'ఎల్‌నినో దృష్ట్యా కృష్ణా జలాలను తాగునీటికే వాడుకోవాలి' - సూత్రప్రాయంగా నిర్ణయించిన కేఆర్ఎంబీ
హైదరాబాద్‌లో ముగిసిన కేఆర్‌ఎంబీ త్రిసభ్య కమిటీ సమావేశం - ఈ ఏడాది నీటి పంపకాలపై ఎలాంటి నిర్ణయం తీసుకోని కమిటీ - మళ్లీ సెప్టెంబర్ 4న భేటీ కావాలని కేఆర్‌ఎంబీ త్రిసభ్య కమిటీ నిర్ణయం

By ETV Bharat Andhra Pradesh Team
Published : August 24, 2026 at 8:09 PM IST
KRMB Meeting Decisions : హైదరాబాద్ జలసౌధలో కృష్ణానదీ యాజమాన్య బోర్డు త్రిసభ్య కమిటీ భేటీ ఎలాంటి నిర్ణయం తీసుకోకుండానే వాయిదా పడింది. కేఆర్ఎంబీ సభ్య కార్యదర్శి సతీశ్ అధ్యక్షతన ఈ సమావేశం జరిగింది. భేటీకి తెలంగాణ ఈఎన్సీ రమేశ్ బాబు, ఏపీ తరపున ఈఎన్సీ నరసింహమూర్తి హాజరయ్యారు. నాగార్జునసాగర్, శ్రీశైలం జలాశయాల్లో అందుబాటులో ఉన్న నీటి పంపిణీపై ఈ భేటీలో చర్చలు జరిపారు. రాయలసీమ, పల్నాడు ప్రాంతాల్లో తాగునీటి అవసరాలకుగానూ నీటి విడుదలపై చర్చించేందుకు త్రిసభ్య కమిటీని సమావేశ పర్చారు.
47 TMCలకు సూత్రప్రాయంగా అంగీకరం : శ్రీశైలం, నాగార్జునసాగర్ నుంచి ఈ ఏడాది మొత్తం నీటి వాడకంపై తెలంగాణ ప్రతిపాదించగా ఏపీ తరపున అక్టోబర్ వరకే ప్రతిపాదించినట్లు ఏపీ ENC నరసింహమూర్తి తెలిపారు. అప్పటివరకు 47 TMCలు అడిగామని ఇందుకు సూత్రప్రాయంగా అంగీకరించినట్లు చెప్పారు. రెండురాష్ట్రాల వాటా అంశం చర్చకు రాలేదని సెప్టెంబర్ 4న మరోసారి సమావేశమై చర్చిస్తామని ENC నరసింహమూర్తి స్పష్టం చేశారు.
ఎల్‌నినో దృష్ట్యా తాగునీటికే : సాగర్, శ్రీశైలం నీటి వాటాలపై చర్చించామని తెలంగాణ ఈఎన్‌సీ రఘువర్ధన్ తెలిపారు. ఎల్‌నినో దృష్ట్యా తాగునీటికే వాడుకోవాలని త్రిసభ్య కమిటీ నిర్ణయం తీసుకుందని అన్నారు. తాగునీటికి 50:50 నిష్పత్తిలో వాడుకోవాలని చెప్పామని, పోతిరెడ్డిపాడు నుంచి ఎక్కువ నీరు వాడుకుంటున్నారని ఫిర్యాదు చేశామని పేర్కొన్నారు.
" ఎల్‌నినో దృష్ట్యా శ్రీశైలం, నాగార్జునసాగర్ నుంచి కృష్ణా జలాలను తాగునీటినే వాడుకోవాలని సూత్రప్రాయంగా నిర్ణయించాం. ఏడాది మొత్తం నీటి వాడకంపై తెలంగాణ ప్రతిపాదించింది. మేం అక్టోబర్ వరకే ప్రతిపాదించాం. అప్పటివరకు 47 టీఎంసీలు అడిగాం, సూత్రప్రాయంగా అంగీకరించారు. రెండు రాష్ట్రాల వాటా అంశం చర్చకు రాలేదు. సెప్టెంబర్ 4న మళ్లీ సమావేశమై చర్చిస్తాం." - నరసింహమూర్తి, ఏపీ ఈఎన్‌సీ
"నాగార్జున సాగర్, శ్రీశైలం ప్రాజెక్ట్‌లలో నీటి వాటాలపై చర్చ జరిగింది. ఎల్‌నినో పరిస్థితుల దృష్ట్యా త్రాగునీటి కోసం మాత్రమే నీటిని వాడుకోవాలని త్రిసభ్య కమిటీలో నిర్ణయించారు. తాగునీటి కోసం 50:50 నిష్పత్తిలో వాడుకోవాలని చెప్పాం. ఏపీ పోతిరెడ్డిపాటు నుంచి ఎక్కువ నీరు వాడుకొందని ఫిర్యాదు చేశాం. సెప్టెంబర్ 4వ తేదీన తాగునీటి అవసరాలపై మాత్రమే చర్చ ఉంటుంది. భవిష్యత్‌లో ప్రవాహాలు వస్తే తదుపరి ఆలోచిస్తాం." - రమేశ్ బాబు, తెలంగాణ ఈఎన్‌సీ
సెప్టెంబర్ 4న మరోసారి భేటీ : తొలుత ఈ నెల 13న సమావేశం అయ్యేందుకు తేదీని ఖరారు చేశారు. తర్వాత 17కు వాయిదా పడింది. ఆ సమయంలో ఏపీ అసెంబ్లీ సమావేశాల నేపథ్యంలో మరోసారి వాయిదా పడింది. దీంతో నేడు ఈ భేటీని నిర్వహించారు. శ్రీశైలం, సాగర్ జలాశయాల్లో నీటి నిల్వలు, రెండు రాష్ట్రాల అవసరాలపై చర్చించారు. తాగునీటి కోసం చెరి సగం వాడుకోవాలని సమావేశంలో ప్రస్తావించింది. అయితే ఎలాంటి నిర్ణయం తీసుకోకుండా సెప్టెంబర్ 4న మరోసారి భేటీ కావాలని నిర్ణయించారు.
పంటలను దృష్టిలో పెట్టుకోండి - ఇరు రాష్ట్రాలకు స్పష్టం చేసిన కేఆర్‌ఎంబీ
ఏపీకి 10, తెలంగాణకు 22 టీఎంసీలు - కృష్ణా జలాలపై కేఆర్ఎంబీ కీలక నిర్ణయం

