కళ తప్పిన కొల్లేరు - నీరు లేక ఎడారిగా మారుతున్న సరస్సు
కృష్ణా, గోదావరి నది డెల్టాల మధ్య విస్తరించిన మంచినీటి సరస్సు - నాడు అరుదైన పక్షులకు, మత్స్యసంపదకు నిలయంగా ఉన్న కొల్లేరు సరస్సు - ఉపాధి కోసం వలస బాటలో మత్స్యకారులు

By ETV Bharat Andhra Pradesh Team
Published : June 2, 2026 at 10:52 AM IST
Kolleru Lake Conditions : ఆసియాలోనే అతిపెద్ద మంచి నీటి సరస్సు. ప్రశాంతత కోరుకునే వారికి ఉత్తమమైన ప్రదేశం. స్థానిక మత్య్సకారులకు మెండుగా జీవనోపాధి. ఇదంతా గతం. ప్రస్తుతం పరిస్థితి మారింది. నాడు వేలమందికి జీవనోపాధి కల్పించిన కొల్లేరు కన్నీరుపెడుతోంది. సరస్సులో నీటి కొరత కారణంగా వేట అవకాశాలు లేకపోవడంతో స్థానికులు వలస బాట పడుతున్నారు. పొట్ట నింపుకొని బిడ్డలను చదివించుకునేందుకు జిల్లాలు, రాష్ట్రాలు దాటుతున్నారు. కొల్లేరు దుస్థితిపై ఈటీవీ భారత్ ప్రత్యేక కథనం
చేపల వేటే జీవన ఆధారం : ఉమ్మడి పశ్చిమ గోదావరి జిల్లాతో పాటు కృష్ణా, గోదావరి నది డెల్టాల మధ్య విస్తరించిన కొల్లేరు సరస్సు అరుదైన పక్షులకు నిలయంగా ఉండేది. లక్షకుపైగా ఎకరాల్లో విస్తరించి ఉన్న ఈ సరస్సు మధ్యలో ఎన్నో లంక గ్రామాలు ఉన్నాయి. ఉమ్మడి పశ్చిమగోదావరి జిల్లావ్యాప్తంగా 9 మండలాల్లో 4 లక్షల మందికి పైగా జనాభా కొల్లేరు ప్రాంతంలో జీవనం సాగిస్తున్నారు. ఈ ప్రాంతంలో లక్షా 20 వేల మంది మత్స్యకారులు ఉండగా వారిలో 30 వేల మందికి పైగా చేపల వేటే జీవనాధారం చేసుకున్నారు. కొల్లేరు సరస్సు ఏటేటా తన సహజ మత్స్య సంపదను కోల్పోతూ వేసవిలో ఎడారిని తలపిస్తోంది. దీంతో సాంప్రదాయ చేపల వేట అవకాశాలు కరువై, మత్స్యకారులు తమ జీవనోపాధిని కోల్పోతున్నారు.
బతుకుదేరువు కోసం వలసకు వెళ్తున్న ప్రజలు : సంప్రదాయ వేట లేక కొల్లేరు సమీప గ్రామాల ప్రజల జీవన విధానం ఇబ్బందికరంగా మారింది. కుటుంబాన్ని పోషించుకునేందుకు నానా అవస్థలు పడాల్సి వస్తోంది. ఉన్న ఊరిలో ఉపాధి లేకపోవడంతో పొట్ట చేతపట్టుకుని యువత నెల్లూరు, ఒడిశా, తమిళనాడు, మహారాష్ట్ర, కేరళ రాష్ట్రాలకు వలస పోతున్నారు. వృద్ధులు, మహిళలు మాత్రం ఎక్కడకూ వెళ్లే అవకాశం లేక ఇక్కడే జీవనం సాగిస్తున్నారు. చదువుకునే విద్యార్థుల్లో కొందరు ఇతర రాష్ట్రాల్లోని ఆక్వా చెరువుల వద్ద కాపలాదారులుగా వెళ్తున్నారని స్థానికులు చెబుతున్నారు.
