వామ్మో! రూ.3.50 లక్షలు పలికిన పందెం కోడి - ప్రత్యేకత ఏంటంటే?
భారీ ధర పలికిన కొక్కిరాయి రకానికి చెందిన పందె కోడి - ఏకంగా రూ.3.50 లక్షల ధర పలికిన వైనం - అయినా ఆ కోడిని అమ్మని యజమాని - ఎందుకంటే?

By ETV Bharat Andhra Pradesh Team
Published : January 9, 2026 at 11:27 AM IST
Cock Cost Rs. 3.50 Lakhs in AP : సాధారణంగా కోళ్ల ధరలు సామాన్యులకు అందుబాటులో ఉంటాయి. కుటుంబంలో బంధువులు వచ్చినప్పుడో, ఆదివారం రోజో నాన్వెజ్ తినాలని మాంసాహార ప్రియులకు ఉంటుంది. షాపునకు వెళ్లి కిలో చికెన్ లేదా ఒక కోడి తెచ్చుకుంటాం. దాని ధర దాదాపు రూ.200 నుంచి రూ. 300 వరకు ఉంటుంది. మరి నాటు కోడి అయితే రూ. 1000 నుంచి రూ. 1500 మధ్య ఉంటుంది. అదే కోడి ధర రూ.3.50 లక్షల ఉంటే ఎలా ఉంటుంది. ఎంటి అవాక్కయ్యారా?. ఒక మధ్య తరగతి కుటుంబం ఏడాది ఆదాయం దాదాపుగా అంతే ఉంటుంది కదూ! ఈ ధర వినడానికి ఆశ్చర్యంగా ఉన్న ఓ కోడి ధర నిజంగానే అంతే రేటు పలికింది.
కాకినాడ జిల్లా పెద్దాపురం మండలంలోని ఓ కోళ్లఫారంలో కనిపించిన కొక్కిరాయి రకానికి చెందిన ఓ కోడి భారీ ధర పలికింది. దీని బరువు 5 కిలోలు, వయస్సు మూడేళ్ల 4 నెలలు. ఇటీవల దీని ధర రూ.3.50 లక్షల వరకు పలికినా యజమాని అమ్మలేదు. పందెం కోళ్లల్లో మేలైన జాతికి చెందినది కావడంతో సంతానోత్పత్తి కోసం వినియోగిస్తామని పేర్కొన్నారు.

వీటిపై రూ.లక్షలు పెట్టి పందెలు : అలాగే చిత్తూరు జిల్లా పుంగనూరులో పడ కోడి రకానికి చెందిన ఓ కోడి ధర రూ.50 వేలు పలికింది. తమిళనాడుకు చెందిన ఈ జాతి కోళ్లను సంక్రాంతి పండుగ సందర్భంగా పందెం కోసం వినియోగిస్తారు. వీటిపై రూ.లక్షలు పందెం కాస్తారని చెబుతున్నారు. వీటిని పుంగనూరు మండలం గూడూరుపల్లె సమీపంలో పెంచుతున్నారు.
కాళ్లు దువ్వుతున్న పందెం కోళ్లు : మరోవైపు రాష్ట్రంలో సంక్రాంతి అనగానే గుర్తొచ్చేవి కోడి పందేలు. ఇప్పటికే సంక్రాంతి బరిలో నిలిచేందుకు పందెం కోళ్లు కాళ్లు దువ్వుతున్నాయి. పోటీలో బరిలో గెలిచేది నువ్వా, నేనా అన్న రీతిలో పోటీ పడేందుకు తర్ఫీదు పొందుతున్నాయి. పొరుగు రాష్ట్రాల వారే కాదు విదేశాల్లో స్థిరపడిన ప్రవాసాంధ్రులు సైతం సంక్రాంతికి సొంతూళ్లకు వచ్చి పందేలు వీక్షించడానికి తహ తహలాడతారు. అంత క్రేజ్ ఉన్న కోడిపందేలకు బరిలో దిగే కోళ్లు మామూలుగా ఉంటే ఎలా? అందుకే వాటి ఎంపిక నుంచి శిక్షణ వరకు, అది తినే డైట్ నుంచి బరిలో చేసే ఫైట్ వరకు అన్నీ ఆసక్తికరమే.
శిక్షకులకు నెలకు రూ.20 వేల వేతనం : సంక్రాంతి పందేలకు కోడి పుంజులు బరుల్లో కత్తులు దూసేందుకు సాధన చేస్తున్నాయి. ఈత, బలవర్ధక ఆహారం, ప్రత్యేక శిక్షణతో తలపడుతున్నాయి. నెమలి, డేగ, అబ్రాసు, సీతువ, కాకి, పర్ల, రసంగి, కెక్కిరాయి ఇలా పలు జాతుల పుంజులు బరిలో పోటీపడేందుకు సై అంటున్నాయి. సంక్రాంతి కోడి పందెలకు శిక్షణనిచ్చేవారు ఒక్కొక్కరు 10 నుంచి 15 కోళ్లనే పర్యవేక్షిస్తుంటారు. వీరికి నెలకు రూ.15 నుంచి 20 వేలు వేతనంగా చెల్లిస్తుంటారు. సాధారణంగా కోళకు శిక్షణ దసరా నుంచి మొదలు పెడుతుంటారు. ఈ షార్ట్ టర్మ్ కోర్సు బాగా పాపులర్. కొన్నిచోట్ల క్రాష్ కోర్స్లాగా ఇంకా తక్కువ వ్యవధిలోనూ ఇస్తారు.
ఉదయాన్నే డ్రైఫ్రూట్ లడ్డూ, ఖీమా : పందెం కోడి శిక్షణ వేకువజామున 5 గంటలకే మొదలవుతుంది. పందేనికి 60 రోజుల ముందు నుంచి రోజూ ఉదయాన్నే డ్రైఫ్రూట్ లడ్డూ, ఖీమా, కొన్ని రకాల ఆకుకూరలను ఉడకబెట్టి పందెం కోళ్లకు పెడుతుంటారు. పండుగ 40 రోజుల ముందు నుంచి గుడ్డు తెల్లసొన పుంజులకు పెడతారు. ఉదయం 8 నుంచి మధ్యాహ్నం 3 గంటల వరకు పెందెం కోళ్లను ఆరు బయట ఉంచుతారు. నడకతోపాటు కొన్ని రకాల కసరత్తులు చేయిస్తారు. సాయంత్రం 4 గంటలకు వాటికి గింజమేత వేస్తారు. శిక్షణ పూర్తి చేసుకున్న కోళ్లుకు సంక్రాంతికి వారం ముందు నుంచి పందేనికి వెళ్లే వరకు కోడికి పూర్తిగా విశ్రాంతినిస్తారు.
సంక్రాంతి బరిలోకి రాటుదేలుతున్న పందెం కో'ఢీ'
కోడి పందేలకు సిద్ధమవుతున్న గోదావరి జిల్లాలు - కాలు దువ్వుతున్న పుంజులు

