ETV Bharat / state

మ‌ధుమేహ బాధితుల్లో ఆంప్యూటేషన్ సమస్య - ముందుగా గుర్తిస్తే చికిత్సతో నయం

మ‌ధుమేహం కార‌ణంగా కాళ్ల‌ సమస్యలు - ముందుగా గుర్తిస్తే వాస్క్యుల‌ర్ చికిత్స‌ల‌తో కాలు సుర‌క్షితం - కిమ్స్ ఆస్ప‌త్రి స‌ద‌స్సులో వైద్య‌ నిపుణుల వెల్ల‌డి

KIMS Hospital
కిమ్స్​ ఆసుపత్రి వైద్య బృందం (ETV)
author img

By ETV Bharat Telangana Team

Published : December 14, 2025 at 5:28 PM IST

2 Min Read
Choose ETV Bharat

Continuous Medical Education Conference in Kims Hospital : దేశంలోని ఇత‌ర ప్రాంతాల‌తో పోలిస్తే రెండు తెలుగు రాష్ట్రాల్లో మ‌ధుమేహ బాధితులు ఎక్కువ‌గా ఉన్నార‌ని, వీరికి కాళ్ల‌కు పుండ్లు, కింద ప‌డినా నొప్పి తెలియ‌క‌పోవ‌డంతో అవి తీవ్ర‌మై చివ‌ర‌కు కాళ్లు తొల‌గించాల్సిన ప‌రిస్థితి (ఆంప్యూటేషన్) ఏర్పడుతోంద‌ని వైద్య నిపుణులు తెలిపారు. ప్ర‌తి న‌లుగురు మ‌ధుమేహ బాధితుల్లో ఒక‌రికి ఈ త‌ర‌హా స‌మ‌స్య వ‌స్తోంద‌న్నారు. ముందుగా గుర్తించ‌గ‌లిగితే వాస్క్యుల‌ర్ చికిత్స‌ల‌తో కాళ్ల‌ను కాపాడుకునే అవ‌కాశం ఉంటుంద‌ని కిమ్స్ ఆస్ప‌త్రికి చెందిన క‌న్స‌ల్టెంట్ వాస్క్యుల‌ర్, ఎండోవాస్క్యుల‌ర్ స‌ర్జ‌న్ డాక్ట‌ర్ వెంక‌టేశ్ బొల్లినేని తెలిపారు.

అన్ని విభాగాల‌కు చెందిన వైద్యుల స‌మ‌న్వ‌యంతో మ‌ధుమేహ బాధితుల కాళ్ల‌ను తొల‌గించాల్సిన అవ‌స‌రం లేకుండా కాపాడుకోవ‌చ్చ‌ని డాక్టర్ వెంకటేశ్​ బొల్లినేని చెప్పారు. ఈ అంశంపై ఆస్ప‌త్రి ప్రాంగ‌ణంలో ఆదివారం నిర్వ‌హించిన కంటిన్యువ‌స్ మెడిక‌ల్ ఎడ్యుకేష‌న్ (సీఎంఈ) స‌ద‌స్సులో ఆయ‌న పాల్గొని మాట్లాడారు. హైద‌రాబాద్, చుట్టుప‌క్క‌ల ప్రాంతాల‌కు చెందిన సుమారు 200 మంది వైద్యులు ఇందులో పాల్గొన్నారు. వీరిలో ప్ర‌ధానంగా వాస్క్యుల‌ర్ స‌ర్జ‌న్లు, ప్లాస్టిక్ స‌ర్జ‌న్లు, పోడియాట్రిస్టులు (పాదాల నిపుణులు), జ‌న‌ర‌ల్ స‌ర్జ‌న్లు, ఎండోక్రినాల‌జిస్టులు, ఇంట‌ర్న‌ల్ మెడిసిన్ నిపుణులు, ఇన్ఫెక్షువ‌స్ డిసీజ్ స్పెష‌లిస్టులు ఉన్నారు.

ముందుగా గుర్తించి నివారించడమే : ఈ సంద‌ర్భంగా డాక్ట‌ర్ వెంక‌టేశ్ బొల్లినేని ఆయన బృందం మాట్లాడుతూ చికిత్స ప‌ద్ధ‌తిని ప్రామాణీక‌రించ‌డం ద్వారా మ‌ధుమేహ బాధితుల్లో కాళ్ల తొల‌గింపును నివారించ‌డం, త‌గ్గించ‌డ‌మే ఈ స‌ద‌స్సు ప్ర‌ధాన ల‌క్ష్యమన్నారు. ఇందుకోసం ముప్పును ముందుగా గుర్తించ‌డం, వాస్క్యుల‌ర్ చికిత్స‌లు చేయ‌డం, ఇన్ఫెక్ష‌న్ల‌ను నియంత్రించ‌డం, గాయాలు, మృదు క‌ణ‌జాలాల‌కు చికిత్స‌లు అందించ‌డం, దీర్ఘ‌కాలం పాటు పాదాల సంర‌క్ష‌ణ ఎలా చేసుకోవాలో మ‌ధుమేహ బాధితుల‌కు చెప్ప‌డం లాంటివి చాలా ముఖ్యమైనవన్నారు.