తమను ఆదుకోవాలి ప్రభుత్వాన్ని కోరుతున్న మత్య్సకారులు : బుడమేరుకు వచ్చిన వరదలు సైతం కొల్లేరు ప్రజల జీవనంపై కోలుకోలేని దెబ్బకొట్టాయి. మత్స్యకారులు వినియోగించే చేపల వలలు, తాటి దోనెలు, నాటు పడవలు వరదలో కొట్టుకుపోయాయి. ఆరు మండలాల్లో సుమారు 800 మంది జీవనోపాధి కోల్పోయి వలసబాట పట్టాల్సిన దుస్థితి కల్పించింది. గత తెలుగుదేశం హయాంలో సంప్రదాయ చేపల వేటను ప్రోత్సహించినా తర్వాత అధికారంలోకి వచ్చిన వైసీపీ ఆ పథకాలకు మంగళం పాడింది. తమ సమస్యలపై కూటమి ప్రభుత్వం దృష్టి సారించాలని మత్య్సకారులు కోరుతున్నారు.
"గతంలోలాగా కాకుండా కొల్లేరులో నీటి కొరత తీవ్రమవడంతో చేపల సంపద క్షీణించిపోయింది. తద్వారా చేపలు పట్టే అవకాశం పూర్తిగా కరువైంది. చేపల వేట మాకు ప్రధాన జీవనాధారం కావడంతో, నీటి కొరత , చేపల లభ్యత లేకపోవడం వల్ల, అనేక కుటుంబాలు బతుకు తెరువు కోసం వలస వెళ్లక తప్పని పరిస్థితి ఏర్పడింది. తమ పిల్లల భవిష్యత్తుకు అత్యంత ప్రాధాన్యతనిస్తూ వారు తమ సొంత గ్రామాలను వదిలిపెట్టి వెళ్తున్నారు. కొల్లేరు పరిసరాల్లో సుమారు 200 నుంచి 300 గ్రామాలు ఉన్నాయి. ఇక్కడ నివసించే ప్రతి ఒక్కరికీ, ఈ సరస్సు వారి మనుగడకు ఏకైక ఆధారంగా నిలుస్తుంది. ఇక్కడ నివసించే వారిలో అత్యధికులకు సాగుకు అనువైన భూమి చాలా పరిమితంగా ఉంది. వాస్తవానికి కొందరికి అసలు వ్యవసాయ భూమి ఏమాత్రం లేదు. వలస వెళ్లగలిగే ఆర్థిక స్తోమత ఉన్నవారు ఇప్పటికే వెళ్ళిపోయారు. కేవలం వలస వెళ్లడానికి కూడా మార్గం లేనివారు మాత్రమే ఇక్కడ మిగిలిపోయారు. ప్రస్తుతం మాకు వ్యక్తిగతంగా గానీ, ఈ గ్రామానికి మొత్తంగా గానీ ఎటువంటి ఆదాయ వనరులు లేవు. ఈ పరిస్థితుల్లో మనుగడ సాగించడం అసాధ్యమని గ్రహించి, కొందరు ఇతర రాష్ట్రాలకు వలస వెళ్తున్నారు. మా దయనీయ స్థితిని గమనించి ప్రభుత్వం జోక్యం చేసుకుని మాకు ఉపాధి అవకాశాలను కల్పిస్తుందని మేము మనస్ఫూర్తిగా ఆశిస్తున్నాము."_ కొల్లేరు పరిసర ప్రాంత ప్రజలు
కొల్లేరులో రాజహంసల సందడి - వేల సంఖ్యలో వచ్చిన ఫ్లెమింగోలు
ఆ 20వేల ఎకరాలను 'కొల్లేరు' పరిధి నుంచి మినహాయించాలి - సీఈసీకి రాష్ట్ర ప్రభుత్వం లేఖ

