ఆరని బ్లోఅవుట్ మంటలు - నియంత్రించేందుకు శ్రమిస్తున్న సిబ్బంది
దగ్ధమైన 300 టన్నుల శకలాలను తొలగించిన ఓఎన్జీసీ - పూర్తి కట్టడికి మరో నాలుగైదు రోజులు పడుతుందని అంచనా - ఇప్పటివరకు 3లక్షల క్యూబిక్ మీటర్ల గ్యాస్ సహజవాయువు దగ్ధం

By ETV Bharat Andhra Pradesh Team
Published : January 9, 2026 at 2:08 PM IST
Konaseema Irusumanda ONGC Blowout Updates : అంబేడ్కర్ కోనసీమ జిల్లా మలికిపురం మండలం ఇరుసుమండలో బ్లోఅవుట్ మంటలు ఇంకా కొనసాగుతున్నాయి. ఎగసిపడుతున్న అగ్నికీలలు తీవ్రత కాస్త తగ్గినా పూర్తిగా నియంత్రించేందుకు ఓఎన్జీసీ సిబ్బంది తీవ్రంగా శ్రమిస్తున్నారు. దగ్ధమైన 300 టన్నుల శకలాలను తొలగించారు. ఇప్పటివరకు 3 లక్షల క్యూబిక్ మీటర్ల గ్యాస్ సహజవాయువు దగ్ధమైనట్టు అధికారులు అంచనా వేస్తున్నారు.
తీవ్రత కాస్త తగ్గినా పూర్తిగా తగ్గని మంటలు : డాక్టర్ బిఆర్ అంబేడ్కర్ కోనసీమ జిల్లా ఇరుసుమండ వద్ద ఈనెల 5న సంభవించిన బ్లో అవుట్ ఇంకా పూర్తిగా అదుపులోకి రాలేదు. మొదటి రోజు కంటే అగ్నికీలల తీవ్రత కాస్త తగ్గినా పూర్తిగా నియంత్రించేందుకు ఓఎన్జీసీ నిపుణుల బృందం తీవ్రంగా శ్రమిస్తోంది. ఓఎన్జీసీ టెక్నాలజీస్ ఫీల్డ్ సర్వీసెస్ డైరెక్టర్ విక్రమ్ సక్సేనా, ఓఎన్జీసీ, ఎంసీఎంటీ బృంద హెడ్ శ్రీహరి నేతృత్వంలో రిస్క్ ఆపరేషన్ కొనసాగిస్తున్నారు. గూడపల్లి పంట కాల్వ నుంచి నీటిని వినియోగించుకొని అగ్నికీలలను చల్లబరుస్తున్నారు.
దేశీయ పరిజ్ఞానంతోనే మంటల అదుపు : 5 వేల జీపీఎం సామర్థ్యం గల పంపుతో నీటిని భారీ పైపులతో మంటలపైకి పంపుతున్నారు. మంటలను అదుపులోకి తెచ్చేందుకు అమెరికాకు చెందిన ప్రత్యేక సాంకేతిక బృందం ఇక్కడకు వస్తుందని మొదట్లో అధికారులు వెల్లడించారు. రోజురోజుకూ మంటల తీవ్రత తగ్గడంతో పూర్తిగా దేశీయ పరిజ్ఞానంతోనే మన సాంకేతిక నిపుణుల బృందంతోనే మంటలు అదుపుచేసే ప్రయత్నాలు చేస్తున్నారు.
శకలాలు పూర్తిగా తొలగించే పనులు ముమ్మరం : బ్లో అవుట్ మంటలకు దగ్ధమైన భారీ యంత్రాల శకలాలు తొలగింపు ప్రక్రియ వేగం పుంజుకుంది. ఇప్పటి వరకు సుమారు 300 మెట్రిక్ టన్నుల బరువు గల శకలాలను ఆ ప్రదేశం నుంచి భారీ క్రేనుల సహాయంతో బయటకు తీశారు. మరో 300 నుంచి 400 టన్నుల బరువు గల శకలాలు కూడా పూర్తిగా తొలగించే పనులు ముమ్మరంగా సాగుతున్నాయి. బ్లోఅవుట్ సంభవించిన డ్రిల్ సైట్లో మంటలు వ్యాపించిన బావి వద్దకు సీఎంటీ బృందం చేరుకునేలా రెస్క్యూ ఆపరేషన్ కొనసాగుతోంది.
పూర్తిగా తొలగిస్తే గానీ : కాలిపోయిన శకలాలను నూరు శాతం తొలగిస్తే గానీ వెల్‌మౌత్ వద్దకు చేరుకునేందుకు వీలుంటుందని ఓఎన్జీసీ వర్గాలు చెబుతున్నాయి. మరో నాలుగైదు రోజుల్లో ఈ పని పూర్తయ్యే అవకాశం ఉందని సంబంధిత అధికారులు తెలుపుతున్నారు. బ్లో అవుట్ వల్ల సుమారు 3 లక్షల క్యూబిక్ మీటర్ల గ్యాస్ దగ్ధమైనట్టు అంచనా వేస్తున్నారు. బ్లో అవుట్ నియంత్రణ చర్యలు గురించి కలెక్టర్ మహేష్ కుమార్, ఎంపీ గంటి హరీష్ మాధవ్, ఎమ్మెల్యే దేవ వరప్రసాద్ పర్యవేక్షిస్తున్నారు.
ఇరుసుమండ బ్లో అవుట్ ఎఫెక్ట్ - 4 గ్రామాలకు ఇబ్బందులు, ఇంటింటా సర్వే
తగ్గిన మంటల తీవ్రత : ఓఎన్‌జీసీ బ్లో అవుట్ నుంచి మంటలు ఇంకా కొనసాగుతున్నాయి. గత 2 రోజులు కంటే ఈరోజు మంటల తీవ్రత తగ్గింది. 400 జీపీఎం సామర్థ్యం గల భారీ పంపు యంత్రంతో మంటలపై నీటిని నిరంతరాయంగా పంపుతున్నారు. డ్రిల్ సైటులో కాలిపోయిన వివిధ సామాగ్రిని అక్కడి నుంచి బయటకు తరలిస్తున్నారు.
బ్లోఅవుట్ ప్రాంతానికి వెళ్లేందుకు అత్యవసర రహదారిని ఏర్పాటు చేశారు. ఉన్నతాధికారుల ఆదేశాలతో రూ.8 లక్షలతో రహదారి ఏర్పాటు చేశారు. అలాగే బ్లోఅవుట్ ప్రాంతంలో కిలోమీటర్ పరిధిలో ఇంటింటా సర్వే నిర్వహించారు. ఈ ఇంటింటా సర్వే చేపట్టేందుకు ప్రత్యేక బృందాలను అధికారులు నియమించారు. అదేవిధంగా పంట నష్టం వివరాలను వ్యవసాయ శాఖ అధికారులు అంచనా వేస్తున్నారు. అలాగే కాలుష్య నియంత్రణ శాఖ నీరు, గాలి కాలుష్యం వివరాలను పరిశీలించింది.
కోనసీమ పాలిట శాపంగా చమురు తవ్వకాలు - గణనీయంగా పడిపోతున్న పంట దిగుబడి

