్లు కేటాయిస్తే జలయుద్ధాలు జరుగుతాయని కృష్ణా-2 ట్రైబ్యునల్ ఎదుట ఏపీ వాదనలు వినిపించింది. నీటి కేటాయింపులకు నిర్దిష్ట విధానాలు ఉన్నాయని ఏపీ తరఫున న్యాయవాది జయదీప్ గుప్తా వాదించారు. కృష్ణా జలాల కేటాయింపుల్లో తెలంగాణకు చారిత్రక అన్యాయం జరిగిందన్నది అబద్ధమని పేర్కొన్నారు. ఎస్‌ఎల్‌బీసీ పూర్తికానందుకే ఎలిమినేటి మాధవరెడ్డి ఎత్తిపోతల పథకం నిర్మించారని స్పష్టం చేశారు.
నీటి కేటాయింపులపై దిల్లీలో బ్రిజేష్ ట్రైబ్యునల్ ఛైర్మన్ జస్టిస్ బ్రిజేష్‌కుమార్, సభ్యులు జస్టిస్ రామమోహన్‌రెడ్డి, జస్టిస్ తాలపత్రల ఎదుట ఏపీ వాదనలు వినిపించింది. గతంలో తెలంగాణ వినిపించిన వాదనలను ఒక్కొక్కటిగా ప్రస్తావిస్తూ అవి ఏరకంగా సహేతుకం కాదో వివరిస్తూ ఏపీ తరపున సీనియర్ న్యాయవాది జయదీప్ గుప్తా వాదించారు. ‘రాజకీయ ఉద్దేశాలతో రాష్ట్రాల విభజన జరిగినప్పుడు అదే ప్రాతిపదికన నీటి కేటాయింపులు చేస్తే నీటి యుద్ధాలు వస్తాయని తెలిపారు. అంతర్రాష్ట్ర నదుల్లో రాజకీయ కారణాలతో నీళ్లివ్వడం సాధ్యం కాదని ఏ రాష్ట్రానికి కేటాయించాలన్నా నదీజల వివాద చట్టాలు, ట్రైబ్యునల్ కేటాయింపులు, అందుకు తగ్గ సూత్రాలు, అప్పటికే ఉన్న వినియోగం వంటి అంశాలు కీలకమవుతాయనన్నారు కృష్ణా నీటి కేటాయింపులకు సంబంధించి తెలంగాణ వాదన అర్థరహితమన్నారు.
తుంగభద్ర నీటి కేటాయింపుల్లో తమకు చారిత్రక అన్యాయం జరిగిదంటూ తెలంగాణ చేసిన వాదన తప్పని జయదీప్ గుప్తా తెలిపారు. 1892, 1933, 1944, 1946 ఒప్పందాలు బచావత్ ట్రైబ్యునల్ ఉత్తర్వులతో రద్దు అయ్యాయి. మరోవైపు 1956 తర్వాత తుంగభద్ర ప్రాజెక్టు నియంత్రణను మార్చి, తుంగభద్ర బోర్డుకు అప్పజెప్పారు. 1944లో జరిగిన ఒప్పందం ప్రకారం మద్రాస్, హైదరాబాద్‌కు సమానంగా జలాలు కేటాయించారన్న వాదనలో నిజం లేదన్నారు. ఆ ఒప్పందం ఉద్దేశం ఆర్‌డీఎస్, కేసీ కాలువలకు సహాయం అందించడమేనన్నారు. కుడివైపు కాలువను కేసీ కాలువతో, ఎడమ ఒడ్డు కాలువను ఆర్డీఎస్తో పోల్చడం అనేది ఊహాజనితమన్నారు. బచావత్ ట్రైబ్యునల్ తుంగభద్ర కేటాయింపులకు ఒక అధ్యాయాన్ని కేటాయించి, వాటిని ప్రాజెక్టుగా నిర్దిష్టంగా నిర్ణయించిందని తెలిపారు.
తెలంగాణ రాష్ట్రం ఏర్పడి 10 ఏళ్లయినా: ఉమ్మడి ఏపీలో పదేళ్ల కాలంలో శ్రీశైలం ఎడమ గట్టు కాలువ పూర్తికాలేదని ఆ తర్వాత తెలంగాణ రాష్ట్రం ఏర్పడి 10 ఏళ్లయినా ఆ ప్రాజెక్టును పూర్తి చేసుకోలేకపోయారని వివరించారు. అందుకు సాంకేతిక కారణాలున్నాయే తప్ప ఆ రాష్ట్రానికి అన్యాయం చేయడమన్న ఉద్దేశం లేదన్నారు. ఎస్‌ఎల్‌బీసీ పూర్తి చేయనందువల్లే ఎలిమినేటి మాధవరెడ్డి ఎత్తిపోతల ఏర్పాటు చేసి అవే ప్రయోజనాలు అందించారని ఇందులో అన్యాయం ఎక్కడ జరిగిందని ప్రశ్నించారు. తెలంగాణలో 6.60 లక్షల ఎకరాల ఆయకట్టుకు నీళ్లు ఇవ్వాలని భావించారు. ప్రారంభంలో 6.02 లక్షల ఎకరాలకే నీళ్లు అందినా, ఆ తర్వాత కాలంలో వైరా ఆయకట్టు, ఇతర అనధికారిక ఆయకట్టు క్రమబద్ధీకరణ ద్వారా మొత్తం నీరు అందుతోంది. సాగర్ ఎడమ కాలువ కింద తెలంగాణలో ఆయకట్టు తగ్గిందన్న వాదన తప్పని వాదనలు వినిపించారు.
ఒక పరీవాహక ప్రాంతం నుంచి మరో పరీవాహక ప్రాంతానికి నీళ్లు తీసుకువెళ్లడానికి వీల్లేదు అని తెలంగాణ వాదించింది. కృష్ణా నుంచి పెన్నాకు నీళ్లు తీసుకు వెళ్లేందుకు వీల్లేదని పేర్కొంది. అదే తెలంగాణ గోదావరి నుంచి పెన్నాకు నీళ్లు తీసుకువెళ్లండి అని చెబుతోందని అని అన్నారు. ఇదేం తీరు గోదావరి నుంచి పెన్నాకు తీసుకువెళ్లండి అని చెబుతూనే పోలవరం-బనకచర్ల, పోలవరం-నల్లమలసాగర్ అనుసంధానానికి అనుమతించ వద్దంటూ సుప్రీంకోర్టులో కేసులు దాఖలు చేస్తోందని పేర్కొన్నారు. ఇదేం తీరని జయదీప్ గుప్తా ప్రశ్నించారు.
కృష్ణా జలాల్లో వాటాను కాపాడుకునేలా గట్టిగా వ్యవహరించాలి - చంద్రబాబుకు జగన్ లేఖ
ఏపీకి కేటాయించిన నీళ్లూ ఇచ్చేస్తే ప్రజలు ఏమవ్వాలి - ట్రైబ్యునళ్ల కేటాయింపులకు అర్థం లేదంటే ఎలా?