దేశంలో ఇత‌ర ప్రాంతాల కంటే తెలంగాణ‌, ఆంధ్ర‌ప్ర‌దేశ్‌ల‌లో మ‌ధుమేహం చాలా ఎక్కువ‌ మందికి ఉంటోందన్న వైద్యులు వెంకటేశ్, దానివ‌ల్ల కాళ్ల తొల‌గింపు ముప్పు కూడా ఇక్క‌డే ఎక్కువ‌గా క‌నిపిస్తోందన్నారు. మ‌ధుమేహం ఉన్న ప్ర‌తి న‌లుగురిలో త‌మ జీవితకాలంలో ఎప్పుడో ఒక‌సారి ఒక‌రికి కాళ్ల‌లో పుండ్లు ఏర్ప‌డ‌తాయన్నారు. వారికి స్ప‌ర్శ అంత‌గా తెలియ‌క‌పోవ‌డంతో ఆ విష‌యాన్ని గుర్తించ‌లేరని, దీనివ‌ల్ల పుండ్లు ఉన్న ప్ర‌తి ముగ్గురిలో ఒక‌రికి కాళ్లు తొలగించాల్సి వ‌స్తోందన్నారు.

అత్యాధునిక విధానాలతో : అందువ‌ల్ల కేవ‌లం మ‌ధుమేహ నియంత్ర‌ణ‌కే వైద్యులు ప‌రిమితం కాకుండా స‌మ‌గ్ర చికిత్స‌లు చేయాల్సిన అవ‌స‌రం ఉందన్నారు. అత్యాధునిక ఊండ్ కేర్ విధానాలు పాటించాలన్నారు. అలాగే ఇన్ఫెక్ష‌న్ల‌ను నియంత్రించాలన్నారు. మ‌ధుమేహ బాధితుల కాళ్ల‌ను కాపాడ‌టంలో వాస్కులర్‌ సర్జరీ, ఎండోక్రైనాలజీ, ప్లాస్టిక్‌ సర్జరీ, ఆర్థోపెడిక్స్‌ విభాగాలు స‌మ‌న్వ‌యంతో ప‌ని చేయాల్సి ఉంటుందని, గ‌తం కంటే ఇప్పుడు ఎండోవాస్క్యుల‌ర్ విధానాలు, ఆధునిక రీ-క‌న్‌స్ట్ర‌క్టివ్ టెక్నిక్‌లు, డెర్మ‌ల్ స‌బ్‌స్టిట్యూట్లు రావ‌డంతో చికిత్స ఫలితాలు మెరుగుపడుతున్నాయని అన్నారు.

ప్లాస్టిక్ సర్జన్ డాక్టర్ శరత్ చంద్రారెడ్డి, ఆయన బృందం మాట్లాడుతూ మ‌ధుమేహం ఉన్నవారు కాళ్ల ఆరోగ్యంపై ప్రత్యేక శ్రద్ధ తీసుకోవాలని, చిన్న గాయం కనిపించిన వెంటనే నిర్లక్ష్యం చేయకుండా వైద్యులను సంప్రదించాలని సూచించారు. ముందస్తు స్క్రీనింగ్‌, సరైన అవగాహనతో చాలా వ‌ర‌కు కాళ్ల తొల‌గింపుల‌ను నివారించవచ్చని వారు స్పష్టం చేశారు. ఇలాంటి సీఎంఈ కార్యక్రమాల ద్వారా వైద్యుల్లో అవగాహనను పెంచుతూ, రోగులకు మెరుగైన చికిత్స అందించడానికి కిమ్స్ ఆస్ప‌త్రి కట్టుబడి ఉందని తెలిపారు.

భార‌తీయ రుమటాల‌జీ రంగానికి అద్భుత‌ గౌర‌వం - ఏసీఆర్ నాలెడ్జ్ బౌల్ పోటీలో 'కిమ్స్​' బృందానికి స్వర్ణపతకం

పిల్ల‌ల గుండెల‌కు 'కిమ్స్ కడల్స్' అండ‌దండ‌లు అద్భుతం : బెల్లంకొండ సాయి శ్రీనివాస్