తెలుగు రాష్ట్రాలకు తాగునీటి విడుదల - కేఆర్ఎంబీ నిర్ణయం
ముగిసిన కృష్ణా నదీ యాజమాన్య బోర్డు త్రిసభ్య కమిటీ సమావేశం - తెలంగాణ, ఏపీ తాగునీటి అవసరాల మేరకు నీటి విడుదలకు నిర్ణయం - శ్రీశైలం, సాగర్ నుంచి నీటి విడుదలకు కుదిరిన అంగీకారం

Published : May 12, 2026 at 6:08 PM IST
|Updated : May 12, 2026 at 7:16 PM IST
KRMB Meeting on Water Release To Telugu States : తాగునీటి అవసరాల కోసం ఆంధ్రప్రదేశ్‌కు 10 టీఎంసీల, తెలంగాణకు 21 టీఎంసీల విడుదలకు కృష్ణా నదీ యాజమాన్య బోర్డు (కేఆర్ఎంబీ) అనుమతించింది. హైదరాబాద్ జలసౌధ వేదికగా జరిగిన కేఆర్ఎంబీ త్రిసభ్య కమిటీ సమావేశంలో ఈ మేరకు నిర్ణయం తీసుకున్నారు. తాగునీటి అవసరాల కోసం మే నెలాఖరు వరకు సాగర్ కుడి కాల్వ నుంచి 10 టీఎంసీలు ఇవ్వాలని ఏపీ ఇప్పటికే బోర్డును కోరింది. జూలై నెలాఖరు వరకు శ్రీశైలం నుంచి 5, సాగర్ నుంచి 13 టీఎంసీల నీరు ఇవ్వాలని తెలంగాణ కోరింది.
తాగునీటి కోసం నిర్ణయం : రెండు రాష్ట్రాల అవసరాలపై కేఆర్ఎంబీ సభ్య కార్యదర్శి సతీష్ కాంబోజు, తెలంగాణ, ఏపీ ఈఎన్సీలు రమేష్ బాబు, నర్సింహమూర్తి చర్చించారు. ఏపీ ఇప్పటికే కోటాకు మించి నీటిని వాడుకొందని, మళ్లీ ఇస్తే తమకు నష్టం జరుగుతుందని తెలంగాణ ఈఎన్సీ తెలిపింది. అయితే తాగునీటి అవసరాల కోసం నీటిని అడుగుతున్నట్లు ఏపీ ఈఎన్సీ తెలిపారు. మిగతా అంశాలు కాకుండా అందుబాటులో ఉన్న నీటిని తాగునీటి కోసం వినియోగించుకునేలా నిర్ణయం తీసుకుందామని బోర్డు సభ్య కార్యదర్శి తెలిపారు. దీంతో ఏపీ విజ్ఞప్తి మేరకు ఆగస్టు నెలాఖరు వరకు సాగర్ కుడి కాల్వ నుంచి పది టీఎంసీలు ఇచ్చేందుకు అనుమతించారు.
గురువారం బోర్డు పూర్తి స్థాయి సమావేశం : ఏపీకి పది టీఎంసీలుపోగా రెండు ఉమ్మడి జలాశయాల్లో మిగిలిన మొత్తం నీరు తమకే చెందుతుందని, మళ్లీ ఇవ్వరాదని తెలంగాణ ఈఎన్సీ అన్నారు. శ్రీశైలంలో 5 టీఎంసీలకుపైగా, నాగార్జునసాగర్‌లో దాదాపు 16 టీఎంసీల వరకు తెలంగాణ వినియోగానికి త్రిసభ్య కమిటీ అనుమతించింది. అటు గురువారం బోర్డు పూర్తి స్థాయి సమావేశం జరగనుంది. ఆ సమయంలో నీటి వాటాలు సహా అన్ని అంశాలపై చర్చ జరగనుంది.
ఈ నెల 14న మరోసారి సమావేశం : త్రిసభ్య కమిటీ సమావేశం సాఫీగా సాగిందని ఏపీ ఈఎన్‌సీ నరసింహమూర్తి తెలిపారు. ఆగస్టు 15 వరకు ఏపీ నీటి అవసరాల కోసం 10 టీఎంసీలు, తెలంగాణకు శ్రీశైలం నుంచి 5, సాగర్ నుంచి 16 టీఎంసీలు వినియోగించుకోవచ్చని ఏపీ ఈఎన్‌సీ ప్రకటించింది. ఈ నెల 14న జరిగే బోర్డు సమావేశంలో మిగిలిన అంశాలపై చర్చిస్తామని పేర్కొంది.
తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాల తాగునీటి అవసరాలపై చర్చించి నిర్ణయం తీసుకునేందుకు కృష్ణా నదీ యాజమాన్య బోర్డు త్రిసభ్య కమిటీ ఇవాళ సమావేశమైంది. హైదరాబాద్‌లోని జలసౌధ వేదికగా కేఆర్ఎంబీ సభ్య కార్యదర్శి సతీష్ కాంబోజ్, తెలంగాణ నీటిపారుదల శాఖ ఇంజినీర్ ఇన్ చీఫ్ రమేశ్ బాబు, ఏపీ జలవనరుల శాఖ ఈఎన్సీ నర్సింహమూర్తి సమావేశమయ్యారు.
'అప్పటి వరకు టెలిమెట్రీల ఏర్పాటు కుదరదు' : తెలుగు రాష్ట్రాలకు కేఆర్ఎంబీ లేఖ

