10 రోజులకు పైగా టెన్షన్ - గల్లంతైన ఏడుగురు మత్స్యకారులు క్షేమం
అల్లవరం మండలం ఓడలరేవు నుంచి వేటకు వెళ్లిన మత్స్యకారులు - ఈ నెల 17 నుంచి సముద్రంలో గాలింపు చర్యలు చేపట్టిన ప్రభుత్వం- 10 రోజులపాటు సముద్రంలో గాలించిన కోస్ట్‌గార్డ్, నేవీ, మెరైన్ సిబ్బంది

By ETV Bharat Andhra Pradesh Team
Published : August 26, 2026 at 6:18 PM IST
Konaseema Missing Fishermen Found : సముద్రంలో చేపల వేటకు వెళ్లి ఆచూకీ లేకుండా పోయిన కోనసీమ జిల్లాకు చెందిన ఏడుగురు మత్స్యకారుల కథ సుఖాంతమైంది. కోల్‌కతా తీరంలో వారు సురక్షితంగా ఉన్నారని మత్స్యశాఖ అధికారులు తెలిపారు. అల్లవరం మండలం ఓడలరేవుకు చెందిన ఏడుగురు మత్స్యకారులు ఈనెల 3వ తేదీన సముద్రంలో చేపల వేటకు వెళ్లి గల్లంతయ్యారు.
దీంతో ఈనెల 17 నుంచి 10 రోజుల పాటు నేవీ, కోస్ట్‌గార్డ్, మెరైన్ సిబ్బంది విస్తృతంగా గాలింపు చేపట్టారు. ఓడలరేవు జెట్టీ నుంచి వెళ్లిన బోటులో గేర్ బాక్స్ దెబ్బతినడంతో 20 రోజులకు పైగా సముద్రంలో ఉన్నారు. మరో బోటు కనిపించడంతో వారి ఫోన్ నుంచి మత్స్యకారులు సమాచారం ఇచ్చారు. సముద్రంలో నుంచి బెంగాల్ తీరంలోని జిగా ప్రాంతానికి మత్స్యకారుల బోటు చేరుకుంది. మత్స్యకారులను త్వరలోనే వారి ప్రాంతాలకు తీసుకు వస్తామని మత్స్యశాఖ జేడీ కరుణాకర్ తెలిపారు. దాదాపు 23 రోజుల తర్వాత మత్స్యకారులు సురక్షితమని సమాచారం రావడంతో కుటుంబ సభ్యులు ఆనందం వ్యక్తం చేస్తున్నారు.
మత్స్యకారులను స్వగ్రామాలకు తీసుకొస్తున్నట్లు మత్స్యశాఖ సహాయ సంచాలకుడు రమణారావు పేర్కొన్నారు. ప్రస్తుత పరిస్థితిని అమలాపురం ఎంపీ హరీశ్, ఎమ్మెల్యే ఆనందరావు పర్యవేక్షిస్తున్నారు. గల్లంతైన మత్స్యకారుల ఆచూకీ కోసం రాష్ట్ర ప్రభుత్వం అనేక ప్రయత్నాలు చేసింది. ఈ నెల 17 నుంచి సముద్రంలో విస్తృతంగా గాలింపు చర్యలు చేపట్టింది. నేవీ, కోస్ట్ గార్డ్, మెరైన్ సిబ్బంది 10 రోజుల పాటు గాలించారు. ఎట్టకేలకు వారంతా బెంగాల్ తీరంలో క్షేమంగా ఉన్నారని శుభవార్త వచ్చింది.
మత్స్యకారుల భద్రత, సంక్షేమానికి ప్రాధాన్యం: కోనసీమ జిల్లాకు చెందిన ఏడుగురు మత్స్యకారులు పశ్చిమ బెంగాల్‌లో సురక్షితంగా ఉన్నారని మంత్రి అచ్చెన్నాయుడు తెలిపారు. ఈ నెల 3న ఓడలరేవు నుంచి సముద్ర వేటకు వెళ్లిన మత్స్యకారులు, బోటులో సాంకేతిక సమస్య తలెత్తడంతో బెంగాల్ తీరానికి చేరుకున్నారు. బోటు యజమాని సోదరుడు భవానీ ప్రసాద్‌తో మాట్లాడి మత్స్యకారులు క్షేమంగా ఉన్నట్లు అధికారులు నిర్ధారించారని తెలిపారు. మత్స్యకారుల ఆచూకీ కోసం సమన్వయంతో పని చేసిన జిల్లా కలెక్టర్, మత్స్యశాఖ కమిషనర్, జేడీ, ఎఫ్‌డీవో అధికారులను మంత్రి అభినందించారు.
మత్స్యకారులను స్వస్థలాలకు తీసుకురావడానికి చర్యలు చేపట్టాలని, అవసరమైతే అధికారులను పశ్చిమ బంగాకు పంపాలని ఆదేశించారు. మత్స్యకారుల భద్రత, సంక్షేమానికి ప్రభుత్వం అత్యంత ప్రాధాన్యత ఇస్తుందని, వారి కుటుంబాలకు అన్ని విధాలా అండగా ఉంటుందని మంత్రి అచ్చెన్నాయుడు స్పష్టం చేశారు.
అసలేం జరిగిందంటే?: డాక్టర్ బీఆర్ అంబేడ్కర్ కోనసీమ జిల్లా అల్లవరం మండలం ఓడలరేవు తీరం నుంచి ఏడుగురు మత్స్యకారులు ఈ నెల 3న సముద్రంలో వేటకు వెళ్లారు. వేటకు వెళ్లిన మత్స్యకారులు గంట తర్వాత నుంచి స్థానికులకు అందుబాటులోకి రాలేదు. వేట ముగించుకుని 10 రోజుల్లో రావాల్సిన వారు తిరిగి రాకపోవడంతో కుటుంబసభ్యులు మెరైన్ పోలీసులు, మత్స్యశాఖ అధికారులకు ఫిర్యాదు చేశారు. గల్లంతైన మత్స్యకారుల కోసం దాదాపు 10 రోజులు గాలింపు చర్యలు చేపట్టారు. తాజాగా ఏడుగురు మత్స్యకారులు బెంగాల్‌లో ఉన్నట్లు అధికారులు తెలిపారు. మత్స్యకారులంతా సురక్షితంగా ఉన్నారని వెల్లడించారు. బోటులో సాంకేతిక సమస్య ఏర్పడడంతో బెంగాల్ తీరానికి చేరినట్లు పేర్కొన్నారు.
కోనసీమలో బోటు ప్రమాదం - సముద్రంలో చిక్కుకున్న మత్స్యకారులు
గల్లంతైన మత్స్యకారుల కోసం ముమ్మర గాలింపు - పొరుగు దేశాల నౌకాదళాలకు రక్షణ శాఖ అలర్ట్

