యంత్రాలతో వరి కోత - పశుగ్రాసం కొరతతో పాడి రైతుల ఇబ్బందులు
కృష్ణా జిల్లాలో ఉన్న మిశ్రమ జాతి పశువులు 3,816, దేశీయ పశువులు 29,193, గేదెలు 24,7283 - యంత్రాలతో వరి కోత చేయిస్తుండటంతో ఏర్పడ్డ గడ్డి కొరత


By ETV Bharat Andhra Pradesh Team
Published : December 30, 2025 at 2:33 PM IST
Rice Straw Shortage : వ్యవసాయంలో వస్తున్న సాంకేతికత పశు పొషకులను ఇబ్బందుల్లోకి నెడుతోంది. గతంలో అక్కడక్కడ మాత్రమే యంత్రాలతో వరి కోతలు జరిగేవి. కానీ ప్రస్తుతం 90 శాతం మంది రైతులు యంత్రాలతోనే వరి కోతలు పూర్తి చేస్తున్నారు. దీంతో వరి గడ్డి బంగారంగా మారిపోయింది. పశు పొషణకు వరి గడ్డి దొరక్కపొవడంతో పశువులను పెంచేవారు తీవ్ర అవస్థలు పడుతున్నారు.
గేదెల పాలు విక్రయిస్తూ కుటుంబ పోషణ: కొందరు రైతులు వ్యవసాయంతో పాటు పశుపోషణ కూడా చేస్తుంటారు. గేదెలు, ఆవులు, కోళ్లను పెంచుతుంటారు. వరి కోతల తర్వాత వచ్చే వరిగడ్డితో పశువులను సాకుతుంటారు. గేదెల పాలు విక్రయిస్తూ కుటుంబాన్ని పొషించే వారు వేల సంఖ్యలో ఉన్నారు. ఉమ్మడి కృష్ణా జిల్లాలో 4.74 లక్షల ఎకరాల్లో రైతులు వరి సాగు చేశారు. గతంలో రైతులు గడ్డిని కూలీలతో కోయించి, పనలు ఆరబెట్టి, కుప్పేసి, నూర్పిడి చేసే వరకు అయ్యే ఖర్చుతో పోల్చితే యంత్రాలకు తక్కువ అవడం, పైగా వెంటనే ధాన్యం ఒడ్డుకు చేరుతుండటంతో ఎక్కువ మంది రైతులు యంత్రాలతో వరికోత చేయిస్తున్నారు. ఈ ఖరీఫ్‌లో మనుషులతో కోత కోయించిన విస్తీర్ణం చాలా తక్కువగా ఉంది. అక్కడక్కడ కొందరు వారికి ఉన్న పాడి పశువులకు అవసరమైన పశుగ్రాసానికి సరిపడా కోయించి, మిగిలింది యంత్రాలతో కోయించుకున్నారు. ఈ పరిణామంతో ప్రస్తుతం తీవ్ర పశుగ్రాసం కొరత ఏర్పడుతోంది.
పెరిగిన ఖర్చుల నేపథ్యంలో: కూలీల కొరత, కూలీల ఖర్చులు పెరగడంతో రైతులు యంత్రాలతో వరి గడ్డిని కోయిస్తున్నారని దీనివల్ల తమ పశువులకు అవసరమైన గడ్డి లభించడం లేదని పాడి రైతులు అంటున్నారు. వారు మాట్లాడుతూ "కృష్ణా జిల్లాలో మిశ్రమ జాతి పశువులు 3,816, దేశీయ పశువులు 29,193, గేదెలు 24,7283 వరకు ఉన్నాయి. యంత్రాల కోత ప్రభావంతో వరిగడ్డికి కొరత ఏర్పడింది. దీంతో మేము తీవ్ర ఇబ్బందులు పడుతున్నాం. పశువులకు వరి గడ్డితో పాటు పచ్చగడ్డిని వేస్తుంటాం. ఇప్పుడు వరి గడ్డి అందుబాటులో లేకపోవడంతో పశువులను పచ్చగడ్డితోనే సాకాలంటే మాకు సాధ్యం కావడం లేదు. వ్యవసాయంలో కూలీల కొరత, పెరిగిన కూలీల ధరలకు భయపడి కోత యాంత్రాలతో రైతులు వరిని కోయిస్తున్నారు. దీనివల్ల మాకు వరిగడ్డి అందుబాటులో ఉండటం లేదు. కొంతమంది రైతులు యాంత్రాలతో కోతలు పూర్తి చేసిన తర్వాత వచ్చిన వరిగడ్డిని చుట్టలుగా చుట్టిస్తున్నారు. అయితే యంత్రాల ద్వారా కోసిన తరువాత భూమిలో మిలిగిపోయిన వరిగడ్డిని పశువులు తినడం లేదు" అని పశు పోషణదారులు అంటున్నారు.
గతంలో ఎకరా వరిగడ్డి 3 వేల నుంచి 4 వేలు: జిల్లాలో వరి గడ్డి ధరలు చుక్కలనంటుతున్నాయని పశు పోషకులు అంటున్నారు. గతంలో ఎకరా వరిగడ్డి 3 వేల నుంచి 4 వేలు ధర పలికేదని, ప్రస్తుతం ఎకరా వరిగడ్డి 10 వేల నుంచి 15 వేలు చెబుతుండటంతో పాడి గేదెలు ఉన్న వారు అలాగే డైయిరీ ఫామ్‌లు నిర్వహించే వారు ఏం చేయాలో తెలియని పరిస్థితి నెలకొందంటున్నారు. గ్రామీణ ప్రాంతాల్లో గతంలో ప్రతి ఇంటికి ఒకటో, రెండో పశువులు ఉండేవని, ప్రస్తుతం పశువులను పెంచేే వారి సంఖ్య కూడా గణనీయంగా తగ్గిపోయిందని వారు అంటున్నారు.
ఉన్న గేదెలను అమ్ముకుంటున్న కొందరు: అధిక ధర పెట్టి వరిగడ్డిని కొని, పశువుల దాణా తదితరాలకు ఖర్చు చేయలేక కొందరు ఉన్న గేదెలను అమ్ముకుంటున్నారు. ఇప్పుడే ఇంత ధర పలుకుతుంటే మున్ముందు పరిస్థితి ఎలా ఉంటుందోనని పలువురు ఆందోళన చెందుతున్నారు. మచిలీపట్నం, విజయవాడ పరిసర ప్రాంతాల నుంచి డెయిరీలు నిర్వహించే వారు పశుగ్రాస కొరతను గుర్తించి ముందుగానే గ్రామాలకు వచ్చి వరిగడ్డి కొనుగోలు చేసి లారీల్లో తీసుకెళ్తున్నారు. జిల్లాలో పశుపోషణపై ఆధారపడి వేలమంది జీవిస్తున్నారు. ఈ నేపథ్యంలో ప్రభుత్వం ప్రత్యామ్నాయ ఏర్పాట్లు చేసి పాడి పరిశ్రమను ఆదుకోవాలని రైతులు కోరుతున్నారు.
తిరుపతి జిల్లాలో దుగరాజపట్నం పోర్టు నిర్మిస్తాం: సీఎం చంద్రబాబు

