వెన్నెముక శస్త్రచికిత్సల్లో కొత్త శకం - తెలుగు రాష్ట్రాల్లో తొలిసారిగా కిమ్స్‌లో స్పైన్ రోబోతో చికిత్సలు
హైదరాబాద్‌లో జరిగిన కార్యక్రమంలో స్పైన్రోబోను ఆవిష్కరించిన డాక్టర్ బొల్లినేని భాస్కర్‌రావు - దీని సాయంతో శస్త్రచికిత్సల్లో అత్యంత కచ్చితత్వం ఉంటుదన్న కిమ్స్ ఆస్పత్రుల సీఎండీ

Published : December 21, 2025 at 7:27 PM IST
|Updated : December 21, 2025 at 7:50 PM IST
Spine surgeries with Robots : ప్రపంచంలో, దేశంలో ఏ మూలనైనా వైద్యరంగంలో కొత్త ఆవిష్కరణలు వస్తే వాటిని వెంటనే అందిపుచ్చుకోవడం తమకు అలవాటని కిమ్స్ ఆస్పత్రుల సీఎండీ డాక్టర్ బొల్లినేని భాస్కరరావు పేర్కొన్నారు. హైదరాబాద్ నగరంలోని నోవాటెల్ హోటల్లో జరిగిన ఓ కార్యక్రమంలో తెలుగు రాష్ట్రాల్లో తొలిసారిగా 'స్పైన్ రోబో'ను ఆవిష్కరించిన సందర్భంగా ఆయన మాట్లాడారు. వెన్నెముకకు సంబంధించిన శస్త్రచికిత్సల్లో అత్యంత కచ్చితత్వం అవసరం అవుతుంటుందని, ఈ విషయంలో ఇప్పటివరకు తెలుగు రాష్ట్రాల్లో రోబోను ఎవరూ వాడలేదన్నారు. తొలిసారిగా తాము దీన్ని ఆవిష్కరించి, వెన్నెముక శస్త్రచికిత్సల్లో ఓ సరికొత్త శకానికి తాము నాంది పలికామని డాక్టర్ భాస్కరరావు చెప్పారు.

99శాతం కచ్చితత్వంతో శస్త్రచికిత్స : అనంతరం సీనియర్ కన్సల్టెంట్ న్యూరోసర్జన్, కిమ్స్ ఆస్పత్రి న్యూరోసర్జరీ విభాగాధిపతి డాక్టర్ మానస్ కుమార్ పాణిగ్రాహి మాట్లాడుతూ అమెరికాకు చెందిన మెడ్‌ట్రానిక్స్ కంపెనీ వారు తయారుచేసిన ఈ స్పైన్ రోబో కొండాపూర్ కిమ్స్ ఆస్పత్రిలో ఉండబోతోందన్నారు. ఆపరేషన్ చేసేటప్పుడే మనం సీటీ స్కాన్ తీసి, దాన్ని రోబోకు పంపుతామని వివరించారు. ఈ విధానంలో 99.9శాతం కచ్చితత్వంతో శస్త్రచికిత్స చేసేందుకు అవకాశముంటుందని తెలిపారు. పేషెంట్‌కు స్క్రూల్ను అమర్చేందుకు ఎంతమేరకు కత్తిరించాలన్నే విషయాలను ముందుగానే రోబోట్‌కు సూచిస్తామని డాక్టర్ మానస్ కుమార్ పాణిగ్రాహి వివరించారు. తద్వారా ఆపరేషన్ చేసేటప్పుడు నరం డ్యామేజి అవ్వడం లాంటి సమస్యలు ఉండవన్నారు. ఫలితంగా రోగులు నూటికి నూరుశాతం వేగంగా కోలుకుంటారని చెప్పారు.

కిమ్స్ఆస్పత్రి సరికొత్త రికార్డు : కిమ్స్ సన్‌షైన్ ఆస్పత్రి ఎండీ, చీఫ్ జాయింట్ రీప్లేస్‌మెంట్ సర్జన్ డాక్టర్ ఏవీ గురవారెడ్డి మాట్లాడుతూ, ఇంతకుముందు మోకాళ్ల మార్పిడికి, ఇతర ఆపరేషన్లకు రోబోలను వాడడం ద్వారా పూర్తి కచ్చితత్వాన్ని సాధించేవాళ్లమని, ఇప్పుడు వెన్నెముక శస్త్రచికిత్సల్లోనూ వీటిని తీసుకురావడం ద్వారా కిమ్స్ ఆస్పత్రి కొత్త చరిత్రను సృష్టించిందని అన్నారు. కొండాపూర్ కిమ్స్ ఆస్పత్రి కన్సల్టెంట్ మినిమల్లీ ఇన్వేజివ్ స్పైన్ సర్జన్ డాక్టర్ కె.శ్రీకృష్ణ చైతన్య మాట్లాడుతూ, రోబోటిక్ సర్జరీ విధానం రావడం వల్ల ప్రధానంగా చిన్న పిల్లల్లో ఏవైనా వెన్నెముక సంబంధిత సమస్యలు వచ్చినా, గూని ఉన్నా కూడా చాలా సున్నితత్వంతో ఆపరేషన్ చేయడానికి వీలవుతుందన్నారు. పిల్లలకు ఇలాంటి శస్త్రచికిత్సలు చేసేటప్పుడు నూటికి నూరుశాతం కచ్చితత్వం ఉండాలని వివరించారు. రోబోతో అది తప్పక సాధ్యమవుతుందని తెలిపారు.
"స్పైన్ సర్జరీకి సంబంధించి రోబోలను ఉపయోగించడం ఇప్పటివరకు మనదేశంలో నాలుగైదు చోట్ల మాత్రమే ఉంది. అందులోనూ తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాల్లో ఎక్కడా లేదు. తొలిసారిగా రోగులకోసం కిమ్స్ కొండాపూర్ ఆస్పత్రిలో ఈ సర్జికల్ రోబోను ప్రవేశపెట్టడం ద్వారా రోగులకు అత్యున్నత స్థాయి వైద్యాన్ని అందించగలమని చెబుతున్నందుకు సంతోషిస్తున్నాం"- బీవీ సవిత్ర్ శాస్త్రి, కిమ్స్ ఆస్పత్రి కన్సల్టెంట్ న్యూరోసర్జన్
కార్యక్రమంలో కోల్‌కతాలోని కొఠారీ మెడికల్ సెంటర్ స్పైన్ సర్జరీ విభాగాధిపతి, స్పైన్ ఫెలోషిప్స్ ప్రోగ్రాం డైరెక్టర్ డాక్టర్ సౌమ్యజిత్ బసు కూడా మాట్లాడి, ఇలాంటి అత్యాధునిక టెక్నాలజీని తెలుగు రాష్ట్రాలకు పరిచయం చేస్తున్నందుకు కిమ్స్ ఆస్పత్రి యాజమాన్యాన్ని అభినందించారు.
మధుమేహ బాధితుల్లో ఆంప్యూటేషన్ సమస్య - ముందుగా గుర్తిస్తే చికిత్సతో నయం

